కమ్యూ”నిజం” జిందాబాద్!


వ్యాపార రావు పెద్ద క్యాపిటలిస్ట్. ఒక వర్గానికి చెందిన వారి భాషలో చెప్పాలంటే ఒక బూర్జువా. ఐతే ఆయన డబ్బు సంపాదించుకోవడంలో విపరీతంగా బిజీగా ఉండడంవల్ల, ఇలా పేర్లు పెట్టి పిలిచే వాళ్ళ గురించి పట్టించుకునే టైం ఉండేది కాదు.

ఐతే ఈ ప్రపంచం చాలా చిత్రమైనది. మనకు ఇష్టం లేని వాళ్ళతో ఎన్నో సార్లు కలిసి వ్యవహరించ వలసి వస్తుంది. ఆ విధంగానే ఆయనకు తనకున్న అనేకానేక ఆస్తులలో ఒకటైన ఒక ఫాక్టరీలో పని చేసే కార్మికులతో, తద్వారా వారి యూనియన్‌తో, డీల్ చేయాల్సి వచ్చింది.

చిక్కెక్కడ వచ్చిందంటే…

వ్యాపార రావు ఫాక్టరీలో మట్టి తవ్వి దాన్ని కొనుగోలు దారులకు తరలించడం ఒక ముఖ్యమైన అంశం. ఆ పని ఒక వంద మంది కార్మికులు చేసే వారు. దానికి వారు పారలు వాడే వారు. ఆ మట్టికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూండడం వల్ల వ్యాపార రావు ఒక సగటు బూర్జువాలా ఉత్పత్తిని పెంచుదామనుకున్నాడు.

వెంటనే విపరీతమైన research చేసి జెర్మనీ నుంచి రెండు ఆధునాతనమైన మెషీన్లు కొనుగోలు చేశాడు. ఆ మెషీన్లూ చాలా శక్తివంతమైనవి. వందమంది కార్మికులు ఒక్క రోజులో తవ్వే మట్టిని, ఒక్క మెషీనే తవ్వగలుగుతుంది. ఉత్పత్తి రెండింతలు అయ్యింది కాబట్టి (పైగా ఆ మెషీన్లు కొనడానికి బోలెడంత డబ్బు ఖర్చయ్యింది కాబట్టి), వ్యాపార రావు ఇదే పని ఇంతకు ముందు చేస్తున్న వందమంది కార్మికులనీ ఒక నెల నోటీసు ఇచ్చి ఉద్యోగం నుండి తీసేశాడు. ఒక చక్కని వ్యాపార నిర్ణయం తీసుకున్నాను అన్న ఆనందంలో ఆ రాత్రి హాయిగా నిద్ర పోయాడు.

వ్యాపార రావు పొద్దున్నే లేచి బద్ధకంగా ఆవులిస్తూ ఎప్పటిలానే కిటికీ పరదాలు తెరచి ఇంటి ముందుకు చూశాడు. వెంటనే కెవ్వున కేకేశాడు. వాళ్ళావిడ హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. “ఏమయ్యిందండీ, ఎందుకా కేకలు?” అడిగింది. “నాకు ఎర్ర కామెర్లు వచ్చాయే. అంతా ఎర్రగా కనిపిస్తూంది,” బిక్క మొహం వేసి అన్నాడు వ్యాపార రావు. కిసుక్కున నవ్వింది ఆయన భార్యామణి. “మీకే కామెర్లూ రాలేదండి, అవి మన ఇంటి ముందు ధర్నా చేస్తున్న మన ఫాక్టరీ వర్కర్లు ఊపుతున్న ఎర్ర జెండాలు అంతే,” అంది ఇంకా నవ్వుతూ.

“ఎందుకు అలా ఊపడం? నేను ఎక్కడ ఆలీసంగా నిద్ర లేస్తానో, ఎక్కడ ఉత్పత్తి దెబ్బ తింటుందో అని భయమా?” అమాయకంగా అడిగాడు వ్యాపార రావు. “అయ్యో ఇలాంటి మొగుడిని ఇచ్చావేంట్రా దేవుడా,” అని తనలో తాను గొణుక్కుని, “అబ్బా, కాదండీ. మీరు కొందరు కార్మికులని ఉద్యోగం నుండి తీసేశారట కద, అందుకు ధర్నా!” చెప్పింది భార్యామణి.

