జాబులూ జవాబులూ

(1991 వరకు ఒకటే చానెల్ ఉన్న మన దూరదర్శన్‌లో ప్రసారమైన కార్యక్రమాల మీద ఒక చెణుకు.)

మేలోటి పాపనాశం: నమస్కారం రామారావుగారూ!

రామారావు: నమస్కారం మేలోటి పాపనాశంగారూ!

మేలోటి పాపనాశం: (ప్రేక్షకులవైపు తిరిగి) నమస్కారం. మేం ప్రసారం చేసే కార్యక్రమాల పట్ల మీ అభిశాపాలు, I mean, అభిప్రాయాలు. ఆ రామారావుగారూ, మీరేదో జాబు పట్టుకుని చదవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. పైగా ముసి ముసి నవ్వులు కూడా నవ్వుతున్నారు. ఏంటి విషయం?

రామారావు: ఏవీ లేదు పాపనాశం గారూ, ఈ సారి అన్ని జాబులూ మిమ్మల్ని ఉద్దేశించే వచ్చాయి. భలేగా రాశారు లెండి.

మేలోటి పాపనాశం: ఏం రాశారో చదవండి మరి! (తనలో తాను) క్రితం సారి మరీ బూతులు తిట్టారు. అంతా ఆ దేవుని దయ.

రామారావు: రచ్చబండనుంచి రామయ్య రాస్తున్నారు. (గొంతు మార్చి) ఒరే పాపనాశం! ఏంట్రా? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? చెత్త చెత్త నాటికలు ప్రసారం చేయడం, పైగా ఇకిలిస్తూ, ఆ వెధవ నాటికలను సమర్థించడం. మొన్న ప్రసారం చేసిన ఆ నాటికకు అదేం పేరురా వెధవా! “ఇది నాటిక కాదు.” మరి అది నాటిక కాకపోతే దాన్ని ప్రసారం చేయడం ఎందుకురా? చంపేస్తా!

మేలోటి పాపనాశం: చూడండి రామయ్య గారూ, ‘ఇది కథ కాదు’ అనే పేరు గల సినిమాని, మీరంతా ఎగబడి చూడగా లేనిది, ‘ఇది నాటిక కాదు’ అనే నాటికని చూడడానికి ఏమొచ్చింది మాయరోగం? పైగా పుట్టించడం చంపడం అంతా ఆ భగవంతుడి చేతుల్లో ఉంది. మరీ మా నాటికలు అంత చేదైతే, TV మానేసి మీ రచ్చబండ రాజకీయాలు చూసుకోండి. Next.

రామారావు: బాగా సమాధానమిచ్చారండీ! తరువాత ఉత్తరం రాసింది ఆముదాల వలసనుండీ అయోమయ రావు గారు. (గొంతు మార్చి) బాబోయి, మీ దూరదర్శన్ ప్రసారం చేసే కార్యక్రమాలకన్నా, మేలోటి పాపనాశంగారి జవాబులు అసలు తట్టుకోలేక పోతున్నాం. నా మటుకు నాకు, ఆయన mental hospitalలో ఉండాల్సిన సరుకులా అనిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన్ని పిచ్చాసుపత్రికి పంపించండి.

మేలోటి పాపనాశం: పోదురూ, మీది మరీ చోద్యం! మా దూరదర్శన్ ప్రసారం చేసే కార్యక్రమాలకన్నా, నా జవాబులు పవర్ ఫుల్ అని నేననుకోను. ఐనా కూడా, మీరు చెప్పినట్టు, నన్ను పిచ్చాసుపత్రికి పంపించినా ఏమీ లాభం ఉండదండీ! నేను పిచ్చాసుపత్రి నుండి బయటకు వచ్చాకే దూరదర్శన్‌లో చేరాను. Next.

రామారావు: తర్వాత ఉత్తరం పాలకొల్లునుండి పచ్చి బూతుల పాపారావు రాశాడండి. (గొంతు మార్చి) ఓరి మీ జిమ్మడ, మీ దూరదర్శన్ని పిచుకలెత్తుకుపోనూ! మీ నాటకాలను నమిలి మింగెయ్యా! మీ పాపనాశం గాడి పళ్ళు రాలగొట్టా! ఏం నాటకాల్రా అవి? ఇంకా మాట్లాడడం రాని మా చంటోడు పాపం, మీ దిక్కు మాలిన ప్రోగ్రాములు చూసి దడుసుకున్నాడు. ఒకటే వాంతులూ, విరోచనాలూ. ఒరే మేలోటి పాపనాశం, మా ఉసురు పోసుకుని నువ్వు బాగు పడవురా…

మేలోటి పాపనాశం: (మధ్యలోనే ఆపేసి) ఇక చదవకండి. నేను వినలేను!

రామారావు: అప్పుడే ఏమయ్యింది! ఇది వినండి.

మేలోటి పాపనాశం: రామారావుగారూ, పొగుడుతూ ఏవీ రాలేదా?

రామారావు: వంద తిడుతూ, రెండు పొగుడుతూ వచ్చాయండి.

మేలోటి పాపనాశం: (నీరసంగా) ఆ రెండే చదవండి.

రామారావు: చిన్న పిల్లల నగర్నుండీ చింకూ రాస్తున్నాడండీ. (గొంతు మార్చి) అంకుల్, అంకుల్! మరేమో మరేమో, మొన్న మీరు T.V. మీద చూపించిన ‘శ్రీ కృష్ణదేవరాయ వైభవం’ ఎంత కామెడీగా ఉందో! ఎన్ని జోకులో! నేనూ, నా ఫ్రెండ్ టింకూ నవ్వలేక చచ్చాం!

మేలోటి పాపనాశం: (కొంచెం విషాదంగా) నాన్నా టింకూ, అది చారిత్రాత్మక నాటిక బాబూ. పోన్లే ఏదో ఒకటి. నవ్వావు, అంతే చాలు. Next.

రామారావు: జబ్బర్ గూడానుండీ, జబరున్నీసా ఉర్దూలో రాశారండీ.

మేలోటి పాపనాశం: మరి నాకు ఉర్దూ రాదుగా!

రామారావు: నేను తెలుగులో అనువదించా లెండి. (గొంతు మార్చి) నేనూ, మా అమ్మీజాన్ మీ దూరా దర్శన్కి ఎంతో రుణపడి ఉన్నాం. మొన్నా మొన్నటి వర్కూ, అమ్మీకి ఎన్ని మందులు వేసుకున్నా నిద్రా పట్టేది కాదు. పోయిన వారం మీ తెల్గూ కార్యక్రమాలు చూడడం జరిగిందీ. హప్పటినుండీ అమ్మీ గురకలు పెట్టి నిద్ర పోతూంది. తెలుగు రాకాపోవడం వల్లా, మీ తెల్గూ కార్యక్రమాలు చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఉర్దూ కార్యక్రమాలు అన్నీ లేపేసి, మొత్తం తెల్గూ కార్యక్రమాలే పెట్టండే!

మేలోటి పాపనాశం: జబరున్నీసా గారూ! ఆశ, దోశ, అప్పడం, వడ! అన్నీ తెల్గూ, I mean తెలుగు కార్యక్రమాలే పెడితే, మరి మా తెలుగు ప్రేక్షకులు నిద్రపోయేది ఎప్పుడు? అందుకనే మీకు తెలుగు కార్యక్రమాలు. వారికి ఉర్దూ కార్యక్రమాలు. (ప్రేక్షకులకేసి చూస్తూ చేతులు జోడించి) మీ ప్రోత్సాహమే మాకు ఎంతో బలం. మీకు నచ్చిన ఇలాంటి కార్యక్రమాలను, ఇలాగే ఎప్పుడూ చూపిస్తుంటామని హామీ ఇస్తూ, సెలవు.

రామారావు: (మిగతా ఉత్తరాలు చదువుకుంటూ, తనలో తాను నవ్వుకుంటూ) సెలవు.

Advertisements
This entry was posted in నాటికలు. Bookmark the permalink.

One Response to జాబులూ జవాబులూ

  1. Jitu says:

    Meeku TV anna, TV programs anna, waati meda intha interest 1998 ninchi undi annamaata. 🙂

    Bhale! Bhale!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s