దిన దిన గండం


అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒక్క క్షణం ఎక్కడున్నానో అర్థం కాలేదు. మెల్లగా తెలిసింది నా ఇంట్లోనే, నా పడకగదిలోనే ఉన్నాను అని. నాకు మెలకువ వచ్చిన కారణం అర్థమయ్యింది. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు, మా ఇంటి వెనుక పంప్ దగ్గర అనుకుంటా, బండ బూతులు తిట్టుకుంటున్నారు.

“నువ్వు ఎలాంటి దానివో ఈ వీధిలో అందరికీ తెలుసే. $$$%$@$!!@**్*%్,” అంటూంది మొదటి ఆడ గొంతు.

“నేను వదిలేసిన @$@!!%$్్*్* స్థానం నువ్వే కదే భర్తీ చేసింది,” అంటూంది రెండో ఆడ గొంతు.

“అబ్బా, ఈ బూతులు వినలేకపోతున్నాను. మరి ఈ పంప్ దగ్గర చాలా అలగా జనం పెరిగిపోతున్నారు. ఆ కిటికీ తలుపులు వేసేయి,” మా ఆవిడని ఉద్దేశించి అరిచాను.

“అది పంప్ దగ్గర గొడవ కాదండి, త్రిలింగ దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కూజా, ఇష్టారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు భౌభౌరాణీ, ఫ్రెండ్లీగా కొట్టుకుంటున్నారు. మీరు వింటున్న గొడవ టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతూంది,” చెప్పింది మా ఆవిడ.

“ఐతే ఆ వెధవ టీవీనే ఆఫ్ చేయి. నిన్న చూసిన సీరియల్ తరువాత మొదలైన కడుపులో వికారం ఇప్పుడే తగ్గింది. మళ్ళీ పొద్దున్నే ఇదో గొడవా?” కాస్త కోపంగా అన్నాను.

“పొద్దున్నే ఏమిటండి? తొమ్మిది కావస్తుంటేనూ! నేనే మిమ్మల్ని నిద్ర లేపుదామనుకుంటూంటే,” బుగ్గలు నొక్కుకుంది మా ఆవిడ.

“నహీ,” అంటూ గట్టిగా అరిచాను నేను. “ఈ మాధ్య ఎకానమీ కూడా బాగాలేదు. ఎటు చూసినా లే-ఆఫ్సే. సోమవారమే లేట్‌గా వెళ్తే అసయ్యంగా ఉంటుంది,” అంటూ మంచం మీద నుంచి కిందకి ఒక గెంతు గెంతాను.

***

ఆఫీసులో ఎంటర్ కాగానే ఎదురొచ్చాడు వెంకట్. వాడి మొహం మతాబులా వెలిగిపోతూంది. “ఏంటి విషయం?” అడిగాను నేను.

“ఇప్పుడే బాస్ నాకు ఈ రోజుకి సరి పడా పని ఇచ్చాడు. అంటే ఈవినింగ్ వరకూ నాకు జాబ్ ఉంటుందోచ్. మజ్జాన్నమే ఫైర్ అయిపోను,” అంటూ గెంతులేస్తూ వెళ్ళిపోయాడు వాడు.

నా గుండె గుభేల్మంది. లాస్ట్ వీకే నా ప్రాజెక్టులన్ని అయిపోయాయి. అంటే నా పని ఈ రోజు పాతాళ భైరవేనా? సడన్‌గా కళ్ళు చీకట్లు కమ్మినట్టయ్యింది. నా డెస్క్ దగ్గరికి వెళ్తూంటే మా బాస్ ఎదురొచ్చాడు.

“సార్ నా జీవితాన్ని పాతాళ భైరవి చేయొద్దు, మల్లీశ్వరి చేయండి,” అన్నాను నేను ఆయనతో.

“ఏంటయ్యా?” అయోమయంగా చూశాడు మా బాస్. “ఈ వీక్ ఒక కొత్త ప్రాజెక్ట్ నీకివ్వాలని వస్తూంటే, ఈ పాత సినిమాల గోల ఏంటి?”

“పని ఇవ్వడానికి వచ్చారా సార్? ఇవ్వండి సార్! మీ ఇష్టం, నా అదృష్టం,” మొహం చేటంత చేసుకున్నాను నేను.

