Archive for the ‘భూగోళం’ Category

వాడి చావు మన ప్రాణానికొచ్చింది!

పీకిస్తాన్!

జంబూ ద్వీపాన్ని “అంటుకుని” ఉన్న పవిత్ర దేశం. అది SIS హెడ్ క్వార్టర్స్. జనరల్ కయ్యానికి తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు.

దానికి గట్టి కారణం ఉండనే ఉంది. ఓసమ్మో ధనా ధన్ అనే ఉగ్రవాది పీకిస్తాన్ నడిబొడ్డున, వమెరికా ప్రత్యేక సైనిక దళాల చేతుల్లో హతమయ్యాడు.

“ఛ ఛ ఎంత దారుణం, ఎంత ఘోరం, తలుచుకుంటేనే సిగ్గు చేటు,” అన్నాడు కయ్యానికి.

“అవును, మన దేశంలోనే ఉండి, అదీ మన మిలటరీ అకాడెమీ పక్కనే ఉన్నా పట్టుకోలేకపోయామంటే ఎంత అవమానం. ఎంత సిగ్గు పడాల్సిన విషయం. క్యా షర్మ్ కి బాత్ హై! అసలు తలెత్తుకు తిరగ గలమా?” అన్నాడు కొత్తగా జాయిన్ అయిన ఒక రిక్రూట్.

“ఎవరక్కడా? వీడికి ఇరవయి కొరడా దెబ్బలు తగిలించండి,” హుకుం జారీ చేశాడు కయ్యానికి.

“అయ్య బాబోయి! నేనేం చేశాను?” భయంతో అరిచాడు ఆ రిక్రూట్.

“మనకు సిగ్గూ శరం లాంటివి ఉన్నాయని నువ్వు అనుకున్నందుకు, నేను బాధపడుతూంది ఓసమ్మోని పట్టుకోలేకపోయాను అని అర్థం చేసుకున్నందుకు,” వివరించాడు కయ్యానికి.

“మరి కాదా?”

“ఒరే మూర్ఖుడా, ఓసమ్మో ఉన్నన్ని రోజులు, మనకు ఏ లోటు ఉండేది కాదురా! వమెరికా ఓసమ్మోని పట్టుకోవడానికి మనం ఉపయోగపడతామని మనకు బోలెడు ధన సహాయం చేసేది. దానిలో కొంత మనం జంబూ ద్వీపం నాశనం చేయడానికి వాడే వాళ్ళం. ఇప్పుడు ఆ చచ్చినోడు చచ్చి ఊరుకున్నాడు. నానేటి సేతురో! ఓలమ్మో, ఓలక్కో,” అని వాపోయాడు కయ్యానికి.

“ఓహో, మరి మన నాయకులు, పేపర్లో, టీవీలో ఉగ్రవాదం వల్ల అందరికంటే నష్టపోయింది మనమేనని, వమెరికాకి ఓసమ్మోని పట్టుకోవడానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది అని, చెప్తారు కద?” సందేహం వెలిబుచ్చాడు రిక్రూట్.

“వీడికి ఇంకో పది ఎక్కువ తగిలించండిరా!”

“అయ్య బాబోయి, మళ్ళీ ఇదేంటి?”

“లేకపోతే మన నాయకులు వాగే వెధవ వాగుడు నమ్మడానికి నువ్వేమన్నా జంబూ ద్వీపంలోని మేధావుల్లో ఒకడివా? ఏ అధో గతి రాయో ఐతే, ఎవరు? ఓసమ్మో, వమెరికా మాజీ అధ్యక్షుడు ఖుష్ ఇద్దరూ ఒకటే అని సెలవిచ్చిందే? ఆవిడ! మన నాయకులు చెప్పేవన్ని నిజాలని, పీకిస్తాన్‌కి ఏ పాపం తెలీదని నమ్ముతుంది కానీ, ఇదే గడ్డలో పుట్టిన నువ్వు మన వాళ్ళ మాటలు నమ్మడమేంటి? అందుకే ఇంకో పది కొరడా దెబ్బలు!”

“అంటే మనకు ఓసమ్మో ఇక్కడే ఉన్నాడు అని ఎప్పటినుంచో తెలుసన్న మాట!”

“ఒక్క తెలియడమేంటి, నేను, మన అధ్యక్షుల వారైన జర్దాపాన్ గారు, ప్రతి నెల ఓసమ్మో ఇంట్లోనే కలిసి డిన్నర్ చేసి, జంబూ ద్వీపం నుంచి దిగుమతి చేసుకున్న ఒక సినిమా కూడా చూసే వాళ్ళం.”

“అవునా?”

“లేకపోతే! ఇప్పుడు మనం ఓసమ్మో సర్కస్ షో కూడా క్యాన్సిల్ చేసేయ్యాలి! హయ్యో!”

“అదేం షో?”

“నీకు ఏం తెలీదనుకుంటానే? మనం ప్రతి రెండు నెలలకి వమెరికా వారికోసం వేసే సర్కస్ షో! అందులో మన నాయకులు, క్లౌన్స్‌లా తయారయ్యి ఆడుతూ పాడుతూ అలరిస్తారు.”

“ఏమని ఆడతారు, దేని గురించి పాడతారు?”

“ఒక ప్రదర్శనలో, ఎవరైతే అప్పటి పీకిస్తాన్ అధ్యక్షుడో, ఆయన పిల్లి మొగ్గలు వేస్తూ వచ్చి, ఓసమ్మో పీకిస్తాన్‌లో లేడు అంటాడు. వమెరికన్‌లు ఆనంద పడి కొంత డబ్బు ఇస్తారు. ఆ తరువాత జరిగే ప్రదర్శనలో అదే నాయకుడు కాస్త మేకప్ మార్చుకుని వచ్చి, ఓసమ్మో పీకిస్తాన్లో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేస్తాడు. అప్పుడు వమెరికన్‌లు భయపడి బోలెడు డబ్బు ఇస్తారు.

ఈ సర్కస్ షోని గత పదేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు అది ఆపేయ్యాలి,” కంట తడి పెట్టుకున్నాడు కయ్యానికి.

“నాకిప్పుడు పూర్తిగా అండర్‌స్టాండింగ్ అయిపోనాది,” అన్నాడు రిక్రూట్.

“ఐనా సరే, నీ కోటా దెబ్బలు నువ్వు తినక తప్పదు,” తేల్చి చెప్పాడు కయ్యానికి.

పీకిస్తాన్ – నాట్ ఫిక్సింగ్


జంబూ ద్వీపం పక్కనే పీకిస్తాన్ అనబడే ఒక దొడ్డ దేశం ఉండేది. నేను ఇంతకు ముందు ఒక సారి చెప్పినట్టు, పీకిస్తాన్ ఒకప్పుడు జంబూ ద్వీపంలో ఒక భాగమే. ఐతే కొందరు శాంతికాముకులైన మైనారిటీలు, దుష్ట మెజారిటీతో పడలేక పీకిస్తాన్ అనే కొత్త దేశం సృష్టించారు. మైనారిటీల నాయకుడు చిన్నా, “మీకొక దేశాన్ని జంబూ ద్వీపం నుంచి పీకి ఇస్తాను” అని వాగ్ధానం చేశాడు కాబట్టి అదే పేరు ఖరారు చేశారు.

పీకిస్తాన్, జంబూద్వీపాలలో కిరికెట్టు అనే ఆట చాలా పాపులర్. జంబూ ద్వీప వాసులకు మరీ ఇష్టం! అసలు కిరికెట్టు చాల రకాల నియమాలతో కూడుకున్ని ఉన్న ఆట కాబట్టి, జంబూ ద్వీప వాసులకు కిరికెట్టు రూల్స్ నేర్చుకోవడానికే ఒక జీవితకాలం పడుతుంది కాబట్టి, జంబూ ద్వీప వాసులు వేరే ఏ ఆటలు ఆడలేకపోతున్నారని గిట్టని వాళ్ళు అంటూంటారు. ఈ దరిద్రపు కిరికెట్టు వలనే ఓలమ్మోపిక్స్‌లో ఆఖరికి అల్యూమినియం పతకం కూడా రావట్లేదని కూడా వాళ్ళు అక్కసు వెళ్ళగక్కుతారు. ఐతే వారిని జంబూ ద్వీప వాసులు ఎవరూ పట్టించుకోరనుకోండీ. ఈ మధ్య రోజూ ఏదో ఒక కిరికెట్టు మ్యాచ్ ఉంటూంది కాబట్టి, ఈ విమర్శలకు సమాధానాలు చెప్పే టైం కూడా వారెవ్వరికీ లేదు.

ఒకప్పుడు పీకిస్తాన్ కిరికెట్టు ఆటగాళ్ళు జమిలిగా “బ్యాచ్ ఫిక్సింగ్” చేసేవారు. బ్యాచ్ ఫిక్సింగ్ అంటే, మొత్తం బ్యాచ్ బ్యాచంతా కలిపి ఫిక్స్ చేయడం. అంటే టీం మొత్తం కావాలని చెత్తగా ఆడి ఓడిపోవడం.

మీరు అమాయకులైతే మీకు వెంటనే సందేహం వచ్చేస్తుంది. ఆటగాళ్ళు ఎప్పుడూ గెలవాలని కోరుకుంటారు కద, ఈ కావాలని ఓడిపోవడమేంటి అని. వాళ్ళు అలా ఓడిపోవడానికి కారణం డొక్కీలు అనబడే కొందరు బ్రోకర్ టైప్ మనుషులు సదరు ఆటగాళ్ళకు, ఓడిపోయినందుకు బోలెడంత డబ్బులు ఇవ్వడమే.

దీని వల్ల ఆ డొక్కీలకు ఏంటి లాభం అంటారా? లక్షలది మంది (అ)మాయక ప్రజలు ఈ కిరికెట్టు మ్యాచ్‌ల మీద పందాలు కాస్తారు. ఈ డొక్కీలకు ముందుగానే ఏ టీం గెలుస్తుందో తెలుసు కాబట్టి, వాళ్ళు సరైన టీం మీద బెట్ కాసి బోలెడు చాలా డబ్బు సంపాయించుకుంటారన్న మాట.

కానీ ఈ బ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అంతా ఒక రోజు బట్టబయలు కావడంతో పీకిస్తానే కాకుండా ఇతర దేశాల్లో బ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్న చాలా మందిని కూడా ఆట నుంచి బహిష్కరించారు (వీరిలో జంబూ ద్వీప కిరికెట్టు టీం ఎక్స్-క్యాప్టెన్ బజారుద్దిన్ ఒకడు లెండి). అందు చేత బ్యాచ్ ఫిక్సింగ్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని కిరికెట్టు ఆటగాళ్ళు గ్రహించారు.

దానితో ఇంకో కొత్త టైప్ ఫిక్సింగ్ మొదలు పెట్టారు. దీన్నే నాట్-ఫిక్సింగ్ అంటారు. ఎందుకంటే ఈ ఫిక్సింగ్ మ్యాచ్ రిజల్ట్‌ని డిసైడ్ చేయదు. అందుకే not fixing అన్న మాట.

దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు (అ)మాయకులైన ప్రజలు ఒక్క మ్యాచ్ రిజల్ట్ మీదే కాకుండా, బాల్ బాల్ మీద కూడా బెట్టు కాయొచ్చు. అంటే ఈ బాల్‌లో బజారుద్దిన్ ఔట్ అవుతాడా లేక సిక్స్ కొడతాడా, లేక ఇంకేమన్నా చేస్తాడా ఇలా అన్న మాట. దీన్ని పసిగట్టడం మహా కష్టం. ఈ ట్రెండ్ పాపులర్ కాగానే కిరికెట్టు ఆటగాళ్ళు, ముఖ్యంగా పీకిస్తాన్ ప్లేయర్స్ రెట్టించిన ఉత్సాహంతో రెచ్చిపోయి మళ్ళీ ఫిక్సింగ్, అదే నాట్-ఫిక్సింగ్, మొదలు పెట్టారు.

పీకిస్తాన్ జట్టుకి క్యాప్టైన్ సల్మాన్ మొహమ్మద్ ఆమిర్. అందుకే మజా మజీద్ అనే డొక్కీ, అతన్ని లైన్‌లో పెట్టాడు. అదిలా జరిగింది.

సల్మాన్ మొహమ్మద్ ఆమిర్ ఒక రోజు కిరికెట్టు ప్రాక్టీసు నుంచి ఇంటికి వెళ్తూంటే మజా మజీద్ అడ్డు పడి, “నేనొక డొక్కీని,” అన్నాడు.

“నీ డొక్కు ఎంట్రీ చూస్తేనే తెలుస్తుంది, నువ్వు డొక్కీవని,” కోప్పడ్డాడు సల్మాన్ మొహమ్మద్ ఆమిర్.

“హహ్హహా, నువ్వు భలే జోకులేస్తావు. నేను డొక్కీనే కావచ్చు కానీ నీ డొక్కు జీవితాన్ని మార్చే సత్తా నాకుంది తెలుసా,” నవ్వుతూ అన్నాడు మజా మజీద్.

“నాది డొక్కు జీవితమా? నా దగ్గర పది కోట్ల పీకిస్తాన్ రూపాయలు ఉన్నాయి తెలుసా,” మండి పడుతూ అన్నాడు సల్మాన్ మొహమ్మద్ ఆమిర్.

“పిచ్చోడా! దానికేనా ఇంత మిడిసిపాటు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎంత అందంగా మారుతుందో సినిమా చూపిస్తా, చూడు!” అని చేయి ఊపాడు మజా మజీద్.

అంతే! సల్మాన్ కళ్ళ ముందు, తనకున్న ఆస్తి కనక వంద రెట్లు పెరిగితే, తన లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో కలర్‌లో కనిపించింది. “అబ్బో, సినిమా బెమ్మాండం! ఇలా కావాలంటే, నేను ఏం చెయ్యాలి డొక్కీ గారూ?” వినయంగా అడిగాడు సల్మాన్.

“ఏం లేదు, సింపుల్. నువ్వు కాస్త నాట్-ఫిక్సింగ్ చేయాలి అంతే. అంటే, నేను చెప్పిన టైంలో కావాలని ఔట్ కావడమో, లేదా నీ బౌలర్స్‌తో నోబాల్ వేయించడమో చేయాలి. నీకు ఒక మ్యాచ్‌కి ఇచ్చే ఫీజ్, ఎండార్స్‌మెంట్స్ వల్ల వచ్చే డబ్బు కంటే ఇరవయి రెట్లు ఇస్తాను,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మజా.

అంతే! ఆ రోజు నుంచి సల్మాన్ నాట్-ఫిక్సింగ్ ప్రపంచానికి ఒక సూపర్ స్టార్‌లా తయారయ్యాడు. డొక్కీ చెప్పినట్టే సల్మాన్ జీవితం నాట్-ఫిక్సింగ్ మొదలయ్యాక పూర్తిగా మారిపోయింది. డబ్బే కాకుండా రక రకాల పవర్‌ఫుల్ మనుషులతో పరిచయం కూడా ఏర్పడింది. డేవిడ్ అబ్రహం లాంటి మాఫియా డాన్స్, పీకిస్తాన్ జంబూ ద్వీపంలోని రాజకీయ వేత్తలు, సినిమా తారలు ఇలా రక రకాల మందితో కాంటాక్ట్స్ నెలకొన్నాయి. వీళ్ళందరూ భారీ ఎత్తున కిరికెట్టు మీద పందాలు కాస్తారు కదా, అందుకన్న మాట.

డబ్బులు వచ్చి పడుతున్నాయి కానీ సల్మాన్‌కి చీకాకులు కూడా ఎక్కువయిపోయాయి. నాట్-ఫిక్సింగ్ చేయాలన్న డిమాండ్స్ పెరిగిపోయి, ఏ మ్యాచ్‌లో ఎవరు ఏది ఫిక్స్ చేయమంటున్నారో తెలీని గందరగోళం ఏర్పడింది. దాని వల్ల అతను కొన్ని విచిత్రమైన పరిస్థితిలు ఎదురుకోవాల్సి వచ్చింది.

***

ఒక మ్యాచ్ ముందు పొద్దున నెట్-ప్రాక్టీస్ చేస్తూంటే సల్మాన్‌కి ఫోన్ వచ్చింది. చేసింది డేవిడ్ అబ్రహం!

“ఇదిగో సల్మాన్, నువ్వు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాగానే నాలుగో బాల్‌కి ఔట్ అయి పోవాలి. అలా అని బోలెడు చాలా డబ్బు పందెం కాశాను,” అన్నాడు తాపీగా భాయి.

“చిత్తం దేవర!” బదులిచ్చాడు సల్మాన్.

