"ళ" తెచ్చిన తంటా!

అది త్రిలింగ దేశం! ఇరవై ఒకటవ శతాబ్దం! త్రిలింగ భాష భ్రష్టు పట్టి, సారీ అభివృద్ధి చెంది, చాలా రోజులయ్యింది. ఎవరో కొందరు పాత చింతకాయ పచ్చడి టేస్ట్ — అంటే కావ్యాలూ, ప్రబంధాలూ, గట్రా నచ్చడం అన్న మాట — ఉన్న వారు, తప్ప దాదాపు అందరూ “ళ” పలకడం మర్చిపోయారు.

అంతే కాకుండా ఆంగ్లికం అనే పరాయి భాషతో కలిపి త్రిలింగాన్ని మాట్లాడడం కూడా అందరికి బాగా అలవాటయి పోయింది. తద్వారా, “అంత సినిమా లేదు”, “ఎక్కువ బిల్డప్ ఇవ్వకు”, “ఆ సినిమా టేకింగ్ బాగుంది”, “నేను సైడయిపోయా”, “స్పాట్ పెడతా”, లాంటి ప్రయోగాలు త్రిలింగంలో సర్వ సాధారణమైపోయాయి.

ఛాందసవాదులు కొందరు ఈ పరిస్థితికి బాధ పడ్డా, చాలా మంది ఈ మార్పుకి అభ్యంతరం చెప్పలేదు. ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసర్ల కొడుకులు ఈ మార్పుకి బోలెడు ఆనందించారు. ఇంతకు ముందు వీరందరూ వమెరికాలో చదువు వెలగబెట్టి విండియాకి రాగానే సినిమా హేరోలుగా రూపాంతరం చెందేవారు. ఐతే అందుకోసం అసహ్యంగా వాళ్ళకు త్రిలింగ భాషా ఉచ్చారణలో తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకపోయింది. ఇప్పుడు హీరో కావాలంటే, రెండేళ్ళ పిల్లలు ఎంత త్రిలింగం మాట్లాడతారో అంత వస్తే చాలు. హీరోయిన్లకి అది కూడా అవసరం లేదనుకోండి. అది వేరే విషయం.

అలా ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న త్రిలింగదేశంలో ఒక కలకలం చెలరేగింది. ఒక ప్రొడ్యూసర్‌కి ఒక వర్దమాన హీరోయిన్‌కి మధ్య జరిగిన తగాదా అది.

ప్రొడ్యూసర్ ప్రకారం అతనేం తప్పు చేయలేదు. ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆ హీరోయిన్ ఈడ్చి ఈయన్ని లెంపకాయ కొట్టింది. తను అనకూడనిది ఏమీ అనలేదు అంటాడు ఆయన. హీరోయిన్ ఏమో కాల్ షీట్స్ నెపం మీద ఇంటికి వచ్చి, అసభ్యంగా మాట్లాడాడని, తన దగ్గర లేనిది అడిగాడని విలేఖరులతో చెప్పింది.

అసలే ఇలాంటి న్యూస్ కోసం ఎదురు చూసే “గ్రేట్ త్రిలింగా” లాంటి కొన్ని గాసిప్ వెబ్‌సైట్స్ అర్జెంటుగా “She doesn’t have ‘that'” లాంటి హెడ్డింగ్స్ పెట్టి తమ “హిట్స్” పెంచుకున్నాయి. యధావిధిగా త్రిలింగులు అందరూ ఆ న్యూస్ లొట్టలు వేసుకుంటూ చదివారు.

ఈ గొడవ ఇంకా పెద్దది కాకముందే పరిష్కరించాలని త్రిలింగ సినిమా సంఘం (త్రి.సి.స.) ఈ గొడవకు సంబంధించిన వారందరి మధ్య ఒక సర్దుబాటు సమావేశం ఏర్పాటు చేసింది. ప్రొడ్యూసరూ హీరోయినూ ఇద్దరూ, తమ తమ తరపున వత్తాసు పలికే సాక్షులని కూడా తెచ్చుకున్నారు.

త్రి.సి.స. అధ్యక్షుడు ముందుగా హీరోయిన్‌ని మాట్లాడవలసిందిగా కోరాడు. ఆవిడ గ్లిసరిన్ లేకుండానే కంట తడి పెడుతూ, “ఏం చెప్పమంటారు! ఏదో సినిమా తీస్తున్నాను, దాని గురించి మాట్లాడాలి అని మా ఇంటికి వచ్చాడు. వచ్చిన వాడు ఆ విషయం మాట్లాడకుండా, మీ ఇంట్లో మంచి మినీ బార్ ఉందటగా, ఆ మందు నాక్కూడా కాస్త రుచి చూపించండి అంటూ పిచ్చి పిచ్చిగా వాగడం మొదలు పెట్టాడు. నా దగ్గర అలాంటివేం లేవు, నేను అప్పుడప్పుడు టీ తప్ప ఇంకేం తాగను అని చెప్పినా వినిపించుకోలేదు. మా హీరో గారికి ఇచ్చారట కద. నాకూ ఇవ్వండీ అని కన్ను కొట్టాడు. అంత అసహ్యంగా మాట్లాడితే ఎలా ఊరుకుంటాను చెప్పండి? అందుకే ఒకటి గట్టిగా పీకాను,” అని చెప్పింది ఆవిడ.

ఆ రోజు హీరోయిన్ ఇంట్లో ఉన్న వారందరూ ఆవిడ చెప్పిన దాన్ని బల పరిచారు. అక్కడే ఉన్న “గ్రేట్ త్రిలింగా” విలేఖరి, “హీరో్‌కి ‘అది’ ఇస్తా, నీకు ఇవ్వను అన్న హీరోయిన్” అనే టైటిల్ పెట్టి కొత్త న్యూస్ ఐటం తన laptopలో రాయడం మొదలు పెట్టాడు.

ప్రొడ్యూసర్ తన వాదన వివరిస్తూ, “అధ్యక్షా, నేను అసభ్యంగా ఏం మాట్లాడలేదు. మా హీరో చెప్పాడు ఆవిడ దగ్గర మంచి మందు దొరుకుతుందని. అందుకే అడిగాను. ఆవిడ మొదట్లో ఇవ్వనంటే మొహమాట పడుతూందేమో అనుకుని మా హీరోకి ఇచ్చిన విషయం గుర్తు చేశా,” అన్నాడు.

దాంతో సదరు హీరో గారిని కూడా పిలిపించారు. అతగాడు కంగారుగా, “అంత సినిమా లేదు అధ్యక్షా, నేను ప్రొడ్యూసర్‌తో అలా ఏం చెప్పలే,” అని మొరాయించాడు. ప్రొడ్యూసర్‌కి వొళ్ళు మండి, “చెప్పావు అలా!” అంటూ గర్జించాడు. “చెప్పలే,” అన్నాడు హీరో.

ఇలా కాసేపు అయ్యాక త్రి.సి.స. అధ్యక్షుడికి చిరాకు పుట్టి, “అసలు హీరో మీతో ఏం అన్నాడో యధాతథంగా చెప్పండి,” అని ప్రొడ్యూసర్‌ని రిక్వెస్టు చేశాడు. అప్పుడు ప్రొడ్యూసర్, “హీరో అంతకు ముందే ఈ హీరోయిన్‌ని కలిసి వచ్చాడు. నేను నీకు ఆమెలో ఏం నచ్చింది అని అడిగాను. అతను ‘ఆవిడ కల్లు’ అని చెప్పాడు. అది గుర్తుండే ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకూ కాస్త మందు పోయమని అడిగాను,” అన్నాడు.

“చూశారా. నేనెప్పుడు చెప్పా మందు గురించి?” అడిగాడు హీరో. “కల్లు అంటే మందే కద?” కోపంగా ప్రశ్నించాడు ప్రొడ్యూసర్.

“ఓరి దేవుడో! నేను చెప్పింది ఆవిడ కల్ల గురించి,” తన eyes చూపిస్తూ explain చేశాడు హీరో.

అంతే! ఒక్క ఉదుటున అందరికి విషయం అర్థమయ్యింది. ఆ తరువాత హీరోయిన్, హీరో, ప్రొడ్యూసర్ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం జరిగిపోయాయి. టైం వేస్టు చేయడం ఎందుకని, “నా నెక్స్ట్ పిక్చర్‌లో వీల్లే హీరో హీరోయిన్‌లు,” అని ప్రకటించేశాడు ప్రొడ్యూసర్.

