బట్టతల వచ్చేసిందే బాలా – 24

నారాయణ్‌గాడి ఎక్స్‌పీరియన్స్ విన్నాక మా అందరి మనసులు విషాదంతో నిండిపోయాయి. వాడు చెప్పలేక ఫెయిల్ అయ్యాడు అన్న జాలితో కాదు. మేము కూడా వాడికంటే దారుణంగా ఎక్కడ ఫెయిల్ అవుతామో అన్న భయం వల్ల.

ఒక రోజు నేను ఇంటికొచ్చేసరికీ శేఖర్ నెత్తిన గుడ్డేసుకుని కూర్చుని ఉన్నాడు. నాకు తెలిసినంతవరకూ స్టాక్ మార్కెట్‌లో దీవాలా తీస్తేనో, ఇండియా పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోతేనో, ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోతేనో అలాంటి ఫోజ్ ఇస్తారు జనాలు. మరి వీడికేమయ్యింది?

“అలాంటివి ఏం కాలేదు,” నా మనసులో మాట పసిగట్టినట్టు అన్నాడు వాడు. “ఈ రోజే ప్రవల్లికతో మాట్లాడ్డం జరిగింది.”

“కాయా పండా?” అడిగాను నేను. అంతలో తలుపు తెరుచుకుని నారాయణ్, పాపారావు లోపలికి వచ్చారు. “ఏరా నెత్తిన గుడ్డేసుకున్నావు? నెత్తిన జుత్తు మొలవడానికి ఇదేమన్నా కొత్త మార్గమా? నాక్కూడా చెప్పొచ్చుగా!” ఉత్సాహంగా అడిగాడు పాపారావు.

“మెడ చుట్టూ అదే గుడ్డ చుట్టుకుని గట్టిగా లాగితే, బట్టతలేంటి, అన్ని ప్రాబ్లంస్ సాల్వ్ అయిపోతాయి. ఏమయ్యిందిరా శేఖర్?” ప్రశ్నించాడు నారాయణ్.

“ప్రవల్లికతో మాట్లాడాను,” చెప్పాడు శేఖర్.

“కాయా పండా?” నారాయణ్, వాడితో పాటూ పాపారావు ఒకేసారి అడిగారు.

“ఏరా? మీరందరూ ఏదైనా పళ్ళతోటలో పని చేసే వారా ముందు? ప్రతి ఒక్కడూ ఇదే అడుగుతాడు?” చిరాకు పడ్డాడు శేఖర్.

“ఏడిశావులే కానీ విషయం చెప్పు,” అన్నాడు నారాయణ్.

శేఖర్‌గాడి ఫ్లాష్‌బ్యాక్:

“నా ఆహ్వానాన్ని మన్నించి నాతో మసాలా చాయ్ తాగడానికి వచ్చినందుకు థాంక్స్ ప్రవల్లిక!” అన్నాడు శేఖర్.

“ఫరవాలేదు కానీ, నిన్న కూడా నారాయణ్ ఇలానే కాఫీకి అని బుంకోగిర్రాకి తీసుకు వెళ్ళాడు. ఈ రోజు చూస్తే మీరు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు,” అంది ప్రవల్లిక.

“బుంకోగిర్రానా? చెత్త ప్లేస్. పైగా ముష్టి కాఫీకి వంద రుపాయలు చార్జ్ చేస్తాడు. కాఫీ కంటే టీ హెల్తుకి మంచిది. ఆ నారాయణ్‌గాడంతే. ఎవర్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలీదు,” అన్నాడు శేఖర్.

“మరే ఎంతైనా మీరు చాలా డిఫరెంట్. చెప్పండి ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో,” వెయిటర్ చూపించిన టేబుల్ దగ్గర కూర్చుంటూ అంది ప్రవల్లిక.

“జెనరల్‌గా లైఫ్ గురించి మాట్లాడాలి అని,” నసిగాడు శేఖర్.