బ్యాటింగ్‌కి వెళ్ళడానికి ప్యాడ్లు కట్టుకూంటూంటే ఇంకో ఫోన్ వచ్చింది. ఇది మోటా వాజన్ నుంచి. ఈయనకు, డేవిడ్ అబ్రహంకి అస్సలు పడదు. (పడదు అంటే మీకూ, మీ పాలిటి విలన్ ఎవడైనా ఉంటే వాడికీ పడనట్టు కాదు. వీళ్ళ గొడవల్లో వందలమంది శాల్తీలు గల్లంతవుతూ ఉంటారు. ఆ లెవెల్లో పడదన్న మాట.)

“ఏంటి భాయి నీ ఆజ్ఞ?” వినయంగా అడిగాడు సల్మాన్.

“ఇదిగో నువ్వు ఈ మ్యాచ్‌లో ఆడబోయే నాలుగో బాల్‌కి ఒక రన్ తీసుకోవాలి, లేదా రన్ ఔట్ అయిపోవాలి. రెండింటి మీద పందెం కాశాను,” కరకుగా విన వచ్చింది మోటా వాజన్ స్వరం.

గతుక్కుమన్నాడు సల్మాన్. “కానీ భాయి, నేను ఆల్‌రెడీ…” అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసేంతలోనే అవతల సైడ్ ఫోన్ క్లిక్‌మంది.

“ఓలమ్మో, నేనేం సేతురో దేవుడో?” అంటూ బ్యాటింగ్ గ్లవ్స్‌తో తన గుండెల మీద బాదుకున్నాడు సల్మాన్. ఒక్క క్షణం తరువాత అతనికి వెలిగింది. తను రన్-ఔట్ అయితే ఇద్దరినీ మెప్పించగలడు అని. అలా ఆ గండం నుంచి బయట పడ్డాడు.

***

ఇంకో సారి ఇంకో మ్యాచ్‌కి సల్మాన్‌కి మోటా వకీల్ నుంచి కాల్ వచ్చింది. ఎప్పటిలానే మామూలుగా నాట్-ఫిక్సింగ్ రిక్వెస్ట్.

“ఇదిగో సల్మాన్, నువ్వు మొదటి బాల్‌కే రన్-ఔట్ కావాలి,” చెప్పాడు మోటా వకీల్.

“అదెంత పని, అలాగే!” అన్నాడు సల్మాన్. ఈ సారి డ్రెస్సింగ్ రూంనుంచి గ్రౌండ్ వైపు నడుస్తూంటే సెల్ ఫోన్ తెచ్చి అందించాడు అతని ఫ్రెండ్.

ఈ ఫోన్ వచ్చింది మాజీ మస్తాను నుంచి. “సల్మాన్, నా మాట జాగ్రత్తగా విను. ఈ సారి నువ్వు బ్యాటింగ్‌కి వెళ్ళగానే మొదటి బాల్‌లోనే నీ ఎదుట ఉన్న బ్యాట్స్‌మ్యాన్‌ని రన్-ఔట్ చేయాలి,” అన్నాడు అతను.

“అదెలా కుదురుతుంది భాయి. ఆల్‌రెడీ మోటా వకీల్ గారికి మాటిచ్చాను, నేనే రన్-ఔట్ అవుతాను అని,” కొంచెం భయపడుతూనే చెప్పాడు సల్మాన్.

“ఐతే ఏంటంట? ఇద్దరూ రన్-ఔట్ కండి. నాకు మోటా వకీల్ శత్రువైనా అతని కడుపు కొట్టాలనేమీ లేదు. నాదసలే పెద్ద మనసు,” అన్నాడు మాజీ మస్తాన్.

“చిత్తం. తమది పెద్ద మనసు అన్నది జగద్విదితం. కానీ కిరికెట్టు ఆటలో ఒకే బాల్‌కి ఇద్దరు ఆటగాళ్ళు రన్-ఔట్ కాలేరు. ఎవరో ఒకరే కాగలరు,” గొంతు నిండా నమ్రత నింపుకుని అన్నాడు సల్మాన్.

“అదంతా నాకనవసరం, నీ ఎదుటి బ్యాట్స్‌మ్యాన్ రన్-ఔట్ అవుతున్నాడు, అంతే!” ఫోన్ పెట్టేశాడు మాజీ మస్తాన్.

“ఛీ, నా బ్రతుకు తగలెయ్య!” అనుకున్నాడు సల్మాన్. అర్జెంటుగా రూల్స్‌బుక్కులన్నీ తిరగేశాడు. ఇద్దరూ ఒకే బాల్‌కి రన్-ఔట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అని. కానీ అలాంటి ప్రొవిజన్ ఏదీ అతనికి దొరకలేదు. చేసేది లేక తానే రన్-ఔట్ అయ్యి మాజీ మస్తాన్‌కి తరువాత నచ్చ చెబ్దామనుకున్నాడు.

ఐతే అతను బ్యాటింగ్‌కి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్న బ్యాట్స్‌మ్యాన్ రసూల్‌కి కూడా మాజీ మస్తాన్ నుంచి ఆర్డర్లు అందినట్టున్నాయి. అసలు సల్మాన్ బ్యాట్ కి బాల్ తగలగానే అతను కూడా రన్‌కి (అదే రన్-ఔట్‌కి) పరిగెత్తాడు. సల్మాన్‌కి విషయం అర్థమయ్యింది. త్వరపడకపోతే తాను రన్-ఔట్ కాలేడని. వెంటనే తను ముందుకి పరిగెత్తి, హాఫ్ లైన్ దాటేంతలోపలే రసూల్‌ని వెనక్కి తోసేశాడు. ఆ రకంగా రసూల్ లేచేంత లోపల సల్మాన్ రన్-ఔట్ అయిపోయాడు.

