తప్పు నీ వొంట్లో లేదు, నీ ఇంట్లో ఉంది!


“గురూ, నన్ను చుట్టు ముట్టిన కష్టాలకు కారణం నాకు తెలిసిపోయింది,” సెలవిచ్చాడు అప్పారావు.

“అసలు నిన్ను చుట్టు ముట్టిన కష్టాలు ఏంట్రా?” అడిగాను నేను.

“చాలా ఉన్నాయిలే. పదేళ్ళైనా ప్రమోషన్ రాకపోవడం, మా ఆవిడ నాకు బొత్తిగా గౌరవం ఇవ్వకపోవడం, మా అత్తారింటి వాళ్ళు అందరు రెండు నెలలకొకసారి వచ్చి నెల రోజులు తిష్ట వేసి పోవడం, మా బాసు గాడు నా ఒక్కడికే ఎక్కువ పని ఇవ్వడం, నేను ఏ రోజైతే క్రికెట్ మ్యాచ్ చూస్తానో, ఆ రోజు సచిన్ ఒకటో రెండో పరుగులకి ఔట్ కావడం. అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.”

“మరి కారణం ఏంటంటావు?”

“మా ఇంటి వాస్తు బాగా లేకపోవడమే!”

“అంటే?”

“అంటే ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండకపోవడం. ఏది ఎక్కడ ఉండకూడదో అది అక్కడ ఉండడం. ఉదాహరణకు వాయువ్య దిక్కులో ఉండాల్సిన దిక్కు మాలిన వంట గది ఈశాన్యంలో ఉందంట. అక్కడ నిజానికి బావి ఉండాలి.”

“ఈ కాలంలో కూడా బావులు తవ్వుతున్నారా?”

“బావంటే బావే కానక్కర్లేదు. ఏ కొళాయో ఉన్నా వోకే. కాని నీటికి సంబంధించి ఏదో ఉండాలి.”

“మరి ఇకనేం, ఈశాన్యంలో వంటగది ఉందన్నావు కద! వంట గది అంటూ ఉన్నాక నీళ్ళు ఉండనే ఉంటాయి కద? కాబట్టి ప్రాబ్లం సాల్వ్డ్.”

“అలా కుదరదు అనుకుంటారా. మరి వాయువ్య దిక్కులో వంట గది మాటేంటి?”

“అక్కడ తిండికి సంబంధించింది ఏదన్నా పెట్టు. ఉదాహరణకు మీ ఎంగిలి పళ్ళాలు.”

“ఛీ చచ్చినోడా! ఎంగిలి పళ్ళాలు ఎక్కడంటే అక్కడ పెడతారా? అందుకే నీలాంటి వాళ్ళకు ఇవన్నీ చెప్పకూడదు. దీనికోసం వేరే వాళ్ళు ఉంటారు. నాకు ఈ వాస్తు గురించి జ్ఞానోదయం కలిగించింది మా పక్కింటాయన. ఆయనే నాకు వాస్తురెడ్డిగారి గురించి చెప్పాడు. ఇంకాసేపట్లో అక్కడికే వెళ్తున్నాను.”

“నన్నూ తీసుకెళ్ళరా! నేనూ వస్తాను.”

“ఎందుకులే, అక్కడ నువ్వేదో అవాకులు చెవాకులు పేలితే ఆయనకు కోపం రావచ్చు.”

“లేదురా. ఏం మాట్లాడను. ఆయనేం చెప్తే అది వింటాను. సరేనా?”

“వోకే. తగలడు ఐతే.”

ఇద్దరం వాస్తు రెడ్డి గారింటికి బయలు దేరాం.

***

వాస్తురెడ్డిగారి ఇంటి ముందు ఉన్న వాచ్‌మ్యాన్ మమ్మల్ని ఆపేశాడు, “సాబ్ సే అప్పాయింట్‌మెంట్ హై?” అంటూ.

ఆదరాబాదరాలో ఆటో డ్రైవర్లు, వ్యాచ్‌మ్యాన్లు ఉర్దూలోనే మాట్లాడతారు. అప్పారావు గాడు తెల్ల మొహం వేశాడు. వాడికి ఉర్దూ హిందీలు రావు. అయినా పాపం ఎలాగో అలా ఆదరాబాదరాలో మ్యానేజ్ చేస్తున్నాడు.

