మనవాళ్ళు ఉత్తి వెధవాయిలోయ్!


ఆ మాట వింటే చాలు నాకు ఉక్రోశం పొడుచుకొచ్చేది. నా బాధ మన వాళ్ళను వెధవాయలు అన్నారని కాదు. నా బాధ పక్క వాళ్ళ వెధవాయత్వం ఎందుకు గుర్తించలేదు అని.

“మన వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా చేసే వెధవ పనులేంటో?” అడిగాను రాజేష్‌ని. మా మిత్ర బృందంలో వాడొక పెద్ద మేధావి.

“మన వాళ్ళకు పబ్లిక్ ప్లేసెస్‌లో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలీదు,” బఫే నుంచి తెచ్చుకున్న ఉల్లిపాయ పకోడాల అంతు చూస్తూ చెప్పాడు వాడు. మేము “మిత్రా” రెస్టారెంట్‌లో ఉన్నాం. అక్కడ ఎప్పుడూ సమృద్ధిగా బఫే ఉంటుంది. అసలు చాలా మంది అక్కడికి వచ్చేదే దానికోసం.

“అంటే, మన చుట్టు పక్కల రాష్ట్రాల వాళ్ళకు తెలుసా ఎలా బిహేవ్ చేయాలో పబ్లిక్ ప్లేసెస్‌లో?” కోపంగా అన్నాను నేను.

“అందరికి కాకపోయినా కొందరికన్నా తెలుసు,” ఖాళీ అయిన ప్లేట్‌ని మళ్ళీ నింపుకోవడానికి బయలుదేరుతూ అన్నాడు మా వాడు. నా లంచ్ ఎప్పుడో అయిపోయినా నేను కూడా వాడి వెంటే బయలుదేరాను. ఈ వాదనలో బ్రేకులు ఇవ్వదల్చుకోలేదు నేను.

“మన వాళ్ళ ముఖ్యమైన ప్రాబ్లెం థియేటర్లలో, ఆడిటోరియంలలో నోరు మూసుకోలేక పోవడం,” వివరించాడు వాడు ఒక డజన్ మసాలా వడలని ప్లేట్‌లో అందంగా అమర్చుకుంటూ.

“వేరే భాషల వాళ్ళు కూడా గోల చేస్తారు!” దాదాపు అరిచాను నేను.

“చేస్తారు, కాని ఎల్లప్పుడూ చేయరు. నోరు మూసుకోవాల్సిన చోట మూసుకుంటారు. ఉదాహరణకు ఏ కర్ణాటక సంగీత కచేరికో వెళ్ళి చూడు. తమిళులంతా దాదాపు పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తారు. దాని వల్ల అందరికీ ఆ ప్రోగ్రాంలో లీనమయ్యే అవకాశం ఉంటుంది,” ఎక్స్‌ప్లేన్ చేశాడు రాజేష్.

“మన వాళ్ళు వెళ్ళేది రికార్డింగ్ డాన్సులకి కద! అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తే, కళాకారులు నొచ్చుకుంటారు,” సర్ది చెప్పాను నేను.

వాడు నన్ను పట్టించుకోకుండా, “అంతే కాదు, సినిమా చూసేప్పుడు కూడా, పిల్లి కూతలు కూయడం, చెత్త జోకులు వెయ్యడం, నచ్చని పాట వస్తూంటే తమలో తాము బిగ్గరగా మాట్లాడేసుకోవడం, మనకు సర్వ సాధారణం. మొన్న ఒక గొప్ప హీరో చిత్రానికి యధా విధిగా నా వెనకాల వాళ్ళు కాకి గోల చేస్తూంటే, వాళ్ళని బతిమాలుకున్నాను, కొంత మెల్లగా మాట్లాడమని. దానికి వాళ్ళలో ఒకడు, మేమూ టికెట్ కొన్నాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చూస్తాం, నీకంత సైలెన్స్ కావాలంటే ఇంట్లో డీవీడీ వేసుకుని చూడు అంటూ ఏ మాత్రం సంబంధం లేని లాజిక్‌తో దబాయించాడు. పక్కనున్న ఇంకొకాయన, మాస్టారూ చూడబోతే మీరు ఎడ్యుకేటెడ్‌లా ఉన్నారు, పబ్లిక్ ప్లేసెస్‌లో సైలెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారేంటండీ అంటూ నాకే నచ్చ చెప్పాడు,” అని నిట్టూర్చాడు.

“నిజమే కదా,” అంటూనే నాలుక కరుచుకున్నాను నేను. కాని అప్పటికే డామేజ్ జరిగి పోయింది.

నా వైపు క్రూరంగా చూస్తూ, “ఇదిగో ఇలా ఏడ్చింది మన కల్చర్,” అన్నాడు రాజేష్.

“ఒరేయి రాజిగా, మనని కల్చర్ లెస్ బ్రూట్స్ అంటావా?” వాడి మెడ దొరకబుచ్చుకున్నా నేను.

“అది నేననలేదు. నువ్వే అన్నావు. పైగా నా గొంతు పట్టుకుని కన్‌ఫర్మ్ కూడా చేశావు,” అన్నాడు శాంతంగా “రాజి గాడు.”

నేను మళ్ళీ అహింసని ఆశ్రయించాను. “అది కాదురా, ఒక మాస్ సినిమాలో ఆ మాత్రం గొడవ ఉండాలి. లేకపోతే దానికి అందం ఉండదు,” అన్నాను మృదువుగా.

“ఒక సినిమానో రికార్డింగ్ డాన్సో మాత్రమే కాదు. ఆఖరికి జండా వందనం దగ్గర కూడా మన వాళ్ళు నాన్-స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటారు. ఏ సాంస్కృతిక కార్యక్రమాని కన్నా వెళ్ళి చూడు. మెజారిటీ మనుషులు, స్టేజ్ మీద ఏం జరుగుతున్నా, వాళ్ళలో వాళ్ళు, ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్‌గా మాట్లాడుకుంటూంటారు. మన వాళ్ళకి సంబంధించినంత వరకూ లివింగ్‌రూంకి, థియేటర్‌కి, ఆడిటోరియంకి ఏ మాత్రం తేడా లేదు,” గుక్క తిప్పుకోకుండా అన్నాడు వాడు.

ఇలానే వదిలేస్తే వీడు ఇంకా ఎన్ని దారుణమైన అభిప్రాయాలు బయట పెడతాడో అనుకుని టాపిక్ మార్చాను నేను.

“ఈ వీకెండ్ ఏం చేస్తున్నావురా,” అడిగాను.

“మా జపనీస్ కొలీగ్ ఇంటికి పార్టీకి వెళ్తున్నా. పార్టీ అంటే మళ్ళీ అపార్థం చేసుకునేవు. ఈ శనివారం పూర్ణిమ. వాళ్ళు రాత్రంతా చంద్ర కాంతిని ఆస్వాదిస్తూ, గంటల తరబడి అలానే మౌనంగా కూర్చుంటారు. మన వాళ్ళు నోరు మూసుకుని వుండగలరు అన్నావుగా ఇందాక? మరి వస్తావా?” నవ్వుతూ అడిగాడు వాడు.

నేను గతుక్కుమన్నాను. “లేదురా ఆ రోజు ఆండాళమ్మ వాళ్ళింట్లో పాట్ లక్ ఉంది. వెళ్ళక తప్పదు,” అన్నాను.

రాజేష్ గాడికి మతి చలించి అలాంటి దిక్కు మాలిన పార్టీలకి వెళ్తున్నాడు కానీ, వంటి నిండా వేడి తెలుగు రక్తం ప్రవహించే నా లాంటి వాడు అంత సేపు మాట్లాడకుండా కూర్చోగలడా?

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

9 Responses to మనవాళ్ళు ఉత్తి వెధవాయిలోయ్!

 1. రవి says:

  ;D…అదుర్స్..యర్రంశెట్టి సాయి పోలిక కనబడింది ఈ టపాలో.

 2. బాగుంది. రసవత్తమైన చర్చ. కాకపోతే “మనం ఉత్త వెధవాయిలు” అనిపించారు.

 3. భలే రాశారు. 🙂
  మనం “టిక్కెట్టు కొని” వెళ్తాం కాబట్టి సినిమా హాలు పబ్లిక్ ప్లేసు కాదని మీ ఫ్రెండుకు తెలిసే ఉండాలే?

 4. Venu Aasuri says:

  Very nice, well done!

 5. Murali says:

  సుగాత్రి గారూ, మీరు మరీనూ! ఆ మాత్రం లాజిక్ మా రాజేష్‌గాడికుంటే, వాడు ఆ సైలెంట్ పార్టీకి ఎందుకు వెళ్తాడు చెప్పండి?

 6. మీ టపా కేక. తమిళులు సంగీత కచేరీలో సైలెంట్ గుంటారేమోగాని, మిగతా చోట్ల మనకన్నా ఘనులు. మీ ఫ్రెండ్ చెప్పిన లక్షణాలు మనకే కాదు, ఇండియా అంతా వున్నాయి. అవి మన జాతీయ లక్షణాలు. ఈ లక్షణాలు లేని మీ ఫ్రెండ్‌ని అర్జెంటుగా పాకిస్తాన్‌కో, లేకపోతే అతనికిష్టమైన జపాన్‌కో పంపించెయ్యండి.

 7. ఆయ్ఁ… ఎవరిక్కడ మనల్ని “వెధవాయిలంది”.

  నోరు కట్టేసుకుని తెలుగు సినిమా చూస్తే ఇంక అందులో మిగిలిందేముంది ?‌ 🙂

 8. brijbaala says:

  అంతేనా? పబ్లిక్ ప్లేసెస్ లో గట్టిగా మాట్లాడటం వరకేనా? ఇండియా లో విమానాలు దిగేటప్పుడు చూడలేదా మన వాళ్ళని? ముందు రో లో కూర్చున్న వాళ్ళని వెళ్ళనివ్వకుండా తోసుకుని మరీ దిగేస్తారు, చూళ్లే?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s