“ఏవిటోనోయి! మన ఆఫీసులో ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం, ఇదే ఆసక్తి. చాలా ముచ్చటగా ఉంది నాకు,” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు ఆయన.

సరిగ్గా అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకో కొలీగ్ కణ్ణన్. “సార్! మొన్నేదో ప్రాజెక్ట్ చేయమంటే, చేయి ఖాళీగా లేదు వెళ్ళండి అని కసురుకున్నాను గుర్తుందా? ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పుడు నేను రెడీ,” అనౌన్స్ చేశాడు.

“అలాంటి ప్రాజెక్టులు మీ వంశంలో ఎవరూ చేయరు అని చెప్పావుగా అప్పుడు?” ఆశ్చర్యంగా అడిగాడు మా బాస్.

“నా కళ్ళు తెరుచుకున్నాయి సార్. మా వంశంలో మొట్ట మొదట అలాంటి ప్రాజెక్ట్ చేసిన ఘనత నేనే కొట్టేద్దామనుకుంటున్నా,” వినయంగా జవాబిచ్చాడు కణ్ణన్.

ఈ సారి ఆనందం తట్టుకోలేక కణ్ణన్‌ని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆయన.

***

మరుసటి రోజు సడన్‌గా కంపెనీ వైడ్ మీటింగ్ అనౌన్స్ చేశారు. ఎవరి బాడీ కండిషన్‌ని బట్టి వారికి, ముచ్చెమటలు పట్టడమో, చలి జ్వరం రావడమో జరిగింది.

“ఇలాంటి మీటింగ్స్ సాధారణంగా పెద్ద ఊచకోత ముందే పెడతారు. నాకేదో భయంగా ఉందిరా,” అన్నాడు వెంకట్.

“నాకు తెలిసిన కంపెనీలో ఇలా మీటింగ్‌కి పిలిచిన వారందరినీ అక్కడినుంచే ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పారట. అసలు అందుకే మీటింగ్ నెపంతో పిలుస్తారట,” చెప్పాడు కణ్ణన్. తనను తాను అందరికంటే ప్రాక్టికల్ అనుకునే పద్మాకర్ నోట్లో కర్చీఫ్ కుక్కుకున్నాడు ఆ మాట వినగానే.

అలా ఒకరినొకరు భయ పెట్టుకుని మొత్తానికి మీటింగ్‌కి వెళ్ళాం. కాన్‌ఫరెన్స్ హాల్ నిండి పోయి ఉంది. “ఎంతమంది బలి పశువులో?” అన్నాడు వెంకట్. “నువ్వు నోరు మూయరా, అసలే టెన్షన్‌తో చస్తూంటే,” అరిచాను నేను.

అప్పుడే మా కంపెనీ బబ్బాసు నవ్వుతూ వచ్చి మైక్ చేతుల్లోకి తీసుకున్నాడు.

బబ్బాసు అంటే బాసులందరికీ బాస్ అన్న మాట. ఇక్కడి బ్రాంచ్ హెడ్. స్పీచ్ మొదలు పెట్టగానే, “Friends, we are going through some tough times, as you all know,” అన్నాడు.

“ఓలప్పో, నాను ఏం చేతురా దేముడా,” అంటూ వాడి శ్రీకాకుళం యాసలోకి దిగిపోయాడు పద్మాకర్. మేం వాడిని ఊరుకోబెట్టాం.

మా బబ్బాసు కంటిన్యూ అవుతూ, “We also know that change is the only constant,” అన్నాడు. ఈ సారి మేము నలుగురం ఘొల్లుమన్నాం. అదెంత పవర్‌ఫుల్ డైలాగో మాకు తెలుసు. సాధారణంగా లే-ఆఫ్‌ల ముందు ఇచ్చే స్పీచుల్లోనే అలాంటి వాక్యాలు వాడుతారు.

“అబ్బబ్బా ఏంటయ్యా ఈ గోల? మమ్మల్ని ప్రశాంతంగా కుమిలిపోనివ్వరా? ఇలా ఏడుపులు పెడబొబ్బలతో అందరినీ డిస్టర్బ్ చేయకపోతే, మీరు మాలా గుడ్ల నీరు కుక్కుకుని కుమిలిపోవచ్చుగా?” కసురుకున్నాడు మా ముందు నిలుచున్నాయన వెనక్కు తిరిగి.