సాయంత్రం మాజీ మస్తాన్ నుంచి సల్మాన్‌కి కాల్ వచ్చింది. “నీకెంత ధైర్యంరా, నా మాట వినకపోవడమే కాకుండా, నా మనిషి రసూల్‌ని గాడిని రన్-ఔట్ కాకుండా చేస్తావా? నిన్నేం చెయ్యమంటావు,” గర్జించాడు.

“సారీ మాజీ గారూ, కావాలంటే ఫైన్ కట్టుకుంటా, నన్నొగ్గేయండి,” అర్థించాడు సల్మాన్. పది కోట్లు ఫైన్ వేసి అతన్ని అప్పటికి వదిలేశాడు మాజీ మస్తాన్.

ఇలాంటి సంఘటనలు కొన్ని అయ్యాక ఒక నిర్ణయానికి వచ్చాడు సల్మాన్.

***

పీకిస్తాన్ ఆంగ్లాడులో కిరికెట్టు సిరీస్ ఆడడానికి వెళ్ళల్సి వచ్చింది. ఆ టూర్‌లో సల్మాన్ తనంతట తనే వెళ్ళి వాట్-ల్యాండ్ పోలీసులకి లొంగిపోయాడు.

“వాట్, ఎవరు నువ్వు?” అడిగాడు అక్కడ ఇన్స్‌పెక్టర్.

“నేను పీకిస్తాన్ కిరికెట్టు క్యాప్టెన్‌ని. నాట్-ఫిక్సింగ్ కేసులో లొంగిపోవడానికి వచ్చాను,” చెప్పాడు సల్మాన్.

“వాట్, నువ్వే వచ్చి లొంగిపోతున్నావా? ఏంటి ఈ రోజు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి. ఐనా మేం పట్టుకోలేక పోయినప్పుడు నువ్వు లొంగిపోవడమెందుకు? బొత్తిగా అమాయకుడిలా ఉన్నావే?” ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్.

“ఈ నాట్-ఫిక్సింగ్ మొదలు పెట్టినప్పటి నుండి మనశ్శాంతి కరువయ్యింది. ఎప్పుడు, ఎక్కడ ఎందుకు, ఏం, ఎలా చేస్తున్నానో కూడా తెలీట్లేదు. ఇప్పుడు నేను ఆపేసి బయట మామూలుగా బతకడం కుదరదు. నన్ను చంపేస్తారు. నన్ను జైల్‌లో పెట్టండి. నేను అక్కడే సేఫ్,” విజ్ఞప్తి చేశాడు సల్మాన్.

మస్జిద్ వహీ బనాయేంగే! (మసీదు అక్కడే కడతాం)


మా ఫ్రెండ్ రాజేష్ గాడు గొప్ప మేధావి అని మీకందరికీ తెలుసు. నాకేదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకోవడం అలవాటు.

అలాగే నాకు వచ్చిన కొత్త డౌట్‌ని తీర్చుకోవడానికి వాడి దగ్గరికే వెళ్ళాను మళ్ళీ. వాడు “ద ఇన్‌ఫ్లూయెన్స్అఫ్ బెంగాలి కల్చర్ ఆన్ గుజరాతీ ఆర్ట్” అన్న పుస్తకం చదువుకుంటున్నాడు.

“ఏంటోరా! అందరూ చక్కగా గ్రేట్ త్రిలింగా లాంటి వెబ్ సైట్స్‌కి వెళ్ళి హాట్ హాట్ న్యూస్ చదువుకుంటూంటే, నువ్వు ఇలా పేర్లు కూడా అర్థం కాని పుస్తకాలు చదువుతూంటావు,” ఫిర్యాదు చేశాను నేను.

“నువ్వు అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి అంటే మరి ఇలాంటి జ్ఞాన సముపార్జన తప్పని సరి,” చిరు నవ్వులు చిందిస్తూ అన్నాడు వాడు.

“ఇంతకీ నా సందేహం ఏంటి అంటే,” గొంతు సవరించుకున్నాను నేను.

“నాకు తెలుసులే న్యూ యార్క్ నగరంలో గ్రౌండ్ జీరో వద్ద మసీదు కట్టాలనుకోవడం పట్ల నా అభిప్రాయం ఏంటో కనుక్కోవాలనుకుంటున్నావు, కదూ!”

“నీకెలా తెలుసురా?”

“ఎప్పటినుంచో మనం స్నేహితులం. ఆ మాత్రం తెలీకుండా ఎలా ఉంటుంది?”

“సరే, ఇంతకీ అక్కడ మసీదు కట్టచ్చా లేదా?”

రాజేష్ గాడు గొంతు సవరించుకున్నాడు. “ప్రశ్న చాలా చిన్నది, సమాధానమే ఆకాశమంత పెద్దది,” అన్నాడు గంభీరంగా.

“ఐతే చెప్పొద్దులే,” అన్నాను నేను భయంగా.

“ఎహె, ఎఫెక్ట్ కోసం అలా అన్నాను. క్లుప్తంగా చెపాలంటే లీగల్‌గా వాళ్ళకు ఆ హక్కు ఉంది.”

“మరి చాలా మంది ఎందుకు అక్కడ కట్టకూడదు అని గింజుకుంటున్నారు? ట్విన్ టవర్స్‌ని ముస్లిము ఉగ్రవాదులు పేల్చేశారు కాబట్టి, అక్కడ మసీదు కట్టడం మానుతున్న గాయాన్ని రేకెత్తించినట్టు అవుతుంది అనా?”

