జ్వాలా ద్వీప రహస్యం – 25 (ఆఖరి భాగం)


“అదన్న మాట జ్వాలా ద్వీప రహస్యం! గానానంద స్వామి మంత్ర మహిమ, అక్కడ ఉన్న ఆటవికులు వాడే దురగ గుండాకు, ఆ ద్వీపాన్ని అభేద్యంగా చేసాయి,” అన్నాడు నరస సింహుడు ఆత్రవిందతో.

“అవును పుట్టలో బంధింపబడి ఉన్న గానానంద స్వామి విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి, ఆ రహస్యం బయట పడకూడదని నన్ను ఆ ద్వీపంలో బంధీ చేశారు,” చెప్పింది ఆత్రవింద.

“అది సరే, మరి ఈ పండు కోతి ఆ రహస్యం బయట పెట్టలేదు కదా, దీన్ని కూడా ఎందుకు బంధించారు?” సందేహంగా అన్నాడు యువరాజు.

“దాన్ని బంధించింది మీరు దాని కోసం వస్తారని, అప్పుడు మీతో పాట పాడించవచ్చని,” సమాధానం చెప్పింది రాకుమారి.

“ఓ, నిజమే! కానీ నేను ఆయన్ని శాపవిముక్తుడిని చేయలేకపోయాను. యమ కింకరి, యమానంద లహరి పాడి ఉంటే బాగుండేది,” విచారంగా అన్నాడు నరస సింహుడు.

“పోనీ లెండి, మీరు అనుకున్నది సాధించారు కద! ఆ పాట ఇక్కడ మాత్రం పాడకండి. అసలే మేఘాల మధ్య పయనిస్తున్నాం. నేను ఎటూ వెళ్ళ లేని పరిస్థితి కూడా,” కాస్త భయంగా అంది ఆత్రవింద.

“గానానంద స్వామికి ఏ మాత్రం ఉపయోగ పడలేని నా గాత్రం అంటే నాకు విరక్తి కలిగింది. గాన వైరాగ్యం వచ్చింది. ఇక పాటలు పాడను, ఒక షట్ కళ్యాణిని పరిగెత్తించాలంటే తప్ప,” విషాదంగా అన్నాడు నరస సింహుడు.

“నన్ను జ్వాలా ద్వీపం నుంచి విడిపించినందుకు ఇప్పటికే మీకు ఋణపడి ఉన్నాను. ఈ నిర్ణయం తరువాత మీ మీద అభిమానం మరింత పెరిగింది,” సిగ్గు పడుతూ అంది ఆత్రవింద.

దానికి నరస సింహుడు బదులు చెప్పేంతలో తివాచీ బెంగ నగరం చేరుకుంది. సరిగ్గా నగరం మధ్యలో దిగి నేలకు ఒక అడుగు పైన ఆగింది. ఆ కూడలిలో ఉన్న ప్రజలు రాకుమారిని చూడగానే ఆనందోత్సాహలతో చుట్టు ముట్టారు.

“రాకుమారి తిరిగి వచ్చేసింది. పరదేశీ విజయుడై తిరిగి వచ్చాడు. నరస సింహుడికి జై. మహారాజు అశృ సింహులకు జై,” అంటూ జయ జయ ధ్వానాలు కావించారు.

అక్కడ ఉన్న ప్రజల్లోనే మత్స్య కుమారుడు కూడా ఉన్నాడు. “నా తెప్ప, నా తెడ్లు,” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకున్నాడు.

నరస సింహుడు, ఆత్ర వింద, పండు కోతి తివాచీ పై నుంచి కిందకి దిగారు. వెంటనే తివాచీ రివ్వున గాలిలోకి ఎగిరి జ్వాలా ద్వీపం వైపు శర వేగంతో పయనిస్తూ కొద్ది క్షణాల్లో మాయమయ్యింది.

అశృ సింహుడికి అతి వేగంగా ఈ వార్త అందిపోయింది. హుటా హుటిన ఆయన అక్కడికి వచ్చేశాడు. ఆత్రవిందని చూడగానే ఆయన కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు జల జలా రాలాయి.

ఆత్రవింద తండ్రిని చూడగానే ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అక్కున చేరింది. “భళా పరదేశీ, భళా! ఎవరూ వెళ్ళడానికి కూడా సాహసించని జ్వాల ద్వీపానికి వెళ్ళి మా పుత్రికని రక్షించి ఆమెతో క్షేమంగా తిరిగి వచ్చావు. నీ ఋణం తీర్చుకోలేను. అక్కడ ఎలాంటి సాహస కృత్యాలు చేశావో వినాలని కర్ణ కుతూహలంగా ఉంది,” అన్నాడు మహారాజు నరస సింహుడిని ఉద్దేశించి.

