అనగనగనగా…


జంబూ ద్వీపంలో త్రిలింగ దేశం అనే ఒక రాజ్యం ఉండేది. త్రిలింగ దేశాన్ని పాలించే గాంక్రెస్ పార్టీనే జంబు ద్వీప కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నడిపేది.

అసలు త్రిలింగ దేశంలో గాంక్రెస్ ఘన విజయం కారణంగానే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమయ్యిందని త్రిలింగ దేశం ప్రాంతీయ గాంక్రెస్ నాయకుల నమ్మకం.

జంబూ ద్వీప కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు జగన్మోహన్ సింగ్ అయినప్పటికీ, పెత్తనం అంతా ఢిల్లీ అమ్మ చేతిలో ఉందని అందరికి తెలిసిన రహస్యమే. అలాగే త్రిలింగ దేశం గాంక్రెస్ పార్టీలో ఎంత మంది నాయకులు ఉన్నా, తిరుగు లేని నాయకుడు వై.నో. రాజశేఖర్ అన్న విషయం కూడా అందరికి తెలిసిందే. ఐతే ఢిల్లీ అమ్మకు సాహుల్ గాంధి వారసుడైనట్టుగానే రాజశేఖరుడికి ఆయన కుమారుడు గగన శేఖరుడు వారసుడు.

రెండో సారి త్రిలింగ దేశం అధికారంలోకి వచ్చాక వై.నో.కి ఎదురు లేకుండా పోయింది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సూర్య బాబు, రిచంజీవి ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. ఇంకో ఐదేళ్ళ వరకు వై.నో. బూతులు వినక తప్పదని గుండె రాయి చేసుకున్నారు. సూర్యబాబు ఐతే తన తల్లి కడుపున ఎందుకు పుట్టానా అని తెగ బాధ పడ్డాడు.

వై.నో. తన మంత్రివర్గం మొత్తం తనకు అనుకూలమైన నాయకులతో నింపేశాడు. మళ్ళీ మంత్రి పదవి రాని వారు మొర పెట్టుకుంటే వారికి ఒకే సమాధానం వచ్చింది. “క్రితం సారి మీరంతా విపరీతమైన లంచగొండి తనానికి పాల్పడ్డారు. అందుకే ఈ సారి మీకు మంత్రి పదవులు రాలేదు,” అని.

అది విని వాళ్ళు మ్రాన్పడిపోయారు. “మేమొక్కరేనా లంచగొండులము? ఇంకెవరూ కాదా? అయినా పవిత్రమైన గాంక్రెస్ పార్టీలో ఉండి లంచం తీసుకోకపోతే మన పార్టీ ఆశయాలకు ద్రోహం చేసినట్టు కాదా” అని బాధగా ప్రశ్నించారు.

“మీకు సరిగ్గా అర్థమైనట్టు లేదు. లంచం తీసుకోవడం తప్పు అని గాంక్రెస్ ఎప్పుడూ అనదు. ఐతే పెద్దాయనకు ఆయన వాటా ఇవ్వకుండా మీకొచ్చిన డబ్బంతా మీరే నొక్కేశారు. నమ్మక ద్రోహం గాంక్రెస్ పార్టీ అస్సలు సహించదు. అందుకే మీకీ శిక్ష,” అని వివరణ వచ్చింది. పదవి పోయిన నాయకులు మళ్ళీ కిక్కురుమనలేదు.

ఇది ఇలా ఉండగా ఎవ్వరూ ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. “ప్రజల వద్దకు పాలన” (వాయు మార్గం ద్వారా లెండి) పథకం కింద బడుగు వర్గాల ప్రజలకు (అంటే గాంక్రెస్ పథకాల వల్ల కూసింత లబ్ధి పొంది వై.నో.కి మళ్ళీ వోట్లేసిన వాళ్ళకు) సహాయం సరిగ్గా అందుతూందో లేదో అని తనిఖీ చేయడానికి వెళ్ళిన వై.నో. విమానం మల్లగుల్ల అడవుల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న వారందరూ మృతులయ్యారు.

ఈ ఆకస్మిక సంఘటన త్రిలింగదేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. మానవత్వం ఉన్న వారెవరూ పగవాడికి కూడా అలాంటి చావు రాకూడదని కోరుకుంటారు కాబట్టి, అన్ని పార్టీలు, అన్ని వర్గాలు తమ సంతాపాన్ని తెలియజేశాయి.

ఐతే రాజకీయానికి చావు అనేది లేదు కాబట్టి మల్లగుల్ల అడవుల ప్రాంతంలో విమానం తప్పిపోయింది అని తెలిసిన మరుక్షణమే త్రిలింగ దేశంలో కాకలు తీరిన రాజకీయ యోధులు తరువాత ముఖ్యమంత్రి ఎవరా అని మల్లా గుల్లాలు పడడం ప్రారంభించారు.

చీఫ్ మినిస్టర్ కావాలని ఆశపడే వారి సంఖ్య గాంక్రెస్‌లో తక్కువేమీ లేదు. ఎం.ఎల్.ఏ గా కూడా గెలవలేకపోయిన ఎస్.డీ నుంచి, మాజీ అధ్యక్షుడు కె.కాకర రావు (ఈయన్ని కె.కె. అంటారు) వరకూ అందరికి ఆ పదవి మీద కన్నుంది.

ఐతే బాహాటంగా బయటపడనిది ఇద్దరే. ఒకరు గగన్ ఐతే ఇంకొకరు ఆర్థిక మంత్రి మోశయ్య. వారిద్దరూ మాత్రం, ఎవరు ముఖ్యమంత్రి ఐనా పరవాలేదు, తమకు కావల్సింది, వై.నో. ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగడమే అని నొక్కి వక్కాణించారు. ఐతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మోశయ్యకు ప్రమాణ స్వీకారం చేయక తప్పింది కాదు. గాంక్రెస్ పార్టీ కోసమని ఆయన ఆ త్యాగం చేశాడు.

ఒక వైపు ఎవరి పావులు వారు కదుపుతూనే ఉన్నారు.

ఇటు సూర్యబాబు గాంక్రెస్ పార్టీని చీల్చి తద్వారా తను ముఖ్య మంత్రి ఐతే, “నగదు బదిలీ” పథకం అమలు పరుచ వచ్చు కదా అని కలలు కనడం మొదలెట్టాడు. (నగదు బదిలీ పథకం అంటే రాష్ట్ర ఖజానాలో ఉన్న నగదుని తన జేబులోకి బదిలీ చేసుకోవడం అన్న మాట.)

అలానే ఇష్టారాజ్యం పార్టీలో కూడా కొత్త ఆశలు చిగురించాయి. ఒక వేళ గగన్ గాంక్రెస్ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెడితే, తమ చిట్టి పార్టీ సహాయం అవసరం కావచ్చు అని, తద్వారా రాజకీయ లబ్ధి పొంద వచ్చు అని అనుకున్నారు.

వై.నో. భక్తబృందం మాత్రం (గిట్టని వాళ్ళు వీరిని వై.నో. తొత్తులు అని అంటారు), ఎలాగైనా గగన్‌ని ముఖ్య మంత్రి చేయడానికి ఒక్కో చేతికి మూడేసి కంకణాలు కట్టుకున్నారు.

అక్కడ ఢిల్లీ అధిష్టానం మళ్ళీ హై కమాండ్‌కి త్రిలింగ దేశంలో పూర్వ వైభవం రావాలంటే, తమ మాట భక్తిగా విని, తు.చ. తప్పకుండా చేసే వాడు (గిట్టని వారు ఇలాంటి వాళ్ళని ఢిల్లీ తొత్తులు అంటారు) ముఖ్య మంత్రి ఐతే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చిది. అసలే గాంక్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ!

ఇలాంటి పరిస్థితి ముందే ఊహించిన గగన్ సన్నిహితులు ప్రజల్లో గగన్‌కి ఎంత ఆదారాభిమానాలు ఉన్నాయో నిరూపించడానికి ఒక కొత్త రకమైన పద్ధతి ప్రయోగించారు. అది సాధారణ ప్రజలకు అంతు పట్టేది కాదు. కానీ గాంక్రెస్ సంగతి తెలిసిన ఎవరికైనా ఇది వెంటనే బోధ పడుతుంది.

దానిలో భాగంగా వై.నో. విమానం మల్లగుల్ల అడవుల మీద అదృశ్యమయ్యింది అని తెలియగానే చక చకా ఏర్పాట్లు జరిగిపోయాయి. వై.నో. మరణ వార్త బయటకు రాగానే, గుంపులు గుంపులుగా జనం గుండె పగిలి చావడం మొదలు పెట్టారు. గుండే పోటు వచ్చేంత వరకు వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళు, అర్జెంట్‌గా ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఆఖరికి రాజకీయాలు అంటే అవగాహన లేని పసి కూనలు కూడా బెంగతో జ్వరం తెచ్చుకుని ప్రాణాలు వదిలారు.

హై కమాండ్ మీద విపరీతమైన వొత్తిడి వచ్చేసింది. “అదిగో చూశారా, వై.నో. ఆశయాలు తీరాలి అంటే, ఒక్క గగన్ ముఖ్య మంత్రి ఐతేనే వీలవుతుంది. గగన్‌ని ముఖ్య మంత్రి చేయట్లేదన్న బాధతోనే ఇంతమంది పోతున్నారు,” అని గగన్ సమర్థకులు వాపోయారు.

“గాంధీ గారు పోయినప్పుడు కూడా ఇంత మందికి గుండె పోట్లు రాలేదు, ఇందరు ఆత్మ హత్యలు చేసుకోలేదు. వై.నో కి ఎంత పాపులారిటీ, ఏం కథ!” అని మిగతా ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు.

వ్యాపారస్తులంతా ఎందుకైనా మంచిది అని తమ దుకాణాలు ఒక వారం రోజుల పాటు మూసేశారు. ఏకాక్షి దిన పత్రిక వై.నో. పోయాక త్రిలింగ దేశ ప్రజలు తిండి తిప్పలు మానేశారని, త్వరలో గగన్‌ని ముఖ్య మంత్రి చేయకపోతే కొన్ని రోజులకి త్రిలింగ దేశంలో జనాభానే మిగలదు అన్న వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించింది. ఆఖరికి ఈ క్షణం దిన పత్రికకి కూడా వై.నో.ని వేనోళ్ళా పొగడక తప్పలేదు.

ఈ హడావుడి చూసి, మిగతా గాంక్రెస్ నాయకులు కూడా వంత పాడారు. “ఔను, గగన్ ముఖ్య మంత్రి ఐతేనే న్యాయం. ఐనా గాంక్రెస్ పార్టీలో ఎవరైనా పోతే వారి కొడుకుకో కూతురుకో అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ కద! ఢిల్లీ అమ్మ కూడా అలా అధికార పీఠం ఎక్కిన మనిషే కద! ఇందులో తప్పేముంది?” అని గగన్‌కి వత్తాసు పలికారు.

ఆఖరికి సినీ నటుడు రాగర్జున కూడా గగన్ ముఖ్యమంత్రి అయితేనే మంచిది అని ఎవరూ అడగక పోయినా అప్పనంగా తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

ఐతే గగన్ సమర్థకులు మర్చిపోయిన విషయము ఒకటుంది. వాళ్ళు రెండు ఆకులు చదివితే హై కమాండ్ ఇంకో రెండు ఎక్కువ చదివింది.

తమ అవకాశవాదం పని చేస్తుంది, అధిష్టానం ఒత్తిడికి లోనవుతుంది అని అంచనా వేసిన గగన్ బృందం ఒక విషయం మర్చి పోయారు. అది, హై కమాండ్ తమను మించిన అవకాశవాదులని. ఒక వేళ నిజంగా ప్రజలంతా ముక్త కంఠంతో ఘోషించినా వారు పట్టించుకునే రకం కాదని. (నిజానికి మొత్తం ఉన్న వోటర్ల లెక్క ప్రకారం చూస్తే, గాంక్రెస్‌కి వచ్చిన వోట్లు ఇరవయి ఏడు శాతం మాత్రమే. అందులో ఎందరు వై.నో పేరు చూసి వోటు వేశారో ఆ ప్రభువుకే ఎరుక.)

తన ఉన్నత సంస్కృతి ప్రకారం అధిష్టానం మొహమాటం లేకుండా ఎలెక్షన్ల ఏరు దాటాం కనుక వై.నో. వంశస్తుల తెప్ప తగల బెట్టడమే మంచిది అన్న నిర్ణయం తీసుకుంది.

విషయం తెలిసిన మిగతా గాంక్రెస్ నాయకులు యధావిధిగా ప్లేటు ఫిరాయించారు. “అసలు నాయకత్వ సమస్య ఉందని ఎవరన్నారు? మోశయ్యను చూస్తే మా తాతగారిని చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. ఆయన చల్లని నీడలో, ధిల్లీ అమ్మ అమృత హస్తం చలువతో గాంక్రెస్ పార్టీ ఎదురు లేకుండా సాగిపోతుంది,” అని తాము అంతకు ముందు గగన్‌ని ముఖ్యమంత్రి చేయాలని గొడవ చేసిన విషయం కన్వీనియెంట్‌గా మరిచిపోయి బల్ల గుద్ది మరీ చెప్పారు.

ఈ ఆటలో ఎవరు ముందు కన్ను రెప్ప వేస్తే (బ్లింక్ చేస్తే) వాళ్ళు ఓడిపోతారు. అధిష్టానానికి ఓపిక ఎక్కువ, గాంక్రెస్ నాయకులకు హై కమాండ్‌కి ఎదురు తిరిగే ధైర్యం తక్కువ కాబట్టి, త్రిలింగ దేశంలో చోటా మోటా నయకులు అంతా టప టప రెప్పలు మూశారు. మోశయ్య ముఖ్య మంత్రి పదవిలో స్థిర పడిపోయాడు.

(ఐతే గగన్ బృందం ఇంకా రెప్ప వేయకుండా ఆశగా ఎదురు చూస్తూనే ఉంది.)

నీతి: తాతకు దగ్గులు నేర్పించలేము.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

10 Responses to అనగనగనగా…

 1. రవి says:

  ఒక వేళ ఖర్మ కాలి గగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే, “త్రిలింగ దేశం అనే ఒక రాజ్యం ఉండేది.” – ఇదుగో, ఈ వాక్యం నిజం అయి ఉండేది. వై. నో మొదలెట్టిన భూ యజ్ఞం (భూముల్ని గుంజుకోవడం) దెబ్బకు, మొత్తం త్రిలింగ దేశం స్వాహా అయి ఉండేది.

 2. ప్రదీప్ says:

  Once you vote for Congress, we only get Dilli Tottulu

 3. 🙂
  ‘‘తన ఉన్నత సంస్కృతి ప్రకారం అధిష్టానం మొహమాటం లేకుండా ఎలెక్షన్ల ఏరు దాటాం కనుక వై.నో. వంశస్తుల తెప్ప తగల బెట్టడమే మంచిది అన్న నిర్ణయం తీసుకుంది.’’
  బాగుంది.

 4. laxmi says:

  😀 అదన్నమాట సంగతి

 5. Sumna says:

  Kathi Kataar.. inka meeru ee topic pina enduku rayaledaa ani wait chestunaa. inka trupti ga migata blogs chadukuntanu.

 6. hahaha says:

  ha ha వీజిత వాజమ్మశేఖర్ ల ని ఈసారి వదిలేసారే???

 7. Satyam says:

  ” గుండే పోటు వచ్చేంత వరకు వెయిట్ చేసే ఓపిక లేని వాళ్ళు, అర్జెంట్‌గా ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఆఖరికి రాజకీయాలు అంటే అవగాహన లేని పసి కూనలు కూడా బెంగతో జ్వరం తెచ్చుకుని ప్రాణాలు వదిలారు” – Nice humor sir ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s