“అది కూడా ఒక కారణం. కొంచెం బజారు భాషలో చెప్పాలంటే దాన్నే పని కట్టుకుని కెలకడం అనొచ్చు. నిజంగా అది కొందరు ముస్లిములు వాదిస్తున్నట్టు శాంతికి చిహ్నమే ఐతే, గ్రౌండ్ జీరో దగ్గర కట్టడం వల్ల, శాంతి మాట దేవుడెరుగు, కక్షలు కార్పణ్యాలు ఇంకా ప్రబలుతాయి. శాంతి కోరే వారైతే, జనం నుంచి వచ్చిన ఈ నిరసన చూసి, మసీదు కట్టాలనే ఆలోచన విరమించుకునే వారు. “

“ఓహో!”

“పోనీ అది కడుతున్న మహానుభావుడెవరు? అబ్దుల్ రవుఫ్ అనబడే ఇమాము. ఆయన గారు 9/11 దాడులు జరగడానికి అమెరికాదే ఎక్కువ బాధ్యత అని ఆరోపించిన మానవతా వాది! ఆయన కడుతున్న ఈ శాంతి మందిరం, 9/11 దాడులలో చనిపోయిన అమెరికన్ల కుటుంబాలను సేద తీరుస్తుందంటావా? ఐనా స్థలం ఉంది కద అని మసీద్ ముందు పందుల పాక పెట్టడం, గుడి ముందు కబేళా షాప్ పెట్టడం ఎంత రస విహీనమైన చర్యలో, ఇదీ అలాంటిదే కాదా?”

“నువ్వు అలా చెప్తూంటే నిజమే అనిపిస్తూంది.”

“అది అటుంచి, అమెరికాలో ముస్లిముల సివిల్ రైట్స్ గురించి గగ్గోలు పెడుతున్న మన మేధావులు, ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలలో మైనారిటీలకి పౌర హక్కులనేవే లేవు అన్న విషయం గురించి ఏ మాత్రం కిక్కురుమనరు. మలేసియాలో వారానికొక హిందువుల గుడి నేలమట్టం కావించబడినా, 2002 వరకు పాకిస్తానులోని హిందువులకు ముస్లిం క్యాండిడేట్లకు వోటు వేసే హక్కు లేకపోయినా, సౌది అరేబియాలో ముస్లిమేతరులు తమ ఇళ్ళల్లో మాత్రమే తమ పూజలు సాగించాలి, బయట తమ గుడులు చర్చ్‌లు కట్టడానికి వీలు లేదు అని ఆర్డర్లు జారీ చేసినా, మన సెక్యూలరిస్టుల దృష్టిలో అవేవి పౌర హక్కుల ఉల్లంఘన కాదు. కాని ముస్లిముల శాంతి మందిరాన్ని గ్రౌండ్ జీరో వద్ద వద్దు, వేరే ఎక్కడైనా కట్టుకోండి అంటే మాత్రం అది మత మౌఢ్యం.”

“కానీ ఒక పదిహేను శాతం ముస్లిములు మాత్రమే తీవ్ర వాదులట. దాని కోసం అందరిని ఒకే గాట కట్టకూడదట. మా వీధిలో సెక్యూలరిస్ట్ ఒకాయన చెప్పాడు.”

“అది నిజమే అనుకున్నా, ఆ పదిహేను శాతం మంది చేతుల్లోనే మొత్తం పవర్ అంతా ఉన్నట్టుంది. మిగతా 85 శాతం మంది ఏమీ మాట్లాడనప్పుడు, ఏ రకంగానూ మత మౌఢ్యాన్ని ఎదిరించనప్పుడు, వారు ఉంటేనేం, ఊడితేనేం?”

“అంటే?”

“ఏదో చాలా కొద్ది మంది తప్ప, ముస్లిములు ఎప్పుడూ ముస్లిమేతరులకు తమ మతస్తుల చేతుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరు. కానీ దేశంతో సంబంధం లేకుండా సుదూరంగా ఉన్నా సరే, సాటి ముస్లిములకు ఏదైనా చిన్న అన్యాయం జరిగినా వెంటనే తీవ్రంగా స్పందింస్తారు. ఉదాహరణకు, 1991లో అమెరికా ఇరాకుని ముట్టడించినప్పుడు మన హైదరాబాద్‌లో ముస్లిములు గొడవ చేసినట్టు.”

“ఇంతకీ ఏమంటావురా?”

“ముస్లిములు తమ మతానికి జరుగుతున్న అన్యాయం గురించి ఘోషించే ముందు, వాళ్ళు మెజారిటీలుగా ఉన్న దేశాలలో ముస్లిమేతరుల పరిస్థితి ఎంత హీనంగా ఉందో అంగీకరించి, వారి హక్కుల కోసం కూడా అంతే సిన్సియర్‌గా పోరాడితే బాగుంటుంది. గ్రౌండ్ జీరో దగ్గర మసీదు కట్టడం కంటే ఇలాంటివి ప్రపంచ శాంతికి ఎక్కువ దోహదం చేస్తాయి.”

“అలా జరుగుతుందంటావా?”

“చూద్దాం!”

http://www.jihadwatch.org/2006/06/malaysia-temple-demolitions-spell-creeping-islamisation.html

http://www.guardian.co.uk/commentisfree/2008/apr/11/protectingpakistanshindus

http://www.asianews.it/news-en/Police-razes-clandestine-Hindu-temple-in-Riyadh,-deports-three-people-2905.html

యమాస్ “విజయ” యాత్ర

ఇది జంబూ ద్వీపం దగ్గరలో ఉన్న రెండు రాజ్యాలకు సంబంధించిన కథ. వాటి పేర్లు పెరుగుస్తీనా, ఈజీరైల్. పెరుగుస్తీనా రాజ్యంలోని బాజా రాష్ట్రాన్ని యమాస్ అనే పార్టీ పాలిస్తూంది. అందరికీ తెలుసు. యమాస్ ధ్యేయం ఈజీరైల్‌ని సముద్రంలో కలిపి వేయడమేనని.

ఏదో వీలు కాలేదు కాబట్టి ఊరుకుంది కాని, తగిన మంది మార్బలం ఉంటే ఈజీరైల్‌ని ఈ పాటికి దుంప నాశనం చేసుండేది కూడా. అప్పుడు మిగతా దేశాలు అన్నీ, “చొచ్చొచ్చో, ఎంత పని జరిగింది?” అని ఒక నిట్టూర్పు వదిలి ఊరుకునేవారు తప్ప పెద్దగా ఏమీ ఉద్ధరించి ఉండేవారు కాదు.

ఈజీరైల్‌కి ఈ సంగతి తెలుసు కాబట్టి, మొహమాటం లేకుండా, ప్రపంచ మేధావుల మనోభావాలు దెబ్బ తింటాయేమో అన్న జంకు లేకుండా, తన ఉనికిని ఎలా ఐనా రక్షించుకోవడానికి అహర్నిశలు సిద్ధంగా ఉండేది. కావలిసిన చర్యలు తీసుకునేది కూడా.

ఈజీరైల్ పక్క దేశం ఇకరాను. ఇకరానుకి ఈజీరైల్ అంటే వొళ్ళు మంట. ఐతే ఇంతకు ముందు ఒక మూడు సార్లు ఈజీరైల్ చేతిలో చావు దెబ్బలు తింది కాబట్టి ప్రత్యక్ష యుద్ధం కనక చేస్తే తమ పరిస్థితి పాతాళభైరవి అవుతుందని గ్రహించి, యమాస్ లాంటి వెర్రి బాగుల గ్రూపులకు రహస్యంగా సాయం చేయడం మొదలెట్టింది. అడపా దడపా యమాస్‌కి ఇంకో దేశం చిరాకు నుంచి కూడా కూసింత హెల్ప్ ఉండేది.

గోచీ పాత అంతున్న ప్రదేశం కోసం ఇంత గొడవేంటి అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఈ సంకుల సమరానికి సహజీవనం కంటే సంఘర్షణకే పెద్ద పీట వేసే సంస్కృతి అసలు కారణం. అది ఇంకో ఇంటర్‌నెట్ మజిలీ కథ అనుకోండి. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.

ప్రస్తుతం కథకు వస్తే ఇకరాను నుంచి ఒక ప్రతినిధి యమాస్‌కి బహుమతులు పట్టుకొచ్చాడు. యమాస్ నాయకులు అల్-బషీర్ మరియు అల్-ఫకీర్ వాటిని చూసి ఉత్సాహ పడ్డారు.

“భలే భలే, రాకెట్లలా ఉన్నాయి. వీటితో ఏం చేయొచ్చు?” అడిగాడు అల్-బషీర్.

“వీటిని దూర ప్రదేశాల మీదకు పంపించవచ్చు. అక్కడ పడి టపాకాయల్లా పేలుతాయి,” చెప్పాడు ప్రతినిధి, తన వేలిని ఈజీరైల్ వైపు చూపిస్తూ.

“ఐతే ఇచ్చేయ్యి. మాక్కావాలి. వూ, వూ, మాక్కావాలి,” గునిశాడు అల్-ఫకీర్.

“ఇస్తా, కానీ మీకొక చిన్న పజిల్. మీరిద్దరు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. మీకొక గొడ్డలి దొరికింది. ఏం చేస్తారు దానితో?” ప్రశ్నించాడు ప్రతినిధి.

“ఇదీ ఒక పజిలా! మేము కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం!” వెంటనే సమాధానమిచ్చాడు అల్-ఫకీర్.

“మరి అది నరికితే, మీరు కింద పడి నడ్డి విరగ్గొట్టుకుంటారు కద?” సందేహం వెలిబుచ్చాడు ఇకరాను ప్రతినిధి.

“ఐతే ఏంటట?” ఒకేసారి అన్నారు అల్-ఫకీర్, అల్-బషీర్.

ప్రతినిధి తృప్తిగా తలాడించాడు. “ఇప్పుడు నాకు నచ్చారు. ఈ రాకెట్లు మీవే. దూర ప్రదేశాల మీద వేయండి. (మళ్ళీ చూపుడు వేలు ఈజీరైల్ వైపు చూపించాడు.) అయిపోతే చెప్పండి. ఇంకా తెచ్చి ఇస్తా,” అన్నాడు వాళ్ళని ముద్దుగా చూస్తూ.

“అయ్యి, ఎన్ని రాకెట్లో. ముందు రాకెట్ నేనే వేస్తానోచ్,” అంటూ కొన్ని రాకెట్లని చంకలో పెట్టుకుని దౌడు తీశాడు అల్-బషీర్. వెనకాలే అల్-ఫకీర్ పరిగెత్తాడు.

“బుజ్జి కన్నలు. ఎంత ముద్దొస్తున్నారో,” వాళ్ళని చూస్తూ మెటికలు విరిచాడు ప్రతినిధి.

***

ఆ తరువాత అల్-బషీర్, అల్-ఫకీర్ ఈజీరైల్ మీద బోలెడు రాకెట్లు వేశారు. ఈజీరైల్ అదృష్టమో, లేక వీళ్ళ చేతకాని తనమో తెలీదు కాని, అవి పేలినా ఎక్కువ నష్టం కలిగించలేదు.

ఈజీరైల్ మొదట్లో ఓపిక పట్టింది. కానీ యమాస్ వీరులు అది ఈజీరైల్ చేతకానితనంగా భావించి రాకెట్లు ఆపకుండా వేశారు. ప్రపంచ దేశాలు ఈజీరైల్ మీద పెద్దగా సానుభూతి చూపించలేదు. పై పెచ్చు “తాము దారిద్ర్యంలో ఉండి, పక్క దేశం అలా వెలిగిపోతూంటే, ఎవరికి మాత్రం కడుపు మండదు. పాపం పెరుగుస్తీనా ప్రజలు!” అన్నారు.

ఐతే ఈజీరైల్ ఆ ప్రాంతాన్ని బంగారు భూమిగా చేయడానికి ముందు అది వొట్టి బంజరు నేల అని, అక్కడ పెరుగుస్తీనా ప్రజలు కూడా ఉండడానికి ఇష్టపడేవారు కాదు అని, గట్టిగా మాట్లాడితే పెరుగుస్తీనా అన్న దేశం ఎప్పుడూ లేదూ, అన్న విషయాన్ని అందరూ కన్వీనియంట్‌గా మరిచిపోయారు.

సహనం చచ్చి ఈజీరైల్ వీరంగం తొక్కింది. ముందు విమాన దాడులూ ప్రారంభించింది. ఐనా యమాస్ రాకెట్లు వేయడం మానలేదు. వందలమంది చచ్చారు. ఐనా యమాస్ రాకెట్లు వేయడం మానలేదు. చివరకి ఈజీరైల్ తన సైన్యాన్ని బాజాలోకి పంపించింది. ఆ సైన్యం విమాన దాడుల వల్ల సర్వనాశనమై కొద్దిగా మిగిలి ఉన్న మొండిగోడలని కూల్చి, పగిలిపోయి ఉన్న శిథిలాలని ఇంకొంత పేల్చి బాజాని ఒక మోత మోసేసింది. చనిపోయిన వారి సంఖ్య వెయ్యి పై చిలుకు అయ్యింది. ఐనా యమాస్ ఈజీరైల్ మీద రాకెట్లు వేయడం మానలేదు.

ఆఖరికి ప్రపంచదేశాల జోక్యం వల్ల తాత్కాలిక సంధి కుదిరింది. ఇరువైపులా కాల్పులు ఆగిపోయాయి. అల్-బషీర్, అల్-ఫకీర్లకు ఇంక రాకెట్లు ఈజీరైల్ వైపు విసరకూడదని ఖచ్చితమైన ఆదేశాలు వెళ్ళాయి.

“కానీ మేము కూర్చుని ఉన్న కొమ్మ ఇంకా విరిగిపోలేదుగా?” అభ్యంతరం చెప్పారు అల్-బషీర్, అల్-ఫకీర్.

“మీ కొమ్మ బాగుందేమో నాయనల్లారా, ఇక్కడ బాజలో చెట్లే ఎగిరిపోయాయి,” అని తిరుగు సమాధానం వచ్చింది. అల్-బషీర్, అల్-ఫకీర్ తిరిగి బాజా జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు.

వెంటనే గుంటల్లోనూ, రాళ్ళకుప్పల వెనకాలా దాక్కుని ఉన్న పెరుగుస్తీనా ప్రజలని కూడగట్టుకుని వారిని విజయ యాత్రకు సిద్ధం కమ్మన్నారు.

“విజయ యాత్రా? యాత్ర మీద వెళ్ళడానికి రోడ్డు ఉండాలి కద?” సందేహపడ్డాడు ఒక పెరుగుస్తీనా ముసలాయన.

“రోడ్డు లేకపోతే గుంతల మీదుగా వెళ్తామండి! ఈ యుద్ధంలో మన అపూర్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? బయట ప్రపంచంలో అంతా ఇది మన గెలుపూ, ఈజీరైల్ ఓటమి అంటున్నారు, వినలేదా?” కోపంగా అన్నాడు అల్-ఫకీర్.

ఆ మాటలకి సిగ్గు పడి, నడిచే పొజిషన్‌లో ఉన్న పెరుగుస్తీనీయులంతా విజయ యాత్ర మీద బయలుదేరారు.

Hamas declares victory in rallies across Gaza

ఆత్మ ఘోష

గొంతులు. వేల వేల గొంతులు. ముందు గుస గుసలుగా మొదలై అతి త్వరలో బలం సంతరించుకున్నాయి.

ఆ గొడవలో వినవచ్చిన కొన్ని మాటలు.

“మనల్ని మరిచిపోయారంటావా?”

“అలానే ఉంది చూస్తూంటే. ఏదో, ప్రతి సంవత్సరం ఈ తేదీకి ఒక దీపం వెలిగించి సరిపెట్టుకుంటున్నారు.”

“ఛ ఛ! మన వాళ్ళు మరీ అంత హృదయం లేని వాళ్ళు కారులే. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతారు.”

“ఏం పడతారో ఏమో. అమెరికా తప్ప మిగిలిన దేశాలు అన్నీ చేతులు దులుపుకున్నాయి. ఇజ్రాయెల్ మరీ చిన్నదైపోయింది. పైగా తన గొడవలు తనకున్నాయి. రాబోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు.”

“పట్టించుకున్నా, పట్టించుకోకున్నా ముందు ముందు ఎంతో కొంత జన నష్టం జరగడం తథ్యం!”

“అదెలా?”

“అందరూ సమస్యను గుర్తిస్తే కొద్ది పాటి జన నష్టంతో సరిపోతుంది. పట్టించుకోకుంటే భారీ ఎత్తున జన నష్టం వాటిల్లుతుంది.”

“నిజమే. ఒక వేళ ఈ నష్టం కొత్త సృష్టికి దారి తీస్తుందా?”

“ఏమో?”

(ఏడు సంవత్సరాల కింద జరిగిన వర్ల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారి ఆత్మల మధ్య జరుగుతున్న సంభాషణ.)

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers