Archive for the ‘జ్వాలా ద్వీప రహస్యం’ Category

జ్వాలా ద్వీప రహస్యం – 1


“రాజాధి రాజ, రాజ మార్తాండ, విజయీ భవ దిగ్విజయీ భవ!”

“ప్రపంచమంతా పనులలో మునిగినది. జాగు చేయక ఇక నిదుర లెమ్ము ప్రభూ!”

“తండ్రి గారు కొలువు తీర్చినారు. తరుణం మించిపోయినది దేవరా!”

ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు నరస సింహుడు. “చీ, చీ, తెల్లవారినట్టు ఉంది. ఒక్క రోజు కూడా వదలకుండా ఏతెంచుతుంది ఈ నికృష్ట బృందం,” తనలో తాను గొణుకున్నాడు కోపంగా.

నరస సింహుడు దోమదేశానికి యువరాజు. తండ్రి నీరస సింహుడి తరువాత దోమదేశానికి కాబోయే రారాజు.

దోమదేశంలో ఆచారాలు ఎక్కువ. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. నిద్ర లేచినప్పటినుంచి మళ్ళీ పడుకునే వరకూ రక రకాల రివాజులు పాటించాలి.

“మీ ముఖములు వేడెక్కు గాక!! ప్రతి రోజు ఇలా నన్ను నిద్ర లేపడం ఏమన్నా బాగున్నదా?” దీనంగా అడిగాడు నరస సింహుడు.

“మమ్మల్ని ఏమి చేయమందురు ప్రభూ! ఇది రాజు గారి ఆజ్ఞ. ఐనా ఈ కరువు కాలంలో మా ఉద్యోగ భద్రత మేము చూసుకొనవలె కద. మీరు తొందరగా నిద్ర లేస్తే మేమంతా ఇంటికి వెళ్ళి శయనించుతాం,” వినయంగా చెప్పాడు బృంద నాయకుడు.

“ఏమీ? నాకు నీతి వాక్యములు బోధించి మీరు ఇంటికి పోయి నిద్ర పోవుదురా, అక్కటకటా!” బాధగా అన్నాడు నరస సింహుడు.

“యువరాజా వారికి చలి ఎక్కువ అయినట్లు ఉన్నది. పళ్ళు టక టకా కొట్టుకొనుచున్నవి,” ఆందోళనగా అన్నాడు బృందంలో ఒకడు.

“మీ ముఖము! నా ఆశ్చర్యమును ప్రకటించుటకు నేనే అక్కటకటా అంటిని,” కోపంగా గర్జించాడు నరస సింహుడు.

“ఇక మేము వెళ్ళి వచ్చెదము ప్రభూ. వేప పుల్లలూ, ఇటుక రాతి పొడులతో దంత ధావన బృందం ఏతెంచినది,” అని మనవి చేసి తన బృందంతో అక్కడినుంచీ నిష్క్రమించాడు మేలుకొలుపు బృంద నాయకుడు.

“నహీ!!” సంస్కృతంలో పొలి కేక పెట్టాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 2


దంత ధావన బృందం వెళ్ళిపోయాక, సాముహిక స్నాన బృందం వచ్చి నరస సింహుడికి సర్వాంగ స్నానం కావించారు. ఆ తరువాత వైవిధ్య వస్త్రధారణ బృందం వచ్చి రాజ వస్త్రాలు తొడిగారు. ఆ తరువాత అల్పాహర బృందం వచ్చి వొంటికి మంచిది కాబట్టి ముందుగా కొంత ఆముదం తాగించి, ఆ తరువాత రెండు జొన్నె రొట్టెలు తినిపించారు.

“హమ్మయ్యా, ఈ రోజుకి బృంద దాడులు ముగిశాయి,” అని ఆనంద పడేంతలో ప్రాతిగామి వచ్చి, “జయము జయము యువరాజా వారికి! మహారాజు మిమ్మల్ని సభకి విచ్చెయ్యమంటున్నారు,” అన్నాడు.

సభకు విచ్చేయక తప్పలేదు నరస సింహుడికి. సభలో అతని పితాశ్రీ నీరస సింహుడు ఎత్తైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన్ని చూడడానికి నరస సింహుడికి తలెత్తి చూడాల్సి వచ్చింది.