నేనేదో కోపంగా అనబోయేంతలో, మళ్ళీ ఆయనే, “ఏంటలా, ఈదురు గాలిలో తాటి చెట్లలా ఊగిపోతున్నారు?” అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు చూసుకున్నాం మేము మా కాళ్ళ వంక. అవి టక టక ఒకదానికేసి ఒకటి కొట్టుకుంటున్నాయి. “పూర్తిగా స్పీచ్ వినండయ్యా!” సానుభూతిగా అన్నాడు అయన.

మా బబ్బాసు ఇంకా ఏవో అవాకులు చెవాకులు పేలి, ఫైనల్‌గా, “I request you not to believe in rumours. As long as you work hard, there will always be a job for you. Remember, change is the only constant,” అని తన స్పీచ్ ముగించాడు. అప్పటిగ్గానీ మా కాళ్ళు కొట్టుకోవడం ఆగలేదు.

***

ఆ తరువాత ఒక రోజు పద్మాకర్ గాడు పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. “ఇది చూశారా? వల్లకాట్లో రామనాథయ్య అనే ఎక్స్‌పర్ట్ చెప్పాడు. ఇంకో ఆరు నెలల్లో ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందంట,” అన్నాడు ఆనందంగా.

“ఆరు నెలలు అంటే ఓకే గురూ. ఎలాగో ఒకలా అడ్జస్ట్ అయిపోతా,” కాస్త హ్యాపీగా అన్నాను నేను. నా మొఖంలో రవంత కళ మళ్ళీ వచ్చినట్టుంది. “మరే,” నాకు వత్తాసు పలికాడు కణ్ణన్.

అప్పుడే వెంకట్ గాడు వచ్చి, “గురూ, రచ్చబండ దగ్గర రాంబాబు అనే ఎక్స్‌పర్ట్ ప్రకారం, ఇంకో రెండేళ్ళు ఎకానమీ ఇలానే నికృష్టంగా తగలడుతుందంట,” ఆందోళనగా అన్నాడు.

నా మొహంలో మళ్ళీ కళ తప్పింది. ఈ ఘోరమైన వార్త వినగానే యాజ్ యుజుయల్‌గా పద్మాకర్ గాడు మళ్ళీ తన నోట్లో కర్చీఫ్ కుక్కుకున్నాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన మా బాస్ ఆశ్చర్యంగా, “ఏంటోయి పద్మాకర్ ఎప్పుడు చూసినా కర్చీఫ్ నోట్లో కుక్కుకునే కనిపిస్తావు. ఏమన్నా ఫిట్స్ లాంటి జబ్బు ఉందా?” అడిగాడు. పద్మాకర్ గాడు సిగ్గు పడి కర్చీఫ్ బయటకు తీసేశాడు.

“ఏంటి సార్, ఇలా వచ్చారు? ఈ రోజు ప్రాజెక్ట్ ఇవ్వడానికా?” ఆశగా అడిగాను నేను.

“నా దగ్గర ఉన్న ప్రాజెక్టులన్నీ అయిపోయాయయ్యా. ఇప్పుడే నాకు బబ్బాసు నుండి కాల్ వచ్చింది. అర్జెంట్ కంపెనీ వైడ్ మీటింగ్ అట. మీ అందరికి చెప్పడానికే వచ్చాను,” అన్నాడు ఆయన నెర్వస్‌గా.

మా అందరి కాళ్ళు మళ్ళీ టక టకా కొట్టుకోవడం మొదలెట్టాయి. ఈ సారి మాతో పాటూ మా బాస్ కూడా జాయిన్ అయ్యాడు.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

29 Responses to దిన దిన గండం

 1. chavakiran says:

  🙂

  It happens.

 2. name says:

  Very nice!

 3. దిన దిన గండం అనుకుంటూ “హమ్మయ్య ఈ రోజు/వారం/నెల జాబ్ ఉంది” అనుకొనే వాళ్ళను చూస్తే జాలేస్తుంది. ఉద్యోగం మన చేతుల్లో లేనపుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం? ఉద్యోగం పోతే జీవితం అయిపోయిందా? ఆరునెల్లకో ఏడాదికో ఎకానమీ బాగవుతుంది అపుడు ఇంకోటి వస్తుంది. రాకపోతే ఈ లోపు ఇంకోటేదో చూసుకోవాలి. అది కూడా ఆలోచించలేరు మన IT “మేతావులు”!!!!

