లెక్ఖలూ ఎక్కాలు తెల్వనోల్లు

అమెరికానుంచి ఆ రోజే దిగాడు అనురాగ్. అతను వచ్చింది పెళ్ళి సంబంధాల కోసం. అదే లెండి, తనకు ఒక పెళ్ళి కూతురుని వెతుక్కోవడానికి. అఫ్ కోర్స్, తల్లి తండ్రులు, బంధు మిత్రుల సహాయంతోనే. అతను ఉండేది కేవలం మూడు వారాలు మాత్రమే. ఆ సెలవు కూడా ఎంతో బతిమాలుకుంటేనే దొరికింది అతనికి. బాస్ తెలుగు వాడు కావడంతో ఒప్పించడం ఇంకా కష్టమయ్యింది.

“మూడు వారాలు ఎందుకోయి? మన పద్మాకర్ వెబ్‌కాం/వాయిస్ చాట్‌తో ఇక్కడినుంచే ఒక రోజులో అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. వారం రోజుల్లో వెళ్ళి పెళ్ళి ముగించుకుని వచ్చాడు. అలా ఉండాలి ఎఫిషియెంట్‌గా!” అన్నాడు అనురాగ్‌తో.

“మరే, ఆ తొందరలో చూసుకోలేదట, ఆ అమ్మాయికి మెల్ల కన్ను, దొడ్డి కాళ్ళు అట. ఇక్కడికి వచ్చాక తెలిసింది. విపరీతంగా ఫీల్ అయ్యాడు.అంత ఎఫిషియెంట్‌గా ఉండి ఉండకూడదు అని,” అన్నాడు అనురాగ్.

“వెళ్ళి కలిశాడు కదయ్యా. మెల్లకన్ను, దొడ్డి కాళ్ళు ఉన్నాయని తెలీలేదా?”

“అంటే అక్కడికి వెళ్ళాక, ఆ అమ్మాయిని పెళ్ళి పీటల మీదే చూశాడట. బుట్టలో వాళ్ళ మేనమామ మోసుకొచ్చాడట. పైగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చుందంట. ఎందుకు అని అడిగితే, హోమగుండం నుంచి వచ్చే పొగ పడదు అని సర్ది చెప్పారట.”

“వెబ్‌కాంలో చూసి పెళ్ళి చేసుకుంటే అంత డేంజర్ అపాయం ఉందన్న మాట!”

“అందుకే సార్, నేను అలా హడావుడిగా చేసుకోకూడదనుకుంటున్నా.”

“సరే అలా ఐతే మూడు వారాలు శాంక్షన్ చేశాలే.”

అలా, ఆ రకంగా మూడు వారాల సెలవుతో ఇండియాకి వచ్చాడు అనురాగ్.

“అమెరికానుంచి వచ్చిన ఐదున్నర అడుగుల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. ఏడాదికి ఆల్‌మోస్ట్ ఆరంకెల జీతం సంపాయిస్తున్న వాడిని. ఇంకా పెళ్ళి కాని వాడిని. మన ఇలాకాలో ఉన్న పెళ్ళి కాని అమ్మాయిల తల్లి తండ్రులందరూ మనింటికి ఒకే సారి రావడంతో మన వీధిలో ట్రాఫిక్ జాం అయిపోతుందేమో?” అనుమానం వెలిబుచ్చాడు అనురాగ్ వాళ్ళ నాన్నగారితో.

“అసలు ఆ అవకాశం వాళ్ళకు మనం ఇవ్వం కదరా అబ్బాయి! రేపే మన చుట్టాలమ్మాయి పెళ్లి ఉంది. అక్కడికి వెళ్దాం. మన పెళ్లిళ్ళ సంగతి నీకు తెలీనిదేముంది. చాలా మంది వాటిని అటెండ్ అయ్యేదే ఏవన్నా పెళ్లి సంబంధాలు కుదురుతాయేమో అని. కాబట్టి మనం కూడా వెళ్తే అంతా పద్ధతిగా జరిగిపోతుంది. నీకు సరయిన ఎక్స్‌పోజర్ లభిస్తుంది,” చెప్పారు అనురాగ్ నాన్నగారు.

