జ్వాలా ద్వీప రహస్యం – 7


దేవాలయంలో ప్రవేశించగానే ఎప్పటిలానే ఒక గగుర్పాటుకు లోనయ్యాడు నరస సింహుడు. ఎదురుగా పెద్ద దోమ ఆకారంలో ఉన్న విగ్రహానికి మొక్కుతూ, “అవును నాన్నగారూ, మన కుల దైవం దోమ కావడం ఎలా సంభవించింది?” అని అడిగాడు.

“మంచి ప్రశ్న అడిగావు కుమారా! ఇదే ప్రశ్న గత ఐదు సార్లూ ఈ గుడికి వచ్చినప్పుడు కూడా అడిగావు. ఐనా చెప్తాను విను.

మా తాతగారి హాయంలో మన రాజ్యంలో విపరీతంగా దోమలు ఉండేవి. రాత్రి అంతా వొళ్ళు బరుక్కుంటూ, నిద్ర లేమి వల్ల పొద్దున నిద్రపోతూ మన ప్రజలు ఎందులకూ పనికి రాకుండా తయారయ్యారు,” ఒక్క సారి ఊపిరి పీల్చుకున్నాడు నీరస సింహుడు.

“అవును యువరాజా! అప్పట్లో వొళ్ళు బరుకుడు బృందం కూడా ఉండేది. రాత్రంతా రాజ కుటుంబీకులకు నిద్రకు అసౌకర్యం లేకుండా వొళ్ళు బరుకుతూ సేవ చేసే వారు,” ఆ వ్యవధిలో చెప్పేశాడు వృద్ధ భట్టు.

“నిక్కము నిక్కము! అలాంటి విషమ పరిస్థితుల్లో మా తాతగారికి ఒక స్వప్నము వచ్చినది. అందులో దోమ దేవత దర్శనమిచ్చి ‘ ఓ రాజా నాకు ఒక గుడి కట్టింపుము. ప్రతి రోజూ ధూప దీపములతో అర్చన కావించుము. అప్పుడు నా సంతతికి చెందిన ఈ దోమలు మిమ్ములను ఇక పీడింపవు ‘ అని చెప్పినది. మా తాత గారు ఆనందంతో నిద్ర లేచి హుర్రే అని గట్టిగా అరుస్తూ వొళ్ళు విరుచుకున్నారు,” మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు నీరస సింహుడు.

“ఆ తరువాత ఏమి జరిగినది?” కుతూహలంగా అడిగాడు నరస సింహుడు.

“ముందుగా మా తాతగారి వొళ్ళు బరుకుతున్న నలుగురూ ఆయన చేతులు విరుచుకోవడంతో పెద్దగా కేకలు వేసి అటూ ఇటూ పడిపోయారు. ఆ తరువాత పనులు చక చకా జరిగిపోయాయి. దోమ దేవతకు బ్రహ్మాండంగా గుడి కట్టింపబడింది. ఎందుకైనా మంచిది అని మన రాజ్యం పేరు దోమదేశంగా మార్చారు కూడా.

అంతే! ఆ రోజు నుంచి మంత్రం వేసినట్టు మన రాజ్యంలో దోమలు మాయమయ్యాయి. మన ప్రజలు ఎప్పటిలానే రాత్రి నిద్ర పోవుచూ, పొద్దున తమ పనులు చేసుకో సాగారు. మన రాజ్యం మరలా సుభిక్షంగా మారినది. అప్పటి నుంచి ఈ దోమ దేవతే మన కుల దైవమైనది,” చెప్పడం పూర్తి అయ్యింది కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువ సేపు ఊపిరి పీల్చుకున్నాడు నీరస సింహుడు.

“భళా! మీరు ఎన్ని సార్లు చెప్పిననూ ఈ కథ నాకు ఎప్పుడూ కొత్తగానే ఉండును. పదండి ఫల పుష్పాలతో దోమాంబకు పూజ చేసెదము,” ఉత్సాహంగా అన్నాడు నరస సింహుడు.

“మరిచితిరా యువరాజా! దోమ దేవతకు పూజ చేయు విధానం అది కాదు. మీ వేలు కోసుకుని రక్తము చిందింపవలె,” చెప్పాడు వృద్ధభట్టు.

“మొన్న వీర బాహుడితో శిక్షణ జరిగినప్పుడు పెక్కు రక్తము చిందించినాను. మళ్ళీనా? ముందుగా మీరు పూజ చేయుడు,” అర్థించాడు నరస సింహుడు.

“తప్పు యువరాజా! ఈ గుడిలో రాజ వంశీయులు మాత్రమే పూజ చేయవలె. ముందుగా మీరే కానివ్వండి,” విన్నవించుకున్నాడు వృద్ధ భట్టు.

“ఈ మర్యాదలకు ఏమీ తక్కువ లేదు,” తనలో తాను పళ్ళు కొరుక్కుంటూ పూజ చేయడానికి సిద్ధమయ్యాడు నరస సింహుడు.

పక్కనే ఉన్న పూజారి, “ఇదిగో యువరాజా! ఈ రాజ ఖడ్గం అందుకొనుడు. దీనితో మీ కుడి చేతి చూపుడు వేలు కోసుకుని ఈ బంగారు పళ్ళెంలో పడునటుల పది బొట్లు రక్తం చిందింపుడు,” అంటూ ఒక పొడవాటి కత్తి అందించాడు.

