పారా హుషార్!

పారా హుషార్!

Actors & actresses: 1. Venkat 2. Aruna (Husband and wife) 3. Kishore

Scene 1:

(తలుపు తడుతున్న శబ్దం)

Kirshore: వెంకట్, వెంకట్ , తలుపు తియ్యి.

Aruna: కిషోర్ వచ్చినట్టున్నాడు!

Venkat: ఆ వస్తాడు, వస్తాడు, ఎందుకు రాడు? వాళ్ళావిడ పుట్టింటికి వెళ్ళినప్పటినుంచిసరిగ్గా భోజనాల వేళకి వాలిపోతున్నాడు. ఆవిడెప్పుడు తిరిగిస్తొందో, మనకు ఈ బాధలుఎప్పుడు తప్పుతాయో!

Aruna: అయ్యో అలా అనకండి, పక్క పక్క ఇళ్ళ వాళ్ళం.ఒకరికొకరు ఆ మాత్రం సాయం చేసుకోక పోతే ఎలా?

Venkat: ఆ సెంటిమెంట్‌ని ఆసరాగా చేసుకునే కద వీడు ఇలా రెచ్చిపోతుంది. సరే, పూర్వజన్మలో వీడింట్లో ఒక పది బియ్యం బస్తాలుకొట్టేసి ఉంటాను. ఆ పాపం ఇలా నన్ను కట్టి కుడుపుతూంది. తప్పుతుందా!

Aruna: అంటే పూర్వ జన్మలో మీరు దొంగతనాలు చేసేవారా?

Venkat: ఆ సంగతి తెలీదు కాని, నువ్వు ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలకొస్తే ఈ జన్మలో నిన్ను హత్య మాత్రం చేస్తాను.

Kirshore: వెంకట్, వెంకట్ , తలుపు తియ్యి.

Venkat: తప్పేలా లేదు! (తలుపు తీసి) ఆ రావోయి కిషోర్. ఇంకా నువ్వు రాలేదేమిటా, భోజనంచల్లారి పోతుంది అని మీ వదిన బెంగ పెట్టుకుంది.

Kishore: (అనుమానంగా) మరి నాకెందుకు వాలిపోతున్నాడు అని నువ్వన్నట్టు వినిపించింది బయట నుంచి?

Venkat: (తడబడుతూ) అబ్బే ఏం లేదు.. మీ వదినకునాకు ఖవ్వాలీలు ఇష్టమని చెప్తున్నా, అంతే!నీకు వాలిలా వినపడి ఉంటుంది.

Kishore: నిజమా! నేను ఖవ్వాలీలు బాగా పాడుతా.(మొదలు పెడతాడు) పర్దా హై పర్దా, పర్దే కే నీచేపర్దా హై పర్దా, పర్దే కే నీచే…

Venkat: నీచే కాదు, పీఛే. వెధవ బూతు పాటలూనువ్వూ. ఐనా భోంచేశాక పాడుదువు కాని. నీ పాట అప్రిషియేట్ చేయడానికి, ఇప్పుడు నా కడుపులో కూడా ఏం లేదు.

Aruna: (ఫక్కున నవ్వుతుంది.)

Kishore: పాట అప్రిషియేట్ చేయడానికి కడుపులో ఏదన్న ఉండడం దేనికి? ఏంటో వెంకట్, నీ మాటలు నాకు అర్థం కావు ఒకో సారి. వదిన నిన్ను ఎలా భరిస్తూందో?

ఆ! అర్థమయ్యింది. అంటే నా పాట విన్నాక డోక్కోవడానికి కడుపులో ఏదన్నా ఉంటే బాగుంటుంది అనే కద నీ అభిప్రాయం? నీలాంటి ఛాందసులు నా లాంటి మేధావులని అర్థం చేసుకోకపోబట్టే, మా లాంటి కళాకారులకు గుర్తింపు రావడం లేదు. చూడు వదినా!

Aruna: ఆయన మాటలు పట్టించుకోకు కిషోర్. అన్నట్టు మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది కద! ఎలా ఉంది, ఏం చేస్తూంది?

Kishore: ఏముంది వదినా? నేను దగ్గర లేను అన్న బెంగతోచిక్కి శల్యమయి బరువు 70 కేజీలకు పడిపోయిందంట. మా మామగారు చెప్పారు.

Aruna: ఐతే మీ మామగారితో కూడా మాట్లాడుతున్నావన్న మాట. ఇంకా నేను మీ ఆవిడతోనే అనుకున్నా. మీ పెళ్ళయ్యాక పద్మ మొదటి సారి కదా నిన్ను విడిచి వెళ్ళింది!

Kishore: మొదటి రెండు రోజులు గంటలు గంటలు మాట్లాడింది వదినా. ఆ తరువాత మధ్యలో ఏదో సాకు చెప్పి ఫోన్ పెట్టెయ్యడం మొదలెట్టింది. ఆ తరువాత, ఇలా రోజు గంటలు గంటలు కాల్ చేస్తారేమిటి, పనీ పాటా లేదా అని మొహమ్మీదే తిట్టేసింది. ఒక్క మా మామ గారు ఇంకా మొహమాటంతో మాట్లాడుతున్నారు నాతో.

Aruna: అదేంటయ్యా? మీ బావ మరదులకు నువ్వంటే ఎంతో ఇష్టం అని చెప్పావు? వాళ్ళు కూడా మాట్లాడట్లేదా?

Kishore: వాళ్ళకి నేను పంపించిన బహుమతులు ఏవీ నచ్చలేదంట. అమెరికాలో కొత్తగా ఏదో వచ్చింది. సోనీ ప్లే స్టేషన్ 3 అనుకుంటా. అది కొనిస్తే కానీ నన్ను బావగా గుర్తించరంట.నా వల్ల కాదు అని చెప్పాను. మళ్ళీ నాతో మాట్లాడితే ఒట్టు!

Venkat: మన చిన్నతనంలో మనకు ఒకటో రెండో బొమ్మల కంటే ఎక్కువ ఉండేవి కావు. ఐనా వాటితోనే ఆడుకునేవాళ్ళం. మరీ ఇంత దురాశ పనికి రాదు అని చెప్పలేక పోయావా?

Kishore: చెప్పాను. ఇంకాస్త అసయ్యించుకున్నారు.

Venkat: సరి పోయింది. అన్నట్టు మద్యాహ్నం ఏదో సినిమా వెళ్తాను అన్నావు. వెళ్ళావా మరి?

Kishore: వెళ్ళాను, నికృష్టుడు.

Venkat: ఏంటి నన్నే! ఇది నీకు మర్యాద కాదోయి కిషోర్.ఎంతైనా రోజు నీకు భోజనం పెడుతున్న అన్న దాతని.మరీ అంత మాట అనేస్తావా?

Kishore: అది సినిమా పేరు వెంకట్! నిన్ను అనలేదు.

Aruna: ఏంటీ సినిమా పేరా? అదేం పేరు, ఛండాలంగా?

Kishore: ఇది ఇప్పటి ట్రెండ్ వదినా. పోకిరి, జులాయి, కంత్రీ, ఇలాంటి పేర్లు అన్నీ వాడేశారు కద! అంతే కాకుండానీచుడు, తుచ్ఛుడు కూడా రిజిస్టర్ అయిపోయాయట.కాబట్టి ఉన్న వాటిలో సంసార పక్షమైన పేరు, నికృష్టుడు అని పెట్టారు.

Venkat: ఇంతకీ ఎలా ఉంది?

Kishore: నికృష్టంగా ఉంది. అదే, పర్లేదు. కేవలం నలుగురు హీరోయిన్‌లు మాత్రమే ఉన్నారు.

Aruna: ఐతే బాగా లో బడ్జెట్ సినిమా అన్న మాట.

Kishore: మరే, అన్ని పాటలు ఇండియాలోనే తీశారు.

