Archive for the ‘Current Affairs’ Category
కరప్షన్‌ని నిర్మూలిద్దాం(లంచం ఇచ్చైనా సరే)!
గుండెలు అర చేతిలో పెట్టుకుని ధన్వంతరి గాడి అపార్ట్‌మెంట్ ముందు నిలబడ్డాను నేను. కారణం మీ అందరికి తెలుసు. సరేలే తప్పదు అని తలుపు తట్టబోతే అదే తెరుచుకుంది. గడియ వేయలేదనుకుంటా. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం.
నా ఆనందం క్లైమాక్స్‌కి చేరుకోక ముందే ధన్వంతరి గాడి గళం నుండి వెలువడిన శబ్ద తరంగాలు ఆ నిశ్శబ్దాన్ని పారద్రోలాయి.
“జోరీగా జోరీగా ఎందాకా నస పెడతావే, రాకే నా వెంట!
దూరంగా పోకుండా వస్తాగా నీ వెనకాలే వీడని గాయంగా!”
….
….
వామ్మో ఈ చేజింగ్ ఏంటి, వాయ్యో ఈ రన్నింగ్ ఏంటి?
వదిలెయ్యి దండం పెడతా వద్దంటూ!
వాన్నో ఆ చాన్సే లేదు, వాక్కో నే ఆగనే ఆగను.
దొరికి పోవే నా చేతికి నువ్వే ఎంచక్కా!”
నేను అరిస్తే వాడు పాట ఆపేశాడో, వాడు పాట ఆపాక నేను అరిచానో తెలీదు. మొత్తానికి పాట ఆగగానే, “ఆఖరికి శాస్త్రి గారి పాటని కూడా వదిలి పెట్టలేదా?” కోపంగా అడిగాను వాడిని.
“నాకు జెనరల్‌గా ఆయన పాటలు నచ్చవు గురూ, ఈ పాట కాస్త నా స్టాండర్డ్‌కి తగినట్టు ఉంటే ఆగలేకపోయాను,” సంజాయిషీ ఇచ్చుకున్నాడు ధన్వంతరి.
“మన కరెంట్ అఫెయిర్స్ కార్యక్రమం మొదలు పెడదామా?”
“ఈ సారి అంతా ఒకే హాట్ టాపిక్, కరప్షన్‌ని అరికట్టాలని మన జాతి జాగృతమయ్యింది.”
“జాగృతమయ్యిందా? అంటే?”
“నిద్ర మేల్కొంది అని.”
“అంటే ఇన్ని రోజులు నిద్రపోతుందా?”
“మరదే కద అర్థం.”
“సరే, టీవీ పెట్టు.”
టీవీ పెట్టగానే కన్నా ఏక్ హజారే దర్శనమిచ్చాడు.
“ఈయన కరప్షన్ మీద పోరాటం మొదలు పెట్టాడని, డోక్‌పాల్ బిల్ కోసం పోరాడుతున్నాడని తెలుసు కానీ, పూర్తి వివరాలు తెలీవు,” అన్నాను నేను.
“అవినీతిని మన ప్రభుత్వం అరి కట్టలేదని, దానికి ఒక స్వఛ్ఛంద సంస్థ ఉండాలన్నదే కన్నా ఏక్ హజారే పోరాటం.”
“మరి డోక్‌పాల్ బిల్?”
“ఎప్పటిలా కేసులు ఏళ్ళ తరబడి ముదర పెట్టకుండా, త్వరగా పరిష్కారం కల్పించడం, అవినితీ సొమ్ముని లంచగొండుల నుంచి డోకు తెప్పించైనా సరే కక్కించడమే డోక్ పాల్ బిల్ లక్ష్యాలు.”
“ఇదేదో ప్రభుత్వం బాధ్యతలా ఉందే?”
“వాళ్ళు చేయట్లేదు కనకే, డోక్‌పాల్ కావాలని అడిగేది.”
అటు కన్నా ఏక్ హజారే రెచ్చిపోతున్నాడు.
