Archive for the ‘సీరియల్స్’ Category

ముఖపుస్తకం – 8

నా ముఖ పుస్తకం లైఫ్, మూడు క్విజ్జులు, ఆరు అప్‌డేట్ల్‌గా నడుస్తూంది. మా కజిన్ గాడు ఇప్పుడే స్పందించాడు: “పవన్ కల్యాణ్ అన్నయ్య సినిమా, గబ్బర్ సింగ్ వచ్చేస్తూంది. కెవ్వు కేక. ఇంక సూపర్ హిట్ కావడమే తరువాయి. స్యాంపుల్‌కి ఈ పవర్‌ఫుల్ డయలాగ్ చూడండి – నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది – అదిరి పోయింది కద! అసలా డయలాగ్ వినగానే నేను చొక్కా చింపేశాను (నాదే లెండి),” అంటూ చిరిగిపోయిన చొక్కతో ఉన్న వాడి ఫోటో కూడా పెట్టాడు.

అసలే ఇంకా పెళ్ళి కాలేదు, వాడికున్న బాడీతో అలాంటి పిక్చర్స్ పెట్టొద్దు అని చెబుదామనుకున్నాను. కానీ, ఆ సలహా ఇచ్చినందుకు, వాడు ఎక్కడొచ్చి నా చొక్కా చింపుతాడో అని విరమించుకున్నాను. ఈ ఫ్యాన్స్‌తో అసలు పెట్టుకోకూడదు. వీళ్ళ తిక్కకి లెక్క కూడా ఉండదు.

నేను మిగతా అప్‌డేట్స్ చూస్తూంటే, ఫోన్ మోగింది. అప్పారావు.

“ఏరా ఎలా ఉంది లైఫ్?” అడిగాను.

“రెగులర్‌గా అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నా కద. అంతా ఓకే అనుకో. కానీ ఈ మధ్య కాస్త తిన్నది అరగడం లేదు. ఎంచేతంటావు?”

“బొత్తిగా ఎక్సర్‌సైజ్ లేకుండా పోయినట్టు ఉంది. వాకింగ్‌కి వెళ్ళొచ్చుగా?”

“అప్పుడే మర్చిపోయావా ఏం జరిగిందో? నాకు కొంత పిక్కుంది. కానీ, దాన్ని కరవడానికో కుక్కుంది.”

“రైట్, రైట్! కానీ ఈ డయలాగ్ ఎక్కడో విన్నట్టుందే?”

“మీ కజిన్ నా లిస్ట్‌లో కూడా ఉన్నాడురా. ఇంతకు ముందే అతని అప్‌డేట్ నేనూ చదివాను.”

“ఓహో! ఇంతకీ ఏంట్రా విశేషం, ఇలా కాల్ చేశావు?” అడిగాను వాడిని.

“ఏం లేదురా, నీకు మా కజిన్ గురించి ఎప్పుడైనా చెప్పానా?”

“లేదు. ఏం చేస్తూంటాడు తను?”

“చాలా పెద్ద స్పోర్ట్స్‌మ్యాన్. దాదాపు ఒక పది వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు.”

“అంత ప్యాపులరా? ఏం స్పోర్ట్స్ ఆడతాడురా?”

“Harmville, Mafia Bars, Coffee^World, Villageville.”

“ఇవేం స్పోర్ట్స్‌రా? నేనెప్పుడూ వినలేదు?”

“నువ్వింకా ముఖ పుస్తకం అంతు చూసినట్టు లేదు. ఇవన్నీ ముఖ పుస్తకం సభ్యులు ఆడే ఆటలు.”

“అలాగా! మరి పదివేల మంది ఫ్రెండ్స్‌ని ఎలా మ్యానేజ్ చేస్తాడు?”

“ఏముంది వారంతా మా కజిన్‌కి ఈ ఆటల ద్వారా పరిచయం ఐన వాళ్ళే. సో, నో ప్రాబ్లెం!”

“అదా సంగతి. ఇంకా నేను నిజ జీవితంలో స్నేహితులేమో అనుకున్నా!”

“ఏడ్చినట్టుంది. నిజ జీవితంలో అంత మంది ఫ్రెండ్స్ ఎవరికి ఉంటార్రా? ఉదాహరణకు నిన్నే తీసుకో. నీకున్న ఫ్రెండ్ నేనొక్కడినే కద!”

“సరే, సరే అలా ఎగతాళి చేయనక్కర్లేదు. నీ పాయింట్ అర్థమయ్యిందిలే. ఐ.డీ. చెప్పు, add చేసుకుంటా.”

వాడు ఐ.డీ. చెప్పడం, నేను add చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

అప్పారావు ఫోన్ పెట్టేయగానే, నేను ముఖపుస్తకంలోకి మళ్ళీ జొరబడ్డాను. అప్పటి దాక తెలీకుండానే కాస్త చిరాకుగా ఉన్న నా మనసు, సడన్‌గా ఆనందంతో నిండి పోయింది. ఏదో సొంతూరికి వచ్చిన ఫీలింగ్ కలిగింది.

అప్పారావు గాడితో నేను మాట్లాడింది, ఒక పది నిమిషాలు కూడా ఉండదు. కానీ అంతలోనే, కొత్త అప్‌డేట్స్ వరదలా వచ్చి పడ్డాయి.

నాకు అన్నిటి కంటే ఇష్టమైన కొటేషన్స్ ముందుగా చదివేశాను.

