Archive for the ‘ప్రవాసాంధ్రులు’ Category

పుణ్యం కావాలా? ఐతే డబ్బు ఖర్చవుతుంది!


“పురుషోత్తమా, పురుషోత్తమా, పురుషోత్తమా!” అన్నమయ్య సినిమాలో ఎస్.పీ బాలు పాడిన పాట అందుకున్నాడు అప్పారావు. అతను పూజ గదిలో కూర్చుని, వెంకటేశ్వర స్వామి పటం వైపు అర్ధ నిమీలిత నేత్రాలతో చూస్తూ ఉన్నాడు.

“పిలిచావా బావా!” రివ్వున వచ్చేశాడు అతని బావమరిది పురుషోత్తం. అతను రెండు రోజుల కింద డల్లాస్ నుంచి కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాకి (అప్పారావు ఇంటికి) వచ్చి ఉన్నాడు. ఇంకో రెండు గంటల్లో మళ్ళీ డల్లాస్ వెళ్ళే ఫ్లైట్ అందుకోవాలి అతను.

“నిన్ను కాదురా! అయినా నిన్నైతే అంత శ్రావ్యంగా అన్ని సార్లు ఎందుకు పిలుస్తాను. నేను ఎలుగెత్తి పిలుస్తూంది ఆ ఆపద మొక్కుల వాడిని,” చేతులు జోడించి అన్నాడు అప్పారావు.

“బావా నువ్వు చాలా వెనక పడి ఉన్నావు. ఇలా ఇంట్లో కూర్చుని పిలవక్కర్లేదు. ఆ సంకట హరణుడు మీ ఊరికే విచ్చేస్తున్నాడు,” చెప్పాడు పురుషోత్తం.

“ఏంట్రా ఆ పిచ్చి వాగుడు? కొంప తీసి మీ అక్కయ్య ఎక్స్‌పరిమెంటల్ బేసిస్ మీద చేసిన కూర పొరపాటున రెండో సారి వేసుకున్నావా?”

“ఆ కూర తింటున్నప్పుడు నీ మొహంలో ఫీలింగ్స్ చూసి, నేను మొదటి సారి కూడా వేసుకోలేదు బావా! ఇంతకీ సంగతి విను.”

“ఏంటో చెప్పు.”

“మన లాంటి N.R.I. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాక్షాత్తు ఆ తిరుమలనే మన దగ్గరకు తీసుకు రాబోతున్నారు. కొద్ది రోజుల పాటు మీ బే ఏరియా తిరుమల అయిపోతుంది. ఎంతో మంది పూజారులు, దేవుడి విగ్రహాలతో సహా వస్తున్నారు.”

“భక్తుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళనప్పుడు, భగవంతుడే భక్తుడి దగ్గరకు వస్తాడట,” భక్తి పారవశ్యంతో అన్నాడు అప్పారావు.

“అంతే బావా, అంతే! నువ్వు వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు కొనుక్కోవచ్చు,” సజెస్ట్ చేశాడు పురుషోత్తం.

సడన్‌గా ఒక డౌట్ వచ్చింది అప్పారావుకి. “అవున్రా, మర్చేపోయాను. సముద్రం దాటడం పట్ల నిషేధం ఏదో ఉంది కద? మరి ఈ పూజారులు ఎలా వస్తున్నారు, అదీ దేవుడి విగ్రహాలతో?” అడిగాడు.

“హయ్యో! ఎంత సత్యకాలపు మనిషివి బావా నువ్వు! విదేశాల్లో గుడులు కట్టడం లేదా, పూజారులు ప్రత్యేక వీసా మీద ఇదే సముద్రాన్ని దాటి రావడం లేదా? ఐనా అప్పట్లో సరయిన టెక్నాలజీ లేదు కాబట్టి, సముద్రం దాటలేకపోయిన పండితుడెవరైనా కడుపు మండి ఆ రూల్ పెట్టి ఉంటాడు. అన్నట్టు నాకు ఫ్లైట్‌కి ఆలస్యం అవుతుంది, నేనొస్తా,” అంటూ నిష్క్రమించాడు పురుషోత్తం.

***

పురుషోత్తం వెళ్ళాక సదరు వెబ్ సైట్‌కి వెళ్ళి వివరాలు కనుకున్నాడు అప్పారావు. టికెట్ల సెక్షన్‌కి వెళ్ళి, వంద డాలర్ల చొప్పున రెండు టికెట్లు కొనుక్కున్నాడు. “వెధవ డబ్బుదేముంది. స్వామికి ఎంత ఇచ్చినా తక్కువే. పైగా వీళ్ళు భక్తుల సౌకర్యం కోసం కామోసు, శని, ఆది వారాల్లోనే దర్శనం పెట్టారు. వాళ్ళు అంత బాగా అన్నీ అరేంజ్ చేస్తూంటే ఆ మాత్రం పెట్టకపోతే ఎలా?” అనుకున్నాడు.

అప్పారావు భార్య రజని కూడా చాలా ఆనందించింది. “చాలా మంచి పని చేశారండీ. ఐతే ఈ వీకెండ్ దేవుడి సన్నిధిలో గడుపుతున్నామన్న మాట,” అంది.

ఏట్టకేలకు ఆ ఘడియ రానే వచ్చింది. అప్పారావు భార్యా సమేతంగా గుడికి బయలు దేరాడు. అక్కడికి చేరుకునేప్పటికి, భక్తుల రష్ ఎంతుందో అర్థమయ్యింది అతనికి. పార్క్ చేయడానికి ప్లేస్ కూడా దొరక్క ఒక నాలుగు వీధులవతల పార్క్ చేసి భార్యతో సహా తిరిగి గుడికి నడుచుకుంటూ వచ్చాడు.

లోపల అడుగు పెట్టగానే గుడి ముందు ఉన్న లైన్ చూసి అప్పారావు, రజని అక్కడికి వెళ్ళారు. అక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తున్న ఒక వాలంటీరు “మీదే టికెట్?” అడిగాడు.

“వంద డాలర్లు,” గర్వంగా చెప్పింది రజని.

“ఐతే మీది ఈ లైన్ కాదు. దూరంగా ఒక టెంటు కనపడుతూంది చూశారా? అక్కడికి వెళ్ళి కూర్చోండి,” డైరెక్ట్ చేశాడు ఆ కుర్ర వాడు.

“ఎందుకు?” కాస్త అయోమయంగా అడిగాడు అప్పారావు.

“ఈ లైన్ రెండొందల యాభై టికెట్ కొనుక్కున్న భక్తులకు మాత్రమే. వీరందరి దర్శనం అయ్యాక మిమ్మల్ని పిలుస్తాం. అప్పుడు టెంటు నుంచి లేచి ఒద్దురు గానీ,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆ వాంటీరు.

చేంతాడు అంతున్న ఆ లైన్‌ని చూసి దడుచుకున్నారు అప్పారావు రజని. కానీ చేసేది ఏమీ లేక టెంటు వైపు బయలుదేరారు.

“వెధవ కక్కూర్తి, వెధవ కక్కూర్తి అని! మీరు కూడా రెండొందల యాభై టికెట్ కొనొచ్చు కద,” కోప్పడింది రజని.

“వంద డాలర్ల టికెట్ కొనడం కక్కూర్తా! ఐనా ఆ రెండొందల యాభై గ్యాంగ్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదులే,” సర్ది చెప్పాడు అప్పారావు.

“అన్నట్టు, వీళ్ళే గుడి బయట ఉంటే, లోపల ఉన్న వాళ్ళు ఎంత టికెట్ కొనుకున్నారో?” ప్రశ్నార్థకంగా చూసింది రజని అప్పారావు వైపు.

