నరమాంసభక్షకులు

వాళ్ళంతా నన్ను నాలుక తడుపుకుంటూ ఒక రకంగా చూస్తున్నారు. తీరా చూస్తే నేనొక భూలోక సుందరినేం కాను. ఒక మాములు సగటు తెలుగు వాడిని. పేరు కూడా అంత గొప్పగా ఏం ఉండదు. అప్పారావు అంటారు నన్ను.

నిజానికి చెప్పాలంటే ఇదంతా నాకు ఒక కలలా ఉంది. దండకారణ్యానికి దగ్గరలోని పల్లెటూరు మాది. తేడా ఏంటంటే ఈ రాత్రి వేళ మా ఊరిలో ఉండాల్సింది పోయి, ఈ దరిద్రపు అడవిలో ఉన్నాను నేను.

అసలిదంతా ఆ సుబ్బారావు గాడి వల్ల వచ్చింది. వనభోజనాలు అంటూ మమ్మల్ని బయలుదేరదీశాడు. వాడితో పాటు ఒక నలుగురం కలిసి వెళ్ళాం. మా ఆడవాళ్ళు కట్టించిన వంటలతో సహా, పొద్దున్నే అడవికి చేరుకున్నాం. మద్యాహ్నం పొట్ట పగిలేలా తిని అందరము ఒక కునుకు తీశాం. నా ఖర్మ కాలి నాకు అందరికంటే ముందు మెలకువ వచ్చింది. లేచిన వాడిని అక్కడే అఘోరించచ్చు కద. లేదు! కొలంబస్ లా అడవిని పరిశోదించడానికి బయలుదేరాను.

ఒక గంట తరువాత అర్థమయ్యింది నేను చాలా భయంకరంగా దారి తప్పాను అని. ఓపికున్నంత వరకూ నా అంతట నేనే దారి కనుక్కుందామని ప్రయతించాను. ఆ తరువాత కాస్త సిగ్గు వదిలేసి, మా వాళ్ళని అందరిని పేరు పేరునా పిలిచా. చివరకి బండ బూతులు కూడా ప్రయోగించా. కానీ వాళ్ళెవ్వరూ బదులు పలకలేదు.

వాళ్ళకి వినిపించలేదు కానీ, ఆ అడవి లోపల ఉంటున్న ఆటవికులకు మాత్రం బాగా వినిపించినట్టున్నాయి. వాళ్ళంతా బరిసెలు, విల్లంబులూ తీసుకుని పొలోమంటూ వచ్చేశారు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళూ మిల మిలా మెరిశాయి. రామాయణ్ టీవీ సీరియల్ తరువాత మళ్ళీ విల్లంబులు అంత క్లోజ్ అప్ లో చూసిన నాకు మాత్రం కళ్ళు తిరిగాయి.

“చూస్తే మంచి రుచిగా కనపడుతున్నాడు దొరా!” ఆనందంగా అన్నాడు వారిలో ఒకడు. వాళ్ళకు తెలుగు వచ్చు అన్న ఆనందం కంటే వాడి భాష తీరు నాకు ఎక్కువ చిరాకు తెప్పించింది. రుచిగా ఉండడం ఏంటి నా బొంద! బహుశా శుచిగా అనబోయాడేమో? కాని గత రెండు గంటలుగా తిరుగుతున్నానేమో, నా ఒళ్ళు మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కాబట్టి అలా అనుకునే అవకాశం లేదు మరి.

“నాకు వీడి కాళ్ళు కావాలి,” అన్నాడు అందులో ఒకడు. వాడి మొహం చూస్తే ఏ కోశాన నాకు పాద పూజ చెయ్యడం కోసం మాత్రం కాదు అని నాకు అర్థమయ్యింది. మరెందుకబ్బా? సడన్ గా నాకు జ్ఞానోదయం అయ్యింది. దండకారణ్యంలో నరమాంసభక్షకులు ఉంటారు అని చిన్నప్పుడు మా పెద్దలు భయపెట్టే వారు. పెద్దయ్యాక అవి ఒట్టి పుక్కిటి పురాణాలు అని తీసి పారేశాం మేమంతా. ఇప్పుడు అర్థమయ్యింది వాళ్ళంతా నాలుకలు తడుపుకుంటూ పెదవులు ఎందుకు చప్పరిస్తున్నారో.

ఆ షాక్ నుంచి తేరుకునేంత లోపల నన్ను కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ గూడేనికి మోసుకుంటూ తీసుకు పోయారు నన్ను. నేను పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నేను ఆగమన్న వాళ్ళు ఆగేలా లేరు. పైగా ఎలాగూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇదే సౌకర్యమైన పద్ధతి కద!

నన్ను చూడగానే గూడెంలో పెడబొబ్బలూ, కేరింతలూ పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళంతా. అందులో ఆడవాళ్ళు వెంటనే మంటేసి, ఒక పెద్ద బాన పెట్టి, వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు.

“ఇది అన్యాయం, దారుణం!” అరిచాను నేను. వాళ్ళ నాయకుడు ఆగి నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. “ఇలా నన్ను చంపడం,” వివరించాను నేను. “పైగా మీరింతమంది కలిసి నా ఒక్కడి మీద ఈ ఘాతుకం చేస్తారా?” అన్నాను.