“రెడ్డిసాబ్ అప్పారావు కే దోస్త్ కా దోస్త్ హై,” వాడి మీద నాకొచ్చిన కొద్ది పాటి హిందీ చేసుకున్నాను.

“అప్పారావు కౌన్ హై జీ,” అన్నాడు వాడు.

అప్పారావుగాడికి వాడి పేరు వినగానే కొద్దిగా అర్థమైనట్టుంది. “మై హై అప్పారావు,” అన్నాడు గర్వంగా.

“హమే కోయీ అప్పారావు మాలూం నై,” అని వాడు లోపలికి పోనివ్వకుండా ఆపేశాడు మమ్మల్ని.

చేసేది లేక అప్పారావు వాళ్ళ పక్కింటాయానకి ఫోన్ చేసి మా పరిస్థితి వివరించాడు.

“అరెరే అలా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు సార్! సరే ఎలాగూ అంత దూరం వెళ్ళారు కద, నేను రెడ్డిగారికి ఫోన్ చేసి చెప్తాను లెండి. అప్పటి వరకు అక్కడే ఉండండి,” ఆర్డర్ పాస్ చేశాడు ఆయన. మేం అక్కడే నిలబడ్డాం.

అరగంట తరువాత వాచ్‌మ్యాన్‌కి ఇంటి లోపల నుంచి ఫోన్ ద్వారా ఆదేశాలు వచ్చినట్టున్నాయి. వాడు గేటు తీసి మమ్మల్ని లోపలికి వెళ్ళమన్నాడు.

“మై హై అప్పారావు,” అని ఒక వెకిలి నవ్వు నవ్వుతూ మా అప్పడు లోపలికి దారి తీశాడు. వాడి వెనకాల నేను కూడా దూరాను.

ఇంటి తలుపుల ముందు నిలబడి కాలింగ్‌బెల్ నొక్కాను నేను. ఎవరూ తెరవలేదు. ఒక పది సార్లు నొక్కాక నా చూపుడువేలు నొప్పి పెట్టడం మొదలెట్టింది. “కాసేపు నువ్వు నొక్కరా,” అన్నాను మా అప్పిగాడితో.

వాడు వేలు సవరించుకునేంతలో అటు పక్కగా వచ్చిన ఒకావిడ, బహుశా ఆ ఇంటి పని మనిషి అనుకుంటా, “మొదటి సారా అయ్యగారిని కలవడం?” అని అడిగింది.

“ఇలా తలుపులు తీయకపోతే ఇదే చివరి సారి కూడా,” అని నాలో నేను అనుకుంటూ పైకి మాత్రం అవునన్నట్టు తలూచాను.

“అందుకే మీకు తెలీదు. ఈ తలుపులు ఎప్పటికి తెరవరు. వాస్తు దోషం ఉంది. అదుగో ఆ పక్కన కిటికీ ఉంది చూశారా? దానిలోంచి లోపలికి వెళ్ళండి,” మార్గం సూచించింది ఆమె.

“అందరూ ఇదే రూట్‌లో ఇంట్లో ప్రవేశిస్తారా?” అడిగాడు అప్పారావు.

“లేదు మేమంతా దొడ్డి దారినుంచి వెళ్తాం. కాని మీ లాంటి కస్టమర్లు మాత్రం ఇలానే వెళ్ళాలి. వాస్తు ప్రకారం అది కరెక్ట్ అని అయ్యగారు చెప్పారు,” వివరించింది ఆవిడ.

ముందు అప్పారావు గాడు, వెనకాల నేను కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాం.

ముందు గదిలో ఎవరూ లేరు.

“నాయనల్లారా, లోపలికి రండి,” పక్క గది నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది.

“చిత్తం,” అంటూ మేము అటువైపు బయలుదేరాం.

“అలా సూటిగా కాదు నాయనా! ఎండ్రకాయలా పక్కటడుగులు వేస్తూ రండి. అసలే ఆ గది వాస్తు మంచిది కాదు,” అంది అదే గొంతు మళ్ళీ.