టెంటులోకి వెళ్ళాక చాలా విషయాలు తెలిశాయి అప్పారావు దంపతులకి. టెంటులో నాలుగు చిన్న టీవీలు ఉన్నాయి. జనమంతా వాటి ముందు నిలబడి తదేకంగా చూస్తున్నారు. అప్పారావు కూడా ఒక టీవీ దగ్గరకు వెళ్ళాడు. టీవీ స్క్రీన్ మీద గుడిలో జరుగుతున్న పూజా తతంగం కనిపిస్తూంది.

“ఇదేం చోద్యమండి, ఈ మాత్రం దానికి టికెట్ ఎందుకు కొనుక్కున్నట్టు?” కాస్త చిరాకుగా అన్నాదు అప్పారావు.

అక్కడ ఉన్న ఒక పెద్దాయన, “మనం నయమండి, ఇంకా యాభై టికెట్ వాళ్ళనైతే గుడి ప్రాకారం బయటే ఆపేశారు,” అన్నాడు.

“ఏంటీ? యాభై టికెట్ వాళ్ళకు అలాంటి ట్రీట్‌మెంటా?” ఆశ్చర్యపోయింది రజని.

“మీకు బొత్తిగా నాలెడ్జ్ ఉన్నట్టు లేదు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. శ్రమ తెలియకుండా వినండి,” అంటూ గొంతు సవరించుకున్నాడు పెద్దాయన.

దాని ప్రకారం వారికి తెలియ వచ్చింది ఏంటంటే యాభై టికెట్ వాళ్ళు గుడి కాంపౌండ్ బయట, వంద టికెట్ వాళ్ళు టెంటులో, రెండొందల యాభై వాళ్ళు గుడి బయట లైన్‌లో ఉన్నట్టుగానే ఐదొందల టికెట్ వాళ్ళు గుడి వెనుక భాగంలో కూర్చుని ఉంటే, వెయ్యి టికెట్ వాళ్ళు గుడి ముందు భాగంలో ఉన్నారట.

“యాభై టికెట్ వాళ్ళు గుడి బయట ఉండి చేసేదేముంది?” సందేహం వచ్చింది అప్పారావుకి.

“అంటే వాళ్ళకు బయట ఒక మైక్ పెట్టారు. దానిలోంచి వాళ్ళు ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు,” చెప్పాడు పెద్దాయన.

“ఐతే వెయ్యి టికెట్ వాళ్ళే దేవుడిని అందరికంటే దగ్గరగా చూస్తారా?”

“లేదు. ఐదు వేల టికెట్ వాళ్ళు మొదటి వరసలో కూర్చుంటారు.”

ఆ ధరలు విని కళ్ళు తిరిగాయి అప్పారావుకి.

“మరేమనుకున్నారు? పుణ్యం ఫ్రీగా వస్తుందేంటి? ఎంత ఖర్చు పెడితే అంత పుణ్యం. ఎంత చెట్టుకి అంత గాలి.”

నిజమే అనిపించింది అప్పారావుకి. ఒక రకంగా ఆశ్చర్య పడాలింది ఏం లేదు. అక్కడ తిరుమలలో జరిగేదే ఇక్కడా జరుగుతూంది. “ఐతే మనది ధర్మ దర్శనం బ్యాచ్ అన్న మాట,” అన్నాడు రజనితో.

అచ్చం అలానే వెయిట్ చేయాల్సి వచ్చింది వంద టికెట్ గ్రూప్‌కి. దాదాపు గుడి మూసే వేళకు వాళ్ళకు లోపలికి ప్రవేశం లభించింది. వాలంటీర్లు జనాలని బారులుగా నిలబెట్టి ఒకరి తరువాత ఒకర్ని దేవుడి దగ్గరకు పంపిస్తున్నారు. తిరుమల గుడిలో లాగానే వాళ్ళు ఇక్కడ కూడా జనాల్ని రఫ్‌గా, తొందరగా కదలమంటూ నెట్టేస్తున్నారు.

అప్పారావు మొహంలో ఆశ్చర్యం గమనించి “అంటే మనకు తిరుమలలో ఉన్న ఫీలింగ్ రావాలని, ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు,” ఎక్స్‌ప్లేనేషన్ ఇచ్చాడు పెద్దాయన.

హెడ్ వాలంటీర్‌ది నున్నటి గుండు. “ఇక్కడ కూడా తిరుపతి కొండలా గుండు చేయించుకునే సదుపాయముందా?” ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.

“మీరు పొరపాటు పడ్డారు. ఆయన ఎప్పటినుంచో గుండుతో ఉన్నారు. జస్ట్ కో-ఇన్సిడెన్స్,” జవాబిచ్చాడు పెద్దాయన.

అందరిలానే అప్పారావు, రజనిలు కూడా దర్శనం కాగానే బయటకు తోయబడ్డారు. చాలా ఆలస్యంగా అర్ధ రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పటం ముందు నిలబడి, “ఇలా అనడం తప్పేమో స్వామీ. కానీ నాకు ఆ గుడిలో కంటే ఇక్కడే ఎక్కువ ప్రశాంతంగా ఉంది,” అని లెంపలేసుకున్నాడు అప్పారావు.

***

( ఇలా ఉత్సవ విగ్రహాలు సముద్రం దాటించి తీసుకు వచ్చి, ప్రవాస భారతీయులని ధన్యులు చేయడం అన్నది కొత్త ట్రెండేమో కాని. మన పుణ్య భూమి నుంచి రక రకాల స్వాములూ, బాబాలూ అమెరికాకి వచ్చి N.R.I.ల నుంచి దండిగా డాలర్లు తీసుకుని పుణ్యం పంచడమనేది, పాత పద్ధతే.)

అరెమికాలో లైఫే వేరు

Read more »

లెక్ఖలూ ఎక్కాలు తెల్వనోల్లు

అమెరికానుంచి ఆ రోజే దిగాడు అనురాగ్. అతను వచ్చింది పెళ్ళి సంబంధాల కోసం. అదే లెండి, తనకు ఒక పెళ్ళి కూతురుని వెతుక్కోవడానికి. అఫ్ కోర్స్, తల్లి తండ్రులు, బంధు మిత్రుల సహాయంతోనే. అతను ఉండేది కేవలం మూడు వారాలు మాత్రమే. ఆ సెలవు కూడా ఎంతో బతిమాలుకుంటేనే దొరికింది అతనికి. బాస్ తెలుగు వాడు కావడంతో ఒప్పించడం ఇంకా కష్టమయ్యింది.

“మూడు వారాలు ఎందుకోయి? మన పద్మాకర్ వెబ్‌కాం/వాయిస్ చాట్‌తో ఇక్కడినుంచే ఒక రోజులో అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. వారం రోజుల్లో వెళ్ళి పెళ్ళి ముగించుకుని వచ్చాడు. అలా ఉండాలి ఎఫిషియెంట్‌గా!” అన్నాడు అనురాగ్‌తో.

“మరే, ఆ తొందరలో చూసుకోలేదట, ఆ అమ్మాయికి మెల్ల కన్ను, దొడ్డి కాళ్ళు అట. ఇక్కడికి వచ్చాక తెలిసింది. విపరీతంగా ఫీల్ అయ్యాడు.అంత ఎఫిషియెంట్‌గా ఉండి ఉండకూడదు అని,” అన్నాడు అనురాగ్.

“వెళ్ళి కలిశాడు కదయ్యా. మెల్లకన్ను, దొడ్డి కాళ్ళు ఉన్నాయని తెలీలేదా?”

“అంటే అక్కడికి వెళ్ళాక, ఆ అమ్మాయిని పెళ్ళి పీటల మీదే చూశాడట. బుట్టలో వాళ్ళ మేనమామ మోసుకొచ్చాడట. పైగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చుందంట. ఎందుకు అని అడిగితే, హోమగుండం నుంచి వచ్చే పొగ పడదు అని సర్ది చెప్పారట.”

