బట్ట తల వచ్చేసిందే బాలా – 30


సాధారణంగా షాకులు అన్నీ కట్ట కట్టుకుని వస్తాయి. మా విషయంలోనూ అలానే జరిగింది.

రమణరావు గీతోపదేశం విన్న మరుసటి రోజు పొద్దున్నే (అంటే ఒంటి గంటకు లెండి, మేము అప్పుడే కదా లేచేది వీకెండ్స్‌లో!) ఎవరో మా తలుపు కొట్టారు. మేము నలుగురం లివింగ్ రూంలోనే పడక సీన్ వేశాం క్రితం రాత్రి.

“కమిన్!” కళ్ళు మూసుకునే అన్నాడు పాపారావుగాడు. “ఎలా వస్తార్రా? లేచి తలుపు తీస్తే వస్తారు,” విసుగ్గా అన్నాడు శేఖర్. ఈ మధ్యలో నేను లేచి వెళ్ళి తలుపు తీశాను. ప్రవల్లిక ఫాదర్!

నేను లోపలికి రమ్మనేంతలో ఆయనే వచ్చేశాడు. “వచ్చే నెల్లోనే ప్రవల్లిక పెళ్ళోయి,” అన్నారు ఆనందంగా. పాపారావుగాడు కెవ్వున అరిచి లేచి కూర్చున్నాడు. “ఏమయ్యింది?” ఖంగారు పడ్డారు ఆయన.

“ఏం లేదు లెండి. ఎవరి పెళ్లి కుదిరినా మా వాడికి బోలెడు సంబరం. వధూవరులను ఊరేగించే సందర్భం ఉంటే, మా వాడే ముందు డ్యాన్స్ చేస్తూ వెళ్ళే రకం,” నేను సర్ది చెప్పాను.

అంతలో విజయశాంతిలా నాకు కర్తవ్యం గుర్తుకొచ్చింది. ప్రవల్లిక నెక్స్ట్ వీకెండ్ జపాన్ బావతో రిజిస్టర్ మ్యారేజ్ ప్రోగ్రాం పెట్టుకుంది కద. పైగా సహాయం చేయమని మమ్మల్ని అడిగింది కూడా!

నేను మొహం కాస్త గంభీరంగా పెట్టి, “ప్రవల్లికకు ఈ పెళ్లి ఇష్టమేనా అంకుల్?” అడిగాను.

“ఇష్టం లేకపోవడమేంటి? తను ఇష్టపడిందనే ఈ పెళ్లి చేస్తూంది,” అన్నారాయన కాస్త ఆశ్చర్యంగా.

నేను అవాక్కయ్యాను. అంతలో నాకు కోపం ముంచుకు వచ్చింది. నాతో ఏమో జపాన్ బావో అని గోలెట్టి, ఇక్కడ వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధానికి ఎగిరి గంతేసి మరీ తయారయ్యింది. ఈ ఆడపిల్లలంతే. సిన్సియర్‌గా ప్రేమించరు. మా అబ్బాయిలు అలా కాదు. నా మటుకు నేను ప్రేమించిన నూట పద్దెనిమిది మందిని యమ సిన్సియర్‌గా ప్రేమించాను.

“ఇంతకీ అబ్బాయి ఎక్కడినుంచి? ఏం చేస్తూంటాడు?” అడిగాడు శేఖర్.

“అబ్బాయి మాకు చిన్నప్పటినుంచి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ చాలా ఏళ్ళ కిందే జపాన్ వెళ్ళారు. ఈ శనివారానికి ఇండియాకి పర్మనెంటుగా తిరిగి వచ్చేస్తున్నారు,” అని ఆయన ఇంకేదో చెప్పబోయేంతలోనే, “జపాన్ బావ,” అన్నాడు నారాయణ్.

“ఆ, అవునవును! ప్రవల్లిక చిన్నప్పటినుంచి బావా అనే పిలిచేది. మీకెలా తెలుసు?” అడిగాడాయన ఆశ్చర్యంగా.

“గెస్ చేసుంటాడు లెండి,” అన్నాను నేను నీరసంగా.

ఆయన కంటిన్యూ అయిపోతూ, “పాపం మా అమ్మాయి భయపడింది నేను ఎక్కడ ఒప్పుకోనో అని. చిన్నప్పుడు ఆ అబ్బాయిని కూకలేసే వాడినట. అది మనసులో పెట్టుకుని నాకు ఈ విషయం చెప్పనే లేదు. ఐతే అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇండియాకి వస్తున్నామని నాకు కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళబ్బాయికి ప్రవల్లిక అంటే ఇష్టం అని కూడా చెప్పారు. తరువాత నేను ప్రవల్లికని అడిగితే బోలెడు సిగ్గు పడి తనకు కూడా ఇష్టమే అని చెప్పింది. కాబట్టి అబ్బాయి వాళ్ళు రాగానే త్వరలో ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాము,” చెప్పారు.