“తండ్రీ! ఆయన ఏ సాహసమూ చేయలేదు. కేవలం ఒక పాట పాడి నన్ను, తన పండు కోతిని విడిపించుకున్నారు,” చెప్పింది ఆత్రవింద.

“నిజమా? ఆ పాటేదో వినవలెనని మాకు ఎంతో కోరికగా ఉంది,” అన్నాడు అశృ సింహుడు.

“ఆ పాట పాడేశాను కద. కావాలంటే ఇంకొకటి పాడుతాను. యమ కింకరి, యమనంద లహరి అని ఉంది లెండి,” తను సిద్ధమే అని తెలియజేశాడు నరస సింహుడు.

“నహీ!” ఈ సారి ఆత్రవింద అరిచింది సంస్కృతంలో. “ఆ పాట అలా అల్లరి చిల్లరిగా పాడకూడదు. ఐనా, మీరు ఇంతకు ముందే కద, గాన వైరాగ్యం వచ్చింది అన్నారు,” చిరు కోపంగా అంది నరస సింహుడిని చూసి.

“నిజమే కదూ! మరిచి పోయాను. ఇక మళ్ళీ పాట పాడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను, మహారాజా! క్షమించండి,” అన్నాడు నరస సింహుడు అశృ సింహుడితో.

“అది మా దురదృష్టము పరదేశీ,” బాధగా అన్నాడు మహారాజు. అంతలోనే ఆయన మొహం విప్పారింది.

“ఇచ్చిన మాట ప్రకారం, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి…” అంటున్న అశృ సింహుడి వాక్ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ, “అంత సమయం లేదు మాహారాజా! నేను త్వరగా దోమదేశం చేరుకోవాలి. మాములు పీటా పందిరి తోనే పెళ్ళి జరిపించండి,” అన్నాడు నరస సింహుడు.

“నీ ఇష్ట ప్రకారమే కానీ, పరదేశీ! నేనూ, మా ప్రజలూ నీకు సదా కృతజ్ఞులం,” అంగీకారం తెలియజేశాడు మహారాజు.

ఉన్న తక్కువ వ్యవధిలోనే పెళ్ళి ఎంతో ఘనంగా చేశాడు అశృ సింహుడు. బెంగ నగరం అంతా పెళ్ళికి తరలి వచ్చింది. పెళ్ళి అయ్యాక నృత్య గానాలు జోరుగా సాగాయి. మత్స్య కుమారుడు తెడ్లు రెండు చేతులతో పట్టుకుని గెంతుతూ పాడిన, “పెద్ద పెద్ద వాగులో, ఎన్ని వేల చేపలో! ఎన్నో ఉన్నవి కానీ, ఎల్లప్పుడు కాదులే!” పాట అందరికీ బాగా నచ్చింది.

ఆత్రవింద అత్త వారింటికి బయలు దేరాల్సిన సమయం వచ్చింది. రెండు రథాల నిండా సారె నింపి అరణంగా ఇచ్చాడు అశృ సింహుడు. అంతే కాకుండా పది దాసీలతో సహా ఇంకో రెండు రథాలు ఇచ్చాడు.

“ఇంత మంది దాసీలు ఎందుకు మామ గారూ! మా దగ్గర ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు,” అభ్యంతరం తెలిపాడు నరస సింహుడు.

“ఫరవా లేదు అల్లుడు గారూ. మీదసలే పెద్ద రాజ్యం. ఇంకో పది మంది దాసీలు మీకు భారం కారు. కానీ మూడు పల్లెలే ఉన్న మా రాజ్యానికి కొంత ఖర్చు కలిసి వస్తుంది,” చెప్పాడు మహారాజు.

“ఓహో! ఇందుకన్న మాట అరణాలు పెట్టేది,” ఆశ్చర్య పోయాడు యువరాజు.

“ఇవే కాకుండా మీ ఇద్దరి కోసం ఇంకో రథం ప్రత్యేకంగా సిద్ధం చేశాం. మీరు అందులో బయలు దేరండి,” అన్నాడు అశృ సింహుడు.

“లేదు మామగారూ. నేనూ ఆత్రా, మా షట్‌కళ్యాణి మీదే ప్రయాణిస్తాం. అసలే దాని మనసు చాలా సున్నితమైనది. తిరుగు ప్రయాణంలో దాన్ని పట్టించుకోలేదని తన మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది,” అన్నాడు యువరాజు.

“కానీ ఆ గుర్రం పరమ బద్ధకస్తురాలు. దాన్ని క్రితం సారి మేము పరిగెత్తించలేక, రథంలో తీసుకు వెళ్ల వలసి వచ్చింది,” సందేహం వ్యక్తం చేశాడు మహారాజు.

“దానికి ఒక చిట్కా ఉంది. షట్‌కళ్యాణికి ఒక పాట అంటే మిక్కిలి మక్కువ. అది పాడితే వెంటనే దౌడు తీస్తుంది. మీరు దాన్ని ఇక్కడికి రప్పించండి,” అర్థించాడు నరస సింహుడు.

షట్‌కళ్యాణి రాగానే ముందు తను అధిరోహించి, తరువాత ఆత్రవిందకు తన ముందు కూర్చోవడానికి సహాయం చేశాడు యువరాజు. పండు కోతి కిచ కిచలాడుతూ వచ్చి నరస సింహుడి వీపుని కరుచుకుంది. యువరాజు గొంతు సవరించుకున్నాడు.

“ఆగండి అల్లుడు గారూ! పాట పాడడం మానేశాను అన్నారు కద?” అడ్డు పడ్డాడు అశృ సింహుడు.

“మామగారూ! మీకు తెలీనిదేముంది? ‘వారిజాక్షులయందు, విత్తంబు యందు, వీర బాహుడి ముందు, షట్‌కళ్యాణి ముందు బొంక వచ్చును’ అన్న ఆర్యోక్తి వినలేదా?” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“మొదటి భాగం విన్నట్టున్నాను. సరే అలాగే కానివ్వండి,” అడ్డు తొలిగాడు మహారాజు.

“అందరు ఇంట్లో వెచ్చగా, మనం బయట కచ్చగా. పదవే పదవే పోదాం,” అంటూ పాడాడు నరస సింహుడు.

షట్‌కళ్యాణి పరుగు మొదలు పెట్టింది. వెనుకనే సారె, దాసీలతో నిండి ఉన్న రథాలు దాన్ని అనుసరించాయి.

***

దోమ దేశం రాజ ధానిలోకి ప్రవేశించగానే దారికి ఇరు వైపులా బారులు తీరి నిలబడి ఉన్న జనం జయ జయ ధ్వానాలు పలుకుతూ వారిని ఆహ్వానించారు.

మళ్ళీ అదే సందేహం వచ్చింది నరస సింహుడికి. “వీరికి ఎటుల తెలియునో కానీ, మేము బయటకు వస్తే చాలు, బాటకు ఇరు వైపులా తయారగుదురు,” అనుకున్నాడు.

సూటిగా రాజ మందిరానికి చేరుకున్నాడు యువరాజు. కోతిని భుజం మీద ఎక్కించుకుని, ఆత్రవింద చేయి పట్టుకుని వడి వడిగా నీరస సింహుడి శయనాగారానికి వెళ్ళాడు.

“జయము, జయము యువరాజుల వారికి,” అంది ద్వారం దగ్గర నిలబడి ఉన్న చెలికత్తెలలో ఒకతి.

“తండ్రి గారు నిద్ర పోవుచున్నారా?” అడిగాడు ఆమెని నరస సింహుడు.

“లేదు యువరాజా! వారు తమ సభలో కొలువు తీరి ఉన్నారు,” వినయంగా సమాధానమిచ్చింది చెలికత్తె.

“అదేమిటి?” ఆశ్చర్యపోయాడు యువరాజు. “నేను కోతి కోసం బయలు దేరినప్పుడు చాలా నీరసంగా పక్క మీద శయనించి ఉన్నారు. ఇప్పుడేమో కొలువు తీరి ఉన్నారా?”

గిర్రున వెనక్కి తిరిగి, ఆత్రవింద, కోతితో సహా రాజసభ వైపు వడి వడిగా అడుగులు వేశాడు నరస సింహుడు. సభలో ప్రవేశించగానే విపరీతమైన ఆశ్చర్యం కలిగింది అతనికి. నీరస సింహుడు హుందాగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏదో సమావేశం జరుగుతున్నట్టు ఉంది. మంత్రి వృద్ధ భట్టు చెప్తున్నది శ్రద్ధగా వింటున్నాడు మహారాజు.