మొదటిది, మా కజిన్ గాడిది.

“Life’s tough; get a helmet.”

రెండోది, మూడ్ బాగా ఉండని అమ్మాయిది.

“Half the people you know are below average.”

తరువాత, కొత్త ఫోటొలు చూశాను.

వల్లకాట్లో రామనాధం, శిశిర ఋతువు (Fall season) కాబట్టి, తను వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి కట్టె పుల్లలు ఏరిన వైనమంతా కలిపి ఒక యాభై ఫోటోలు పెట్టాడు.

పద్మాకర్ గాడు, “హయితిలో సునామి వచ్చాక జీడిపప్పు దొరక్క అక్కడి ప్రజలు ఎంతో బాధ పడుతున్నారు. ఆ సర్వేశ్వరుడి దయ వల్ల మళ్ళీ వాళ్ళకు జీడి పప్పు సమృద్ధిగా దొరకాలి.” అని అప్‌డేట్ పెట్టాడు.

జీడిపప్పు కొరతే కనక హయితి వాసులకు ఉండకపోయి ఉంటే, అసలు వీడు వాళ్ళని పట్టించుకునేవాడా అన్న సందేహం నాకు కలిగిన మాట నిజం.

“ఒరేయి, కాళ్ళు చేతులు కడుక్కో, భోజనం వడ్డిస్తాను!” మా అమ్మ కేకేసింది.

“ఆ భోజనమేదో నా రూంకే తీసుకు రా అమ్మ. నాకు బోలెడు పనులున్నాయి,” నేను తిరిగి కేకేశాను.

“బావిలో కప్పలా, ఎప్పుడూ నీ రూంలోనే పడుంటావేమిట్రా,” విసుక్కుంటూనే నా గదిలో భోజనం పెట్టి వెళ్ళింది మా అమ్మ.

రామకృష్ణ పరమహంస, వివేకానందుడిని తాకినప్పుడు, ఆయన ఒక అలౌకిక అనుభూతికి లోనయ్యారట. చుట్టు పక్కల ఏం జరుగుతుంది అన్న స్పృహ లేకుండా పోయిందట.

ఇంచు మించు నేను కూడా అదె లెవెల్‌లో ముఖ పుస్తకానికి సంబంధించిన పనుల్లో లీనమై పోయాను.

(ఇంకా ఉంది)

ముఖపుస్తకం – 7


సామాజిక స్పృహ పెరిగిపోయింది కాబట్టి తరువాయి కార్యక్రం మొదలు పెట్టాను. అదే నా గురించి నేను తెలుసుకోవడం.

ఈ మధ్యే ముఖపుస్తకంలోనే ఎవరి అప్‌డేట్‌లోనో చదివాను. సోక్రటీస్ అనే ఆయన ఉటంకించాడట, “An unexamined life is not worth living” అని. అంటే మన జీవితాన్ని నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండడం ఉత్తములు చేసే పని అని అర్థం అట.

ఈ క్విజ్జుల వల్ల నా జీవితాన్ని కాలు కదపకుండా విశ్లేషించుకోవచ్చు. కాబట్టి వెంటనే ప్రొసీడ్ అయ్యాను.

మొదట ఎదురయిన క్విజ్, “మీరు అచ్చమైన హైదరాబాదినా?” అన్నది.

నాకు భలే ఆనందం వేసింది. పుట్టినప్పటి నుండి హైదరాబాద్‌లో ఉన్న నాకు ఇంతకంటే నచ్చే క్విజ్ ఏముంటుంది?

అందులో మొదటి ప్రశ్న ఇది:

మీరు ఏ భాషలో బాగా కంఫర్టబుల్?

1) తెలుగు
2) ఉర్దూ
3) ఇంగ్లీష్
4) ఏది కాని సంకర భాష

నేను చాయిస్ 4 సెలెక్ట్ చేశాను.

రెండవ ప్రశ్న:

మీ నోటి నిండా పాన్ ఉంది. ఎక్కడ ఉమ్మేస్తారు?

1) రోడ్డు మీద
2) పక్క వాడి చెప్పుల మీద
3) గోడ మీద
4) ఉమ్మి తొట్టిలో

నేను చాయిస్ 2 సెలెక్ట్ చేశాను.

మూడవ ప్రశ్న.

మామూలుగా ఊరి శివార్లలో ఉన్న మీ ఇంటికి, నాంపల్లి నుంచి వెళ్ళడానికి ఆటోలో 500 రుపాయలు అవుతుంది.
అదే ప్రయాణానికి ఖర్చు ఆదివారం రాత్రి ఎంతౌతుంది?

1) 500
2) 1000
3) ఏ ఆటో వాడు రాడు
4) 2500

నేను చాయిస్ 3 కి వోటు వేశాను.

నాలుగవ ప్రశ్న.

మీరు పాత బస్తిలో ఉన్నారు. అప్పుడే అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది అని వార్తల్లో తెలుస్తుంది. మీ రియాక్షన్?

1) అమెరికా సామ్రాజ్య వాద వైఖిరిని ఖండించడం
2) ఇరాన్ పై సానుభూతి ప్రకటించడం
3) ఆ వార్త పట్టించుకోక పోవడం
4) అర్జెంటుగా ఇంటికి దౌడు తీయడం

నేను వెంటనే చాయిస్ 4 ఎన్నుకున్నాను. (ఎందుకంటే ఏ ముస్లిం దేశం మీద ఎవరు అటాక్ చేసినా, పాత బస్తిలో మత కలహాలు మొదలవుతాయి.)