“ఈ ప్రభుత్వం పాసి గూలా! అందరూ అవినీతి పరులే. వీళ్ళకి డోక్‌పాల్ బిల్ ఎందుకు నచ్చుతుంది? ప్రభుత్వ ప్రతినిధులతో కలవడానికి మేమంతా ఢిల్లీ భవన్ వెళ్తే, బక్షీస్ తీసుకొని కానీ ఆ కాపలా వాడు మమ్మల్ని లోపలికి ప్రవేశించనియ్య లేదు. దీన్ని బట్టే తెలుస్తూంది ఎంత అవినీతి పేరుకుపోయి ఉందో”
చానెల్ మారిస్తే ప్రభుత్వ ప్రతినిధి కపిల్ నోబాల్ మాట్లాడుతున్నాడు. “అసలు గాంక్రెస్ పార్టీ అవతరించిందే కరప్షన్ అంతమొందించేందుకు. అలానే మేము పదవిలోకి వచ్చినప్పుడల్లా నిర్మూలిస్తూనే ఉన్నాం. కానీ దాని సిగ్గోసిరి! అది మళ్ళీ మొలకెత్తుతూనే ఉంది. డోక్‌పాల్ బిల్ అంటే మాకు అత్యంత గౌరవం, కన్నా ఏక్ హజారే ఒక గొప్ప వ్యక్తి. కానీ మేము పెట్టిన ఒకే షరతుకి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి సంధి ఎలా పొసగుతుంది?”
“ఏమిటి మీరు పెట్టిన షరతు?” అడిగాడు ఒక విలేఖరి.
“ఆ బిల్‌ని రెండు పదాలు లేకుండా రాయమని అడిగాం, అంతే.”
“ఏంటో ఆ పదాలు?”
“లంచము, ఇంకా శిక్ష!”
“విన్నావురా ధన్వంతరి, గాంక్రెస్ పార్టీ అవినీతిని అంతమొందించేందుకే ఉందట!” అన్నాను నేను.
“నిజమే గురూ, హెన్రూ గారు ప్రధాన మంత్రి అయ్యాక, 1948లో, ఆయన మిత్రుడు క్రిష్ణ చేపన్, మొదటి జంబూ ద్వీప – పీకిస్తాన్ యుద్ధానికి, తెల్ల దొరలనుంచి కొన్ని వందల జీపులు ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేశాడు. తెల్ల దొరలు మనకు షెడ్డుకెళ్ళడానికి రెడీగా ఉన్న రెండవ ప్రపంచ యుద్ధ వాహనాలను, అవి కూడా, పీకిస్తాన్‌తో మన యుద్ధం అయిపోయాక, తీరికగా పంపించారు. అప్పట్లో హెన్రూ గారు ఏ పాపం తెలీని తన మిత్రుడిని కాపాడారు. మొన్నటికి మొన్న, జగన్మోహన్ సింగ్ మన టెలికాం మినిస్టర్ వాజాని కాపాడగలిగినంత వరకు కాపాడారు. అలా గాంక్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది.”
చానెల్ మళ్ళీ మారింది.
“బాబా శ్యాందేవ్‌ని మొన్న అన్యాయంగా ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఢిల్లీనుంచి పట్టుకెళ్ళి పోవడం తప్పు కాదా?” ఒక విలేఖరిణి ప్రశ్నించింది.
“ఓ, ఆ విషయం మీకు తెలిసిపోయిందా. పొరపాటు మాదే. ఈ సారి కన్నా ఏక్ హజారేని ఎవరికీ తెలీకుండానే తరలిస్తాం. ఇలాంటి తప్పులని సహించేది లేదు,” నొచ్చుకున్నాడు పీ. ఏకాంబరం.
“డోక్‌పాల్ బిల్ అంటేనే మన గాంక్రెస్ నాయకులకి డోకొచ్చేలా ఉంది,” అన్నాను నేను.
“మరి రాదా గురూ! గాంక్రెస్ చల్లని పాలనలో, పార్లమెంట్ నుండి, పాల దుకాణం వరకు అందరూ ఒక క్రమ శిక్షణతో లంచాలు వసూలు చేయడానికి అలవాటు పడిపోయారు. మరి సడన్‌గా ఆపేయాలి అంటే ఎలా కుదురుతుంది.”
“ఏమోరా, నాక్కూడా నా వంతు ఏదో చేయాలని ఉంది. నీ కవిత్వం నా శేష జీవితం అంతా వింటే, లంచగొండితనం నిర్మూలింపబడుతుందని ఎవరన్నా హామీ ఇస్తే, నేను దానికి కూడా సిధ్ధమే,” ఆవేశంగా అన్నాను నేను, పిడికిలి బిగించి.
“అబ్బ! ఎంత మంచి మాటన్నావురా! నువ్వు ఆ పిడికిలి అలాగే బిగించి ఉంచు. అష్ట కష్టాలు పడి, ఆఖరికి లంచం ఇచ్చైనా సరే ఆ డోక్‌పాల్ బిల్ పాస్ అయ్యేలా నేను చూస్తాను,” అన్నాడు ధన్వంతరి.
“ఎర్రి” మొహాలు, కొడగట్టిన సూరీడు, అత్యధిక మెజారిటీలు
“దోమ నిన్ను కుట్టింది, చీమ నిన్ను కుట్టింది, నేను నిన్ను కుట్టితే తప్పా?
దోమ రాత్రి కనపడదు, చీమ సౌండు వినపడదు, ఏమిటంట నీలోని గొప్ప?
అవి కుడితే నీకు డేంజర్ లేదమ్మా, నే కుడితే సెప్టిక్ అయిపోతుందమ్మా.
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా, నువ్వందకపోతే వృధా ఈ జన్మ”
మగ ఆడ గొంతులు మార్చి మార్చి ధన్వంతరి గాడు పాడుతున్న పాట వినపడి తలుపు బయటే ఆగిపోయాను నేను. వీడు కవి కావాలని ఏ ముహూర్తాన నిర్ణయించుకున్నాడో కానీ, ఈ మధ్య కరెంట్ అఫెయిర్స్ డిస్కస్ చేయడానికి వీడింటికి రావాలంటే భయం పట్టుకుంది నాకు. కానీ ఏం చేస్తాం, సివిల్స్ పాస్ కావాలంటే తప్పదు మరి. గుండె రాయి చేసుకుని వాడింట్లో అడుగు పెట్టాను.
“రారా, నీకోసమే వెయిటింగ్. ఆలస్యం అవుతుందని కాస్త కవిత్వం ప్రాక్టీసు చేసుకుంటున్నా,” బ్రైట్‌గా అన్నాడు ధన్వంతరి.
“ప్రాక్టీస్ చేసుకోవడానికి అదేమన్నా హ్యాండ్ రైటింగా? ఐనా ఇది కూడా ఇంద్ర బోస్ రాసిన పాటే కద?”
“ఆయనే నాకు ఇన్స్పిరేషన్ గురూ, సింపుల్ పదాలు వాడి సెన్సేషనల్ మీనింగ్ సృష్టిస్తాడు. గత వారం పాడిన పాట ‘ మౌనంగా మొరగమని ‘నే తీసుకో. అది..”
“వద్దు, మళ్ళీ ఆ పాట పాడొద్దు. కావాలంటే నువ్వు ఆయన కంటే గొప్ప కవి అని ఒప్పుకుంటా.”
“థాంక్యూ గురూ! మరి వార్తలు చూద్దామా?”
“పద, నీదే ఆలస్యం.”
టీవీ ఆన్ చేయగానే గడప డిస్ట్రిక్ట్ నుంచి లైవ్ ప్రసారం. ఒక పెద్ద గుంపు అందరు మొహాల మీద గుడ్డేసుకుని వెళ్తున్నారు.
నేను ధన్వంతరి వైపు ప్రశ్నార్థకంగా చూశాను.
“వీళ్ళంతా వై.నో. గగన్‌కి పోటీగా నిల్చుని ఎలెక్షన్లలో డిపాజిట్ కోల్పోయారు,” వివరించాడు వాడు.
“అంటే వై.నో. గగన్ మచ్చ లేని నాయకుడు అని ఋజువు అయ్యిందన్న మాట. అంత అధిక మెజారిటీతో గెలిచాడంటే, అదే కదా అర్థం!” అన్నాను నేను.
“ఏరా నువ్వేమన్నా ఛాఛీ దిన పత్రికకి పని చేస్తావా? జర్మనీలో ఒకప్పుడు హిట్లర్ కూడా అతి పెద్ద మెజారిటీతో గెలిచాడు. ఆయన వొంటి నిండా మచ్చలే అని ఇప్పుడు లోకానికంతా తెలుసు కద. మన దేశంలో ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నెన్నో సమీకరణాలు ఉంటాయి. అది వై.నో. గగన్ కంచు కోట. ఆ నియోజకవర్గానికి ఆయన ఫ్యామిలీ చాలా చేసింది (మిగతా రాష్ట్రాన్నంతా కొల్ల గొట్టి అనుకో). డబ్బు మంచి నీళ్ళలా ప్రవహించింది. ముఖ్య మంత్రి కాగల సత్తా ఉన్న క్యాండిడేట్‌ని ఏ నియోజకవర్గ ప్రజలు వదులుకోరు. ఇలా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి.”
“ఇంతకీ మన రిచంజీవి గడప నడి బొడ్డున తొడ గొట్టాడు కద! ఆయనేమయ్యాడు?”
“ఇక ప్రచారం చేసే అవసరం లేదు కద. ఇప్పుడు ఆయన ఒక పుస్తకం రాసుకుంటున్నాడంట. అది కాబోయే రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగపడుతుందంట!”
“ఏం పుస్తకం అది?”
“దాని టైటిల్ – కొత్త పార్టీ పెట్టి భ్రష్టు పట్టడమెలా? – అట.”
“బెస్ట్ సెల్లర్ అవుతుందిలే. చానెల్ మార్చు.”
ఈ సారి అరవనాడు దర్శనమిచ్చింది.
కర్కశ నిధి విలేఖరులతో మాట్లాడుతున్నాడు. “ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదు. 2G కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన డబ్బంతా పార్టీ క్యాడర్స్ నుంచి లీడర్స్ వరకు అందరము చాలా సామరస్యంగానే పంచుకున్నాం. మరి తేడా ఎక్కడొచ్చిందో అర్థం కావట్లేదు.”
“బహుశా ప్రజలు మీరు వారితో కూడా పంచుకోలేదని ఫీల్ అయినట్టున్నారేమో,” సజెస్ట్ చేశాడు ఒక రిపోర్టర్.
“వాళ్ళకు ల్యాప్‌టాప్స్, కలర్ టీవీలు ఇస్తామన్నాం కద? చీ! ఈ జనానికి బొత్తిగా విశ్వాసం లేదు.”
“ఇప్పుడు మీ స్ట్రాటెజీ ఏంటి?” ఇంకో విలేఖరి అడిగాడు.
“నాతో పాటూ మా పార్టీ సభ్యులు కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని కొన్ని రోజులు ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఈ సారి తిరుగులేని వ్యూహంతో వస్తాం. ఐతే ఈ మధ్యలో 3G స్క్యాం మిస్ అవుతామని కొంత బాధగా ఉంది,” అన్నాడు కర్కశ నిధి.
“పాపం కర్కశ నిధి గారికీ, ఆయన కుటుంబానికీ ఎంత కష్టమొచ్చిందో! చానెల్ మార్చు,” అన్నాను నేను.
ఈ సారి వంగ భూమి స్క్రీన్ మీద కనిపించింది.
“మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు?” ఒక విలేఖరి మైక్‌ని (త్వరలో మాజీ కాబోయే) ముఖ్య మంత్రి బుద్ధావతారం ముందు ఉంచి అడిగాడు.
బుద్ధావతారం మైక్ కేసి అసహ్యంగా చూశాడు.
“మా క్యాడర్ల వల్లే మేం ఓడిపోయాం. పైగా కొందరు జనం ఆ మడతా బెనర్జీ మాయ మాటలు నమ్మారు.”
“మీ క్యాడర్లు సరిగ్గా ప్రచారం చేయలేదంటారా?”
“కాదు, సరిగ్గా రిగ్గింగ్ చేయలేదు. బద్ధకించారు. వెధవలందరికీ మొహానికి ఎర్ర రంగు పూసి వదిలేస్తాను. తిక్క కుదురుతుంది.”
అంతలో నలుగురు జమా జెట్టిలాంటి “కత్తి కొడవలి” పార్టీ సభ్యులు వచ్చి బుద్ధావతారం మొహాన ఎరుపు రంగు పులిమి, “ఇంతటితో ఈయన ఉపన్యాసం అయిపోయింది,” అని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి పోయారు.
“పాపం బుద్ధావతారం గారు, ఎరుపు రంగు ఎవరినీ క్షమించదు అని అర్థం చేసుకోలేక పోయారు. చానెల్ మార్చరా!” అన్నాను నేను.
ఈ సారి జంబూ ద్వీపపు ముద్దు బిడ్డ సాహుల్ గాంధి కనిపించాడు. తను రైతులతో కలిసి కాసేపు ధర్నా చేయించడం, అతన్ని ఉత్త ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం చూపించారు.
“ఏం జరిగింది?” అడిగాను నేను.
“హైవే కోసం తీసుకున్న భూములకు ఉత్త ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరైన ధర చెల్లించలేదని, గొడవ చేస్తూంటే పోలీసులు పట్టుకుపోయారు.”
