బాబా నీకు మొక్కుతా!

అది ఒక మధ్య తరగతి లొకాలిటీ. ఒక ఇరుకు సందు. నగరంలో పుట్ట గొడుగుల్లా పెరిగిపోయిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్సుల్లో అదొకటి.

రాఘవరావు గారు పూర్తిగా కృంగి పోయి ఉన్నారు. పక్కనే ఉన్న ఆయన భార్య కళ్ళు చెంగుతో ఒత్తుకుంటూంది. అసలు ఈ గొడవంతటికీ కారణమైన రాఘవరావు కూతురు సుజాత వారి ఎదుటే తల వంచుకుని దోషిలా నిలబడి ఉంది.

“నీకేం పోయే కాలం వచ్చిందే, ముదనష్టపు దానా! నీకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఇదేనా?” ఏడుపూ, కోపం మేళవించిన గొంతుతో నిలదీశాడు రాఘవరావు సుజాతని.

“మా నుంచి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనామ్మా?” ఇది సుజాత తల్లి వేదన.

“అది కాదమ్మా! అందరూ వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను,” గొణిగింది సుజాత.

“హయ్యొ నా తల్లో! అందరికి నీకు తేడా లేదుటమ్మా? నువ్వు పెళ్ళి కావాల్సిన ఆడ పిల్లవి అని మర్చిపోయావా? మన మధ్య తరగతి మనుషులకు పరువు ప్రాణంతో సమానమమ్మా! నువ్వు ఇలాంటి తిరుగుళ్ళు తిరుగుతున్నావు అని తెలిస్తే మన చుట్టాల్లో మనం తలెత్తుకుని తిరగ గలమా? ఇప్పుడు నీకు పెళ్లి సంబంధం తేవడం ఎలా?” వాపోయింది సుజాత తల్లి.

“అసలేం జరిగింది రాఘవరావు గారూ? అమ్మాయినలా ఎందుకు కోప్పడుతున్నారు?” మృదువుగా అడిగాడు పక్క అపార్ట్‌మెంట్‌లో ఉండే భూషణం గారు.

జరిగింది ఆయనతో చెప్పాడు రాఘవరావు. భూషణం గారి మొహంలో రంగులు మారాయి. “అంత పని జరిగిందా? ప్చ్! ఏం చేస్తాం చెప్పండి. ఈ సమాజమే అలా తయారయ్యింది. మనం ఇంట్లో ఎంత మంచి నూరి పోసినా, బయటకు వెళ్ళే సరికి మన ఉపదేశాలు ఏమీ చేయలేక పోతున్నాయి,” నిట్టూర్చాడు ఆయన.

“అంకుల్!” అంది సుజాత బొంగురు పోయిన గొంతుతో.

“సారీ అమ్మా. ఇది మీ కుటుంబ సమస్య అని నాకు తెలుసు. కాని ఒక సాటి ఆడపిల్ల తండ్రిగా రాఘవరావు గారి బాధని నేను అర్థం చేసుకోగలను. అందుకే సానుభూతి తెలుపకుండా ఉండలేక పోతున్నాను,” అన్నాడు ఆయన.

అప్పుడే అక్కడికి వాళ్ళ వీధి గూండా గళ్ళ లుంగి గంగులు వచ్చాడు. అందరు సైలెంట్ అయిపోయారు. గంగులు కాస్త నొచ్చుకున్నాడు.

“మీకెన్ని సార్లు చెప్పనమ్మా! నేను గూండానే కానీ, మీ వీధిలో ఉండే గూండాని. కాబట్టి నా నుంచి ఏం భయం లేదు అని చెప్పానుగా?” అన్నాడు.

“అబ్బెబ్బే, భయం కాదు గంగులూ, మా అమ్మాయి చేసిన పని అలా ఉంది. చెప్పుకుంటే కూడా ఎవరు తీరుస్తారు? అందుకే అలా మాట్లాడకుండా ఉండి పోయాం,” చెప్పింది సుజాత తల్లి.

“ఎవరు మన సుజాతమ్మా? మన వీధికే ఆదర్శమైన ఆడపడుచు, తను అంత ఘోరమైన తప్పు ఏం చేసింది?”

“నా నోటితో నేను చెప్పలేను గంగులూ,” భోరుమంది సుజాత తల్లి.

“మీరైనా చెప్పండి రాఘవరావు గారూ!”

“చెప్తాను గంగులూ. తప్పుతుందా! తండ్రిని కద. బిడ్డలు చేసిన తప్పులు తండ్రే మోయాలి కద! మా అమ్మాయి ఏం చేసింది అనుకున్నావు. నీకు మిథ్యానంద స్వామి తెలుసు కద? ఆయన ఆశ్రమానికి పాద పూజ చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పు? ఎంత అప్రతిష్ట, ఎంత నామర్దా!”

“నహీ!” అరిచాడు గంగులు హిందీలో.

“వింటున్న నీకే అలా ఉంది. ఇక తల్లి తండ్రులం, మా పరిస్థితి ఏంటో ఊహించు! ఆ మిథ్యానంద స్వామి ఎందరి జీవితాలు పాడు చేశాడో నీకు తెలుసు కద. అలాంటి వాడి దగ్గరికి పాద పూజ చెయ్యడానికి వెళ్ళిందయ్యా నా కూతురు,” గుండెలు బాదుకున్నాడు రాఘవరావు.

“ఏమండి. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం, అలా ఆవేశానికి లోను కాకండి,” ఏడుస్తూ అంది ఆయన భార్య.

“నాన్నా, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఏ స్వామి ఆశ్రమానికి వెళ్ళను నాన్నా, వెళ్ళను,” అంటూ విలపిస్తూ రాఘవ రావు కాళ్ళ మీద పడింది సుజాత.

“ఒక్క స్వామీ, బాబాలే కాదమ్మ, ఏ భగవాన్లూ, ఏ అమ్మల దగ్గరికి కూడా వెళ్ళను అని ఈ ముసలి తండ్రికి మాటివ్వమ్మా,” గద్గదమైన స్వరంతో అన్నాడు రాఘవరావు.

“అలాగే నాన్నా! వాళ్ళు ఎన్ని శివలింగాలు గాలిలోంచి సృష్టించినా, ఎన్ని ప్యాకెట్ల విభూది ఇచ్చినా, ఇక ప్రలోభాలకు లోను కాను నాన్న. ఇక నుంచి రాముల వారి గుడికి మాత్రమే వెళ్తాను,” స్థిరమైన గొంతుతో అంది సుజాత.

“నా బంగారు తల్లి!” ఆనందంగా సుజాత తల నిమిరాడు రాఘవరావు.

“మా అమ్మాయి కూడా ఇలానే కక్కు భగవాన్ దగ్గరకి వెళ్ళొస్తాను అంటే, సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. కక్కు భగవాన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టొద్దని,” బరువైన గొంతుతో అన్నారు భూషణం గారు.

“అవును సుజాతమ్మా! ఈ స్వాములు చాలా డేంజర్. అదే మా లాంటి గూండాలో, రౌడీలో అనుకో! మా సంగతి అందరికీ తెలుసు. జనం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ స్వాములూ, బాబాలతో అలా కాదు. కొంత ఆద మరచి ఉంటే, జీవితాలే బుగ్గి పాలయ్యే ప్రమాదముంది,” అన్నాడు గంగులు.

అందరూ నిజమే అన్నట్టు తల ఊపారు.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

14 Responses to బాబా నీకు మొక్కుతా!

 1. చైతన్య.ఎస్ says:

  🙂 🙂 🙂 🙂 🙂

 2. హబ్బ.. పొద్దు పొద్దున్నే ఏం నవ్వించారండీ బాబూ!! 😀 😀 😀

 3. తెలుగు అభిమాని says:

  మిథ్యానంద స్వామి & కక్కు భగవాన్ – ’ఫన్’ టాస్టిక్.

 4. శివ బండారు says:

  🙂

 5. naga says:

  hi murali garu
  baba la gurunchi raasaru chaala baagundhi.
  kani temples lo kooda same situation kada!(ex: keesari gutta)
  alantappudu SUJATHA ki akkadu kooda probleme kada?!!!!
  basic ga evari jaagrathalo vaallu vundaalemo!
  but anyways, u r a grt writer.

  • Murali says:

   నాగ గారూ,

   నిజమే! ప్రమాదం అన్ని చోట్లా పొంచి ఉంది. నేను గుడి, అందులోనూ రాముల వారి గుడి అని ఎందుకన్నాను అంటే, దేవుడిగా కాక పోయినా ఒక ఆదర్శ వ్యక్తిగా రాముడిని నేను గౌరవిస్తాను. పైగా, ఇలాంటి ప్రత్యక్ష్య అవతారాల మల్లే, ఆయన మన మధ్యకు వచ్చేసి, ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. నాకు సంబంధించి రాముడు ఒక మంచి కాసెప్ట్. మిథ్యానంద స్వామి ఒక దుష్ట న్యూసెన్స్! 🙂 ఇంకో రకంగా చెప్పాలంటే, మహిమల కంటే, మంత్రాల కంటే, ఆధ్యాత్మికతను ఆదరించడం మంచిది అని నా నమ్మకం.

   -మురళి

 6. Devendar says:

  :)…excellent creative story

 7. Sravana Kumar says:

  keka

 8. Rajiv says:

  ముందుగా ఎమైందా అనుకుంటూనే, రాసింది మురళి గారు ఎదొ Twist ఉంటుంది అనుకున్నాను

  చాలా బావుంది… ఆంగ్లములొ చెప్పాలంటె ROFL

 9. Cyno says:

  😛 ఆది ఆది ఆది ..(జూ ఎంటీవోడి ఆది సినిమాలో బాక్ గ్రవుండు మ్యూజిక్కు)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s