జ్వాలా ద్వీప రహస్యం – 8


అర్ధ రాత్రి! ఒంటి గంట! నరస సింహుడిని ఎవరో మెల్లగా తట్టి నిద్ర లేపారు. ఒక చిన్న అరుపుతో లేచి కూర్చున్నాడు అతను. ఎప్పుడూ ఏ మేలుకొలుపు బృందమో పాడే అపస్వరపు పాటలకు నిద్ర లేవడమే కానీ, ఇలా సున్నితంగా నిద్ర మేల్కొనే అలవాటు లేకపోవడంతో అలా జరిగింది.

కళ్ళు తెరిచి చూస్తే వృద్ధ భట్టు! “మంత్రి గారూ, వార్ధక్యం వల్ల మీకు నిద్ర పట్టదు కామోసు, కానీ నన్ను నిద్ర లేపనేల? కాసేపు పడుకోనివ్వండి. ఇంకో నాలుగు గంటల్లో ఠంచనుగా మేలుకొలుపు బృందం ఎలాగూ వచ్చేస్తుంది. అప్పుడు ఎటూ నిద్ర లేవక తప్పదు,” కాస్త చిరాగ్గానే అన్నాడు నరస సింహుడు.

“నేను మిమ్ములను నిద్ర లేపినది, నా నిద్ర లేమి వల్ల కాదు, యువరాజా! మహారాజు గారి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. పదండి బయలు దేరుదాం,” వినమ్రంగా అన్నాడు వృద్ధ భట్టు.

“నిన్న గుడికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కద. ప్రసాదము కూడా మనందరికంటే ఎక్కువగా భుజించినారు. ఇంతలో ఏమైనది?” ఆందోళనగా అన్నాడు నరస సింహుడు.

“పెరిగే వయసే కానీ, తరిగే వయసు కాదు కద యువరాజా! ఆయన ఆరోగ్యము అకస్మాత్తుగా క్షీణించినది. రాజ వైద్యుల వారు కూడా ఏతెంచి ఉన్నారు,” చెప్పాడు వృద్ధ భట్టు.

వడివడిగా మంత్రితో తన తండ్రి గారున్న మందిరానికి బయలుదేరాడు నరస సింహుడు. అక్కడ హంసతూలికా తల్పం మీద పవళించి ఉన్న నీరస సింహుడి చుట్టూ దోమ రాజ్యానికి చెందిన ప్రముఖులు గుమిగూడి ఉన్నారు. మెత్తని దిళ్ళకు శరీరం ఆనించి తల్పం మీదే కూర్చుని ఉన్న మహారాజు, యువరాజును చూడగానే దగ్గరకు రమ్మని సైగ చేశాడు.

“ఏమయ్యింది జనకా? ఈ ఆకస్మిక అనారోగ్యము ఏమి? ఎంత నీరసంగా కనిపిస్తున్నారో!” బాధగా అన్నాడు నరస సింహుడు.

అంత అస్వస్థతలోనూ గుడ్లురిమాడు నీరస సింహుడు. “కుమారా! ఎన్ని మార్లు చెప్పవలె, ఆ పదము వాడ వలదు అని? మా పేరు మాకు గుర్తుకొచ్చి హృదయ క్లేశము కలుగును,” కోపంగా అన్నాడు.

“మన్నించండి పితాశ్రీ! ఐనా ఆరోగ్యం బాగా లేనప్పుడు విశ్రాంతి తీసుకొనవలెను కానీ, ఈ అర్ధ రాత్రి సమావేశములు ఏల?” ఆవులిస్తూ అన్నాడు నరస సింహుడు.

“దానికి కారణం ఉన్నది యువరాజా! ఇంతకు ముందే మన రాజ వైద్యుల వారు నన్ను పూర్తిగా పరీక్షించి నా ఆరోగ్యము బాగు పడవలెనన్న ఒక్కటే మార్గము అని తెలిపినారు. అందులకే నీకోసం కబురు పెట్ట వలసి వచ్చినది,” వివరించాడు నీరస సింహుడు.

పక్కనే వున్న రాజ వైద్యుడు గొంతు సవరించుకుని, “పక్షము రోజుల్లో కొండ మీద కోతిని తీసుకుని వచ్చి, దాని గుండెను వండి మహా రాజు గారికి తినిపించని ఎడల వారు మనకు దక్కరు, యువరాజా! ఈ పని మీరు చేస్తేనే బాగుంటుంది అని మీ తండ్రిగారు అభిప్రాయ పడ్డారు. మన దగ్గర అట్టే వ్యవధి లేదు. అందుకే మిమ్మలని మంత్రి గారు ఇలా అర్ధాంతరంగా తీసుకుని వచ్చినారు,”అంటూ చెప్పాడు.

