పదిమందిలో పాట పాడినా…

మా మిత్రబృందంలో రాజేష్ గాడు పెద్ద మేధావి అని ఆల్‌రెడీ మీకు చెప్పినట్టు గుర్తు. కానీ, ఒకానొక సందర్భంలో నేను వాడికి సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయంబెట్టిదనిన…

నేనూ, రాజేష్ వాడింట్లో కూర్చుని పాటలు వింటున్నాం. సడన్‌గా నడుస్తున్న పాటని ఆపేసి, నా వైపు తిరిగి, “ఘంటసాల గారు చూడు ఎంత భావ యుక్తంగా పాడారో! ఇలాంటి లైఫ్ నా పాటల్లో ఉండదు. ఎందుకంటావు?” అని అడిగాడు.

నేను ఈ అవకాశం పోనీయదల్చుకోలేదు. ఎప్పుడూ వాడు మాట్లాడ్డం నేను వినడమే తప్ప, వాడు నన్ను సలహా అడిగింది లేదు.

“లైవ్‌లీగా పాడితేనే కద లైఫ్ ఉండేది,” అన్నాను గంభీరంగా.

“అంటే?” అన్నాడు వాడు కాస్త అయోమయంగా.

నేను మరి కొంత ఉత్సాహం పుంజుకున్నాను. “నువ్వు బాగానే పాడతావు. కానీ మొహంలో ఏ ఫీలింగ్స్ లేకుండా ఎటో శూన్యంలో చూసి పాడతావు. అలా కాకుండా పాటకు తగ్గ హావభావాలతో పాడావనుకో, అప్పుడు నీ పాటలో లైఫ్ అదే వస్తుంది,” అన్నాను.

“ఓ!” కాస్త అర్థమయినట్టు తల పంకించాడు వాడు.

“ఉదాహరణకు, ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ పాట ఉంది కద, అది కాస్త గొంతు వణికిస్తూ, కళ్ళు తడి చేసుకుని పాడావనుకో, ఆ ఎఫెక్టే వేరు,” ఎక్స్ప్లేన్ చేశాను.

“ఓహో! అంటే విప్లవ గీతాలు పాడినప్పుడు, నారాయణ మూర్తిలా కళ్ళు ఎగరేస్తూ పాడాలి. అంతేనా?” ఉత్సాహంగా అన్నాడు వాడు.

“కరెక్ట్! అర్థమయ్యిందిగా. ఇంకేంటి, రెచ్చిపో. ఎలాగూ మీ సింగర్ ఫ్రెండ్స్ అందరూ ప్రతి రెండు వారాలకొక సారి ఎవరో ఒకరింట్లో కలిసి గానా బజానా కార్యక్రమం పెట్టుకుంటారు కద!” ప్రోత్సహించాను నేను.

“అలాగే, ఈ శనివారమే ఉంది. నీ సలహా అప్పుడే అమలు పరిచేస్తా. చాలా థాంక్స్‌రా ఈ ఐడియా ఇచ్చినందుకు,” విశాలంగా నవ్వుతూ అన్నాడు రాజేష్.

“మరి థాంక్స్ అంటే సరిపోదు. ఆదివారమే మీ ఇంటికి వచ్చేస్తా. ప్రోగ్రాం ఎలా జరిగిందో చెప్పాలి నువ్వు,” గోముగా అన్నాను నేను. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలట.

“అలాగే,” హామీ ఇచ్చాడు వాడు.

*****

ఆది వారం పొద్దున్నే నేను రాజేష్‌గాడి ఇంటికి వెళ్ళిపోయాను, “నా కంటే నువ్వే పెద్ద మేధావివిరా,” అని వాడు నన్ను పొగుడుతున్నట్టు ఊహించుకుంటూ.

రాజేష్ వాళ్ళింటి వసారాలోనే పడక కుర్చీ మీద రిలాక్స్ అవుతున్నాడు. ఒక్క ఉదుటున వాడి దగ్గరకి వెళ్ళి, “ఏరా రాజిగా, ఎలాగయ్యింది నిన్న ప్రోగ్రాం?” అంటూ వాడి భుజం మీద చరిచాను. “చచ్చాన్రోయి. అసలే వొళ్ళు కుళ్ళబొడిచేశారు,” గట్టిగా ఒక కేక పెట్టాడు వాడు.

అప్పుడు చూశాను వాడిని నేను క్లియర్‌గా. చిరంజీవి సినిమాకి మొదటి రోజు ఎలాంటి కవచాలు తొడుక్కోకుండా, నేల టికెట్ క్యూలో వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మా వాడు. కుడి కన్ను లొట్ట పోయింది. ఒక వైపు దవడ ఉబ్బి ఉంది. చేతులూ కాళ్ళూ సరైన పొజిషన్‌లో లేవు.

“ఏమయ్యిందిరా?” అన్నాను భయంగా.

“నువ్విచ్చిన దిక్కుమాలిన సలహానే. ఫీలింగ్స్‌తో పాడమన్నావు కద. దాని పర్యవసానమిది,” లొట్ట పోయిన ఒక కంటితో ఎంత కోపంగా చూడగలడో అంత కోపంగా చూశాడు వాడు.

ఎందుకైనా మంచిది అని ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాను నేను. అది గమనించినట్టున్నాడు, “ఏడ్చావులే! నువ్వూ నీ ఓవరాక్షన్. నీ వెనకాల పడి నిన్ను దొరక పుచ్చుకునే పరిస్థితిలో లేను నేను,” నీరసంగా అన్నాడు వాడు.

“అసలేమయ్యిందిరా?”

“నిన్న అందరము పాటలు పాడ్డానికి కలిశామా! నా మొదటి పాట, ‘జజ్జనికిరి జనారే’. దానికి బోలెడు రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నేను రమణాగాడి లుంగీని శాలువలా కప్ప్పుకుని, నారాయణ మూర్తిలా కళ్ళెగరేస్తూ, చిందులు తొక్కుతూ పాడాను,” సన్నగా మూలిగాడు వాడు.

“ఓహొ ఇప్పటి దాకా బానే ఉంది. తరువాత?”

“నా రెండో పాట ‘నెరజాణవులే మృదు పాణివిలే’. పాటకు తగ్గట్టు, నేను నవ్వుతూ, ఫుల్ ఫీలింగ్‌తో పాడాను. కాని ఈ సారి రెస్పాన్స్ అంత బాగా లేదు.”

నా మనసెందుకో కీడుని శంకించింది.

“తరువాత అవకాశం వచ్చినప్పుడు, ‘పది మందిలో పాట పాడినా, అది అంకితమెవరో ఒకరికే’. ఇది కూడా సాహిత్యానికి తగ్గట్టు హాల్లో ఉన్న వాళ్ళందరిని, ముఖ్యంగా ఆడంగులని, చూస్తూ చిలిపిగా నవ్వుతూ కన్ను గీటుతూ పాడాను.”

విషయం అర్థమయి నాలుక కర్చుకున్నాను నేను.

“అంతే, అందరూ నా మీద పడి, సాటి సింగర్‌ని అని కూడా చూడకుండా చితక బాదేశారు. ‘మా ఫ్యామిలీస్ వైపు చూస్తూ అలా అంకితమిస్తావురా?’ అంటూ. ఓలప్పో. వాళ్ళని అతి కష్టం మీద తప్పించుకుని ఇంటికి పరిగెత్తి వచ్చాను. ఒరేయి! నువ్వు మేధావివి కావురా! మాయావివి. ఆగు, నిన్ను తిట్టడానికి తిట్లు రాసుకున్నా,” అంటూ జేబులో చేయి పెట్టి ఒక పేపర్ తీశాడు వాడు.

నేను పరుగు లంకించుకున్నా.

***

ఒక ఆరు నెలలు నేను రాజేష్‌గాడిని కలవ లేదు. ఆ తరువాత ఏదో సాంస్కృతిక కార్యక్రంలో స్టేజ్ మీద పాడుతున్న వాడిని చూశాను. “కళ్యాణినీ, కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని” అన్న డ్యూయెట్లో మగ గొంతు వాడిది. ఆ పాటలో హీరోలానే మా వాడు, కళ్ళు మూసుకుని గుడ్డివాడిలా పాడుతున్నాడు.

కార్యక్రమం అయిపోయాక వాడిని వెనకాల కలిసి అభినందించాను నేను. “ఏమో అనుకున్నాను కానీ, నా సలహా ఇంకా పాటిస్తున్నావే. పాటకు తగ్గట్టు పాడావు,” అన్నాను.

నన్ను అకస్మాత్తుగా అక్కడ చూసి వాడి మొహం కొంచెం కళ తప్పింది. అంతలో సర్దుకుని, “నీ మొహం! నేను ఇప్పుడు అన్ని పాటలు అలానే పాడుతున్నాను, పొరపాటున కూడా ఏమీ ఫీలింగ్స్ కనిపించకుండా,” కర్కశంగా అన్నాడు.

నేను గతుక్కుమన్నాను. అప్పుడు నాకర్థమయ్యింది, చాలా మంది గాయకులు అలా శూన్యంలోకి చూస్తూ ఎందుకు పాడతారో!

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

4 Responses to పదిమందిలో పాట పాడినా…

 1. Brijbaala says:

  “Families ki alaa ankitamistaavuraa?” naa :)) bhale undi…

  Chiranjeevi cinema ki modati rojuna kavachaalu gatraa todukkuni vellaalaa :))

 2. “గోపాలుని కెన్ని వేల గోపికలున్నా…” అంటూ “ఫ్యామిలీ లేడీస్” వైపు హావభావాలతో చూసి పాడుతున్న రాజేశును ఊహిస్తే 🙂 🙂 🙂

 3. Jitu says:

  Anukunanu. Meeru eppudaithe Rajesh ki salaha ichhero… appude anukunnaa… mundu mundu undi panndaga ani.

  LOL

  Ee roju koncham distracted ga chadivenu. Chatting, commenting in the neighboring tabs. Manchidi ayindi. Lekunte… navvi navvi… daggu ochedi. 😛

  Thanks for the hearty ( interrupted) laughter. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s