బట్టతల వచ్చేసిందే బాలా – 14

మరుసటి రోజు ప్రవల్లిక ఫాదర్ మాతో మాట్లాడారు. “ఏంటోయి, మీరేదో అబ్బాయి గుణగణాలు కనిపెడతామన్నారు? చూస్తే ఒక్క ముక్క కూడా మాట్లాడినట్టు లేదు?”

“అలా మాట్లాడితే ఏం లాభం లేదండి. వాళ్ళు మనకు కావలసిన విధంగా సమాధానం చెప్తారు. అందుకే మేము అతని బాడీ లాంగ్వేజు కనిపెడుతూనే ఉన్నాంగా,” బదులిచ్చాడు శేఖర్.

“అవును బాడీ లాంగ్వేజ్ అబద్ధం చెప్పదు. మనము ఎలా కూర్చుంటాం, ఎలా నిల్చుంటాం, ఎలా గడ్డం గీక్కుంటాం వంటివి చూసి, మనిషి మనసులో ఏముంటుందో కనిపెట్టవచ్చు. అదే బాడీ లాంగ్వేజ్!” అన్నాను నేను వాడికి వత్తాసు పలుకుతూ.

“మీకు తెలుగు లాంగ్వేజే సరిగ్గా రాదన్నారు. బాడి లాంగ్వేజు ఎప్పుడు నేర్చుకున్నారు?” బోలెడు ఆశ్చర్య పోయారు ఆయన.

నాకు అప్పుడెప్పుడో చదివిన “హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్” గుర్తొచ్చింది. అదొక్కటే నేను బాడీ లాంగ్వేజ్ గురించి చదివిన ఏకైక పుస్తకం. అందులో నాకర్థమయ్యింది మా వాళ్ళకు చెప్పాను. వాళ్ళకు ఎంత అర్థమయ్యిందో మరి నాకు తెలీదు.

నేను గొంతు సవరించుకుని, “ఈ బాడీ లాంగ్వేజ్‌ని ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు నేర్చుకున్నాం అంకుల్. దాని వల్ల తెలుగు మీద పెద్దగా కాన్సంట్రేట్ చెయ్యలేకపోయాం,” అన్నాను.

ఆయన మొహంలో కాస్త నమ్మకం కనిపించింది ఇప్పుడు. “సరే అలాగైతే చెప్పండి మరి, ఏం అబ్‌జర్వ్ చేశారో?” అడిగారు.

“మనిషిలో లీడర్‌షిప్ క్వాలిటీ తక్కువలా ఉంది. అందుకే వాళ్ళ అమ్మగారూ, నాన్నగారూ మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక తను వెనక వచ్చాడు,” అన్నాడు నారాయణ్.

“ఓ,” సాలోచనగా తల పంకించాడు ఆయన. “కానీ లీడర్‌షిప్ క్వాలిటీ లేకపోయినా మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు కద! ఇన్ ఫాక్ట్, మా అమ్మాయిని పట్టించుకోకుండా ముందుకు అలా దూసుకెళ్ళిపోవడం కంటే, తన వెనకే రావడం మంచిదేమో కద!”

రిలీజ్ అయిన మొదటి రోజే డబ్బాలు వెనక్కు తిరిగొచ్చేసిన హీరోలా తయారయ్యింది నా పరిస్థితి. ఇంతలో శేఖర్, “అతను సోఫా మీద కూర్చున్నప్పుడు బాగా వెనక్కి జారిపోయాడు. అది బధ్ధకాన్ని సూచిస్తుంది అంకుల్. అలాంటి బద్ధకస్తుడు ప్రవల్లికకు బెటరేనంటారా?” అడిగాడు. మేము ముగ్గురం శేఖర్‌కి మా బొటన వేళ్ళు పైకెత్తి విక్టరీ సైన్ చూపించాం.

దాన్ని కూడా ఆయన కొట్టి పారేశాడు. “అదేం లేదోయి, ఆ సోఫాలో స్ప్రింగులు పూర్తిగా పాడయిపోయాయి, అందులో మన సచిన్ టెండుల్కర్ కూర్చున్నా అలానే జారిపోతాడు. తప్పదు,” అన్నాడు.

మేము నలుగురం ఒకేసారి పళ్ళు పటపటా కొరకడంవల్ల ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. ఇంతలో పాపారావుగాడు ముక్కు గోక్కున్నాడు. ప్రవల్లిక ఫాదర్ నా వైపు తిరిగి, “మరి దీని అర్థమేంటి బాడీ లాంగ్వేజ్‌లో?” అడిగాడు.

“మనం ముక్కు గోక్కుంటూ మాట్లాడితే, మనం అబద్ధం చెప్తున్నాం అని. అదే ఎవరైనా మాటాడుతూంటే మనం ముక్కు గోక్కుంటే, మనం వాళ్ళ మాటలు నమ్మడం లేదని అర్థం,” వివరించాను నేను.

“అంటే నేను అబద్ధం చెప్తున్నాననా?” కోఫంగా అడిగాడు ఆయన.

“లేదంకుల్. నాకు నిజంగా ముక్కు దురదేసింది. అందుకే గోక్కున్నా,” జాలిగా అన్నాడు పాప్స్.

“ఎలా నమ్మడం?” అనుమానంగా అన్నాడు ఆయన.

“కావాలంటే మేము వాడిని ముక్కు గోక్కోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటాం అంకుల్. ఒక వేళ వాడి ముక్కు ఎర్రగా అయ్యి కళ్ళెంబడి నీళ్ళొస్తే, వాడికి నిజంగా దురద వేసినట్టు. లేకుంటే మీరు అబద్ధం చెప్తున్నారని వాడు తన బాడీ లాంగ్వేజ్ ద్వారా హింట్ ఇచ్చినట్టు,” అన్నాడు నారాయణ్. పాపారావు అది విని ఒక పదడుగులు వెనక్కి గెంతాడు.

అప్పుడే అక్కడికి ప్రవల్లిక వచ్చింది, “ఏంటి టాపిక్?” అంటూ.

“అదేనమ్మ వీళ్ళకి నిన్నటి కుర్రాడు నచ్చాడా లేదా అని ఎంక్వైర్ చేస్తున్నా,” అన్నారు ఆయన.

“వీళ్ళకు నచ్చినా నేను చేసుకోను. నాకు నచ్చలేదు,” అంది ప్రవల్లిక.

“ఏం ఎందుకు?” వాళ్ళ నాన్నతో పాటూ కలుపుకుని ఐదుగురం అడిగాం.

“నాకెందుకో తనకు పెద్ద వ్యక్తిత్వం లేదు అనిపించింది. పైగా లీడర్‌షిప్ క్వాలిటీలు అస్సలు లేవు. బద్ధకస్తుడిలా కూడా ఉన్నాడు,” చెప్పింది ప్రవల్లిక.

“కాని తలనిండా బోలెడు జుత్తుంది కద,” అన్నాడు పాపారావు.

“ఏం చేసుకోవాలి దాన్ని? నాకు నచ్చలేదంతే,” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రవల్లిక.

టీవీలో న్యూస్ రీడర్స్‌లా బాధగా మొహం పెట్టి, “అయ్యో ఇలా జరిగిందేంటి అంకుల్?” అన్నాము మేము పళ్ళికిలిస్తూ, ఒక ఎమోషన్‌కీ ఇంకో దానికీ సంబంధం లేకుండా.

(ఇంకా ఉంది)

This entry was posted in బట్టతల. Bookmark the permalink.

10 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 14

  1. bharat says:

    బాధగా పళ్ళికిలిస్తోన్న నాలుగు ముఖాల్ని ఇంకా చూస్తూనే వున్నాను.
    సూపర్!!! 🙂

    -భరత్.

  2. Nanda Kishore p says:

    Katha Lo Edo Twist Vunnatu Vundi… Manvalla matalu Pravalika Matalu Okey laga vunnayi ……
    Coolllllll Murali garu.. Me Timing Jokes Chala Bagunnayi….

  3. VJ says:

    త్రివిక్రం కి మీకు దగర పోలికలు ఉన్నాయి, మంచి టైమింగు ఉంది కామెడీ మీద మీకు

  4. పార్వతి says:

    😀 “మీకు తెలుగు లాంగ్వేజే సరిగ్గా రాదన్నారు. బాడి లాంగ్వేజు ఎప్పుడు నేర్చుకున్నారు?” 😀
    ఈ బాడీ లాంగ్వేజ్ జోకులకి ఇన్స్పిరేషన్ ఏంటో నేను అడగను గాక అడగను ! 😐 😀
    హమ్మయ్య, నిన్న దీపావళికి సెలవలు ఇచ్చేసినా…ఈ రోజు కథ ఊపందుకుందిగా ! థాంక్స్ మురళి గారు !

  5. Wanderer says:

    నా మనసేదో కీడుని శంకిస్తోంది. ప్రవల్లిక ఏంటి, అంత heavy hints drop చేస్తోంది – నాకు జుట్టు అక్కర్లేదు వగైరా వగైరా? మీ వాలకం చూడబోతే నలుగురినీ ప్రవల్లికకిచ్చి కట్టపెట్టేలా ఉన్నారు. హమ్మో హమ్మో…

  6. లచ్చిమి says:

    ha ha ha ha ha ha

  7. వీరుడు says:

    స్టోరీ చాలా చాలా బాగుంది. TV సీరియల్ టైపులో కనీసం ఒక 200 ఎపిసోడ్స్ అయినా వ్రాయండి మురళి గారూ!

  8. Jyothi Reddy says:

    “కావాలంటే మేము వాడిని ముక్కు గోక్కోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటాం అంకుల్. ఒక వేళ వాడి ముక్కు ఎర్రగా అయ్యి కళ్ళెంబడి నీళ్ళొస్తే, వాడికి నిజంగా దురద వేసినట్టు. లేకుంటే మీరు అబద్ధం చెప్తున్నారని వాడు తన బాడీ లాంగ్వేజ్ ద్వారా హింట్ ఇచ్చినట్టు,”

    Oh my God Murali ji,

    Meeku aaa idea ela vachindhi,really really great.

  9. prasad says:

    Abbo Kevvu Keka

    Chinchestunnaru

    E roju office lo work lekapote chala rojula tarvata me site loki vacchi anni edpisodes chadivanu

    E routine life e madya inthaga eppudu navvaledu

    Thanks murali and keep wirting

    prasad

Leave a reply to వీరుడు Cancel reply