“కొండ మీద కోతా? మన దోమ దేశములో కొండలే లేవు కద!” నోరు తెరిచాడు నరస సింహుడు.

“అందుకే కుమారా! మన రాజ్యం దాటిన పిదుప ఇంకో నాలుగు దేశాలు దాటే వరకు కొండ ప్రాంతము రాదు. ఆ కొండల్లో పడి కొంత దూరం వెళ్తే కానీ అక్కడ కోతులు ఉండవు. ఉన్నా, చాలా అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ పని చేయాలంటే, ఎంతో శక్తి, సాహసం ఉండాలి.

నేనా, కదిలే పరిస్థితిలో లేను! ఇక మంత్రి గారూ, సేనాపతి గారూ, ఇక్కడ ఉండి రాజ్య భారం వహించుట అత్యవసరము. అంతే కాకుండా ఇది నీకు ఒక మంచి పరీక్ష అవుతుంది. ఏమంటావు?” అన్నాడు మహారాజు.

“తప్పకుండా తండ్రిగారూ! రాజకుమారుడన్నాక సాహస కృత్యం చేసి తీర వలె. దేశాటన వెళ్ళి రావలె. ఈ అవకాశం రావడం నాకునూ ఎంతో ఆనందముగా ఉన్నది,” తన అంగీకారం తెలియజేశాడు నరస సింహుడు.

“నిక్కము కుమారా! చిన్నప్పుడూ నేను కూడా ఇటులనే దేశాటనకు వెళ్ళి ఉన్న వాడనే. మన రాచ బిడ్డలకు అది కడు శోభాయమానము,” హుందాగా అన్నాడు నీరస సింహుడు.

“మరి తాతగారు నాకు, మీరు చిన్నప్పుడు చిల్లర దొంగతనములు చేయుట వలన ఆయన మిమ్ము కఠినంగా శిక్షిస్తే, అలిగి మీరు దేశాలు పట్టి పోయారని చెప్పియుండిరే?” ఆశ్చర్యపోయాడు నరస సింహుడు.

“అహో, ఆయన చిత్త చాంచల్యము గురించి నీకు తెలిసినదే కద! ఆయన మాటలకేమి గానీ, మీరు ప్రయాణానికి సన్నిద్ధులు కండి,” అజ్ఞాపించాడు మహారాజు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

6 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 8

 1. రవి says:

  ఖడ్గ ప్రహరణమునందే ఇంకనూ ప్రావీణ్యము సంపాదించని యువరాజు సాహస కృత్యములయందు ఆసక్తి కనబర్చి, దేశాటనముకరుగనిచ్చగించుట అత్యంత ఆసక్తిదాయకగనున్నది.

  ఇప్పుడు వ్యావహారికం.

  మీరిట్ల ఏక్తాకపూర్ టీవీ సీరియళ్ళల్లోలాగా తుంటలు తుంటలు పబ్లిష్ చేయడం అసలు బాలేదు.

  • Murali says:

   రవి గారూ,

   క్షంతవ్యుడిని.

   ఈ కథ మొదలు పెట్టినప్పుడు చిన్న తుంటలైనా రోజుకో ఎపిసోడ్ రాద్దమనేది నా ఉద్దేశ్యం. పరిస్థితుల ప్రభావం వల్ల, విదేశీ హస్తం వల్ల అది కాస్తా వీక్లీ సీరియల్ అయి కూర్చుంది. రాబోయే ఎపిసోడ్ల నిడివి పెంచుతాను.

   -మురళి

 2. amun says:

  “మరి తాతగారు నాకు, మీరు చిన్నప్పుడు చిల్లర దొంగతనములు చేయుట వలన ఆయన మిమ్ము కఠినంగా శిక్షిస్తే, అలిగి మీరు దేశాలు పట్టి పోయారని చెప్పియుండిరే?” ఆశ్చర్యపోయాడు నరస సింహుడు.

  Excellent, i became fan of this serial

 3. Wanderer says:

  ప్రసాదం అందరి కంటే ఎక్కువ భుజించాడా మహారాజు? హహ్హహ్హాహ్హా

 4. Jyothi Reddy says:

  “మరి తాతగారు నాకు, మీరు చిన్నప్పుడు చిల్లర దొంగతనములు చేయుట వలన ఆయన మిమ్ము కఠినంగా శిక్షిస్తే, అలిగి మీరు దేశాలు పట్టి పోయారని చెప్పియుండిరే?”
  HAHA Nice…….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s