“కొంప దీసి మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఏదో నాకు అంటగట్టబోవడంలేదు కద?” భయంగా అంది ప్రవల్లిక.

“ఛ! అలాంటిదేమీ లేదు. లైఫ్ గురించి అంటే, మన ఆశయాలూ, అనుభూతులు వగైరా వగైరా అన్న మాట.”

“చెప్పండి మరి మీ ఆశయల గురించి.”

“అంటే నా ఆశయాలే కాదు ఎవరి ఆశయాల గురించి అయినా మాట్లాడుకోవచ్చు…”

“ఓ, ఐతే మా కజిన్ సుబ్బలక్ష్మి ఆశయాల గురించి మాట్లాడుకుందామా? తనకి ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలన్నా కావాలట. ఆ మరేమో వాళ్ళమ్మని తన దగ్గరే పెట్టుకుంటుందట.”

“ఆశయాలంటే నీ ఆశయాల గురించి అని నా ఉద్దేశం. నువ్వు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు అలాంటివి. మీ సుబ్బలక్ష్మి ఆశయాలు నాకెందుకు?”

“ఏం? సుబ్బలక్ష్మి మనిషి కాదా? దానికి మనసు ఉండదా? అదే సిమ్రన్ అనే పేరు ఉంటే మీరిలా అనే వారా?”

“అబ్బే అది నా ఉద్దేశం కానే కాదు. నేను నీ ఫ్యూచర్ గోల్స్ గురించి తెల్సుకోవాలని…”

“ప్రస్తుతం నా గోల్, ఈ మసాలా చాయ్ తాగి ఇంటికి వెళ్ళడమే.”

***

“ఆ తరువాత?” అడిగాం ముగ్గురం.

“ఏముంటుంది నా బొంద. ప్రవల్లిక మూడ్ ఆఫ్ అయిపోయినట్టుంది. ఇంటికొస్తూంటే దారిలో కూడా ఏం మాట్లాడలేదు. ఆ సుబ్బలక్ష్మి ఎవరో నా ప్రాణానికి వచ్చి పడింది,” ఘొల్లుమన్నాడు శేఖర్.

“మరి మూడ్ ఆఫ్ కాదా? అమ్మాయిలంటే ఎంత సున్నితంగా డీల్ చెయ్యాలి,” అనునయంగా చెప్పాడు పాపారావు.

“నువ్వు డీల్ చేద్దువుగానీ లేరా సచ్చినోడా! చూస్తానుగా! ఇప్పుడు నేనున్న పొజిషన్‌లో రేపో ఎల్లుండో నువ్వుంటావు. నెత్తిన గుడ్డ మాత్రం నీది. అంతే తేడా,” కసిగా అన్నాడు శేఖర్.

(ఇంకా ఉంది)

This entry was posted in బట్టతల. Bookmark the permalink.

6 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 24

  1. Jyothi Reddy says:

    Murali ji,

    “ప్రస్తుతం నా గోల్, ఈ మసాలా చాయ్ తాగి ఇంటికి వెళ్ళడమే.”

    Nice comedy!

  2. VJ says:

    బుంకోగిర్రా అంటే “బుర్ర గీక్కో” అని .. నేనే చెప్పా లెండి ఆ ఓనర్కి ఆ ఐడియా

  3. బాపు says:

    “ఏరా నెత్తిన గుడ్డేసుకున్నావు? నెత్తిన జుత్తు మొలవడానికి ఇదేమన్నా కొత్త మార్గమా? నాక్కూడా చెప్పొచ్చుగా!” మురళి గారూ ! కొత్త ఆలోచన. అయితే నేను అర్జెంటుగా ఓ గుడ్డ కొనుక్కోవాలి.

  4. పార్వతి says:

    😀 Hilarious ! 😀

  5. name says:

    very funny!

Leave a reply to Jyothi Reddy Cancel reply