“సాహుల్‌కి ఆ ఊర్లో భూమి ఉందా?”
“కాదెహే, అక్కడి రైతుల భూములని స్వాధీన పరుచుకున్నారని వాళ్ళు ఉద్యమం మొదలెట్టారు. ఇతగాడు కన్‌వీనియెంట్‌గా ఆ ఉద్యమంలో దూరాడు.”
“ఎందుకు దూరాడు?”
“అతన్ని ఉత్త ప్రదేశ్‌లొ ముందుకు మల్లే ఎవరూ తమ గుడిసెల్లో దూరనివ్వడం లేదంట. సో, ఇలా నరుక్కొచ్చాడు.”
“ఎంతైన సాహుల్ గాంధి భలే యాక్టివ్‌గా ఉంటాడురా! నాయకుడంటే అలా ఉండాలి.”
“శుభం! నీ లాంటి వాళ్ళు అలా అనుకోవడమే అతనికి కావల్సింది కూడా.”
“ఈ న్యూస్ అంతా చూస్తూంటే కడుపు నిండిపోతూంది. మన త్రిలింగ చానెల్ ఏదైనా పెట్టు. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.”
“బృందగాన కోసం సభ ఏర్పాటు చేయండి. ఓకే! కేంద్రాన్ని నానా తిట్లు తిట్టండి. డబుల్ ఓకే! కాని మన తెగులు దేశం పార్టీ జెండాలు ఎందుకు పెట్టలేదు,” కోపంగా సర్పం జనార్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు సూర్య బాబు.
“ఎందుకు పెట్టలేదంటే,” గొంతు సవరించుకున్నాడు సర్పం.
“ఆ! ఎందుకు?”
“అసలు నేనే కొత్త పార్టీ పెట్టాలా, లేక ఉన్న పార్టీల్లో ఒక దానిలోకి జంప్ చేయాలా, ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ లొల్లి తేలిపోగానే, సరైన పార్టీ జెండాలు తప్పకుండా పెడతాను,” బదులు చెప్పాడు సర్పం.
టీవీ స్విచ్ ఆఫ్ చేశాడు ధన్వంతరి.
“సరే, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం,” వాడికి చెప్పి అక్కడినుంచి బయటపడ్డాను నేను.
యాష్-ట్రేలియా, కన్నా ఏక్-హజారే, వీ.సీ.అర్
“మౌనంగానే మొరగమని కుక్క నీకు చెబుతుంది, మొరిగే కొద్దీ విరుగునని అర్థమందులో ఉంది,” ధన్వంతరి గాడు జుత్తు దువ్వుకుంటూ గొంతు చించుకుంటున్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది.
“అన్నామంటే అన్నామంటావు కానీ, ఏంట్రా ఆ పాట? మౌనంగా మొరగడమేంటి, విరగడమేంటి?” ఒక్క అరుపు అరిచాను.
మా ఇద్దరికి ప్రతి రోజూ ధన్వంతరి గాడింట్లో కూర్చుని కరెంట్ ఎఫెయిర్స్ డిస్కస్ చేయడం ఒక ఆనవాయితి. ఎందుకంటే మేం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాం.
“అంటే వీలైనంత మౌనంగా మొరగడం మంచిది అని. ఎక్కువగా మొరిగితే వొంటి మీద కర్ర విరుగుతుందని కవి హృదయం.”
“ఎవరా కవి?”
“ఇంకెవరు, నేనే!”
“ఈ పైత్యం ఎప్పటినుంచి?”
కొద్దిగా హర్ట్ అయినట్టు మొహం పెట్టాడు ధన్వంతరి.
“పైత్యం కాదురా కవిత్వం. దీన్ని కవిత్వం అంటారు. ఇంద్ర బోస్ అనే రచయిత ఇలాంటి పాటే రాస్తే, అందరూ దాన్ని వేనోళ్ళ పొగిడారు. ఆఖరికి కలి యుగాంతం వరకు ఇలాంటి పాట నిలిచిపోతుందని నొక్కి వక్కాణించారు. ఆ స్ఫూర్తితోనే నేను ఇలా రాశాను.”
“ఆయనేదో మొక్క గురించి రాసినట్టున్నాడు?”
“మొక్కైతే ఏంటి, కుక్కైతే ఏంటి? పిచ్చి మొక్క, గజ్జి కుక్క, పెంట కుప్ప, కాదేది కవితకనర్హం అని ఒక మహా కవి అన్నాడు.”