 4. బాబు says:

  చాప్లిన్ సినిమాల మాదిరిగా మీటపా పైకి నవ్వించినా లోపలి విషాదం హృదయాన్ని తాకింది.భలే టపా!

 5. జీడిపప్పు గారూ,
  మీకేదో బాగా డబ్బులొచ్చే బిజెనెస్ ఉన్నట్టుంది. ఉద్యోగాల మీదే ఆధారపడ్డవాళ్లకి ఉద్యోగం పోతే జీవితం పోయినట్టేగా!”ఇంకోటేదో” చూసుకోడానికి ఆ “ఇంకోటి” ఉండాలి కదండీ! ఆయనే ఉంటే మంగలాడెందుకని సామెత చెప్పినట్టు…..భలే వారండీ మీరు!

  మురళి గారు,
  చంపేశారు! ఇప్పుడే అమెరికాలో ఉన్న కజిను గాడు ఫోన్ చేసి “ఇహ వచ్చెయ్యాల్సి వచ్చేట్టుంది. మా కంపెనీలో బోల్డుమందిని పీకేశారు. మా అపార్టుమెంటంతా ఖాళీ అయిపోయింది. నా సంగతి ఇంకా తేల్లేదక్కా” అని ఏడుపుకి కొంచెం తక్కువ స్థాయిలో(వాళ్లావిడ పక్కనే ఉన్నట్టుంది) అని బాధపడ్డాడు.వాడిని కొంచెం ఓదార్చి ఫోన్ పెట్టేసి ఇలా వస్తే ఇక్కడ మీరు! సరే కానీండి!

 6. చాలా బాగా చెప్పారు! మా ఫ్రెండ్స్ పరిస్థితి కూడ దరిద్రం గ ఉంది US లొ

 7. Madhuravani says:

  ఎన్ని కష్టాలండీ బాబూ 😦
  మీ టపా మాత్రం కష్టాల్లో కూడా నవ్వులు పూయిస్తుంది 😉

 8. Srinivas says:

  నవ్వించేలా చెప్పినా .. టపాలో నిండి ఉన్నా విషాదం కాస్త గట్టిగానే గుండెకి గుచ్చుకుందండి … త్వరలోనే ఈ పరిస్తితి నుండి గట్టెక్కుతామని గట్టి నమ్మకం తో ఉన్నాను

 9. Sravya says:

  🙂

 10. సుజాత గారూ, మీరేనా ఆ మాట అంటున్నది!!!? నేను కూడా ఒక సగటు IT కూలీనే. ఈ వారం ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలీదు. అంత మాత్రాన నేను ఆఫీసుకు దిగులు/భయం/ఆందోళనతో వెళ్ళానే అనుకోండి, నా ఉద్యోగానికి భరోసా ఉందా? అలా బాధపడుతూ భయపడుతూ వెళ్తే ఉద్యోగం ఉండేట్టయితే హాయిగా ఏడుస్తూ వెళ్ళేవాడిని. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే, ఉద్యోగం మన చేతిలో లేనపుడు దాని గురించి ఆందోళన ఎందుకు? మనము చెయ్యగలిగింది ఏదయినా ఉంటే చెయ్యాలి.

  “ఆయనే ఉంటే…” అన్నారు… necessity is the mother of invention అని మర్చిపోయారా? 🙂

 11. చిలమకూరు విజయమోహన్ says:

  సుజాతగారూ,
  ఇప్పుడు డబ్బులొచ్చే వ్యాపారాలేమున్నాయండి ఒక్క రాజకీయాలు తప్ప

 12. Ashok says:

  అవును ఇక్కడ పరిస్తితి ఇలానే వుంది, వర్క్ వుంటే హమ్మయ్య ఈ రోజు కి జాబు వుంది అని, పులి మీద పుట్ర లాగా ఒబామా H1B’s ని టార్గెట్ చేస్తున్నాడు… God only knows when this economy is going to be up..

 13. krishna rao jallipalli says:

  సుజాత గారు కరక్టు. అవును. టపా లోని కామెడి కన్నా… విషాదమే కొంచం మనసుని టచ్ చేసింది.

