జ్వాలా ద్వీప రహస్యం – 10


దోమదేశం పొలిమేరలు దాటగానే మశకారణ్యం మొదలయ్యింది. షట్ కళ్యాణి ఆపకుండా దౌడు తీస్తూంది. మద్యాహ్నానికి గుర్రం అలిసిపోక పోయినా నరస సింహుడికి వొంటి నొప్పులు మొదలయ్యాయి. కళ్ళెం బిగించగానే షట్ కళ్యాణి పరుగు తగ్గించి మెల్లగా అడుగులు వేస్తూ చివరకు ఆగింది.

“హాయిగా కూర్చుని స్వారీ చేస్తున్న నాకే వొళ్ళు హూనమైనది. పాపం షట్ కళ్యాణి పరిస్థితి ఏమిటో?” తనలో తాను అనుకున్నాడు నరస సింహుడు.

షట్ కళ్యాణిని పచ్చిక మేయడానికి వదిలి తను ప్రయాణం మధ్యలో తినడానికి తెచ్చుకున్న తిండి పదార్థాలున్న మూటను విప్పాడు యువరాజు.

ఆ మూటలో నరస సింహుడికి నచ్చిన తినుబండారాలు అన్నీ ఉన్నాయి. “ఇవి ఒక మూడు రోజుల వరకూ సరిపోతాయి,” అనుకున్నాడు.

భోజనం కాగానే నిద్ర ముంచుకుని వచ్చింది నరస సింహుడికి. షట్ కళ్యాణి నీడలో పడుకుని నిద్రపోయాడు. కొన్ని గంటల తరువాత మొహం మీద చుర్రుమని సూర్య రశ్మి తాకి మెలకువ వచ్చింది. షట్ కళ్యాణి నరస సింహుడి నుంచి దూరంగా కదిలి వెళ్ళడంతో ఉన్న నీడ తొలిగిపోయి అలా జరిగింది.

“పద షట్ కళ్యాణి, విశ్రాంతి సమయం ముగిసింది. కర్తవ్యం నా వెన్ను చరిచి మరీ గుర్తు చేస్తోంది. మన ప్రయాణం తిరిగి మొదలు పెట్టాల్సిన తరుణం ఆసన్నమయ్యింది,” గుర్రాన్ని అధిరోహిస్తూ అన్నాడు నరస సింహుడు.

కానీ షట్ కళ్యాణి కదల్లేదు. “ఓహో, నువ్వు పాట పాడితే కానీ కదలవు కద! అలాగే కానీ. అందరు ఇంట్లో మత్తుగా, మనం బయట చెత్తగా, పదవే పదవే పోదాం,” పాడాడు నరస సింహుడు. షట్ కళ్యాణి అడుగు ముందుకు వేయలేదు.

“తప్పు పాడినట్టున్నా. ఆ పాట ఏంటబ్బా? ఆ! అందరు ఇంట్లో సుస్తిగా, మనం బయట మస్తుగా, పదవే పదవే పోదాం,” అంటూ పాడి చూశాడు. ఊహూ. లాభం లేకపోయింది.

అలా రక రకాలుగా పాడి ప్రయత్నించాడు నరస సింహుడు. కానీ షట్ కళ్యాణి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది.

కళ్ళలో నీళ్ళు తిరిగాయి నరస సింహుడికి. “రాచ బిడ్డను, నన్ను ఇలా బాధ పెట్టకు. నాకు చాలా కచ్చగా ఉంది,” అంటూ ఉత్సాహంగా ఒక కేక పెట్టాడు. “ఆ గుర్తొచ్చింది, అందరు ఇంట్లో వెచ్చగా, మనం బయట కచ్చగా. పదవే పదవే పోదాం,” అంటూ పాడాడు.

షట్ కళ్యాణి బిగ్గరగా సకిలించి దౌడు తీయడం మొదలు పెట్టింది.

సాయంత్రానికి మశకారణ్యం దాటాడు నరస సింహుడు. అల్లంత దూరంలో ఒక కుగ్రామం కనిపించింది. పొలిమేరల్లో ఒక గ్రామీణుడు ఎదురు పడ్డాడు.

“ఈ రాత్రికి బస చేయడానికి ఇక్కడ వసతి ఏదైనా ఉందా?” అతన్ని అడిగాడు నరస సింహుడు.

“ఒకే ఒక పూటకూళ్ళ ఇల్లుంది. అలా ముందుకు పోయి ఎడమవైపు తిరిగితే కనిపిస్తుంది,” చెప్పాడు ఆ గ్రామీణుడు.

“వెళ్ళకుండానే ఇక్కడినుంచే కనిపిస్తూందిలే!” ఎత్తైన గుర్రం మీద కూర్చుని ఉన్న నరస సింహుడు ఠీవీగా సెలవిచ్చాడు.

“చిత్తం. ఇక్కడంతా పూరి గుడిసెలే, మీ పట్నంలోలా భవంతులు వుండవు. కాని పూటకూళ్ళమ్మ భలే మంచి వంటకత్తె. మీరే చూస్తారుగా!” అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ గ్రామీణుడు.

పూటకూళ్ళ ఇల్లు బాగా సందడిగానే ఉంది. “ఇక్కడ కొంచెం సమాచారం రాబట్టచ్చు,” అనుకున్నాడు తనలో తాను నరస సింహుడు.

పూటకూళ్ళమ్మ అతన్ని చూసి చేటంత మొహం చేసుకుని ఆహ్వానించింది. “రా నాయనా, ఒక పూట భోజనం ఐదు వరహాలే. మీకు తృప్తి కలిగేవరకు భుజించవచ్చు. దీన్ని పూర్తి భోజనం అంటాము ఇక్కడ. అదే మీకు అంత ఆకలి లేకపోతే మూడు వరహాలకు పళ్ళెం భోజనం చేయొచ్చు. అందులో ఐతే నేను పెట్టినంతే తినాలి,” వివరించింది.

“అంటే పూర్తి భోజనం పళ్ళెంలో వడ్డించరా?” ఆశ్చర్యంగా అడిగాడు నరస సింహుడు.

“ఎందుకు వడ్డించం నాయనా, వడ్డిస్తాం. అదైతే పళ్ళేలు పళ్ళేలు వడ్డిస్తామన్నమాట,” చెప్పింది పూటకూళ్ళమ్మ.

“బాగా ఆకలిగా ఉంది. ఒక పూర్తి భోజనం, ఒక పళ్ళెం భోజనం వడ్డించు అవ్వా!” హుందాగా అన్నాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

3 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 10

  1. Shilpa says:

    Oka purthi bhojanam, oka pallem bhojanam :)! Murali gari mark anipinchukunnaru. Jandhyala gari level lo mee mark andariki cheruva avvalani ashistunnamu.

  2. Jyothi Reddy says:

    అందరు ఇంట్లో మత్తుగా, మనం బయట చెత్తగా, పదవే పదవే పోదాం,Super song Muraliji….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s