“నిజంగా ఆ మహా కవే బతికి ఉంటే ఇది విని గుండెలు బాదుకునే వాడు. సర్లే గానీ, మనం కరెంట్ అఫెయిర్స్ గురించి డిస్కషన్ మొదలు పెడదామా?”
“తప్పకుండా. టీవీ ఆన్ చేస్తున్నా, ఒక్కొక్క చానెల్ లో వచ్చే న్యూస్ చూస్తూ విశ్లేషించడమే తరువాయి.”
“నువ్వు సూపర్ రా! కానియి”
ధన్వంతరి గాడు టీవీ ఆన్ చేశాడు.
టీవీ మీద ఆదరా బాదరా ఎయిర్ పోర్ట్ కనిపించింది. అర్రైవల్స్ దగ్గర ఒక పాతిక మంది యువకులు, ఒళ్ళంతా కట్లు కట్టుకుని, వీల్ చెయిర్స్‌లో కూర్చుని వస్తున్నారు.
“ఏదో పెద్ద విమాన ప్రమాదం జరిగినట్టుంది. ఈ న్యూస్ ఎలా మిస్ అయ్యానబ్బా?” అన్నాను నేను.
“వాళ్ళు యక్సిడెంట్ తాలుకు కాదు. యాష్-ట్రే-లియా కి చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థులు. అక్కడ యాష్-ట్రే-లియన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిని ఇలా వచ్చేస్తున్నారు. వారానికొక గుంపు దిగుతూనే ఉంటుంది. అది పెద్ద న్యూస్ కాదులే.”
“మరెందుకు వెళ్ళడం?”
“పిచ్చి వాడా, జంబూ ద్వీపం కాకుండా ఎంత దిక్కు మాలిన చోట డిగ్రీ చేసినా దాని వ్యాల్యూనే వేరు. విదేశాలు, విదేశీయులు, విదేశీ వస్తువులు ఎప్పటికి గొప్పవే. ఢిల్లీ అమ్మ కేవలం వేరే దేశం నుంది వచ్చింది అన్న కారణంగా ఆవిడకి ఎంత గ్లామర్ ఉందో చూడు,” చానెల్ చేంజ్ చేశాడు ధన్వంతరి.
ఈ సారి స్క్రీన్ మీద వై.నో. గగన్ రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ కనిపించాడు.
“ఏంటీ సెన్సేషన్! ఈయన కొంప దీసి తెగులు దేశం పార్టీలో చేరిపోయాడా?” అన్నాను.
“కాదులే ఆయన సమర్పించిన ఆస్తుల లిస్ట్‌లో పేర్కొన్నాడు, తనకు స్వంత కార్ లేదని. కొందరు గిట్టని వాళ్ళు అది నమ్మకపోవడంతో, ఇలా సైకిల్ మీద తిరుగుతూ రుజువు చేస్తున్నాడు.”
“మరి వెనకాల మెల్లగా వస్తున్న ఆ ఇరవై టాటా సుమోలు?”
“అవి ఆయన అనుచర వర్గానివి. ఆయనకి కార్ లేదు కానీ, తనకి కావలిసిన వాళ్ళకి, కార్లు, సుమోలు బాగానే కొనిపెడ్తాడులే!”
మళ్ళీ చానెల్ మారింది.
ఒక పెద్ద గుంపు, ప్లాకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తూ పోతున్నారు. వాళ్ళేమంటున్నారో వినడానికి నేను చెవులు రిక్కించాను.
“బృందగానా జిందాబాద్. వాయు కళ్యాణ్ డౌన్ డౌన్. అతని సినిమా బొందల గడ్డని బ్యాన్ చేయాలి,” అంటున్నారు వారు.
“ఎందుకు బ్యాన్ చేయాలి?” ఆశ్చర్యపోయాను నేను.
“బొందల గడ్డ అనేది బృందగానా పదం. ఆ పదాన్ని తన సినిమా పేరుగా పెట్టుకోవడానికి మోస్తా ప్రాంతానికి చెందిన వాయు కళ్యాణ్‌కి హక్కు లేదంట.”
“ఇది మరీ అన్యాయం. ఇంతకీ ఈ గుంపు అంతా ఎక్కడికి పోతునట్టు?”
“ఈ నినాదాలు కాగానే వీళ్ళందరే, వాయు కళ్యాణ్ నటించిన బొందల గడ్డ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దూరుతారు. వాయు కళ్యాణ్‌కి బృందగానాలో అభిమానులు ఎక్కువలే”.
