చచ్చే చావొచ్చింది!


ధనుంజయ రావు చని పోయి ఆరు గంటలు అయ్యింది. అందరు చనిపోయిన వాళ్ళ మల్లే మొదట్లో తను కూడా చాల హడావుడి చేశాడు. ఇంకా బతికున్నాను అనే అభిప్రాయంతో బతికున్నప్పుడు తెలిసిన వాళ్ళందరి ఎదుట పడి నానా గోలా, యాగీ చేశాడు. “నేనూ! నన్ను గుర్తు పట్టకుండా వెళ్ళిపోతున్నారేంటి? అదీ నాలోంచే నడుస్తూ!” అంటూ తెగ ఫీలై పోయాడు.

అందరి లానే కాసేపయ్యాక తను చనిపోయాడు అన్న విషయం ఒంట పట్టింది అతనికి. సారీ! అతనికి ఇప్పుడు ఒళ్ళు లేదు కద! మనసుకు హత్తుకునేలా అర్థమయ్యింది.

తను చనిపోయాడు అన్న విషయం రూఢీ కాగానే చలించిపోయాడు ధనుంజయ రావు. అదే, అదే! అతని ఆత్మ చలించి పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మామూలుగా ఐతే అతను పార్క్‌కి వెళ్తాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేస్తాడు. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు.

మరి ఎక్కడికి వెళ్ళాలి? అతనికి గుర్తొచ్చింది. దెయ్యాలు (ఛీ ఛీ! అలా అనుకుంటేనే బాధగా ఉంది), ఆత్మలు ఉండేది స్మశానంలో కద. కాబట్టి అక్కడికే వెళ్ళాలి. ఉత్తరాన ఊరవతల ఉన్న స్మశానం వైపు బయలుదేరాడు.

సడన్‌గా గుర్తొచ్చింది అతనికి. తను ఆత్మ కద! నడవాల్సిన అవసరం లేదేమో? ఎగరడానికి ప్రయత్నించాడు ధనుంజయ రావు. ప్చ్! లాభం లేకపోయింది. దేహం లేదు అన్న బలహీనత మిగిలింది కానీ, ఎలాంటి అదనపు శక్తులు సంక్రమించినట్టు లేదు.

చేసేది లేక, నడవడం ప్రారంభించాడు ధనుంజయ రావు. దాదాపు ఒక రెండు గంటలు పట్టింది అతనికి స్మశానం చేరుకోవడానికి. ఆ రోజు బంద్ కాబట్టి ఆటోలూ బస్సులూ లేవు. దారిలో అంతా గుంపులు గుంపులుగా జనం షాపులూ, స్కూళ్ళూ, మూయిస్తున్నారు. నిజం చెప్పొద్దూ! చనిపోయాను అని తెలిసి కూడా ఒక్క క్షణం చచ్చేంత భయం వేసింది అతనికి. ఎలాగైతేనేం, కష్టపడి స్మశానం చేరుకున్నాడు.

లోపలికి వెళ్ళగానే, మూడు ఆత్మలు ఎదురు పడ్డాయి ధనుంజయ రావుకి. “ఇప్పుడే వస్తున్నావా ఊరి నుంచి?” మొదటి ఆత్మ అడిగింది. అవునన్నాడు ధనుంజయ రావు. “‘నిన్ను తంతే నాకు నొప్పి’ సినిమా ఎట్ల నడుస్తూంది?” రెండో ఆత్మ అడిగింది. అయోమయంగా చూశాడు ధనుంజయ రావు. “ఏమో నాకు తెలీదండి. నేను సినిమాలు ఎక్కువగా చూడను. కేబుల్ టీవీలో సీరియల్స్ మాత్రమే చూస్తాను. ఐనా అదేం పేరండీ?” అడిగాడు.

“గంటే, ఆ సినిమల హీరోకి హీరోయిన్ అంటే మస్తు ఇష్టం భయి! హీరోయిన్‌కి కష్టం వస్తే హీరోకి బాధవుతది. గందుకనే ఆ టైటిల్. గివన్నీ నాకెట్ల తెల్సినయి అనుకుంటున్నవా? దాని ప్రొడ్యూసర్ నా దోస్తే. గది రిలీజ్ అయ్యెంతలో నేను చచ్చిన అనుకొరాదే,” ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఆ ఆత్మ.

“అది సరే కానీ క్రికెట్ స్కోర్ చెప్పండి మాస్టారూ,” అంది మూడో ఆత్మ.

“తెలీదు. ఐనా ఇదేంటి? చచ్చాక ప్రశాంతంగా ఉంటాం అనుకున్నాను. ఇక్కడ కూడా ఇదే గోలా?” ఆశ్చర్య పోయాడు ధనుంజయ రావు.

ఘొల్లున నవ్వాయి ఆత్మలు. “మేమూ అలానే అనుకున్నాం. చచ్చాకే తెలిసింది. ఇక్కడ ఇంకా బిజీగా ఉంటాం అని.” చెప్పింది మొదటి ఆత్మ.

కొంత సేపు స్మశానంలో గడిపాక ధనుంజయ రావుకి కూడా ఆ విషయం అర్థమయ్యింది. స్మశానం మహా రష్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఏదో తిరునాళ్ళలా ఉంది. పక్కన నిలబడి ఉన్న ఒక పెద్ద ఆత్మని అదే విషయం అడిగాడు ధనుంజయ రావు.

ఆయన ఫెళ్ళున నవ్వి, “పాపులేషన్ ప్రాబ్లెమండీ బాబూ! వచ్చే ఆత్మలే కానీ పోయే ఆత్మలు లేవు కద. కాబట్టి ఈ స్మశానం ఇలా కిటకిటలాడి పోతూంది. కొందరికి ఇది నచ్చక జనాల మధ్యకు వెళ్ళి ఇంటి చూర్ల మీద మకాం పెట్టారు. ఐనా ఇక్కడ ఎప్పుడూ రష్‌గానే ఉంటుంది,” అన్నాడు.

అకస్మాత్తుగా ఒక మూల ఏదో కలకలం చెలరేగింది. “ఏం జరుగుతూంది అక్కడ?” ఆందోళనగా అడిగాడు ధనుంజయ రావు.

“రెండు వేరు వేరు కులాలకు చెందిన ఆత్మలు కొట్టుకుంటున్నారు.”

“ఎందుకు?”

“”వాళ్ళు మొన్న కుల కక్షల వల్ల జరిగిన దొమ్మీలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే ఫైట్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు,” చెప్పింది పెద్ద ఆత్మ.

తల బరుక్కున్నాడు ధనుంజయ రావు. “అన్నట్టు రాత్రి పదకొండు కావొస్తూంది. నిద్ర పోతే బెటరేమో?” అన్నాడు.

మళ్ళీ ఫెళ్ళున నవ్వింది పెద్ద ఆత్మ, “మీకు ఇది మొదటి రాత్రి కద, అందుకే తెలీదు. రాత్రి పూట నిద్ర ఏంటండీ బాబూ? కావాలంటే పగలయ్యాక కాస్త కునుకు తీద్దురు గానీ,” అంది.

“గురువు గారూ, ఏం అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఆ మొదటి రాత్రి అన్న పద ప్రయోగం బాగా లేదు. పైగా మీరు మాటకి ముందు ఫెళ్ళున నవ్వడం ఆపేయ్యండి. నాకు కాస్త భయం వేస్తూంది,” అన్నాడు ధనుంజయ రావు.

“చనిపోయాక భయమేంటండి బాబూ?” అంటూ ఫెళ్ళున నవ్వబోయి ఆఖరి క్షణంలో ఆపేసింది పెద్ద ఆత్మ.

పక్కకు చూసిన ధనుంజయ రావుకి, వాళ్ళ కాలనీలో ఉండే ఏడు కొండలు కనిపించాడు.

“అరే ఏడు కొండలు, నువ్విక్కడ..?” ఆశ్చర్య పోయాడు రావు.

“మొన్నే లారి గుద్దేసింది సార్! అప్పటికెల్లి తిరుగుతున్నా ఈడ. మస్తు పరేషాన్ అవుతున్నది సార్!”