 14. Hilarious.

  నన్నడిగితే కష్టకాలంలో డిప్రెషన్ దరిచేరకుండా ఉండాలంటే ఇలాంటి హాస్యం తప్పనిసరి.. జరిగేది ఎలాగూ జరగక తప్పదు..నాకూ మెడమీద ఒక ఐదడుగుల ఎత్తులో కత్తి వేలాడుతున్నా, నేను మాత్రం కాసేపు హాయిగా నవ్వుకున్నాను..

  జీడిపప్పుగారూ, అంత ఈజీ గా ఎలా అనేసారండీ?

 15. స్నేహ says:

  జీడిపప్పు గారు,

  బాగా చెప్పారు.మన చేతుల్లో లేని దాని గురించి ఇంతగా దిగులుపడడం ఏమిటో నాకూ అర్థం కావడంలేదు. నా ఉద్యోగం పొతే అన్న మా వారి ప్రశ్నకు నా సమాధానం ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుండే బాధపడడం దండగ, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి, ఆ మరొక ఉద్యోగం ఐ.టి లోనే అవ్వక్కర్లేదు.

 16. స్నేహ గారు – సరిగ్గా నేను కూడా అదే అనుకుంటాను ఎప్పుడూ!!

  ఉమాశంకర్ గారూ 🙂 మరేమి చెయ్యగలము చెప్పండి! మనకున్నవి రెండే రెండు మార్గాలు: ఎప్పుడేమవుతుందో అంటూ భయపడుతూ దిగులుపడుతూ ఉండడం Vs జరిగేది జరుగుతుంది అనుకొంటూ మనం చేయగలిగిన దాని గురించి ప్రశాంతంగా, సంతోషంగా ఆలోచించడం.

 17. స్నేహ గారు,
  అమ్మయ్య, వచ్చేసారా!

  జీడిపప్పు గారు, అందరు చేస్తుందీ అదేలెండి. మనసులో బాధో, దిగులో ఉన్నా, పైకి ఏడవలేక నవ్వుతూ ఆఫీసుకు పోవడమే! మీరంత ఈజీగా తీసుకునేసరికి, మీరు IT కాదనుకున్నా మరి!

 18. prasad says:

  E story USA lo vunna prati IT persons di
  Inthaku mundu naku pani lekapote hayi ga vundedi
  Ippudu weekly okka roju pani lekunna “Make My Trip” lo kelly Hartford to Hydeabad Flight tickets deals chustunna

  Kondaru cheppinattu e job kakapote enkoti ani but inkote vachhe daka Loans EMI ela kattali

  Badha lonu navvadamu ante e story chadivite vachhe navve

  Prasad

 19. Jyothi Reddy says:

  మురలి గారు చాలా బాగా నవ్వించారు సార్ థాంక్యూ,,,కాని నెను మాత్రం పెద్ధగా చింతించదం లేదులెంది.పొతె పొఇంది ఉద్యొగం హాఇగా మన ఊరిలొ హపీ గా ఉందవచ్చు గదా….

 20. భలే చెప్పారు… ఇలాంటి పరిస్థితిని కూడా హాస్యం తో కలిపి చెప్పిన మీ విధానం చాల బాగుంది 🙂
  exact గా మాకు కూడా ఇలాగే ఉందండీ… వర్క్ లేకపోతె ఆ టెన్షన్ తట్టుకోవటం నిజంగా నరకమే… వర్క్ ఇస్తే ఆనందపడే రోజులు ఇప్పుడు… నేను ప్రాజెక్ట్ లో ఉన్నాను నేను ప్రాజెక్ట్ లో ఉన్నాను అని సంబరపడిపోతున్నాం…
  మీటింగ్ అని కాల్ రాగానే అందరం మొహాలు చూసుకోవటం గుస గుసలాడుకోవటం… ఏంటో… hmmm
  ఇదంతా సర్దుకోవటానికి ఎంత కలం పడుతుందో ఏంటో… hmm

 21. kamudha says:

  non IT లో కూడా పరిస్తితి అలాగే ఉంది. ఎప్పుడు ఉద్యొగం ఉంటుందొ ఎప్పుడు ఊడుతుందో తెలీదు.
  – కాముధ

 22. చాలా బాగా చెప్పారు.
  ఒక్కసారి ఈ బ్లాగును చూడండి. http://futurepowerz.blogspot.com/. మీకు ఆసక్తి వుంటే ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించండి.

