Archive for the ‘కథలు’ Category
సినిమా కష్టాలు
శనివారం మద్యాహ్నం. నేను మూటా ముల్లే సర్దుకుని ఆఫీస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడే రాఘవ, మల్లేశ్, గిరి, నా డెస్క్ దగ్గరికి వచ్చారు.
“ఏరా వీకెండ్ ప్లాన్స్ ఏంటి?” అడిగాను నేను. బిక్క మొహం పెట్టారు ముగ్గురూ.
“బాసాధముడు (బాస్ + అధముడు) నాకు అర్జెంట్ పని అని అంటగట్టాడురా. ఈ రోజు సాయంత్రం వరకే కాదు, రేపు కూడా పని చేయాల్సి వచ్చేలా ఉంది,” దిగులుగా చెప్పాడు రాఘవ.
“రేపు డెంటిస్ట్‌తో అప్పాయింట్‌మెంట్ ఉంది, నా పిప్పి పన్ను పీకించుకోవడానికి. తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపొచ్చేస్తున్నాయి,” సెలవిచ్చాడు గిరి.
“అయ్యో, మరి నీ సంగతి మల్లేశ్?’ అడిగాను.
“నాదింకా ఖతర్‌నాక్. మా ఆవిడ నా తరపున మొక్కుకుందట. రేపు మా ఊరి దేవత ముందు నన్ను నేను ఐదు కొరడా దెబ్బలు కొట్టుకోవాలి,” చెప్పాడు వాడు.
“బాబోయి, ఏంటీ సినిమా కష్టాలు,” కళ్ళు తేలవేశాను నేను.
“ఇంతకీ నీ ప్రోగ్రాం ఏంటి?” అడిగాడు రాఘవ.
“పెళ్ళయి ఆరు నెల్లయ్యింది కదా, ఐనా మనిద్దరం కలిసి షాపింగే చేయలేదూ, ఈ ఆదివారం నన్ను తీసుకెళ్ళండీ అని చెప్పింది మా ఆవిడ,” అన్నాను నేను.
“అయ్యో నీకెంత కష్టం వచ్చింది!” ముగ్గురూ ఏక కంఠంతో అన్నారు.
“కష్టమేంటి? మీరు కద కష్టాల్లో ఉంది?” ఆశ్చర్యపోయాను నేను.
“నీ కష్టం ముందు మాది ఏ పాటి లే! ఎలా నెట్టుకొస్తావో ఏమో. బెస్ట్ అఫ్ లక్‌రా!” విష్ చేశాడు గిరి.
మల్లేష్ నా వంక జాలిగా చూస్తూ నా భుజం తట్టాడు.
“ఎహె! ఆపండి మీ సానుభూతి ప్రకటనలు. నేను వెళ్తూంది షాపింగ్‌కి, యుద్ధానికి కాదు,” విసుక్కున్నాను నేను.
“మరదే! నీకే తెలుస్తుందిలే,” అన్నారు వాళ్ళు మళ్ళీ ఏక కంఠంతో.
***
“ఇప్పుడు మనిద్దరం కలిసి షాపింగ్‌కి వెళ్తున్నాం,” అని నేను చెప్పగానే, మా ఆవిడ కళ్ళలో ఒక వెలుగు చూశాను. హిరోషిమా మీద అణు బాంబు పడినప్పుడు జరిగిన విస్ఫోటం నుంచి వచ్చిన వెలుగు అది అని తరువాత తెలిసింది నాకు.
“వెళ్దాం, నాకు పెద్దగా ఏం షాపింగ్ లేదనుకోండి. తొందరగానే అయిపోతుంది,” చెప్పింది తను.
“తొందరగా అయిపోతుందంట. ఏదో పెద్ద టార్చర్ లెవెల్‌లో ఉంటుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు వెధవలు,” అనుకున్నాను నేను.
“సరే! ముందుగా నర్సరీకి వెళ్దాం,” అంది మా ఆవిడ.
“అక్కడికెందుకు, మనకు ఇంకా పిల్లలు లేరు కద!”
“బోడి జోకులు వెయ్యకండి. నర్సరీ అంటే గార్డెన్. అక్కడ నేను కొన్ని మొక్కలు కొనాలి.”
“ఎందుకు?”
“మన పెరట్లొ వేయడానికి. మన సొంత గార్డెన్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా?”
“ఎవరికి?”
“కుళ్ళు జోకులు ఆపమన్నానా! మనకే! “
అలా కాసేపయ్యక నర్సరీలో అడుగు పెట్టాం ఇద్దరం.
చాల మంది మొగవాళ్ళలానే, పెళ్ళి కాక ముందు మీకు ఆ నర్సరీ లాంటి ప్రదేశాలు ఉంటాయని కూడా తెలిసి ఉండదు. నాకూ తెలీదు. అసలు మొక్కలను ప్రత్యేకంగా ఎందుకు పెంచాలో నాకు అర్థం కాలేదు. చెట్లూ, మొక్కలు మనకంటే ముందు నుంచి భూమ్మీద ఉన్నాయి. వాటిని ఎవరైనా పెంచారా? చోద్యం కాకపోతే.
“రండమ్మా,” నవ్వు మొహంతో ఆహ్వానించాడు నర్సరీ యజమాని.
“అంటు మామిడి మొక్క కావాలి,” అంది మా ఆవిడ. “ఇటు వైపు ఉన్నాయి, రండి,” అంటూ దారి తీశాడు ఆయన.
“అంటు మామిడి అంటే ఏంటోయి? మామిడే, కాని దాన్ని అంటుకోకూడదా?” భుజాలు ఎగరేస్తూ నవ్వాను నేను.
“లాభం లేదు, మిమ్మల్ని కొన్ని రోజులు ఇక్కడికి వాలంటరీ వర్క్‌కి పంపాలి,” సాలోచనగా అంది తను.
నేను నాలుక కరుచుకున్నాను, “నువ్వు చాలా తొందరగా నిర్ణయాలకు వచ్చేస్తావోయి, అలా జోక్ వేశానంటే అర్థం నాకు అంటు మామిడి మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది అని!” బుకాయించాను.
“అంతే అంటారు. మీకు ఏ ఏ మొక్కల గురించి తెలుసు?”
నేను శరవేగంగా ఆలోచించాను. ఒక్కటి కూడా గుర్తు రాలేదు. ఆఖరికి, “జామ మొక్కల గురించి బాగా తెలుసు. చిన్నప్పుడు వాటి మీద రాళ్ళు వేసే వాళ్ళం,” అన్నాను.
“మీ మొహం. అవి జామ చెట్లయి ఉంటాయి. మీకు మొక్కల గురించి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందే,”
“నహీ!” అన్నాను నేను. కానీ సౌండ్ బయటకి రాలేదు.
“అసలు మొక్కలు నాలుగు రకాలు,” గొంతు సవరించుకుంది మా ఆవిడ.
అంతే! తరువాత మూడు గంటల పాటు నేను సోదాహరణంగా ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నిటినీ దగ్గర నుంచి చూసి మరీ తెలుసుకున్నాను. ఒక స్టేజ్‌లో దేవుడి మీద కూసింత కోపం కూడా వచ్చింది, ఇన్ని మొక్కలు సృష్టించడం దేనికి అని.
“ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ మొక్కలు భూమ్మీద నుంచి పీకకున్నావా?” అని సైలెంట్‌గా పాడుకున్నాను.
నా మొహంలో మారుతున్న రంగులు గమనించకుండా మా ఆవిడ తన ఫ్లోలో తాను వెళ్ళిపోయింది. “ఇంట్రడక్షన్” అయ్యాక హోరెత్తుతున్న నా చెవులని మసాజ్ చేసుకుంటున్న టైంలో ఒక పది రకాల మొక్కలు కొని మా వ్యాన్‌లో వెనక పెట్టించింది కూడా. కాసేపట్లో, (అంటే ఎంతసేపో నాకు సరిగ్గా తెలీదు. మొక్కల గురించి సమగ్రంగా తెలుసుకోవడం వల్ల నా టైం సెన్స్ అప్పటికే బాగా దెబ్బ తిని ఉంది.) మేము నర్సరీ బయట ఉన్నాం.
***
నర్సరీ నుంచి బయట పడగానే, నా మనస్సు ఒక రకమైన ఉల్లాసంతో నిండి పోయింది. ఇన్ని రోజులు గమనించలేదు కానీ, ఆఖరికి ఆ వీధిలో మూత లేకుండా ఉన్నా డ్రైనేజ్ హోల్ కూడా నా కళ్ళకు ఎంతో అందంగా కనిపించింది. నాకు తెలీకుండానే ఈల వేసినట్టున్నా. మా ఆవిడ వెంటనే స్పందించింది.
“బాగ హుషారుగా ఉన్నట్టున్నారు?” అడిగింది.
“అవును, అహహా లేదు,” చాలా క్లారిటీతో బదులు చెప్పాను నేను.
“షాపింగ్ అయిపోయింది అనుకుని విజిల్ వేశారేమో అని..”
“కాలేదా?” నా మొహం కళ తప్పింది.
“చూశారా, నాకు తెలుసు మీకు షాపింగ్‌కి రావడం ఇష్టం లేదని!”
“నువ్వు నన్ను పరిపూర్ణంగా అపార్థం చేసుకున్నావు. షాపింగ్ అయిపోయిందేమో అని ఆ దిగులు.”
“ఐతే పదండి, పక్క వీధిలో చీరల షాప్‌కి వెళ్దాం.”
“తప్పకుండా వెళ్దాం, నాకేమన్నా భయమా?”
“ఇప్పుడు మీకు భయం అని ఎవరన్నారు?”
“ఎవరూ అనలేదు. ఊరికే క్లారిఫై చేస్తున్నా, నాకు షాపింగ్ అంటే అయిష్టత లేదని.”
“ఐతే పదండి.”
చీరల షాప్‌లోకి అడుగు పెట్టాం మేము. ఒక మూల దుశ్శాసనుడు విప్పినట్టుగా గుట్టలు గుట్టలు చీరలు పడి ఉన్నాయి. ఆ పక్కనుంచే ఒక నలుగురు మనుషులు ఒకతన్ని మోసుకుపోతున్నారు.
“ఏం జరిగింది?” అడిగాను నేను వారిలో ఒకరిని. “Occupational hazard,” సమాధానమిచ్చాడు అతను.
చీరల షాప్‌లో వృత్తి రీత్యా వచ్చే ప్రమాదలు ఏముంటాయబ్బా అనుకుంటూ, మా ఆవిడని ఫాలో అయ్యాను నేను.
షాప్ కుర్రాడు మేము కూర్చోగానే, కొన్ని చీరలు మా ముందు పడేశాడు. నాకన్నీ బాగానే ఉన్నాయనిపించాయి. మా ఆవిడ ఒక ఎర్ర చీర, ఒక లైట్ బ్లూ శారీ తీసి, నాతో, “ఏవండి? వీటిలో ఏది బాగుంది?” అని అడిగింది.