“నీకు పరేషానా? నువ్వు మన కాలనీలో పెద్ద దాదావి కద?”

“అది బతికున్నప్పుడు సార్! అప్పుడైతే చంపుతా అని భయపెడుతూండే! ఇప్పుడు కొడుకులు ఎవ్వరూ భయపడ్త లేరు.”

“ఎన్ని కష్టాలొచ్చాయి నీకు ఏడు కొండలూ!”

“అవును సార్!”

ఈ సంభాషణ ఇంకెంతసేపు నడిచేదో తెలీదు కాని మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ఒక దెయ్యం, సారీ ఆత్మ, అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది, “రక్షించండి,” అంటూ.

“అరే సతీష్ గారూ! మీ వెంట పడుతూంది ఎవరండీ?” నగరంలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు సతీష్ కుమార్‌ని గుర్తు పట్టిన ధనుంజయ రావు అడిగాడు.

“ఇంకెవరు! నా చేతిలో చచ్చిన మాజీ పేషెంట్లు అందరూ! ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా వేధించుకు తింటున్నారు.”

“దుక్కలా ఉండేవారు. మీరెలా పోయారు?”

“పొరపాటున నా మాత్ర నేనే వేసుకున్నా”

“ఓహో.”

ఇంతలో ఒక చిన్న గుంపు వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది, “అందరూ వెళ్ళి దాక్కోండి. భూత వైద్యుడు కాద్రా ఎవరికో చేతబడి చేయడానికి ఇక్కడికే వస్తున్నాడు,” అంటూ.

“పదండి అలా కాసేపు స్మశానం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలానికి వెళ్దాం,” అంది పెద్ద ఆత్మ.

“ఆ కాద్రా మంత్రాల వల్ల మనకు ప్రమాదమా?” అడిగాడు ధనుంజయరావు.

“ప్రమాదమని కాదు. వాడు గోచీ కట్టుకుని, ఒంటికి అంతా బూడిద, నెత్తురు పూసుకుని రాత్రి చూస్తే పగలు కలలోకొచ్చేలా ఉంటాడు. పైగా ఆ బండ గొంతు వేసుకుని అవే మంత్రాలు చదువుతాడు. వాణ్ణి భరించడం చాలా కష్టం. అందుకే వాడు వెళ్ళిపోయాక మళ్ళీ వద్దాం లెండి,” సర్ది చెప్పింది పెద్ద ఆత్మ. చేసేది లేక తను కూడా స్మశానం నుంచి బయట పడ్డాడు ధనుంజయ రావు.

ఓ గంట తరువాత అంతా తిరిగి వచ్చారు.

“అబ్బబ్బా! ఈ కాద్రా గాడు ఈ మధ్య రెగులర్‌గా మన స్మశానానికి వచ్చేస్తున్నాడు. వాడు వచ్చినప్పుడంతా బయటకు పరిగెత్తలేక చస్తున్నాం. అసలు ఎలానో అలా వీడిని లేపేస్తే బాగుంటుంది,” విసుక్కుంది పెద్ద ఆత్మ.

“వేరే మంత్రగాడితో వీడికి చేతబడి చేయిస్తే?” సలహా ఇచ్చాడు ధనుంజయరావు.

“సరే లెండి. ఈ మంత్రగాళ్ళంతా ఒక జట్టు. ఐనా మన ఆత్మల మాట ఎవరు వింటారు? ఎవరు పట్టించుకుంటారు?” నిట్టూర్చింది పెద్ద ఆత్మ.

ఒక్క సారిగా స్మశానంలో మళ్ళీ కల కలం రేగింది. ఒక పెద్ద గుంపు వీరి వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది.

“మళ్ళీ ఏమయ్యింది?” అడిగాడు ధనుంజయ రావు.

“నగరంలో పేరు మోసిన మేటి గూండా, కబ్జా సామ్రాట్, ఇంతకు ముందే పోయాడట. ఇప్పుడు ఈ స్మశానం ఆక్రమించడానికి వస్తున్నాడట,” చెప్పింది గుంపు గోల గోలగా.

ఈ సారి ఎవరూ చెప్పే అవసరం లేకుండా తానే అందరి కంటే ముందు పరుగు లంకించుకున్నాడు ధనుంజయ రావు.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

13 Responses to చచ్చే చావొచ్చింది!

 1. ప్రదీప్ says:

  చచ్చే చావోచ్చింది … చచ్చినా సుఖం లేకుండా పోయింది … 🙂

 2. Jo says:

  “గురువు గారూ, ఏం అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఆ మొదటి రాత్రి అన్న పద ప్రయోగం బాగా లేదు. పైగా మీరు మాటకి ముందు ఫెళ్ళున నవ్వడం ఆపేయ్యండి. నాకు కాస్త భయం వేస్తూంది,” అన్నాడు ధనుంజయ రావు.

  “చనిపోయాక భయమేంటండి బాబూ?” అంటూ ఫెళ్ళున నవ్వబోయి ఆఖరి క్షణంలో ఆపేసింది పెద్ద ఆత్మ.

  “పదండి అలా కాసేపు స్మశానం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలానికి వెళ్దాం,” అంది పెద్ద ఆత్మ.

  “ఆ కాద్రా మంత్రాల వల్ల మనకు ప్రమాదమా?” అడిగాడు ధనుంజయరావు.

  “ప్రమాదమని కాదు. వాడు గోచీ కట్టుకుని, ఒంటికి అంతా బూడిద, నెత్తురు పూసుకుని రాత్రి చూస్తే పగలు కలలోకొచ్చేలా ఉంటాడు. పైగా ఆ బండ గొంతు వేసుకుని అవే మంత్రాలు చదువుతాడు. వాణ్ణి భరించడం చాలా కష్టం. అందుకే వాడు వెళ్ళిపోయాక మళ్ళీ వద్దాం లెండి,”

  చించేసారు
  ROFL 😀 😀

 3. sowmya says:

  చచ్చిన మన బుద్ధులు మారవని ఏం సెటైర్ వేసారు మాస్టారూ…మీకు 200 వీరతాళ్ళు 🙂

 4. chaitanya says:

  ” నిజం చెప్పొద్దూ! చనిపోయాను అని తెలిసి కూడా ఒక్క క్షణం చచ్చేంత భయం వేసింది అతనికి. ”

  భలే వ్రాసారు 🙂 🙂 సూపర్ గా ఉంది 🙂

 5. brijbala says:

  “నేనూ! నన్ను గుర్తు పట్టకుండా వెళ్ళిపోతున్నారేంటి? అదీ నాలోంచే నడుస్తూ!” అంటూ తెగ ఫీలై పోయాడు.

  దేహం లేదు అన్న బలహీనత మిగిలింది కానీ, ఎలాంటి అదనపు శక్తులు సంక్రమించినట్టు లేదు.

  “‘నిన్ను తంతే నాకు నొప్పి’ సినిమా ఎట్ల నడుస్తూంది?” రెండో ఆత్మ అడిగింది.

  “పాపులేషన్ ప్రాబ్లెమండీ బాబూ! వచ్చే ఆత్మలే కానీ పోయే ఆత్మలు లేవు కద.

  చాలా బావుంది వ్యంగ్యాస్త్రం.

 6. lucky says:

  superb,,,,,,,,,,,,,:)

 7. రామ says:

  నాకిది బాగా నచ్చింది: “కొందరికి ఇది నచ్చక జనాల మధ్యకు వెళ్ళి ఇంటి చూర్ల మీద మకాం పెట్టారు.”
  దయ్యాలు చూర్లు పట్టుకొని వేలాడతాయని చిన్నప్పుడెప్పుడో చందమామ/బాలమిత్ర కథలలో చదివింది గుర్తు వచ్చింది. 🙂

 8. vsreenivas says:

  దుక్కలా ఉండేవారు. మీరెలా పోయారు?”

  “పొరపాటున నా మాత్ర నేనే వేసుకున్నా
  ఈ డైలాగు అదిరిపోయింది
  హహ్హహా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s