సరే అన్నట్టు తల ఊపాడు అనురాగ్.

***

కాస్త ఉక్కగా ఉన్నా పెళ్లికి సూట్ వేసుకుని వెళ్ళాడు అనురాగ్. ఎంతైనా అమెరికా నుంచి వచ్చాడు కద, ఆ మాత్రం దర్జాగా ఉండడం అవసరం అని అతని అభిప్రాయం.

అతను వెళ్ళేసరికి పెళ్ళి హాల్ ఒక మోస్తారుగా నిండిపోయింది. అనురాగ్ అనుకున్నట్టుగానే అతని దగ్గర ఒక చిన్న గుంపు (పెళ్లి కాబోయే అమ్మాయిల తండ్రులు, మామయ్యలు, అన్నయ్యలు, బాబాయిలు టైప్ మనుషులు అన్న మాట) తయారయ్యింది.

అనురాగ్ అమెరికానుంచి వచ్చాడు అని, ఏడాదికి ఆల్‌మోస్ట్ ఆరంకెల జీతగాడని, ఐదున్నర అడుగుల అందగాడని హాల్‌లో దాదాపు అందరికి తెలిసిపోయింది. “నాన్నే కరెక్ట్. ఇక్కడైతే ఇలా డిగ్నిఫైడ్‌గా సంబంధాలు వెతుక్కోవచ్చు,” అనుకున్నాడు అనురాగ్.

మెల్లగా హాల్ నిండడం మొదలు పెట్టింది. “ఇక ఒకటే తోసుకుంటూ నెట్టుకుంటూ వస్తారేమో తనని కలవడానికి,” అనుకున్నాడు అనురాగ్. అతను అనుకున్నట్టే ఒక పెద్ద గుంపు అతని వైపు వచ్చేసింది.

“నెమ్మదిగా, నెమ్మదిగా! ఒకరి తరువాత ఒకరు రండి. అందరితో మాట్లాడతాను,” హామీ ఇచ్చాడు అనురాగ్. కానీ ఆ గుంపు అతన్ని పట్టించుకోకుండా అతని పక్కనుంచి వెళ్ళిపోయింది.

కొద్దిగా చిన్నబుచ్చుకున్నాడు అనురాగ్. “ఏమైంది? అంత హడావుడిగా వెళ్ళిపోయారు?” పక్కనున్నతన్ని అడిగాడు.

“మరి పెద్ద మనిషి వస్తే వెళ్ళరుటండి?” అన్నాడాయన.

“పెద్ద మనిషి అంటే, ఎవరైనా స్వామీజీనా?”

“కాదు.”

“మరి ఎవరైనా పేరు మోసిన యాక్టర్ గారా?”

“అబ్బే!”

“పోనీ, నాలా సాఫ్ట్‌వేర్ ఇంజనీరా?”

“ఛీ! కాదు!”

“మరి?”

“మన కలెక్టరాఫీసులో బంట్రోతు.”

“అతనికింత హడావిడా?”

“లేకపోతే! పేపర్ చదవరా, టీవీ చూడరా? కలెక్టరాఫీసులో బంట్రోతుగా పని చేసి ఇరవయి ఏళ్ళలో ఇరవయి కోట్లు సంపాయించాడు. అవినీతి కారణంగా ఉద్యోగం తీసేశారనుకోండి. కానీ ఆయనకేం ఫర్లేదు, ఇప్పుడు ఓపెన్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. అన్నట్టు మీరు అమెరికాలో పని చేశారు కద, మీ దగ్గరెన్ని కోట్లు ఉన్నాయి?”

“తొడుక్కోవడానికి కూడా అన్ని కోట్లు లేవు,” నీరసంగా చెప్పాడు అనురాగ్.

ఈ సారి మొదటి గుంపు కంటే పెద్దది ఎంట్రన్స్ వైపు పరిగెట్టింది.

“ఈయనెవరు?” అసూయగా అడిగాడు అనురాగ్.

“సెక్రటేరియట్‌లో ప్యూన్. రిటైర్ కావడానికి ఒక నెల ఉంది. ఇప్పటి వరకు యాభై కోట్లు సంపాయించాడు.”

“ఓలమ్మో!”

ఈ సారి దాదాపు హాల్‌లో సగం మంది డోర్ వైపు పరిగెత్తారు.

“ఈ సారి ఎవరు వచ్చారు?” భయం భయంగా అడిగాడు అనురాగ్.

“ఎండౌమెంట్స్ ఆఫీస్‌లో గుమాస్తా. పదేళ్ళలో మూదొందల కోట్లు సంపాయించాడు.”

కళ్ళు తిరిగి కింద పడబోయిన అనురాగ్‌ని ఆయనే పట్టుకున్నాడు.

అంతలో గుమాస్తా గారు వెనకాల ఒక పెద్ద మందతో అక్కడికి వచ్చేశారు. మొదటి వరుసలో సీట్లు ఖాళీగా లేకపోవడం గమనించి నొసలు చిట్లించారు. పెళ్లి కూతురు తండ్రి గతుక్కుమని, “ఒక నిమిషం సార్!” అంటూ మొదటి రోలో కూర్చున్న వారందరిని (అనురాగ్‌తో సహా) లేపేసి గుమస్తా గారికి, ఆయన మిత్రులకి సీట్లు ఖాళీ చేశాడు.

మనసులో ఆనందపడినా పైకి, “అదేంటయ్యా, పాపం కూర్చున్న వాళ్ళని లేపేశావు,” అన్నారు గుమాస్తా గారు.

“ఆ వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాదు లెండి సార్. ఏదో అమెరికాలో బోడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అంతే!” తేల్చేశాడు పెళ్లి కూతురి తండ్రి.

“రేపే నా జాబ్ కి రిజైన్ చేసి, ఎలాగో అలా ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ప్యూను గానో, గుమాస్తాగానో ఉద్యోగం సంపాదించాలి,” తనలో తాను నిర్ణయించుకున్నాడు అనురాగ్.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

10 Responses to లెక్ఖలూ ఎక్కాలు తెల్వనోల్లు

 1. రామకృష్ణ says:

  బాగా వ్రాసారు. గమ్మత్తుగా తేలికగ కళ్ళు చెమర్చ కుండా వ్రాశారు.

 2. Jyothi Reddy says:

  Murali ji,

  Really, it is a great one. This is the fact now a days and the way you explained is fabulous. I was unable to
  control my laughter….

 3. రవి says:

  అదేదో మల్లిక్ జోకొకటుంది. “వా.. మా అమ్మా నాన్నలు అమెరికా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిచ్చి నన్ను పెళ్ళి చేసి, నా గొంతు కోశారు” అని. సాఫ్టు వేరు ఉద్యోగం, హార్డు వేరు బతుకులు అని ఏ మహిళా రచయితో, ఓ కన్నీటి గాథ నవలగా రాస్తే బావుంటుంది.

  • Murali says:

   రవి గారు, అలాంటి ఐడియాలు ఇచ్చి నన్ను రెచ్చ గొట్టొద్దు ప్లీజ్. 😀

 4. chitra says:

  baagundi. Heading inkaa baagundi

 5. “పోనీ, నాలా సాఫ్ట్‌వేర్ ఇంజనీరా?”

  “ఛీ! కాదు!”

  🙂 🙂 🙂

  ఎప్పట్లాగే తెగ నవ్వించేశారండీ బాబూ..!

 6. bhargavi says:

  chala bagunnadi mee kadha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s