“వెబ్‌కాంలో చూసి పెళ్ళి చేసుకుంటే అంత డేంజర్ అపాయం ఉందన్న మాట!”

“అందుకే సార్, నేను అలా హడావుడిగా చేసుకోకూడదనుకుంటున్నా.”

“సరే అలా ఐతే మూడు వారాలు శాంక్షన్ చేశాలే.”

అలా, ఆ రకంగా మూడు వారాల సెలవుతో ఇండియాకి వచ్చాడు అనురాగ్.

“అమెరికానుంచి వచ్చిన ఐదున్నర అడుగుల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. ఏడాదికి ఆల్‌మోస్ట్ ఆరంకెల జీతం సంపాయిస్తున్న వాడిని. ఇంకా పెళ్ళి కాని వాడిని. మన ఇలాకాలో ఉన్న పెళ్ళి కాని అమ్మాయిల తల్లి తండ్రులందరూ మనింటికి ఒకే సారి రావడంతో మన వీధిలో ట్రాఫిక్ జాం అయిపోతుందేమో?” అనుమానం వెలిబుచ్చాడు అనురాగ్ వాళ్ళ నాన్నగారితో.

“అసలు ఆ అవకాశం వాళ్ళకు మనం ఇవ్వం కదరా అబ్బాయి! రేపే మన చుట్టాలమ్మాయి పెళ్లి ఉంది. అక్కడికి వెళ్దాం. మన పెళ్లిళ్ళ సంగతి నీకు తెలీనిదేముంది. చాలా మంది వాటిని అటెండ్ అయ్యేదే ఏవన్నా పెళ్లి సంబంధాలు కుదురుతాయేమో అని. కాబట్టి మనం కూడా వెళ్తే అంతా పద్ధతిగా జరిగిపోతుంది. నీకు సరయిన ఎక్స్‌పోజర్ లభిస్తుంది,” చెప్పారు అనురాగ్ నాన్నగారు.

సరే అన్నట్టు తల ఊపాడు అనురాగ్.

***

కాస్త ఉక్కగా ఉన్నా పెళ్లికి సూట్ వేసుకుని వెళ్ళాడు అనురాగ్. ఎంతైనా అమెరికా నుంచి వచ్చాడు కద, ఆ మాత్రం దర్జాగా ఉండడం అవసరం అని అతని అభిప్రాయం.

అతను వెళ్ళేసరికి పెళ్ళి హాల్ ఒక మోస్తారుగా నిండిపోయింది. అనురాగ్ అనుకున్నట్టుగానే అతని దగ్గర ఒక చిన్న గుంపు (పెళ్లి కాబోయే అమ్మాయిల తండ్రులు, మామయ్యలు, అన్నయ్యలు, బాబాయిలు టైప్ మనుషులు అన్న మాట) తయారయ్యింది.

అనురాగ్ అమెరికానుంచి వచ్చాడు అని, ఏడాదికి ఆల్‌మోస్ట్ ఆరంకెల జీతగాడని, ఐదున్నర అడుగుల అందగాడని హాల్‌లో దాదాపు అందరికి తెలిసిపోయింది. “నాన్నే కరెక్ట్. ఇక్కడైతే ఇలా డిగ్నిఫైడ్‌గా సంబంధాలు వెతుక్కోవచ్చు,” అనుకున్నాడు అనురాగ్.

మెల్లగా హాల్ నిండడం మొదలు పెట్టింది. “ఇక ఒకటే తోసుకుంటూ నెట్టుకుంటూ వస్తారేమో తనని కలవడానికి,” అనుకున్నాడు అనురాగ్. అతను అనుకున్నట్టే ఒక పెద్ద గుంపు అతని వైపు వచ్చేసింది.

“నెమ్మదిగా, నెమ్మదిగా! ఒకరి తరువాత ఒకరు రండి. అందరితో మాట్లాడతాను,” హామీ ఇచ్చాడు అనురాగ్. కానీ ఆ గుంపు అతన్ని పట్టించుకోకుండా అతని పక్కనుంచి వెళ్ళిపోయింది.