ఆ కత్తి పరిమాణము చూసి ఉలిక్కి పడ్డాడు నరస సింహుడు. “ఏమి ఈ ఖడ్గమూ? వీరబాహుడి కత్తి కంటె పెద్దదిగా ఉన్నది. దీనితో చిన్న గాటు పెట్టిననూ అధమాతి అధమం వంద బొట్లు ఐనా చిందును,” ఆందోళన వ్యక్తం చేశాడు.

“పది బొట్ల కన్నా ఎక్కువ పడిన దోమాంబ మరింత సంతోషించును. పది బొట్ల కన్నా తక్కువ పడితేనే పూజ ఫలించదు. మీరు సందేహించకుండా వేలు కోసుకొనుడు,” సర్ది చెప్పాడు పూజారి.

“తన వేలు కాదు కాబట్టి వేయి సార్లు కోసుకోమన్నాడంట వెనకటికెవడో,” తనలో తానూ నిట్టూరుస్తూ వేలు కోసుకోవడానికి ఉపక్రమించాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

8 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 7

 1. ఓహో, రాజులు కూడా ఆనందమేస్తే హుర్రే అనే అరిచేవారన్న మాట.

  ఇలా కాస్త కాస్త రాసి పాఠకులను సస్పెన్స్ లో పెట్టటానికి ఇదేమన్నా సస్పెన్స్ థ్రిల్లరా? ఇంకొంచం పెద్ద టపాలు రాసి మాకు ఇంకాసేపు నవ్వుకునే అవకాశం ఇస్తే మీ సొమ్మేం పోయింది చెప్పండి. ఇలాగే చేస్తే మీ చేత కూడా దోమాంబకు పూజ చేయించాల్సి వస్తుంది, ఆ తర్వాత మీ ఇష్టం.

  • Murali says:

   చైత్రన్య గారూ,

   “దాన వీర శూర కర్ణ” చిత్రంలో ఎన్.టి.ఆర్‌తో సహా అందరూ
   హురే హురే అని అరుస్తూంటారు. అది కాపీ కొట్టేశా!

   ఇది సస్పెన్స్ త్రిల్లర్ కాక పోవడమేమిటి? టైటిల్‌తో సహా అంతా సస్పెన్సే!

   ఐనా వార పత్రికల్లో ఎన్నో సీరియల్స్‌లో “తలుపు మెల్లగా తెరుచుకోసాగింది” అంటూ ముగించి ఇంకా ఉంది అని రాసే సీరియల్స్ బోలెడు చాలా చదివి నాకూ ఎప్పటినుంచో కోరిక, అలా అర్ధాంతరంగా ముగిస్తూ సీరియల్స్ రాయాలని. I always wanted to do that!

   అదన్న మాట.

   -మురళి

 2. Wanderer says:

  వెబ్ సైట్ రిఫ్రెష్ అవ్వడానికి పట్టే సమయంలో పదో వంతులో ఐపోతోంది మీ పోస్టు చదవడం. ఇంత చిన్న చిన్న పోస్టులేంటి అని కంప్లయింట్ చేస్తుంటే అవి మీకు కాంప్లిమెంటులుగా కనపడుతున్నట్టున్నాయి ఖర్మ. ఇంకా ఇంకా చిన్నవి చేసేస్తున్నారు పోస్టులు. పెద్దవి రాయండి. కాస్త కడుపూ అదీ నిండాలా వద్దా?

 3. Jyothi Reddy says:

  Muraliji,
  Mee kathalu evening coffee la unnai sir…kaani nenu coffee chala thaguthanu kadhaa mari….LOL Keep goin…

 4. రవి says:

  దోమాంబ పూజావిధానము, పనిలో పనిగా గున్యాంబ వ్రత విధానము మాకును సెలవియ్యుడు, మా వూరిలో దోమలు తెగ పీడించుచున్నవి. అదియును, రక్తము చిందించే విధానము తక్క.

 5. Amun says:

  “ఏమి ఈ ఖడ్గమూ? వీరబాహుడి కత్తి కంటె పెద్దదిగా ఉన్నది. దీనితో చిన్న గాటు పెట్టిననూ అధమాతి అధమం వంద బొట్లు ఐనా చిందును,” ఆందోళన వ్యక్తం చేశాడు.

  Amazing…

 6. ఆదిత్య says:

  ‘కాదేది కవితకనర్హము కుక్కపిల్ల, సబ్బు బిల్ల, అగ్గి పుల్ల… ‘ అని శ్రీ శ్రీ చెప్పినట్టుగ –
  మీరు మీ హాస్యము లో ‘దోమని’ కూడ వదల కు0డ మహా చక్కగ దోమని పీకి పాకము పెట్టారు 🙂 అలానే ఓ చక్కటి చ0దమామ కధ కూడా రాస్తే అమెరికాలో పెరుగుతున్న పిల్లలికి చదివి వినిపిస్తాము 🙂 వాళ్ళకి రోజు స్తడెర్ మాన్ గట్రా చదివి వినిపి0చి మహా బోర్ కొడుతున్నది

  ఆదిత్య

 7. srinivas says:

  “ఈ మర్యాదలకు ఏమీ తక్కువ లేదు,” తనలో తాను పళ్ళు కొరుక్కుంటూ పూజ చేయడానికి సిద్ధమయ్యాడు నరస సింహుడు.

  adiripoyindi…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s