ముఖపుస్తకం – 3


మరుసటి రోజు పొద్దున్నే ముఖ పుస్తకంలోకి లాగిన్ అయ్యాను.

నాకు బోలెడు add రిక్వెస్ట్స్ వచ్చి ఉన్నాయి. మొదటిది మా అప్పారావు నుంచి. వెంటనే వాడిని add చేసుకున్నా.

తరువాత కొందరు దూరపు చుట్టాలు. వారిని కూడా add చేసేశా. ఇన్నాళ్ళకి నాకు నా వేలు విడిచిన మేనత్త కొడుకు ఏం చేస్తూ ఉంటాడో అవకాశం దొరికింది అని ఆనందిస్తూ.

ఆ తరువాత కొందరు ముఖ పరిచయం మాత్రమే ఉన్న వారు. వీళ్ళందరికీ నన్ను add చేసుకోవాల్సిన అవసరమేముందబ్బా అనుకుంటూనే వాళ్ళనీ add చేసేశాను.

ఆ తరువాత నాకు అస్సలు తెలీని వాళ్ళనుంచి add రిక్వెస్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వల్లకాట్లో రామనాథం నుంచి. వాడెవడో ఎంత గింజుకున్నా గుర్తు రాలేదు. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర స్మశానంలో ఆడుకునే వాళ్ళం. కొంప దీసి ఆ బ్యాచ్‌లో ఒకడా? ఊహూ, అలాంటి వాడెవడూ ఉన్నట్టు జ్ఞాపకం రాలేదు.

వాడినీ, అలాంటి కొద్ది మందినీ హోల్డ్‌లో పెట్టాను. ఈ add చేసుకునే ప్రహసనం పూర్తి కాగానే నా “గోడ” వైపు చూసి ఒక్క సారి ఉలిక్కి పడ్డాను. ఆల్‌రెడీ చాల మంది నా వాల్ మీద మెసేజెస్ వదిలి పెట్టారు. నాకు వొళ్ళు గగ్గుర్పొడిచింది. ఇది నిజంగా అద్భుతమైన విషయం. అందులో కొద్దిమంది, నేను ఈ-మెయిల్స్ పంపినా, ఫోన్ మెసేజెస్ వదిలినా రెస్పాండ్ కాని బాపతు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా, ఇంత ప్రాంప్ట్‌గా నా గోడ మీద బరికేసారంటే, ముఖపుస్తకం ఎలా జన జీవన స్రవంతిలోకి చొచ్చుకు పోయిందో నాకు బోధ పడింది.

నా గోడ మీద మొదటి మెసేజ్ చూశాను. అది అప్పారావు గాడి నుంచి. “ముఖపుస్తకానికి స్వాగతం, సుస్వాగతం! ఇందులో జాయిన్ అయి, ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశావు. అన్నట్టు నేను బాత్‌రూంకి వెళ్తున్నాను” అని ఉంది.

నాకు అర్థం కాలేదు. వీడు బాత్‌రూంకి వెళ్తే ఆ విషయం నాతో చెప్పడం ఎందుకబ్బా అనుకున్నాను. కాని మిగతా మెసేజెస్ కూడా అలానే ఉన్నాయి.

మా వేలు విడిచిన మేనత్త కొడుకు, “వెల్‌కం! నేను గత వారం కాలు జారి పడ్డాను,” అని వదిలాడు.

ఇంకొక అమ్మాయి, “స్వాగతం, ఈ రోజు నా మూడ్ బాగా లేదు” అని వాల్ మీద మెసేజ్ పెట్టింది.

నేను తల బరుక్కున్నాను. దీని గురించి వెంటనే ఒక అథారిటీని సంప్రదిస్తే మంచిది అనిపించింది. మా అప్పిగాడికి ఫోన్ కొట్టాను. ఈ సారి ఆశ్చర్యంగా వాడు మొదటి రింగ్ తరువాతే ఫోన్ ఎత్తాడు.

“ఏంట్రా అసయ్యంగా ఫోన్ చేస్తున్నావు, ముఖపుస్తకం ద్వారా మాట్లాడుకోవచ్చు కద?” అన్నాడు నిష్టూరంగా.

“అంటే నేను అడగాల్సినవి గోడ మీద రాస్తే బాగుండదు, అందరూ చూస్తారు కదా అని…”

“నాకు మెసేజ్ పంపొచ్చుగా మెసెంజర్ మీద? లేదా మెయిల్ కొట్టొచ్చుగా, ముఖ పుస్తకం ద్వారా?”

“అలా పంపితే నువ్వు వెంటనే బదులిస్తావా?”

“ఇవ్వననుకో, ముఖపుస్తకంలో ఎవరు ఏం చేస్తున్నారో ఆ అప్‌డేట్స్ అన్నీ చదవడానికీ, నా అప్‌డేట్స్ ఇవ్వడానికే టైం సరిపోవట్లేదు.”

“అందుకే మరి కాల్ చేశాను. నాదో సందేశం.”

“సందేశం కాదు సందేహం. సందేశాలు రాజకీయ నాయకులు ఇస్తారు.”

“సరేలే, నాకు మెసేజ్‌లు పెట్టిన వాళ్ళంతా, ఆఖరికి నీతో సహా, ఎందుకని వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్తున్నారు?”

“పర్సనల్ విషయాలంటే?”

“నువ్వు చెప్పావుగా, బాత్‌రూంకి వెళ్తున్నాను అని. అది నాకెందుకు రా?”

“అసలు ముఖపుస్తకంలో జాయిన్ కావడమే, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి. ఉదాహరణకు, నా ఫ్రెండ్స్‌లో ఎవరైనా, వాళ్ళు చేసిన మాడిపోయిన దోస ఫోటో పెట్టారనుకో, నేను వెంటనే లైక్ కొట్టకపోతే ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకోసం ఈ ఇన్‌ఫర్మేషన్. — నేను బాత్‌రూంలో ఉన్నాను, వచ్చాక వెంటనే లైక్ కొడతాను. అపార్థం చేసుకోకండీ — అని.”

“ఓహో. ఐతే ఇంకో సందేశం, అదే సందేహం. నాకు ఊరూ పేరూ తెలీని వాళ్ళు కూడా add రిక్వెస్ట్స్ పంపుతున్నారు. వీళ్ళంతా ఎవరు?”

“పిచ్చివాడా, వసుధైక కుటుంబం అన్న మాట విన్నావా?”

“ఓ! అంటే వసుధ అనే అమ్మాయిది ఒకే కుటుంబం అని, అంతేనా?”

“ఛీ, ఛీ! ప్రపంచంతా ఒకే కుటుంబం లాంటిది అని. ఈ సూత్రాన్ని ముఖపుస్తకం బలంగా నమ్ముతుంది. అందరూ మన వాళ్ళే అన్న మాట. సో, వాళ్ళని add చేసుకో, అప్పుడు వాళ్ళు ఇంక తెలీని వాళ్ళు కారు కద!”

“ఏడ్చినట్టుంది. ఎవడో వల్లకాట్లో రామనాథం అంట! వాడిని కూడా add చేసుకోనా?”

“వల్లకాట్లో రామనాథమా? వాడు నన్ను కూడా add చేసుకున్నాడు. చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్న స్మశానంలో ఒక బ్యాచ్‌తో ఆడుకునే వాడిని. బహుశా, వారిలో ఒకడై ఉంటాడు.”

“మీ ఇంటి దగ్గర కూడా స్మశానం ఉండేదా?”

“ఇంకా చాలా ఉండేవి. ఇంతకీ నీ సందేహాలు తీరినట్లేనా?”

“ఏదో కొంత…”

“సరే ఐతే, నేను ఇప్పుడు వాకింగ్‌కి వెళ్తున్నా, రాగానే ఆ ఫోటోలు అప్‌డేట్ చేస్తా. ఇంక ఉంటా,” ఫోన్ పెట్టేశాడు అప్పారావు.

(ఇంకా ఉంది)

Advertisement

9 comments so far

  1. kamudha on

    Kamudha Likes this

  2. sailajachandu on

    బాగుంది. బాగా నవ్విస్తున్నారు

  3. పాపం ముఖపుస్తకం వాడు మీకేం అన్యాయం చేశాడండీ వాడు అసలే గూగుల్ ప్లస్ తో కాంపిటీషన్ తట్టుకోలేక అవస్థ పడుతుంటే :-) ))
    కానీ నిజాలు చెప్పి కడుపుబ్బ నవ్విస్తున్నారు :-) )

  4. kiran on

    దోస పార్ట్ చాలా బాగుంది :D ..

  5. chinni on

    రెండు మూడు సార్లు చదువుకున్నాను చాలాకాలం తరువాత పడిపడి నవ్వాను .చాల బాగుందండీ .

  6. narsinghrao on

    very nice keep it up

  7. tara on

    keka


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 66 other followers