కొద్దిగా చిన్నబుచ్చుకున్నాడు అనురాగ్. “ఏమైంది? అంత హడావుడిగా వెళ్ళిపోయారు?” పక్కనున్నతన్ని అడిగాడు.

“మరి పెద్ద మనిషి వస్తే వెళ్ళరుటండి?” అన్నాడాయన.

“పెద్ద మనిషి అంటే, ఎవరైనా స్వామీజీనా?”

“కాదు.”

“మరి ఎవరైనా పేరు మోసిన యాక్టర్ గారా?”

“అబ్బే!”

“పోనీ, నాలా సాఫ్ట్‌వేర్ ఇంజనీరా?”

“ఛీ! కాదు!”

“మరి?”

“మన కలెక్టరాఫీసులో బంట్రోతు.”

“అతనికింత హడావిడా?”

“లేకపోతే! పేపర్ చదవరా, టీవీ చూడరా? కలెక్టరాఫీసులో బంట్రోతుగా పని చేసి ఇరవయి ఏళ్ళలో ఇరవయి కోట్లు సంపాయించాడు. అవినీతి కారణంగా ఉద్యోగం తీసేశారనుకోండి. కానీ ఆయనకేం ఫర్లేదు, ఇప్పుడు ఓపెన్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. అన్నట్టు మీరు అమెరికాలో పని చేశారు కద, మీ దగ్గరెన్ని కోట్లు ఉన్నాయి?”

“తొడుక్కోవడానికి కూడా అన్ని కోట్లు లేవు,” నీరసంగా చెప్పాడు అనురాగ్.

ఈ సారి మొదటి గుంపు కంటే పెద్దది ఎంట్రన్స్ వైపు పరిగెట్టింది.

“ఈయనెవరు?” అసూయగా అడిగాడు అనురాగ్.

“సెక్రటేరియట్‌లో ప్యూన్. రిటైర్ కావడానికి ఒక నెల ఉంది. ఇప్పటి వరకు యాభై కోట్లు సంపాయించాడు.”

“ఓలమ్మో!”

ఈ సారి దాదాపు హాల్‌లో సగం మంది డోర్ వైపు పరిగెత్తారు.

“ఈ సారి ఎవరు వచ్చారు?” భయం భయంగా అడిగాడు అనురాగ్.

“ఎండౌమెంట్స్ ఆఫీస్‌లో గుమాస్తా. పదేళ్ళలో మూదొందల కోట్లు సంపాయించాడు.”

కళ్ళు తిరిగి కింద పడబోయిన అనురాగ్‌ని ఆయనే పట్టుకున్నాడు.

అంతలో గుమాస్తా గారు వెనకాల ఒక పెద్ద మందతో అక్కడికి వచ్చేశారు. మొదటి వరుసలో సీట్లు ఖాళీగా లేకపోవడం గమనించి నొసలు చిట్లించారు. పెళ్లి కూతురు తండ్రి గతుక్కుమని, “ఒక నిమిషం సార్!” అంటూ మొదటి రోలో కూర్చున్న వారందరిని (అనురాగ్‌తో సహా) లేపేసి గుమస్తా గారికి, ఆయన మిత్రులకి సీట్లు ఖాళీ చేశాడు.

మనసులో ఆనందపడినా పైకి, “అదేంటయ్యా, పాపం కూర్చున్న వాళ్ళని లేపేశావు,” అన్నారు గుమాస్తా గారు.

“ఆ వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాదు లెండి సార్. ఏదో అమెరికాలో బోడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అంతే!” తేల్చేశాడు పెళ్లి కూతురి తండ్రి.

“రేపే నా జాబ్ కి రిజైన్ చేసి, ఎలాగో అలా ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ప్యూను గానో, గుమాస్తాగానో ఉద్యోగం సంపాదించాలి,” తనలో తాను నిర్ణయించుకున్నాడు అనురాగ్.

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers