ఆటలో అరటిపండు


ఆటల గురించి నాదొక అభిప్రాయం. అభిప్రాయం అంటే నాకు తెలీదు. కానీ బాబాయి ఎప్పుడూ వాడి అభిప్రాయాల గురించి చెప్తూంటాడు. కాబట్టి నాది కూడా వినండి. వింటే మీకొక చేగోడీ ఇస్తా. (ఉత్తినేలే, నేను చేగోడీలు లాక్కోవటమే కానీ, ఇవ్వడం ఉండదు. కావాలంటే మా టింకూ గాడిని అడగండి.)

ఇంతకీ ఏం చెప్తున్నాను. ఆ! ఆటల గురించి. అసలు దేవుడు మనుషుల్ని ఆటలు ఆడుకోవడానికే పుట్టించాడట. నీకు చెప్పాడా అని అడగొద్దు. నాకు అనుమానం వేస్తుంది. అనుమానం అంటే ఇంసల్ట్. నువ్వు అలా నన్ను అడిగితే నాకు చెప్పలేదని నీతో చెప్పాడా అని, నిన్ను నేను అడగాల్సి వస్తుంది.

ఇక్కడ దేవుడి గురించి నేను కుంచెం చెప్పాలి. దేవుడిని ఇప్పటి దాకా ఎవరూ చూడలేదంట. కానీ వాడు నిఝంగానే ఉన్నాడట. ముందు నేను మా పూజ గదిలో ఉన్నాడేమో అనుకున్నా. ఎందుకంటే రాధ, అంటే మా అమ్మలే, పొద్దున్నే పూజ గదిలో కూర్చుని, “దేవుడా మా బుడుగు బాగా చదువుకుని పెద్ద వాడయ్యేలా చూడు,” అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయడం అంటే దేవుడితో మాట్లాడ్డం. (వాడు మనతో తిరిగి మాట్లాడ్డు అనుకో, అది వేరే విషయం.)

అందుకని నేను దేవుడు మా పూజ గదిలో ఉన్నాడని అనుకున్నా. అమ్మని అడిగితే, “పిచ్చి బుడుగు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు,” అని ఒక మొట్టిక్కాయ వేసింది. (అంతా అబద్ధం! నేను మా ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనపడలేదులే.)

“అమ్మా, మరి అన్ని చోట్లా ఉంటే పూజ గదిలో ఎందుకు ప్రార్థన చేస్తావు?” అని అడిగితే అమ్మకు కోపం వచ్చేసింది. “హన్నా, దేవుడి గురించి అలా మాట్లాడవచ్చురా భడవకానా,” అని నాకు గుండు మీద ప్రైవేట్ చెప్పేసింది.

దాంతో నాకు అర్థమయ్యింది ఏంటంటే దేవుడు మనకు అర్థం కాడూ అని. నిజానికి పెద్దవాళ్ళకు కూడా అర్థం కాడటలే. బాబాయిని అడిగితే ఇవన్నీ మూడు నమ్మకాలు అంటాడు. మూడు నమ్మకాలేంటి వాడి బొంద! ఒకటే నమ్మకం కద!

ఇంతకీ నేను ఏం చెప్తున్నాను? ఆ! ఆటలు! దేవుడు మనుషుల్ని ఆడుకోవడానికే పుట్టించాడు అని నా అభిప్రాయం. (దేవుడు మనుషుల్ని సుబ్బలష్మిని చూసి ఈల వేయడానికి పుట్టించాడు అని బాబాయి అభిప్రాయం. కానీ తప్పు.)

ఎందుకంటే మనుషులు ఆడుకునేప్పుడు చాలా బుద్ధిగా ఉంటారు. కావాలంటే నన్ను తీస్కో. నేను ఆడుకునేప్పుడు అల్లరి అసలు చేయను. బుద్ధిగా ఆడుకుంటాను. (బుద్ధిగా చదువుకోరా అని పెద్ద వాళ్ళు నీకు చెప్తారు. కాని కుదర్దు. బుద్ధిగా ఆడుకోవడం మాత్రమే వీలు అవుతుంది.)

ఆటలాడేప్పుడు మనుషులు ఆనందంగా ఉంటారు. (ఆనందంగా అంటే మా టింకు గాడిలా ఉండకపోవడం. వాడెప్పుడూ మొహం వేళ్ళాడేసుకుని ఉంటాడులే. ) మనుషులు ఆనందంగా ఉంటే సమస్యలు రావు. సమస్య అంటే కష్టం. అంటే నాకు తెలీదు. (ఇప్పుడు నీకు మామిడి తాండ్ర తినాలని ఉంది, కానీ జేబులో కాణీలు లేవనుకో, అది సమస్య అన్న మాట.)

ఐతే నాకు ఈ పెద్ద వాళ్ళని చూస్తే ఒకోసారి జాలి వేస్తుంది. ఎందుకంటే, పాపం వాళ్ళకు ఆడుకునే టైం ఉండదు. అందుకే వాళ్ళకు బోలెడు సమస్యలు అన్న మాట. ఇదే విషయంలో నేను ఒకసారి వాళ్ళందరికి కుంచెం సలహా ఇచ్చాను. “ఉరేయి, గోపాళం, రాధా, బాబాయి, బామ్మా, సాయంత్రం మీరు కూడా వచ్చి మాతో ఆడుకోండి,” అని.

అమ్మ (అంటే రాధలే) , నవ్వేసి, “కుదర్దు బుడుగూ, ఇంట్లో బోలెడు పనులు నాకు,” అంది. ఎందుకు కుదరదు.! కావాలనుకుంటే మహా బాగా కుదురుతుంది. నేనూ, టింకూ గాడూ ఎన్ని సార్లు మా క్లాస్ రూం గది కిటికీలోంచి బయటకు దూకి వెళ్ళి ఆడుకోలేదు. మా విస్సినాధం మాస్టారు మా నడ్డి మీద చంపేస్తాడని భయ పడ్డామా? హేంటో, ఈ పెద్ద వాళ్ళు.

నాన్న (అంటే గోపాళంలే), “రేపు ఆడుకుంటాలే, బుడుగు, ” అన్నాడు. నాన్న ఎప్పుడూ ఇంతే. చేగోడీలు తెమ్మంటే, “రేపు తెస్తానులే బుడుగూ,” అని, ఝట్కా బండి మీద తీసుకెళ్ళమంటే “రేపు తీసుకెళ్తానులే బుడుగూ,” అని అంటాడు. దీన్నే వాయిదా వేయడం అంటారు. అంటే నాకు తెలీదు.

బాబాయికి ఆటలు వద్దుట. వాడికి సుబ్బలష్మి పాడే పాటలే కావాలట. అలా అని వాడికి పాటలు ఇష్టమనుకునేరు. వాడికి సుబ్బలష్మి అంటే ఇష్టం, అంతే!

బామ్మ భళ్ళున నవ్వేసి, “ఈ వయసులో నాకు ఆటలేమిట్రా?” అని ఒక మొట్టికాయ వేసింది. నాకు ఖోపం వచ్చేసింది. నేనేమన్నా చిన్న వాడినా, చితక వాడినా? ఐనా ఆడుకోవట్లేదూ? మరి బామ్మ ఎందుకు ఆడుకోకూడదు? హేంటో, ఈ పెద్ద వాళ్ళు. మళ్ళీ టీవీలో “సీ క్రిష్ణ లీలలు,” సినేమా వస్తే, “బుజ్జి క్రిష్ణుడు, ఎంత బాగా ఆడుకుంటున్నాడో?” అని మురిసిపోతారు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, మీరు కూడా వాయిదా వేయకుండా హాయిగా ఆడుకోండి. మీ మంచి కోసమే చెబ్తున్నా. ఇంక ఉంటాను, సీ గాన పెసూనాంబ ఆడుకుందాం రా అని పిలుస్తూంది.

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

13 Responses to ఆటలో అరటిపండు

 1. kamudha says:

  మురళి

  చాలా బాగుంది. అదరగొట్టేసారు.

  కాముధ

 2. Abhinay says:

  chala bagunnayi kaburloo.Jeevithamae oka aata,Aadukundham hayeegaaa!!!!!!!!!!

  Abhinay

 3. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు, ఇంతకాలం కనిపించకపొవడానికి ఇదన్నమాట కారణం
  మా బుడింగి(నా మేనకొడలెండి) పిలుస్తొంది ఆడుకొవడానికి…

  – రేణూ కూమార్

 4. mee BUDUGU chaala bavunnadu. All the best.

 5. chaitanya says:

  సూపెర్ అండి… భలే వ్రాసారు.
  “నేను ఆడుకునేప్పుడు అల్లరి అసలు చేయను. బుద్దిగా ఆడుకుంటాను. (బుద్ధిగా చదువుకోరా అని పెద్ద వాళ్ళు నీకు చెప్తారు. కాని కుదర్దు. బుద్ధిగా ఆడుకోవడం మాత్రమే వీలు అవుతుంది.)”
  “ఎందుకంటే, పాపం వాళ్ళకు ఆడుకునే టైం ఉండదు. అందుకే వాళ్ళకు బోలెడు సమస్యలు అన్న మాట.”
  భలే చెప్పారుగా 😀

 6. padmarpita says:

  భలే భలేగుంది:):)

 7. Rajiv says:

  బావుందండి బుడుగు గొడవ..

  ఈ పెద్దొల గొల బుడుగుకి పడదు, మాలాంటి బుడుగుల గొడవ ఎవ్వరికి అంతుపట్టదు

 8. Yogi says:

  Chala baghundhi Murali garu..

 9. Sahasra says:

  Hats off to Mullapudi Venkata Ramana gaaru. Inka konni ‘Budugu’ baadha gaadhalu share cheyandi Murali. Bapu garu vesina bulli bugudu cartoon kuda okati pettandi pls. 🙂 Thx for the wonderful collections here.

 10. Praveen Kumar Vasari says:

  Would like to bind up this page to the “BUDUGU” pusthakam.

  Its Marvelous.

 11. tulasi says:

  nenu late ga chaduvutunnanu but yenta haayiga navvukuntunano cheppalenu keep it up sir

  • Murali says:

   థాంక్యూ, మీ క్యామెంట్ అప్రూవ్ చేస్తూ, నేను కూడా ఇంకో సారి ఈ పోస్ట్ చదువుకున్నాను. హేంటో ఈ పెద్ద వాళ్ళు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s