జ్వాలా ద్వీప రహస్యం – 15


“మీ అదృష్టం బాగున్నది. నేనింకా పాట మొదలు పెట్టలేదు. పెట్టి ఉండిన ఎడల మా షట్‌కళ్యాణి అంత తొందరగా ఆగదు. చెప్పండి, ఎందుకు నన్ను ఆపినట్టు?” అడిగాడు నరస సింహుడు.

“నిన్ను చూస్తే ఎవరో యోధుడు అనుకున్నాను, నువ్వు గాయకుడివి కూడానా? భళా!” అన్నాడు మహారాజు.

“మరే, మా షట్‌కళ్యాణి పై స్వారీ చేయవలసి వచ్చిన, ఎవరైననూ గాయకుడు కావలసిందే. ఇంతకీ నన్ను ఏల ఆపితిరో చెప్పుము,” అన్నాడు నరస సింహుడు.

“ప్రకటన నీవు వినే ఉందువు. నా నామధేయము అశృసింహుడు. నా అనుంగు పుత్రి ఆత్రవింద జ్వాలా ద్వీప ప్రాంతమున అదృశ్యం ఐనది. అక్కడ వెళ్ళి వెదుకు సాహసం చేయువారు ఎవరూ కాన రావడము లేదు. నిన్ను చూస్తే మహా వీరుడిలా కనిపిస్తున్నావు. నా కుమార్తెను రక్షించి తీసుకుని రాగలవా? అటులైన నీకు ఆమెని ఇచ్చి వివాహం చేసెదను, నా అర్ధ రాజ్యం ఇచ్చెదను,” ఉద్వేగంతో అన్నాడు మహారాజు.

“రాజ్యం అంటే ఏ మాత్రము ఉంటుందేమిటి?” అడిగాడు నరస సింహుడు.

“ఈ కనపడుతున్న నాలుగు వీధులూ, ఇదే మా రాజధాని బెంగ నగరము. ఇది కాకుండా ఇంకా ఒక మూడు పల్లెలు,” చెప్పాడు అశృసింహుడు.

“ఇదా మీ రాజ్యం, ఇందులో నాకు సగం ఇస్తారా?” బోలెడు ఆశ్చర్య పోయాడు నరస సింహుడు.

కాస్త చిన్న బుచ్చుకున్నాడు అశృసింహుడు. “మీ రాజ్యం ఎంత పెద్దగా ఉంటుందేంటి?” ఉక్రోశంగా అడిగాడు.

“మాది చాలా పెద్ద రాజ్యము లెండి. నలభై వీధులు కల రాజధాని, ఇంకో నలభై పల్లెలు ఉంటాయి,” గర్వంగా చెప్పాడు యువరాజు.

“అబ్బో. పెద్ద రాజ్యమే. మా రాజ్యము సరి తూగ జాలదు. కాని అర్ధ రాజ్యం కన్నా విలువయినది మా కుమార్తె ఆత్రవిందతో పాణి గ్రహణము. ఆమె భువనైక సుందరి. ఆలోచించుకొనుము,” అర్థించాడు అశృసింహుడు.

“మీరన్నది నిజము కావచ్చు. కాని నా శిరము మీద అత్యంత గురుతర బాధ్యత మోపబడి ఉన్నది. కొండ మీది కోతిని వెతికి పట్టుట నా ప్రథమ కర్తవ్యము. దాని తారువాతే మిగతావి ఏవైనా,” వివరణ ఇచ్చుకున్నాడు నరస సింహుడు.

“కొండ మీద కోతి నీకు దొరుకుట తథ్యము. మా బెంగ నగర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న కొండల మీద ఒక పండు కోతి ఉన్నది. అది పెద్దగా పరిగెత్తనూ జాలదు. కావున దాని గురించి చింత మాని, జ్వాలద్వీపమునకేగి ఆత్రవిందను రక్షించి తీసుకొని రమ్ము,” విజ్ఞప్తి చేశాడు అశృసింహుడు.

“అసలే పండు కోతి అంటున్నారు, నేను ఆలశ్యం చేసిన అది గుటుక్కుమనే ప్రమాదమున్నది. నేను వెంటనే వెళ్ళు అవసరము ఎంతైనా ఉన్నది,” తొందర పడ్డాడు నరస సింహుడు.

“కోతి దొరికిన తరువాత, రాజకుమార్తెని రక్షించుదువా?” ఆశగా అడిగాడు అశృసింహుడు.

“కోతి దొరికిన వెంటనే నేను త్వరిత గతిన దోమదేశము చేరుకొనవలెను. క్షమించండి. కోతిని అక్కడ అప్పగించిన పిదుప మరల వచ్చెదను,” అన్నాడు నరస సింహుడు.

“నువ్వు తిరిగి వచ్చేంతలో మా పుత్రి ఆత్రవింద గుటుక్కుమనే అవకాశము ఉన్నది. ఐననూ చేయునది ఏమున్నది. నీ కార్య సాధనార్థమై నువ్వు బయలు దేరు పరదేశీ,” భారంగా నిశ్వసించాడు అశృసింహుడు.

నరస సింహుడు పాట మొదలు పెట్టగానే షట్‌కళ్యాణి కదిలింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

One Response to జ్వాలా ద్వీప రహస్యం – 15

  1. Jyothi Reddy says:

    “మాది చాలా పెద్ద రాజ్యము లెండి. నలభై వీధులు కల రాజధాని, ఇంకో నలభై పల్లెలు ఉంటాయి,” HAHA
    Waiting for next episode…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s