“మరి తీసెయ్యక ఉంచుతానా! వాళ్ళెందుకు కాళ్ళకు చేతులకు అడ్డంగా?” కోపంగా అన్నాడు వ్యాపార రావు. “మీరు వాళ్ళ జీవనోపాధి తీసేశారట. వాళ్ళ నోటి ముందు కూడు గుంజుకున్నారట. వంద కుటుంబాలు ఒక వేళ ఆకలి చావు చస్తే దానికి మీరే కారణమట. మీరు ఒక ధన పిశాచి అట. ఆ, ఇంకోటేదో అన్నారు. మీరు కరడు గట్టిన బూర్జువా అట,” వివరించింది వాళ్ళావిడ.

“బూర్జువా… ఈ మాటెక్కడో విన్నట్టుందే,” తనలో తాను అనుకున్నాడు వ్యాపార రావు. పైకి, “ఐనా ఆకలి చావులు ఎందుకు చావడం? నెల రోజులు నోటీసు ఇచ్చాగా. ఇంతలో వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చుగా?” అన్నాడు భార్యతో. “నన్నడుగుతారేంటండీ? వెళ్ళి వాళ్ళకే ఆ విషయం చెప్పండి,” సలహా ఇచ్చింది ఆవిడ.

వ్యాపార రావు దొడ్డి దారిన బయట పడి ఫాక్టరీకి వెళ్ళాడు. అక్కడ ఇంకా ఖంగాళీగా ఉంది. ఆయన ఫాక్టరీలో మొత్తం పని చేసేది మూడొందలు ఐతే, బయట ధర్నా చేస్తున్న జనం దాదాపు రెండు వేలమంది ఉన్నారు. “ఓరి దేవుడోయి, వీళ్ళంతా ఎవరు?” అనుకున్నాడు వ్యాపార రావు.

తన ఆఫీసులో కూర్చుని బాయ్ కోసం బెల్లు నొక్కాడు. ఎంతసేపటికీ ఎవరూ రాలేదు. “ఎవరూ లేరా?” గట్టిగా అరిచాడు. పెద్ద గుమాస్తా పరిగెత్తుకుంటూ వచ్చాడు. “అతను కూడా సమ్మెలో ఉన్నాడు సార్!” గొణిగాడు. “సరే! మీరెళ్ళి కార్మిక నాయకులని పిలుచుకు రండి. నేను మాట్లాడలని చెప్పండి,” ఆర్డర్ వేశాడు.

కాసేపయ్యాక పెద్ద గుమాస్తా ముగ్గురిని తనతో పట్టుకొచ్చాడు. వ్యాపార రావు వాళ్ళలో ఎవరినీ గుర్తు పట్టలేదు. “ఏంటయ్యా! కార్మిక నాయకులను పట్టుకు రమ్మంటే ఎవరినో తీసుకొచ్చావు?” విసుక్కున్నాడు.

“మేమంతకంటే ఇంపార్టెంట్. మేము మీ ఫాక్టరీ కార్మికులు ఏ యూనియన్‌లో సభ్యులో, ఆ యూనియన్ యొక్క నాయకులం,” అన్నాడు వారిలో ఒకతను. “అవును. ఎక్కడ సమ్మె జరిగినా పరిష్కారం చేసేది మేమే,” అన్నాడు రెండో అతను. “అవును….” అని మూడో అతను ఏదో చెప్పబోయేంతలో, “సరే సరే అర్థమయ్యింది. ఇంతకీ మీ డిమాండ్లేమిటి?” అడిగాడు వ్యాపార రావు.

“ఏముంది! తీసేసిన వర్కర్లని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలి. టెంపరరీ వర్కర్లని పర్మనెంటు చేయాలి. పర్మనెంటు వర్కర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి,” గుక్క తిప్పుకోకుండా అన్నాడు మొదటి అతను.

“అంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా?” పళ్ళు పట పటా కొరుకుతూ అన్నాడు వ్యాపార రావు.

“ఆ ఇంకోటుంది. ఇలా నోటీసు ఇచ్చి ఆ వంద వర్కర్లకూ బోలెడు మనస్తాపం కలిగించావు కాబట్టి, వాళ్ళందరి జీతాలు పెంచాలి,” అన్నాడు మూడో అతను. అసలే అతను ఇంతకు ముందు వ్యాపార రావు తనని మాట మధ్యలోనే ఆపేశాడు అన్న కోపంలో ఉన్నాడు.

“కుదరదు,” గట్టిగా అరిచాడు వ్యాపార రావు. “నేను ఈ ఫాక్టరీ నడుపుతూంది లాభాలకోసం. లాభాలు వస్తేనే కద జీతాలు ఇచ్చేది. ఆ రెండు మెషీన్లు కొన్నాక నాకు ఆ వంద మంది ఎందుకు? ఊరికే వాళ్ళకి జీతాలు ఇస్తూ మేపాలా?” అన్నాడు.

“ఏమో అదంతా మాకు తెలీదు. మమ్మల్ని సంప్రతించకుండా మెషీన్లు కొనడమే మీరు చేసిన పెద్ద తప్పు. ఆ మెషీన్ల వల్ల వంద మంది ఉద్యోగాలు పోయాయి. ఆ మెషీన్లు కొనేప్పుడు ఆ వంద మందీ, వాళ్ళ పెళ్ళాం పిల్లలూ మీ కళ్ళెదుట మెదలలేదా?” ఆవేశంగా అడిగాడు రెండో అతను.

“నా కళ్ళెదుట, ఉత్పత్తి పెరగడంవల్ల వచ్చే లాభాలు మాత్రమే మెదిలాయి. ఓకే. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి, నా పని మళ్ళీ మొదలవడం నాకు ముఖ్యం కాబట్టి, ఆ తీసేసిన వర్కర్లకి ఒక మూడు నెలల జీతాలు అదనంగా ఇస్తాను. దాని వల్ల వాళ్ళకు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి నాలుగు నెలల టైం కలిసొస్తుంది. ఇంకో నాలుగు నెలల్లో కూడా ఉద్యోగాలు తెచ్చుకోలేక పోయారంటే వాళ్ళు పని చేయడానికి పనికి రారు అన్న మాట. వాళ్ళని వెనక్కి తీసుకునే ప్రసక్తి మాత్రం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు నాకు అనవసరం,” వీలైనంత శాంతంగా అన్నాడు వ్యాపార రావు.

“మీకు అనవసరమండీ! కార్మికుల కాలే కడుపులో భగ భగ మండే ఆకలి మంటలు మీకెందుకు అవసరం? కాని మూడు ప్రపంచాల సిద్ధాంతం బాగా వొంట పట్టించుకున్న మాకు మాత్రం బోలెడు అవసరం. మా డిమాండ్లు తీరే వరకు ఈ సమ్మె ఇలానే కొనసాగుతుంది. లాల్ సలాం!” అంటూ అ ముగ్గురూ బయటకు నడిచారు. “మూడు ప్రపంచాల సిద్ధాంతమా? ఏంటో అది? అందుకే ముగ్గురు వచ్చినట్టున్నారు కాబోలు!” అనుకున్నాడు వ్యాపార రావు.

రెండు వర్గాలు వాళ్ళూ, వాళ్ళ స్థానలనుంచి ముందుకు కదలడానికి నిరాకరించడం వల్ల మూడు నెలల పాటూ ఫాక్టరీ మూత పడింది. ఈ మూడు నెలల్లో వచ్చిన నష్టాన్ని లెక్క వేసి చూసి వ్యాపార రావు భోరుమని విలపించాడు. ఎట్టకేలకు ఒక స్నేహితుడి సలహా మీద సివిల్ లిబర్టీస్ సంఘాన్ని మధ్యవర్తిత్వం చేయమని కోరాడు.

సివిల్ లిబర్టీస్ వాళ్ళు ఇరు పక్షాల వాదనలు విని తమ నిర్ణయం ప్రకటించారు. “మీ రెండు వర్గాలకీ ఒకరు చెప్పింది ఒకరికి నచ్చలేదు కాబట్టి, మేం మూడో మార్గం సూచిస్తాం. కాని ఈ నిర్ణయానికి మీరంతా కట్టుబడి ఉండాలి. అసలే మా సమయం చాలా విలువయినది. ఇంకా వెళ్ళి బోలెడు తగాదాలు తీర్చాలి మేము,” అన్నారు. యూనియన్ వాళ్ళు తల ఊపారు. మిత్రుడి బలవంతం మీద వ్యాపార రావు కూడా తల ఊచాడు.

“ఐతే వినండి. వ్యాపార రావు గారు ఎంతో ఖర్చు పెట్టి ఆ మెషీన్లు కొన్నారు కాబట్టి, ఆ మెషీన్లని ఆయన రొటేషన్ బేసిస్ మీద ఒక్కో రోజు ఒక్కోటి వాడుకోవచ్చు,” చెప్తూ ఆగారు సివిల్ లిబర్టీస్ వారు. వ్యాపార రావు మొహంలో ఆనందం కదలాడింది. “కానీ, మెషీను సగం పని మాత్రమే చేస్తుంది. మిగతా సగం పని వర్కర్లు చేస్తారు.” వ్యాపార రావు గతుక్కుమన్నాడు.

“అది కూడా పారలు వాడి కాదు, స్పూన్లు వాడి. దాని వల్ల పని వేగం తగ్గుతుంది. కాబట్టి ఇంతకు ముందు మల్లే వందమంది సరిపోరు. ఓ రెండొదల మంది కావలసి వస్తుంది. కాబట్టి వ్యాపార రావు గారు ఇంకో వందమందికి ఉద్యోగం ఇవ్వాలి. దీని వల్ల ఇప్పుడు ఉన్న వాళ్ళకే కాకుండా ఇంకో వంద మందికి పని దొరుకుతుంది. ఇది రెండు వర్గాల ఆత్మాభిమానం దెబ్బ తినకుండా, ఒక వైపు వ్యాపార రావు గారు మెషీన్లు వాడుకునేలా, ఇంకో వైపు ఇంకా ఎక్కువ వర్కర్లకి పని కల్పించేలా, మేము ఇచ్చే తీర్పు!” అని పెద రాయడి స్టైల్‌లో కండువాలు ఎగరేసుకుని వెళ్ళి పోయారు సివిల్ లిబర్టీస్ వారు.

వ్యాపార రావుకి నోట మాట పడిపోయింది. కార్మికులంతా “పి పి పి డుం డుం డుం” అని కేరింతలు కొడుతూ సంబరం చేసుకున్నారు.

ఆ తరువాత ఇక చెప్పేదేముంది. ఉత్పత్తి ముందుకంటే పడి పోయింది. మెషీన్ల పై పెట్టిన ఖర్చుని వ్యాపార రావు రాబట్టుకోలేక పోయాడు. లాభాలు బాగా తగ్గి పోయాయి. కొన్ని రోజులు చూసి వ్యాపార రావు ఫాక్టరీ మూసేసుకుని వెళ్ళి పోయాడు. నాలుగు వందల మంది వర్కర్లు రోడ్డున పడ్డారు. సివిల్ లిబర్టీస్ వారూ, యూనియన్ నాయకులూ మాత్రం ఇప్పటికీ ఇది మూడు ప్రపంచాల సిద్ధాంతం సాధించిన ఇంకో గొప్ప విజయంగా చెప్పుకుంటూ ఉంటారు.

సర్వే జనా దు:ఖినోభవంతు!

(ఎప్పుడో చదివిన ఒక పాత జోక్ ఆధారంగా.)

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

9 Responses to కమ్యూ”నిజం” జిందాబాద్!

 1. వికటకవి says:

  🙂

 2. మురళి గారూ! మీరు కాపిటలిజం లోని పాజిటివ్ యాంగిల్ గురించి రాశారు.దానిలో కూడా చెడు పార్శ్వం ఉన్నది.అందుకే సామ్యవాదం జనించింది.అలాగే సామ్యవాదంలో కూడా చెడు పార్శ్వం ఉన్నది. అందుకే అది విఫలం చెందింది.

 3. Murali says:

  సరస్వతి కుమార్ గారూ,

  నిజమే క్యాపిటలిజంలో కూడా చెడు పార్శ్వం ఉంది. నేను కాదనట్లేదు. Perfect solution వెతికేది కమ్యూనిజం, క్యాపిటలిజం కాదు. Just like there are no silver bulltes, so are there no perfect solutions. ఇదే నేను చెప్పదలుచుకుంది.

  -మురళి

 4. independent says:

  కుమార్ గారూ..
  మీరు మీ బ్లాగులో రాస్తూన్నవి చదివా. దాంట్లో నాకు ఎక్కువ కాపిటలిజమ్ ని కావాల్సిన దాని కన్నా ఎక్కువ విమర్శించినట్లుగానే నాకు కనబడింది.

  నేను చిన్నప్పట్నుంచి కమ్యునిస్టుల మధ్యనే పెరిగా. ఒకప్పుడు నాకు లెనిన్ దేవుడు. రష్యా నాకు భూతల స్వర్గం. నేను చదివిన సాహిత్యం అలాగే ఉండేది మరి. Das Capital లో “అదనపు విలువ(surplus value)” అనే కాన్సెప్ట్, దాని వెనకాల ఉండే “దోపిడి”, దాని మీద పుంఖానుపుంఖానులుగా (రంగనాయకమ్మ గారు కూడా దాని గురించి చాలా రాసారు ) వచ్చిన గ్రంధాలు చదివి, ఆవేశంతో ఊగిపోయేవాణ్ణి. నిజంగా కూడా ఆలోచించండి..ఈ “అదనపు విలువ” వల్లే వచ్చిన సమస్యలు అన్నీ..అనిపిస్తుంది ఇప్పటికి కూడా.

  నాకు M.Tech అయిపోగానే DMRL, Kanchan Bagh లో సైంటిస్టుగా ఉద్యోగం వస్తే ఒక రెండు నెలలు చేసి నేను private sector లోకి move అయిపోయా డబ్బులెక్కువ అవసరముందని. అక్కడ కమ్యూనిస్టు యూనియన్ ఉండింది. మీరు నమ్మరు..ఆ కంపెనీలో అతి మామూలు ITI ఫిట్టర్ with 3 years experience కి, ఒక స్టేట్ గవర్న్మెంట్ లో ఇంజనీర్ కి వచ్చే సాలరీ కన్నా ఎక్కువ వచ్చేది. I swear. ఒకే యూనియన్.. elections గొడవల్లేవు. మా కంపెనీ లో కొంతమంది సీనియర్ వర్కర్స్ చివరి రెండు, మూడు నెలలు సాలరీ తీసుకోకుండా, అది డైరక్ట్ గా టాక్స్ కి పంపించెవాళ్ళు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్ అన్నీ రోజుకి ఒక రూపాయకి మానేజ్మెంట్(జర్మనీది లెండి) సబ్సిడైజ్ చేసి ఇచ్చేది. plus bonuses, full PF, excellent annual gifts etc., దాంట్లో ఉద్యోగం వస్తే చాలని వర్కర్సే కాదు, ఇంజనీర్లు(మెకానికల్) కూడా తల క్రిందులుగా తపస్సు చేసే వాళ్ళు. మొత్తం సౌత్ ఇండియాలో సాఫ్ట్ వేర్ కంటే కూడా ఎక్కువ పే చేసేది అదొక్క కంపెనీయే. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ, దాని మానేజ్మెంట్ ప్రొఫైల్ అర్ధం కావడానికి.

  ఇట్లాంటి కంపెనీలో కూడా వాళ్ళెంత ఉక్కు పిడికిలి బిగించి మరీ మొత్తం shopfloor ని ఎంత కంట్రొల్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. చీమ కూడా కదిలేది కాదు యూనియన్ అనుమతి లేకుండా. ఒక మిషిన్ మీద ఓ నలబై పీసెస్ ప్రొడ్యుస్ అవుతున్నాయనుకోండి. ఇక ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు ఒక్క పీస్ కూడా మీరు ఎక్కువ తీయలేరు. మీరు ఆ మిషిన్ మీద పనిచెసి, అవలీలగా కనీసం అరవై పీసేస్ ప్రొడ్యుస్ చేయొచ్చని ప్రూవ్ చేసినా సరే. పచ్చిగా చెప్పాలంటే ఎవ్వరూ ఏమీ పీకలేరు. అందరికీ తెలుసు అక్కడ ఏమవుతుందో including top management. ఊరికే middle management suffer అవ్వడం తప్పితే ఏమీ ఉండదు. ఒక్కొసారి నాకున్న ముప్పై మంది వర్కర్స్ లో ఒక మిషిన్ డౌన్ ఉండి, అతన్ని వేరే మిషిన్ మీద పని చేయాలన్న కాని, మనకు యూనియన్ లీడర్స్ కి సత్సంబంధాలుండాలి, లేకపోతే you will land in trouble and I did quite a few times. అందులో కాలేజి నుంచి ఫ్రెష్ గా వచ్చి, మాంచి దూకుడు మీద ఉండేవాణ్ణి. నా బ్యాచ్ లో ఒక క్యాంపస్ రిక్రూట్ కి ఉద్యొగం పోయింది..ఎందుకంటే ఆ అబ్బాయికి కొంచెం లౌక్యం తక్కువ, ఈ యూనియన్ వెధవలు చేసే వెధవ్వేషాలన్ని నా దగ్గర నడవ్వు అన్నట్లుగా ఉండేవాడు. ఇండియాలో labor laws చాలా పవర్ఫుల్ కాబట్టి, మానేజ్మెంట్స్ కూడా middle-management నే ఈజీగా వదిలేసుకుంటాయి.

  నాకు చిరాకు పుట్టి నేను అమెరికా కి వచ్చేశా. నాకీ కొద్ది కాలంలో అర్ధం అయ్యిందేంటంటే అమెరికా ఇంత succesful అవడంలో ఒక biggest reason ఏంటంటే, having large middle class in the country. అమెరికాకె కాదు..ఏ సొసైటీ లోనైనా మధ్య తరగతి శాతం ఎక్కువ ఉండాలి. కొన్ని ముఖ్యమైన పాయింట్లు.

  1. మధ్యతరగతి శాతం ఎక్కువ ఉంటే, difference in extremes తక్కువ ఉండి society lo unrest ప్రబలడానికి అవకాశాలు తక్కువుంటాయి.
  2. మధ్య తరగతి వాళ్ళు, కన్స్యూమర్ ఎకానమీ కి బాగా కంట్రిబ్యూట్ చేస్తారు.
  3. మధ్య తరగతి వాళ్ళకి, ఏదో ఒకటి చేసో, కష్టపడో, నెక్స్ట్ లెవల్కి వెళ్ళాలని ఉంటుందే తప్ప, వాళ్ళ దగ్గర్నుంచి లాక్కోని వాళ్ళని రిప్లేస్ చేయాలని ఉండదు. When people have nothing to loose, they don’t hesitate to do anything, but not the middle-class because of they always have something to loose.
  4. Social/Moral Values లో కూడా వీళ్ళు మరీ extreme ends లో జీవితాల్ని గడపడానికి ఇష్టపడరు. వీలయినంత వరకూ middle-of-the-path లోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. Call it middle-class syndrome, or middle-class values, they are universal.

  వేరేవి తరవాత చెపుతా.

  నేను మెక్సికో లో the-most-expensive-district-in-all-latin-american-countries లో ఒక ఆరు నెలలు పని చేసా. నాకు లంచ్ పదిహేను డాలర్లకి తక్కువ దొరికేది కాదు. ఆ దేశంలొ అసలు మిడిల్ క్లాసే లేదసలు. There are only upper and lower classes. అక్కడ కూడా అంతరాలు ఎంతుంటాయో చూసా.

  కమ్యూనిజం అంతందంగా కనబడుతుంది కదా..దాన్ని అమెరికా వాళ్ళు కనీసం ఒకసారి ట్రై చేయాలని ఎందుకు అనుకోలేదో, అసలు ఎప్పుడు ట్రై చేయకుండానే అదొక EVIL అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసిందా అన్నది నాకు ఇప్పటికీ మిస్టరీ. నేనా ప్రశ్న కొన్ని వందల మంది అమెరికన్స్ ని అడిగా. సంతృప్తికరమయిన జవాబు రాలేదింతవరకీ.

  మీ వ్యాసాల్లో కాపిటలిజం మీద మితిమీరిన thrashing తప్పితే, ఎక్కడా కొంచెం కూడా దానికి క్రెడిట్ ఇవ్వలేదు.
  అసలు అన్నింటి కన్నా ముందు ఎవరైనా కూడా, be-all, the-all solution ఒకటి expect చేయడమే అవివేకం. అలాంటిది ఈ భూ ప్రపంచం మీద ఇప్పటి వరకూ రాలేదూ..రాబోదూ…ఎందుకంటే change is the only constant thing in this world.

  అసలు ఏ ఇజం అయినా మానవున్ని, మనిషి తత్వాన్నీ, మానవ సహజ ప్రవృత్తినీ అంతర్లీనంగా ఇముడ్చుకోగలిగి ఉండి, తనను హైయ్యర్ ఐడియల్స్ వైపు గైడ్ చేయగలిగి ఉండగలగాలి. అప్పుడే అది మనగలుగుతుంది.

  all over the world కాపిటలిజం కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ని పావర్టీ లోంచి లిఫ్ట్ చేసింది , at the same time, it left billions behind.. ఇవి నా మాటలు కాదు. బిల్ గేట్స్ వి. వీలయితే Compassionate Capitalism మీద తన latest speech వినండి.