“నాన్న గారు, నేను కొండ మీద కోతిని తీసుకుని వచ్చాను,” పెద్ద గొంతుతో ప్రకటించాడు నరస సింహుడు.

నీరస సింహుడు తల ఎత్తి చూశాడు. కుమారుని చూడగానే ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కాని ఆయన యువరాజు భుజం మీద కోతిని చూడ లేదు.

“అదేమిటి కుమారా, అందమైన నాతిని పక్కన పెట్టుకుని కోతి అంటున్నావు? దేశాటనం వల్ల నీకు మతి భ్రమణం కలగలేదు కద?” అన్నాడు మహారాజు.

“భుజం మీద చూడండి నాన్న గారూ,” కోపంగా అన్నాడు నరస సింహుడు.

మహారాజు తన భుజం మీద చూసుకున్నాడు. “ఎప్పటిలానే భుజ కీర్తులు ఉన్నాయి, అదేనా నువ్వు నన్ను చూడమంది?” అడిగాడు.

“అహో! మీ భుజం కాదు, నా భుజం మీద!” విసుగ్గా అన్నాడు యువరాజు.

అప్పుడు గమనించాడు నీరస సింహుడు పండు కోతిని. “ఓ, ఐతే మేము పంపిన సందేశం నీకు చేరలేదన్న మాట,” మెల్లగా అన్నాడు.

“సందేశమా? ఏం సందేశం?”

“వాయు కుమారుడనే వార్తాహారుడితో నీకు సందేశం పంపాను. అతను వాయువేగంతో పరిగెట్ట గల శక్తి ఉన్న వాడు. కానీ అతడు నిన్ను చేరుకోలేకపోయినట్టు ఉన్నాడు,” నీరసంగా అన్నాడు నీరస సింహుడు.

“నేను తూర్పు వైపు కద వెళ్ళింది! అతను బహుశా పడమటి వైపు పరిగెత్తి ఉంటాడు. ఇంతకీ సందేశం ఏమిటో చెప్తారా?”

“వైద్యుల వారు తన తాళపత్ర గ్రంథం తప్పుగా చదివారట. నేను తినాల్సింది కొండ మీది కోతి గుండె కాదట. కొండె మీది గోతి కుండె అట. అది చెప్పి నిన్ను వెనక్కి రప్పించడానికే వాయుకుమారుడిని పంపించాను.”

“గోతి కుండా? అదేమిటి?”

“అది ఒక అపురూపమైన వన మూలిక. మన దోమ దేశానికి ఈశాన్యంలో ఉన్న కొండెల్లో దొరుకుతుంది. అది తినగానే నా అస్వస్థత చిటికెలో మాయమయ్యింది. నన్ను మన్నించు కుమారా! ఎంతో కష్ట పడి కొండ మీద కోతిని తెచ్చావు. కానీ అది ఇప్పుడు మనకు అవసరం లేదు.”

“అయ్యో! అదేం మాట నాన్న గారూ! మీ ఆరోగ్యం బాగు పడింది, నాకంతే చాలు. నా అభిప్రాయం ప్రకారం పండు కోతికి కూడా ఈ విషయం పట్ల ఎలాంటి అభ్యంతరమూ ఉండ కూడదు.”

“అలా ఐతే నేను దీన్ని పెంచుకుంటా,” ఉత్సాహంగా అంది ఆత్రవింద.

“తప్పు ఆత్రా! ముసలి కోతులని పెంచుతాము అనకూడదు,” అన్నాడు నరస సింహుడు.

“ఇంతకీ ఈ కన్యామణి ఎవరు?” అడిగాడు నీరస సింహుడు.

“మీ మొదటి కోడలు నాన్న గారూ. కోతిని వెతుకుతూ నేను చేసిన యాత్రలో చింతదేశపు యువరాణి ఐన ఈ ఆత్రవిందని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆత్రా, ఈయనే మా నాన్న గారు,” అన్నాడు నరస సింహుడు ఆత్రవింద వైపు తిరిగి.

ఐతే ఆత్రవింద మొహం ఎరుపెక్కి ఉండడం చూసి ఆశ్చర్యపోయి, “అదేమిటి? ఎందుకంత కోపం?” అడిగాడు.

“లేకపోతే? నేను, మొదటి కోడలినా? దాని అర్థం మీకు ఇంకొన్ని వివాహములు చేసుకునే ఉద్దేశం ఉందనే కద?” హుంకరించింది ఆత్రవింద.

నాలుక కరుచుకున్నాడు నరస సింహుడు. “నేను వేరే వివాహములు చేసుకోకపోయినా కూడా, నువ్వు మా నాన్న గారి మొదటి కోడలివే అగుదువు కద. అదన్న మాట. ఆ! నాన్న గారూ, నాదొక చిన్న కోరిక,” అన్నాడు యువరాజు తండ్రి వైపు తిరిగి.

“చెప్పు కుమారా? ఏమా కోరిక?”

“ఈ దేశాటనం వల్ల నా ఖడ్గ శిక్షణకు అంతరాయము వాటిల్లినది. రేపే వీరబాహుడితో కత్తి యుద్ధానికి ఏర్పాటు చేయండి, చాలు,” అన్నాడు నరస సింహుడు.

“అలాగే!” మాట ఇచ్చాడు మహారాజు.

***

మళ్ళీ వ్యాయామ శాల వద్దే కత్తి సాముకి ఏర్పాట్లు జరిగాయి. ఐతే ఈ సారి పోటీని వీక్షించడానికి వేలమంది ప్రజలు తరలి వచ్చారు. దానికి కారణం, నరస సింహుడు ప్రతి ఒకరిని దండోరా వేయించి ఆహ్వానించడమే.

“ఇంత మంది ఎందుకు యువరాజా? అసలే ఆ వీర బాహుడు జనన్ని చూస్తే మదించి పోతాడు. వానికి కీర్తి కండూతి ఎక్కువ. మీకు వీలైనన్ని ఎక్కువ గాట్లు పెట్టునేమో?” సందేహం వెలిబుచ్చాడు వృద్ధ భట్టు.

“పెక్కు మంది ముందు వాని పీచమణచుట కొరకే ఈ ఏర్పాటు,” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“కత్తి సాము ప్రారంభించండి,” ఆజ్ఞాపించాడు మహారాజు.

ఆత్రవిందను చూసి కన్ను గీటి, దోమాంబకు మనసులోనే నమస్కారం చేసుకొని గోదాలోకి దిగాడు యువరాజు.

“మీరు దేశాటనకు వెళ్ళిన రోజు నుండి ఈ కత్తిని పదును పెడుతూనే ఉన్నాను. చాలా వాడిగా ఉంది,” అన్నాడు వీర బాహుడు.

“ఉండును, ఉండును. నా దగ్గర ఉన్నది కూడా ప్రత్యేకమైన ఖడ్గమే. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి,” గర్జించాడు నరస సింహుడు.

అలా అన్న వెంటనే వేగంగా కదిలి తన కత్తిని వీర బాహుడి చేతులకు, కాళ్ళకు, భుజాలకు, చాతీకి తగిలించాడు.

“ఇదేమి విన్యాసము? ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు,” హేళనగా అంటూ యధా విధిగా యువరాజు ఒంటి నిండా గాట్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు వీరబాహుడు.

అంతలోనే అకస్మాత్తుగా ఒంటి మీద ఏవో పురుగులు పాకుతునట్టు మెలికలు తిరిగిపోయాడు వీరబాహుడు. కింద పడిపోయి దొర్లడం మొదలు పెట్టాడు. నరస సింహుడు ఆ అవకాశం వదులుకోకుండా శర వేగంగా కదిలి వీరబాహుది ఒంటి నిండా పదునైన గాట్లు పెట్టాడు.

ఒకే ఒక నిముషంలో పోరాటం ముగిసి పోయింది. కేకలు పెడబొబ్బలు పెడుతున్న వీరబాహుడిని నలుగురు మల్ల యోధులు గోదానుంచి లేవనెత్తి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు.

“భళా కుమారా, నీ ఖడ్గ విద్యా విన్యాసం సంస్తుతి పాత్రం!” మెచ్చుకున్నాడు నీరస సింహుడు. కత్తి సాము వీక్షించడానికి వచ్చిన ప్రజలంతా హర్ష ధ్వానాలు చేశారు. ఆత్రవింద, వృద్ధ భట్టు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు.

నరస సింహుడు విజయ గర్వంతో తల ఎగరేశాడు. అతని పెదవుల మీద చిరు మందహాసం రూపు దిద్దుకుంది. జ్వాలా ద్వీపం వదిలి వస్తున్నప్పుడు గండ్ర మండ్రలని అతను అడిగింది కొంత దురద గుండాకు ఇమ్మని. అదే ఆకు పసరుని తన కత్తికి పట్టించి, వీరబాహుడిని కత్తి సాములో సులువుగా ఓడించగలిగాడు నరస సింహుడు.

ఆ తరువాత యువరాజు సాహస యాత్ర విజయవంతంగా ముగిసినందుకు దేవికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, దోమాంబ ఆలయం దిశగా బయలుదేరింది నీరస సింహుడి పరివారం.

(అయిపోయింది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

16 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 25 (ఆఖరి భాగం)

 1. రవి says:

  నరస సింహుడు – సునీల్
  నీరస సింహుడు – బ్రహ్మానందం
  వీరబాహుడు – ఆలీ
  ఆత్ర వింద – ఓ తెలుగు ఖూనీ చేస్తూ మాట్లాడే బాలీవుడ్డు హీరోవిను

  ఇదీ కాస్టింగు.

 2. chavakiran says:

  బాగుంది.

 3. Kanth says:

  సినిమా చివరలో, రోలింగ్ క్రెడిట్స్‌తో “యమ కింకరి, యమానందల హరి” పాట వినిపిస్తే బాగుంటుంది – ప్రేక్షకులు ఎలాగూ ఉండరు కాబట్టి.

  చాలా బాగుంది మీ జ్వాద్వీర కథ. దీనికి పార్ట్-2 ఉంటుందా?

  • Murali says:

   Part 2 ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇవే పాత్రలతో చిన్న కథలు రాయొచ్చు, like “నరస సింహ కథా సరిత్సాగరం”లా. 😉

 4. Sumna says:

  Awesome. Loved it.

 5. భళా! బాగుంది. ముగింపే సినిమాటిక్‌గా ఉంది 🙂

 6. jyothi reddy says:

  Muraliji,
  Super….

 7. ramesh says:

  “వారిజాక్షులయందు, విత్తంబు యందు, వీర బాహుడి ముందు, షట్‌కళ్యాణి ముందు బొంక వచ్చును”… యిది మాత్రం సూపరు!

 8. jonathan says:

  keka
  inka meeru ilantivi raayali
  congrats murali

 9. చాలా బాగుంది..

 10. ఒక ఐటం సాంగు కూడా ఉంటే బాగుండేది. యమ కింకరి, యమానందల హరి సాంగుని రీమిక్సు లో ఐతే సూపరు. నవల ఇరగ దీసారు. దీనికి పీకుడు ఫార్ములా పెట్టీ, లాగి పీకుడు తీసెయ్యచ్చు. బండ క్రిష్ణ కి దురద గుంటాకు ద్వీపం లెవల్లో ఒక జానపద సైన్మా తీయలని దురద ఉందిట, అడిగి చూడరాదండి?

 11. Vamsi says:

  Super like..!! Keep writing mastaru..

 12. sreenivas varanasi says:

  .ఈ కథ మొత్తం బహు హాస్య చతురతతో నిండి మమ్ములను బహు అలరించినది… కడుపుబ్బా నవ్వుకొంటిని… రేపు ఎన్నాడైననూ నా పిల్లలు చక్కని కథ చెప్పమని మారాం చేసినచో తప్పక ఈకథను చెప్పుదును అని అనుటలో ఎటువంటి సందేహము లేదు.
  ఈకథను అల్లరి నరేష్ తో తీస్తే తప్పక సూపర్ డూపర్ హిట్టు అగునని నా అభిప్రాయం…. ఎన్టీఆర్ యమలీల వలే కలగన్నుట్టు కథ పెట్టిన సెట్ అగును…

 13. sreenivas varanasi says:

  కథ ముగింపులో పుట్ట కరిగించు ప్రయత్నంలో కథానాయకుడు సఫలం అయినట్టుగా వుంటే బాగుండేది…
  రక రకాలైన పాటలు కేవ్వుకేక… రింగారింగా… లాంటి పాటలు పాడితే పుట్టకరిగినట్టుగా వుంటే బాగుండేది

  • Murali says:

   ఇది జెట్ స్పీడ్‌తో, ఫ్రీ టైంలో రాసిన కథ సార్. బోలెడు ఇంప్రూవ్ చేయొచ్చు. మీరన్నట్టు ఒక వేళ ఇది ఎవరైన సినిమా తీస్తే, అప్పుడు నగిషీలు దిద్దుతాను లెండి. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s