దాంతో ప్రశ్నలు అన్ని అయిపోయాయి. నేను క్విజ్ ముంగించగానే, “కంగాజ్యులేషన్స్! మీరు పక్కా హైదరాబాదీ!” అని రిజల్ట్ వచ్చింది. నా ఛాతీ గర్వంతో ఉప్పొంగింది.

అదే ఊపులో “మీరు మీరేనా? లేక ఇంకెవరైనానా?”, “తల్లా, పెళ్ళమా?” క్విజ్జులు కూడా పూర్తి చేసి పారేశాను. రెండవ క్విజ్ ద్వారా నేను నేనే అని రూఢీ అయ్యింది. మూడో క్విజ్ ద్వారా నేను తల్లికి పెళ్ళానికి సమాన గౌరవం ఇచ్చే వ్యక్తి అని ఋజువయ్యింది.

నేను కాస్త ముఖపుస్తకం నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మనిషన్నాక కొన్ని పనులు తప్పవు. దాని వల్ల ఇలాంటి అంతరాయాలూ తప్పవు. నేను గుండె రాయి చేసుకుని చిన్న బ్రేక్ తీసుకున్నా.

తిరిగి వచ్చేప్పటికి బోలెడు మెసేజెస్‌తో నా గోడ నిండి పోయింది. నేను పచ్చి హైదరాబాదిని అని ప్రూవ్ అయినందుకు నాకు వివిధ ప్రాంతాల వారి నుండి అభినందనలు అందాయి.

అప్పారావు దగ్గరి నుండి ఫోన్ వచ్చింది. “ఒరేయి! నేను అనుకున్నదానికంటే తొందరగానే నువ్వు ముఖ పుస్తక జన జీవన స్రవంతిలో కలిసిపోయావు. ముఖపుస్తకంలో అన్ని మూలలకి అల్లుకుపోతున్నావు,” మెచ్చుకోలుగా అన్నాడు.

“థాంక్స్‌రా! ఇంతకి నువ్వు పొద్దున్నుంచి ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నావు? ఆ డిస్కషన్ అంతా నేను చదవలేదు, ఏమయ్యింది?” అడిగాను.

వాడు చిరాకుగా, “ఏం లేదురా, నేను నా స్టాటస్‌లో పెట్టిన కొటేషన్, మా కజిన్ కూడా పెట్టాడు. అది కూడా నేను పెట్టిన ఐదు నిమిషాల తరువాతే పెట్టాడు. దానితో నాకు వొళ్ళు మండి వాడితో గొడవేసుకున్నాను,” అన్నాడు.

“ఎంత దారుణం! కజిన్ అయ్యుండి మరీ అలా నీ కొటేషన్ కాపీ కొట్టెయ్యడం! మనుషుల్లో నిజాయితీ బొత్తిగా లోపిస్తూంది. ఇంతకి ఆ కొటేషన్ ఏమిటి?”

“సోక్రటీస్ అనే ఆయన చెప్పాడులే, An unexamined life is not worth living అని. ఆ కొటేషన్!”

“ఇది నేను మొన్నే ఇంకొకరి స్టేటస్‌లో చూశాను రా!”

“అంటే నేను ఆ కొటేషన్ పెట్టేంత లోపలే వాడెవడో కబ్జా చేశాడన్న మాట!” నొచ్చుకున్నాడు అప్పారావు.

“అలా అని నువ్వు నిరాశ పడొద్దురా, కొటేషన్ల మీద అలా కొటేషన్లు పెడుతూనే పో. మానావాళికి విజ్ఞానాన్ని అందిస్తూనే పో,” అన్నాను నేను ఆవేశంగా.

“అందిస్తా. నన్ను ఎవరూ ఆపలేరు,” ఫోన్ పెట్టేశాడు వాడు.

వెంటనే నేను “మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?” అన్న కొత్త క్విజ్‌లో పాల్గొనడానికి ఉపక్రమించాను.

(ఇంకా ఉంది)

ముఖపుస్తకం – 6


రెండు రోజులయ్యింది.

నాకు ముఖపుస్తకం బాగానే వంటబట్టింది. అప్‌డేట్స్ చదవడం లైకులు కొట్టడమే కాకుండా నా పరిధి ఇంకొంత పెంచుకున్నాను. ముఖ్యంగా నాలో సామాజిక స్పృహ పెరిగింది. అంటే ఇప్పటి వరకు సామాజిక స్పృహ తప్పి పోయి పడి ఉన్నాను అని కాదు. స్పృహలో ఉన్నా ఏం చేయలేదు అని అర్థం.

ఈ సంగతి కూడా నాకు అప్పిగాడి వల్లే తెలిసింది. అప్పిగాడు ఈరోజే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశాడు. వాడి యోగక్షేమాలు విచారించుకోవడానికి ఫోన్ చేశాను. వాడు ఫోనెత్తగానే, “ఎలా ఉందిరా?” అని అడిగాను ఆదుర్దాగా.

“ఖంగారు పడాల్సిన పని లేదు, నేను బాగానే ఉన్నాను,” అన్నాను వాడు.

“ఏం జరగకపోవడం ఏంటి, కుక్క కరిచింది అని మీ అన్నయ్య నాతో చెప్తేనూ!”

“అంటే ఆ కుక్కని అలా క్లోజప్‌లో చూసి నేను స్పృహ తప్పిపోయాను. దాని వల్ల అందరూ కరిచింది అనుకున్నారు.”

“మరి కరవనప్పుడు హాస్పిటల్‌లో రెండు రోజులు ఎందుకు ఉన్నావు?”

“ఆ ఎఫెక్ట్ తగ్గడానికి కొంత టైం పట్టిందిలే. మధ్య మధ్యలో లేచి నేను వెర్రి కేకలు వేస్తున్నాను అని డాక్టర్ నన్ను రెండు రోజులు హాస్పటల్లొ ఉంచేశాడు.”

“పోనీ లేరా, త్వరలోనే బయట పడ్డావు. ఆ రూట్లో మళ్ళీ వాకింగ్‌కి వెళ్ళకు. వెళ్ళినా ఒక కర్ర పట్టుకుని వెళ్ళు, ఎందుకైనా మంచిది.”

“ఏడ్చినట్టుంది, కర్ర పట్టుకుని నడిస్తే నాకు ఏజ్ బార్ అయిపోయింది అనుకుంటారు. అసలే ఇంకా పెళ్ళి కాలేదు. అయినా నేను వాకింగ్‌కి ఎప్పుడో కానీ వెళ్ళను లేరా. సో, పర్లేదులే. ఇంతకీ ఈ రెండు రోజులు ఏం చేశావు?”

“బోలెడు మంది అప్‌డేట్స్ చదివాను. ఇప్పుడిప్పుడే నా అప్‌డేట్స్ కూడా పెట్టడం నేర్చుకుంటున్నాను. ఇంతకు ముందే మూడు దోశలు, ఆరు ఇడ్లీలు లాగించాను అని ఫ్రెష్ అప్‌డేట్ పెట్టాను. చూడలేదా?”

“అది సరే. సామాజిక స్పృహ ఏమైనా పెంచుకున్నావా?” అడిగాడు ఆప్పారావు నన్ను.

“నాకు గడ్డమే ఎగుడు దిగుడుగా పెరుగుతుంది. ఈ సామాజిక స్పృహ పెంచుకోవడం ఎలా?”

“ఓరి పిచ్చోడా, సామజిక స్పృహ అంటే, సమాజంలో మన చుట్టూతా జరుగుతున్న విషయాలని గమనించి వాటి పట్ల స్పందించడం.”

“అంటే?”

“ఉదాహరణకు, ఇప్పుడు సిరియాలో సివిల్ వార్ జరుగుతూంది. దాని పట్ల నీ అభిప్రాయం ఒకటి అప్‌డేట్‌గా పెట్టెయ్యి. ఆ రకంగా మిగతా జనంలో కూడా సామాజిక స్పృహ పెంచు.”

“సిరియాలో సివిల్ వార్ జరుగుతూంది అని నాకు తెలీదురా,” కాస్త సిగ్గు పడుతూ అన్నాను నేను.

“మరదే! న్యూస్ చూడు, చదువు. నీ జ్ఞానాన్ని పెంచుకో. దాన్ని అందరితో పంచుకో. అంతే కాకుండా వేరే వాళ్ళు ఇలాంటిదే రాస్తే వెంటనే స్పందించు, లేకపోతే నీకు ఏమీ తెలీదు అనుకుంటారు.”

“ఓహో.”

“రెచ్చిపో,” ఫోన్ పెట్టేశాడు అప్పిగాడు.

ఆ తరువాత నేను నిజంగానే రెచ్చిపోయాను.

ముందుగా నా ముఖపుస్తకం ఫ్రెండ్స్ పెట్టిన సామాజిక అప్‌డేట్స్ మీద ఎడా పెడా స్పందించా. సిరియాలో యుద్ధం అమానుషం అని, అఫ్ఘనిస్తాన్ పరిస్థితి దారుణమని, కాష్మీరుని చూస్తూంటే కడుపు తరుక్కుపోతూందని, అమెరికాలో ఎకానమీ గురించి చాలా ఆందోళనగా ఉందని, చైనాలో మానవ హక్కుల గురించి అంతా గొంతు చించుకోవాలని వివిధ రకాలుగా స్పందించాను.

ఆ తరువాత, సెలెబ్రిటీస్ జీవితాల్లో జరిగే సంఘటనల పట్ల నా అమూల్యమైన అభిప్రాయాలు తెలియపరిచాను.

అభిషేక్‌కి, ఐశ్వర్యకి కూతురు పుట్టడం నాకెంతో ఆనందం కలిగించిందని, నేను ఆ పిల్లకి మామయ్యలా ఫీల్ అవుతున్నానని, అమితాబ్ త్వరగా కోలుకోవాలని,రాం గోపాల్ వర్మ తీస్తానని ప్రామీస్ చేసిన 20 సినిమాల్లో కనీసం ఒక్కటైనా తీయాలని, రాహుల్ గాంధి దేశ ప్రధాని అయితే ఆయనకు మంచిదే కాని, దేశానికి అంత మంచిది కాదేమోనని, ఇండియన్ క్రికెట్ టీం ఇక ఇండియా బయట ఆడితే ఒప్పుకునేది లేదని, కాంగ్రెస్‌లో చేరినందుకు కనీసం చిరంజీవికైనా సామాజిక న్యాయం జరగాలని, అబ్బాస్ హార్పిక్ అడ్వర్టైజ్‌మెంట్‌లో యాక్ట్ చేయడం నాకు నచ్చట్లేదని, చంద్ర బాబుకి రెండు కళ్ళ సిద్ధాంతం వర్కౌట్ కావట్లేదు కాబట్టి, మూడు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించాలని, జగన్ మిస్ అయిన బాధితుల కోసం, ఇంకో రౌండ్ ఓదార్పు యాత్ర వేయాలని, కే.సీ.ఆర్ ఈ సారి వీధుల్లో వంట సమ్మె చేసినప్పుడు వీధుల్లో నార్త్ ఇండియన్ వంటకాలు కూడా వండాలని, ఇలా చెలరేగి పోయాను.

ఆ తరువాత నాకనిపించింది; ఇలా వేరే వాళ్ళు రాసిన వాటి మీద స్పందించడమే కాకుండా, ప్రజలని విజ్ఞాన వంతులని చేయడానికి నా వంతు కృషి నేను కూడా చేయాలని.

రక రకాల వెబ్ సైట్స్ వెతికి, కష్టపడి ఒక కొత్త సమాచారం సంపాదించాను. ప్రభుత్వం గిరిజన సంక్షేమ పథకం కింద ఆదివాసులున్న ఒక గూడెంలో వాళ్ళని విద్యావంతులు చేయాలని సంకల్పించింది. ఆ పథకానికి కేటాయించిన నిధుల్లో, ముఖ్య మంత్రి నుండి ఫారెస్ట్ ఆఫీసర్ వరకు అందరు పంచుకున్నాక మిగిలిన డబ్బుతో ఒక ఆదివాసిని మాత్రం చదివించగలిగారు. ఇప్పుడు అతను రెంటికి చెడ్డ రేవడు అయ్యాడు. పదో క్లాస్ ఫెయిల్ కావడం వల్ల, వృత్తి విద్యలేవి రాక పోవడం వల్ల, అతను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు.

అతని కథ విశదంగా చెప్పే ఒక లింక్‌ని, “ఎంత అమానుషం!” అనే హెడ్డింగ్ కింద పెట్టి, నా కొత్త అప్‌డేట్‌ని ముఖ పుస్తకం ప్రజల మీదకి వదిలాను.

అరగంటలో యాభై రెస్పాన్సులు వచ్చాయి. వల్లకాట్లో రామనాధమైతే, “ఇంత ఉత్తమమైన సమాచారం అందించినందుకు ధన్య వాదాలు. కట్టెల అవసరం ఏమైనా ఉంటే అడగడానికి మొహమాట పడొద్దు,” అని మరీ రాశాడు.

ఫోన్ మోగింది. అప్పారావు.

ఫోనెత్తగానే, “కంగ్రాట్స్‌రా! నీ అప్‌డేట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. నీలో సామాజిక స్పృహ జ్వరం పెరిగినట్టు పెరిగిపోయింది,” అన్నాడు మెచ్చుకోలుగా.

“థాంక్స్‌రా!” ఉబ్బి తబ్బిబ్బయ్యాను నేను.

“ఇప్పుడు నువ్వు అర్జెంట్‌గా చేయాల్సింది, నీ గురించి నువ్వు తెలుసుకోవడం. అంటే ముఖ పుస్తకంలో రక రకాల క్విజ్జులు వుంటాయి. వాటిని యాన్సర్ చేస్తే, నీ పర్సనాలిటీ గురించి నీకు అర్థమవుతుంది,” కర్తవ్యం బోధించాడు, అప్పిగాడు.

(ఇంకా ఉంది)

ముఖపుస్తకం – 5

ఈ ముఖపుస్తకంలో ఎలా మెలగాలో, ఎలా నడుచుకోవాలో నాకు ఇప్పటి వరకు చెప్తున్న నా రథ సారధి, అప్పిగాడు, ఇలా హాస్పిటల్ పాలు కావడం నాకేం నచ్చలేదు. అఫ్ కోర్స్, నాకు నచ్చకపోయినా నేను చేసేది ఏమీ లేదు, వాకింగ్ టైంలో ఆ కుక్కకి వాడు నచ్చాక.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలట. ఆ ప్రిన్సిపుల్ ఫాలో అవుతూ నేను మళ్ళీ ముఖ పుస్తకంలోకి ఎంటర్ అయ్యాను.

యదావిధిగా బోలెడు కొత్త అప్‌డేట్స్ వచ్చున్నాయి. నాకు సడన్‌గా ఒక అనుమానం వచ్చేసింది. ఈ అప్‌డేట్స్ చదవడం సరే, నా అప్‌డేట్స్ కూడా పెట్టాలి కద! కాబట్టి వెంటనే, నా స్టేటస్ అప్‌డేట్ చేశాను, “మీ అందరి అప్‌డేట్స్ చదువుతున్నా” అని. ఆ తరువాత తృప్తిగా అందరి అప్‌డేట్స్ చదవడం మొదలు పెట్టా.

మా కొలీగ్, “దరిద్రుడు” సినిమా చూస్తున్నాడట. దాని టాగ్‌లైన్ “ఎవరి దగ్గర బిచ్చమెత్తుకోడు” అట. మరి తిండికి ఎలాగబ్బా అనుకున్నాను నాలోనే.

మా వేలు విడిచిన కజిన్, “బాబా దయ వల్ల అపాయం తప్పింది. ఈ రోజు మళ్ళీ జారి పడ పోయాను. కొద్దిలో తప్పించుకున్నాను,” అని రాశాడు. వెంటనే లైక్ కొట్టేశాను.

నా అప్‌డేట్‌కి మా బాబాయి రిప్లై పెట్టాడు, “బాబూ, ముళ్ళలో దొర్లుతూ ప్రదక్షిణాలు చేస్తే, నీకొచ్చే ఐశ్వర్యం డబుల్ రెట్టింపు అవుతుంది. కాబట్టి దొర్లేయి!” అని.

దానికి నేను వినయంగా, “అది కరెక్టే కావొచ్చు బాబాయి, కానీ ముళ్ళలో దొర్లుతూ ప్రదక్షిణం చేశాక, వచ్చే ఐశ్వర్యం ట్రిపుల్ మూడింతలు ఐనా, అది అనుభవించడానికి నేనుండనేమో?” అని సమాధానమిచ్చాను.

ఎవడో అప్పారావు గాడి ఫ్రెండ్, “అదేంటి కుక్క క్లోజప్‌లొ ఎగురుతున్న తరువాత ఫోటోలు లేవు? ఆ మిగతా ఫోటోలు కూడా వెంటనే పెట్టాలి. ఈ సస్పెన్స్ తట్టుకోలేకుండా ఉన్నాను,” అని వాడి ఫోటో అప్‌డేట్‌కి రిప్లై పెట్టాడు. ఆస్పత్రి బెడ్ మీద పడుకుని ఉన్న అప్పిగాడు ఇది చదివితే ఎలా రియాక్ట్ అవుతాడో అనిపించింది.

నన్ను కొత్తగా ఇంకో ఐదు మంది add చేసుకున్నారు. వారిలో ఒక్కడు కూడా నాకు గుర్తు లేదు. కానీ వసుధైక కుటుంబం సూక్తి గుర్తుకు వచ్చి మారు మాట్లాడకుండా వాళ్ళందరినీ add చేసేసుకున్నాను. వెంటనే అందులో ఒకడు, పేరు పద్మాకర్, నా “గోడ” మీద బరికేశాడు కూడా.

“ఒరేయి ఆదిత్యా, గుర్తున్నానా నేను? చిన్నప్పుడు మనం గోకులమ్మ స్కూల్‌లో రెండో క్లాస్ కలిసి చదువుకున్నాం. మూడో క్లాస్‌కి మా నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయ్యి మేము ఒంగోలు వెళ్ళిపోయాం. వెళ్ళడానికి ముందు రోజు, నువ్వు నా దగ్గర పది జీళ్ళు తీసుకున్నావు. అవి నువ్వు తిరిగిచ్చేంత లోపే, మేము ఊరు విడిచి వెళ్ళిపోయాము. హి హి హి,” అని.

నాకు కొంత కన్‌ఫ్యూజన్ కలిగింది. వీడు నన్ను మళ్ళీ కలుసుకున్నందుకు ఆనందిస్తున్నట్టా, లేక వాడి జీళ్ళని ఇప్పటికైనా తిరిగి ఇమ్మని డిమాండ్ చేస్తున్నట్టా? ఎందుకైన మంచిది అని నేను నర్మగర్భంగా వాడికి రిప్లై కొట్టాను.

“ఒరే పద్మాకర్, నిన్ను మళ్ళీ కలుసుకోవడం ఒక వంద జీళ్ళు తిన్నంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ సారి కలిస్తే హోటల్‌కి వెళ్ళి, జీడి పప్పు, మాదీఫల రసయానం తాగి సెలబ్రేట్ చేసుకుందాం,” అని.

మా ఒకనొక కజిన్ స్నానం అయ్యింది కాబట్టి భోంచేసి వచ్చినట్టున్నాడు. “ఈ రోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కూర. ఎంత బాగుందంటే, స్వర్గానికి బెత్తెడే దూరం. అది తిన్నాక ఈ పాడు ప్రపంచాన్ని చూడాలి అనిపించలేదు. ఇప్పటికిప్పుడు పరమపదిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నా. కానీ రాత్రికి కూడా మళ్ళీ అదే కూరతో భోజనం చేయబోతున్నా అని గుర్తొచ్చి, మళ్ళీ మనసు మార్చుకున్నా,” అని అప్‌డేట్ పెట్టాడు. దీన్నే వంకాయ వైరాగ్యం అంటారు కామోసు. రాత్రి మళ్ళీ ఆ కూర తిన్నాక, వీడు ఇంతే ఘాటుగా స్పందిస్తాడో లేదో అనుకున్నాను. చదవబోయే అప్‌డేట్ గురించి తొందర పడ్డం ఎందుకు అనుకుని, నెక్స్ట్ అప్‌డేట్ కి వెళ్ళాను.

అది మూడ్ బాగుందో లేదో తెలియని అమ్మాయిది.

“ఆ తెల్లటి గోడ మీద ఒక నల్ల చుక్క ఎందుకు ఉండాలి?
ఆ దిక్కుమాలిన చంద్రుడికి ఒక మచ్చెందుకు ఉండాలి?

మన టీవీ సీరియళ్ళు, కనీసం పదివేల ఎపిసోడ్లైనా ఎందుకు లాగాలి?
ఆఖరికి సూపర్ మార్కెట్‌లో కొన్న కూరల్లో కూడా పుచ్చెందుకు రావాలి?”

అని తన సొంత కవిత కాబోలు, తన సరికొత్త అప్‌డేట్‌లో పెట్టింది.

ఇలాంటి కవితలు రాస్తూ ఉందంటే ఆమెలో ఎంత నిరాశావాదం పేరుకుపోయిందో నాకు అర్థమయి, హృదయం ద్రవించుకు పోయింది. ఇలా అన్నింటిలో లోపాలు, లోట్లు వెతుక్కుంటే ఇంక ఆమె మూడ్ ఎప్పటికైనా బాగు పడుతుందా అని సందేశం, అదే అదే, సందేహం వేసింది.

కాస్త ఓదార్చుదామని,

“ఎందుకు అని అలా అడిగితే ఏం చెప్ప గలం?
మహేష్ బాబు సినిమాల్లో తన హీరోయిన్‌ని బూతులు తిట్టడం
ఎంత మంచి షాప్‌లో కొన్నా కూరగాయల్లో పుచ్చులు రావడం సహజం.”

అని రిప్లయ్ కొట్టాను.

దాని తరువాత కాస్త ఆలోచనలో పడ్డాను. నేను ముఖపుస్తకంలో అడుగు పెట్టడం వల్ల నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసి వచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం.

ముఖ్యంగా నేను ఇప్పటి వరకూ, నేనొక్కడినే ఏబ్రాసిని ఏమో, పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయని వాడినేమో, మిగతా వారంతా నిరంతరం ఏదో కార్యాన్వేషణలో కరిగిపోతూ, రహస్య శోదనలో రగిలిపోతూ ఉంటున్నారేమో అనుకునే వాడిని. ఆ అభిప్రాయం ఈ రోజుతో పటాపంచలయ్యింది.

(ఇంకా ఉంది)

ముఖపుస్తకం – 4


అప్పిగాడి మాటలతో నాకు కనువిప్పు కలిగింది. “కాదేదీ కవితకనర్హం?” అని శ్రీ శ్రీ మహాకవి అన్నట్టు, “కాడెవడు ముఖపుస్తకంలో add చేసుకొనుటకు అనర్హుడు” అనుకుని, వల్లకాట్లో రామనాథం & Co.ని నా అకౌంట్‌కి add చేసి పారేశా.

నా హోం పేజ్ రిఫ్రెష్ చేయగానే ఆల్‌రెడీ 20 అప్‌డేట్స్ వచ్చి ఉన్నాయి. ఈ సారి నేనంత ఆశ్చర్య పోలేదు. ముఖపుస్తకం మెంబర్ల కెపాసిటీ నాకు అప్పటికే తెలిసి వచ్చింది.

సరే ఒక్కొక్క అప్‌డేట్ చదవడం మొదలు పెట్టాను. మొదటిది మా ఒకనొక కజిన్‌ది. “ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను (10:45).” ఐతే ఆల్రెడీ అప్పిగాడి “నేను బాత్‌రూంకి వెళ్తున్నాను” అన్న అప్‌డేట్ చదివి ఉండడం వల్ల ఈ సారి నేనంత ఇబ్బందిగా ఫీల్ కాలేదు.

ఎలా రెస్పాండ్ కావాలి దీనికి? కాస్త ఆలోచించాను. స్నానం చేయడం అన్నది మంచి అలవాటు కాబట్టి “లైక్” మీద క్లిక్ చేసేశా.

నెక్స్ట్ అప్‌డేట్ మా వేలు విడిచిన మేనత్త యొక్క కాలు జారిన కొడుకుది. “గత వారం కాలు జారి పడ్డాను అన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు కాస్త కుంటుతూ నడవ గలుగుతున్నాను,” అని పెట్టాడు.

ఈ సారి ఎలా రెస్పాండ్ కావాలో కొంచెం అర్థం కాలేడు. “లైక్” అని పెడితే, నేను కుంటడం నీకు బాగుందా అని వాడు అపార్థం చేసుకునే అవకాశముంది. అసలే చాల రోజుల తరువాత మళ్ళీ ముఖపుస్తకం ద్వారా కలుసుకున్నాం. సరిగ్గా రెస్పాండ్ కాకపోతే దూరపు చుట్టం కాస్తా ఘోరపు చుట్టమయ్యే అవకాశముంది. అలా అని ఏం అనకపోతే కూడా వాడు ఫీల్ కావచ్చు. కాబట్టి ఒక కామెంట్ వదిలాను, “నువ్వు త్వరలో కుంటడం ఆపేసి నడుస్తావని ఆశిస్తున్నాను,” అని.

నాలో ఇంత లౌక్యముందని నాకు ముఖపుస్తకంలో సభ్యత్వం తీసుకోవడం వల్లే తెలిసింది కదా అని కూసింత ముచ్చట పడ్డాను.

తరువాత అప్‌డేట్, మూడ్ బాగా లేని అమ్మాయిది. “ఇప్పుడు నా మూడ్ కొంత బెటర్. అహహా, మళ్ళీ పాడయ్యింది. కాదులే ఇప్పుడు బెటర్. ఏమో నాకు తెలీదు!” అని ఉంది. దానికి ఎలా స్పందించాలో తెలీక నేను కూడా అది వదిలేసి తరువాత అప్‌డేట్ చూశాను.

వల్లకాట్లో రామనాథం పెట్టాడు, “ఈ ప్రపంచమే ఒక స్మశానం. మనమంతా కాబోయే శవాలం. కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి కట్టెలని. అలా అని వదిలిపెట్ట కూడదు బట్టలని,” అని. నాకు ఒక్క సారి నీరసం ముంచుకుని వచ్చింది. అసలే నేను కొంత సెన్సిటివ్. ఇలాంటి డిప్రెసింగ్ మెసేజెస్ అస్సలు తట్టుకోలేను.