Venkat: శివ శివా. ఎలాంటి రోజులు వచ్చాయి!

Aruna: హిందీ సినిమాలే నయం. వాటిలో కనీసం ఒక్క సీను కూడా ఇండీయాలో తీయరు. ఆఖరికి పల్లెటూరి సెట్టింగ్ కూడా ఏ స్విట్జర్లాండ్‌లో వేస్తారు.

Kishore: నిజమే వదినా! కానీ తెలుగు భాష మీద ఉన్న అభిమానం చంపుకోలేక, గుండె రాయి చేసుకుని ఏదో చూసేస్తున్నా.

Venkat: మేం ఎక్కడ ఫీల్ అవుతామో అని గుండె రాయి చేసుకుని మా ఇంట్లో రోజూ భోజనం చేస్తునట్టు!

Kishore: చూడు వదినా!

Aruna: ఆయన మాటలు పట్టించుకోకు కిషోర్.మొన్న మన ఇండియా ట్వెంటీ-ట్వెంటీ కప్ గెల్చుకుంది కద. ఫైనల్ చూశావా?

Kishore: ఏం ఫైనల్, నా మొహం! అది మరీ అంత చిన్న మాచ్ అనుకోలేదు. సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాము అనిమాచ్ మొదలైన మూడు గంటలకు టీవీ ఆన్ చేస్తే, మాచ్ అయిపోవడమే కాకుండా కప్ కూడా ఇచ్చేశారు. మరీ చోద్యం.

Aruna: ఇప్పటికే ఆలస్యం అయ్యింది. భోజనాలు వడ్డిస్తాను.

Kishore: నువ్వుండు వదినా. అసలు నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. వెంకట్ఖవాలీలు అని వాలీలు అని నన్ను పక్కదారి పట్టించాడు.

Venkat: నీకు భోజనం కన్నా ముఖ్యమైన విషయంఉందా కిషోర్?

Kishore: ఉంది, ఉంటుంది. ఎందుకంటే విషయం అలాంటింది.మనిషికి అన్నిటికంటే ముఖ్యం రక్షణ. అదిలేనిదే సాగించలేడు తన భక్షణ.

Aruna: ప్రాస బాగుంది. ఇంతకీ నువ్వు చెప్పేది దేని గురించి కిషోర్?

Kishore: దేని గురించి ఏంటి? ఈ మధ్య జరుగుతున్న దొంగతనాల గురించి! రోజుకొక కాలనీలోదొంగతనం జరుగుతూంది. మన కాలనీ వంతు ఎప్పుడైనా రావచ్చు. దోచుకున్నవాళ్ళు దోచుకుని పోకుండా చంపి మరీ వెళ్తున్నారట! బతికుంటే కద భక్షణ!అందుకే కావాలి మనకు రక్షణ!

Aruna: మన కాలనీలో ఏముందయ్యా దోచుకోవడానికి?ఉన్నదంతా మన ఇళ్ళు కట్టించిన కాంట్రక్టరేదోచుకున్నాడు కద!

Kishore: అది నిజమే అనుకో వదినా, కానీ ఆ వెధవలు ఏం దొరక్కపోయినా ఒక పోటు పొడిచి పోతున్నారట.

Venkat: ఐతే వీళ్ళు బీహారు దొంగలు అయ్యుంటారు. వాళ్ళు మాత్రమే ఇంకా కత్తులు వాడుతున్నారట.

Kishore: ఇప్పుడా వివరాలు అవసరమంటావా వెంకట్? బీహారు వాడైతేనేం, మరొకడైతేనేం, ఎవడుపొడిచినా రిజల్ట్ ఒకటే కద!

Venkat: అంటే బీహారు వాళ్ళు వంపులు తిరిగిన కత్తులు వాడతారంట. వాటితో పొడిస్తే రక్తస్రావంఅధికంగా అవుతుందని ఎక్కడో చదివాను.

Aruna: అబ్బా మీరు ఊరుకోండి. వింటూంటే వణుకుపుట్టుకొస్తూంది.

Kishore: అందుకే వదినా నేను చెప్పేది. మనల్ని మనమే రక్షించుకోవాలి.

Aruna: ఐతే ఏమంటావు ఇప్పుడు?

Kishore: మనమంతా వంతుల వారీగా గస్తీ తిరగాలి ప్రతి రాత్రి. అదొక్కటే సొల్యూషన్.

Venkat: దానికి మనమెందుకూ? మన ఘూర్కా ఉన్నాడు కద!

Aruna: వాడికి మనకున్న ఇంటరెస్టు ఏముంటుందండీ? నెల జీతానికి పని చేసే వాడు! నాకు కిషోర్ ఐడియా బాగా నచ్చింది. మొదటి గస్తికి మా ఆయన పేరు కూడా రాసెయ్యి కిషోర్!

Venkat: నువ్వుండవే భార్యామణి. ఇది కాస్తఆలోచించాల్సిన విషయం. నేను అసలు నిద్ర ఆపుకోలేను అన్న సంగతి నీకు తెలుసు కద! నేను గస్తీకి తిరిగినా ప్రయోజనం ఉండదు.

Kishore: నీది మరీ చోద్యం వెంకట్. ఆ గజగజలాడే చలిలో నీకు నిద్ర రమ్మన్నా రాదు.

Venkat: అమ్మో! అదొకటి మర్చిపోయాను. నేను నా ఓవర్‌కోట్ వేసుకుని వస్తాను ఐతే.

Aruna: చాల్లెండి. మా బాబాయి చవకగా వస్తుందని ఆ బరువైన ఓవర్‌కోట్ మీకు పెళ్ళిలో చదివించారు.అది వేసుకుంటే పరిగెత్తడం మాట అటుంచి, కనీసం నడవలేరు కూడా. ఇక దొంగని ఏం పట్టుకుంటారు?

Venkat: అన్నట్టు ఆ గస్తీలో అందరూ ఏదో ఒక కూత కూస్తారు. అది ఏంటోయి కిషోర్?

Kishore: (అరుస్తాడు పెద్దగా) పారా హుషార్!

Venkat: ఇదిగో! నిన్ను చెప్పమన్నాను. అరవమనలేదు. నా కర్ణభేరి పగిలినట్టుంది అని నా అనుమానం.

Kishore: అలా అరవాలి వెంకట్. అప్పుడే అందరు అప్రమత్తంగా ఉంటారు. పడుకున్న వాళ్ళతో సహా! మనం ఎవరినీ మొద్దు నిద్ర పోనీయం. అదే మన గస్తీ ఆశయం.

Venkat: అదే మన ఆశయం ఐతే నేను మీతో గస్తీ తిరుగుతూనిద్ర మేల్కోవడమే బెటర్!

Kishore: అది అలా ఉండాలి. ఇక భోజనం చేద్దాం. కాస్త ఓపిక వస్తుంది. ఆ తరువాత మిగతా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఈ ఐడియా చెప్పొస్తా.

Venkat: మళ్ళీ వస్తావా ఈ రోజు?

Kishore: ఈ రోజు కాదులే. రేపు రాత్రి పది గంటలకి. భోజనానికి కాదులే. గస్తీ వెళ్ళాలిగా! అందరిని తీసుకుని వస్తా.

Aruna: పదండి మరి, వడ్డిస్తా.

(End of scene 1)

Scene 2:

Venkat: పది గంటలు కావొస్తూంది. ఇంకా మన వాడు అందర్ని పోగేసుకుని రాలేదేంటి చెప్మా?

Aruna: మీకన్నిటికీ తొందరే. అందరి ఇళ్ళకూ వెళ్ళి పట్టుకు రావాలంటే టైం అవుతుంది కద!

Venkat: పట్టుకు రావడానికి వాళ్ళేమైన పిట్టలా ఉడుతలా? నాకేమో ఆల్రెడీ ఆవులింతలు వచ్చేస్తున్నాయి.