“కంగ్రాచ్యులేషన్స్ అంకుల్!” కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అన్నాను నేను.

“నీది మరీ సున్నితమైన మనసయ్యా! వెంటనే ఆనంద భాష్పాలు వచ్చేశాయి నీకు,” మృదువుగా అన్నారు ప్రవల్లిక నాన్నగారు.

“నేను కొంచెం అంతే లెండి,” అన్నాను నేను గద్గదమైన స్వరంతో.

“సరేనోయి! ఈ ఆదివారం అబ్బాయి వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. మీరు నలుగురూ కూడా వచ్చేయ్యండి. అబ్బాయిని చూద్దురు గాని,” అని చెప్పి బయలు దేరారు ఆయన.

“ఏముంది చూడ్డానికి? చిన్నప్పటి అమ్రీష్ పురిలా ఉంటాడు. అంతే కద!” కసిగా అన్నాడు నారాయణ్.

****

జూనియర్ అమ్రీష్ పురిలా లేడు కానీ జపాన్ బావ గుండు మాత్రం సీనియర్ అమ్రీష్ పురిలానే నిండుగా నున్నగా ఉంది.

ప్రవల్లిక నాన్నగారు మమ్మల్ని పరిచయం చేశారు “కొంబన్ వా,” అన్నాడు జపాన్ బావ మమ్మల్ని చూసి విశాలంగా నవ్వుతూ. మేము కాస్త ఖంగారు పడ్డాం.

“సారీ, అలా అంటే జపనీస్‌లో గుడ్ ఈవినింగ్ అని అర్థం,” మా కన్‌ఫ్యూజన్ని గమనించాడేమో, ఎక్స్‌ప్లెయిన్ చేసాడు అతను.

“యాండీ, జపనీస్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?” అడిగాడు పాపారావు.

“రోజులు కాదండీ. సంవత్సరాలు పడుతుంది. చాలా క్లిష్టమైన భాష,” గంభీరంగా అన్నాడు జపాన్ బావ.

“ఓ ఐతే మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారన్న మాట,” అన్నాడు పాప్స్.

“లేదు నాకు జస్ట్ రెండేళ్ళు పట్టింది,” కాస్త కోపంగా అన్నాడు జపాన్ బావ.

ఆ తరువాత ఏం మాట్లాడాలో మాలో ఎవరికీ తెలీలేదు. ప్రవల్లిక వచ్చి మమ్మల్ని రక్షించింది. “బావా, ఇలా రా. మా నాన్న పిలుస్తున్నాడు,” అని అతన్ని లాక్కుని వెళ్ళిపోయింది.

“ఈ జపాన్ బావ నాకు నచ్చలేదురా!” డిక్లేర్ చేశాడు నారాయణ్. “మేం ఏమన్నా పెద్ద ఫ్యాన్స్ అనుకుంటున్నావా? మాకూ నచ్చలేదు,” అన్నాడు శేఖర్.

“మనకు నచ్చితే ఏంటి, లేకపోతే ఏంటి? ప్రవల్లికకి నచ్చాడు కద,” అన్నాను నేను దిగులుగా.

“మన ప్రేమలో ఎక్కడో సిన్సియారిటీ తక్కువయ్యిందిరా. అందుకే ఇలా జరిగింది,” బాధగా అన్నాడు పాపారావు.

“ఇన్ని పాటలు పాడుతావు కదరా, దేవుడిని ఉద్దేశించి ఒక సాంగ్ అందుకో. ఏమైనా అద్భుతం జరుగుతుందేమో?” అన్నాను నేను.

పాపారావుగాడి కళ్ళు మెరిశాయి. వెంటనే గొంతు సవరించుకుని, “రా దిగి రా, హెవెన్ నుంచి ఎర్త్ దిగిరా. రా రా, హెవెన్ నుంచి ఎర్త్ దిగిరా,” అంటూ అందుకున్నాడు. నారాయణ్ గాడు రెండు చెవుల్లో వేళ్ళు పెట్టుకున్నాడు ఆ ఎఫెక్ట్ కాస్త తగ్గడానికి.

దేవుడు రాలేదు కాని, సడన్‌గా ప్రవల్లిక వాళ్ళ అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యింది చూడ్డానికి నేపాలీలా ఉన్న ఒక అమ్మాయి.

సూటిగా మా నలుగురి దగ్గరకు వచ్చి, “కొంబన్ వా!” అంది. మాకు ఆ పాటి జపాను భాష వచ్చు కాబట్టి, మేము నలుగురం, “కొంబన్ వా!” అన్నాం గట్టిగా. ఆమె మొహం వికసించింది. “日本語を知っている?” అంది ఆనందంగా.

మేం గతుక్కుమన్నాం. ఆమె తిరిగి, “డూ యువ్ నో జపనీస్?” అడిగింది. మేం అడ్డంగా తలూపాం. “నాకు తెలుగే సరిగ్గా రాదు,” గర్వంగా చెప్పాడు పాపారావు. “నువ్వు నోర్మూయి. ఆమెకి కూడా రాదు,” అన్నాడు నారాయణ్.

“సారీ. ఐ థాట్ యువ్ న్యు జపనీస్. ఐ యాం లుకింగ్ ఫర్ దిస్ బాల్డ్ గై హూ కేం ఫ్రం జపాన్? డు యువ్ నో హిం?” అడిగింది జపాన్ పిల్ల.

“ఫుల్ బాల్డ్? నాట్ ఈవెన్ వన్ హెయిర్?” అడిగాడు పాపారావు.

అవునన్నట్టు తలూపింది ఆమె. “అదిగో అక్కడ ఉన్నాడు, జపాన్ బావా,” వేలితో చూపించాడు పాపారావు. పాపారావు ఏమన్నాడో ఆ అమ్మాయికి అర్థం కాలేదు, కానీ జపాన్ బావని చూడగానే తన కళ్ళు మెరిశాయి. వెంటనే అక్కడికి దూసుకుని వెళ్ళిపోయింది.

“か。!” అన్నాడు జపాన్ బావ తన్ను చూసి.

“いかに私に私の愛これをすることができるか。 私達が一緒に持っていた夢についての何か。いかに私を残し、行くでしようか。,” ఏడుపు గొంతుతో అంది ఆ అమ్మాయి.

జపాన్ బావ వెర్రి మొహం పెట్టాడు. ఆ అమ్మాయి ఏదో అంది.

“ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి,” అన్నాడు శేఖర్.

“ఆగు బాబూ, అది నా డైలాగు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి,” ఆవేశంగా అన్నారు ప్రవల్లిక ఫాదర్.

అలా అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యి ఒకరితో ఒకరు రకరకాల భాషల్లో మాట్లాడేశాక చివరికి తెలీందేమిటంటే, ఆ అమ్మాయి, జపాన్ బావా, టోక్యోలో ఉన్నప్పుడు రజనీ కాంత్ నటించిన “ముత్తు” సినిమా చూడ్డానికి వెళ్ళిన థియేటర్ దగ్గర కలుసుకున్నారు. ఆ తరువాత ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.

తీరా తన తల్లి తండ్రులకి, చెప్పాల్సి వచ్చేసరికి జపాన్ బావకు ధైర్యం చాల్లేదో, లేక ఈ అమ్మాయిని వదిలించుకుందామనుకున్నాడో కానీ, మొత్తానికి చెప్పకుండా ఇండియాకి వచ్చేశాడు, ఆ అమ్మాయికి ఇన్‌ఫార్మ్ కూడా చేయకుండా. ఆ అమ్మాయి నానా కష్టాలు పడి ఎలానో కూపీ లాగి ఇక్కడి వరకూ వచ్చింది.

ఇక క్షమాపణల పర్వం మొదలయ్యింది. తప్పు ఒప్పుకుంటూ జపాన్ బావ ఆ ఆమ్మాయిని క్షమించమని కోరాడు. తరువాత ప్రవల్లికని అడిగాడు. ప్రవల్లిక జపాన్ పిల్లని క్షమించమని అడిగింది. తరువాత జపాన్ బావ తల్లి తండ్రులు ప్రవల్లిక ఫాదర్‌నీ మదర్‌నీ క్షమాపణలు అడిగారు. ఇదంతా చూసి పాపారావు మనసు కరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. వాడు చేసిన గోలకు మేం ముగ్గురం అందరికీ క్షమాపణ చెప్పాం.

కాసేపయ్యాక, జపాన్ బావ కుటుంబం, ఆ అమ్మాయితో కలిసి అక్కడినుంచి నిష్క్రమించారు. ప్రవల్లిక మౌనంగా నిలబడిపోయింది. అలాంటి సున్నితమైన పరిస్థితుల్లో మేం ఎప్పుడూ ఏం చేస్తామో ఈ సారీ అదే చేశాం. అక్కడినుంచి దౌడు తీశాం.

(నెల రోజుల తరువాత…)

మేమంతా ప్రవల్లికకు వీడ్కోలు చెప్పడానికి ఎయిర్‌ పోర్ట్‌కి వచ్చి ఉన్నాం.

“ఇంకో సారి ఆలోచించమ్మా, దేశం కాని దేశం. ఎలా ఉంటావో ఏంటో!” అన్నారు ప్రవల్లిక నాన్నగారు. ప్రవల్లిక అమ్మగారు కళ్ళొత్తుకున్నారు.

“లేదు నాన్నా. బావని మరిచిపోవాలంటే ఇదే బెస్ట్ పద్ధతి. ఒక సంవత్సరం టోక్యోలో ఈ కోర్స్ చేసి వస్తే, నేను మళ్ళీ మాములుగా అవుతాను. ఇంతవరకూ ఇష్టం లేకుండా బావకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు కావాలనే దూరంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళనివ్వండి,” తొణకకుండా చెప్పింది ప్రవల్లిక. ప్రవల్లిక నాన్నగారు ఇంక ఏం అనలేదు.

“వెళ్ళొస్తానండీ. మళ్ళీ సంవత్సరం తరువాత కలుద్దాం. మీరు ఇంకా అదే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటే,” నవ్వుతూ అంది ప్రవల్లిక.

“ఒక్క సంవత్సరంలో మా జీవితాల్లో అంతంత పెద్ద పెద్ద మార్పులు రావు లెండి,” చెప్పాడు నారాయణ్.

బోర్డింగ్ ఆఖరి కాల్ అనౌన్స్ చేశారు. ప్రవల్లిక మా అందరికీ చేయి ఊపి, సెక్యూరిటీ క్లియరెన్స్ ఏరియాలోకి ప్రవేశించింది. ప్రవల్లిక తల్లి తండ్రులు వెంటనే కదిలేలా కనిపించలేదు. వాళ్ళని అక్కడే వదిలేసి, మేం నలుగురం ఎయిర్ పోర్ట్ నుంచి బయట పడ్డాం.

“ఏరా బాధ పడుతున్నావా?” నేను నారాయణ్‌ని అడిగాను.

“లేదురా. నాకిప్పుడు అర్థం అయ్యింది. నేను ఒక వేళ బాధ పడినా అది ప్రవల్లిక గురించి కాదు. నిజానికి నేను నా కోరిక తీరలేదు అని బాధ పడుతున్నాను అన్న మాట. ఉదాహరణకు నాకు పూతరేకులు తినాలనిపించింది. కానీ అవి దొరకలేదు. అప్పుడు నేను ఒక వేళ బాధ పడితే అది పూతరేకులు తృప్తిగా కొరకలేకపోయినందుకు కాదు. నేను ఒకటి కోరుకున్నాను. అది నాకు దొరకలేదు. అందుకు నాకు బాధ కలిగిందన్న మాట,” జవాబిచ్చాడు నారాయణ్.

“ఏడ్చినట్టుంది, మొన్న చెప్పిన యాపిల్ జామకాయ ఎగ్జాంపుల్ కూడా ఇదే కద. అప్పుడు అర్థం కాలేదు ఎందుకు మరి?” చిరాగ్గా అన్నాడు శేఖర్.

“ఆ ఎగ్జాంపుల్ పూతరేకులు వాడి చెప్పుంటే నాకు అప్పుడే అర్థమయ్యేది,” అన్నాడు నారాయణ్.

(అయిపోయింది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

21 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 30

 1. ప్రపుల్ల చంద్ర says:

  ప్రతీ డైలాగ్ బాగుంది… చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. ముఖ్యంగా చివరిది…
  మొత్తానికి మీ బట్ట తల వచ్చేసిందే బాలా చాలా బాగుంది…
  ఇంకా ఇలాంటి సిరీస్ లు అందిస్తారని ఆశిస్తూ….

 2. రవి says:

  మురళీజీ,

  “తోతెమో ఓమోషిరోయి దేసునే”

  ఎక్కడో ఓ మూల అనుమానం ఆ జపాన్ బావ మీరేనేమో అని.

  日本語を知っている?” అంటే, నిహొంగొ ఓ — దేకిరు ? ..కరెక్టేనా?

  congrats for running a beautiful serial in such an interesting way..

 3. మురళిగారు,
  చాలా బాగా వ్రాసారు. అబినందనలు.

  అరిపిరాల

 4. Murali says:

  పోండి సార్, మీరు మరీనూ! నాకు జపనీస్ ఎక్కడ వస్తుంది, నా మొహం.

  Thanks for the kudos!

  -మురళి

 5. bapu says:

  nice ending… chalaa baagundi.
  mammalni entertain chesinanduku thanx murali gaaru..!

 6. sk says:

  muraliji …

  superrrrrrrrrr

 7. సీరియల్ చాలా చాలా బాగుంది. అన్ని భాగాలను కలిపి PDF లోకి కన్వర్ట్ చేసి, ఒక చోట పెడితే బాగుంటుంది.

 8. అయిపోయిందా. ఇదేం బాలేదు. మీ బట్టతల బ్యాచ్ నంతా ప్రవల్లిక వెనకే టోక్యో తీసుకెళ్ళి, మీ పాపారావుతో ఎంచక్కా వాళ్ళ భాషలో కూడా పాటలు పాడించొచ్చుగా.

 9. చాలా బాగుంది. కొద్ది సేపు హాయిగా నవ్వుకున్నాము! మా ఆవిడతో కూర్చుని ఈ పాట పాడుతున్నాను! నాకు బట్ట తల వచ్చినా ఆవిడను ‘ బాలా ‘ అన్నందుకు తెగ మురిసిపోతున్నది మరి…

 10. indira devi says:

  appude ipoyindaa? ayyoooooooooo

 11. Murali says:

  ఈ సీరియల్‌ని ఫాలో అయి, ఎప్పటికప్పుడు తమ ఫీడ్‌బ్యాక్‌ని అందించిన పాఠకులందరికీ కృతజ్ఞతలు.

  I enjoyed writing this story very much and was a little hesitant when I decided to end it. But, all good things have to come to an end…

  -మురళి

 12. రవి says:

  నాగ ప్రసాద్ గారి సూచన బావుంది. పీడీఎఫ్ చేసి పెట్టాలి.

  మురళీజీ, క్లైమాక్స్ బాగా లేదని అనుమానమా? లేకపోతే, తెలుగు సినిమాల్లో లాగ, డ్రమ్ములు దొర్లుకుంటూ ఫైటు జరిగి, చివరికి పోలీసులు వచ్చి…ఇలా లేదని చింతా?

  అవేం లేవు, క్లైమాక్స్ కూడా మిగిలిన ఎపిసోడ్ ల లాగే సూపరు..

 13. Jyothi Reddy says:

  Enti sir maku cheppakundaney end chesaru we will miss all fun….
  Can you please start new one asap,
  Really we enjoyed your Battathala story.
  “Wish You Happy New Year 2009” and your dreams come true…

 14. చాల సరదాగా ఉంది కాని ముగింపు మొదలంత బాగా లేదు.
  చివరకి వచ్చేసరికి హాస్యం పాలు తగ్గి వేదాంతం సాంద్రత కొంచం పెరిగింది.

  మొత్తానికి చాలా బాగుంది.

  కాముధ

 15. Seetha says:

  Murali,

  Chadivinantha seepu navvuthune vunnanu.
  Chaala Chaala baagundhi.
  Really admirable sense of humour.
  Waiting for a new sequel in the new year….

  HAPPY NEW YEAR

 16. Wanderer says:

  వేరే డెడ్ లైన్స్ ఎమన్నా ఉన్నాయా ఏంటి? హడావుడిగా ముగించేసినట్టు ఉంది. 😛

  Happy New Year.

 17. lakshmi says:

  Murali gaaru !! chaala baaga enjoy chesaamu. and i thought its going to end like NAALUGU STAMBHAALATA. but ending lo malli twist ichchaaru.
  kaani papam jaali vesindi aa BATTA TALA BAABULNI taluchukunte. herione evariki doraka ledu kada!!!

  secrete gaa okka vishayam cheppandi( meeku kuda batta tala undaa:):):))
  ssshhhh !! nenu evariki cheppanulendi

 18. kishore reddy says:

  చాలా బాగా వ్రాసారు.

 19. suresh says:

  ఎక్సెలెంట్ అండి!! చాలా బాగా రాసారు…బాగా నవ్వించారు…నాగ ప్రసాద్ గారు చెప్పినట్లు పి. డి. ఎఫ్. చేసి పెట్టండి ప్లీజ్!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s