మాతుర్ బాషా దినోస్తవం“బురుగూ బురుగూ, మాతుర్ బాషా దినోస్తవం అంటే ఏంటి?” అడిగింది నన్ను సీ గాన పెసూనాంబ.

“సీ గాన పెసూనాంబా, సీ గాన పెసూనాంబా, మాతుర్ బాషా దినోస్తవం అంటే నాకు తెలీదు. నేనెప్పుడూ తినలేదు,” అని చెప్పాను నేను.

“నీ మొహం! అది తినేది కాదు. ఒక పండగట. మా అమ్మ చెప్పింది. కానీ ఎందుకు పండగ చేసుకుంటారో అడిగితే చెప్పేంతలోపు పక్కింటి పిన్నిగారు వచ్చింది,” అంది సీ గాన పెసూనాంబ.

ఐతే మాతుర్ బాషా దినోస్తవం అంటే పండగన్న మాట. ఇక్కడ పండగ గురించి మీకు నేను కుంచెం చెప్పాలి. ఎక్కువ సార్లు పండగ అంటే ఎవరైనా దేవుడి పుట్టిన రోజు అయి ఉంటుంది. ఇప్పుడు కిష్నాష్టమి ఉందనుకో అది కిష్నుడి బర్త్‌డే. సీ రామ నవమి ఉందనుకో, అది రాముడి బర్త్‌డే. మరి సంకురాత్రి ఎవరి బర్త్‌డే అని నన్ను అడగకు. నాకు తెలీదు. కొన్ని సార్లు పండగ ఎవరి బర్త్‌డే కాకపోవచ్చు. అందుకే సీ గాన పెసూనాంబని అడిగాను, “మాతుర్ బాషా దినోస్తవం ఎవరి బర్త్‌డే?” అని.

“నీ మొహం! నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా?” అరిచింది సీ గాన పెసూనాంబ. నాకు ఒళ్ళు మండిపోయింది. నేనేమన్నా చిన్న వాడినా చితక వాడినా అలా అరవడానికి. ఇంతలో సీ గాన పెసూనాంబే, “టీవీలో ఏం చెప్తున్నారో చూద్దాం,” అంటూ టీవీ పెట్టింది.

టీవీలో ఒక యాంకరమ్మ కనిపించి నోరంతా చేటలా చేసుకుని నవ్వుతూ, “ఇప్పుడు మనం సచివాలయానికి వెళ్దాం. Let’s see what’s happening at the secretariat. తెలుగు మన మాతృ భాష. Telugu is our mother tongue. అందుకు మనం గర్వపడాలి. We should be proud,” అని చెప్పింది. (నాకు కుంచెం అర్థం అయ్యింది. కుంచెం కాలేదనుకో. కానీ అర్థమైనట్టే మొహం పెట్టాను.)

వెంటనే టీవీలో బొమ్మ మారి పోయింది. ఎవరో పెద్దాయన తెలుగు తల్లి విగ్రహానికి దండ వేసి, “ఈ రోజు మనకు పర్వ దినం!” అన్నాడు. చుట్టూ ఉన్న గుంపంతా చప్పట్లు కొట్టారు. ఎందుకైనా మంచిది అని సీ గాన పెసూనాంబా నేను కూడా ఇంట్లోనే చప్పట్లు కొట్టేశాం.

“మనమంతా తెలుగులో మాట్లాడాలి. తెలుగులో చదువుకోవాలి. తెలుగులో ఊపిరి తీయాలి,” కుంచెం ఏడుపు గొంతుతో అన్నాడు పెద్దాయన.

చెప్పొద్దూ! అంత పెద్ద మనిషి ఏడుపు గొంతుతో మాట్లాడితే నాకూ ఏడుపు వచ్చింది.

“ఒరే పెద్దాయన గారూ! అలాగే లేరా. నేను తెలుగులోనే మాట్లాడుతాలే,” వాడికి ధైర్యం చెప్పాను నేను. నాకు తెలుగు ఒక్కటే మాట్లాడ్డం వచ్చనుకో. కాని వాడికి ఆ విషయం తెలీదుగా! అందుకే చెప్పాను.

“అన్ని భాషల్లో తెలుగు భాషే గొప్పది,” మళ్ళీ వాడే అన్నాడు.

అంటే పెద్దాయనకు అన్ని బాషలు వచ్చన్న మాట. నాకు బోలెడు చాలా ఆనందం వేసింది. అన్ని తెలిసినా, వీడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప. నేను కూడా ఒక్క తెలుగే మాట్లాడతాననుకో. కానీ నాకు వేరే బాషలు రావు కద. కాబట్టి నేను గొప్ప కాదు. అదే చెప్పాను సీ గాన పెసూనాంబకి.

“నాకు ఎప్పుడో తెలుసు, నువ్వు గొప్ప కాదని,” మూతి మూడోంకర్లు తిప్పింది అది. ఏ మాటకదే చెప్పుకోవాలి. అది అలా మూతి తిప్పితే భలే ఉంటుంది.

మళ్ళీ టీవీలో బొమ్మ మారిపోయింది. యాంకరమ్మ మళ్ళీ వచ్చేసింది. “ఇప్పుడు మీరు సచివాలయం వద్ద మాతృ భాషా దినోత్సవం వేడుకలు చూశారు. You just watched the celebrations at the secretariat,” మళ్ళీ నోరంతా బార్లా తెరిచి నవ్వుతూ అంది అది.

“పద మనం టింకూ గాడి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి వాడికి చెబ్దాం,” అంది సీ గాన పెసూనాంబ. టీవీ కట్టేసి మేము టింకు గాడి ఇంటికి వెళ్ళాం.

మేము వెళ్ళే సరికి టింకూ వాళ్ళ నాన్న వాడిని గాఠిగా ఖోప్పడేస్తున్నాడు, “నిన్ను డాడీ అని పిలవమని ఎన్ని సార్లు చెప్పానురా, ఈ సారి నాన్న అంటే చీరేస్తాను,” అని.

మేమెందుకైనా మంచిది అని వెనక్కి వచ్చేశాం. మాతుర్ బాషా దినోస్తవం అంటే తెలుగులో మాట్లాడాలి, తెలుగులో ఊపిరి తీయాలి అని మేము టింకూ గాడికి చెప్తే, వాడు నిఝమే అనుకుని అలా చేస్తే, ఈ రోజు వాడి వీపు విమానం మోత మోగుతుంది కద!

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

9 Responses to మాతుర్ బాషా దినోస్తవం

 1. చైతన్య.ఎస్ says:

  బాగుంది 🙂

 2. bondalapati says:

  మాతుర్ బాషా దినోస్తవం ఇప్పటి వాత్సవానికి మిర్రర్ పడుతోంది…

 3. Jyothi Reddy says:

  Muraliji,

  “తెలుగులో ఊపిరి తీయాలి” Nice one Sir!

  Can you please write on Kalki (modern) Bhagvan?

 4. yagnasri says:

  మీ శైలి బాగుంది “ముళ్ళపూడి” మురళి గారు 😀 నిఝంగా బుడుగు చెప్తునట్టే ఉంది

 5. nagarjuna says:

  :)నేను బోలెడు చాలా నవ్వాను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s