మేము అలానే పక్క గదిలోకి వెళ్ళాం. లోపల పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్న వాస్తురెడ్డిగారు కనిపించారు.

“ఇప్పుడు చెప్పండి, ఏంటి మీకొచ్చిన కష్టం?” అన్నాడాయన.

ఒక రెండు నిముషాలు నాన్-స్టాప్‌గా తన కష్టాలు ఏకరువు పెట్టాడు అప్పారావు. తన ఇంటి ప్లాన్ కూడా ఆయనకి చూపించాడు. మా వాడిది రెండంతస్తుల మేడ .

“తప్పు నీ వొంట్లో లేదు నాయనా, నీ ఇంట్లో ఉంది. దీనికి ఒక్కటే సొల్యూషన్. మీ ఇంటి పై కప్పు ఊడ బీకు. అన్నీ అవే సర్దుకుంటాయి,” అన్నాడు ఆయన.

“మరీ ఇంటిమీద రూఫ్ లేకుండా ఉండాలి అంటే కష్టం స్వామి. అసలే వానా కాలం,” గొణిగాడు అప్పడు.

“నిజమే ఐతే ఇంకో సొల్యూషన్ ఉంది. కొంత సులభమైనది కూడా. అది నీకు తారక మంత్రంలా చెవిలో చెప్పాలి. నీ ఫ్రెండ్ వినకూడదు. అది నువ్వు మొదటి సారి అమలు పరిచాక కావాలంటే అతనికి చెప్పవచ్చు,” అంటూ దగ్గరకు రమ్మని సైగ చేశాడు ఆయన.

వాస్తురెడ్డిగారు బోధించినది విన్న అప్పారావుగాడి మొహంలో రంగులు మారాయి. జేబులోంచి పది వేల నూట పదహార్లు తీసి ఆయన ముందు ఉంచాడు.

“ఇంకేముంది, ఇంతకు ముందులానే పక్కటడుగులు వేసుకుంటూ బయటకి వెళ్ళిపోయి, కిటికీ నుంచి బయటకి దూకి బయలు దేరండి,” నవ్వుతూ అన్నారు రెడ్డిగారు.

ఈ సారి ఎండ్రకాయల్లా నడవడం మాకెందుకో కష్టం అనిపించలేదు. బహుశా ప్రాక్టీసు వల్ల అనుకుంటా.

***

రెండు రోజుల తరువాత నాకు ఫోన్ వచ్చింది. అప్పారావు గాడు హాస్పిటల్‌లో ఉన్నాడని. నేను హడావుడిగా అక్కడికి వెళ్ళాను.

అప్పారావు గాడు బెడ్ మీద పడుకుని వున్నాదు. వాడి వొంటి నిండా కట్లున్నాయి. వాళ్ళావిడ వాడికి బత్తాయి వొలిచి నోటికి తొనలు అందిస్తూంది.

“అసలేమయ్యిందమ్మా?” అడిగాను నేను.

“ఆ వాస్తురెడ్డి గారిచ్చిన దిక్కుమాలిన సలహా అన్నయ్యగారూ. వాస్తుదోషం పోవాలంటే, ఒక నెల రోజులు ఇంటి వోనర్ వెనకనుంచి పైపు పట్టుకుని పాకుతూ ఎక్కాలట. మొదటి రోజే ఆ ఫీట్ చేస్తూ ఈయన జారి పడ్డారు. ఇదిగో ఇలా తయారయ్యారు. ఉండండి మీకు కాఫీ తీసుకొస్తాను,” అంటూ బయటకు వెళ్ళింది ఆవిడ.

తను అలా వెళ్ళగానే “ఏడిచినట్టుంది. ముందే నీ పరిస్థితి బాగుండేది కద?” అన్నాను వాడితో.