ఆ తరువాత అక్కడున్న వారంతా ఈ గొడవ జరిగింది “ళ” అనే అక్షరం వల్ల, అని తీర్మానించారు. దీనికి పరిష్కారం త్రిలింగ భాషలో “ళ” ఉన్న అన్ని పదాల స్థానంలో వేరే వాటిని వాడడమే అని అభిప్రాయ పడ్డారు. అందుకోసం ఒక కమీషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తరువాత ఆ ఆనందకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కల్లు (మందు లెండి) తాగారు

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

13 Responses to "ళ" తెచ్చిన తంటా!

 1. Vamsi M Maganti says:

  బావుందండీ మురలి గారూ ఈ టపా సూద్దారి అని రాగానే నా కల్లు ఆస్చర్యంతో తెర్సుకున్నాయి, అనందంతో కన్నీల్లు వొచ్చినాయ్..మీ రాతలు అద్బుతమని, అవి ఇలా ఎన్నో ఏల్లు కొనసాగాలని గట్టిగా కోరుకుంటు నొక్కి వక్కానిస్తున్నాను…

  మురళి గారూ , బావుంది ..చాలా బాగా రాసారు ..అందుకోండి అభినందనలు

 2. oremuna says:

  బాగుంది

 3. మేధ says:

  మీ ‘కల్లోపాఖ్యానం’ బావుందండీ…!

 4. Ramdas Nandagiri says:

  చాలా బాగా వ్రాశారు. తెలుగులో కన్నా కన్నడం లో ళ, హ ల వాడకం చాలా ఎక్కువ. చాలామంది తెలుగువాళ్లకి ఇవి రెండు పలకడం కష్టం, అందుకే కన్నడ మాట్లాడటానికి కష్టపడవలసి వస్తుంది 😉

  నమస్కారాలతో,
  ~సూర్యుడు 🙂

 5. ప్రవీణ్ గార్లపాటి says:

  అద్భుతమయిన టపా…
  వాడకంలో తప్పులని బాగా ఎత్తిచూపారు 🙂

 6. రాఘవ says:

  “ళ” యెక్కువ కనిపించేలా యీ మధ్యనే వేటూరిగారు వ్రాసిన వొక పాట గుర్తుకొచ్చింది యిది చదివాక.

 7. వికటకవి says:

  చాలా బావుందండీ. కాకపోతే, ఇప్పుడు తెలంగాణా ఉద్యమ ప్రభావమే గానీ మరోటి గానీ, “ళ” బదులు “ల” ని నిక్షేపంగా ఈటీవీ లో కూడా బ్రహ్మాండంగా పలకనిచ్చేస్తున్నారు. తెలంగాణా మాండలీకంలో “ళ” కి చోటు లేదు కదా.

 8. రాధిక says:

  “చ” బదులు “స”,”శ”బదులు “ష”,”ళ”బదులు “ల” ఇలా మార్చి మాట్లాడడం మనకే చెల్లుతుంది.తమిళం వాళ్ళకి “హ” లేదట.అందుకు మహారాజా ని మగారాజా అని పలుకుతూ వుంటారు.అది వారి చాదస్తం.మరి మనవాళ్ళకేమి దౌర్భాగ్యమో వున్నవాటిని పలకడానికి.

 9. రానారె says:

  భలే :)))

 10. .C says:

  “పరభాషను వ్రాయటానికి తెలుగులో అక్షరాలు తక్కువయ్యాయి” అని బాధ పడే నాలాంటి వారు కొందఱయితే ఉన్న అక్షరాలు కూడా సరిగ్గా పలకటం రాక, పలకాలని తెలిసినా భాష పట్ల గౌరవం లేక నేర్చుకోదలచని వాళ్ళు మఱి కొందఱు!

  ఈ బాధ ఒక్క ళ-కారానికే కాదు… ఋత్వానికి, ణ-కారానికి, బండెక్కి పారిపోతున్న శకటరేఫానికీ (“ఱ”) తప్పలేదు. “మా వంశంలో పుట్టినవాళ్ళు మాట్లాడినంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడేవారు చిత్రపరిశ్రమలోనే లేరు!” అని గొప్పగా చెప్పుకున్న ఒక కథానాయకుని తరువాతి తరంలో వచ్చిన వారిలో ముగ్గురిలో ఇద్దరు సరైన తెలుగు పలకలేరు. అది మన ఖర్మ!

 11. దైవానిక says:

  బాగా చెప్పారు. ఇలా ఒక్కొక్క అక్షరం తగ్గుకుంటూ పోతే అరవంలో లాగా 30 కి వచ్చేస్తుందేమో అక్షరసంఖ్య!!!!!!!

 12. Karthik says:

  masteru adooooorssssss.

  chala bagaundandi ee tapa.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s