 23. Murali gAru,

  As usual.. adirindi. konni pada prayOgAlaki (guDla neeru kukkukOvaTam etc) inkA navvu vastUnE undi.

  Cheers,
  Srini

 24. jyothi reddy says:

  Muraliji,
  Emaindhi sir next one inka rayaledhu why?
  malanti patakula kosam kastha time ketainchandi sir…..

 25. Rajiv says:

  మురళి గారు

  ఎప్పటి లాగె చదవగానె నవ్వాగలేదండి….. హాస్యం, దుఖం సమపాళ్లలొ కలిపి చెప్పినట్టున్నారు.

  పైన అందరు జాబ్ ఉన్నవారికి పొతుంది అనొ, లెదంటే వస్తుంది అనొ అనుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే కాలేజ్ లొ నుండి బయటపడ్దాను, నాలాంటి వాళ్ళు ఈ ఎకానమి లొ ఎమి చెయ్యలొ ఎమొ!!!!

 26. Jyothi Reddy says:

  Muraliji,
  India lo antha rajakeeya gola unte meeru inka respond kaledhu?

 27. budugu says:

  “దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు”
  “తుమ్మితే ఊడే ముక్కు”

  గత కొద్ది నెలలుగా..
  అస్సలు సామెత అంటే తెలీని వాళ్ళు కూడా వాడేస్తున్న సామెతలు ఇవి మాష్టారు..

  మీ ఆర్టికల్ ఎలా ఉందో చెప్పాలంటే.. అది చదివిన నా పరిస్థితి చెప్తే అర్ధమైపోతుంది..
  ఆఫీస్ లో చదవటం మొదలెట్టానా..

  “ఇప్పుడే బాస్ నాకు ఈ రోజుకి సరి పడా పని ఇచ్చాడు. అంటే ఈవినింగ్ వరకూ నాకు జాబ్ ఉంటుందోచ్. మజ్జాన్నమే ఫైర్ అయిపోను,” అంటూ గెంతులేస్తూ వెళ్ళిపోయాడు వాడు

  smile started..

  //“ఓలప్పో, నాను ఏం చేతురా దేముడా,” అంటూ వాడి శ్రీకాకుళం యాసలోకి దిగిపోయాడు పద్మాకర్. మేం వాడిని ఊరుకోబెట్టాం.//

  ఇది చదవాగానే కిసుక్కున నవ్వేశా.. నవ్వేసి మళ్ళీ ఆలోచనారాణి నవల్లో పాత్ర గనక “అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు”..
  వచ్చేసి.. ప్రికాషనరి చర్యగా పెదాలు బిగించేసా..

  //మా బబ్బాసు కంటిన్యూ అవుతూ, “We also know that change is the only constant,” అన్నాడు. ఈ సారి మేము నలుగురం ఘొల్లుమన్నాం.//

  దీంతో చేతిని నోటికి అడ్డం పెట్టేసా..

  //మళ్ళీ ఆయనే, “ఏంటలా, ఈదురు గాలిలో తాటి చెట్లలా ఊగిపోతున్నారు?” అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు చూసుకున్నాం మేము మా కాళ్ళ వంక. అవి టక టక ఒకదానికేసి ఒకటి కొట్టుకుంటున్నాయి.//

  మీకాళ్ళు ఊగటమేమో గాని.. నా భుజాలూగటం మొదలెట్టాయ్ మాష్టారూ..
  దెబ్బకి.. సీట్ దగ్గర కూర్చుంటే లాభం లేదని బయటకి పరిగెత్తా..

  పది నిముషాలకి తిరిగొచ్చాక..
  నా పక్కమ్మాయి అనుమానము, క్యూరియాసిటి కలిపిన లుక్కు ఇస్తుంటే గాని అర్ధం కాలా..

  పరిగెత్తే హడావిడిలో నోటికి అడ్డం పెట్టిన చేతిని తియ్యటం మర్చిపోయా అని..

  ఇలా జనానికి అనుమానం కలిగించే పరిస్థితి తెస్తున్నందుకు.. మీ పోస్టులని తీవ్రంగా ఖండిస్తున్నా.. 🙂

 28. sujata says:

  Im with Budugu.

 29. pappu says:

  కేక..మురళీ పోస్ట్ అదిరింది….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s