పేరు కావాలా? ఐతే సినిమా తియ్యి!

నరసయ్య ఒక పెద్ద భూస్వామి. తాతలు వదిలి వెళ్ళిన ఆస్తిని తన తెలివితేటలతో వందింతలు చేశాడు. అంత డబ్బు సంపాదించినా ఏదో తెలియని అసంతృప్తి అతనికి. ముఖ్యంగా ఒకసారి టీవీ మీద ఏదో రియాలిటీ షోలో, మేకుల మీద పడుకుని చప్పట్లు కొట్టించుకున్న ఒక కుర్రాడిని చూశాక అతనికి సడన్‌గా ఒక విషయం అర్థమయ్యింది.

తనని తన ఊర్లోనే గుర్తు పడతారు. ఆ అబ్బాయిని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరూ గుర్తు పడతారు. ఆ అబ్బాయి ఓవర్‌నైట్ ఫేమస్ అయిపోయాడు. అది మీడియాకి, గ్లామర్‌కి ఉన్న పవర్! తనకెంత డబ్బు ఉంటే ఏం లాభం, ఇలాంటి గుర్తింపు లేనప్పుడు!

ఎలా అయినా కీర్తి గడించాలనుకున్నాడు నరసయ్య. ఐతే అతనికి మేకుల మీద పడుకోవడం లాంటి ఫీట్స్ చేసే శక్తి లేదు. అలాంటివి చేస్తే కీర్తిశేషుడయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కీర్తి నరసయ్యకు అక్కర్లేదు.

స్నేహితుడు గవరయ్యని సలహా అడిగాడు. గవరయ్య తను కాలుస్తున్న లంకా పుగాకు చుట్ట కొసని పళ్ళతో పీకి పక్కనే తుపుక్కున ఉమ్మేసి, “ఒక సినిమా తీసెయ్యి. బోలెడంత కీర్తి అదే వచ్చి పడుతుంది,” అని సలహా ఇచ్చాడు.

“అంతేనంటావా?” సాలోచనగా అన్నాడు నరసయ్య.

“అంతే మరి! నీ కాడ కోట్ల డబ్బు మూలుగుతూంది కద, ఒక పదో పదిహేనో నీవి కాదనుకుంటే సరి, ఏ కళాఖండమో తీసి పారెయచ్చు. ఆ తరువాత తెలుగు టీవీ చానెళ్ళలో ఒకటే ఇంటర్వ్యూలు, ఒకటే పబ్లిసిటీ. అబ్బో బెమ్మాండం!” అన్నాడు గవరయ్య.

“సినిమా తీస్తే నాకెందుకు పబ్లిసిటీ వస్తుంది. హీరోకో హీరోయిన్‌కో వస్తుంది కద?” అమాయకంగా అన్నాడు నరసయ్య.

“అవన్నీ పాత రోజులురా, అబ్బీ! ఇప్పుడు సినిమాకి సంబంధించిన అందరికీ గుర్తింపు వస్తా ఉంది. మన తెలుగోళ్ళకు సినిమాని మించి వేరే కళాపోసన లేదు కద. ఎక్కడ చూసినా సినిమా కబుర్లే. ఊ టీవీలో హెమినీ టీవీలో సినిమాలకు సంబంధించిన చాలా కార్యక్రమాలు వస్తాయి. అందులో నిన్ను పరిచయం చేస్తూ కొన్ని ప్రోగ్రాములు పెట్టించేసుకో.

వాటిలో యాంకర్లు యాంకరమ్మలు నీ పుట్టు పూర్వోత్తరాల నుంచి మొదలు పెట్టి, నువ్వు ఎంత మంచి అభిరుచి కలోడివో, సినిమాల వల్ల నువ్వు మన దేశ యువతని ఎలా మార్చాలని ఆశ పడేటోడివో గట్రా కబుర్లు చెప్పి, టోటల్‌గా నీదెంత గొప్ప కళా హృదయమో తేలుస్తారు.

నువ్వు కూడా దానికి తగినట్టు సమాధానాలిస్తూ పో. శంకరాభరణం యాభై సార్లు చూసినావని, పాత తెలుగు పద్యాలంటే పడి చస్తావని చెప్పు. ఇంకా టైముంటే నా పేరు కూడా ఇరికించు ఆ ఇంటర్వ్యూలో,” వివరించాడు గవరయ్య.

“అయన్నీ నేనెప్పుడు చేశాను. శంకరాభరణంలో క్యామెడీ ట్రాకు లేదని ఇంటర్‌వెల్‌లోనే బయటికి వచ్చేసినా కద. ఇంక పద్యాలంటావా, నేను తెలుగు పేపరే సరింగా చదవను, అవెప్పుడు చదివినట్టు,” సందేహం వ్యక్తం చేశాడు నరసయ్య.

“ఎవడు చూడొచ్చినాడురా? నువ్వు ఎంత చెప్తే అంత. అవన్నీ సాధారణంగా ఇంటర్వ్యూలలో చెప్పే సొల్లు కబుర్లు. చెప్పమని ఎవడూ అడగడు. నువ్వు చెప్పినా అది యాంకర్లకు అర్థం కాదు, చూసే ప్రేక్షకులకూ అర్థం కాదు. నా మాట విని ఇట్టా కానియ్యి,” భరోసా ఇచ్చాడు గవరయ్య.

***

గవరయ్య మాట ప్రకారం సినిమా తీద్దామనుకుని డిసైడ్ అయిపోయి హైదరాబాద్‌కి తన మకాం మార్చేశాడు నరసయ్య.

డబ్బులు ఎంతైనా ఖర్చుపెట్టడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి, ఒక అగ్రహీరో కాల్షీట్లు వెంటనే దొరికిపోయాయి. హిట్ చిత్రాలు తీసే ఒక దర్శకుడు, నరసయ్యతో ఇంకో హిట్ చిత్రం తీయడానికి ఒప్పుకున్నాడు.

“మనం ఎలాంటి సినిమా తీస్తే మనకు బెటరంటారు?” దర్శకుడిని అడిగాడు నరసయ్య.

“ఈ కాలంలో తెలుగోళ్ళు థియేటర్‌కి వచ్చి చూసే సినిమాలు రెండే రకాలు. ఒకటి, కాలేజ్ కుర్రకారు ప్రేమలో పడి, ఆ ప్రేమ సుఖాంతం అయ్యేవి. ఫస్ట్ హాఫ్ అంతా, కాలేజ్‌లో లెక్చరర్ల మీద, ఇంట్లో అమ్మా నాన్నల మీద నీచమైన జోక్స్ వేసుకోవడం, హీరో హీరోయిన్ వెనకాలో, హీరోయిన్ హీరో వెనకాలో పడి తరిమి తరిమి ప్రేమించడం ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా, అపార్థాలూ, విడిపోవడాలూ చివరికి మళ్ళీ కలుసుకోవడాలూ ఉంటాయి ” చెప్పాడు డైరెక్టర్.

“ఈ మధ్య కాలేజే కానక్కర్లేదు, హై స్కూల్ ఐనా ఓకే,” మధ్యలో అడ్డు పడి అన్నాడు బాగా డబ్బులు పోసి నరసయ్య కొనుక్కున్న రచయిత.

“మరి మీ అబ్బాయో/అమ్మాయో అలా ప్రేమిస్తే మీకు ఓకేనా?” అడిగాడు నరసయ్య.

“నరికి పోగులు పెడతాం. సినిమా అంటే మన చేతికొచ్చినట్టు తీస్తాం, నోటికొచ్చినట్టు రాస్తాం. నిజంగా అలా చేస్తే ఊరుకుంటామటండీ?” అన్నారు కోరస్‌గా దర్శకుడూ, రచయితా.

“గుడ్. ఎక్కడం మనం చెప్పేవన్ని మనం కూడా పాటించాలి అని నమ్మే మనుషులేమో అనుకుని భయపడ్డాను,” ఊపిరి పీల్చుకున్నాడు నరసయ్య.

“మీకు ఆ భయమేమీ అక్కర్లేదు. ఇక రెండో రకం సినిమా ఫ్యాక్షనిస్టుల గురించి ఉంటుంది. రాయలసీమలో రెండు పెద్ద కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబం మంచిది. ఇంకోటి పరమ నీచమయ్యింది. ఈ నీచ కుటుంబం మంచి కుటుంబాన్ని హత్య చేస్తుంది. వాళ్ళ చంటోడు మాత్రం నౌఖర్‌తో తప్పించుకుని పారిపొతాడు. పెద్దయ్యాక తిరిగి వచ్చి ఆ నీచ కుటుంబం అంతు చూస్తాడు,” వివరించాడు డైరెక్టర్.

“ఆ! అర్థమయ్యింది. ఆ రెండు కుటుంబాలు వేరు వేరు కులాలకు చెందినవి కదూ?” తెలివిగా అడిగాడు నరసయ్య.

“అమ్మో! అలా తీస్తే ఇంకేమైనా ఉందా? అప్పుడు నీచ కుటుంబానికి చెందిన కులం వాళ్ళు, స్టూడియో బయటే మన గోరీ కడ్తారు. ఇలాంటి కథల్లో రెండు కుటుంబాలూ, ఒకే కులానికి చెంది ఉండడం చాలా ఇంపార్టెంట్,” చెప్పాడు రచయిత.

“ఓహో, ఐతే ఏ టైపు సినిమా తీద్దాం?” అడిగాడు నరసయ్య.

“ఆగండి ఇవి కాకుండా మూడో టైపు కూడా ఉంది,” డ్రమాటిక్‌గా అనౌన్స్ చేశాడు డైరెక్టర్.

“హయ్యి! మూడో టైపు కూడానా? ఎన్ని వెరైటీలో! ఏంటది?” కుతూహలంగా అడిగాడు నరసయ్య.

“ఫస్ట్ హాఫ్ అంతా, కాలేజ్‌లో లెక్చరర్ల మీద, ఇంట్లో అమ్మా నాన్నల మీద నీచమైన జోక్స్ వేసుకోవడం, హీరో హీరోయిన్ వెనకాలో, హీరోయిన్ హీరో వెనకాలో పడి తరిమి తరిమి ప్రేమించడం ఉంటుంది.

సెకండ్ హాఫ్‌లో సెలవుల్లో హీరోయిన్ వాళ్ళూరు వెళ్ళిపోయి తిరిగి రాదు. ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకి తెలుస్తుంది. ఆమె ఒక నీచ ఫ్యాక్షనిస్టు కూతురు అని, వాళ్ళ కుటుంబమే హీరో చిన్నప్పుడు హీరో యొక్క మంచి కుటుంబాన్ని హత్య చేసింది అని. అంతే! హీరో వీరంగం వేసి, ఆ నీచ కుటుంబాన్ని మొత్తం లేపేసి, వాళ్ళ శవాల పక్కనే హీరోయిన్‌ని పెళ్ళి చేసుకుంటాడు,” చెప్పాడు డైరెక్టర్.

“భలే భలే! ఐతే ఈ కథనే సినిమా తీద్దాం,” ఆనందంగా అన్నాడు నరసయ్య.

“కుదరదు సార్. మన అగ్ర హీరో గారిని కాలేజ్ స్టూడెంట్‌లా చూపించలేము. కాబట్టి రెండో కథే బెటర్,” అన్నాడు రచయిత.

“మరి మన ఫ్యామిలీ ఆడియెన్సు ఇలాంటి సినిమాలు చూస్తారా?” సందేహం వెలిబుచ్చాడు నరసయ్య.

“వాళ్ళు థియేటర్‌కి రావడం మానేసి చాలా రోజులయ్యింది సారి. ఇంట్లో కూర్చుని హ్యాపీగా, ‘కంటే కూతుర్నే కను’ లాంటి సీరియల్స్ చూసుకుంటారు.

“మరి అభిరుచి కల ప్రేక్షకులు?” అడిగాడు నరసయ్య.

“వాళ్ళు పాత బ్లాక్ & వైట్ తెలుగు చిత్రాలో, లేదా కొత్త ఆంగ్ల చిత్రాలో చూస్తారు. ఆ రెండు వర్గాలు శుద్ధ దండగ మారి ఆడియెన్సు. వాళ్ళు మనకు అనవసరం లెండి,” తేల్చి పారేశాడు డైరెక్టర్.

“అలాగే, మీరు చెప్పినట్టే కానిద్దాం,” తన అంగీకారం తెలిపాడు నరసయ్య.

***

సినిమా తీయడానికి ముందే, నరసయ్య అన్ని తెలుగు చానెల్స్‌లో తన ఇంటర్వ్యూ ప్రసారం అయ్యేలా చూసుకున్నాడు. అసలు తన సినిమాకి స్ఫూర్తి పోతన భాగవతమేనని నమ్మ బలికాడు. పైగా ఒక పేరు పొందిన పండితుడితో నరసయ్య సినిమాకూ భాగవతానికీ ఎన్ని పోలికలున్నాయో కూడా చెప్పించాడు.

మొత్తానికి నరసయ్య తీసిన సినిమా, “రాయలసీమ రాలుగాయి” అన్ని బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలు కొట్టింది. నిర్మాతగా నరసయ్యకు డిమాండ్ పెరిగిపోయింది.

తను తరువాత తీయబోయే చిత్రం పేరు “నైంత్ క్లాస్ ఫెయిల్, కానీ లవ్‌లో సక్సెస్” అని ప్రకటించాడు నరసయ్య. కొత్త నటుల కోసం పేపర్‌లో అడ్వర్తైజ్‌మెంట్లు వేయించాడు.

అలా ఆడిషన్ కోసం వచ్చిన వాళ్ళలో, తను అంతకు ముందు టీవీలో చూసిన మేకుల మీద పడుకున్న అబ్బాయిని ఒక రోజు గమనించాడు నరసయ్య.

“ఏంటోయి, నీకు ఈ పిక్చర్‌లో రోలెందుకు? నువ్వు ఆల్రెడీ ఫేమస్ కద?” అడిగాడు అతన్ని.

“వెధవది ఆ మేకుల మీద పడుకుంటే ఏం వస్తుంది సార్, వొళ్ళంతా బొక్కలు తప్ప! ఏదో మీలాంటి అభిరుచి గల నిర్మాత చిత్రంలో ఒక చిన్న పాత్ర ఐనా వేస్తే అందరికీ కల కాలం గుర్తుండిపోతాను,” వినయంగా చెప్పాడు ఆ కుర్రవాడు.

ఠీవీగా తల ఊపాడు నరసయ్య.

Advertisements
This entry was posted in కథలు, సినిమాలు. Bookmark the permalink.

17 Responses to పేరు కావాలా? ఐతే సినిమా తియ్యి!

 1. ఇంతకీ మీ సినిమా ఎప్పుడూ?!?

 2. రవి says:

  నా దగ్గరా ఓ కథుంది. నరసయ్యకు వినిపిస్తా, వీలు దొరికితే.

  “హీరో పుట్టి, పసిగుడ్డుగా ఉన్నప్పుడే, ఆస్పత్రిలో పక్క గదిలో హీరోవిను పుడుతుంది. పుట్టినప్పుడు కేర్ మని ఏడుస్తుంది. ఆ ఏడుపు వినగానే హీరోవిన్ను ప్రేమిస్తాడు మన హీరో.ఆ ఏడుపును గుర్తుంచుకుని, దాని సహాయంతో వెతుక్కుంటా వెళ్ళి, చివరకు హీరోవిన్ను దక్కించుకుంటాడు.”

  బచ్చా (ఓ పసిగుడ్డు ప్రేమకథ) – ఇది టైటిలూ, కాప్షనూ..

  (ఇంకా నిలబడే ఉన్నారా? బాత్రూమ్ కు పరిగెత్తి భళ్లున వాంతి చేసుకోలే?)

 3. bujji says:

  తరిమి తరిమి ప్రేమించడం ఉంటుంది haha!!

 4. Karthik says:

  super.
  mee marku chupincharu.

  -Karthik

 5. sujata says:

  Super story. very very good.

 6. Bhaskar says:

  Superb..I am waiting for your post on MEMINI TV interview of some useless/unknown Telugu cine film personality!

 7. Wanderer says:

  పైగా ఒక పేరు పొందిన పండితుడితో నరసయ్య సినిమాకూ భాగవతానికీ ఎన్ని పోలికలున్నాయో కూడా చెప్పించాడు.

  :-)) :-))

 8. Jyothi Reddy says:

  “నైంత్ క్లాస్ ఫెయిల్, కానీ లవ్‌లో సక్సెస్” Super Title murali ji

 9. prasad says:

  bagundi

 10. $h@nK@R ! says:

  “అమ్మో! అలా తీస్తే ఇంకేమైనా ఉందా? అప్పుడు నీచ కుటుంబానికి చెందిన కులం వాళ్ళు, స్టూడియో బయటే మన గోరీ కడ్తారు. ఇలాంటి కథల్లో రెండు కుటుంబాలూ, ఒకే కులానికి చెంది ఉండడం చాలా ఇంపార్టెంట్,” చెప్పాడు రచయిత.

  superb and Nice Narration again… 🙂

  by the way iam also hunting for NARSAIAH 🙂

 11. panipuri123 says:

  > వెధవది ఆ మేకుల మీద పడుకుంటే ఏం వస్తుంది సార్, వొళ్ళంతా బొక్కలు తప్ప
  🙂

 12. anamika says:

  Madhya madhya lo athukula bontha lanti vekili comedy kuda pettali.

 13. yogi says:

  Super Story Murali garu…keep writing!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s