  Capitalism is not the perfect one, but it is the best one.

  ఇది నేను ఆలోచించి సమగ్రంగా రాసింది కాదు. పైన ఈ కధ, మీ కామెంట్స్ చూడగానే రాయాలనిపించి రాసింది. దీంట్లో అంత continuity ఉండకపోవచ్చేమో, కాని ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయడానికి నాకు ఓపిక లేదు.కాబట్టి judge చేయబాకండి.

 5. ఇండిపెండెంట్ గారూ!

  మీ సారాంశం నాకర్థం అయినది.నేను సారాంశాన్నే పరిగణిస్తాను కానీ రచనా శైలిని బట్టి జడ్జ్ చేయను.

  నేను కాపిటలిజాన్ని కొంచెం ఎక్కువగా విమర్శించిన మాట నిజమే.అంత మాత్రం చేత నేను సామ్యవాదిని కాను.నిజానికి నేను ఇస్లాం,కాపిటలిజం,కమ్యూనిజం.. ఈ మూడింటినీ సమదృష్టితోనే చూస్తాను.ఐతే మిగతా రెండూ విఫలమైపోయి, బలహీనమైపోయిన విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది.వాటిని విమర్శిస్తే చచ్చిన పామును చంపినట్లే కదా!

  ‘అదనపు విలువ’ అనే అంశం మార్క్స్ సిద్ధాంతంలోకెల్లా బలహీనమైన అంశం.దాని మీద అనేక విమర్శలు వచ్చాయి. వస్తువు విలువను నిర్ణయించేది డిమాండ్ అండ్ సప్లై. కానీ మార్క్స్ శ్రామికుని శ్రమ శక్తి వలనే ఉత్పత్తి చేయబడిన వస్తువుకు విలువ ఆపాదింపబడుతుంది అనీ.. దానిని పెట్టుబడిదారుడు కార్మికునికి చెల్లించకుండా దోపిడీ చేస్తాడని వర్ణించాడు. ఇది కొంచెం అసంబద్ధమనే చెప్పాలి.ఐతే ఈ ఒక్క అంశం ద్వారా కమ్యూనిజాన్ని నిగ్గు తేల్చలేము.

  మీరు పనిచేసిన ప్రైవేటు కంపెనీలో మామూలు ITI ఫిట్టర్ కు రాష్ట్ర పభుత్వ ఇంజనీర్ కన్నా ఎక్కువ సాలరీ ఇచ్చేవారు, అలానే అనేక ఇతర సౌకర్యాలను కూడా కల్పించేవారు అని రాశారు. ‘ఇది సామ్యవాదం సాధించిన విజయం’ అనైనా అనుకోవచ్చు లేదా ‘ఇటువంటి పరిస్థితి సామ్యవాద ఉద్యమ ఫలితంగానే ఏర్పడింది ’ అనైనా అనుకోవచ్చు. సామ్యవాదం జనించింది ఈ నాటి పరిస్థితుల దృష్ట్యా కాదు. పారిశ్రామిక విప్లవం యొక్క ఆరంభ దినాల్లో అంటే 18వ మరియు 19వ శతాబ్దపు రోజులలోని పరిస్థితుల నేపథ్యంలో సామ్యవాదం జనించింది.

  ఇక ఆ కంపెనీలో యూనియన్ వాళ్ళ ఉక్కు పిడికిలి,వాళ్ళ కంట్రోల్ అంటారా! కాపిటలిజానికి కమ్యూనిజం ప్రతిక్రియేగానీ పరిష్కారం కాదు. దానిలో ఉండే లోపాలు దానిలో ఉంటే.. దీనిలో ఉండే లోపాలు దీనిలో ఉంటాయి.

  ఇక మధ్యతరగతి లక్షణాల గురించి మీరు చెప్పిన వాటిలో కొన్ని నేనూ ఒప్పుకుంటాను. కానీ పెద్ద సంఖ్యలో మధ్య తరగతి అనేక దేశాలలో ఉన్నది. అవన్నీ అమెరికాలా అభివృద్ధి చెందలేదు.

  వ్యవస్థలు ట్రై చేయాలనుకుంటే మారవు.. విప్లవాలతోనే మారతాయి. కాపిట్లలిజంతో అమెరికన్లు హాయిగా ప్రపంచం మీద పెత్తనం చేస్తూ బ్రతుకుతుంటే సామ్యవాదాన్ని ఆచరిద్దామనే ఆలోచన వారికెలా కలుగుతుంది.

  కాపిటలిజానికి ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదు. నేను వరుసగా ఇస్లాం, కాపిటలిజం, కమ్యూనిజం.. ఈ మూడింటి వలన ప్రపంచానికి జరిగిన మేలు.. అలానే కీడు రెంటినీ సంగ్రహంగా వివరించాను. ఐతే కాపిటలిజాన్ని మిగతా వాటి కన్నా కొంచెం ఎక్కువగా విమర్శించాను. దీనికి కారణం ఇప్పుడు మానవుడు తన అంతిమ రాజకీయ వ్యవస్థ దిశగా కదిలేటపుడు పోరాడవలసినది, కూలదోయవలసినది కాపిటలిజాన్నే కనుక.

  కాపిటలిజాన్ని వ్యతిరేకిస్తున్నను కనుక నేను సామ్యవాదిని అని అనుకోవద్దు. నేనొక నూతన వ్యవస్థని కోరుకుంటున్నాను. ఆ వ్యవస్థ ఏర్పాటుతో భారతదేశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నాను.

  Capitalism is not the perfect one,but it is the best one.

  ఏనాటి కాపిటలిజం గురించి మీరు ఈ మాట రాశారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభ దినాలలోని కాపిటలిజం గురించి మీరు ఈ మాట అనగలరా?! కేవలం కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగా, కమ్యూనిస్టు ఉద్యమ ఫలితంగా, కమ్యూనిస్టు ఆలోచనా విధానం ఫలితంగా అనేక మార్పులకు గురై నేడు మన కళ్ళకు కనిపిస్తున్న కాపిటలిజం గురించేగా మీరీ మాట అనగలుగుతున్నది!

  మానవుడు అనాదిగా సత్యాన్వేషణ జరుపుతున్నది Perfect one కోసమే.అప్పటి వరకూ అతని పోరాటం ఆగదు.

  Change is the only constant thing in this world

  అనాదిగా ఉన్న సూర్యుడు మారాడా?.. చంద్రుడు మారాడా?.. ఆకాశం మారిందా?.. నక్షత్రాలు మారాయా?.. సముద్రాలు మారాయా? సరే ఇంతెందుకు అమీబాతో మొదలైన జీవ పరిణామం కొన్ని లక్షల సంవత్సరాలు జరిగి మనిషి ఆవిర్బావంతో ఆగిపోలేదా?!

  మార్పు గమనం కొరకే.. గమనం లక్ష్యం చేరడం కొరకే. లక్ష్య సిద్ధి జరిగిన తరువాత మార్పుకు అర్థంలేదు.

  కామెంట్ పెరిగిపోతున్నది.. చివరిగా ఓ మాటచెప్పి ముగిస్తాను. నేను ఇంకొక టపాతో నా చిరు గ్రంథపు మొదటి అధ్యాయం ముగించబోతుండగా నా భావాల ప్రాతిపదికతో మంచి చర్చ చేశారు.. ధన్యవాదాలు! ఐతే నేను ఈ భావాలను ఏదో నాకు తోచినట్లుగా చెప్పటం లేదు. వీటి వెనుక ఒక శాస్త్రీయమైన తాత్విక విచారధార ఉన్నది. ఆ ప్రాతిపదిక మీదే నేను ఆ వ్యాసాలన్నీ రాస్తున్నాను. ఆ తత్వవిచారాన్ని రెండవ అధ్యాయంగా మరికొన్ని వ్యాసాల రూపంలో అందించబోతున్నాను.

  ఆ వ్యాసాలను కూడా చదివిన తరువాత మీ అభిప్రాయాలను, అలానే నా అభిప్రాయలను గురించి కూడా ఓ సారి పునరాలోచించగలరని ఆశిస్తున్నాను.

 6. Siva says:

  I closely observed lot of communist leaders, all of them are karode pathis some of them have more than 100cr of assets, my question is why only comunist party workers are in proverty, why not leaders ?

 7. klnrao says:

  ther ar somany neo rich people cald cammunists in india.They al ar act like two headed snakes ,one head is capitalism and the another captalism.Your artical is good.keep it up

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s