సడన్‌గా నాకు మంచి రోజులు వచ్చినట్టు అనిపించింది. సెలెక్షన్ నాదేనన్న మాట. అసలే నేను చాలా ఫాస్ట్. ఇలా ఐతే ఇంకో అర గంటలో షాపింగ్ ముగించుకుని ఇంట్లో ఉంటాము. “రెడ్ శారీ తీసుకో,” అన్నాను చప్పున.
“నేను కూడా అదే అనుకున్నానండి, మీ టేస్ట్ సూపర్. ఈ లైట్ బ్లూ శారీ బాగాలేదా?”
“బాగానే ఉంది.”
“మరి ఇదెందుకు వద్దన్నారు?”
నా మొహం మళ్ళీ కళ తప్పింది. “అంటే, ఏదో ఒకటి సెలెక్ట్ చేయమన్నావు కద! అందుకని అది చెప్పాను.”
“అంటే, ఏదో పని అయిపోతుంది అన్నట్టు చెప్పారు అన్నమాట. ఇంకా మీకు నాతో షాపింగ్ రావడం ఇష్టం అనుకున్నా!” పెదవి విరిచింది తను.
“ఇష్టమే, ఇష్టమే!” ఖంగారుగా చెప్పాను నేను, ఏంటి నా పరిస్థితి రెండు నిమిషాల్లో ఇంత తారు మారు అయిపోయింది అనుకుంటూ.
“ఐతే అలా మొక్కుబడిగా చెప్పడమెందుకు? ఏ మాత్రం ఆలోచించకుండా?”
“లేదు, ఆలోచించే చెప్పాను, నువ్వు తెలుపు కద, కాబట్టి ఎరుపు రంగు నీకు బాగా నప్పుతుందని.”
“కిందటి వారం బ్లూ శారీ కట్టుకుంటే, చాలా బాగున్నావోయి అన్నారు?”
కిందటి వారం బ్లూ శారీ కట్టుకుందా? అసలు వారం రోజుల కింద కట్టుకున్న బట్టలు ఎలా గుర్తుంటాయబ్బా? నాకు మొన్న వేసుకున్నవే గుర్తుండవు.
“అలా చెప్పానా, అంటే నువ్వు బ్లూ శారీలో కూడా బాగుంటావు.”
“ఐతే బ్లూదే తీసుకుంటా.”
“ష్యూర్ ష్యూర్.”
“మరి ఎర్ర చీర బాగుందన్నారు ఇంతకు ముందే.”
అడ కత్తెరలో పోక చెక్క అనే సామెత ప్రాముఖ్యత నాకు అప్పుడు అర్థమయ్యింది.
“అలా కాదోయి, నాకన్ని రంగులు బాగానే ఉంటాయి.”
“అన్నీ అబద్ధాలు, మొన్న మీకోసం ఒక ఎర్ర షర్ట్ కొనుక్కొస్తే, వేసుకోను అన్నారు!”
“నీకు సూట్ అయినట్టు నాకు అన్ని రంగులు సూట్ కావోయి!”
“అంతే లెండి. మీకు నా మీద బొత్తిగా ప్రేమ లేదు. నేను ఏది కట్టుకున్నా, ఎలా పోయినా మీకు ఫర్వాలేదు. మా వాళ్ళకేం తెలుసు మీకిచ్చి నా గొంతు కోసారని.”
ఈ రంగుల సెలెక్ష్‌కి నాకు తనపట్ల ఉన్న ప్రేమకి లింక్ ఏంటో నాకర్థం కాలేదు.
“సర్లేండి, నేనే సెలెక్ట్ చేసుకుంటా, అంతా నా ఖర్మ” అని అప్పటికి నన్ను వదిలేసి చీరల వైపు తిరిగింది తను. నేను కొంచెం రిలాక్స్ అయ్యాను.
రెండు గంటల తరువాత ఒక ఆకు పచ్చ చీర సెలెక్ట్ చేసింది మా ఆవిడ. చీర ప్యాక్ చేయగానే షాప్ కుర్రాడు కళ్ళు తిరిగి తూలి ధబ్బున కింద పడిపోయాడు. ఇంతకు ముందు మల్లే నలుగురు మనుషులు వచ్చి అతన్ని మోసుకుపోయారు.
“గురువుగారూ ఏమయ్యింది?” అప్పుడే షాప్‌లో అడుగు పెట్టిన ఒక పెద్ద మనిషి నన్ను అడిగాడు.
“Occupational hazard,” అన్నాను నేను క్లుప్తంగా. అతను తల బరుక్కుంటూ వెళ్ళిపోయాడు.
“ఏమోయి ఇక ఇంటికి వెళ్దామా?” మా ఆవిడని అడిగాను.
“వెళ్దాం లెండి. పాపం మీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉందనుకుంటా,” అంది మూతి విరుస్తూ తను.
“నువ్వే కద అన్నావు, షాపింగ్ తొందరగా అయిపోతుందని?” అని వెంటనే నాలుక కర్చుకున్నా.
“అవును ఇలాంటివి అన్నీ బాగా గుర్తు పెట్టుకుంటారు. గత వారం మా ఇంటికి ఒక పార్సెల్ పంపమన్నా, అది మాత్రం గుర్తు లేదు. అంతా నా ఖర్మ!”
ఇక నేను కిక్కురుమనలేదు.
“ఈ రెండు చీరల్లో ఏది బాగుంది?” గిర్రున వెనక్కి తిరిగి అడిగింది.
ఈ సారి జాగ్రత్త పడ్డాను నేను. “నాకు తెలీడం లేదు.”
“ఎందుకు తెలీదు? మనిషి అన్న వాడికి ఏదో ఒకటి నచ్చాలి.”
“ఐతే నేను మనిషిని కాదేమో?” ఉక్రోశంగా అన్నాను.
“నిజమే! అది మిమ్మల్ని పెళ్ళి చేసుకోక ముందు తెలిసి ఉంటే బాగుండేది.”
“ఈ ఈ ఈ.”
“అలా పక్కకు వెళి జుట్టు పీక్కోండి.”
అప్పటికి పక్కకి వెళ్ళి జుట్టు పీక్కుని వచ్చినా, మా ఆవిడ నన్ను వదల్లేదు. మాటి మాటికి నా సలహాలు అడుగుతూ, చెప్పక పోతే అలుగుతూ, చెప్పితే దెప్పుతూ, మొత్తానికి తనకి కావల్సిందే సెలెక్ట్ చేస్తూ, ఇంకో రెండు గంటలు గడిపింది.
ఆ టైంలోనే అనుకుంటా నేను ఒక అలౌకిక స్థితికి చేరుకున్నా. తరువాత మా ఫ్రెండ్స్ చెప్పారు. దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు అని. ఇది వేద కాలం నుంచి ఉందంట. అసలు ఆ కాలంలో ఈ రకమైన షాపింగ్ తప్పించుకోవడానికే రాజులూ, సైనికులూ యుద్ధాలకి వెళ్ళేవారట.
ఆఖరి కుర్రాడు పడిపోయాక షాప్ ఓనర్ వచ్చి మా పక్కన నిలబడడంతో నేను ఆ అలౌకిక స్థితి నుండి బయట పడ్డాను.
“మేడం, ఇక షాప్ మూసేయ్యాలి.”
“ఏం?” కొంచెం కోపంగా అడిగింది మా ఆవిడ.
“మా కుర్రాళ్ళు అందరు ఔట్. అందుకని…”
“మీరు నిలబడే ఉన్నారుగా?”
“షాప్ క్లోజ్ చేయడానికి నేను ఇలానే నిలబడి ఉండడం చాలా అవసరం మేడం. కావాలంటే రేపు పొద్దున్నే వచ్చేద్దురు కాని.”
“సరే ఇంతకు ముందు చీరతో కలిపి ఈ చీరకి కూడా బిల్ రాయండి.”
ఓనర్, ఆనందంతో గెంతులేస్తూ వెళ్ళి పోయాడు. కాసేపట్లో మేము ఆ షాప్ నుండి కూడా బయట పడ్డాం.
“సరిగ్గా షాపింగ్ కాలేదు. మళ్ళీ వచ్చే ఆదివారం వద్దాం,” అంది మా ఆవిడ.
“నెక్స్ట్ వీక్ కుదరదు. యాక్చుయల్లీ స్పీకింగ్, నెక్స్ట్ 16 వీక్స్ కూడా కుదరదు.”
“ఏం, ఎందుకు?”
“చిన్నప్పటి మొక్కు సడన్-అకస్మాత్తుగా గుర్తుకి వచ్చింది. పదహారు వారాల పాటు మా గ్రామ దేవత గుడి ముందు ప్రతి ఆది వారం నన్ను నేను ఒక ఐదు కొరడా దెబ్బలు కొట్టుకోవాలి. శనివారం మజ్జాన్నం బయలుదేరితే మళ్ళీ ఆదివారం అర్ధ రాత్రికి ఇంటికి చేరుకుంటా. మొక్కు మధ్యలో ఆపకూడదు. సారీనోయి నీతో షాపింగ్‌కి రాలేక పోతున్నందుకు చాలా బాధగా ఉంది.”
కాస్త అబ్బాయి గురించి ఆరా తీద్దురూ!
“మంచి సంబంధం అండి, మన చిట్టికి సరిజోడీ అనిపిస్తూంది,” జగన్నాధ రావుకి మనవి చేసుకుంది పార్వతమ్మ.
“నిజమే అనుకో, కానీ అబ్బాయి ఎక్కడో దూరంగా పూనాలో పని చేస్తున్నాడు. అతడు ఎలాంటి వాడో, అతగాడి గుణగణాలు ఎలాంటివో మనకు తెలిసేదెలా?” సంధేహం వెలిబుచ్చాడు పార్వతమ్మ భర్త జగన్నాధరావు.
పక్కనే కూర్చుని ఈ మాటలు వింటున్న చిట్టి కాస్త సిగ్గు పడింది. అఫ్ కోర్స్, చిట్టి అంటే నిజంగా చిట్టి ప్రాణం కాదని, పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లని మీకిప్పటికే అండర్ స్టాండింగ్ అయిపోయుంటుంది. చిట్టీ తమ్ముడు, చంటి (వాడికో ఇరవయి ఏళ్ళుంటాయి), సోఫా మీద బోర్ల పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.
“మా అన్నయ్య మల్లిఖార్జున రావు ఉన్నాడు కదండి, ఆయన్ని వెళ్ళి వాకబు చేయమంటే ఎలా ఉంటుంది?” అడిగింది పార్వతమ్మ.
“బాగానే ఉంటుంది. మీ అన్నయ్య ఒప్పుకుంటాడా?”
“ఫోన్ చేసి మీరే అడగండి.”
“సరే!”
రెండో రింగుకే ఫోనెత్తాడు మల్లిఖార్జున రావు.
“హలో ఎవరండీ?”
“నేను బావగారూ, జగన్నాధ రావుని.”
“ఓ, నువ్వటోయి, మా చెల్లెలు ఎలా ఉంది? చిట్టి, చంటి ఎలా ఉన్నారు?”
“మీ చెల్లెలే నాకు ఫోన్ చేయమని పురమాయించింది. చిట్టి బాగానే ఉంది. చంటి ఏదో తెలుగు పుస్తకం చదువుకుంటున్నాడు.”
“తెలుగు పుస్తకమా? ఇంకా అవి రాస్తున్నారా? ఏం పుస్తకమో?”
“శ్యాం గోపాల్ వర్మ రాసిన “నా ఇష్టం, చదివితే నీకే నష్టం” అన్న పుస్తకంలెండి.”
“ఇంటరెస్టింగ్!”
“ఇంతకీ మీరేం చేస్తున్నారు బావగారూ?”
“ఈ రోజు నేను ఉపవాసం కద! ఇప్పుడే ఒక అర డజన్ అరటిపండ్లు తిని, ఒక శేరు పాలు తాగాను.”
“అది ఉపవాసమా?”
“కాదా మరి? అన్నం ఒక మెతుకు కూడా తినలేదు.”
“ఐతే నిజమే లెండి. ఇంతకీ మీకు ఫోన్ చేసిందెందుకంటే, చిట్టీకి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. అబ్బాయి ఆనంద మూర్తి పూనాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మీరేమన్నా అక్కడికి వెళ్ళి అబ్బాయి మంచి చెడు గురించి వాకబు చేస్తారేమో అని…”
“ఇక్కడ నీకో సంగతి చెప్పాలోయి జగన్నాధం,” గొంతు సవరించుకున్నాడు మల్లిఖార్జునరావు.
“అలాగే, సాధారణంగా నేను ఎంగిలి మెతుకులు సీరియల్ చూడగానే నిద్రపోతాను,” చెప్పాడు జగన్నాధరావు.
“అది నాకెందుకు చెప్తున్నావు?” ఆశ్చర్య పోయాడు మల్లిఖార్జునరావు.
“అంటే, ఆ సీరియల్ ఇంకో గంటలొ మొదలవుతుంది, అర గంట తరువాత అయి పోతుంది. మీరేదో చెప్పాలన్నారు కద. దానికి మీకున్న టైం ఎంతుందో తెలియబరుస్తున్నాను.”
“మరీ విడ్డూరం కాకపోతే అంత సేపు చెప్తానటయ్యా?”
“మరి పెళ్ళికి ముందు ఇలాగే మీ చెల్లెలి గురించి చెప్తాను అని, సగం రోజంతా చెప్పారు. అందుకే ముందు జాగ్రత్తగా…”
“అప్పుడు నేను సేల్స్ మ్యాన్ మూడ్‌లో ఉన్నానోయి. మా చెల్లెలిని చేసుకోబోతున్న నువ్వు ఎంత అదృష్టవంతుడివో చెప్పాలి కద? ఇప్పుడు ఆ అవసరం లేదు. క్లుప్తంగా చెప్తానులే!”
“ఐతే చెప్పండి మరి!”
“కుర్రాడి మంచీ చెడూ కనుక్కొమన్నావు కద. మంచిదేముందిలే, మనం కనుక్కోవాల్సింది ముఖ్యంగా చెడు గురించి. చెడు అలవాట్లూ, చెడ్డ గుణాలు లేకుంటే చాలు. మంచి ఏమన్నా ఉంటే మనం బోనస్ అనుకోవాలి.”
“ఓహో!”
“కాబట్టి నేను వెంటనే బయలుదేరి వెళ్ళి, అబ్బాయి సంగతేంటో తేలుస్తా. పేరేమన్నావు, ఆనంద మూర్తి కదూ?”
“అవును.”
“సరే వచ్చాక ఫోన్ చేస్తాలే, ఉంటాను.”
***
మల్లిఖార్జున్ రావు స్టేషన్‌లో దిగగానే ఆనంద మూర్త్ ఆయని రిసీవ్ చేసుకున్నాడు.
“థాంక్సోయి. ఉదయం ట్రైన్ కద! అందులో ఆది వారం. టైంకి వస్తావో రావో అనుకున్నా,” అన్నాడు అతనితో.
“ఏం, అలా ఎందుకనుకున్నారు?” ఆశ్చర్యపోయాడు ఆనందం మూర్తి.
“అంటే మీకు నిన్న సెలవు ఉంటుంది కద. అసలే కుర్ర వాడివి. ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రి లేట్ గా పార్టీలు అవీ చేసుకుని ఉండచ్చు. పొద్దున్నే నిద్ర లేవాలంటే కష్టం కద,” నర్మ గర్భంగా అన్నాడు మల్లిఖార్జున రావు.
“అలాంటిదేం లేదండి, నేను సెలవున్న రోజు ఒక గంట ఆలస్యంగా పడుకుంటాను, అంతే,” చెప్పాడు ఆనంద మూర్తి.
“ఓహో, కుర్రాడికి పార్టీలు గట్రా పెద్దగా అలవాటు లేవన్న మాట,” మనసులోనే నోట్ చేసుకున్నాడు మల్లిఖార్జున రావు.
అఫ్ కోర్స్, అంతటితో తృప్తి పడే మనిషి కాదు మల్లిఖార్జున రావు. తన అంబుల పొదిలో ఉన్న శరాలన్నిటినీ ఒక దాని తరువాత ఒకటి వదలడానికే నిశ్చయించుకున్నాడు.
“నా దగ్గర సిగరెట్లు అయిపోయాయి. నీ దగ్గర నుంచి ఒకటి అరువు తీసుకోవచ్చా?” క్యాజుయల్‌గా అడిగాడు.
“నేను సిగరెట్లు కాల్చనండి. అసలు ఆ పొగే నాకు పడదు. బస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా సిగరెట్టు కాలిస్తే…”
“వాళ్ళని చావ చితక గొడతావా?” వెంటనే అడిగాడు మల్లిఖార్జున రావు.
“లేదు నెక్స్ట్ స్టాప్‌లో బస్ దిగిపోతా. అనవసరంగా వయొలెన్స్ ఎందుకు చెప్పండి?”
“అబ్బో, ఐతే సిగరెట్ అలవాటు లేకపోవడమే కాదు, అనవసరంగా గొడవలు కూడా పెట్టుకోడన్న మాట,” మళ్ళీ నోట్ చేసుకున్నాడు మల్లిఖార్జున రావు.
“మా ఇల్లు దగ్గర్లోనే, పదండి,” బయలు దేర దీశాడు ఆనంద మూర్తి.
***
బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక, మళ్ళీ తన పని మీద ఫోకస్ పెట్టాడు మల్లిఖార్జున రావు. “ఇందాక దారిలో వస్తున్నప్పుడు పోస్టర్ చూశాను. ‘షీలా కీ జవాని ‘ అట పిక్చర్ పేరు. మార్నింగ్ షో వెళ్ళొద్దామా?” క్యాజుయల్‌గా అడిగాడు.
వేపాకు నమిలినట్టు మొహం పెట్టాడు ఆనంద మూర్తి. “అది ఒక దరిద్రపు గొట్టు పిక్చర్ అండి. మనం చక్కగా పార్వతి టెంపుల్‌కి వెళ్దాం. చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు,” కాస్త పరవశంగా అన్నాడు.
“దరిద్రపు గొట్టు పిక్చర్ అంటున్నావు, చూశావా?” టక్కున అడిగాడు మల్లిఖార్జున రావు.
“ఆ పోస్టర్ చూస్తే చెప్పెయ్యొచ్చండి. ఎలాగూ నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను. మీరు ఉన్నారు కాబట్టి, నాతో వచ్చెయ్యండి.”
అలా ఆనంద మూర్తితో గుడికి వెళ్ళి, ఇంటికి వచ్చాక, కాస్త నడుము వాల్చి, “అబ్బాయి అలాంటి పిక్చర్లు చూడకపోవడమే కాదు, చక్కగా గుడికి కూడా వెళ్ళే బాపతు అన్న మాట,” తనలో తాను ఆనంద పడుతూ నిద్రలోకి జారుకున్నాడు మల్లిఖార్జున రావు.
***
సాయంత్రం నిద్ర లేవగానే మళ్ళీ తన ప్రయత్నాలు తాను మొదలు పెట్టాడాయన.
“కాస్త ఒంట్లో నలతగా ఉందోయి. ఇలాంటప్పుడు కాస్త మందు వేసుకుంటే బాగుంటుంది,” కన్ను కొడుతూ అన్నాడు ఆనంద మూర్తిని ఉద్దేశించి.
“మీరేం వర్రీ కాకండి. ఇంట్లో ఎప్పుడూ ఒక మందు బాటిల్ రెడీగా ఉంటుంది,” అని లోపలికి వెళ్ళాడు మూర్తి.
“అయ్య బాబోయి, ఏ దురలవాట్లు లేవనుకుంటే, అబ్బాయికి తాగుడు అలవాటులా ఉంది,” మనసులోనే బోలెడు ఫీల్ అయి పోయాడు మల్లిఖార్జున రావు.
లోపల నుంచి ఒక సీసా, ఒక చెంచా తీసుకుని వచ్చాడు ఆనంద మూర్తి. “ఒక రెండు చెంచాలు తీసుకోండి, ఒంట్లో నలత చేత్తో తీసేసినట్టు మాయమై పోతుంది,” అన్నాడు.
“నువ్వు మందు చెంచా లెక్ఖన తాగుతావా బాబూ?” బోలెడు ఆశ్చర్యపోతూ సీసా లేబిల్ చూశాడాయన. “మాదీ ఫల రసాయనం” అని రాసి ఉంది దాని మీద.
“మరి లేకపోతే సీసా మొత్తం తాగుతారా, ఇంకేమన్నా ఉందా?” అంటూ ఒక చెంచాడు మందు ఆయనకు ఇచ్చాడు ఆనంద మూర్తి.
“అనవసరంగా కుర్రాడిని అపార్థం చేసుకున్నాను,” కాస్త ఫీల్ అయ్యాడు మల్లిఖార్జున రావు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగానే కావచ్చు, ఆ చెంచాడు మందు వెంటనే తాగేశాడు.
***
మరుసటి రోజు పొద్దునే తిరుగు ప్రయాణం కట్టాడు మల్లిఖార్జున రావు. ఈ సారి ఆయన వెళ్తూంది జగన్నాధ రావు ఇంటికి. ఇంట్లో ప్రవేశించగానే, ఊపిరి కూడా తీసుకోకుండా ఆనంద మూర్తి గురించి తన రిపోర్ట్ మొదలు పెట్టాడు.
