జల యజ్ఞం!


త్రిలింగ దేశంలో ఘోరమైన కరువు కాటకాలు సంభవించాయి. ఒక్క ఏడాదిగా వానలు కురవక రైతులు, సామాన్య ప్రజలు అల్లల్లాడిపోయారు.

ఇరవయ్యొక శతాబ్దంలో త్రిలింగ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గాంక్రెసు పార్టీ, ప్రజల ఇబ్బందులు తగ్గడానికి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వరుణ దేవుణ్ణీ, వీలైతే మిగతా దేవుళ్ళనీ శాంతింపచేయడానికి పెద్ద ఎత్తున జలయజ్ఞం చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి వై.నో.రాజశేఖర్ రెడ్డి ముందుగా తన మంత్రి వర్గంతో ఈ విషయం చర్చించాడు.

“జలయజ్ఞం మనకు బెటరేనంటారా?” అడిగాడు. అసలే గాంక్రెసు పార్టీలో అంతర్గత ప్రజస్వామ్యం ఎక్కువ. ఏమంటే ఏమొస్తుందో అని ఎవరూ మాట్లాడలేదు.

“ఫర్లేదు, చెప్పండి. మీ మీద ఢిల్లీ అమ్మకు ఫిర్యాదు చేయను అని మాటిస్తున్నాను,” బుజ్జగిస్తున్నట్టు అన్నాడు వై.నో.

“బెటరే. అసలే ప్రజల్లో మన ప్రభుత్వం ఈ కరువు గురించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనే అభిప్రాయం పెరిగి పోయింది. మన పార్టీ ఇమేజ్‌కి అదంత మంచిది కాదు. ఈ జల యజ్ఞం చేయడం వల్ల ఆ అపోహ పోతుంది,” చెప్పాడు విజ్ఞాన శాఖ మంత్రి.

వై.నో అంగీకారం తెలుపుతున్నట్టు తల ఊచాడు. దానితో మిగతా మంత్రులకి తమ ప్రియతమ నాయకుడు ఎటు వైపు మొగ్గుతున్నాడో అర్థం అయ్యింది. వెంటనే ఒకరి తరువాత ఒకరు తమ మనసులోని మాట చెప్పేశారు.

“బ్రహ్మాండమైన ఐడియా.”

“అసలు గత సంవత్సరమే అడ్వాన్సుగా చేసుంటే మరీ బాగుండేది.”

“మనని చూసి మిగతా రాష్ట్రాలు కూడా కాపీ కొట్టాలి.”

వై.నో. “ఇంకేముంది! ఇది ఏకగ్రీవ నిర్ణయం. అసలే మన పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందరూ ఒప్పుకుంటే కానీ ఏ పనీ చెయ్యం. మీరంతా నాలా ఆలోచించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది,” తృప్తిగా అన్నాడు.

ఇంతలో ఒక పిన్న వయస్కుడు లేచి నిల్చున్నాడు. వై.నో. అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

“మనం తప్పు చేస్తున్నాము. కాబోయే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న మనం, ఇంకా ఇలా ప్రకృతి పరిణామాల మీద ఆధార పడి ఉండడం సిగ్గు చేటు.” అన్నాడు అతను.

సడన్‌గా అందరూ సైలెంట్ ఐపోయారు. వై.నో. మొహం రంగు మారింది. ఇంకొందరు మంత్రులు “అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏంటి ఈ కుర్రకుంక ఇలా మాట్లాడుతున్నాడు?” అని ఆశ్చర్యపోయారు.

అతను చలించకుండా, “మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో, వానలు బాగా పడినప్పుడు ఆ నీటిని వృధా కాకుండా రైన్ హార్వెస్టింగ్ స్టోరేజ్ సిస్టం ద్వారా నిలువ చేసుకుంటారు. ఆ తరువాత కరువు వచ్చినప్పుడు ఆ నీటిని వాడుకుంటారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మనం ఇప్పటినుంచీ ఐనా ఇది ఎందుకు అమలు చేయకూడదు?” అంటూ ప్రశ్నించాడు.

“అబ్బబ్బా ఏంటీ గోల? అసలు ఇతను ఎవరయ్యా? నాకు గుర్తు రావడంలేదు?” అడిగాడు వై.నో.

“ఇతను స్వాతంత్ర్య సమర యోధుడైన దేశభక్తయ్య మనవడు సార్. పైగా అమెరికాలో చదువుకున్నాడు. యువతకు ప్రాముఖ్యమిచ్చే పార్టీ మనది అనే సందేశన్ని ఇవ్వడంకోసం తమరే ఇతన్ని పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా తీసుకున్నారు,” సమాధానం అందించాడు ఒక మంత్రి సత్తముడు.

“తప్పులు మానవ సహజం. కానీ తెలిశాక సరి దిద్దుకోపోవడం మరీ తప్పు. నిన్ను బర్తరఫ్ చేశానోయి. నీ చేంబర్‌కి వెళ్ళి అర్జంటుగా ఖాళీ చెయ్యి,” అని అతన్ని బయటకు తోలేశాడు వై.నో.

“బాగా చేశారండి. ఈ హార్వెస్టింగులు, స్టోరేజులు ఇప్పుడు మొదలుపెడితే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి సక్సెస్ అవుతాయి. మనకు కావాల్సింది ఇమ్మీడియెట్ సొల్యూషన్. జలయజ్ఞమే కరెక్ట్,” సమర్థించాడు విజ్ఞాన శాఖామాత్యుడు.

*****

ప్రెస్ కాన్‌ఫరెన్స్ పెట్టి ఈ విషయం వెల్లడి చేశాడు వై.నో. జర్నలిస్టులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

“ఇది మూఢాచారం కద. ప్రభుత్వమే దీన్ని సమర్థించడము ఎంత వరకు సబబు?”

“ఇప్పటి దాక ఇలాంటి మంత్రాలకు చింతకాయలు రాలినట్టు ఉదాహరణలు లేవు కద! ఇది మాత్రం ఎలా ఫలిస్తుంది?”

“ముందు ముందు ఇలాంటి సమస్యలు వస్తే, ఎదుర్కోవడానికి ఏదైనా ప్రణాలిక ఉందా?”

వై.నో. చిరు నవ్వులు చిందించాడు. “చూడండి. మన పెద్దలు ఎంతో అనుభవంతోనే ఇలాంటి పద్ధతులు ప్రవేశపెట్టారు. ఇది మూఢ నమ్మకం కాదు. పూర్వం తాన్‌సేన్ మేఘమల్‌హార్ రాగంలో పాడితే వానలు పడేవట. ఇదీ అలాంటిదే. జలయజ్ఞం రేపటినుంచే ప్రారంభం అవుతుంది,” డిక్లేర్ చేశాడు.

****

జల యజ్ఞం మొదలు పెట్టి వారం రోజులైనా వర్షాలు పడలేదు. బోలెడు మంది జనం కూడా అక్కడే సెటిల్ అయ్యారు.

వై.నో మరియు ఆయన మంత్రి వర్గం, యజ్ఞం జరుగుతున్న చోటే ఉండి తమ వంతు ప్రార్థనలు తాము చేస్తున్నారు.

అకస్మాత్తుగా జనంలోనుండి ఒక యువకుడు ముందుకు వచ్చి హుంకరిస్తూ ఊగడం మొదలు పెట్టాడు. జనంలోని కొందరు మేధావులకు వెంటనే అర్థమయ్యింది. “అమ్మా, శాంతించు తల్లో. నీకు ఏం కావాలమ్మా?” అని చేతులు జోడించి బతిమలాడడం మొదలు పెట్టారు.

“నరబలి కావాలిరో. నాకు నరబలి కావాలి. అందుకే వానలు కురవడం లేదురో,” ఊగిపోతూ అన్నాడు ఆ యువకుడు.

“ఈ జర్నలిస్టులు పక్కకు పోయాక ఎలాగోలా మ్యానేజ్ చేసి అలానే ఇస్తాము తల్లి. కాస్త ఓపిక పట్టు,” ప్రాధేయపడ్డాడు ఒక ముసలాయన.

“ఎవరు పడితే వాళ్ళు కాదురో. ఈ వై.నో, ఆయన మంత్రి వర్గాన్ని నాకు బలి ఇవ్వండి. వీళ్ళు చేసిన పాపాల వల్లే వర్షాలు పడ్డం లేదు. ఊఊఊఊఉ,” వీరంగం వేశాడు ఆ యువకుడు.

అందరు గతుక్కుమన్నారు.

“ఏమంటారు, సార్! ఇది కూడా పాత పద్ధతే కద! కో-ఆపరేట్ చేస్తారా మరి? మీకు బెటరేనంటారా?” చిలిపిగా అడిగాడు ఒక విలేఖరి.

“టెస్ట్-ట్యూబ్ బేబీలని పుట్టించే ఈ లోకంలో, మృత్యువునే ఎదిరించే సర్జరీల కాలంలో, ఈ పూనకాలూ నరబలులూ ఎవరు నమ్ముతారు. మూఢ నమ్మకాలు కాకపోతే. నాన్సెన్స్!” కొట్టి పారేశాడు వై.నో.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

5 Responses to జల యజ్ఞం!

 1. అదిరింది!

 2. anand says:

  that is true.they dont see for future.they see for immediate solution -votes.

 3. ఈ పద్దతి బ్రహ్మాండంగా వుంది. వైనోని, ఆయన మంత్రివర్గాన్ని, ఇంద్రబాబుని, ఆయన మంత్రివర్గాన్ని, ఎడం పక్క వాళ్ళను, కుడిపక్క వాళ్ళను, అందరిని ఒకేసారి బలిచ్చేస్తే వానలు వద్దన్నా పడతాయి.

 4. sujata says:

  నిజమే.. ఫక్తు అవకాసవాదులు రా.నాలు. కాని వై.ఎస్ ని సింగిల్ ఔట్ చెయ్యటం అన్యాయం. నేను ఖండిస్తున్నా! గాఠ్ఠిగా!

 5. chavakiran says:

  అదిరింది!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s