విషరాజ్ పాటిల్ – మన రాజకీయ నాయకులు

విషరాజ్ పాటిల్. జంబూద్వీపపు హోం మినిస్టర్! అలా అని ఆయన ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అనుకునేరు. 2004 ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయాడు. కానీ ఢిల్లీ అమ్మ చల్లని “హస్తం” తన తల మీద ఉన్న ఏకైక కారణాన ఈ పదవి దక్కించుకున్నాడు.

పదవి వచ్చిన రోజే ఢిల్లీ అమ్మ దర్శనం చేసుకున్నాడు పాటిల్. “నాకీ పదవి ఎందుకు కట్టబెట్టారమ్మ?” గద్గదమైన స్వరంతో అడిగాడు అమ్మని. “నువ్వైతే చేతులకు కాళ్ళకు అడ్డం రాకుండా ఉంటావు అని. ఆ మంత్రి కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవ్వు,  మిగతా సంగతి నేనో మా అబ్బాయి సాహులో చూసుకుంటాం,” వివరించింది అమ్మ.

“కాని మరీ ఏం పని చేయకుండా ఉండాలి అంటే…” నసిగాడు పాటిల్.

“ఏ పనీ చేయొద్దు అని నేను అనలేదే? నీ మంత్రి పదవికి సంబంధించిన పనులు మాత్రం చేయొద్దన్నా అంతే. మనసుంటే మార్గమే ఉండదా?” ప్రశ్నించింది ఢిల్లీ అమ్మ, విలాసంగా కాళ్ళు ఊపుతూ.

అమ్మ కాళ్ళ వంక చూసిన పాటిల్‌కి జ్ఞాన ట్యూబ్‌లైట్ వెలిగింది. ఆవిడ పాదాలనుంచి చెప్పులు తీసి వాటిని తుడవడం మొదలెట్టాడు. అమ్మ పెదవులు చిరు నవ్వుతో విచ్చుకున్నాయి. “వెళ్ళే ముందు అబ్బాయి సాహుల్ జోళ్ళు కూడా శుభ్రం చేసి వెళ్ళు,” ఆర్డర్ వేసింది. “మహా ప్రసాదం,” చెప్పులు తుడవడం ఒక క్షణం ఆపి చేతులెత్తి మొక్కుతూ అన్నాడు పాటిల్.

***

కొన్ని నెలలు సాఫీగానే సాగిపోయాయి విషరాజ్ పాటిల్ జీవితంలో. ఆయనకు అధ్యాత్మిక చింతన మెండు! మహిమాన్వితుడైన సన్నాయి బాబాకు గొప్ప భక్తుడు. భగవద్గీత ఆయనకు ఎంతో నచ్చిన గ్రంథం. తీరిక వేళల్లో (అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడూ, అమ్మ యొక్క, సాహుల్ యొక్క చెప్పులు తుడిచే అవసరం లేనప్పుడూ) భగవద్గీత మీద తన స్వంత భాష్యం రాయడం ప్రారంభించాడు.

ఐతే గాంక్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందనీ, రావడంతోనే ఉగ్రవాదులకు ప్రతికూలమైన అన్నీ చట్టాలని తీసివేసిందనీ తెలియగానే, ప్రపంచపు నలు మూలలనుంచి ఉగ్రవాదులు లొట్టలు వేసుకుంటూ జంబూ ద్వీపానికి చేరుకున్నారు. పైగా హోం మినిస్టర్ అధ్యాత్మిక వాది, సన్నాయి బాబా గారి ప్రియ భక్తుడని తెలియగానే కేరింతలు కొడుతూ అన్ని రాష్ట్రల్లో బాంబులు పేల్చడం మొదలు పెట్టారు.

విషరాజ్‌కు చిరాకు వేసిన మాట వాస్తవం. “ఛీ ఛీ, ఈ ఉగ్రవాదులకు వేళా పాళా లేదు. ప్రశాంతంగా నన్ను శ్రీమద్ భగవద్గీత రాసుకోనివ్వరు,” అని బోల్డు బాధ పడిపోయాడు.

ఐతే ఆయన సహనపరుడు. చుట్టుపక్కల దీపావళి పండగ జరుగుతున్నట్టు బాంబులు పేలుతున్నా రాసుకోగల సమర్థుడు. అలా రాసుకొనేవాడేమో కూడా.

కానీ అసయ్యంగా ప్రెస్ వాళ్ళూ, పార్లమెంట్‌లో ఎగస్పార్టీ వాళ్ళూ, ఇలాంటి హింసాత్మక సంఘటనల గురించి హోంశాఖామాత్యులు ఏం చేస్తున్నారంటూ ఆయన్ను నిల దీశారు. నానా యాగీ చేశారు.

ఈ బాధ తట్టుకోలేక ఎప్పటిలానే ఆ ఆదివారం, ఢిల్లీ అమ్మ దర్బారులో కూర్చుని ఆవిడ చెప్పులు సాఫ్ చేస్తున్నప్పుడు గొణుగుతూ అన్నాడు పాటిల్, “ఈ ఉగ్రవాదుల గురించీ ఏదో ఒకటి చేయకపోతే తప్పేలా లేదమ్మా,” అని.

“అక్కడే మరి నాకు మండేది! నీకు పని చెయ్యడం కోసమా ఆ పదవి ఇచ్చింది? ఏదో నమ్మకస్తుడివి, చెప్పులు బాగా తుడుస్తావు అని పనిలో పెట్టుకున్నా,” కోపంగా గద్దించింది ఢిల్లీ అమ్మ.

“పోనీ మన ముందు ప్రభుత్వం, పార్లమెంట్ మీద దాడికి వ్యూహం రచించిన అబ్‌చల్ గురూని పట్టుకుంది కద! వాడిని ఉరి తీసేయనా?” ఆశగా అడిగాడు పాటిల్.

“నీకేమన్న మతి పోయిందా? అబ్‌చల్ గురూ గారు ఎంత పెద్ద మనిషో మర్చిపోయావా? మన మైనారిటీలు ఇళ్ళల్లో ఆయన పటాలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బ తినవూ? మనకు మళ్ళీ వోట్లేస్తారా? ఛ! అసలు ఎలా నాయకులయ్యారయ్యా మీరంతా,” తెగ బాధపడిపోయింది అమ్మ.

“మరేం చెయ్యమంటారు?” దిగులుగా అడిగాడు పాటిల్.

“అన్నిటికీ నన్నే అడిగితే ఎలా? మీ సొంత తెలివితేటలు లేవా?” కసురుకుంది అమ్మ.

ఇంక లాభం లేదని ఫ్లైటెక్కి సన్నాయి బాబా దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు పాటిల్.

“రా రా విషరాజ్! చాలా రోజులయ్యింది. భగవద్గీత ఎంత వరకూ వచ్చింది? నీలాంటి వాళ్ళే మన జాతిని మేల్కొలపాలి,” ఆశీర్వదిస్తూ అన్నారు బాబా.

“ఏం మేల్కొలపడమో ఏంటో స్వామీ! స్పీకర్‌గా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో నిద్ర పోయే ఎం.పీ.లనే లేపలేక పోయా. ఏదో వాళ్ళు గొడవ చేసినప్పుడు కళ్ళు మూసుకుని మిమ్మల్ని ధ్యానించుకుటూ ఆ గండం గట్టెక్కాను గానీ,” నీరసంగా అన్నాడు పాటిల్.

“ఇప్పుడు హోం మినిస్టర్‌వి కద! ఆ కష్టాలు లేవుగా?” చిద్విలాసంగా అన్నారు బాబా.

తనకు వచ్చిన కొత్త కష్టాలని వివరించాడు విషరాజ్. “మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి స్వామీ. ప్రెస్ వాళ్ళని కలవాలంటేనే భయం వేస్తుంది,” దీనంగా చేతులు జోడించాడు.

“దిక్కులు అన్నీ ఒక్కటి కావు. బక్క చిక్కిన కుక్క చెడ్డది కాదు,” అన్నారు బాబా.

అయోమయంగా చూశాడు పాటిల్. “అదేంటి స్వామీ! నేను అడిగిందేమిటీ, మీరు చెప్పేదేమిటీ?” ప్రశ్నించాడు.

“అదే నాయనా మరి. దిమ్మ తిరిగింది కద! నువ్వూ నాలానే ఆకుకందనీ పోకుకందనీ సమాధానాలు ఇవ్వు. మళ్ళీ నోరెత్తకుండా వెళ్ళిపోతారు,” తరుణోపాయం వివరించారు బాబా.

“ధన్యుడిని స్వామీ!” బాబా గారి కాళ్ళమీద పడ్డాడు పాటిల్.

***

ఢిల్లీ వెళ్ళాక ధైర్యంగా తానే ఎదురు ప్రెస్ కాన్‌ఫరెన్స్ పెట్టి మరీ విలేఖరులని పిలిచాడు విషరాజ్.

విలేఖరులు రాగానే ప్రశ్నల వర్షం కురిపించారు.

“మీ పార్టీ వచ్చాక ఉగ్ర వాదులు మరీ పెట్రేగిపోతున్నారని లోకం కోడై కూస్తూంది. మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా?”

“అబ్‌చల్ గురూని ఇంకా ఎందుకు ఉరి తీయలేదు?”

“ఈ ఉగ్రవాదం మన దేశాన్ని నిస్సహాయ స్థితిలో పడేస్తూంది. దీనిపై మీ కామెంట్?”

బాబాను తలుచుకుని ఒకసారి గొంతు సవరించుకున్నాడు పాటిల్.

“రాజీనామా చేయను. ఈ విషయంలో రాజీ పడేదే లేదు!”

“అబ్‌చల్ గురూని అప్పుడే ఎలా ఉరి తీస్తాం? మన రాజ్యాంగం ప్రకారం కనీసం ఏడేళ్ళైనా పడుతుంది. పైగా మన పక్క దేశంలో ఉన్న మనవాళ్ళని విడిపించాలని ప్రయత్నిస్తున్నాం కద! అబ్‌చల్ గురూని ఉరి తీస్తే వాళ్ళు ఫీల్ అవ్వరూ?”

“దేశం నిస్సహాయ స్థితిలో ఉంది అన్నది నిజం కాదు. మా దగ్గర బోలెడు ఇన్‌ఫర్మేషన్ ఉంది. కానీ నేను చెప్పనుగా! ఎవరు బాధ్యులో చెప్తే ఇంకొన్ని ఘోరాలు జరిగిపోతాయి. అందుకే నేను చెప్పనంటే చెప్పనుగా!”

“ఐతే ఒకటి మాత్రం చెప్తాను., మన శరీరంలో ఉన్న వ్యాధి అన్నిటికంటే ప్రమాదకరమైనది. అర్థమయ్యిందా?”

ఈ సమాధానాలకు సగం మంది విలేఖరులకు పిచ్చి చూపులు పడ్డాయి. నోట మాట పెగల్లేదు. గర్వంగా కాలరెగరేశాడు పాటిల్. “బాబా గారి సలహానా మజాకానా! ఇంక మళ్ళీ కనపడరు ఈ వెధవలు. భగవద్గీతను అంకితమివ్వడానికి బాబా గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనకు థాంక్స్ చెప్పుకోవాలి,” తనలో తానూ నవ్వుతూ అనుకున్నాడు విషరాజ్.

(అశుభం)

“We have information but it is not proper for me to disclose that information at this point of time or blame any organisation because it has implications.”

“The disease within the body is more dangerous”

Honarable Home minister’s own words as publicly recorded by the media.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

15 Responses to విషరాజ్ పాటిల్ – మన రాజకీయ నాయకులు

 1. chilamakuru vijayamohan says:

  ఇలాంటి వారి పాలనలో ఉండడం మనదేశ దౌర్భాగ్యం.

 2. సెటైర్ బాగుంది. ఇంతే సింప్లిస్టిక్ గా భారతదేశంలో తీవ్రవాద సమస్యుంటే చాలా త్వరగా సమాధానం దొరికేది.

 3. మన దౌర్భాగ్యం అనుకుంటూ మనం ఇలా కామ్ గా కుర్చోవలసిందేనా?

 4. Murali says:

  మహేష్ గారూ,

  ఈ సెటైర్ సింప్లిసిటీకీ తీవ్రవాద సమస్య జటిలత్వానికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు.

  ఈ సెటైర్ ఉద్దేశ్యం మన గృహ మంత్రి గారు ఏ మాత్రం తన విధులని నిర్వర్తించలేదని. ఈయన ఒక్కడే నిర్వర్తిస్తే తీవ్ర వాదం మొత్తానికి మాయం కాకపోవచ్చు. కాని ఒక దేశపు హోం మినిస్టర్ ఇంత అధ్వానంగా ఉంటే మాత్రం తీవ్ర వాద సమస్య ఎప్పటికీ తగ్గదు.

  -మురళి

 5. Murali says:

  ప్రతాప్ గారూ,

  ఇది ఒక రకంగా విత్తు ముందా లేక చెట్టు ముందా సమస్య లాంటిది. మాములు ప్రజలు క్రియాశీలక రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలంటే రాజకీయాలలో ఈ కరప్ట్ మరియు రౌడీ ఎలిమెంట్స్ ఉండకూడదు. అవి అలా ఉండకూడదు అంటే మాములు ప్రజలు ( మన గాంక్రెస్ భాషలో ఆం ఆద్మీలు) పాల్గొనాలి.

  ఐతే కనీసం అందరు తమ వోటు హక్కు వినియోగించుకోవడం ఒక చిన్న ప్రారంభం.

  -మురళి

 6. chaitanya says:

  కుళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నంతవరకు బహుశ పరిస్తితి మారదేమో ! గురు ని ఉరి తీయక పోవటం, పోటా ని తొలగించడం, ఒక వర్గం వారి ప్రయొజనాలు కాపాడటం వీరి జెండ మరియు అజెండ.

 7. రవి says:

  మురళీ, సెటైరికల్ గా రాసినా కూడా దేశ పరిస్థితిని ప్రతిబింబించింది. మనస్సు చివుక్కుమంది. ఇలానే అందరు రాజకీయ నాయకులను శుభ్రంగా కడిగెయ్, చెప్తాను!

 8. హోం మినిస్టెర్ మంచివాడు ఉండటం వలన కొంత మేలు ఖచ్చితంగా జరిగినా, మొత్తం భారతదేశ రక్షణ వ్యవస్థ ఇలా తయారవడానికి కేవలం మినిస్టరే కారణం కాదుకదా?

  అందుకే తీవ్రవాద సమస్య నిర్మూలన అంత సింపుల్ కాదు అన్నాను. ఇక్కడ మినిస్టర్ ని సపోర్ట్ చెయ్యడం నా ఉద్దేశం కాదు. కాకపోతే,మీ extended imagination బాగుంది కానీ,శివరాజ్ పాటిల్ అంత తీసెయ్యదగ్గ వ్యక్తికూడా కాదు.
  చూ: http://en.wikipedia.org/wiki/Shivraj_Patil

 9. నరేంద్ర భాస్కర్ S.P says:

  నరేంద్ర భాస్కర్ S.P.
  నమస్తే భయ్యా!
  ఎంటి సంగతి, సర్పయాగం చేయవయ్యా బాబూ అంటే, వానపాము వెంట పడ్డావ్! నిజమే ఆ రోజు పేపర్ చూసి-మన్సులోనే పాటిల్ పుచ్చ లేపేద్దామనుకున్నా, పేర్లు మాత్రం బాగా పెట్టారు సాహుల్, అబ్‌చల్ గురూ, గాంక్రెస్ నిజంగా ఐతే (గాంగ్రేన్) అని పిలవాలి, బాగా రాసారు, మనం రాయగలమే గానీ ఇంకేమీ చేయలేం అని అనుకోకుండా మీరన్నట్టూ కనీసం అందరం వోటు వేయాలి- నెనర్లు

 10. వికటకవి says:

  బాగా రాసారు. బాంబు దాడుల తరువాతి విషరాజ్ పాటిల్ యొక్క ప్రసంగాలు గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే, ఒకటే ప్రతి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడంటే ఆశ్చర్యం లేదు. మరోటి మర్చిపోయారు.

  “దాడి చేస్తారని సమాచారం ఉంది, కానీ ఎప్పుడు, ఎక్కడ అన్నది తెలియదు.”

  ఇంత ఛండాలమైన సమాధానం ఇచ్చిన హోం మంత్రిని ఎప్పుడూ చూళ్ళేదు.

 11. Murali gAru..

  One of the best satirical articles so far.. You amaze with your new articles every time.. Way to go!! the words like “gadgada svaram, nasigADu etc” show your grip on the Satirical comedies.

 12. gireesh says:

  మంచి వ్యంగ్య రచన…ప్రస్తుత పరిస్తితులకు అద్దం పడుతున్నట్లుగా ఉంది.

  good one. keep it up.

 13. Murali says:

  మహేష్ గారూ,

  ఆయన తీసెయ్యదగ్గ మనిషేం కాదు. లెక్క ప్రకారం హోం మంత్రి పదవి ప్రధాని తరువాత వచ్చేది. అందుకే ఈ సెటైర్.

  ఆ వికీ ఆర్టికల్‌లో ఆయన నిర్వహించిన పదవుల చిట్టా ఉంది. అందులో రెండే మంచి పాయింట్లు, 1)ఆయన పార్లమెంట్ వ్యవహారాలు బ్రాడ్‌కాస్ట్ చేయడంలో దోహదపడ్డాడని 2)ఆయన “fairness”.

  పార్లమెంట్ వ్యవహారాలు బ్రాడ్‌కాస్ట్ కావడంలో ఆయన ఒక్కడి హస్తమే లేదు. ఐనా సరే ఆయనకు ఫుల్ మార్క్స్ ఇచ్చేద్దాం.

  ఇక fairness అంటారా, దానంత vague word లేదు. ఎవరికి fair? POTA తీసేస్తూంటే చప్పట్లు కొట్టి సమర్థించడం వల్ల ఉగ్రవాదులకా?

  ఆయన ఇంకెంతటివాడో తెలుసుకొవాలి అంటే ఇది కూడా చదవండి మరి….

  http://indiatoday.digitaltoday.in/index.php?option=com_content&task=view&issueid=65&id=12328&Itemid=

 14. రాజు says:

  బాగుంది. దేశానికి రెండవ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇంతటి బేజవాబ్దారీ సమాధానాలను ఊహించలేదు. వ్యక్తిగా ఆయనకు ఘనమైన గత చరిత్ర ఉండి ఉండవచ్చు. కానీ నాయకుని నాయకత్వ పటిమ ఇలాంటి పరీక్షా సమయాలలోనే బయటపడుతుంది.

 15. Srividya says:

  బాగా రాసారు.నవ్వు వచ్చింది. అదే టైములో బాధ కలిగింది..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s