ముఖపుస్తకం – 2
మొదలు:
నిద్ర లేచాక కాసేపు నేనెవరో, ఎక్కడ ఉన్నానో, కనుక్కోవడానికి కాస్త టైం పట్టింది. అలా అని నేను రాత్రి తప్ప తాగి పడిపోయాను కాబట్టి అలా జరిగిందని అనుకోకండి. నాది మందు బ్యాచ్ కాదు, నాది మాదీఫల రసాయనం బ్యాచ్.
ఆ! గుర్తు వచ్చింది. ఈ రోజు ఆదివారం. అంటే వీకెండ్. నా పేరు ఆదిత్య. ఈ రోజు ఆఫీసు లేదు కాబట్టి ఫూటుగా ఎంజాయ్ చేయాలి. గుర్తుకి రాగానే లేచి కూర్చున్నా. ఆ తరువాత పనులు చక చకా జరిగిపోయాయి. ముందస్తుగా నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చాయేమో చూసుకున్నా. ఒక్కటి కూడా లేదు. నా ఈ-మెయిల్ చెక్ చేసుకున్నా. ఏవేవో advertisements తప్ప ఎవరూ మెయిల్ చేయలేదు. నాకు చిరాకుగా అనిపించింది. గత కొన్ని వారాలుగా ఇదే తీరు. నాకున్న బోలెడు మిత్రులు (అదే, మా అమ్మ ఉద్దేశంలో “ఎందుకు పనికి రాని వాళ్ళు”) అందరూ ఏమయ్యారా అని ఆశ్చర్యం వేసింది.
వెంటనే నా క్లోజ్ ఫ్రెండ్ అప్పారావుకి కాల్ చేశాను. క్లోజ్ ఫ్రెండ్ అంటే వాడు మా ఇంటికి దగ్గరగా ఉంటాడు. పక్క వీధే. వాడు ఫోన్ ఎత్తలేదు. కానీ కాసేపయ్యాక ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాడు, “I am busy” అని. నాకు వొళ్ళు మండింది. నాలాంటి క్లోజ్ ఫ్రెండ్ కంటే బిజీ విషయాలు వీడికేముంటాయి అనుకుని, వాడి ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.
అప్పిగాడు ల్యాప్ టాప్ వేసుకుని, వాడి రూంలోనే ఉన్నాడు. “ఇంట్లోనే ఉండి బిజీ అంటావేంట్రా?” గట్టిగా అడిగాను వాణ్ణి. వాడొకసారి నా వైపు చూసి కళ్ళతోనే “hi” చెప్పి, “ఉండరా, చాలా అప్‌డేట్స్ ఉన్నాయి చదవడానికి, అందులో కనీసం సగం వాటికైన లైక్ అని కొట్టాలి. అందుకే నీ కాల్ రిటర్న్ చేయలేదు,” అని సంజాయిషీ ఇచ్చాడు.
“అసలు గత రెండు నెలల నుంచి ఐపు అజా లేవు. ఏమయిపోయావు?” అడిగాను.
“లేకపోవడమేంటి, ప్రతి సెకండ్ నేనేం చేస్తున్నానో అప్‌డేట్ చేస్తూనే ఉన్నాగా!” అన్నాడు వాడు చాలా ఆశ్చర్యంగా.
“ఎక్కడ చేస్తున్నావు రా?”
“నా ముఖపుస్తకం అకౌంట్‌లో.”
“ముఖ పుస్తకమా, అదేంటి?”
“నీకు ముఖపుస్తకం తెలీదా? అది ఒక సోషల్ నెట్‌వర్కింగ్ టూల్. అంటే మనమేం చేస్తున్నామో అందరికీ ఒకే దెబ్బలో చెప్పడం అన్న మాట. ఉదాహరణకు, మీ ఇంటి ముందు గోడ మీద నువ్వు ఆ రోజు ఏం చేసిందీ రాశావనుకో…”
“ఎందుకు రాస్తాను. ఇంటి ముందు గోడ ఖరాబు చేసుకోవడానికి నాకేమన్నా పిచ్చా! అంతగా కావాలంటే డెయిరీలో రాసుకుంటా.”
“అబ్బా అలా ఒక నిముషం అనుకోరా!”
“సరే…”
“అప్పుడు మీ వీధిలో వాళ్ళందరిని పేరు పేరునా పిలిచి, ఆ రోజు నువ్వేం చేశావో చెప్పక్కర్లేదు.”
“అవును అక్ఖర్లేదు. అలా చెప్తే పిచ్చ కొట్టుడు కొడతారు కూడా.”
“వినరా! అందరూ ఆ గోడ మీద రాసింది చదువుకుంటారు. నీవేం చేసావో తెలుసుకోవడం వాళ్ళకు ఇష్టం లేదనుకో, చదువుకోరు. కానీ నువ్వు ఒక్కరికి ఇదంతా చెప్పే సమయంలోనే, మీ వీధిలో బ్యాచ్‌ని అంతా కవర్ చేశావు అన్న మాట. దాని వల్ల ఎంత సమయం ఆదా అయ్యిందో చూడు.”
“కానీ నేనెప్పుడూ మా వీధిలో ఎవరికీ నేను రోజూ ఏం చేస్తానో చెప్పను. అలాంటప్పుడు అందరికీ ఎందుకు చెప్పడం? పైగా గోడ కూడా ఖరాబవుతుంది.”
“$%$%$%$%$%$%$%,” రాయడానికి వీలు లేని బూతులు తిట్టాడు అప్పారావు.
“నువ్వు మానసికంగా చాలా ఎదగాలిరా! ఇప్పుడు నీ పరిధిని కొంచెం విస్తరింపచేయి. వీధి స్థానంలో ప్రపంచాన్ని చేర్చు. ఎలా ఐతే మీ ఇంటి ముందు గోడ మీద రాతలు చదవడం వల్ల, మీ వీధి వారందరికి ఒకేసారి జ్ఞానోదయం అవుతుందో, అదే విధంగా ముఖపుస్తకం ద్వారా నువ్వు చేసేది ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది,” మళ్ళీ వాడే అనునయంగా చెప్పాడు అప్పారావు.
“నేను చేసేది ప్రతీది చెప్పాలా?”
“నీకిష్టమైంది మాత్రమే చెప్పవోయి!”
“ఇదేదో బాగుందే!”
“మరేమనుకుంటున్నావు. నువ్వు కూడా ముఖపుస్తకంలో ఉండి ఉంటే నేను గత రెండు నెలలుగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేస్తున్నానో నీకు ఇట్టే తెలిసిపోయేది.”
“అసలేం చేశావురా నువ్వు గత రెండు నెలలు?”
“సమయం వృధా చేయకు, ఇప్పటికైనా జాయిన్ కా. కనీసం ఇప్పటి నుంచైనా నేను చేసేది తెలుస్తుంది.”
“సరే!”
ఆ రకంగా, ఒక దుర్ముహూర్తాన, నేను ముఖపుస్తకంలోకి ఎంటర్ అయ్యా.
(ఇంకా ఉంది)
అమ్మో!ముఖ పుస్తకంలోకి తీసుకెళ్ళి మా మస్తకం తినరుకదా
పెద్ద వారు, మీకు తెలీనిదేముంది? ముఖపుస్తకం చెప్పేది అదే కద! మీకా భయముంటే ఈ బ్లాగ్ చదవకండి.
మీ మస్తకం పదిలంగా ఉంటుంది.
….:)