Archive for the ‘అమెరికాలో ఆపసోపాలు’ Category
అమెరికాలో ఆపసోపాలు – 1 (పరిచయ కార్యక్రమం)
(గమనిక: “అమెరికాలో ఆపసోపాలు” 96-97లో నేను రాసిన సీరియల్ కథ. ఇది ఒక రకంగా నేను ఇంతకు ముందు రాసిన “సీనియర్”కి loose sequel. ఐతే అందులో పాత్రలు ఈ కథలో కనిపించవు. “సీనియర్” అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన తెలుగు విద్యార్థుల గురించి ఐతే, ఈ కథ అమెరికాలో పని చేస్తున్న తెలుగు బాచిలర్స్ గురించి. కథా కాలం పదేళ్ళ కిందటిది. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని చదవమని మనవి.)
“Tring Tring,” అంటూ phone మోగింది. misc.unnecessary.rubbish newsgroup చదువుకుంటున్న సంజయ్ విసుగ్గా phone అందుకున్నాడు.”Hello, ఏదో-ఒకటి-soft technologies, Sanjay speaking. How can I help you today? అన్నాడు యధావిధిగా. “నీ accent తగలెయ్యా! నేనురా సూరిబాబుని,” అటు వైపు నుంచీ ఒక కరుకయిన గొంతు వినవచ్చింది.
“ఒరే సూరీ నువ్వా, చెప్పరా విశేషాలేమిటి?” అన్నాడు అనందంగా సంజయ్. సూరి బాబు అతనికి చిన్నప్పటినుంచీ తెలుసు.
“రేపు నేను మీ రాష్ట్రానికి వస్తున్నాను. అక్కడ నాకు బే సున్నిత సంస్థ లో మద్యాహ్నం పరిచయ కార్యక్రమం ఉంది. నీవు నన్ను విమాన స్థావరానికి వచ్చి కలుసుకో,” అన్నాడు సూరి బాబు.
“??? ఏమంటున్నావురా సూర్లూ???” అయొమయం సంజయ్ గొంతులో ధ్వనించింది. “మొన్న weekend మాట్లాడినప్పుడు బాగానే ఉన్నావు కదరా? పొరపాటున ఎవరైనా Amway దేశీని కలిశావా? ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు?” బోల్డంత బాధ పడిపోయాడు సంజయ్.
“నీ బొందరా. నేనిప్పుడు office నుంచి మాట్లాడుతున్నా. Englishలో ఏడ్వలేను కద! నువ్వే Englishలోకి translate చేసుకో,” చిరాగ్గా అన్నాడు సూరి బాబు.
రెండు నిమిషాల తరువాత bulb వెలిగింది సంజయ్‌కి. “ఓహో, నువ్వనేది, నీకు మా దగ్గర Baysoftలో interview ఉంది. నేను నిన్ను airportకి వచ్చి receive చేసుకోవాలి. అంతేనా?”
“అంతే, అంతే రక్షించావురా బాబూ. రేపు పొద్దున ఏడు గంటలకి విమానం వస్తుంది. నన్నూ నా luggage ని మోసుకుని తెస్తుంది. అక్కడ తగలడు.” phone click మంది.
“ఈ వెధవది అంతా అవక తవక వ్యవహారమే. పొద్దున ఏడు గంటలకి రావడమేమిటి nonsense,” తనలో తాను గొణుక్కున్నాడు సంజయ్. నిజమే మరి చిన్నప్పుడు ఎప్పుడో N.T.R నటించిన అడవి రాముడు cinema grand morning showకి వెళ్ళడానికోసం పొద్దున్నే లేచాడు సంజయ్. ఆ తరువాత ఇదే మళ్ళీ.
(సశేషం)
అమెరికాలో ఆపసోపాలు – 2 (నవలామణి నవలల పిచ్చి)
పొద్దున్నే ఏడు గంటలకు కళ్ళు నులుముకుంటూ చికాకుగా చుట్టు పక్కల చూశాడు సంజయ్. “వెధవ విమానాలు, పొద్దున పూటైతే ఠంచనుగా timeకి వచ్చేస్తాయి,” తనలో తాను గొణుక్కున్నాడు. ఇప్పుడతను airportలో ఉన్నాడు.
“ఒరే సంజయ్!” అంటూ సుడిగాలిలా దూసుకుని వచ్చాడు సూరి బాబు. “ధన్యవాదాలురా. సమయమునకు వచ్చి నా కార్యమును సులభము చేసితివి,” అన్నాడు ఎలుగుబంటిలా సంజయ్‌ని వాటేసుకుంటూ.
“ఇంకో సారి ఆ అచ్చ తెలుగులో మాట్లాడావంటే నరుకుతా,” అన్నాడు సంజయ్ కోపంగా. “ఇప్పుడు officeలో లేవుగా. మామూలుగా మాట్లాడి ఏడువు. పైగా మాటి మాటికి కార్యం, కార్యం అనకురా బాబూ,” చుట్టూతా చూస్తూ అన్నాడు. అసలే bay areaలో తెలుగు వాళ్ళు ఎక్కువాయే!
“సారీ రా, ఈ మధ్య office నుంచి నీకు చేసిన calls వంటివి ఎక్కువ చేయడంతో ఇలా అలవాటైపోయింది. అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?” question mark face పెట్టాడు సూరి.
“ముందు నిన్ను ఇంటికి తీసుకెళ్తా. అక్కడ కాఫీ లాగించి, నువ్వు స్నానం అఘోరించాక నిన్ను నీ interview site దగ్గర పడేసి నేను officeకి పోతా. సాయంత్రం నిన్ను pick up చేసుంకుంటా,” program వివరించాడు సంజయ్.
“ఐతే మీ ఆవిడని చూస్తానన్న మాట! ఏవిటోరా సంజయా, మనం ఇంత దగ్గరి స్నేహితులం కదా, నీ పెళ్ళికి నేను రాలేకపోయాను. ఎలా వస్తానులే, నువ్వు Indiaలో చేసుకుంటే. మా బాసు గాడు నా పెళ్ళికి నన్ను India వెళ్ళనివ్వడానికే ఏడుస్తున్నాడు. పైగా, మీ దేశంలో వరుడి బదులు కత్తిని పంపించచ్చు కదా అని కుళ్ళు జోక్ ఒకటి వేశాడు కూడా.
వాడు ఈ మధ్యనే “India Made easy for Americans” అన్న non-fiction book ఒకటి చదివి, తనకు ఇప్పుడు India గురించి అంతా తెలుసు అన్నట్టు behave చేస్తున్నాడు. అన్నట్టు మీ ఆవిడ పేరేమిట్రా?” ప్రశ్నించాడు సూరి బాబు.
“తన పేరు గాంధర్వ గౌళ. అదిగో! అలా ఆశ్చర్య పడకు. తను ఆంధ్రుల ఆర్భాట రచయిత వానమూరి ధీరేంద్రనాథ్‌కి వీర అభిమానిలే. చిన్నప్పుడు ఏం పేరు పెట్టరో కానీ తన పన్నెండొ ఏట ఇలా పేరు మార్చుకుంది. కొంచెం నవలల భాష మాట్లాడుతుంది కూడా. ఖంగారు పడకు,” చెప్పాడు సంజయ్.
“గాంధర్వ గౌళ? అదేం పేర్రా బాబూ? సరేలే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిరుచి,” సాలోచనగా తల పంకించాడు సూరి బాబు. “పద, ఇంటికి వెళ్దాం,” అంటూ exit వైపు దారి తీశాడు సంజయ్.
*************************************************************
“నీ ఇల్లు చక్కగా ఉందిరా సంజిగా!” గాంధర్వ గౌళ ఇచ్చిన కాఫీ అందుకుంటూ అన్నాడు సూరి బాబు. “Thanks రా,” సూరి బాబుతో అని, “అన్నట్టు కొద్దిగా చక్కర తక్కువైనట్టుంది?” అడిగాడు సంజయ్ గౌళని.
“నిజమేనండీ. కాఫీలో చక్కర తక్కువే అయ్యింది. బహుశా నిన్న చక్కర నిండుకుంది అని తెలిసినప్పుడు, మీకు చెప్పాలని వచ్చినప్పుడు, సోఫాలో నిద్రపోతున్న మీ మొహంలోని ప్రశంతత చూసి, దాన్ని చెదిరిపోనీయడం ఇష్టం లేక, మౌనంగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవడమే నేను చేసిన పొరపాటేమో… కాఫీలో చక్కర లేకపోవచ్చండి, కానీ మల్లె పూవు లాంటి స్వచ్ఛత, మంచి గంధంలాంటి నా ప్రేమ అందులో రంగరించి కలిపానండి. అయ్యో! మీకు ఎలా చెప్పనండి?” గౌళ గొంతులో విషాదం ధ్వనించింది.
సూరి బాబుకి తాగుతున్న కాఫీ పొలమారి, దగ్గుతూ, టక్కున లేచి నిల్చున్నాడు. “ఖంగారు పడకురా సూరీ. నే చెప్పానుగా ముందే,” సూరి బాబుతో అని, “సారీ గౌళా! నేనే విషయం పూర్తిగా కనుక్కోకుండా తొందర పడ్డాను,” గౌళను అనునయించాడు సంజయ్.
గౌళ మౌనంగా కప్పులు వారి దగ్గరినుండి తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది.
*************************************************************
సూరి బాబు శనివారం నిద్ర లేచేప్పటికి పదకొండు గంటలయ్యింది. కళ్ళు నులుముకుంటూ living roomలోకి వచ్చాడు. “కాఫీ మైక్రోవేవ్‌లో ఉంది. వేడి చేసుకోండి,” అంది గౌళ, చదువుతున్న నవలలోంచి తలెత్తి. సూరి బాబు నవల పేరుని యధాలాపంగా చదివాడు. అది వానమూరి ధీరేంద్రనాథ్ రాసిన “దానవుడు” నవల.
సూరి బాబు కాఫీ తెచ్చుకుని సోఫాలో కూర్చుంటూ, “సంజయ్ ఇంకా లేవలేదా?” అని అడిగాడు గౌళని. గౌళ, “ఆయన showerలో ఉన్నారు,” అని చెప్పి, “ఇది చూశారా? వానమూరి ఎంత గొప్ప వాక్యం రాశాడో ఇక్కడ,”అంది. “ఏమిటది?” అని అడుగుతూనే నాలుక కరుచుకున్నాడు సూరి.
“మనిషి ఒంటరిగా గుక్క పట్టి ఏడ్చే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు రాత్రినిసృష్టించాడట,” గౌరవం నిండిన గొంతుతో అంది గౌళ.
“నిజమా? నేను నిద్ర పోవడానికి అనుకున్నాను,” sincereగా అని మళ్ళీ నాలుక కరుచుకున్నాడు సూరి.
అప్పటికే గౌళ అతనివైపు ఒక అసహ్యమయిన చూపు విసిరింది.
“మాములు మనుషులు అలా అనుకుంటారు. వానమూరి కాదు. ఇంతకు ముందు ఇదే నవలలో చెప్పాడు. మనమంతా మారాలంటే, capitalism communism ఇవేవి సహాయం చేయవట. మనుషుల్లో భావ విప్లవం రావాలట. భావ విప్లవం వచ్చినా, ఎందుకైన మంచిది, ఒక వ్యక్తి Chengiz Khanలా కొరడా పట్టుకొని అందరిని బాదుతూ ఉండాలట. ఎంత బాగా చెప్పాడో చూడండి. That is వానమూరి,” అంది గౌళ అనందంగా.
“ఓహో! ఐతే మరి ఎవరు Chengiz Khan అని మనకు ఎలా తెలుస్తుంది?”ప్రశ్నించాడు సూరి బాబు.
“ఎలా తెలియడమేమిటి? భావ విప్లవం రాగానే Chengiz Khan కూడా అవతరిస్తాడు,” అంది గౌళ.
“మరి భావ విప్లవం ఎప్పుడు వచ్చిందో మనకు ఎలా తెలుస్తుంది,” పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రశ్నించాడు సూరి.
“వీపు మీద కొరడా వాతలు తేలగానే తెలుస్తుంది,” కసిగా సమాధానంఇచ్చింది గౌళ. ఆమెకు చాలా చిరాగ్గా ఉంది. ఇంతకు ముందు ఎవరైనా, ఆమె ఏం చెప్తే అది విని ఊరుకునేవారు. సూరి బాబులా ప్రశ్నలు వేసి, ఇలా ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. వానమూరి ఇలాటి సవాళ్ళని ఎలా ఎదుర్కుంటాడో అని, అప్పుడు ఆమెకు ఒక సందేహం కలిగింది.
ఇంతలో సంజయ్ బయటకు వచ్చి, “ఒరేయి. ఈ రోజు సాయంత్రం Indian restaurantకి dinnerకి
వెళ్తున్నాం. So, అదీ evening మన program”, అంటూ announce చేశాడు.
(సశేషం)
అమెరికాలో ఆపసోపాలు – 3 (సూరి బాబు హోటల్ అనుభవం)
Interview సాయంత్రం అయిపోగానే సూరిబాబుని సంజయ్ pick up చేసుకున్నాడు. “ఏరా, సూరి, ఎలా అయ్యింది మీ కాబోయే బాసుతో పరిచయం?” అడిగాడు.
“ఫర్లేదురా, బాగానే అయ్యింది. ఈ రాత్రికి ఏదయినా Indian restaurant కి వెళ్దామురా సంజయ్,” request చేశాడు సూరిబాబు. “అలాగే లేరా నీ ఇష్టం. మేము ఇక్కడ ఎపుడూ వెళ్తూంటాం అనుకో,” అన్నాడు సంజయ్.
ఇంటికి వెళ్ళగానే గౌళ వారికి కాఫీతో ఎదురు వచ్చింది. సంజయ్ మొదటి గుక్క తాగుతూంటే భయం భయంగా చూశాడు సూరి బాబు. అదృష్టవశత్తు చక్కెర సరిగ్గానే ఉన్నట్టుంది. సంజయ్ ఏం అనలేదు.
ఎంత సేపైనా ఎవ్వరూ ఏమీ మాట్లాడక పోయేసరికి, సూరి బాబు సంభాషణ సాగించడానికి గౌళతో, “మీరేం చదువుకున్నారండి?” అని అడిగాడు. “నేను microbiologyలో post graduation చేశానండి,” సమాధానమిచ్చింది గౌళ.
“ఓ మరి ఇకనేం. మీరు కూడా ఇక్కడ computer scienceలో masters చేసి ఉద్యోగం మొదలెట్టచ్చుగా?” అడిగాడు సూరి బాబు.
“Micro biologyకి, computer scienceకి ఏమిటి సంబంధం?”అయోమయంగా ప్రశ్నించింది గౌళ.
“ఇక్కడ micro biology కాదండీ important! ఏదో ఒక post graduate degree ఉంటే చాలు. ఇక్కడ masters programకి qualify అవుతారు,” వివరించాడు సూరి బాబు. “మీకూ ఇంట్లో ఒక్కతే ఉండి bore కొట్టదూ?” అన్నాడు.
గౌళ ఒక్కసారి సూరి బాబు వైపు గంభీరంగా చూసి, “ప్రశ్నచిన్నదే సూరి బాబు గారు. కానీ సమాధానం ఆకాశమంత పెద్దది,” అంది. మళ్ళీ సూరి బాబుకి ఒకసారి పొలమారింది. సంజయ్ వైపు రక్షించమన్నట్టు చూశాడు.
సంజయ్ topic మార్చేస్తూ, “గౌళా, సూరి బాబు Indian restaurantకి వెళ్దామని ముచ్చట పడ్తున్నాడు. తొందరగా తయారవ్వు,” అన్నాడు.
కాసేపయ్యాక వారెక్కిన కారు, సదరు Indian restaurant వైపు దూసుకుపోయింది. కారు ఆగగానే బధ్ధకంగా బయటకు దిగి వొళ్ళు విరుచుకున్నాడు సూరి. Restaurant లోపలికి నడిచే ముందు యధాలాపంగా పైన బోర్డ్ వంక చూసి shock తిన్నాడు. చక్కగా తాటికాయంత తెలుగు అక్షరాలతో “శ్రీ శ్రీశ్రీ సత్యనారాయణ ఉడిపి భవన్” అని రాసి ఉంది.
“ఇదేమిటిరా సంజయ్? మనం పొరపాటున అడ్డ దారిన ఏ విజయవాడకో వెళ్ళిపోలేదు కద?” సూరి బాబు గొంతు నిండా ఆశ్చర్యం ధ్వనించింది.
సంజయ్ ఘొల్లున నవ్వుతూ, “అరే సూర్లూ, ఇది మా bay areaలో మామూలే. ఇక్కడ బోల్డు తెలుగు వాళ్ళు ఉన్నారులే. పైగా ఈ hotelకి వచ్చే వాళ్ళంతా తెలుగు వాళ్ళే. అందుకని వీడు Englishలో పేరు పెట్టడం దండగ అని ఇలా తెలుగు బోర్డ్ తగిలించేశాడు,” explain చేశాడు.
లోపలికి వెళ్ళేంతలో, “ఒరే సూరీ!” అన్న ఒక పొలి కేక వినిపించింది. ఒక భారీ శాల్తీ వచ్చి సూరి బాబు వీపు మీద ఒక్క చరుపు చరిచింది. “కెవ్వు,” అన్నాడు సూరి బాబు ఆ శాల్తీ వంక అయోమయంగా చూస్తూ.
“నన్ను గుర్తు పట్టలేదురా? నేనురా! చిన్నప్పుడు మీ ఇంటి వెనకాల ఉండేవాణ్ణి? చంటి గాడ్నిరా!” అనందంగా అంది ఆ నిండు విగ్రహం. సూరి బాబుకి యెంత గింజుకున్నఅతగాడెవడో గుర్తు రాలేదు.
“మీరు…” అని గొణుగుతున్న సూరి బాబుని చూసి, శాల్తీ కొంచెము విసుగ్గా, “అబ్బా, అప్పుడే మర్చిపోయావురా? నువ్వు ఒకసారి మా ఇంట్లో జామకాయలు తెంపాలని చూస్తే మా నాన్న నిన్ను చచ్చేట్టు కొట్టాడు?” అని గుర్తు చేసింది.
గౌళ కిసుక్కున నవ్వింది. ఇంకా గుర్తు రాలేదు అంటే ఏమంటాడో అన్న భయంతో, “ఆ గుర్తు వచ్చింది, ఎలాఉన్నవురా చంటీ,” కష్టపడి గొంతులో ఆప్యాయతని పులుముకుంటూ అన్నాడు సూరి బాబు.
“ఇప్పుడు నేను వేరే వాళ్ళతో వచ్చానురా. బయలు దేరుతున్నాం. నీ phone number ఇవ్వు,” అని సూరి బాబు జేబులో తన visiting card కుక్కి సూరి బాబు నంబర్ తీస్కొని అదృశ్యం అయ్యాడు “చంటి”.
తల బరుక్కుంటూ సూరి బాబు restaurant వైపు ఇంకోఅడుగు వేశాడు. “ఒరే సూరీ!” అంటూ ఇంకో గావు కేక వినిపించింది. తన వైపే వస్తున్న ఇంకో భారీ శాల్తీని చూసి వెనక్కు రెండు అడుగులు వేశాడు సూరి బాబు, ఆ ఆకారం ఇంకొక సారి తన వీపు వాయించకుండా.
“నేనురా, నన్ను గుర్తు పట్టలేదా?” అన్నాడు ఆ ఆజానుబాహుడు. “గుర్తొచ్చింది, నీ పేరు బుజ్జి కదు?” తొందర తొందరగా అన్నాడు సూరి. “correctరా భలే గుర్తు పట్టావే! ఒకవేళ నువ్వు గుర్తు పట్టకపోతే నిన్ను మా నాన్న మా ఇంట్లో మామిడి కాయల దొంగతనానికి చావగొట్టిన విషయం గుర్తు చేద్దమనుకున్నాను,” అన్నాడు “బుజ్జి” అనందంగా.
“ఇదిగో నా నంబర్. నీ card ఇవ్వు,” నీరసంగా అన్నాడు సూరి బాబు. బుజ్జి నిష్క్రమించగానే ఇంకో అడుగు ముందుకు వేసిన సూరి బాబు restaurant door తెరిచి పట్టుకున్నఒక అబ్బాయిని చూసి కళ్ళు తేలవేశాడు.
“ఒరే సంజయ్! వీడు చిన్నప్పుడు మా పాలకొల్లులో తప్పి పోయిన సీను గాడు. ఇక్కడకి ఎలా వచ్చాడు?” ఇక ఈ shocks తను తట్టుకోలేడేమో అన్నట్టు సంజయ్ భుజాన్ని పట్టుకుంటూ అన్నాడు సూరి.
“ఒరే సూరీ, మరీ అంత ఆశ్చర్యపోకురా. ఎక్కడెక్కడి వాళ్ళు నీకు మా bay areaలో కనిపిస్తారు. మరి మా bay area అంటే ఏమనుకున్నావు?” గర్వంగా అన్నాడు సంజయ్.
ఇంకా ఏం విచిత్రాలు కనిపిస్తాయో అనుకుంటూ, సంజయ్ గౌళలతో లోఫలికి నడిచాడు సూరి బాబు.
అమెరికాలో ఆపసోపాలు – 4 (buffet అంటే బోలెడు ఫుడ్డు!)
లోపల అడుగు పెట్టి చిన్నగా వణికాడు సూరి బాబు. “ఓరి నాయనో, ఎంత మంది దేశీలు రా బాబూ. వీళ్ళల్లో ఎవడెవడు మా ఇంటి వెనుకాతల ఉండే వాడో? ఎవడెవడి నాన్న నన్ను చావగొట్టాడో?” మనసులోనే అనుకున్నాడు.
“సూరీ. ఇక్కడ buffet బెస్టురా. పద, వెళ్ళి లాగిద్దాం,” సంజయ్ సూరి బాబు గురించి wait చేయకుండానే బయలుదేరాడు.
కాసేపయ్యాక ముగ్గురు busyగా ఫుడ్డు లాగిస్తున్నారు. తెచ్చుకున్నది సగం అయిపోవడంతో సూరి బాబు మళ్ళీ buffet serve చేసిన వైపు బయలుదేరాడు.
సూరి బాబుని ముఖ్యంగా buffetలో ఆకర్షించిన విషయము ఇడ్లీలు, దోసలూ, పకోడీలూ రుచిగా ఉండడమే కాకుండా, సమృద్ధిగా ఉండడం కూడా. పకోడీల సువాసన రావడంతో సూరి బాబు కాళ్ళు వాటంతట అవే అటు వైపు దారి తీశాయి.
మళ్ళీ మళ్ళీ ఏం వస్తాంలే అని సూరి బాబు ఒక 5 platesలో రక రకాల పదార్థాలు నింపుకొని, ఒక plate మీద ఇంకోటి పెట్టుకుని చాలా మెల్లగా సంజయ్ వాళ్ళు కూర్చున్న table వైపు బయలుదేరాడు.
దారిలో ఎదురయిన waiter విశాలంగా నవ్వుతూ, “ఏంటి సార్? అలా కష్టపడుతున్నారు? హెల్ప్ కావాలా?” అన్నాడు. waiter గొంతులో కొద్దిగా వెటకారం ఉన్నట్టు అనిపించి ఐదు ప్లేట్ల వెనుకాతల నుంచి ఎంత క్రూరంగా చూడచ్చోఅంత క్రూరంగా చూశాడు, సూరి బాబు.
“అక్ఖర్లేదు, అసలు ఇంకో రెండు ప్లేట్స్ తెచ్చుకుందామనుకున్నా కానీ, దారి కనపడదు అని వదిలేశా. No thank you!” అన్నాడు సూరి. waiter, “సరే సార్. okay సార్,” అని పక్కకు తప్పుకున్నాడు.
సంజయ్, గౌళ సూరి బాబుని చూసి openగానే నవ్వేసారు. “ఏంట్రా ఆ కక్కూర్తి? మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చుగా? ఫుడ్ ఎక్కడికీ పోదులే,” అన్నాడు సంజయ్.
“నోరు ముయ్యరా! నీకేం తెలుసు మా బాధలు? మా ఊర్లో అయితే ఇంత ఫుడ్ తినడానికి నా కారు అమ్మేయాల్సి వస్తుంది, తెలుసా? పైగా అక్కడ ఈ రోజు ఫుడ్ తినాలంటే ఎల్లుండి వెళ్ళాలి,” ఏ మాత్రం మొహమాట పడకుండా పకోడీల మీద దాడి చేశాడు సూరి.
అప్పుడే పక్కనున్న ఒక నడివయస్కుణ్ణి చూసి ఉలిక్కి పడ్డాడు సంజయ్. సూరిబాబుతో, “ఒరేయి, ఆయనతో అస్సలు మాట్లాడకు, ప్రమాదం!” హెచ్చరించాడు.
“ఎందుకు?” అని సూరి బాబు అడుగుతూండగానే, ఆయన వాళ్ళ వైపు వచ్చేశాడు.
(సశేషం)
అమెరికాలో ఆపసోపాలు – 5 (AMWAY? NO THANKS! NO WAY!!!)
“Hello, hello, ఏంటి డిన్నర్‌కని వచ్చారా?” పక్కనుంచి chair లాక్కుని కూర్చుంటూ ప్రశ్నించాడు ఆయన. “లేదు, అందరూ తినేంత వరకూ కూచుని వాళ్ళ ఎంగిలి పళ్ళాలు కడుగుదామని వచ్చాం,” కసిగా సమాధానం ఇచ్చాడు సంజయ్.
“హబ్బా, హబ్బా, మీరు భలే జోకులు వేస్తారండి, చిలిపి,” అని ఆయన సూరి బాబు వైపు తిరిగి, “Hello, నా పేరు వ్యాపార రావు. మరి మీ పేరో?” అని అడిగాడు.
సూరి బాబు, “మీరు మా ఇంటి వెనుకాతల ఉండేవాళ్ళా? మీఇంట్లో జామ చెట్లూ, గట్రా ఏవైనా ఉండేవా?” కొద్దిగా భయం భయంగా అడిగాడు.
“ఒక వేళ ఉంటే ఇప్పటికి గుర్తు పట్టి ఉండేవాడిని కాదండీ! ఐనా వెధవది, మనుషులు స్నేహితులు కావాలంటే పక్క పక్క ఇళ్ళల్లోనే ఉండాలేవిటి? స్నేహం అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. ఇప్పుడు ఉదాహరణకు, మిమ్మల్ని చూస్తూంటే నాకు ఎప్పట్నుంచో బాగా తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నారు,” గద్గదంగా అని కళ్ళు తుడుచుకున్నాడాయన.
“మరే, ఆరు నెల్ల కింద, మనమిద్దరం మొదటి సారి కలిసినప్పుడు, నాతో కూడా ఇలానే అన్నారు,” అన్నాడు సంజయ్. “మీ ఫ్రెండ్‌కి మాంచి sense of humor,” అని సంజయ్‌ని అస్సలు పట్టించుకోకుండా, “ఇవిగోండి, మా family photos,” తన walletలో నుంచి తీసి ఇచ్చాడు ఆయన.
సూరి బాబు వాటిని చూసి “బాగున్నాయండీ,” అన్నాడు ఏమనాలో తెలీక. “మరే, మీరే కాదు, చూసిన వాళ్ళంతా అలానే అంటారు. అంతా మీ అభిమానం,” అని, “ఇదిగోండి నా business card. మీ number ఇవ్వండి,” pen పట్టుకుని ready అయిపోయాడు ఆయన.
“మా వాడికి ఇక్కడ ఇంకా number లేదు. అసలు వీడు ఇక్కడ ఉండడు. వీణ్ణి వదిలేయండి,” అన్నాడు సంజయ్. “మీరు మరీనూ! నేనేమన్నా మీ friendని కొరుక్కు తినేస్తానా? మా ఇంటికి ఈ శనివారం భోజనానికి పిలవడానికోసం నేను అడిగేది,” అని “సూరి బాబు గారు! మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఆవిడ కూడా మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తుంది.ఆ రోజు మనం ఇంచక్కా బోల్డు సేపు మాట్లాడుకోవచ్చు. నేను సంజయ్‌గారి ఇంటికి call చేసి మీకు గుర్తు చేస్తాను లెండి,” అని లేచాడు ఆయన.
“మేము ఈ weekend ఊళ్ళో ఉండడంలేదు. చెట్లు, పుట్టలు పట్టుకొని camping tripకి వెళ్తున్నాం,” ఆఖరి ప్రయత్నం కింద protest చేశాడు సంజయ్. “ఈ Saturday! మర్చిపోకండే”, అని వ్యాపారరావు restaurant బయటకి నడిచాడు.
“అవున్రా, ఆయన అంత ఆప్యాయంగా మాట్లాడుతూంటే, నువ్వేమిట్రా అలా అంత వెటకారంగా ఉన్నవు?” అడిగాడు సూరి బాబు. “ఒరే సూరీ! నీకు తెలీదురా. ఆయన ఎవరనుకున్నావు? Amway networkలో ఉన్నాడు. కనపడిన ప్రతివాడినీ పట్టుకుని, member చేయడమే ఆయన జీవిత ధ్యేయం. చాలా ప్రమాదం,” హెచ్చరించాడు సంజయ్.
“Amwayనా? అదేదో networking business కదూ?” అన్నాడు సూరి.
“అవున్రా, అదే! నువ్వు ముందస్తుగా ఆరు మందిని members చేయాలి. వాళ్ళలో ఒక్కొక్కరు చెరేసి ఆరు కొత్త membersని చేయాలి. వాళ్ళు ఇంకో ఆరు…” అంటున్నసంజయ్‌ని మధ్యలోనే అడ్డుకొని, “విషయం అర్థమయ్యిందిలే. అలా చేస్తే ఏమవుతుంది?” అడిగాడు సూరి.
“అందరు members నెలకు ఇంత డబ్బు పెట్టి Amway products కొనాలి. అప్పుడు అందులో నీకు కొంత commission వస్తుంది….” మిగతా process అంతా explain చేశాడు సంజయ్.
“ఏడిసినట్టుంది. ఇలాంటి schemes మన Indiaలోనూ ఉన్నాయి కద. నువ్వు ప్రతి ముగ్గురిని members చేయడం, వాళ్ళు ఇంకో ముగ్గురిని…” సూరి బాబు చెబుతూండగానే మధ్యలోనే సంజయ్, “కానీ, సూరీ, ఇందులో ఒక బాధ ఉంది. ఒకవేళ పీల్చే గాలి కొనాల్సి వస్తే అది కూడా Amway దగ్గరనుంచే కొనుక్కుంటారు ఈ Amway members. పైగా ఒకప్పటి స్నేహితులు వీళ్ళని చూస్తే పరుగు లంకించుకుంటారు. కానీ వీళ్ళు పట్టించుకోరనుకో. అందుకే నేనంత దురుసుగా మాట్లాడాను ఆయనతో,” అన్నాడు.
“మొత్తానికి మీ bay area భలే eventfulగా ఉందిరా. ఇక పద. నాకన్నిరకాలుగా కడుపు నిండింది,” అన్నాడు సూరి బాబు. ముగ్గురూ బయటకు నడిచారు.
(సశేషం)
Comments (5)