“అలా అనకురా. వాస్తురెడ్డిగారు మహానుభావులు. ఇప్పుడు చూడు, మా ఆవిడ నాకు బోలెడు గౌరవం ఇస్తూంది. సేవలు చేస్తూంది. బెడ్ రెస్ట్ కావాలి కాబట్టి కొన్ని రోజులు ఆఫీసు పని కూడా చేయక్కర్లేదు. నేను మా ఆవిడ హాస్పిటల్‌లో ఉన్నాం కాబట్టి కొన్ని రోజుల వరకు మా ఆవిడ చుట్టాలు ఎవరూ వచ్చి మా ఇంట్లో తిష్ట వేయరు. వికలాంగుల కోటాలో నాకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు వున్నాయి. నేను క్రికెట్ చూడలేను కాబట్టి సచిన్ బ్యాటింగ్‌కి ఇక ఢోకా లేదు. వాస్తుని తక్కువ చేసి మాట్లాడకు,” అన్నాడు అప్పారావు.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

22 Responses to తప్పు నీ వొంట్లో లేదు, నీ ఇంట్లో ఉంది!

 1. Sravya says:

  ha ha ha 🙂

 2. Indian Minerva says:

  ఆదరాబాదరా, ఎండ్రకాయల్లాగా నడవడం బాగున్నాయండీ 🙂

 3. ramani says:

  వాస్తులో మాయ భలే బాగు బాగు చాలా బాగుంది .. ఆఫీసులో గట్టిగా నవ్వితే బాగోదేమో అన్నది కూడా మరిచ్పోయి నవ్వేసా మురళీ గారు.

  • Murali says:

   రమణి గారు,

   సారీ! ఇంతకు ముందు కూడా నా రచనల మీద ఇలాంటివి ఒకటో, ఫదో కంప్లైంట్స్ వచ్చాయి. ఏం చేయాలో మరి. మా బుడుగుని సలహా అడుగుతా.

   -మురళి

 4. హహహ బాగుంది. మీశైలి ఎప్పటిలాగే అదుర్స్. రెగ్యులర్ గా రాయటం లేదే!

  • Murali says:

   ఏం చెప్పమంటారు? ఎటు చూసినా కష్టాలు, ఓటములు!
   ఎంత బాధ పడినా లాభం లేదు అని మళ్ళీ హాస్యాన్నే ఆశ్రయించాను.

   -మురళి

 5. hare krishna says:

  రెడ్డిసాబ్ అప్పారావు కే దోస్త్ కా దోస్త్ హై
  అలా సూటిగా కాదు నాయనా! ఎండ్రకాయలా పక్కటడుగులు వేస్తూ రండి
  భలేగా వుంది ..

 6. Sarath 'Kaalam' says:

  :))

 7. aswin says:

  enjoyed after a long break

 8. Wanderer says:

  కేక.. బావుంది.

 9. panipuri123 says:

  super… 🙂

 10. nomi says:

  ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాబోయే రోజుల్లో జంబూ ద్వీపం గురించి, త్రిలింగ దేశం గురించి ఒక టపా వ్రాయండి.
  మీ “రాజశేఖర చరిత్ర” మళ్ళీ పునరావృతం అవుతుందేమో?……

  • Murali says:

   నోమీ గారు,

   ప్రస్తుతానికి ఒక దండకం రాశాను. చిత్తగించగలరు. త్వరలో ఒక సమగ్ర సెటైర్ రాబోతూందహో!

   -మురళి

   • nomi says:

    @ మురళి
    కృతజ్ఞతలు. మీ టపా ఇప్పుడే చూశాను. మీ సమగ్ర సెటైర్ కోసం ఎదురు చూస్తూ…..

 11. parimalam says:

  🙂 🙂

 12. Jyothi Reddy says:

  LOL….

 13. prasad says:

  ఆదరాబాదరా చాలా బాగుంది

 14. kishore says:

  Murali garu meru chance istey nenu me daggra student ga cheripoyi ee comedy track rayatam nerchukunta…. naku telisina (nenu chadivina) varilo meru comedy king…

  Maro sari kekaaaaa…………

  • Murali says:

   కిషోర్ గారు,

   మంచి అవుడియా ఇచ్చారు. గంటకు 50 డాలర్లు ఫీజ్ ఓకే అంటారా?

   -మురళి

 15. andhrajyothi daily editor says:

  *tappu nee intlo ledu.. blogothamnu 10th june aadivaram aandhrajyothilo prachuristhunnam- editor, andhrajyothi

 16. Devender Babu says:

  🙂 very funny. Your blogs guarantee laughs, I go back and re-read them. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s