వేరే జనాలు మటుకు బాగానే స్పందించారు. దానికి అప్పటికే పది లైక్‌లు వున్నాయి. ఎవరో ఒకతను, “చాలా బాగుంది. ఆ కట్టేలేంటో చెప్తే అవి రెడీ చేసుకుంటాం కద!” అని రిప్లై పెట్టాడు కూడా. రామనాథం గాడి అప్‌డేట్లు ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటూ నేను ప్రొసీడ్ అయ్యాను.

తరువాతది నాకు బాబాయి వరస అయ్యే ఒక పెద్దాయన అప్‌డేట్, “మీరు ఫలానా బాబా యొక్క ఫలానా వ్రతం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి,” అని పెట్టి వ్రతం యొక్క లింక్ కాబోలు, అది కూడా add చేశాడు.

వద్దు అనుకుంటూనే ఆ లింక్ మీద క్లిక్ చేశాను. అందులో వ్రత విధానం విశదంగా చెప్పబడి ఉంది. చదవడానికి ఒక అర్ధ గంట పట్టింది. క్లుప్తంగా సారాంశం ఏంటంటే ఆ ఫలానా బాబా ఫోటోని రెండు చేతులతో గుండెకి హత్తుకుని మన ఇంటి చుట్టూ మనం పొర్లు దండాలు పెట్టాలి. ప్రతి ప్రదక్షిణం తరువాత, గట్టిగా ఆ బాబా పేరు అరిచి చెప్పాలి. దీనికి కూడా స్పందించాలి కాబట్టి, (లేకపోతే దూరపు చుట్టం ఘోరపు చుట్టం అయిపోయే ప్రమాదం ఉంది, వగైరా వగైరా), “నాకు కుదరదులే బాబాయి. మా ఇంటి చుట్టూ ముళ్ళు. ఒక్క ప్రదక్షిణం చేయడమే కష్టం,” అని రిప్లై పెట్టా.

ఇంతలో మా ఒకనొక కజిన్ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది, “నా స్నానం అయిపోయిందోచ్ (11:45),” అని. ఓర్నీ వీడు గంట సేపు స్నానం చేశాడా ఐతే అనుకుని ఆశ్చర్యపోయాను. ఈ లెక్కన వీడు రోజుకో సబ్బు అరగదీస్తూ ఉండాలి. అంటే వీడి సబ్బుల ఖర్చే నెలకు కనీసం మూడొందల రూపాయలు ఉంటుంది. సబ్బులే ఈ రకంగా తగలేస్తున్నాడంటే, షేవింగ్ క్రీం, టూత్ పేస్ట్ కూడా బాగానే వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా వాడి పర్సనల్ ఖర్చు ఎంత ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ, ఒక సారి తల విదిలించి, ఆ థాట్ ప్రాసెస్ ఆపేశాను. ఏంటో ఈ అప్‌డేట్శ్ చదువుతూ ఉంటే మనసు పరి పరి విధాల పోతూంది.

నెక్స్ట్, అప్పారావు గాడు ఇంతకు ముందు చెప్పినట్టే వాడు వాకింగ్‌కి వెళ్ళిన ఫోటోలు పెట్టాడు. దాదాపు ఒక యాభై ఉంటాయి. బహుశా నడుస్తున్నంత సేపు, వాడి ఫోన్‌లో ఉన్న క్యామెరా వాడి, దారి పొడుగూతా ఫోటోలు తీసినట్టున్నాడు.

ముందు వాడి ఇంటి గేటు ఫోటో ఉంది. ఆ తరువాత వాడి వీధివి ఒక నాలుగు ఫోటోలు. ఆ తరువాత వాడి పక్క సందులో ఇంకొన్ని ఫోటోలు. ఆ తరువాత మళ్ళీ వాడి సందుకు వచ్చినట్టున్నాడు. ఇంకో మూడు ఫోటోలు. ఆ తరువాత వాళ్ళింటి దగ్గర గుంటలు పడి ఉన్న వాళ్ళ మెయిన్ రోడ్‌వి తీశాడు. ఆ తరువాత ఆ రోడ్ మీద ట్రాఫిక్‌ని తీశాడు. ఆ తరువాత ఒక వీధి కుక్క ఫోటో ఉంది. ఆ తరువాత క్లోజప్‌లో అదే కుక్క ఎగురుతున్నట్టు ఫోటో ఉంది. అంతే! ఇంక ఫోటోలు లేవు.

నా మనసు కీడుని శంకించింది. వెంటనే అప్పారావింటికి ఫోన్ చేశా. వాళ్ళన్నయ్య ఫోన్ ఎత్తాడు. నేనేం అడగక ముందే, “ఓ, అప్పుడే నీకు తెలిసిపోయిందా! అర గంట కిందే వాడిని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళారు,” అన్నాడు.

“ఎందుకు?” ఆందోళనగా అడిగాను.

“ఇంతకు ముందు వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కుక్క కరిచింది! అందుకు. ఆస్పత్రికి పోతూ కూడా ఒకటే గోల. నాతో బలవంతంగా వాడి వాకింగ్ ఫోటోలు వాడి ముఖపుస్తకం అకౌంట్‌కి అప్‌లోడ్ చేయించాడు,” కాస్త విసుగ్గా చెప్పాడాయన.

నేను ఫోన్ పెట్టేశాను.

(ఇంకా ఉంది)

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers