Archive for the ‘Senior’ Category

Senior – Part 1


గమనిక:

సీనియర్ 94-95లో నేను రాసిన సీరియల్ కథ. అప్పట్లో (అంటే మా golden daysలో), మా ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్ అంతా అమెరికాలోని రకరకాల చోట్ల, ఎం.ఎస్. చేస్తూ ఉండే వాళ్ళం. మా అందరికి ఒక్క ఎం.ఎస్.కే చావు తప్పి కన్ను లొట్టపోతే, మా రమణ్‌రావు మాత్రం రెండో ఎం.ఎస్. కూడా మొదలు పెట్టాడు. ఇలా వీడు ఎం.ఎస్.ల తరువాత ఎం.ఎస్.లు చేస్తూ పోతే ఎలా ఉంటుంది అని నాకు వచ్చిన ఒక చిలిపి ఊహ, ఈ సీరియల్ కి నాతో శ్రీకారం చుట్టించింది. మా క్లాస్‌మేట్స్ లో బాగా పాపులర్ కావడం వల్ల నేను దాని తరువాత soc.culture.indian.telugu మీద ప్రచురించాను. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కథాకాలం దాదాపు 14 ఏళ్ళ కిందటిది కాబట్టి, కొన్ని సిచ్యుయేషన్స్ మీకు వింతగా అనిపించచ్చు. కాని అప్పట్లో జీవితం, నా కల్పనలు పక్కకు పెట్టి, అలానే ఉండేది. అవి globalization ముందు రోజులు. అమెరికా కి రావడానికి మాకు ఒక్క స్టూడెంట్ వీసా (F-1) మాత్రమే శరణ్యం. ఈ సంగతి మీరు దృష్టిలో ఉంచుకుని చదివితే, ఈ కథను ఎక్కువగా ఎన్‌జాయ్ చేయగలరు.

ఈ కథలో రమణ్‌రావు గురించి ఏవన్నా చెడుగా రాసి ఉంటే అదంతా నా కల్పన. ఈ కథలో కనిపించే మంచి గుణాలు మాత్రం అచ్చంగా బుచ్చంగా వాడివే. ఇక చదవండి….



ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యంది. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అంతా కోలాహలంగా ఉన్నారు. ప్రొఫెసర్ లోనికి రాగానే ఆ అల్లరి సద్దు మణిగింది. ప్రొఫెసర్ ఇండియన్ కావడంతో మన దేశీ స్టూడెంట్స్ మొహాలు విప్పారాయి.

ప్రొఫెసర్ కృష్ణారావు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ గ్రాజ్యుయేట్ క్లాస్‌లో ఉన్న 30మంది ఫ్రెషర్స్‌లో ఒకడు చైనీస్ ఐతే మిగతా 29మంది ఇండియన్స్. అందులో 28మంది ఆంధ్రప్రదేశ్‌నుంచి ఐతే, 27మంది హైదరాబాద్‌నుంచి.

కృష్ణారావు వారందరి వంకా ఆనందంగా చూసి, “ఇక్కడ కూడా మీరందరూ మన తెలుగు తల్లికి కీర్తిని తీసుకు వస్తారని ఆశిస్తున్నాను,” గద్గదంగా అని క్లీనెక్స్‌తో కళ్ళు తుడుచుకున్నాడు. 28మంది తెలుగువాళ్ళు హర్షధ్వానాలు చేస్తే, తమకు కూడా ఏదో అర్థమయినట్టు, మణిపూర్‌నుంచి వచ్చిన మావు టాంగు, చైనీస్ స్టూడెంట్ చింగ్ చాంగ్ చుంగ్ విశాలంగా నవ్వారు.

“ఇక్కడ anti-copying law ఉందా గురు? అహా ఏం లేదు, ఉంటే మన తెలుగు తల్లికి కీర్తి తీసుకురాలేం కద అని నా బాధ!” అన్నాడు సుందరమూర్తి.

సోమూ లేచి, “ఇక క్లాస్ ప్రారంభించుదామా సర్?” అన్నాడు. అంతే! క్లాస్ అంతా ఘోరమైన నిశ్శబ్దం!!

“రావు అన్న రాందే ఏ క్లాస్ షురు కాదు,” అన్నాడు మల్లేష్.

“అవ్! రావు అన్న వస్తే గాని క్లాస్‌కి రోష్‌నీ రాదు,” పరవశంగా అన్నాడు నర్సింలు.

“రోష్‌నీ ఎవరు? ఆవిడ కూడా ఒక స్టూడెంటా?” అమాయకంగా అడిగాడు సోము.

“నీ యవ్వ! యాడికెల్లి వచ్చినవు భై! రోష్‌నీ అంటె వెలుగు, light అన్నట్టు!” అన్నాడు నర్సింలు విసుగుగా.

“అగో అన్న వచ్చిండు, అన్న వచ్చిండు,” అన్న కేకలు సడన్‌గా క్లాస్‌లో మారుమోగాయి. రమణ్‌రావు సుడిగాలిలా లోపలికి దూసుకు వచ్చాడు. “ఏరా, కొంపదీసి క్లాస్ మొదలు పెట్టావా?” కోరగా చూస్తూ అన్నాడు. కృష్ణారావు గొంతులో తడి ఆరిపోయింది.

“మీరు లేకుండా ఎప్పుడన్నా అలా చేశానా రమణ్ బాబూ?” అన్నాడు నమ్రతగా. రమణ్‌రావు హుందాగా తల పంకించాడు.

“అన్నది ఇది రెండో ఎం.ఎస్. ఇంకా చాలా చేద్దామనుకుంటున్నాడు అన్న!” గౌరవంగా అన్నాడు మల్లేష్ సోమూతో. దురుసుగా కనిపించే రమణ్‌రావు వెనక ఇంత విద్యా దాహం ఉందా అనుకొని ఆశ్చర్యపోయాడు ఎం.బీ. సోము.

Senior – Part 2

Cafeteria. అందరూ busyగా assignments చేసుకుంటున్నారు. సడన్‌గా ఒక కార్నర్‌లో కలకలం చెలరేగింది. మల్లేష్ సోమూకి లాగిపెట్టి ఒకటి ఇచ్చాడు. సోమూ బేర్‌మని అరిచి కింద పడ్డాడు. “ఎంత పొగర్రా నీకు,” అంటూ మల్లేష్ సోమూని లేపి మళ్ళీ ఒక గుద్దు గుద్దాడు.

విసురుగాపోయి పడబోతున్న సోమూని రెండు బలమైన చేతులు అడ్డుకున్నాయి. అది ఎవరో కాదు, రమణ్‌రావు.

“ఏరా! ఏం జరుగుతూంది ఇక్కడ?” కరకుగా అడిగాడు రమణ్‌రావు.

“కొత్తగా వచ్చిన ఫ్రెషర్ మీద చేయి చేసుకుంటావా?” అంటూ మల్లేష్ వంక ఉరిమి చూశాడు. అక్కడ ఏదో పెద్ద గొడవ జరగబోతునట్టు ప్రకృతికి కూడా తెలిసిపోయిందేమో అనిపించేలా చెట్లు గాలికి ఊగడం మానేశాయి.

Cafeteria Manager, Tom Smith మెల్లగా phone మీద చేయి వేశాడు. రమణ్‌రావు వెనక్కి తిరిగి చూడకుండానే సోమూ పుస్తకాల bag తీసి Tom Smith మీదకు విసిరాడు. అంత బరువున్న ఆ దేశీ bag తగిలి అతను స్పృహ తప్పి పడిపోయాడు.

అందరూ ఇక మల్లేష్ పని అయిపోయిందనే అనుకున్నారు. “ఏరా! ఊ చెప్పు,” గద్దించాడు రమణ్‌రావు. “అది కాదన్నా. రేపు data structuresలో assignment ఉంది కదా! వీడి assignment ఇవ్వమంటే, ఈడు నఖరాలు చేస్తున్నడు,” అన్నాడు మల్లేష్.

అంతే! రమణ్‌రావు చెయ్యి లేపి, సోమూ గూబ గుయ్యిమనిపించాడు. మళ్ళీ బేర్‌మన్నాడు M.B.సోమూ. “అదేటండీ, నన్ను కొడతారు? Copy చూపించడం తప్పు కద?” ఏడుపు మొహం పెట్టి అడిగాడు.

“ఒక్క సారి వాడి మొహంలో చూడరా! చూడు,” గర్జించాడు రమణ్‌రావు. “Bank loan చేసి, ఎన్నో కష్టాలు పడి వాడి అమ్మ, నాన్న వాడిని పంపిస్తే, ఇక్కడ ముష్టి assignment ఇవ్వకుండా, వాడి బంగారు భవిష్యత్తుని పాడు చేస్తావా? ఒక్క సాటి భారతీయుడికి నువ్వు ఆ పాటి కూడా చేయలేవా?” అవేదనగా అడిగాడు రమణ్.

సిగ్గుతో సోమూ తల దించుకున్నాడు. “ఒరే, నువ్వు assignment ఇస్తూంది వాడికి కాదురా, మన భారత మాతకిరా, మన భారతమాతకి,” ఆవేశంతో రమణ్‌రావు గొంతు బొంగురు పోయింది.

“ఇక చాలు, రమణ్ బాబూ! ఇక చాలు! మీ మానవత్వం నా కళ్ళు తెరిపించింది బాబూ!” అంటూ వల వల ఏడ్చేశాడు సోమూ.

“ప్రతి universityకి నీలాంటి ఒక senior ఉండాలె అన్నా! గప్పుడే వాటికి రోష్నీ వస్తుంది,” ఆనందంగా అన్నాడు నర్సింలు.

“ఆవిడెవరు?” అని అడగబోయి, అతి కష్టం మీద నోరు మూసుకున్నాడు సోమూ.

“రమణ్‌బాబుకి జై! రావు సాబ్‌కి జై!” అన్న అరుపులతో cafeteria మారుమోగిపోయింది. రమణ్‌రావు విలాసంగా తన చేతిలోని గ్లాస్‌ని వెనక్కు విసిరాడు. అది అప్పుడే స్పృహలోకి వస్తున్న Tom Smith తల మీద పడి, అతను అర్జెంట్‌గా మళ్ళీ మూర్ఛ పోయాడు.

Senior – Part 3

Computer Lab. Students అంతా workstations ముందు కూర్చుని బుద్ధిగా పని చేసుకుంటున్నారు. M.B. సోమూ mouseని గాలిలో తిప్పుతూ స్క్రీన్ మీద cursor కదలడంలేదేమిటా అని ఆశ్చర్యపోతున్నాడు.

రమణ్‌రావు దగ్గరికి నర్సింలు ఒక అమ్మాయితో సహా వచ్చాడు. “ఈమె పేరు బిందు మాధవి అన్న. Apartment కోసం పరేషాన్ అవుతూంటే నీ కాడికి తోలుకొచ్చినా!” అన్నాడు వినయంగా.

“Only girls అపార్ట్‌మెంటేనా లేక girls/guys పర్లేదా?” అడిగాడు రావు. బిందు మాధవి shock తిన్నట్టు మొహం పెట్టింది.

“Okay, okay. ఇంక నువ్వు ఏం చెప్పక్కర్లేదు. Girls apartment type నువ్వు. నేను రాగిణితో మాట్లాడతాను. నువ్వేమీ worry కాకు,” హుందాగా అన్నాడు రమణ్‌రావు.

“చాలా thanks అండి,” అంది బిందు మాధవి. “No sweat, నా హాయంలో ఎందరికో apartments ఇప్పించా. You gotta do what you gotta do,” నిర్లక్ష్యంగా అన్నాడు రావు.

“ఏదో N.T. రామారావు పేదలకు ఇళ్ళు పంచిపెట్టిన still ఇస్తాడేంటి?” తనలో తాను అనుకుంది బిందు మాధవి. పైకి, “వస్తానండి, assignment చేసుకొవాలి,” అంటూ workstation వైపు నడిచింది.

“గీ పోరి చాంద్ కా టుక్‌డా లెక్క ఉన్నదన్న! ఈమె రావడంతో గీ Labకే రోష్నీ వచ్చినట్టయింది,” అన్నాడు సాలోచనగా నర్సింలు.

నోరు తెరవబోతున్న సోమూ వంక మల్లేష్ ఉరిమి చూడడంతో సోమూ నోరు మూసుకుని mouseని కొత్త varietyలో గాలిలో తిప్పడం మొదలు పెట్టాడు.

Senior – Part 4

“ఏరా! ఒక సిగరెట్ ఉంటే ఇలా పడేయి,” అన్నాడు రావు. “ఇగో అన్నా! అవు అన్నా, ఏంది గట్ల సోంచాయిస్తున్నవు? బిందు మాధవి గురించా?” question mark face పెట్టి అడిగాడు నర్సింలు.

“ఒరే నర్సీ, నీకెప్పుడన్నా నేను universityకి వచ్చే అమ్మాయిల categories చెప్పాన్రా?” అన్నాడు రమణ్‌రావు.

“లే అన్నా!” అన్నాడు నర్సింలు. సిగరెట్టుతో గాలిలో పొగ ఊదుతూ, భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడిలా pose ఇస్తూ, రమణ్‌రావు నర్సింలుతో ఇలా అన్నాడు.

“హే నర్సింలు, ఈ univeristyకి వచ్చే అమ్మాయిలు ఐదు రకాలు.

1) Groceries, Assignments చెల్లెమ్మలు:

వీళ్ళు నీకు Groceriesకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు call చేస్తారు. అలాగే assignments deadlines వచ్చినప్పుడు కూడా వీళ్ళకి నీ phone numbers గుర్తుకొస్తాయి! Groceries తీసుకొచ్చిన రోజు, మరుసటి రోజు భోజనానికి రండి అని అంటారు. మరుసటి రోజు ఎదురైతే, అదే భోజనంలోని కరివేపాకులా చూస్తారు. వీళ్ళకి మగాళ్ళు తమ సేవకు మాత్రమే పుట్టారని ఒక గొప్ప నమ్మకం. మన చవలాయిలు కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఈ చెల్లాయిలకు సేవ చేస్తూంటారు.

2) అనుమానపు అమ్మడు types:

వీళ్ళు, universityలో ఉన్న ప్రతి మగ పురుగూ తమ వెనకే పడుతూందని గట్టిగా నమ్ముతూంటారు. కారణం కూడా లేకపోలేదు. అమ్మాయి-to-అబ్బాయి ratio చాలా minor fraction కావడం దీనికి మరింత దోహదం చేస్తుంది. ఐతే వీళ్ళు ప్రతి మగాణ్ణి exception లేకుండా మోహన్ బాబు లెవెల్లో చూస్తారు. ఆ తరువాత ఎలాగూ ఎవరో ఒక మగాణ్ణే పెళ్ళి చేసుకుంటారనుకో. అది వేరే విషయం.

3) Sincere సావిత్రులు:

అదృష్టవశాత్తు వీళ్ళు numberలో ఎక్కువ. వీళ్ళకు తమ చదువేమో, తమ గొడవేమో తప్ప మిగతా విషయాలు పట్టవు. నువ్వు libraryకి, classకి, labకి రాని type ఐతే, నీకు వీళ్ళు ఉన్నారని కూడా తెలీదు.

4) Outgoing అన్నపూర్ణలు:

వీళ్ళు U.S.కి రాగానే సడన్‌గా వాళ్ళు Indiaలో ఎలా ఉండేవారో మర్చిపోతారు. వీళ్ళు ఎప్పుడూ ఏదో partyలోనో, functionలోనో, library steps మీదో కనిపిస్తారు. నీకు కనీసం వాళ్ళని examsలో చూసినట్టు కూడా గుర్తు రాదు. ఐతే, moviesలో tickets కొనేప్పుడు వాళ్ళు student I.D. తీయడంతో నీకు వాళ్ళు students అని confirmation లభిస్తుంది.

5) —————–:

వీళ్ళు చదువు ఒక్కటే కాకుండా మిగతా విషయాలు కూడా ముఖ్యమని భావిస్తారు. ఉన్నంతలో వాళ్ళ జీవితాన్ని అందంగా మలుచుకుంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. తమ principles ఏవైనా వాటిని తొణక్కుండా పాటిస్తారు.

Balance ఉన్న మనుషులు. ఇలాంటి వాళ్ళు అమ్మాయిలలోనూ, అబ్బాయిలలోనూ తక్కువే. వీళ్ళ వల్ల నువ్వంటూ ఉంటావే, ఎక్కడుంటే అక్కడ రోష్నీ వస్తుంది!

కాబట్టి ఓ నర్సింలు, బిందు మాధవి ఏ categoryనో త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు సోంచాయిస్తాను,” అని పెదవులు చుర్రుమనడంతో సిగరెట్ ముక్కని చేత్తో window sill మీద నలిపేశాడు రమణ్‌రావు.

నర్సింలు నోట మాట రాక, అర్జునిడి లెవెల్లో రావు కాళ్ళ మీద వాలిపోయాడు.

Senior – Part 5

School. “ఏరా! ఏంటలా ఆ professor room దగ్గర, కోలాహలం?” అడిగాడు రమణ్‌రావు. “నీకు తెలీనిదేముందన్న! గా professor కాడ ఒక assistantship ఏదో ఉందని ఎవలో చెప్పిండ్రంట. ఈల్లందరూ నేను ముంగట పోతానంటె నేను పోతనని లొల్లి జేస్తుర్రు” అన్నాడు నర్సింలు. రమణ్‌రావు వాళ్ళ దగ్గరికి నడిచాడు.

సోమూ “please అండీ, నేనే ముందు professor గారు రావడం చూశాను. నేనే first వెళ్ళాలి,” అంటున్నాడు. “నీ బొంద! వాడు restroomలో నుంచి రావడం చూసింది నేను. నేనే ముందు పోవాలి,” అన్నాడు సుందరమూర్తి.

“professor ఇంటికి phone చేసి ఆయన బయలు దేరారని చెప్పగానే, ఇక్కడ పడి ఉన్నాను. నాకే first chance!” కొత్తగా వచ్చిన ఇంకో fresher అంటున్నాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన బిందు మాధవి అది చూసి, “ఏమిటీ, ఒక professor కోసం ఇంత డిమాండా?” అంది.

“ఔ, లక్షలాది students ఎక్కువగా వస్తుంటారు, assistantships కోసం. మీరు కూడా పోయి lineల నిల్చోండ్రి,” నర్సింలు చిలిపిగా అన్నాడు.

“తను lineలో నిల్చోనక్కరలేదు”, శూన్యంలో చూస్తూ అన్నాడు రమణ్‌రావు.

“ఏం” ఆశ్చర్యంగా చూసింది బిందు మాధవి. “Indiaలో cinema halls దగ్గర separate queue ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. మీరు కాస్త కళ్ళల్లో నీళ్ళు నింపుకొని లోపలికి వెళ్ళి గద్గదంగా మాట్లడండి. అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు చూసి కూడా, assistantship ఇవ్వని దేశీ professor ఇంకా పుట్టలేదు!” చెప్పాడు రమణ్‌రావు.

“మీరు నన్ను ఒక మామూలు అమ్మాయి అనుకుంటున్నారా?” కోపంగా అంది బిందు మాధవి. “ఐతే మీరు కాదా?” CRYING GAME movie గుర్తుకొచ్చి భయంగా ఒక్క అడుగు వెనక్కు వేశాడు రావు.

“నేను అందరూ సమానమే అని భావిస్తాను. నేను కూడా లైనులో నిల్చుంటాను,” అంటూ వెళ్ళింది బిందు మాధవి.

” అన్నా! సూస్తూంటే, గీ పోరి 5th category లెక్క ఉంది,” సాలోచనగా అన్నాడు నర్సింలు.

“తొందర పడకు. ఎవరికి తెలుసు, professorని already meet అయ్యిందేమో,” అన్నాడు రమణ్‌రావు.

అంతలో professor roomలోనుంచీ బయటకు పరుగెత్తుకుంటూ వెళ్ళి పొయాడు. సోమూ ఒక్క dive కొట్టి professor కాళ్ళు పట్టుకోవడానికి try చేశాడు. కాని professor తెలివిగా గాలి లోకి చెంగున ఎగిరి సోమూని తప్పించుకొని కంటికి కనపడనంత వేగంతో దూసుకొని వెళ్ళిపోయాడు.

“యేం పరుగెడుతున్నడన్నా! carl lewis కుడా బేకార్,” అశ్చర్యపోయాడు నర్సింలు.

కింద బొక్క బోర్ల పడి ఉన్న సోమూకి పైకి లేవడానికి సహాయం చేస్తోంది బిందు మాధవి.

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers