జ్వాలా ద్వీప రహస్యం – 18


నెమ్మదిగా స్పృహ వచ్చింది నరస సింహుడికి. తను ఒక హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు అని గమనించాడు అతను. కాస్త మత్తు వదలగానే గుర్తుకి వచ్చింది అతనికి. తను నదిలో పడి కొట్టుకుపోవడం, పండు కోతి తప్పి పోవడం…

కొంప తీసి తను చనిపోయి స్వర్గం చేరుకున్నాడా అన్న సందేహం వచ్చింది యువరాజుకి. తన చుట్టు పక్కల చూశాడు.

అతను పడుకుని ఉన్న హంసతూలికా తల్పం ఒక విశాలమైన మందిరంలో ఉంది. ఆ గది అచ్చం రాజభవంతిలోని హర్మ్యంలా ఉంది. “ఓహో, స్వర్గం కూడా ఇలానే ఉంటుందన్న మాట. కొంచెం వేరే రకంగా కట్టిస్తే దేవతల సొమ్మేం పోతుందో,” గొణుక్కున్నాడు నరస సింహుడు. అతనికి కాస్త చిరాకు వచ్చిన మాట వాస్తవం.

గది బయట అడుగుల చప్పుడు వినిపించింది అతనికి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. “గృహము పెకిలించి, ఈ స్వర్గంలో కూడా మేలుకొలుపు బృందం ఉందా ఏమిటి? హతవిధి!” అని భయపడ్డాడు.

ఐతే లోపలికి అశృసింహుడు తన పరివారంతో ప్రవేశించాడు. విపరీతంగా ఆశ్చర్యపోయాడు నరస సింహుడు.

“అయ్యో, మీరు పరివారంతో సహా స్వర్గస్తులైనారా, మహారాజా?” అడిగాడు అశృసింహుడిని ఉద్దేశించి.

మహారాజు భృకుటి ముడిపడింది. వెంటనే అర్థమయ్యింది అతనికి.
“లేదు పరదేశీ, మేము స్వర్గమునకు రాలేదు. నీవే ఇంక భూమి మీద క్షేమంగా ఉన్నావు,” బదులు చెప్పాడు.

“ఓ! ఐతే నదిలో మునిగిపోకుండా నన్ను రక్షించింది మీరే అన్న మాట,” కృతజ్ఞత తన గొంతులో ఉట్టిపడుతూండగా అన్నాడు నరస సింహుడు.

“నేను కాదు. మా ఆస్థాన జాలరి. చేపలకోసం వలవేస్తే నువ్వు దొరికినావు వానికి,” వివరించాడు మహారాజు.

“మీకు ఆస్థాన జాలరి కూడా ఉన్నాడా?” ఆశ్చర్యంగా అడిగాడు నరస సింహుడు.

“అంటే మా దేశంలో చేపలు పట్టేది వాడొక్కడే. వాడిని ఆస్థాన జాలరి చేసిన యెడల, వాడు మాకు విశ్వాసపాత్రముగా ఉంటాడు కదా అని నేనే వాడికి ఆ పదవి ఇచ్చితిని,” గర్వంగా చెప్పాడు మహారాజు.

“సొబగు సొబగు!” అన్నాడు నరస సింహుడు. అంతలో అతనికి గుర్తు వచ్చింది. “నా గుర్రం షట్‌కళ్యాణి ఏమయినది?” ఆందోళనగా అడిగాడు.

“అశ్వము కూడా క్షేమముగానే ఉన్నది. కానీ దాని స్వారీ చేసి గుర్రపు శాలకు తీసుకునిపోదమని ఎంత ప్రయనించిననూ, అది ఒక్క అంగుళం కూడా కదల లేదు. ఆఖరికి దాన్ని ఒక నాలుగెడ్ల బండిలో ఎక్కించి తీసుకు వెళ్ళ వలసి వచ్చింది,” కొంచెం చిరాగ్గా అన్నాడు మహారాజు.

“అందరు ఇంట్లో వెచ్చగా, మనము బయట కచ్చగా…” తనకు తెలీకుండానే అనేశాడు యువరాజు.

“అయ్యో సంధి ప్రేలాపన మొదలు పెట్టినాడు. మీ దగ్గర ఉండే ఆ చేదు గుళిక ఒకటి వేయండి,” ఖంగారుగా అన్నాడు అశృసింహుడు.

“అక్కర్లేదు. ఆ పాట పాడితే కానీ మా షట్‌కళ్యాణి కదలదు. అది చెప్పుటయే నా ఉద్దేశము,” కోపంగా అన్నాడు నరస సింహుడు.

“కానీ మాకు నీ పండుకోతి దొరకలేదు. గృహము పెకిలించి అది నువ్వు అక్కడికి చేరుకునేంతలోనే మరణించినదా?” ప్రశ్నించాడు అశృసింహుడు.

“తెలీదు! అది నా నుంచి విడువడి, దూరంగా ఉన్న ఒక ద్వీపము వైపు కొట్టుకు పోయినది. ఏమయినదో ఏమో,” బాధగా అన్నాడు నరస సింహుడు.

“అది వెళ్ళినది జ్వాలా ద్వీపానికే. మా కుమార్తె ఆత్రవింద కూడా అక్కడే ఉంది. చూశావా పరదేశీ! ఇప్పుడు మన ఇద్దరి లక్ష్యము ఒక్కటే అయినది,” గంభీరంగా అన్నాడు అశృసింహుడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

One Response to జ్వాలా ద్వీప రహస్యం – 18

  1. wanderer says:

    “గృహము పెకలించి” ఈ expression అదిరిపోయింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s