“ఐతే నీకు ఒక అవకాశం ఇస్తాను,” అన్నాడు నాయకుడు. వంట ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆడవాళ్ళు అసహనంగా చూశారు. అప్పటికే వాళ్ళు మసాలాలు ఏవి వేయాలి నన్ను ఎలా కాల్చుకుని తినాలి అని తర్జన భర్జన పడుతున్నారు. మళ్ళీ ఈ ఆలశ్యం ఏమిటి అని వాళ్ళ భావన అనుకుంటా.

“మనిషి ఒక్కడే నవ్వగలిగిన జంతువు అని మీలో ఒక నానుడి అట కద? మమ్మల్ని అందరినీ కాస్త నవ్వించు. మేమూ నీ జాతికి చెందిన వారిమే అని వదిలేస్తా,” అన్నాడు నాయకుడు.

“అవును. నవ్వి చాలా రోజులయ్యింది. మాలో కొంత మందికి అసలు నవ్వంటే ఏమిటో తెలీదు,” క్రూరంగా అన్నాడు ఇంతకుముందు నా కాళ్ళు చూసి లొట్టలేసిన వాడు.

నాకు రిలీఫ్ తన్నుకు వచ్చింది. అసలు గంటలు గంటలు జోక్స్ చెప్పగలను అని నాకొక పేరు. ఈ అడవి మనుషులని నవ్వించడం ఎంత?

వెంటనే బాసింపట్టు వేసి కూర్చున్నా. నా చుట్టూ ఒక వలయంగా వారంతా కూర్చున్నారు. ఒక రెండు గంటల పాటు గుక్క తిప్పుకోకుండా జోక్స్ చెప్పాను. సర్దార్జీ జోక్స్, పేరడీలూ, బాపూ రమణ జోక్స్ ఇలా బోలెడు చెప్పాను. లాభం లేక పోయింది. మొహం కందగడ్డలా పెట్టుకుని నా వైపు చూడ్డం తప్ప వారింకేమీ చేయలేదు. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నానేమో, నాకు నీరసం ముంచుకొచ్చింది. కళ్ళు తేలవేశాను.

“మసాలాలు బాగా ఘుమ ఘుమలాడుతున్నాయి. వంట మొదలు పెడదామా?” అంది ఆడంగులలో ఒకతి. సరే అన్నట్టు తల ఊపాడు నాయకుడు. అందరు పొలోమంటూ నన్ను మోసుకుని మళ్ళీ బయలుదేరారు.

ఒక్కసారి నాకు చావుభయం ముంచుకొచ్చింది. “మీరంతా రాక్షసులు. మనిషి రూపంలో ఉన్న మృగాలు. మా మనుషులు ఇలా ఉండరు. అంతా కలిసి మెలిసి ఉంటాము. ఒద్దికగా జీవిస్తాము. తినడం మాట దేవుడెరుగు, ఒకరినొకరు ఇలా చంపుకోము. చంపినా ఏదో బలమైన కారణం ఉంటేనే చంపుతాము. అనవసరంగా చీమకు కూడా హాని చెయ్యం,” ఉక్రోషంగా అరిచాను.

ఒక్కసారి అంతా విస్తూపోయి చూసారు. తరువాత తేరుకుని బిగ్గరగా నవ్వేశారు. ఆ నవ్వు ఒక పట్టానా ఆగలేదు. నవ్వుతూ నవ్వుతూ నన్ను కింద పడేశారు నన్ను మోస్తున్నవాళ్ళు. నడుము విరిగినట్టు అనిపించినా, వాళ్ళని ఆఖరికి నవ్వించాను అని కాస్త ఆనందం వేసింది నాకు. ఆ నవ్వు ఇంకా ఆగలేదు. అందరు కింద పడి దొర్లి దొర్లి నవ్వారు. కళ్ళ నీళ్ళు వచ్చేలా నవ్వారు.

ఒక పది నిముషాల తరువాత బలవంతంగా నవ్వు ఆపుకుంటూ, “చాలా బాగా నవ్వించావు. ఈ మధ్యకాలంలో ఇంతకంటే పెద్ద జోక్ వినింది లేదు. భేష్. నిన్ను వదిలేశాం పో. ఆ కనపడే కాలిబాటగుండా వెళ్తే, రెండు గంటల్లో ఈ అడవి దాటుతావు. వెళ్ళు,” అని ఎంత సడన్ గా వచ్చాడో అంతే సడన్ గా తన వాళ్ళతో అక్కడనుంచి నిష్క్రమించాడు నాయకుడు.

తుఫాను వచ్చి వెలసినట్టయ్యింది ఒకసారి. ఒక్క క్షణం కలో నిజమో అర్థం కాలేదు నాకు. కాసేపటికి తేరుకుని నాయకుడు చూపించిన బాట మీద నడక సాగించాను. ఎంత నవ్వించాలని ప్రయత్నించినా నవ్వని వాళ్ళు నేను ఆఖరిలో వెర్రి ఆవేశంతో అన్న మాటలకు అంతలా ఎందుకు నవ్వారో అర్థం కాలేదు నాకు…

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to నరమాంసభక్షకులు

  1. vinay chakravarthi says:

    very nice blog……………. this is the best one among all telugu blogs.

    carryon………….tc…………

  2. మన సమాజం లో నానాటికీ తగ్గిపోతున్న సామాజిక విలువలకు అద్దం పట్టినట్టుంది మీ టపా..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s