“కుర్రాడు బంగారమోయి జగన్నాధ రావు, నాకు బాగా నచ్చాడు,” అనౌన్స్ చేశాడు.
“అది కాదు బావా,” ఏదో చెప్పబోయాడు జగన్నాధ రావు. ఆయనా, ఆయన సతీ మణి పార్వతమ్మ, చిట్టి, చంటి అంతా అక్కడే ఉన్నారు.
“ఇంకేం మాట్లాడకు, అంత యోగ్యుడిని, బుద్ధిమంతుడిని నేనింతవరకు చూడలేదంటే నమ్ము. మన చిట్టి చాలా సుఖపడుతుంది, ఇతగాడిని చేసుకుంటే.”
చిట్టి వాళ్ళ మామయ్యని అదోలా చూసింది.
“అది కాదన్నయ్యా,” ఈ సారి పార్వతమ్మ అడ్డు పడింది.
“ఏంటమ్మ నువ్వు కూడా? నా మీద నమ్మకం లేదా? చిట్టి నా కూతురు లాంటిది. దాని గొంతు కోస్తానా నేను?”
“అది కాదు మామయ్యా, ఆ పెళ్ళి కొడుకు ఈ సంబంధం తనకు ఇష్టం లేదని ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు,” తను కూడా సంభాషణలో పాల్గొన్నాడు చంటి.
“అవునా అదేంటి???”
జగన్నధ రావు ఇబ్బందిగా గొంతు సవరించుకున్నాడు. “కుర్రాడు చెప్పడమేంటంటే, అతడికి నీ ప్రవర్తన బొత్తిగా నచ్చలేదట. ఉన్న ఒక రోజులోనే నీకు ఎన్ని దుర్వ్యసనాలున్నాయో, అన్నీ బయట పెట్టుకున్నావట. సిగరెట్లనీ, బూతు సినిమాలనీ, మందనీ, మరోటని, నీ విశ్వరూపం చూపించావట కద? దానితో అతగాడు బెదిరి పోయాడు. పెద్ద వాళ్ళే ఇలా ఉంటే, ఇంక పిల్లని చూడాల్సిన అవసరం లేదనుకుని, ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేశాడు,” వివరించాడు.
నిరుత్తరుడయ్యాడు మల్లిఖార్జున రావు.
కల గంటి, కల గంటి!
నేనూ అప్పారావు గాడు కలిసి ఆఫీస్‌లో ఎంటర్ కాగానే, “పితృత్వంలోనే ఉంది మగ జన్మ సార్థకం. తండ్రి అనిపించుకొనుటే మగ మూర్తికి గౌరవం,” అంటూ పాడుకుంటూ వెళ్తున్న అనిల్ గాడు ఎదురు పడ్డాడు.
“ఏంట్రా, పాప పుట్టాక వీడు చాలా హుషారుగా తయారయ్యాడు?” అడిగాను నేను అప్పారావు గాడిని.
“అంటే వాడు తండ్రి అయ్యాకే వాడికి వాళ్ళ చుట్టాల్లో పక్కాల్లో బాగా రెస్పెక్ట్ పెరిగిందంట. ఒకప్పుడు కూరలో కరివేపాకులా తీసేసిన వాళ్ళే ఇప్పుడు వాడు రాగానే లేచి నిలబడుతున్నారట. తండ్రి అయ్యే వరకు మగవాడి జీవితం ఈ సమాజంలో ఎంత దుర్భరంగా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే కద!” చెప్పాడు అప్పారావు.
అవునన్నట్టు తలూపాను నేను. ఒకప్పుడు తల్లి కాని ఆడవాళ్ళను మాత్రమే గొడ్రాళ్ళు అనే వారు. ఇప్పుడు తండ్రి కాని మగాళ్ళకు కూడా ఆ అవమానం తప్పట్లేదు. అనిల్ గాడు కోయ డాన్స్ చేయకుండా కేవలం పాటతోనే సరిపెట్టుకోవడంలోనే వాడి సెల్ఫ్-కంట్రోల్ అర్థమవుతూంది.
“అది సరే కానీ ఏంట్రా నీ కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి?” అడిగాడు నన్ను అప్పడు.
“ఎలా చెప్పాలో తెలీట్లేదు,” మెల్లగా అన్నాను నేను.
“మొదటి నుంచి చెప్పు.”
“ఈ మధ్య నిద్ర ఉండట్లేదురా! ఒకటే పీడ కలలు. అంటే నిద్ర పడుతుంది కాని, ఆ పీడ కలలకు భయపడి నిద్ర పోవట్లేదు,” కళ్ళు రుద్దుకుంటూ అన్నాను నేను.
“అంటే ఎన్ని పీడ కలలు వస్తాయేంటి?”
“చాలా ఏం రావు. ఒకే ఒక పీడ కల వస్తుంది.”
“మరి పీడ కల(లు) వస్తున్నాయి అన్నావు?”
“ఎవరైనా అలానే అంటారు. పీడ కల వస్తూంది అనరు.”
“సరే సరే! ఇంతకీ ఆ పీడ కల ఏంటి?”
“చాలా విచిత్రమైన కల. నేను పరీక్ష గదిలో కూర్చుని ఉంటాను. టెంత్ క్లాస్ పరీక్షలు అన్న మాట. నాకేమో ఏమీ గుర్తుండదు. క్వొస్చన్ పేపర్ చూస్తే ఒక్క దానికీ సమాధానం తెలీదు. ఆఖర్లో ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తాను. ఆ టైంలో చెమటలు కక్కుతూ లేచి కూర్చుంటాను. విపరీతమైన టెన్షన్. అసలు నిజంగా ఎగ్జాం రాసినప్పుడు ఎప్పుడూ ఏ చీకూ చింతా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఈ దిక్కుమాలిన కల ఏంటో?” వాపోయాను నేను.
“అయ్యయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయిరా!”
“మరే…”
“ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు కద?”
“అమ్మో నేను వెళ్ళను. ఎవరైనా చూస్తే నాకు పిచ్చి అని ప్రచారం చేసేస్తారు. ఆ తరువాత ఆ ఇమేజ్‌కి సరిపోయేలా చారల డ్రాయరు వేసుకుని తిరగాల్సి వస్తుంది. దాని కంటే ఈ కలే బెటర్!”
“హ్మ్, ఐతే నీకు ఒక్కటే దారి.”
“ఏంటది?”
“ఒకప్పుడు డాక్టరుగా ఉండి, తరువాత బాబాగా మారిన స్వప్నానంద స్వామి ఒక్కడే నీ సమస్యని పరిష్కరించగలడు.”
“స్వప్నానంద స్వామా? అయినా ఆయన డాక్టర్ వృత్తి మానేసి, బాబా ఎందుకు అయ్యాడు?”
“కొందరు గిట్టని వాళ్ళు, ఈ బాబా వృత్తిలోనే ఎక్కువ ఆదాయం ఉంది, అందుకే అయ్యాడు అంటారనుకో. ఆయన మాత్రం ప్రజలకు సేవ చేయడానికి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం అయ్యానూ అంటాడు.”
“దేవుడు ఆయన్ని అజ్ఞాపించాడా?”
“అవునట. అస్తమానూ ఈయన చెవులు కొరుక్కు తిన్నాడట. బాబ్బాబూ, కాస్త బాబాగా మారు బాబూ అంటూ. ఆ గోల తట్టుకోలేక ఈయన స్వప్నానంద స్వామి అవతారం ఎత్తాడట.”
“ఏడిచినట్టుంది. అసలు ఈయనకే సైకియాట్రిస్ట్ అవసరం ఉందేమో?”
“మాట తూలకురా. ఆయన మహిమ నీకు తెలీదు. హిప్నాటిజాన్ని, యోగ శక్తులని కలిపి రంగరించి, ఆయన ఇలాంటి రుగ్మతలను నయం చేస్తూంటాడు.”
“రుగ్మతా? అంటే ఏంటి?”
“డిసీజ్, వ్యాధి.”
“ఓరేయి అప్పిగా! నాకు డిసీజ్ ఉందంటావా?”
“అందుకే మరి! డైరెక్టుగా చెప్తే నువ్వు ఫీల్ అవుతావని, నీకు అర్థం కాని పదం వాడాను.”
“అఘోరించావులే. సరే ఆయన ఎక్కడుంటాడో నీకు తెలుసా?”
“ఓ! నిన్ను అక్కడికి తీసుకెళ్ళే బాధ్యత నాది. నేను ఆయన్ని ప్రతి వారం కలుస్తూ ఉంటానుగా?”
“నీకేం రుగ్మత ఉంది?”
“నాకు బొత్తిగా కలలు రావురా. లైఫ్ అంతా చాలా డల్‌గా డింగా ఉంది. అందుకని కలలు రప్పించుకోవటానికి వైద్యం చేయించుకుంటున్నాను.”
“హేంటో, నీ రుగ్మత నాకుంటే బాగుండేది. ఈ రోజు సాయంత్రం ఆయన్ని దర్శించుకుందామా?”
“అలాగే. ఆఫీసు కాగానే బయలుదేరుదాం.”
***
స్వప్నానంద స్వామి అంటే గెడ్డాలు మీసాలు పెరిగిపోయి కాషాయ వస్త్రాల్లో ఉంటాడనుకున్నాను కానీ ఆయన ఫుల్ సూట్ వేసుకుని పెళ్ళి రిసెప్షన్లలొ పెళ్ళి కూతురుకి, పెళ్ళి కొడుకుకి వేసే స్పెషల్ ఎర్ర చెయిర్ల లాంటి ఒక దాని మీద కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొందరు శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా అంతా సఫారీ సూట్స్ వేసుకుని ఉన్నారు.
“రా అప్పారావు, రా! నా వైద్యం పని చేసిందా? ఏమన్నా కలలు వచ్చాయా?” అప్పారావుని చిరు దరహాసంతో అడిగాడు ఆయన.
“పడుకోగానే ఒక కల లాంటిది మొదలయ్యింది కానీ, ఒక్క నిముషంలో ఆగిపోయింది స్వామీ. ఆ తరవాత ఎంత గింజుకున్నా ఏ కల రాలేదు,” బాధగా అన్నాడు అప్పడు.
“బాధ పడకు నాయనా! ఈ రాత్రి ఇంకో కల వస్తుందేమోలే?”
“వేరే కల వస్తే రావచ్చేమో కానీ మళ్ళీ ఈ కల రాదేమో స్వామీ! నిన్నటి కల మొహంమొత్తే ఖాన్ డాన్సుతో స్టార్ట్ అయ్యింది,” కాస్త సిగ్గు పడుతూ చెప్పాడు అప్పారావు.
ఏదో చెప్పబోతూ నన్ను మొదటి సారి గమనించాడు స్వప్నానంద స్వామి. “ఈ భక్తుడు ఎవరు నాయనా?” ప్రశించాడు అప్పారావుని.
“ఇంకా భక్తుడు కాలేదు స్వామీ. మీ మహిమ చూశాక తప్పకుండా అవుతాడు. కష్టాల్లో ఉండి మీ దగ్గరకు వచ్చాడు,” వినయంగా చెప్పాడు అప్పడు.
“ఏంటి నాయనా నీ కష్టం?” మృదువుగా అడిగాడు స్వామీజీ.
“ప్రతి రోజూ ఒకే పీడకల వచ్చి చాలా విసిగిస్తూంది స్వామీ,” చెప్పాను నేను.
“ఒక్క నిముషం ఆగు నాయనా. కలలకు సంబంధించిన కష్టాలు ఇలా చెప్పకూడదు.”
“మరి ఎలా చెప్పాలి స్వామీ?”
సమాధానంగా ఆయన పక్కకు తిరిగి చప్పట్లు చరిచాడు. ఆయన శిష్య బృందంలో ఒకడు లోపలికి వెళ్ళి ఒక పరుపు తీసుకొచ్చాడు.
“ఆ పరుపు మీద పడుకుని అటూ ఇటూ పొర్లుతూ నీకొచ్చే కల గురించి చెప్పు నాయనా.”
కాస్తా విచిత్రంగా అనిపించినా, నాలాంటి విచిత్రమైన సమస్యలకు పరిష్కారాలు కూడా ఇలాగే విచిత్రంగా ఉంటాయి అనిపించి ఆయన చెప్పినట్టే చేశాను నేను. పరుపు మీద అటూ ఇటూ దొర్లుతూ నా కల గురించి ఆయనకు విశదంగా వివరించాను.
“ఎగ్జాం ఏ సబ్జెక్ట్ మీద ఉంటుంది నాయనా?”
“ఒకటని లేదు స్వామీ. ఒక్కొ సారి ఒక్కొ సబ్జెక్ట్. ఏదైనా సరే నేనిచ్చేది ఖాళీ పేపరే!”
“ఎగ్జాం టైమింగ్స్ ఏంటి నాయనా?”
నాకు ఒళ్ళు మండింది. “టైమింగ్స్‌తో పనేంటి స్వామీ?” కోపం అణుచుకుంటూ అడిగాను.
“అలా అనకు నాయనా! అన్ని వివరాలు తెలిస్తేనే వైద్యం కుదిరేది.”
“సాధారణంగా పొద్దున పది గంటలకు అనుకుంటాను.”
స్వప్నానంద స్వామి ముందుగా, పక్కన ఉన్న ఒక శిష్యుడితో అప్పారావుకి కొత్త వైద్యం చేయమని పురమాయించాడు. ఆ శిష్యుడు అప్పారావుతో సహా అక్కడినుంచి నిష్క్రమించాడు. తరువాత “పరీక్షా, ఖాళీ పేపరు, పొద్దున పది గంటలూ! పొద్దున పది గంటలూ, ఖాళీ పేపరు, పరీక్షా,” అని మార్చి మార్చి అంటూ తన చేతి వేళ్ళ మీద ఏదో గుణించాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత నా వైపు తిరిగి, “నీ సమస్యకు పరిష్కారం ఉంది నాయనా, హిప్నాటిజం, యోగశక్తి కలిపి కొడితే అదే నయమవుతుంది.”
“ఎవర్ని కొడితే స్వామీ? నన్నా?”
“నిన్ను కాదు నాయనా! సమస్యని. సరే ఇక వైద్యం మొదలు పెడదాం. నా కళ్ళలోకి సూటిగా చూడు. అహ! లేవకు. అలా పడుకునే చూడు. నువ్విప్పుడు నిద్రలోకి జారుకుంటున్నావు, నీ కళ్ళు మూతలు పడుతున్నాయి…”
ఎప్పుడు నిద్రపోయానో, అదే, ఎప్పుడు హిప్నాటిక్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయానో, నాకే తెలీదు. కళ్ళు తెరిచేప్పటికి పక్కనే అప్పారావు గాడు కనిపించాడు.
“ఇదేమన్నా నీ బెడ్‌రూం అనుకున్నావురా? ఇంతసేపు పడుకుంటావు,” కాస్త విసుగ్గా అన్నాడు. నేనున్న గదిలో మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. లేచి నిలబడుతూ, “ఐతే నా వైద్యం అయిపోయినట్టేనా?” అడిగాను వాడిని.
“వైద్యం అయిపోలేదు. నీ చికిత్స ఇప్పుడే మొదలయ్యింది,” చెప్పాడు వాడు నాతో పాటూ బయటకి నడుస్తూ.
“అన్నట్టు నేను నీకు రెండు వేలు అప్పు ఉన్నా కద, తీసుకో!” అని నా పర్స్ జేబులోంచి తీసి, దాన్ని తెరిచి షాక్ తిన్నాను, “ఇదేంటి ఐదు వేలు ఉండాలి ఇందులో, ఏమయ్యింది?” అంటూ.
“మొదటి సారి నేనూ అలాగే షాక్ తిన్నా. ఆ ఐదు వేలు స్వామికి నువ్వు చెల్లించాల్సిన ఫీజ్. నువ్వు ఇచ్చే స్టేజ్‌లో లేవని, వాళ్ళే తీసేసుకున్నారు,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అప్పారావు.
“వచ్చే వారం మళ్ళీ వస్తాం కద. అప్పుడు ఇంత డబ్బు తీసుకు రానులే, బుద్దొచ్చింది,” నిట్టూర్చాను నేను.
***
మరుసటి వారం, నేనూ, అప్పారావు స్వప్నానంద స్వామి దగ్గర హాజరు వేయించుకున్నాం. ఆయన అప్పారావు వైపు చూసి కళ్ళెగరేశాడు. “ఈ సారి కొంచెం బెటర్ స్వామీ, కాస్త పెద్ద కలే వచ్చింది,” చెప్పాడు అప్పారావు విషాదంగా.
“మరి ఆనందించాల్సింది పోయి, అలా ఏడుపు మొహంతో చెప్తావేంటి నాయనా?” అడిగాడు స్వ.స్వా. (అదే, స్వప్నానంద స్వామి)
“అంటే, ఈ సారి కలలో వచ్చింది, పాత నటి చిన్నాంబ, స్వామి,” దిగులుగా అన్నాడు అప్పడు.
“నీ సంగతి ఏంటి, బిడ్డా?” నా వైపు చూస్తూ అన్నాడు స్వ.స్వా.
నేను భోరుమన్నాను. “ఏం చెప్పమంటారు స్వామీ! మిమ్మల్ని కలిసే వరకు ఒక్క సబ్జెక్ట్ పరీక్ష మాత్రమే అటెండ్ అయ్యే వాడిని. గత వారం నుంచి, ప్రతి రాత్రీ, మొత్తం ఆరు సబ్జెక్టుల ఎగ్జాంసూ రాస్తున్నా. వరుసగా పది రోజులు మన అసెంబ్లీ సమావేశాలు చూస్తే మనసు ఎలా గజిబిజిగా తయారవుతుందో అలా ఉంది నా పరిస్థితి,” ముక్కు ఎగబీలుస్తూ అన్నాను.
“చికిత్స వికటించినట్టు ఉంది. మీ ఇద్దరినీ కొత్త టైప్ హిప్నాటిజంతో కొడతా! ఇస్తా, కొత్త వైద్యం ఇస్తా!” ఉత్సాహంగా అన్నాడు స్వ.స్వా.
***
ఈ సారి నేను కొంత తొందరగానే మేలుకున్నాను. పక్క రూంలో అప్పారావు గాడు గురకలు పెడుతూ కనిపించాడు. వాడిని లేపాకా, ఇద్దరం బయట పడ్డాం. పూర్వపు అనుభవం వల్ల ఎందుకన్నా మంచిది అని, ఒక సారి జేబు తడుముకున్నాను. వెంటనే కెవ్వున కేకేశాను. “అదేంట్రా అప్పిగా, ఈ సారి పర్సు కూడా లేదు,” అన్నాను ఆందోళనగా.
“నువ్వెంత అమౌంట్ పెట్టుకున్నావు పర్సులో?” ప్రశాంతంగా అడిగాడు అప్పడు.
“మూడు వేలు!”
“మరదే! అలాంటి చీప్ పనులు చేస్తే స్వామీజీ శిష్యులకు కోపం వస్తుంది. అందుకే ఈ సారి పర్స్ కూడా లేపేశారు,” వివరించాడు వాడు.
“నెక్స్ట్ టైం అసలు ఒక్క పైసా కూడా తేను,” కోపంగా అన్నాను నేను.
***
మరుసటి వారం నేనూ అప్పిగాడూ మళ్ళీ ఠంచనుగా స్వ.స్వా సన్నిధికి హాజరు అయ్యాము. ఆయన ఈ సారి ముందు నన్ను చూసి కళ్ళెగరేశాడు.
“ఈ సారి పీడ కలలో ఆరు సబ్జెక్టుల పరీక్షలు రాయడంతో పాటూ, పక్క విద్యార్థులు నన్ను కాపీ చూపించమని బెదిరించడం కూడా జరిగింది స్వామీ,” వాపోయాను నేను.
స్వామీజీ అప్పారావు వైపు చూశాడు. “ఈ సారి మా తాత కలలోకి వచ్చాడు సార్. నేను చిన్నప్పుడు ఎంత వెధవనో ఇప్పుడూ అంతే అని చాలా సేపు చీవాట్లు పెట్టి వెళ్ళాడు,” గద్గదమైన స్వరంతో అన్నాడు వాడు.
ఆయన నాలుక కరుచుకున్నాడు. “ఐతే ఈ సారి గండభేరుండ యోగాన్ని మీ మీద ప్రయోగిస్తా. దీనికి తిరుగు ఉండకూడదు,” హామీ ఇచ్చాడు, తన నున్నటి గెడ్డం నిమురుకుంటూ.
***
ఈ సారి నేనూ, అప్పారావు గాడూ ఒకే సారి లేచి కూర్చున్నాం. ముందు ఒకరిని చూసి ఒకరు కెవ్వున కేకేశాం. తరువాత మమ్మల్ని మేము చూసుకుని ఇంకో సారి కేక రిపీట్ చేశాం. ఆ కేకలకు కారణం మా వొంటి మీద ఉన్న ప్యాంటూ షర్టులు మాయం అయి ఉండడమే.
“నేను ఈ రోజు పర్సే తేలేదు, అందుకోసం నా బట్టలు లాక్కున్నట్టున్నారు, నువ్వు కూడా తేలేదా?”
అడిగాను నేను.
“తెచ్చాను, కానీ చాలా తక్కువ తెచ్చాను. అందుకే నాకీ సత్కారం అనుకుంటా,” అన్నాడు వాడు.
ఇద్దరము శిష్య బృందం మా కోసమే కన్వీనియెంట్‌గా వదిలిన పాత న్యూస్‌పేపర్లు చుట్టుకుని బయట పడ్డాం.
***
నెక్స్ట్ వీక్, నేనూ అప్పడూ, స్వ.స్వా దగ్గరికి మళ్ళీ బయలుదేరాం. గత వారం, న్యూస్‌పేపర్లు చుట్టుకుని సందుల్లో గొందుల్లో నడుస్తూ వెళ్ళడం వల్ల ఇంటికి చేరుకునే సరికి అర్ధ రాత్రి అయ్యింది. ఈ సారి అలాంటి అగత్యం రాకూడదని ఇద్దరం, మా దగ్గర ఎంతుందో అంత డబ్బూ తీసుకుని వచ్చాం.
ఈ సారి స్వప్నానంద స్వామి రియాక్ట్ కాలేదు. ఆయన శిష్యుడు ఒకతను మమ్మల్ని చూసి కళ్ళెగరేశాడు.
“ఏం చెప్పమంటారు స్వామీ. ఇప్పుడు ప్రతి రాత్రీ ఎడ తెరపి లేకుండా కలలు. కానీ అందరూ చిన్నాంబ లాంటి వృద్ధ తారలు వచ్చి వాళ్ళ గత స్మృతులు వినిపిస్తున్నారు. అది చాలదన్నట్టు మా తాత అప్పుడప్పుడు వచ్చి వాళ్ళందరి ముందూ తిట్టి పోతూంటాడు,” బావురుమన్నాడు అప్పారావు.
“ఈ వారమంతా నేను పక్క విద్యార్థులకు భయపడి అన్ని సబ్జెక్ట్స్‌లో వాళ్ళకి కాపీ చూపించడం, వెంటనే ఎగ్జాం స్క్వాడ్ వచ్చి నన్ను రెడ్-హాండెడ్‌గా పట్టుకుని జీపులో ఎక్కించుకుని వెళ్ళడం జరిగింది స్వామీ,” ఘొల్లుమన్నాను నేను.
“ఐతే ఏమంటారు నాయనల్లారా?” చిద్విలాసంగా అన్నాడు స్వప్నానంద స్వామి.
“మిమ్మల్ని కలవడానికి ముందు నేను ఎలా ఉండే వాడినో అదే స్థితికి పంపించండి. నా పాత పీడ కలే ఎంతో బెటర్,” అర్థించాను నేను.
“నేను కూడా డిటో. ఏ కలలూ రాక పోవడమే బాగుండేది,” తను కూడా రిక్వెస్ట్ చేశాడు అప్పడు.
“మధ్యలో వైద్యం మానేస్తే పెనాల్టీ ఉంటుంది బిడ్డల్లారా!. ఇద్దరూ చెరొక పది లక్షలు సమర్పించుకోండి, అలానే చేస్తాను,” సెలవిచ్చాడు స్వ.స్వా.
మేమిద్దరం నా కోసం ఆల్‌రెడీ వేసి ఉన్న పరుపు మీద పడి స్పృహ తప్పాం.
పేరులో ఏముంది పెన్నిధి?
రవికిరణ్ గాడు నాకు మార్కెట్‌లో ఎదురయ్యాడు.
“ఒరే రవికిరణ్, దాదాపు ఐదేళ్ళయ్యిందిరా నిన్ను చూసి. నీ పెళ్ళి కాగానే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ ఊరిలోనే వచ్చిందా పోస్టింగ్?” ఆనందంగా అడిగాను నేను. రవికిరణ్ గాడు నా క్లాస్‌మేట్.
“అవున్రా, రెండు రోజులయ్యింది వచ్చి. నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నా. ఇంతలో నువ్వే కలిశావు,” అన్నాడు వాడు కూడా అంతే ఆనందంగా.
“నాన్నా!” అంటూ ఒక చిన్న శాల్తీ వచ్చింది అక్కడికి. నాలుగేళ్ళు ఉంటాయి వాడికి.
“మీ అబ్బాయా?” అడిగాను వాడిని.
“అవున్రా! నిర్ఘాంత్, అంకుల్‌కి నమస్తే చెప్పు నాన్నా!” అన్నాడు వాడు.
“మీ బాబుని ఏమని పిలిచావు?” పేరు నాకు సరిగ్గా వినపడలేదేమో అని అడిగాను వాడిని.
‘నిర్ఘాంత్.”
నిర్ఘాంత పోయాను నేను. “అదేం పేరు రా?”
“ఇప్పుడు ఇదే ట్రెండ్ బాబాయి. ప్రతి ఒక్కరు తమ పిల్లలకి ఎవరికి లేని పేర్లు, అనగా unique names పెట్టాలి అనుకుంటున్నారు. లక్కీగా మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరూ ఈ పేరు పెట్టలేదు. అందుకే నేను టక్కున పెట్టేశా!”
“నిజమా? ఇప్పుడు అందరూ తమ పిల్లలకి ఇలాంటి పేర్లే పెడుతున్నారా?”
“అవున్రా! నువ్వు బహుశా గమనించలేదనుకుంటా. లేకుంటే తెలిసేది నీకు, అందరు తల్లి తండ్రులు తమ పిల్లలకి ప్రత్యేకమైన పేర్లు పెట్టాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఒక్క సారి కళ్ళు తెరిచి లోకాన్ని గమనించు. అలా అని చెవులు మూసుకోవద్దు. అవి కూడా తెరిచే ఉంచు,” అని ఒక ఉచిత సలహా పడేసి వాడి దారిన వాడు పోయాడు.
***
రవికిరణ్ గాడు చెప్పింది అక్షర సత్యమని నాకు తెలిసొచ్చింది. ఎటు చూసినా నాకు నవీన నామాలు (అదేనండి, modern names) కనిపించాయి.
మా కజిన్ శ్రీనివాస్ ఫోన్ చేసి, “ఒరేయి, నాకో సలహా కావాలి,” అన్నాడు. నా ఛాతీ ఒక రెండు అంగుళాలు విస్తరించింది. సాధారణంగా నాకు సలహాలు చెప్పే వారే కాని, నన్ను అడిగిన వాళ్ళు లేరు ఇప్పటి దాక.
“చెప్పరా ఏం కావాలో, నేను కొంచెం బిజీ అనుకో, ఐనా ఫర్లేదు. నీ కోసం ఆ పని పోస్ట్‌పోన్ చేసుకుంటాలే,” అన్నాను. ఇంతకీ నేను చేయబోతున్న ఆ పని టీవీ 999 చానెల్‌లో రాబోతున్న “క్షణం క్షణం సంచలనం” కార్యక్రమం చూడ్డమే.
“నెక్స్ట్ మంత్ మాకు అమ్మాయి పుట్టబోతూంది అని తెలుసు కద? రెండు పేర్లు సెలెక్ట్ చేశాం కానీ వాటిలో ఏది పెట్టాలో తెలీడం లేదు.”
“ఏంటా పేర్లు?”
“మొదటిది యద్భవిష్య, రెండోది యాద్రుఛ్ఛిక.”
“నాకు రెండూ సరిగ్గా అర్థం కాలేదు. ఐనా, నీకు ఇలాంటి బరువైన సంస్కృతం పేర్ల మీద ఎప్పటి నుంచి ఇంటరెస్టురా?” అడిగాను వాడిని.
“సంస్కృతం కాదు ఇక్కడ పాయింట్, కొత్తదనం అసలు పాయింట్,” అన్నాడు వాడు.
“ఏమోరా, నాకు రెండు పేర్లూ పెద్దగా నచ్చలేదు.”
“నచ్చడం పక్కన పెట్టు. ఈ పేర్లు ఎప్పుడైనా వినావా?” కొంచెం టెన్షన్‌గా అడిగాడు వాడు.
“లేదు, విన లేదు. ఆ యద్భవిష్య పేరు ఐతే అస్సలు వినలేదు!”
“అదే నాకు కావల్సింది. ఎవరు ఇప్పటి దాకా విని ఉండని పేరు. సరే అలా ఐతే యద్భవిష్య పేరే ఫిక్స్ చేసేస్తాను. చాలా థాంక్సురా నీ సలహాకి,” అని ఫోన్ పెట్టేశాడు వాడు.
నేను వాడికి ఏం సలహా చెప్పానో నాకు అర్థం కాలేదు. కానీ ఫైనల్‌గా ఎవరికో ఒకరికి సలహా చెప్పాను అని కాస్త ఆనంద పడ్డాను.
***
మా కొలీగ్ శంకర్రావు గాడు పిలిచాడని ఆదివారం, వాడింటికి బయలుదేరాను నేను. ఏదో ఆఫీసుకి సంబంధించిన పని ఉంది, నా హెల్ప్ కావాలి అని నన్ను రమ్మన్నాడు. ఐనా శంకర్రావు ఆదివారాలు పని చేస్తున్నాడంటే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాడు మాములు రోజుల్లో ఎప్పుడు ఆఫీసులో కనిపించిన పాపాన పోలేదు.
నేను వాడి ఇంట్లో అడుగు పెట్టగానే, శంకర్రావు చాలా ఉత్సాహంగా నన్ను ఆహ్వానించాడు. “రారా, ఈ రోజు మా ఇంట్లోనే నీ లంచ్, డిన్నర్ కూడా. బోలెడు ఫైల్స్ ఉన్నాయి,” అంటూ నన్ను కూర్చోమని సైగ చేశాడు.
“ఏరా, కాఫీ/టీ, ఏమన్నా తాగుతావా?” అడిగాడు వాడు నేను కూర్చోగానే. “అవేం వద్దురా, కొంచెం మంచి నీళ్ళు ఇప్పించు చాలు,” అన్నాను నేను. “బాబూ, అంకుల్‌కి కాస్త మంచినీళ్ళు తీసుకురా!” వెనక్కి తిరిగి ఒక్క అరుపు అరిచాడు వాడు.
ఒక ఐదేళ్ళ బాబు పెద్ద గ్లాస్‌నిండా నీళ్ళు తీసుకుని వచ్చాడు. వాడి దగ్గర్నుంచి గ్లాస్ తీసుకుంటూ, “నీ పేరేంటి, బాబూ?” అడిగాను నేను. “గ్రనోదల్,” అన్నాడు వాడు.
నాకర్థం కాలేదు. శంకర్రావు గాడి వైపు ప్రశ్నార్థకంగా చూశాను. “వాడికి ఇంకా కొన్ని మాటలు సరిగ్గా పలకవురా!” అన్నాడు వాడు.
“మంచిదేగా! ఐతే, మన త్రిలింగ సినిమాల్లో హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్న మాట. ఇంతకీ వాడి పేరేంటి?” మళ్ళీ అడిగాను నేను.
“ఘనోధర్,” చెప్పాడు వాడు.
“ఘనోధరా? అది ఒక రాక్షసుడి పేరు కదూ?” ఆశ్చర్యపోయాను నేను.
“ఎలా తెలుసు? నీ ఫ్రెండ్స్‌లో కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా తమ పిల్లలకి ఈ పేరు పెట్టారా?” ఆందోళనగా అడిగాడు వాడు.
“లేదురా. మా తాతయ్య చిన్నప్పుడు బలవంతంగా కూర్చోపెట్టి మరీ పురాణాలు చెప్పే వాడు. అలా విన్నట్టు గుర్తు,” అన్నాను నేను.
“హమ్మయ్య, రక్షించావు! ఇంకా ఎవరన్నా ఈ పేరు పెట్టుకున్నారేమో, మా వాడి ప్రత్యేకత ఎక్కడ పోతుందో అని ఖంగారు పడ్డాను,” కాస్త రిలాక్స్ అవుతూ అన్నాడు వాడు.
“అంతే కానీ, మీ అబ్బాయి పేరు ఒక రాక్షసుడి పేరు అని బాధ కలగట్లేదా?” తల బరుక్కున్నాను నేను.
“ఆ! దానికి బాధెందుకురా! చాలా మంది తల్లి తండ్రులకే వాళ్ళ పిల్లల పేర్ల అర్థాలు తెలీవు. మా వాడి పేరు ఇలాంటిది అని ఎందరికి తెలుస్తుంది? ఇంకా ఎవరన్నా ఆల్‌రెడీ పెట్టేశారేమో అని కాస్త ఖంగారు పడ్డాను,” నవ్వుతూ అన్నాడు వాడు.
***.
హోటల్ “పరపాకం”లో టిఫిన్ చేస్తున్నాను నేను. నా ప్రమేయం లేకుండానే నాకు నా పక్క టేబుల్ వద్ద ఉన్న ఇద్దరి మాటలు వినవచ్చాయి.
“మీ అమ్మాయి పేరు ఏంట్రా?” అడుగుతున్నాడు మొదటి వాడు.
“ఆపాద,” చెప్పాడు రెండో వాడు.
“అపాదా? అదేం పేరు రా?” ఆశ్చర్యపోయాడు మొదటి వాడు.
“అంటే బహుమతి అని ఒక అర్థంలే. మీ బాబు పేరేంటి?”
“మస్తక్!”
“మస్తకా? అదేం పేరు రా?” ఈ సారి రెండోవాడు ఆశ్చర్యపోయాడు.
“అంటే శిఖరం అని ఒక అర్థంలే,” వివరించాడు మొదటి వాడు.
తింటున్న టిఫిన్ వెగటుగా అనిపించి లేచి నిలబడ్డాను నేను. , బిల్‌కి డబ్బులు టేబుల్ మీద వదిలేసి, ఆ ఇద్దరినీ ఆపాదమస్తకం ఒక సారి చూసి అక్కడినుంచి బయట పడ్డాను.
***
ఇంటికి రాగానే ఫ్యాన్ వేసి దాని కిందే కూలబడ్డాను నేను. “ఎండలు మండిపోతున్నాయి కదండి?” అంటూ వచ్చి చల్లని మజ్జిగ నాకందించింది మా ఆవిడ.
“నాకు తెలిసి నా చిన్నప్పటినుంచి ఎండలు మండిపోతూనే ఉన్నాయి. చల్లగా ఉన్నట్టు నాకెప్పుడూ గుర్తు లేదు,” గ్లాస్ అందుకుంటూ అన్నాను నేను.
“ఈ సెటైర్లంటేనే నాకు చిరాకు. అన్నట్టు, ఇంతకు ముందే మన పక్కింటి పార్వతి పాప బారసాలకి వెళ్ళి వస్తున్నానండి,” చెప్పింది మా ఆవిడ.
“పేరేం పెట్టారు?” అని అడుగుతూనే నేను నాలుక కరుచుకున్నాను.
“ఎప్పుడూ ఎవరూ పెట్టుకోని పేరు, ఎవరూ కని విని ఎరగని పేరు పెట్టాలని చాల రోజులు ఆలోచించి పాపకి నిర్లజ్జ అని నామకరణం చేశారండి,” బదులిచ్చింది మా ఆవిడ.
దబ్‌మన శబ్దంతో నేను స్పృహ తప్పి పడిపోయానని ఆ తరువాత మొహాన నీళ్ళు కొట్టి లేపిన మా ఆవిడ చెప్పింది,
అదిరేటి డ్రెస్సు మేమేస్తే, బెదిరేటి లుక్కు మీరిస్తే…
ఆదర్శ్ నగర్ కాలనీ! అక్కడ అందరూ మధ్య తరగతి కుటుంబీకులే. అఫ్ కోర్స్, ప్రస్తుతం జంబూ ద్వీపంలో, మధ్య తరగతి అన్న పదానికి డెఫినిషన్ మారింది అనుకోండి. స్థిరాస్తులు, చరాస్తులు కలుపుకుని కనీసం ఒక కోటి రూపాయలు ఉంటేనే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబీకుల కింద లెక్ఖ.
ఆ కాలనీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో గొడవ జరుగుతూంది. ప్రెసిడెంట్ గారు, తన ఆరేళ్ళ కూతురి మీద కేకలేస్తున్నారు, “ఛీ, నీ మూలంగా నా పరువు పోయింది కదే,” అంటూ. కూతురు లిల్లీ బిక్క మొహం వేసుకుని నిలబడి ఉంది.
“పోనీ లెండి, చిన్న పిల్ల కద!” సర్ది చెప్పబోయింది ప్రెసిడెంట్ గారి భార్య.
“ఆ సెక్రెటరీ గాడి కూతురు కూడా చిన్న పిల్లే. మరి అది ఎలా చేసింది, ఎలా చేయగలిగింది?”
“వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారండీ! ఎన్నో వీడియోలు కొన్నారు. ఎంతో ప్రాక్టీస్ చేయించారు. మన లిల్లీ జస్ట్ సిక్స్ మంత్స్ నుంచే కదా ట్రైనింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా సెలెక్ట్ అవుతుంది లెండి.”
“నాకు నమ్మకం లేదే, నెక్స్ట్ టైంకి దీనికి ఏడేళ్ళు వస్తాయి. నీకు తెలుసు కద, ఎంత తక్కువ వయసు ఉంటే అంత మంచిది వీటికి అని?”
ఇంతకీ అక్కడ జరుగుతూంది ఏమిటనుకుంటున్నారు? ఊ టీవీ చానెల్‌లో “గుంతలకిడి గెంతులు” అనే చిన్న పిల్లల డాన్స్ ప్రోగ్రాం వస్తుంది. అంధేరా ప్రదేశ్ నలుమూలల నుంచి తల్లి తండ్రులు తమ పిల్లలకు తర్ఫీదు ఇచ్చి పంపిస్తారు.
ఒక వేళ ఆడిషన్‌లో సెలెక్ట్ ఐతే, ఆ పిల్లలకు ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం, తద్వారా టీవీ మీద అందరికి కనిపించే అదృష్టం దక్కుతాయి. తమ పిల్లలు ఆడిషన్‌లో సెలెక్ట్ అయి ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలని అందరు తల్లి తండ్రులు ఆశగా ఎదురు చూస్తూంటారు.
దీనిలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఎవరి పిల్లలు ఐతే సెలెక్ట్ అవుతారో, వాళ్ళ తల్లి తండ్రులు కూడా స్టూడియోలో ఆడియెన్స్‌లో కూర్చోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ మొహాలు కూడా టీవీ మీద కనిపించే ఛాన్స్ ఉంటుంది.
కొంప దీసి వాళ్ళ పిల్లలు కనుక ఏదైన ప్రైజు గెలుచుకుంటే, తల్లి తండ్రులవి ఇంటర్‌వ్యూలు కూడా తీసుకుంటారు. ఒక మధ్య తరగతి కుటుంబానికి అంతకు మించిన భాగ్యం ఏముంటుంది?
రెండు రోజుల కింద జరిగిన ఆడిషన్‌లో ప్రెసిడెంట్ గారి కూతురు లిల్లీ సెలెక్ట్ కాలేదు. పుండు మీద కారం చల్లినట్టు అదే కాలనీ సెక్రెటరీ కూతురు మల్లి ఎన్నుకోబడింది. ఒక తండ్రికి ఇంతకంటే అవమానమేముంటుంది? అందుకే ప్రెసిడెంట్ గారు అలా చిందులు తొక్కుతూంది.
“గుంతలకిడి గెంతులు” ప్రోగ్రాంకి సెలెక్ట్ కావడానికి తల్లి తండ్రులు చేయంది లేదు. ఆ ప్రోగ్రాంలో జడ్జులు సాధారణంగా మాస్ డాన్సులపై ఎక్కువ మక్కువ చూపుతారు. కాబట్టి పేరెంట్స్ కూడా తమ పిల్లలతో అన్ని మాస్ నృత్యాలే ప్రాక్టీస్ చేయిస్తారు.
ఆడిషన్ సంగతి మళ్ళీ గుర్తొచ్చినట్టుంది, ఇంకో సారి రెచ్చిపోయారు ప్రెసిడెంట్ గారు.
“నీకేం చెప్పానే, మొహంమొత్తే ఖాన్ పాటకి డాన్స్ చేయమని చెప్పానా? ఆ మూవ్‌మెంట్స్ కూడా ఇంట్లో దగ్గరుండి మరీ నేర్పించాను కద? నువ్వు చేసిందేమిటి? ఎప్పుడో పాత సినిమాల్లోని మాస్ డాన్సర్ విజయమాలిని పాటకి డాన్స్ చేస్తావా? ఆ డాన్స్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతాననుకున్నావే?” కోపంగా గద్దించాడు ఆయన.
“సారీ నాన్నా, ఆ మొహంమొత్తే ఖాన్ పాటకి డాన్స్ చేయాలంటే చిగ్గేసింది. అందుకే విజయమాలిని ఆంటీ డాన్స్ చేసా,” భయంగా అంది లిల్లీ.
“సిల్లీగా మాట్లాడకు లిల్లీ. ఆ పాటలో ఊపు లేదనే నిన్ను డిస్‌క్వాలిఫై చేశారు. ఆ మల్లి చూడు, చక్కగా ఛండాలంగా ఎలా నడుము ముందుకి వెనక్కీ ఊపిందో! నువ్వు తెగ సిగ్గు పడుతూ చేశావు. సిగ్గు లేకపోతే సరి. సరేలే నీకు చాలా సిగ్గు కద. అదే కొంప ముంచింది,” విసుక్కున్నారు ప్రెసిడెంట్ గారు.
***
శనివారం. ఆ రోజు “గుంతలకిడి గెంతులు” టెంత్ ఎడిషన్ మొదటి భాగం ఊ టీవీ స్టూడియోలో షూట్ చేస్తున్నారు. పాల్గొంటున్న పిల్లలతో పాటూ వాళ్ళ తల్లి తండ్రులు, వారి వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా విచ్చేశారు. ఆడియెన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ప్రోగ్రాం కి ముగ్గురు జడ్జెస్: ఒక రిటైరైపోయిన యాక్టర్, ఒక మాజీ కొరియోగ్రాఫర్, ఒక పనీ పాట లేని మ్యూజిక్ డైరెక్టర్.
మొట్ట మొదట ఒక ఆరేళ్ళ కుర్రాడు వచ్చేసి, దేశబెదురు సినిమాలోని “రాయే రాయే రాయే రాయే” పాటకు డాన్స్ చేసాడు. ఆ పాటలో ఒకే లిరిక్ ఐతే ఆ కుర్రాడు ఒకే స్టెప్‌తో మ్యానేజ్ చేశాడు. స్టూడియో చప్పట్లతో మారు మోగి పోయింది.
తరువాత బేబీ స్వర్ణ వచ్చి, “A అంటే ఎప్పాసు బేరం, B అంటే బోడిగుండు వారం, C అంటే సింగినాధం జీలకర్ర, గోల చేసి గెంతుతారు అంధేరా జనం,” అన్న పాటకి పచ్చి బూతు మూవ్‌మెంట్స్‌తో డాన్స్ చేసింది. ఈ సారి జడ్జ్‌లు లేచి మరీ చప్పట్లు కొట్టారు. బేబీ స్వర్ణ తల్లి తండ్రులు ఆనంద భాష్పాలు తుడుచుకోవడాన్ని క్యామెరా మ్యాన్ శ్రద్ధగా కవర్ చేశాడు.
నెక్స్ట్ క్యాండిడేట్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి బేబీ మల్లి. ఆడియెన్స్‌లో ఉన్న మల్లి పేరెంట్స్, వారితో పాటు వచ్చిన ప్రెసిడెంట్ గారూ, ఆయన భార్య ఊపిరి బిగబట్టి చూడ్డం మొదలు పెట్టారు.
చిన్న పీలికల్లాంటి బట్టలు వేసుకుని బేబీ మల్లి ఎంటర్ అయ్యింది. కొందరు ఛాందసులు ఆ దృశ్యం చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నారు. సెక్రెటరీ గారి భార్య పక్కన ఉన్న ప్రెసిడెంట్ గారి భార్యతో గర్వంగా చెప్పింది, “ఈ కాస్ట్యూం నేనే సెలెక్ట్ చేసాను, క్యూట్‌గా ఉంది కదూ?” అని.
“అవునవును, అసలు కాస్ట్యూంకే ప్రైజ్ వచ్చేసేలా ఉంది,” వంత పాడారు ప్రెసిడెంటూ, ఆయన భార్య.
మల్లి స్టేజ్ మీద ఉన్న పట్టు స్మిత విగ్రహానికి మొక్కి తన డాన్స్ మొదలు పెట్టింది. తను ఎంచుకున్న పాట “ఇప్పటికింకా నా వయసు నిండా ఆరేళ్ళే. చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ అంతా అంకుల్సే!”
“పాట కూడా సూపర్! మీ అమ్మాయే టాపర్ లెండి ఈ రౌండ్‌లో,” అసూయగా అంది ప్రెసిడెంట్ గారి భార్య.
“అంతా మీ అభిమానం వదినా. అసలు సంవత్సరం పాటూ మా పిల్ల ఎలాంటి దుష్ప్రభావాలకూ లోను కాకుండా, కనీసం ఒక్క శాస్త్రీయ నృత్యం ప్రోగ్రాం కూడా చూడకుండా మ్యానేజ్ చేశాం,” ఆనందంగా అంది సెక్రటరీ గారి భార్య.
కానీ జరగకూడని ఘోరం జరిగిపోయింది. మల్లి డాన్స్ మధ్యలో మాజీ కొరియోగ్రాఫర్ లేచి, “ఆపు మల్లీ ఆపు!” అంటూ గర్జించాడు. పాట ఆగిపోయింది. మల్లి ఏడవడానికి రెడీ అయ్యింది.
“అసలా పాటకు మొహంమొత్తే ఖాన్ ఎలా డాన్స్ చేసింది, నువ్వెలా చేస్తున్నావు? ఆమె మూవ్‌మెంట్స్ ఏంటి, నీ మూవ్‌మెంట్స్ ఏంటి? ఇదేమన్నా తొక్కలో క్లాసికల్ డాన్స్ అనుకున్నావా, అలా కంట్రోల్డ్‌గా చేయడానికి? ఆ బరితెగింపు, ఆ విచ్చలవిడితనం ఏవీ? ఆ మాస్ ఎలిమెంట్స్ ఏవి?” బాధగా అన్నాడు కొరియోగ్రాఫర్.
భోరున ఏడ్చేసింది మల్లి. ఆ పిల్ల తల్లి తండ్రులు అంతకంటే వయొలెంట్‌గా రియాక్ట్ అయ్యారు.
“అయ్యయ్యో, మన ట్రైనింగ్‌లో ఏం లోపం జరిగిందండీ? పొరపాటున కేబుల్ టీవీ మీద ఆ వె. కిశ్వనాథ్ సినిమాలు, కంకరాభరణమో సముద్ర సంగమమో చూసిందంటారా?” ఏడుపు గొంతుతో అడిగింది సెక్రటరీ గారి భార్య.
“అయ్యుంటుంది. అసలు అలాంటి సినిమాలని బ్యాన్ చెయ్యలి. బూజు పట్టిన భావాలు అవీ. అ దిక్కుమాలిన శాస్త్రీయ నృత్యాల ప్రభావం పడినట్టుంది. అందుకే టెంపో తక్కువయ్యింది మన అమ్మాయి డాన్సులో,” బొంగురు పోయిన గొంతుతో అన్నాడు వాళ్ళాయన .
కాని మ్యూజిక్ డైరెక్టర్, మాజీ యాక్టర్ ఎక్కువ మార్క్స్ వేయటం వల్ల నెక్స్ట్ రౌండ్‌కి ఐతే చేరుకుంది మల్లి. సెక్రటరీ గారూ ఆయన భార్యా, బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
***
“గుంతలకిడి గెంతులు” లాంటి ప్రోగ్రాంలు చాలా హేయమైనవని, చిన్న పిల్లలతో, పెద్దలకు మాత్రమే టైప్ పాటలకి అలా డాన్స్ చేయించడం, మన సమాజానికి పట్టిన దౌర్భాగ్యానికి నిదర్శనమని, శిశు హక్కుల సంఘం పెద్ద గొడవ చేసింది.
టీవీ 999 విలేఖరి, “గుంతలకిడి గెంతులు” ప్రోగ్రాం ప్రొడ్యూసర్ నటరాజుతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు.
విలేఖరి: అలా చిన్న పిల్లలతో కురచ బట్టలు వేయించడం చాలా ఛండాలంగా ఉందని కొందరు అంటున్నారు. మీ కామెంట్?
నటరాజు: కొందరే అంటున్నారు అని మీరు అనడంలోనే తెలిసిపోతుంది. ఎక్కువ మందికి ఎలాంటి ప్రాబ్లెం లేదని. ఐనా పిల్లలు భగవత్ స్వరూపాలు. వాళ్ళు ఏం వేసుకున్నా ముద్దుగానే ఉంటారు. అవి బూతు డ్రెస్సులు అనే వాళ్ళే పెద్ద బూతు మనుషులు. వాళ్ళ మనసులో అంతా బూతే కాబట్టి వాళ్ళకు ఏది చూసినా బూతు లానే అనిపిస్తుంది.
విలేఖరి: ఐతే ఇలాంటి ప్రోగ్రాంలు ప్రసారం చెయ్యడం తప్పు కాదంటారు?
నటరాజు: కానే కాదు. ఐనా, ఆ పిల్లల తల్లి తండ్రులకే లేని బాధ ఈ సంఘానికెందుకండీ? తల్లి తండ్రుల పూర్తి అంగీకారంతోనే కద పిల్లలు పాల్గొనేది!
అలా ఇంటర్వ్యూ ముగిసింది.
***
విలేఖరి ఆ తరువాత “గుంతలకిడి గెంతులు” ఫైనలిస్ట్ ఐన బేబీ స్వర్ణ తల్లి తండ్రులని ఇంటర్వ్యూ చేశాడు.
విలేఖరి: ఈ వయసులో పిల్లలకు మంచి చెడు గురించి సరైన అవగాహన ఉండదు కాబట్టి, పేరెంట్సే వారిని సరిగ్గా గైడ్ చేయాలంటారు. మరి మీరే మీ పిల్లల్ని ఇలాంటి ప్రోగ్రాంస్‌లో పాల్గొనమని ప్రోత్సహిస్తే ఎలా?
తల్లి: సరిగ్గానే గైడ్ చేస్తున్నామండి. మనం పుట్టగానే బట్టలతో పుట్టామా, పోయేప్పుడు బట్టలతో పోతామా? ఈ న్యారో మైండెడ్ ఫెలోస్‌కి అవకాశమిస్తే బట్టలు లేకుండా తిరుగుతున్న చంటి పిల్లల్ని కూడా ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ కింద జైల్‌లో పెట్టమంటారు.
తండ్రి: ఇదంతా కుళ్ళుమోతుతనమండి! ప్రతి ఒక్క కుటుంబం టీవీ మీద కనపడాలని కోరుకుంటుంది. మాకు అవకాశం వచ్చింది. వాళ్ళకు రాలేదు. అందుకే ఈ ఏడ్పు.
***
ఆదివారం ఉదయం. పేపర్ చదువుతున్న సెక్రటరీ గారు (అదేనండి! బేబీ మల్లి నాన్నగారు) “ఏమేవ్ ఇది విన్నావా?” అన్నారు భార్యని ఉద్దేశించి.
“ఏ విషయమండి?” వంటింట్లోంచి బయటకు వస్తూ అడిగింది ఆవిడ.
“ఫాదర్ జేకబ్‌ని పెడోఫిలియా నేరం కింద అర్రెస్ట్ చేశారంట. అదేనే, తన ప్రాపకంలో ఉన్న కొందరు చిన్న పిల్లలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడట. అందుకని!”
“ఎంత దారుణమండి! ఆ పిల్లలు ఫాదర్‌ని నమ్మి ఆయన పంచన చేరారు. రక్షించాల్సిన వాడే భక్షిస్తే ఎలాగండి? ఎంత అన్యాయం!!!”
“కదూ!”
Comments (28)