ఎలక్సన్లు వచ్చేశాయి

నమస్కారం. నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. ఇది నాకు బాబాయి చెప్పాడు. అలాగే ప్రజలు పిడుగులైతే పార్టీలు వాళ్ళకు గొడుగులుట. ఇది బాబాయి చెప్ప లేదు. మొన్న మా కాలనీలో మీటింగ్ ఐతే వచ్చిన ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు.

రాజకీయ నాయకుడు అంటే లీడర్ అన్నమాట. అంటే నాకు తెలీదు. లీడర్లు ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుంటారు. కుంచెం సార్లు టోపీ పెట్టుకుంటారు. కుంచెం సార్లు పెట్టుకోరు. కాని ఎదుటి వాళ్ళకు మాత్రం తప్పక టోపీ పెడతారట. ఇలా అని బామ్మ చెప్పింది.

ప్రజలు అంటే, నువ్వు, నేను, అమ్మ, నాన్న, బామ్మ, పక్కింటి పిన్ని గారి ముగుడు గారు, ఝట్కా బండి వాడు వీళ్ళందరూ అన్న మాట. ప్రజలంటే వెర్రి వాజమ్మలు కాదట. ఇది ఆ నాయకుడు చెప్పాడు.

“ప్రజలారా! ప్రస్తుత గాంక్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని వెర్రి వాజమ్మల కింద లెక్క గట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తూంది. మీరు వెర్రి వాజమ్మలు కారు అని నిరూపించుకోవాలంటే మా తెగులు దేశం పార్టీకే వోటేయ్యాలి. నాకు తెలుసు మీరు వెర్రి వాజమ్మలు కారు. మా పార్టీకే వోటేస్తారు. కదూ? కదూ?” అన్నాడు నాయకుడు గారు. నిరూపించుకోవడం అంటే రుజువు చేసుకోవడం. అంటే నాకు తెలీదు. ఈ రాజకీయ నాయకులు అంతా ఇలానే మాట్లాడతారులే.

“లీడర్ గారూ, మరి మీ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది?” అడిగాడు ఝట్కా బండి వాడు.

“నెలకు అందరికీ రెండేసి వేల రూపాయలు ఇస్తాం. ఊరికే తిని కూర్చుంటే బోరు కొడుతుంది కాబట్టి, అందరికీ కలర్ టీవీలు కూడా ఇస్తాం,” అన్నాడు లీడర్.

“ఉరేయి లీడర్ వాడు! మరి నాకు నెల నెలా చేగోడీలు ఇస్తావురా?” అడిగాను నేను.

“నీకు వోటు హక్కుందా?” అడిగాడు లీడర్ వాడు.

“అంటే ఏంటి? అయినా నాకు లేదేమో!” అన్నాను నేను.

“ఐతే నీకు ఏం ఇవ్వను, అహ్హహ్హా,” అన్నాడు లీడర్ వాడు.

“చిన్న కుర్రాడి మనసు కష్ట పెడతావా? హన్నా!” అంటూ మా బామ్మ లీడర్ వాడికి గాఠిగా ప్రైవేటు చెప్పేసింది.

వాడు బిక్క మొహం వేసి, “మరి ఈ అబ్బాయికి నెల నెలా చేగోడీలు ఇస్తే, మీ వోటు నాకేనా?” అని అడిగాడు.

“చూద్దాంలే,” అంది బామ్మ.

అప్పుడు వాడు, “ఐతే మీకిచ్చే రెండు వేలనుంచి మినహాయించుకుని ఇస్తే ఫర్లేదా?” అన్నాడు.

“ఆ మాత్రం నువ్విచ్చేదేంటి? మేమే మినహా హాహా యించుకుంటాం లే!” అన్నాను నేను.

“కాని వోటు మాత్రం మినహా హాహాయించుకోకండి. మాకే వెయ్యండి బుడుగు గారూ,” అన్నాడు దీనంగా లీడర్ వాడు.

“నువ్వు ఇస్తానంటూంది ఎలక్సన్ల తరువాత, ముందే తాయిలంలా ఇవ్వొచ్చుగా, ఒక్కొక్కరికి ఫది వేలు చొప్పున?” అడిగాను నేను.

లీడర్ వాడు గభుక్కున మాయమైపోయాడు.

“పర్లేదు లేరా, రేపు ఉంకో లీడర్ వస్తున్నాడట. వాడిని అడిగేద్దాం,” అంది బామ్మ.

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

8 Responses to ఎలక్సన్లు వచ్చేశాయి

 1. venu says:

  Excellent……..

 2. D. Venu Gopal says:

  బండి లైన్లో పడుతోంది (అంటే బుడుగు స్టైల్ కు దగ్గరగా వస్తోంది అని అర్ధం అనమాట) రాయగా రాయగా ముళ్ళపూడి కర్రపుచ్చుకు వస్తారన్నమాట. హన్నా నా బుడుగును నువ్పు హైజాక్ చేస్తావా అని

 3. budugu says:

  హర్రే.. ఇక్కడింకో బుడుగున్నాడే!!

  ఇక నుంచి నువ్వు నేను.. స్నేహితులు
  అంటే ఫ్రెండ్స్.. అంటే నేను, సీ గానపెసూనాంబ లా అనుకుంటా..
  ఉండు.. బామ్మ నడిగి చెప్తా !!

  మరి..
  ఓటు హక్కు లేదని చెగోడీలు ఇవ్వనన్నాడా??
  హన్నా!! వాడు లీడరు కాదు.. రౌడీ రాస్కిల్!!

  ఈసారి కొత్త లీడరు వస్తాడు కదా.. ఓటు హక్కుందా అని అడిగితే..

  “ఓ.. ఉంది కూడా.. నాకప్పుడే ఏడేళ్ళు తెలుసా!!” అని చెప్పు.
  (నన్నడిగితే ఓ కబురు చెప్తా..
  లీడరు గాడు వచ్చినప్పుడు నిక్కరొద్దని పాంటు వేసుకో.. బావుంటుంది!!)

  మరే.. అలాగే..
  చేగోడీలతో పాటు పకోడీలు కూడా అడుగు..
  ఇంకా.. ప్రేవేటు మేస్టారు వద్దని నాన్నతో చెప్పి ఒప్పించమను..

  అప్పుడు..
  నాన్నది, అమ్మది, బాబాయిది, బాబాయికి చెప్పి సీతది, సీతకి చెప్పి వాళ్ళ నాన్న గాడిది,
  నేను చెప్పి గానపెసూనాంబది కూడ వోటు నిఝంగా లీడరు గాడికే వేయిస్తానని చెప్పు..

  మా ఊరు వస్తే నేనే అడిగేస్తాలే!!
  నీకు కుంచెం చెగోడీలు కూడా పంపిస్తా..

  టాటా..

 4. Wanderer says:

  బుడుగు కబుర్లంటే శతకోటి బుడుగు ఇమిటేషన్లలో ఇదొకటి అనుకున్నానే కానీ, ఇంత విభిన్నంగా ఉంటుందనుకోలేదు… good job మురళి గారూ.

 5. Jyothi Reddy says:

  Muraliji,
  Very good satire sir….keep going please

 6. nelabaludu says:

  Nice one Murali …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s