Aruna: దానికి నా దగ్గర ఒక చిట్కా ఉందండీ. ఇంద, గొడవ చేయకుండా ఈ గ్లాసుడు జూస్ తాగెయ్యండి చెప్తాను.

Venkat: ఏంటోయి అది? (అనుమానంగా)

Aruna: కాకరకాయ జూస్ లెండి. సర్వరోగ నివారిణి. కొత్త ఉత్సాహం వస్తుంది మీకు తాగితే.

Venkat: అయ్య బాబోయి! నేను నీకు ఏం ద్రోహం చేశానే? ఆ చేదు కషాయం నాకు పోస్తున్నావు!

Aruna: ద్రోహం కాదండి. మేలు. వంటికి ఎంతో మంచిది. తాగండి.

Venkat: ఒక రకంగా ఇదే మంచిదిలే. ఆ చేదు రుచి నాలుక మీద ఉంటే, నిద్ర మాట దేవుడెరుగు, ఈ బతుకు మీదే ఇంటరెస్టు పోతుంది. ఇలా ఇవ్వు.

Kirshore: వెంకట్, వెంకట్ , తలుపు తియ్యి.

Aruna: నేను తీస్తానుండండి.

Kishore: ఇంకా తయారు కాలేదా? అదేంటి వెంకట్, అలా కాకరకాయ తిన్నట్టు మొహం పెట్టావు, అంతా ఓకేనా?

Venkat: తినలేదు, తాగాను. నీ ఖవ్వాలీ విన్న ఫీలింగ్ వచ్చింది. అన్నట్టు, మిగతా వాళ్ళంతా ఏరి?

Kishore: వాళ్ళెవరు?

Venkat: వాళ్ళెవరా? మనతో పాటు గస్తీకి వచ్చేవాళ్ళు.

Kishore: సారీ వెంకట్. ఇప్పుడే అందిన తాజా వార్త. మనతో ఎవరూ రావట్లేదు.

Venkat: ఎందుకుట?

Kishore: వాళ్ళకు కుదరదట.

Venkat: అదే ఎందుకు కుదరదట?

Kishore: ఒక్కొక్కరికి ఒక్కొ కారణం ఉంది. ఎవరినీ తప్పు పట్టలేములే.

Venkat: ఏంటా కారణాలు. అసలే నోరంతా చేదుగా ఉంది. తొందరగా చెప్పు.

Kishore: సరే చెప్తాను. శ్రమ తెలియకుండా విను. నరసింహనాయుడు గారింటికి వెళ్తే, ఆయన తొడకి కాపడం పెట్టుకుంటున్నాడు.

Venkat: ఎందు వలన చేత?

Kishore: నిన్న ఆయనకి గస్తీ గురించీ చెప్పాను కద అప్పటినుంచి దొంగలు చూడగానే భయపడి పారిపోయేలా పవర్‌ఫుల్‌గా ఉండాలని, పొద్దున్నుంచి తొడ కొడుతూ ప్రాక్టీస్ చేశాడట. దాంతో తొడ బూరెలా వాచిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. రాలేను అని చాలా బాధగా చెప్పాడు.

Venkat: ఓహో, మరి వాస్తు శాస్త్రిగారు?

Kishore: ఆయన ఈశన్యంనుంచి మన కాలనీలోకి ఎంటర్ అవుతారట. ఆ పని మీద ఉన్నారు.

Venkat: అక్కడనుంచి ఎలా వస్తాడయ్యా? అటు వైపు అంతా ఎత్తయిన కొండలు కద!

Kishore: అందుకే అవతలవైపు నుంచి తాడు వేసి పాకుతూ ఎక్కి, మళ్ళీ అదే తాడు వెసుకుని మన కాలనీలోకి దిగుతారంట. నెక్స్ట్ మంత్ కల్లా వచ్చేస్తామన్నారు.

Venkat: ఏడ్చినట్టుంది. మరి మన సమరసింహారెడ్డి?

Kishore: ఆయన కనీసం ఇంటినుంచి బయటకు కూడా రావట్లేదు.

Venkat: ఏం?

Kishore: నిన్న సమరసింహారెడ్డి గారు బార్బర్ దగ్గరికి వెళ్తే, వాడు పొరపాటున ఆయన బుర్ర మీసాలు కత్తరించేశాడట. అప్పటినుంచి ఆయన
ఇంటి బయటకు రావట్లేదు. అవమానంతో కుమిలి పోతున్నాడు. ఆ మొహం ఎవరికి చూపించలేడట!

Venkat: ఆ మొహం మనం కూడా చూడలేములే. నెక్స్ట్.

Kishore: భీష్మారావు గారు వాళ్ళింట్లో ఆయనకు కావల్సినవి వండట్లేదని, భీష్మించి బయటే అంపశయ్య మీద పడుకున్నారట.

Aruna: అంపశయ్యా? అంటే బాణాలతో వేసిన పరుపు. అది ఆయనకి ఎక్కడిది?

Kishore: అంటే ఆయనకు బాణాలు దొరకలేదు. మేకుల మీద పడుకున్నాడు. దాంతో సెప్టిక్ అయ్యింది. ఆస్పత్రికి తీసుకెళ్ళారు.

Venkat: హతోస్మి! మరి మిలటరీ మాధవ రావు?

Kishore: ఆయన ఈ లాటీలు పట్టుకుని తిరగడం వల్ల లాభం లేదు, బార్డర్ నుంచి ఒక టాంక్ తీసుకొస్తానని కాష్మీరు వెళ్ళాడు.

Venkat: ఇంకాయన తిరిగి వచ్చినట్టే!

Kishore: అలాగే కమ్యూనిస్ట్ కనకారావు పొద్దున్నే భూపోరాటం పేరున గవర్నమెంట్ స్థలాల్లో ఎర్ర జెండాలు పాతడానికి వెళ్తే, పోలీసులు అరెస్ట్ చేశారంట. ఈ రాత్రికి తిరిగి రాడు. ఇంకా చెప్పమంటావా?

Venkat: వద్దు నాకు వినే ఓపిక లేదు. ఇంకెవ్వరూ రారని అర్థమయ్యింది. మనకు తప్పదు. పద గస్తీకి బయలుదేరుదాం.

Kishore: మనమేంటి? వెళ్ళాల్సింది నువ్వు.

Aruna: మరి నువ్వు వెళ్ళవా?

Kishore: నీకు తెలీనిదేముంది వదినా, నేను అస్సలు నిద్ర ఆపుకోలేను. ఏదో వీళ్ళందరూ గస్తీ తిరుగుతూంటే హాయిగా వెచ్చగా ఇంట్లో పడుకుందామనుకున్నా. తీరా చూస్తే ఇలా అయ్యింది. కనీసం వెంకట్ ఐనా గస్తీ తిరుగుతాడు. నాకదే చాలు. బెస్ట్ అఫ్ లక్‌రా.

Venkat: నరుకుతానొరేయి. అందరూ కుంటి సాకులు చెప్పి తప్పించుకుని నన్ను వీధుల్లో నెడతారా! నేను చచ్చినా గస్తీకి వెళ్ళను.

Kishore: ఎహె వెళ్ళు వెంకట్. ఎలాగూ కాకరకాయ రసం తాగావు కద. నిద్ర పట్టదు. గస్తీకి వెళ్తే
ఒక పని అయి పోతుంది కద!

Venkat: ఆ కాకరకాయ రసం ఇంకా మిగిలుందిరా కాస్త. నీకు కొంత పట్టిస్తా. నీ పని అయిపోతుంది.

Kishore: అమ్మో కాస్త మెంటల్ వచ్చినట్టుంది. అర్జెంట్‌గా పారి పోవాలి.

Venkat: ఆగరా కిషోర్ ఆగు.

End of scene 2

End of play

Advertisements
This entry was posted in నాటికలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s