నాకు నోట మాట రాలేదు.
ఈ సారి స్క్రీన్ మీదకి సాహుల్ గాంధి వచ్చాడు.
ఇంటర్వ్యూ చేసే ఆవిడ సాహుల్‌ని అడిగింది, ” కన్నా ఏక్-హజారే చేస్తున్న ఉద్యమం మీద మీ అభిప్రాయం.”
సాహుల్ గొంతు సవరించుకున్నాడు.
“ఆయనకి కీర్తి కండూతి చాలా ఎక్కువ. అందుకే ఇలా రోడ్డు మీద పడ్డాడు. అవినీతిని నిర్మూలించడానికి నేను కూడా కంకణం కట్టుకున్నా. ఎటొచ్చీ, నాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు కాబట్టి, రహస్యంగా ఈ అవినీతిని అంతం చేసే యజ్ఞంలో ఒక సమిధలా కాలిపోతున్నా.”
“ఏదీ కంకణం చూపించండి. కొత్త డిజైనా?” ఆసక్తిగా అడిగింది యాంకర్.
“ఎహే, మాట వరుసకి అన్నా. ఐనా ఇది అంత సులభమైనది కాదు, ఎన్నో ఏళ్ళ సమయం పడుతుంది. కానీ నేను లక్ష్యం పూర్తయ్యే వరకు, రోజూ కొద్ది కొద్దిగా కరిగిపోతూ శ్రమిస్తూనే ఉంటాను.”
“ఎందుకు అన్నేళ్ళు పడుతుంది?” ధన్వంతరిని అడిగాను నేను.
“అంటే ఆ అవినీతిని పెంచి పోషించింది, ఆయన ముత్తాత, నానమ్మ, నాన్నలే కద. మరి మూడు తరాల అవినీతిని అంతమొందించడం అంత వీజీ కాదు,” చెప్పాడు వాడు, చానెల్ చేంజ్ చేస్తూ.
స్క్రీన్ మీద ఈ సారి భక్తుల సందోహం కనిపించింది. అందరూ పెద్ద గొంతుతో భజనలు చేస్తున్నారు.
నేను ధన్వంతరి వైపు ప్రశ్నార్థకంగా చూశాను.
“బాబా గారి ఆరోగ్యం ఏమీ బాగా లేదు. ఆయన కోలుకోవాలని ఈ పూజలు,” అన్నాడు వాడు.
“బాబా గారే ప్రత్యక్ష దైవం కద? మళ్ళీ దేవుడికి ఈ పూజలెందుకు?”
“ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఆ దేవుడికి తెలుసో లేదో మరి. ఎందుకైనా మంచిది అని వీళ్ళు ఇలా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.”
చానెల్ మళ్ళీ మారింది.
ఈ సారి బృందగానా నాయకుడు వీ.సీ.ఆర్. కనిపించాడు.
“మోస్తా వాళ్ళంటేనే నాకు దమాక్ ఖరాబవుతది.
మోస్తా వాళ్ళ బిర్యాని పేడ లెక్కుంటది. వాళ్ళ బాపనోళ్ళకు మంత్రాలు సదువుడు రాదు,” ఉటంకించాడు ఆయన.
“దీన్ని బట్టి నీకర్థమయ్యిందేంటి?” అడిగాడు నన్ను ధన్వంతరి.
“ఆయనకు పేడ రుచి బాగా తెలుసని. మోస్తా యాస అంటే ఆయనకు పడదు కాబట్టి ఆ బ్రాహ్మణుల మంత్రాలు అర్థం కాలేదని.”
“కరెక్ట్!” మళ్ళీ చానెల్ మార్చాడు వాడు.
“సర్కస్‌కి, బఫూన్లకి తగ్గి పోతున్న ఆదరణ,” వార్తల్లో ముఖ్యాంశాలు చదువుతూంది ఒక విలేఖరి(ణి).
“దీనికేమంటావు?” అడిగాడు ధన్వంతరి.
“మన చుట్టు పక్కలే, ఫ్రీగా ఇంత మంది బఫూన్లు ఉండి, ఇంత గొప్ప సర్కస్ జరుగుతూంటే, డబ్బులు పెట్టుకుని ఎవరు మాత్రం వెళ్తారు,” అన్నాను నేను.
ఇగ్రహాలే కద!
రాళ్ళ బొమ్మలు కూలితే గింత రాద్దాంతమా?
వాటికేమన్న ప్రానమా, మన్నా, మశానమా?
మంది మంటెట్టుకు సస్తూంటే గా ముచ్చటే లేదు గానీ,
ఎప్పుడో సచ్చినోల్ల ఇగ్రహాలు ఇరగ్గొడొతే ఎందుకు పరేషానీ?
గట్లని మాకు ఇగ్రహాలంటే ఇలువ లేదనుకోకు బిడ్డ!
కానీ ఆళ్ళ చిరునామ మాత్రం కావాలె ఇదే గడ్డ!
(1955 కి ముంగట లే)
మమ్మల్ని రౌడీలంటరు, మీ దిమాక్ ఖరాబయ్యిందా?
మేము పెద్ద మనుసులం కాకుంటే గా ఒప్పందం అమలయ్యెడిదా?
గసలే మాది శాంతియుత ఉద్యమం, నీకెరుకా?
కాదని ఎవడైనా అంటే నరుకుతం కొడకా!
మా బాసని ఎక్కరించెంటందుకు మీరెవరు బే?
అర్థమయితె ఇనుకో, లేక పోతె చెవ్వులు మూస్కో పో!
ఏందీ? గిన్నేల్లు బాగు బడంది ఇంకేం పడుతరు, అంటరా?
పైకి రానియ్యకుండా నొక్కేసి పైగా పరాసికాలడతరా?
ఒక ఏల ప్రత్యేక రాష్ట్రం వచ్చ్చినా ఏం గాక పొతే, అనే సందేహం మీకొద్దు.
గప్పుడు జిల్ల, జిల్ల మధ్య రాస్తం సరి కొత్త సరిహద్దు.
ది గ్రేట్ జంబూ ద్వీప్ క్యామెడీ సర్కస్ – 2010
గత సంవత్సరంలో ఎందరో ప్రముఖులు తమదైన శైలిలో (అంటే పిచ్చి వాగుడు వాగడం ద్వారా అని గమనించగలరు) మనకు వినోదాన్ని పంచారు. వాటిలో కొన్ని మచ్చు తునకలు.
- బాలిక్ (పీకిస్తాన్ మంత్రివర్యులు): ఉగ్రవాదం వల్ల ఎక్కువగా నష్టపోయింది పీకిస్తానే! ప్రపంచ దేశాలు అన్నీ మాకు దొడ్డ మనసుతో ఆర్థిక సహాయం చేయాలి.
- రిచంజీవి: ఇష్టా రాజ్యం పార్టీ గాంక్రెస్‌తో విలీనం చేసే ప్రసక్తే లేదు. అలా చేయడం తల్లి గొంతు నులిమినట్టే!
- ఢిల్లీ అమ్మ: కరప్షన్ పైన గాంక్రెస్ యుద్ధం ప్రకటిస్తూంది. జగన్మోహన్‌కి ఏ పాపం తెలీదు.
- సాహుల్: “అహ్మదీయ ఉగ్రవాదం కంటే, సింధువుల ఉగ్రవాదంతోనే జంబూ ద్వీపానికి ప్రమాదం ఎక్కువ.” (కాలు నోట్లో ఉండడం వల్ల ఆయన మాటలు పూర్తిగా వినపడలేదు.)
- వై.నో. గగన్: ఓదార్పు యాత్రకు రాజకీయ రంగు పులమకండి. ఓదార్పు అనేది రాజకీయలకు అతీతం.
- మొద్దియూరప్ప (కంకర్‌నాటక ముఖ్య మంత్రి): నా కొడుకులు అమాయకులు. (అలా అనిపించినా ఇది బూతు కాదని మనవి.)
- కీసర బాసర నారాయణ రావు: “పరమ ఘోర చక్ర”లో ప్రదర్శించిన నటనకి బుజ్జి క్రిష్ణకి ఉత్తమ నటుడి అవార్డ్ వస్తుంది. ఈ చిత్రం పట్ల ఆయన అభిమానులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు.
- వీ.సీ.ఆర్: బృందగాన ఇస్తే ఢిల్లీ అమ్మ కాళ్ళు కడుగుతాం. బృందగాన రాష్ట్ర సమితిని గాంక్రెస్‌లో విలీనం చేస్తాం. (Dec 26, 2010)
బృందగాన రాష్ట్ర సమితిని గాంక్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదు. కె.కె. (కె. కాకర రావు) చెప్పింది జోక్ అఫ్ ద ఇయర్! (Feb 7, 2011)
Comments (10)