“రండి యువ రాజా వారూ, మా పక్కన ఉన్న ఉన్నతాసనాన్ని అధిరోహించండి,” అన్నడు అప్యాయంగా నీరస సింహుడు.

దాని మీద కూర్చున్నాక కొంత తండ్రి ముఖము దగ్గరగా, స్పష్టంగా కనిపించసాగింది నరస సింహుడికి. వడలి పోయి ఉన్న తండ్రి మొహం చూసి ఆందోళనగా, “ఏమయ్యింది పితాశ్రీ, నీరసంగా ఉన్నారు,” అని వెంటనే నాలుక కర్చుకున్నాడు నరస సింహుడు.

“అహో యువరాజావారూ! ఆ పదం మాకు గిట్టదు అని మీకు తెలుసు కద. వినగానే మా పేరు మాకు గుర్తుకి వస్తుంది. మా తండ్రిగారికి తెలుగు భాషా జ్ఞానం సరిగ్గా లేక, అన్ని రసాలు కలిసిన నీరసం అగునని, ఒక అపోహతో మాకా పేరు పెట్టినారు. ఆయన తరువాత స్వర్గస్తులైనప్పటికీ, ఆయన పెట్టిన పేరు మాకు ఇంకనూ నరకం చూపించూనే ఉన్నది,” నిట్టూర్చాడు నీరస సింహుడు.

“అవును నాన్నగారూ, ఇంత పొద్దునే సభ ఏల ఏర్పాటు చేసితిరి?” అడిగాడు నరస సింహుడు.

“మన నుంచి న్యాయం కోరుటకు వచ్చు వారంతా కార్మికులూ కర్షకులూ కద! వారు పొద్దున్నే లేచి పనులకు పోవుదురు. దానికి ముందు ఏదైనా సమస్య పరిష్కారం కోసం మన వద్దకు వచ్చుదురు. వారి సౌకర్యార్థం ఇటుల ఏర్పాటు చేసితిని,” బదులిచ్చ్చారు రాజా వారు.

“ఓహో, ఐతే ఏ మాత్రము పని లేని వారం మేమే అన్న మాట,” అనుకున్నాడు తనలో తాను నరస సింహుడు.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 3


ముందుగా ముగ్గురు సామాన్యులు రాజ దర్బారులోకి ప్రవేశించారు. రాగానే నీరస సింహుడికి జయ జయ ధ్వానాలు చేసి ఆయన ముందు నేల మీద బొక్క బోర్ల పడ్డారు.

“అభయం ఇస్తున్నా! మీ సమస్య ఏమిటో చెప్పండి,” అన్నాడు నీరస సింహుడు.

ఆ ముగ్గురూ అలానే నేలను కావలించుకునే ఏదో గొణిగారు. నీరస సింహుడికి కోపం ముంచుకొచ్చింది.

“మీ అతి వినయం చాలించి ముందు లేచి నిలబడుడు! మీ ముఖములే సరిగ్గా కనిపించకున్న, మీ సమస్యలను నేను ఎట్లు తీర్చగలను?” అని హూంకరించాడు.

“లేచి నిలబడిననూ పెద్దగా ఒరుగునది ఏమియూ లేదు. ఇంత ఎత్తునుంచి ఎవరి ముఖమూ ఎలాగూ కనిపించదు,” తనలో తాను గొణుక్కున్నాడు నరస సింహుడు.

“యువరాజా వారు ఏదో అనుచుంటిరి?” ప్రశ్నార్థకంగా చూశాడు నీరస సింహుడు.

“ఏమియునూ లేదు. వారికి పాపం న్యాయం కలిగించుడు,” అన్నాడు నరస సింహుడు.

“లెస్స పలికితిరి. ప్రజలారా, మీ సమస్య ఏమిటి?” అప్పటికి లేచి నిలబడి వున్న ఆ ముగ్గురినీ అడిగాడు రాజు.

“మేము ముగ్గురం అన్నదమ్ములం ప్రభూ!” మొదలు పెట్టాడు వారిలో అందరికంటే పెద్ద వయస్కుడు.

“ఇదే మీ సమస్యనా?” ఆశ్చర్యపోయాడు నీరస సింహుడు. “దానికి మేమేమి చేయగలము? అది దైవ నిర్ణయం కద! ఈ జన్మకు ఇటులనే సర్దుకొనుడు,” అని సలహా ఇచ్చాడు.

“సమస్య అది కాదు మహా రాజా! మా తండ్రిగారు చనిపోతూ నాలుగు ఏనుగులు వదిలిపోయినారు. మా ముగ్గురినీ సమానంగా పంచుకొమ్మనినారు. కానీ మేము ఉన్నది ముగ్గురం. ఏనుగులు నాలుగు. ఈ సమస్యను ఎటుల పరిష్కరించుటయో మాకు తెలియక మీ వద్దకు వచ్చితిమి,” వినయంగా సమాధానం ఇచ్చాడు పెద్ద వాడు.

“చిత్రమైన సమస్యనే! యువరాజా వారు, మీరు కలుగజేసుకుందురా?” తనయుడిని అడిగాడు మహారాజు.

“ఈ సమస్యను రెండు రకములుగా పరిష్కరించవచ్చు,” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“ఏమీ? రెండు పరిష్కారములు ఉన్నావా? మాకు ఒక్కటియే తోచుటలేదే?” ఆశ్చర్యంగా అన్నాడు నీరస సింహుడు.

“అవును. మొదటిది ఆ నాలుగింటిలో ఒక ఏనుగుని చంపి వేయుట. అప్పుడు ముగ్గురు అన్నదమ్ములూ చెరొక ఏనుగుని తీసుకోవచ్చు,” నాటకీయంగా ఆగాడు నరస సింహుడు.

అన్నదమ్ముల మొహాల్లో కళ తప్పింది అది వినగానే.

“లేదా, ముగ్గురు అన్న దమ్ములలో ఒకరిని చంపుట. అప్పుడు మిగిలిన ఇద్దరూ చెరి రెండు ఏనుగులు తీసుకొనవచ్చును,” ముగించాడు నీరస సింహుడు.

ఈ సారి అన్న దమ్ముల మొహాల్లో భయం స్పష్టంగా కనిపించింది.

“భళా కుమారా!” మెచ్చుకున్నాడు నీరస సింహుడు.

“ఈ చంపుటలు ఎందుకు లెండు ప్రభూ. నా మాట వినుడు. సమస్యని పరిష్కరించినందుకు మీరే ఒక ఏనుగును గై కొనుడు. మిగిలిన మూడింటిని మేము గై కొని ఇక్కడ నుండి గైరు హాజరు అగుదుము,” తొందర తొందరగా అని తన తమ్ములతో కలిసి శరవేగంగా అక్కడినుంచి నిష్క్రమించాడు పెద్ద వాడు.

“సొబగు సొబగు,” ఆనందించాడు మహారాజు.

“ఎరక్క పోయి న్యాయము కొరకూ ఇక్కడికి వచ్చితిమి. బాగుగానే దుగ్ధ తీరినది,” రాజుగారి కోట ద్వారం దాటుతూ తనలో తాను అనుకున్నాడు ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్ద వాడు.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 4


ఆ తరువాత గంట గడిచినా కొత్త ఫిర్యాదీలు ఎవరూ రాలేదు.

“చిత్రముగానున్నది. దోమదేశంలో ఎవరికీ సమస్యలే లేవా?” ఆశ్చర్యపోయాడు నీరస సింహుడు.

“బహుశా మీ సమస్యా పరిష్కారం గురించి ఆ ముగ్గురు అన్నదమ్ములూ ప్రజలందరిలో చాటినారేమో ప్రభూ!” రాజు గారికి కనపడకుండా పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు మంత్రి వృద్ధ భట్టు.

“నిక్కము, నిక్కము! యువరాజా వారి బుధ్ధి కుశలత గురించి విని అందరు నివ్వెర పోయి ఉంటారు,” గర్వంగా అన్నాడు నీరస సింహుడు.

“వారికి కలిగిన రక రకాల భావాలలో తప్పని సరిగా ఆశ్చర్యం కూడా ఒక భావం అయి ఉండవచ్చు మహారాజా!” నర్మగర్భంగా జవాబిచ్చాడు వృద్ధ భట్టు.

“సొబగు సొబగు,” ఉటంకించాడు నీరస సింహుడు.

“ఎన్ని రోజులనుంచో నాకొక సందేహం పితాశ్రీ. సొబగు అన్న పదమునకు అర్థమేమి?” అడిగాడు నరస సింహుడు.

“మా తండ్రిగారు ఆయనకు ఏదైననూ నచ్చినచో, ఇలా అనెడి వారు. అందుకే నేనునూ అలవాటు చేసుకొంటిని,” సమాధానమిచ్చాడు నీరస సింహుడు.

“అటులైన నేనునూ అలవాటు చేసుకొనెదను,” అన్నాడు నరస సింహుడు.

“సొబగు సొబగు,” ఆనందం వెలిబుచ్చాడు మహారాజు.

“మన తరువాయి కార్యక్రమం ఏమి, ఆమాత్యా?” వృద్ధ భట్టుని అడిగాడు నీరస సింహుడు.

“ఈ రోజు యువరాజా వారు వీర బాహుడితో కత్తి యుద్ధంలో తలపడి కొత్త మెళకువలు నేర్చుకొనవలె. ఇప్పుడు మనమందరం వ్యాయమ శాలకు విజయం చేస్తున్నాం,” వివరించాడు వృద్ధ భట్టు.

ఉలిక్కి పడ్డాడు నరస సింహుడు. “అది ఈ రోజా? నేను రేపు అనుకొంటినే? నాకు ఈ రోజు కాస్త నీరసముగానున్నది,” ఆందోళన వెలిబుచ్చాడు.

“కుమారా ఆ పదము వలదంటిని కద!” గర్జించాడు నీరస సింహుడు.

“మన్నించుడు! బలహీనముగా ఉన్నది,” సర్దుకున్నాడు నరస సింహుడు.

“రాచ బిడ్డ నోటి నుండి బలహీనము అనే మాట వెలువడ కూడదు, కుమారా!” బాధగా అన్నాడు మహారాజు.

“అటులనా? నోటితో చెప్పుట తప్పైన తాళపత్రము మీద రాసి ఇచ్చెదను. అప్పుడు ఫరవాలేదా?” ఆశగా అడిగాడు నరస సింహుడు.

“అహో కుమారా! నువ్వు నన్ను అపార్థం చేసుకొంటివి. నా ఉద్దేశం కాబోయే రాజు బలహీనతను దగ్గరకు రానీయకూడదు అని.”

“కావచ్చును, కానీ గత వారము వీరబాహుడు కత్తి యుద్ధంలో మెళకువలు నేర్పుతూ, మా దేహమున పెట్టిన గాట్లు ఇంకనూ మానలేదు.”

“మన రాచ దేహములు ఉక్కు వంటివి. మామూలు కత్తి గాట్లు వాటిని బాధించకూడదే?”

“అది మీకు తెలుసునూ, నాకు తెలుసునూ. కానీ దేహమునకు తెలియదు కద! అది బాధపడుతూనే ఉన్నది,” వినయంగా సమాధానమిచ్చాడు నరస సింహుడు.

“అందుకే కుమారా! ఇంకొక్క ఆరు మాసములు వీరబాహుడి వద్ద మెళకువలు నేర్చుకున్న మీ దేహమును గాట్లు బాధింపవు,” చెప్పాడు నీరస సింహుడు.

“కాబోలు. వీరబాహుడి రీతి చూచుచున్న, ఇంకొక్క మూడు మాసములలోనే వొంటినిండా గాట్లు పెట్టి, నన్ను స్వర్గస్తుడిని చేయుట ఖాయము. అప్పుడు ఆరు మాసముల తరువాత బాధ పడుటకు దేహమే ఉండదు కద!” తనలో తాను గొణుక్కున్నాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

జ్వాలా ద్వీప రహస్యం – 5


వ్యాయమ శాల కొత్త పట్లు నేర్చుకుంటున్న మల్ల యోధులతో, సాము గరిడీలు చేస్తున్న యువకులతో చాలా హడావుడిగా ఉంది. నరస సింహుడిని చూడగానే వాళ్ళంతా, “యువ రాజ వారికి జై, నరస సింహుల వారికి జై,” అంటూ పెద్ద పెట్టున కేకలు పెట్టారు.

“నా అదృష్టం బాగుండి నన్ను రోజూ వ్యాయామం చేసేలా పురి కొల్పడానికి తండ్రిగారు వీళ్ళతో ఒక వ్యాయామ బృందం ఏర్పాటు చేయించలేదు. ఈ దుష్టులవి నిజముగానే కంచు కంఠములు,” తనలో తాను అనుకున్నాడు నరస సింహుడు.

“వీరబాహుడు కనిపించుట లేదు. ఏడీ?” అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళని మహారాజు.

“ఈ రోజు యువరాజా వారితో కత్తి యుద్ధం కద! అందులకే పొద్దుటి నుంచి కత్తి పదును పెట్టుచున్నాడు,” చెప్పాడు ఒక పౌరుడు.

“పదును చేయుట ఎందుకు? నా చర్మం అంత దళసరి కాదే,” అన్నాడు నరస సింహుడు కాస్త కోపంగా.

“అదుగో వీర బాహుడు మాటల్లోనే విచ్చేసినాడు,” ఆనందంగా అన్నాడు వృద్ధ భట్టు.

వీర బాహుడు రాగానే వంగి వంగి వాళ్ళకి నమస్కారాలు పెట్టాడు.

“కత్తి బాగా పదును అయినదా?” కాస్త వ్యంగ్యంగా అడిగాడు నరస సింహుడు.

“ఇంతకంటే పదును చేయుట ఇంక ఎవరి వల్లా కాదు,” గర్వంగా బదులిచ్చాడు వీర బాహుడు.

“ఇక కత్తి సాము మొదలు పెట్టుడు,” ఆజ్ఞాపించాడు మహా రాజు.

గోదాలోకి వీర బాహుడూ, నరస సింహుడూ ప్రవేశించగానే అందరూ ఉత్సాహంగా చుట్టూ గుమిగూడారు.

నరస సింహుడు తన కత్తిని ఒర నుంచి బయటకు తీసేంతలోపల, వీర బాహుడు శరవేగంగా తన కత్తితో అతనికి ఒక గాటు పెట్టాడు.

“ఓరి తుళువా! ఇంకా కత్తి సాము మొదలు కానే లేదు కద, అప్పుడే గాటు ఏల పెట్టితివి?” అరిచాడు నరస సింహుడు.

“మన్నింపుడు! కత్తి ఎంత పదును ఎక్కినదో తెలుసుకొనుటకు అటుల చేసితిని,” వినయంగా బదులు ఇచ్చాడు వీర బాహుడు.

“నీ ముఖం వేడెక్కుగాక. కాసుకో!” అని అరుస్తూ, కత్తి ఝళిపిస్తూ ముందుకు దూకాడు నరస సింహుడు.

ఆ తరువాత ఎప్పుడూ జరిగేదే జరిగింది. పది నిమిషాలలో నరస సింహుడు వొళ్ళంతా రక్త సిక్తమై మట్టి కరిచాడు.

“భళా! ఈ రోజు సాధన కడు రసవత్తరముగా సాగినది,” మెచ్చుకున్నాడు నీరస సింహుడు.

“ఈ రోజు యువరాజా వారు విజృంభించినారు మహారాజా! వీర బాహుడి చిటికెన వేలిని గాయ పరిచినారు,” విన్నవించాడు వృద్ధ భట్టు.

“శభాష్ కుమారా!” మెచ్చుకున్నాడు నీరస సింహుడు.

“వీరి ఆనందం తిరునాళ్ళకు పోవుగాక. వాడు నాకు పెట్టిన పాతిక గాట్ల గురించి వీరికి కించిత్తు కూడా పట్టింపు ఉన్నట్టు లేదు,” మూలిగాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers