ప్రేమంటే తెలీదా? ఇన్సల్ట్!

ఈ సీగాంపెసూనాబ ఉందే, మహా గడుసుది. గడుసు అంటే నాకు తెలీదనుకో. కానీ దాన్ని అందరూ అలానే అంటారు. “ఒరే బుడుగూ, అది చాలా గడుసుదిరా, అది ఎవరికి పెళ్ళాం అవుతుందో వాడిని కొంగుకి కట్టేసుకుంటుంది,” అని మా అమ్మ అంటూ ఉంటుంది.

పెళ్ళాం అంటే ఆడది. దానికి ఫదేళ్ళు కంటే ఎక్కువ ఉంటాయి. సీగానపెసూనంబకి ఏడేళ్ళే. అది చీరే కట్టుకోదు. మరి ముగుడిని కొంగుకి ఎలా కట్టేసుకుంటుంది? ఈ పెద్ద వాళ్ళంతా ఇంతే. ఇలా గడుసుగా మాట్లాడుతూ ఉంటారు.

“ఒరే బుడుగూ, నీకు ప్రేమంటే ఏమిటో తెలుసారా?” అని అడిగింది నన్ను సీగానపెసూనాంబ.

“ప్రేమంటే డాన్సులు చేసుకుంటూ, గాఠిగా పాటలు పాడుకోవడం,” అన్నాను నేను.

“నీ మొహం!” అంది అది.

నాకు వొళ్ళు మండిపోయింది. నేనేమన్న చిన్న వాడినా చితక వాడినా, అలా తీసి పారేయ్యడానికి?

“మన సినిమాల్లో అందరూ అలానే ప్రేమించుకుంటారు, తెలుసా?” అన్నాను ఆవేసంగా. ఆవేసం అంటే నాకు తెలీదు. కానీ ఎక్కువ ఆవేసపడితే ఆయాసం వస్తుందని మాత్రం తెలుసు.

“కొయి కొయి. ఎక్కడో చూసింది విన్నది కాదమ్మా! నీకు తెలిసింది చెప్పు.”

“ఐతే నీ దగ్గర నాలుగు చేగోడీలు ఉన్నాయనుకో. నాకు మూడిచ్చి నువ్వొక్కటి తింటే నీకు నా మీద ప్రేమున్నట్టు,” అన్నాను నేను.

అప్పుడే అక్కడికి టింకు గాడు వచ్చాడు. టింకుగాడి గురించి కుంచెం చెప్పాలి. వాడి ప్రకారం ఈ ప్రపంచకంలో పిల్లలూ, చేగోడీలు అమ్మే వాళ్ళు (అంటే చేగోడీలు స్టాక్ ఉన్న వాళ్ళు లెండి), ఝట్కా బండి వాళ్ళు తప్ప ఇంకెవరూ ఉండకూడదు. మిగతా అందరూ దండగ అని వాడి అభిప్రాయం. అభిప్రాయం అనే మాట నాకు బాబాయి నేర్పాడు. వాడి దగ్గర ఇంకా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్నీ వొద్దు లెండి.

“ఉరేయి టింకూ గాడూ, నువ్వు ప్రేమిస్తావురా?” అడిగింది వాడిని సీగానపెసూనాంబ.

“ఎలా ఇస్తాను? అదేంటో నాకు తెలీనూ కూడా తెలీదు,” అన్నాడు వాడు చేగోడీ నములుతూ.

నాకు వాడి మీద జాలి వేసింది. మరి, ఈ కాలంలో బతుకుతూ ప్రేమ అంటే తెలీకపోవడం హెంత అనుమానం! అనుమానం అంటే ఇంసల్టు. ఈ మాట మా ప్రైవేట్ మాస్టారు చెప్పాడు. వాడు చదువు చెప్తూంటే నేను వాడికి ఇవ్వకుండా జీళ్ళు తినేస్తూంటాను కద. అప్పుడు వాడికి ఖోపం వచ్చి “ఇంసల్ట్,” అని అరుస్తాడులే.

“అదేరా, ప్రేమ అంటే సినీమాల్లో హీరో హీరోయిన్ డాన్సు చేస్తూ గాఠిగా పాడేసుకుంటారు చూడు? అది,” వాడికి చెప్పాను నేను.

“నోర్మూయి,” అంది సీగానపెసూనాంబ.

నాకు ఉడుకుమోత్తనం వచ్చేసింది. “ఐతే ప్రేమేంటో నువ్వే చెప్పు!” అరిచాను నేను.

“డాన్సులు చేస్తూ గాఠిగా పాడితే చేగోడీలు ఇస్తారా?” అడిగాడు నన్ను టింకూగాడు ఇంతలో.

“ఇవ్వరనుకుంటా,” అన్నాను నేను.

“ఐతే ప్రేమ ఇవ్వనులే,” అంటూ వాడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

“ఉప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారనుకో. ఒకరు కనపడకపోతే ఇంకొకరికి పిచ్చి ఎక్కుతుంది. అదే ప్రేమంటే,” చెప్పింది సీగానపెసూనాంబ.

“పిచ్చంటే?” అన్నాను నేను.

“పిచ్చంటే టింకూ గాడి నుంచి చేగోడీలు లాక్కుంటే వాడు అరుస్తూ గెంతుతాడు చూడు. అదన్న మాట.”

“ఐతే ప్రేమంటే చేగోడీలు లాక్కోడం అన్న మాట.”

“నీ మొహం,” అంది సీగానపెసూనాంబ.

నాకేమనాలో తెలీలేదు. అందుకే చెప్పాను. సీగానపెసూనాంబ చాలా గడుసుది అని.

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

9 Responses to ప్రేమంటే తెలీదా? ఇన్సల్ట్!

 1. venu says:

  Soooooper…..

 2. Dhrruva says:

  ఈ కాలంలో బతుకుతూ ప్రేమ అంటే తెలీకపోవడం హెంత అనుమానం! అనుమానం అంటే ఇంసల్టు.

  పిచ్చంటే టింకూ గాడి నుంచి చేగోడీలు లాక్కుంటే వాడు అరుస్తూ గెంతుతాడు చూడు. అదన్న మాట.”

  Kekooooooooooo Keka

  ~dhrruva

 3. Meher says:

  ఇది excerpt నా లేక parody నా? “బుడుగు” చదివి చాలా కాలం అయింది; అందుకే గుర్తు రావడం లేదు. పేరడీ అయితే మాత్రం చాలా బాగుంది.

 4. హి హి హ్హే… భలే రాసారు 🙂

 5. budugu says:

  //“ఐతే నీ దగ్గర నాలుగు చేగోడీలు ఉన్నాయనుకో. నాకు మూడిచ్చి నువ్వొక్కటి తింటే నీకు నా మీద ప్రేమున్నట్టు,” అన్నాను నేను. //

  ఇంత బాగా ప్రేమ అంటే ఏంటో చెప్పినా ఒప్పుకోలేదంటే..
  నిఝంగా గానపెసూనాంబ మహా గడుసు..

  మురళి గారూ..

  బుడుగుకి సీక్వెల్ రాసే ఆలోచనల్లో ఏమన్నా వున్నారా?? 🙂

  • Murali says:

   సీక్వెల్ కాదు కాని, ఏదో ముళ్ళపూడికి ఉడుతా భక్తిగా నా నివాళి అనుకోండి.

 6. Sreedhar says:

  Nice parody 🙂

 7. Rajiv says:

  చాలా బావుంది మురళి గారూ….

  కేక అని చెప్పండి మీ బుడుగు కి….. కేక అంటె ఎంటొ బాబాయ్ ని అడగమనండి

 8. Sravya says:

  భలే ఉంది !:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s