జ్వాలా ద్వీప రహస్యం – 11


“మారాజుది దొడ్డ మనసు. ముందు పూర్తి భోజనం వడ్డిస్తాను. తరువాత పళ్ళెం భోజనం వడ్డిస్తాను. కానీ రెండింటికి ముందే డబ్బులివ్వాలి,” తెలివిగా అంది పూటకూళ్ళమ్మ.

“అలాగే ఇస్తాలే. కాని నేను మారాజుని కాను. ఇంకా యువరాజునే,” హుందాగా అన్నాడు నరస సింహుడు.

అర్థం కాలేదు పూటకూళ్ళమ్మకి. తల బరుక్కుంటూ, “అలాగే బాబు గారు, ఇప్పుడే పూర్తి భోజనం పట్టుకొస్తాను,” అంటూ లోపలికి వెళ్ళింది.

చుట్టు పక్కల ఉన్న వాళ్ళతో మాటల్లో పడ్డాడు నరస సింహుడు. “మీరెవరైనా కొండ మీద కోతిని చూశారా?” అడిగాడు.

“ఈ ప్రాంతంలో అసలు కొండలు లేవు పరదేశీ! ఒకటో రెండో కోతులు ఉన్నాయి. ఏం? మీ వృత్తి కోతులాడించడమా?” అడిగాడు ఒక గ్రామీణుడు.

గుర్రుగా చూశాడు నరస సింహుడు. “అంటే కోతి గురించి ఆసక్తి చూపించేది కేవలం కోతులాడించే వాళ్ళు మాత్రమేనా?” అడిగాడు కాస్త కోఫంగా.

“మరి ఆడించడానికి కాకపోతే దేనికి పరదేశీ?” అడిగాడు ఇంకొక గ్రామీణుడు.

“అది పరమ రహస్యం. ఐననూ, కొండలు లేని ఈ ప్రాంతంలో ఉన్న కోతులు మాకు అవసరం లేదు. ఇంకేదైనా ప్రాంతంలో ఉన్నట్టు మీరు ఎరుగుదురా?” ప్రశ్నించాడు వాళ్ళని.

“లేకేమి. ఇక్కడికి పది కోసుల దూరంలో ఉన్న కొండపల్లిలో అన్నీ కొండలే, ఎటు చూసినా కోతులే,” సెలవిచ్చాడు ఒక ముసలాయన.

“సొబగు, సొబగు. ఐతే మా పని సులభము అయినది. శీఘ్రమే కొండపల్లికి దారి చూపించండి,” ఆనందంగా అన్నాడు నరస సింహుడు.

“కానీ దేవరా, కొండపల్లిలోని కోతులు ఎందులకో కొండల మీద ఉండవు. ఎప్పుడూ నేల బారునే సంచరిస్తూంటాయి,” చెప్పాడు అదే ముసలాయన.

నరస సింహుడికి చిర్రెత్తుకొచ్చింది.

“మీ ముఖాలు వేడెక్కుగాక! మాకు కావలసింది కొండ మీద ఉన్న కోతి మాత్రమే అని స్పష్టం చేసి ఉంటిని కద!” కోపంగా అరిచాడు.

“కొండ మీది కోతులను మచ్చిక చేసుకొనుట కష్టము. నేల మీద తిరిగే కోతులకు త్వరగా శిక్షణ ఇవ్వవచ్చు. వాటిని త్వరితమే ఆడించవచ్చు,” సలహా చెప్పాడు మొదటి గ్రామీణుడు.

“ఈఈఈ! మేము కోతులాడించే వారము కాదు. దయ ఉంచి కొండల మీద కోతులుండే ప్రాంతమేదో చెప్పండి,” కళ్ళలో నీళ్ళు తిరుగుతూండగా అర్థించాడు నరస సింహుడు.

“మాకు తెలిసి ఈ చుట్టు పక్కల అలాంటి ప్రాంతాలు ఏవీ లేవు,” చెప్పాడు రెండవ గ్రామీణుడు.

“ఆ సంగతి అర్థమయినది. ఆ ప్రాంతమేదో నేనే గాలించెదను,” కోపాన్ని అణుచుకుంటూ పెద్దగా తేన్చాడు నరస సింహుడు.

“పళ్ళెం భోజనం పట్టుకుని రమ్మంటారా?” వినయంగా అడిగింది పూటకూళ్ళమ్మ.

“అక్కర్లేదు. అదేంటో ఆశ్చర్యంగా, పూర్తి భోజనము ముగించగానే ఆకలి తీరిపోయినది. పడుకోవడానికి చోటు చూపిస్తే ఈ రాత్రికి నిద్రపోయి రేపు ఉదయమే బయలు దేరుతాను,” అన్నాడు నరస సింహుడు.

“రేపే వెళ్ళిపోతారా? మీరు కనీసం ఒక పది రోజులుంటారేమో, మీకు మూడు పూట్లా, పూర్తి భోజనం మరియు పళ్ళెం భోజనం పెట్టి సేవ చేద్దామనుకొంటినే,” బాధగా అంది పూటకూళ్ళమ్మ.

“మాకు అంత తీరిక లేదు అవ్వా! అత్యవసరమైన పనులు బోలెడు ఉన్నాయి,” గంభీరంగా అన్నాడు నరస సింహుడు.

“అంతా దైవేఛ్ఛ! మీ పేరు చెప్పుకుని ఈ పూటకూళ్ళింటికి ఇంకో రెండు గదులు అదనంగా కట్టించుదామనుకున్నాను,” నిట్టూర్చింది పూటకూళ్ళమ్మ.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

2 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 11

 1. Jyothi Reddy says:

  Muraliji,

  Can I expect your comments on our political changes in AP sometime soon?

 2. Amun says:

  “ఈఈఈ! మేము కోతులాడించే వారము కాదు. దయ ఉంచి కొండల మీద కోతులుండే ప్రాంతమేదో చెప్పండి,” కళ్ళలో నీళ్ళు తిరుగుతూండగా అర్థించాడు నరస సింహుడు.
  🙂

  nice serial, i love it

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s