శ్రీ శ్రీ శ్రీ సైగానంద స్వాముల వారి మహత్మ్యం


మా వూరిలో చిన్న దుమారం చెలరేగింది. మహాభక్తుడైన మా అప్పారావు వల్ల నాకు ఆ విషయం ఏంటో తెలిసింది.

“మన వూరిలో ఒక కొత్త స్వామి వారు వెలిశారు,” మహా ఉత్సాహంగా సెలవిచ్చాడు మా అప్పడు.

“అవునా? ఆయన ఎందుకు మన ఊరు వచ్చినట్టు?” అడిగాను నేను.

“ఆయన దాని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఆ విషయానికి వస్తే ఆయన దేని గురించీ చెప్పరనుకో. ఆయన ఒక మౌన ముని,” కళ్ళు పరవశంగా పెట్టి అన్నాడు అప్పారావు.

“మన రె.కాఘవేంద్ర రావులా అన్న మాట.”

“ఆయన దర్శక మౌని. ఈయన మౌన ముని. ఇంకా చెప్పాలంటే ఆయన తను చేస్తున్న పనులకు సిగ్గు పడి మాట్లాడడు. ఈయన మానవ జాతి చేస్తున్న పనులకు సిగ్గు పడి మాట్లాడ్డం మానేశాడు.”

“పాపం రె.కాఘవేంద్ర రావు అంత సిగ్గు మాలిన పనులు ఏం చేశాడేంటి?”

“నాకు కోపం తెప్పించకు గురూ! బ్యాండు రంగడు సినిమా గురించి ఆపుడే మర్చిపోయావా?” మొహం కందగడ్డలా చేసుకుని అడిగాడు అప్పారావు. 

నేను నాలుక కర్చుకున్నాను. బ్యాండు రంగడు చూసి తేరుకోవడానికి మా అప్పిగాడికి నెల పట్టింది.

హడావుడిగా టాపిక్ మారుస్తూ, “ఓహో, మరి ఈ స్వామి వారి గురించి మనకు ఏం తెలుసు? ఆయన మాట్లాడరన్నావు కద!” ప్రశ్నించాను నేను.

“ఆయన మాట్లాడడు అన్నానే కానీ, ఆయన శిష్యులు మాట్లాడరు అనలేదు కద!”
 
“ఓ, ఆయనకి శిష్యబృందం కూడా ఉందా?”

“ఉన్నారు గురూ! వారిలో ఒకతను ప్రధాన శిష్యుడు.”

“అది ఎలా తెలుసు నీకు?”

“అంటే ఆయనకి ఒక్కడికే స్వామి వారి సైగలు అర్థమవుతాయి.”

“స్వామి వారు సైగలు చేస్తారా? ఎందుకు?”

“భక్తులు ఏవన్నా ప్రశ్నలు అడిగితే స్వామి వారు సమాధానం చెప్పడానికి బదులు సైగ చేస్తారు. ఆ సైగకి అర్థం ఏంటో ఆయన ప్రధాన శిష్యుడు మాత్రమే చెప్పగలడు. ఇలా సైగలు చేస్తారు కనుకే ఆయనకు సైగానంద స్వామి అనే పేరు వచ్చింది,” వివరించాడు అప్పారావు.

నాకు కాస్త అర్థమయ్యింది. కాస్త కాలేదు. నా మొహంలో అనుమాన పిశాచాన్ని గమనించినట్టు ఉన్నాడు. అందుకే, “ఈ రోజు సాయంత్రం రంగయ్య గారింట్లో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. నువ్వు వస్తే, నీకు క్లియర్‌గా అర్థమవుతుంది,” నచ్చ చెప్పాడు అప్పారావు. సరేనన్నాను నేను.

***

రంగయ్యగారింట్లో ఉన్న పెద్ద హాల్‌లో అందరం గుమిగూడాం. స్వామి వారు ఇంకా వేంచెయ్యలేదు కాని ఆయనకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఒక చిన్న వేదిక. దాని మీద  అట్టహాసంగా ఉన్న ఒక పెద్ద కుర్చీ. చుట్టు పక్కల కాషాయ వస్త్రాలు వేసుకుని నిలబడి ఉన్న స్వామి వారి శిష్యబృందం. అందులో ఒకతను మాత్రము గులాబి రంగు దుస్తులు ధరించి వున్నాడు.

“స్వామి వారు తెలంగాణా ఉద్యమానికి సపోర్టరా?” అడిగాను నేను అప్పారావుని.

చిరాగ్గా మొహం పెట్టాడు వాడు. “స్వామి వారికి తుచ్ఛమైన రీజనల్ ఫీలింగ్స్ లేవు. నేను ప్రధాన శిష్యుడు అని చెప్పానే. ఆయనే ఈయన,” అన్నాడు. 

“సారీ,” నాలుక కర్చుకున్నాను నేను. “ష్‌ష్,” అన్నారు ఎవరో.

శ్రీ శ్రీ శ్రీ సైగానంద స్వాములవారు హాల్‌లోకి ప్రవేశించారు.

మాసిపోయిన గెడ్డంతో శూన్యంలోకి చూస్తూ, తనలో తాను నవ్వుకుంటూ, సూటిగా వెళ్ళి తనకు కేటాయింపబడిన కుర్చీలో కూర్చున్నారు ఆయన.

“జై సైగానంద స్వామికి, జై ఆశ్రిత జన రక్షక సామ్రాట్‌కి,”  అన్న అరుపులతో గది మారు మోగి పోయింది.

గులాబీ రంగు దుస్తులు వేసుకున్న ప్రధాన శిష్యుడు చేతులు పైకెత్తి అందరిని నిశ్శబ్దంగా ఉండమని సూచించాడు.

గదిలో సద్దు మణిగాక, “మీ ప్రశ్నలు స్వామి వారిని అడగండి,” అన్నాడు మృదువుగా.

ముందుగా రంగయ్యగారు, “స్వామీ, నా మనమడు అమెరికాలోని సెటిల్ అయిపోయి తిరిగి రాను అంటున్నాడు. వాడు తిరిగి వచ్చే అవకాశం ఉందా?” అంటూ ప్రశ్నించారు.

ప్రధాన శిష్యుడు స్వామివారి చెవిలో ఏదో చెప్పాడు. బహుశా ఇదే ప్రశ్నను రిపీట్ చేశాడు అనుకుంటా.

స్వామి వారు శూన్యంలోకి చూస్తూనే తన కుడి చేతి వేళ్ళు మడిచి మధ్య వేలు మాత్రం బయటకు తెరిచారు.

ప్రధాన శిష్యుడు కళ్ళు మూసుకుని, తన నుదిటిపై చేతిని ఆనించుకుని కాసేపు మౌనంగా ఉండి పోయాడు. తరువాత కళ్ళు తెరిచి రంగయ్యగారిని చూస్తూ, “అద్భుతం! స్వామి వారు ఒక సంవత్సరంలో మీ మనమడి మనసు మారుతుంది అంటున్నారు,” అన్నాడు. 

“అంటే అటూ ఇటూ ఊగకుండా, పెర్మనెంట్‌గా అమెరికాలోనే సెటిల్ అయిపోతాడా?” అడిగాను అప్పారావుని.

“నీ మొహం, మనసు మార్చుకుని తిరిగి వచ్చేస్తాడని అర్థం,” మెల్లగా చెప్పాడు వాడు.

“కాని దాని అర్థం అదే అని మనకు ఖచ్చితంగా ఎలా తెలుసు?”

“మనకు తెలీదు. అనువాదానంద స్వామికి తెలుస్తుంది. అందుకే ఆయన స్వామివారి ప్రధాన శిష్యుడయ్యాడు.”

అప్పుడు తెలియవచ్చింది నాకు, గులాబీ దుస్తులు ధరించ పెద్ద మనిషి పేరు అనువాదానంద స్వామి అని. ఏ మాటకామాట చెప్పుకోవాలి. పేర్లు చక్కగా కుదిరాయి. ఆయనకు సైగలు ఇష్టం. ఈయనకు అనువదించడం ఇష్టం.

తరువాత భక్తులు ఒకరి తరువాత ఒకరు తమ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు.

“బొత్తిగా మనశ్శాంతి ఉండట్లేదు స్వామీ!”

సైగానంద స్వామి చంకలు గుద్దుకున్నారు.

“అనుమానాన్ని అణిచి వేయి బిడ్డా. మనశ్శాంతి అదే వస్తుంది,” వివరించారు అనువాదానంద స్వామి.

“భక్తికి ముక్తికి తేడా ఏమిటి స్వామి?”

సైగానంద స్వామి ఈల వేశారు.

“భక్తి మనసులోంచి తన్నుకు వస్తే, బయటపడే ఈలే ముక్తి నాయన.” ఇది అనువాదానంద స్వామి.

భక్తులంతా హర్షధ్వానాలు చేశారు. 

“ఈ అనంత విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వామీ?”

స్వామి వారు ఆ భక్తుడిని దగ్గరకు రమ్మని సైగ చేశారు.భక్తుడు వెళ్ళి వినమ్రంగా నిలుచున్నాడు. స్వామి వారు చాచి పెట్టి ఒక తన్ను తన్నారు. బొక్క బోర్లా పడ్డాడు భక్తుడు.

“నచ్చని ప్రశ్నలు వేస్తే స్వామి వారు అలానే స్పందిస్తారు నాయనా. పైగా అన్ని నక్షత్రాలు అంటే, ఎన్ని వేళ్ళు చూపించాలి? అర్థం చేసుకో,” అన్నారు అనువాదానంద స్వామి.

“అన్ని మతాలు సమానమే అంటారా స్వామీ?”

సైగనాంద స్వామి కింద పడి అటూ ఇటూ దొర్లారు.

“ఆహా, గురువు గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. కింద పడి దొర్లినప్పుడు మట్టికీ మనకీ ఎలా తేడా ఉండదో, అలానే మతాల మధ్య తేడా ఉండదు,” నవ్వుతూ వివరించారు అనువాదానంద స్వామి.

భక్తులంతా స్వామి వారికి సాష్టాంగ పడ్డారు.

****

రెండు నెలల తరువాత మా ఊరు ఒక చిన్న సైజు పుణ్యక్షేత్రంలా తయారయ్యింది. భక్తుల రద్దీ తట్టుకోవడానికి లాడ్జిలు, వారి ఆకలి తీర్చడానికి హోటెల్స్ సర్వత్రా వెలిశాయి. మా మునిసిపల్ కౌన్సిల్ వారు  మా ఊరు పేరు సైగపురిగా మారిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెట్టారు. 

అందరి ఇళ్ళల్లో సైగానంద స్వామివారి నిలువెత్తు పటాలూ, విగ్రహాలూ వెలిశాయి. మా ఇళ్ళల్లో మిగతా దేవుళ్ళు పూజలకి నోచుకోవడం  మానేశారు. మాకు అసలు తీరిక ఉండడం లేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరి ఇంట్లో భజనలు, వారానికొకసారి స్వామివారి దర్శనం చేసుకోవడం సర్వ సాధారణమై పోయాయి.

***

ఒక శనివారం పొద్దున్నే మేము స్వామి వారి కుటీరానికి చేరుకున్నాం. అక్కడ నానా కోలాహలంగా ఉంది. రెండు పొలీసు వాన్‌లు, ఒక ఆంబులెన్స్ ఆగి ఉన్నాయి. గుంపులు గుంపులుగా జనం.

“ఏం జరిగింది?” భయపడుతూనే అక్కడ నిలబడి ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ని  అడిగాను. 

“ఆ ఏముంది. ఇదంతా ఒక పెద్ద రాకెట్ సార్! ఆ స్వామి పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న బాపతు అట. ఆ అనువాదం నాయల వాడికి స్వామి వేషం వేసి, వాడు చేసే పిచ్చి సైగలకు భాష్యం చెప్తూ ప్రజలని మోసం చేస్తూ వచ్చాడు ఇప్పటిదాక.

మొన్న టీవీలో మెంటల్ హాస్పిటల్ డాక్టరు గారు ఈ తంతు చూసి ఈ పిచ్చి వాడిని గుర్తు పట్టారు. వెంటనే ఆంబులెన్సు వేసుకుని వాళ్ళిటు వస్తూ, మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు.

అనువాద స్వామిని నాలుగు పీకితే సైగలు అవసరం లేకుండానే నిజం చెప్పేశాడు. అందరిని అరెస్టు చేసి తీసుకు పోతున్నాం. కొందరు భక్తులు అడ్డు పడ్డం వల్ల ఆలస్యం అయ్యింది,” ఓపికగా చెప్పాడు అతను. 

రెండు చేతులతో జుత్తు పీక్కుంటున్న సైగానంద స్వామిని ఆంబులెన్స్ ఎక్కిస్తున్నారు ఇద్దరు హాస్పిటల్ స్టాఫ్.

“కొంప దీసి మీరు కూడా ఆయన భక్తులా?” అనుమానంగా అడిగాడు కానిస్టేబుల్ నన్ను.

“అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు. ఐనా సైగలకు అనువాదాలేంటి, నాన్సెన్స్,” అన్నాను నేను తడబడుతూ. అప్పారావు గాడు నిజమే అన్నట్టు తలాడించాడు.

( ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మా రమణ రావు గాడికి థ్యాంక్స్.)

This entry was posted in అప్పారావు - నేను, కథలు. Bookmark the permalink.

7 Responses to శ్రీ శ్రీ శ్రీ సైగానంద స్వాముల వారి మహత్మ్యం

  1. రాజేంద్ర says:

    హమ్మా హెంత గుండేలుతీసినబంట్లు మీరు బాబోయ్!చితగ్గొట్టి చంపారండి,నాకు ప్రతివాక్యాన్ని బ్రహ్మానందం,కృష్ణభగవాన్ ల మీద ఊహించుకుంటూ చదివుతుంటే నాసామిరంగా..ముఖ్యంగా “స్వామి వారు శూన్యంలోకి చూస్తూనే తన కుడి చేతి వేళ్ళు మడిచి మధ్య వేలు మాత్రం బయటకు తెరిచారు”సీను.
    ఇప్పట్లో ఇలాంటివి రాయకండి మాకు నవ్వే ఓపికలేదు.

  2. రవి says:

    ” తను చేస్తున్న పనులకు సిగ్గు పడి మాట్లాడడు ” :-)..సూపర్…రమణ రావు అంటే ఎవరు? ఎందుకంటే శ్రీ రమణ గారి ” అరటి పువ్వు సాములారు ” అనే కథ గుర్తొచ్చింది. ఆయనదే ఓ జోకు.

    *******
    హృశీక్లేశం.

    సాములారు హృశీకేశం వెళ్ళారు.

    తమరు లేనప్పుడు దొంగలు పడి మొత్తం దోచేశారండీ అన్నారు చిన్న సాములారు.

    ” అందుకే శిశ్యా, భవబంధాలపై మోహం కూడదు ” అన్నారు సాములారు చిద్విలాసంగా.

    ” ఆయ్, దొంగలు మీ వెండిచెంబు, రొక్కం కూడా దోచేశారండీ! ”

    సాములారు అవాక్కయి, తేరుకుంటూ అన్నారు , ” భగవాన్, నీ లీలలు అర్థమ్ కావు కదా ” అన్నారు , శూన్యం లోకి చూస్తూ…

    ************

  3. Murali says:

    మీ సాములారి కథ బాగుంది. 🙂

    రమణ రావు అంటే ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు ఇదే బ్లాగ్‌లో ఉన్న Senior కథని చదవాలి.
    https://tetageeti.wordpress.com/category/senior/

  4. “ఆయన తను చేస్తున్న పనులకు సిగ్గు పడి మాట్లాడడు” – బాగా తిట్టారు. 🙂

  5. dr.subba says:

    Murali Garu..

    Chala Baga undi andi..keep it up.

    Just this is the first day of my visit to you blog and I already spent one hour…Which is very rare. Keep it up..

  6. Murali says:

    డాక్టర్ సుబ్బా గారు,

    థాంక్స్! మీ లాంటి పాఠకుల కోసమే ఈ శ్రమంతా.

    -మురళి

  7. Pingback: శ్రీ శ్రీ శ్రీ సైగానంద స్వాముల వారి మహత్మ్యం (ఆడియో/Audio) | తేట గీతి

Leave a comment