Archive for the ‘బట్టతల’ Category

బట్టతల ముచ్చట్లు

ఈ సీరియల్‌ని ముందునుంచి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించిన పాఠకులకందరికీ నా ధన్యవాదాలు.

నేను ప్రతి కామెంట్‌కి బదులు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి కామెంట్, అది చిన్నదైనా, పెద్దదైనా, తప్పని సరిగా చదివానని అని ఈ పోస్ట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను. Each comment of yours has truly encouraged me and kept me going.

ఇలాంటి పెద్ద సీరియల్ ఎప్పుడు రాస్తానో తెలీదు కానీ, అడపా దడపా హాస్యం ప్రధానమైన ఎలిమెంట్‌గా, మరి కొన్ని టపాలు తప్పకుండా రాస్తాను.

జై జంబూ ద్వీప్!

-మురళి

బట్ట తల వచ్చేసిందే బాలా – 1


“బట్ట తల వచ్చేసిందే బాలా, కష్ట దశ తెచ్చేసిందే చాలా! ఇష్ట సఖి ఎట్లా దొరుకును నువ్వే చెప్పు? జుత్తు ఉన్నప్పుడు నీలగడం మనదే తప్పు! బట్ట తల వచ్చేసిందే బాలా!” అని తనలో తాను పాడుకుంటూ షేవ్ చేసుకుంటున్నాడు పాపారావు.

మా ముగ్గురి గుండెలు ఉసూరుమన్నాయి ఆ ఆ పాట వినగానే.  పాపారావు గాడికి వెనక రెండూ, పక్కన రెండూ పీచులు తప్ప ఇంకేమీ మిగల్లేదు కాబట్టి, వాడు అలాంటి పాటలు పాడుకోవచ్చు, కానీ అటూ ఇటూ కాని స్టేజ్‌లో ఉన్న మేమేం చేసేది? 

మేము నలుగురం రూం-మేట్స్. పాపారావు, నారాయణ్, శేఖర్, నేను. ఎవ్వరికీ పెళ్ళి కాలేదు. సో, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మేము, బట్ట తల గురించి ఎవరన్నా గుర్తు చేస్తే చాలు, బాగా ఆందోళన పడడం చాలా సహజమే.

“ఛీ నోర్ముయ్యరా పాపిగా,” అరిచాడు నారాయణ్. తన ఫ్లోలో తాను వెళ్ళిపోతున్న పాపారావు టక్కున ఆపాడు. “ఏం? ఎందుకాపాలి? ఇంట్లోని కళాకారుడినే గౌరవించలేనప్పుడు మీరు అసలు కళామాతల్లిని ఎలా గౌరవిస్తారు?” ఆవేశంగా అడిగాడు.

“ఇది కళకు సంబంధించిన ఆక్రందన కాదు. నువ్వు పాడుతున్న సబ్జెక్టుకి సంబంధించిన శోకం. కావాలంటే ఇంకేదన్నా పాడుకో, చేతులు అరిగే దాకా చప్పట్లు కొడతాం,” మెల్లగా చెప్పాడు శేఖర్.

ఈ డీలేదో బాగానే ఉంది అనుకున్నాడేమో, వెంటనే గేరు మార్చి, “ఒకటే రాగం, ఒకటే ట్యూనూ, ఒక పాటాంటూ వింటే అన్నీ విన్నట్టే! మరువకుమా ఆనంద్ చిత్రాన్ని చూసేటి వేళా ఈ విషయం,” అని అందుకున్నాడు. మేమందరం తృప్తిగా తలాడించాం.

(ఇంకా ఉంది)

బట్ట తల వచ్చేసిందే బాలా – 2

మా నలుగురికీ ఒక మంచి అలవాటుంది. అదేంటంటే పగలంతా ఎక్కడ ఎలాంటి తిరుగుళ్ళు తిరిగినా రాత్రి అందరం పడుకునే ముందు ఒక గంట పిచ్చాపాటీ మాట్లాడి ఒకరి యోగ క్షేమాలు ఇంకొకరం విచారించుకుంటాం.

ఈ పధ్ధతిలోనే భాగంగా శేఖర్ పాపారావుని అడిగాడు. “అవునురా గత వారం పెళ్లి చూపులని మీ ఊరెళ్ళావు కద . ఏమయ్యింది?” అంటూ.

“ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి,” మెల్లగా అన్నాడు పాపారావు.

“గుడ్ న్యూసే చెప్పు. బ్యాడ్ న్యూస్ ఎలాగూ మామూలే కద,” అన్నాను నేను. ఇది పాపారావు 212వ పెళ్లి చూపులు.

“వెరైటీగా ఉంటుందని ఈ సారి నేనే ముందు వెళ్ళాను. లోపల వెళ్ళగానే పెళ్ళి కూతురు ఎదురయ్యింది. తన ఫోటో చూశాగా. గుర్తు పట్టాలే. ఐతే తనే నా ఫోటో సరిగ్గా చూడనట్టుంది. ‘రండి మావయ్య గారూ రండి. మీరే ఇంత చార్మింగ్‌గా ఉన్నారంటే, మీ అబ్బాయి ఇంకెలా ఉంటాడో’ అంది,” చెప్పాడు పాపారావు.

“ఇది గుడ్ న్యూసా?” నోరు తెరిచాను నేను.

“కాదేటి? నేను అందంగా ఉన్నాను అని రికగ్నైజ్ చేసింది కద?” ఆనందంగా అన్నాడు పాప్స్ ఉరఫ్ పాపారావు.

“మరి బ్యాడ్ న్యూస్ ఏంటి?” అయోమయంగా అడిగాను నేను.

“నన్ను చూసి మా నాన్ననుకుంది. బ్యాడ్ న్యూస్ అంటూ వేరేగా చెప్పాలా?” కొర కొరా చూస్తూ అన్నాడు పాపారావు.

“ఓహ్, ఐతే నీ బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ రెండూ ఒకటేనన్న మాట,” సాలోచనగా అన్నాను నేను.

“మరి ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం?” అడిగాడు నారాయణ్.

“ఈ బట్ట తల వల్ల అడ్డంగా దొరికిపోయా గురూ. లేకపోతే నా ఫేస్ బ్యూటి ఏం తక్కువ కాదు అని ఆ అమ్మాయి తేల్చేసింది కద. ఇది ఎలాగైనా సాల్వ్ చేయాలి,” అన్నాడు పాపారావు.

“ఐతే నీకు శ్రమ తెలియకుండా ఒక సలహా ఇస్తాను విను,” అన్నాడు గంభీరంగా నారాయణ్.

(ఇంకా ఉంది)

బట్ట తల వచ్చేసిందే బాలా – 3

“పూర్వం దక్షిణ భారత దేశంలో, హైదరాబాద్ అనే నగరంలో, గుర్నాథం అనే ఒక యువకుడుండేవాడు,” మొదలెట్టాడు నారాయణ్.

“ఆగు! సలహా అన్నావు! ఇదేదో కథలా ఉంది. అయినా పూర్వం అంటే ఎంత పూర్వం?” అడ్డు పడ్డాడు పాపారావు.

“అంటే 2007లో.”

“అది పూర్వమా? ఏడ్చినట్టుంది. లాస్ట్ ఇయరే కద!”

“నాకు తెలిసి కథలు అలానే మొదలెడతారు!” క్రూరంగా చూస్తూ అన్నాడు నారాయణ్.

“అబ్బా ఇప్పుడు ఫార్మాట్ అంత అవసరమా? మెసేజ్ ముఖ్యం. ముందు పూర్తిగా వినరా,” అరిచాడు శేఖర్.

“సరే సరే, గుర్నాథం ఉండేవాడు. తరువాత?” రాజీ పడిపోయి అడిగాడు పాపారావు.

“ఏముంది! చాలా రోజులు అలానే ఉన్నాడు. ఇన్ ఫ్యాక్ట్, నీలా బట్టతల వచ్చేవరకూ అలానే ఉన్నాడు. ఆ తరువాత ఉండలేక పోయాడు,”  కంటిన్యూ చేశాడు నారాయణ్.

“ఎందుకు ఉండలేకపోయాడు? నాలా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండచ్చు కద,” మళ్ళీ అడ్డు పడ్డాడు పాపారావు.

ఈ సారి పాపారావు పీక నులమడానికి ముందుకు దూకిన నారాయణ్‌ని నేనూ, శేఖరూ లాగేశాం.

“మొత్తం విన్నాక ఇవ్వచ్చుగా నీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్? నీ పాటలు ఓపిగ్గా విని మేమందరం చప్పట్లు కొట్టట్లేదా?” కొర కొరా చూశాడు నారాయణ్.

“ఇంక అడ్దు పడడులేరా, నువ్వు కానివ్వు,” అన్నాను నేను.

“అలా గుర్నాథానికి బట్టతల వచ్చాక, ఉండబట్టలేక తిరిగి జుత్తు మొలిచే మార్గాలు అన్వేషించాడు. ఆఖరికి ఎవరో నాటు వైద్యుడు చెప్పాడని ఒక ఊర పిచ్చుక లేహ్యాన్ని గుండంతా పూసుకున్నాడు. కానీ ఏది పని చెయ్యలేదు. అప్పుడు గుర్నాథానికి ఎవరో చెప్పారు కేశానంద స్వామి గురించి.”

“కేశానంద స్వామా!” అప్రయత్నంగా అన్నాను నేను.

ఏ మూడ్‌లో ఉన్నాడో నారాయణ్ పట్టించుకోలేదు. “అవును కేశానంద స్వామే, మనలాంటి వాళ్ళకు కళ్ళు కుట్టేలా వొంటినిండా జుత్తే, బొటనవేలినుంచి బోడి గుండు దాకా. మన గుర్నాథం అంతేసి జుత్తు ఉన్న స్వామి వారిని చూసి సాష్టాంగ ప్రణామం చేశాడు. స్వామి వారు సంతోషించి ఒక పెద్ద సీసాడు హిమాలయ మకరంద తైలాన్ని ఇచ్చారు. ఒక నెల రోజుల్లో గుణం కనిపిస్తుంది అని చెప్పారు. మరుసటి రోజే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారు. గుర్నాథం ఠంచనుగా ప్రతి రోజు ఆ తైలాన్ని తలకి పట్టించాడు,” ఊపిరి తీసుకోవడానికి ఆగాడు నారాయణ్.

“ఆ తరువాతేమయ్యింది?” ఉత్కంఠగా అడిగాను నేను. పాపరావు గాడి గుడ్లు బయటకు వచ్చాయి టెన్షన్‌తో. వాడు మాట్లాడే పొజిషన్‌లో కూడా లేడు.

“నెల రోజుల తరువాత గుర్నాథం గుండు మీద, ముళ్ళపంది వొంటి మీద పొడుచుకొచ్చినట్టు ఒక లావాటి వెంట్రుకలు పది చోట్ల పొడుచుకొచ్చాయి. దానితో వాడి పరిస్థితి మరీ బ్యాడ్ అయిపోయింది. తైలం వికటించిందన్న మాట. ఆఖరికి మునుపటిలా బట్టతల తెప్పించుకోవడానికి లక్షలు పోసి ఆపరేషన్ చేయించుకుని వాటిని పర్మనెంట్‌గా పీకించుకున్నాడు,” కథ ముగించాడు నారాయణ్.

దబ్బని శబ్దం విన వచ్చింది. చూస్తే పాపారావు స్పృహ తప్పి పడిపోయున్నాడు.

(ఇంకా ఉంది)

బట్ట తల వచ్చేసిందే బాలా – 4

ఏదో పాపారావు మీద జోకులు వేస్తున్నాం కానీ మా ముగ్గురి పరిస్థితి చాలా బ్యాడ్‌గానే ఉంది (జుత్తుకి సంబంధించింత వరకు). పాపారావులానే మేమందరం 30 ఏళ్ళ లోపు వాళ్ళమైనా, మా అందరి జుత్తు బాగా పల్చబడింది. దానికే రక రకాల హంగులు చేసుకుని ఉన్నదానికంటే ఎక్కువ జుత్తు చూపించాలని ప్రయత్నిస్తూ కష్ట పడుతూంటాం.

ఈ సందర్భంగా నేను బట్ట తల గురించి కొంచెం నా అభిప్రాయాలు చెప్పాలి. బట్ట తల అనేది భగవంతుడు మగాళ్ళకి ఇచ్చిన శాపం. జనరల్‌గా అందరు భగవంతుడు మగాడే అంటారు కాబట్టి, నా అనుమానమేంటంటే భగవంతుడికి ఒకానొక సందర్భంలో బట్టతల వచ్చి ఉంటుంది. దానితో వొళ్ళు మండి మగాళ్ళందరికీ ఎప్పుడో ఒకప్పుడు బట్ట తల రావాలి అని కొత్త రూల్ సృష్టించి ఉంటాడు.

ఏదో నలభై ఏళ్ళకు బట్ట తల వస్తే గుండె రాయి చేసుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ ముప్పై ఏళ్ళ ముందే వస్తే అది రెండు నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించాల్సిన సందర్భం. అదే పెళ్లి కావడానికి ముందే వస్తే, ఛాతీ బాదుకుంటూ ఏడ్వాల్సినంత ట్రాజెడీ .

ఐతే నేను భగవంతుడిని ఇంతకంటే ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. ఇందులో భక్తి కన్నా భయం ఎక్కువ. ఈ ఉన్న జుత్తు కూడా పీకేసి నన్ను పాపారావు గాడిలా తయారు చేస్తాడన్న భయం.

నాకన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు జుత్తు ఉన్నవారు బట్ట తల ఉన్న వాళ్ళమీద జోకులు పేల్చడం. కొన్ని రోజుల్లో వాళ్ళకు కూడా ఊడుతుంది అన్న ప్రాథమిక జ్ఞానం లేకపోవడం. అప్పుడే నాకు యక్షుడు ధర్మరాజుని అడిగిన ప్రశ్న గుర్తుకొస్తుంది. “హే యుధిష్టరా, ఈ ప్రపంచంలో కెల్లా ఆశ్చర్యకరమైన విషయమేది?” దానికి ధర్మజుడి సమాధానం: “మనకు తెలిసినవాళ్ళందరూ మన ముందే చనిపోతున్నా మనం మాత్రం ఎల్ల కాలం బ్రతికి ఉంటామని విశ్వసించడమే.”

అదే నేనైతే, “మనకు తెలిసిన వాళ్ళందరికి మన ముందే బట్టతల వస్తున్నా మనకు మాత్రం తలపై జుత్తు ఎల్ల కాలం ఉంటుందనుకోవడమే,” అని సమాధానమిచ్చి ఉండే వాడిని.

కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు బట్టతల గురించి బాధ పడుతూ కర్మలు ఆచరింపడం మాన రాదు. ఎందుకంటే ఇంకా నాకు పెళ్ళి కావల్సి ఉంది. అదయ్యేంతవరకు గుండె చిక్కబట్టుకుని ఈ సమస్యని పరిష్కరించే మార్గాలు వెతుకుతూనే ఉండాలి.

(ఇంకా ఉంది)

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers