దండేస్తే చాలు, దండం అక్కర్లేదు


పెళ్లి పందిరి దగ్గర అంతా హాడావుడిగా ఉంది. జోగయ్య గారు, జారి పోతున్న కండువా సర్దుకుంటూ ఒకటే, అటూ ఇటూ తిరిగేస్తున్నారు.

ఆయన్ను మించిన స్పీడుతో అక్కడికి వచ్చేశాడు ఆయన బావమరిది రత్నాకర్. రాగానే, “ఇదిగో బావా, నీ చెవి ఒక సారి ఇలా ఇవ్వు, అర్జెంటుగా కొరకాలి,” అన్నాడు.

“అమ్మో! నేనివ్వను, అయినా ఇదేం పాడు అలవాటురా నీకు? పొద్దున్నే మగ పెళ్ళివారి కంటే ముందు, నువ్వే ఫుల్ మీల్స్ లెవెల్లో ఉప్మా లాగించావుగా? మళ్ళీ నా చెవి ఎందుకు?” అడిగారు జోగయ్య గారు.

“అబ్బా! అది జనాంతికంగా అన్నాలే బావా! నా ఉద్దేశం నీకు ఒక విషయం చెప్పాలని,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు రత్నాకర్.

“ఐతే ఈ ఎడమ చెవిలో కానివ్వు. కుడి చెవిని మీ అక్క, కొరికీ కొరికీ అది సరిగ్గా పని చేయ్యట్లేదు,” తన ఎడమ చెవి రత్నాకర్ వైపు పారేశారు జోగయ్య గారు.

“సమస్య బావ! పెద్ద సమస్య వచ్చి పడింది.”

“ఏమయ్యింది, మగ పెళ్లి వారు అందరూ తినేంత లోపే ఉప్మా అయి పోయిందా?”

“కాదు!”

“కొంప తీసి ఉప్మా మిగిలిందా! అసలే ప్లేటుకు ముప్ఫై రూపాయలు చార్జ్ చేశాడు ఆ క్యాటెరింగ్ వాడు.”

“బావా, నీ ఉప్మా గోల ఆపుతావా?”

“మరేమయ్యింది?”

“పెళ్లి కొడుకు అలక పానుపు ఎక్కాడు!”

“నహీ!” పెద్దగా అరిచాడు జోగయ్య.

“నువ్వు హిందీలో ఎంత పెద్దగా అరిచినా లాభం లేదు బావా. తన కోరిక తీరిస్తేనే ఈ పెళ్లి చేసుకుంటాడట.”

“ఏంటి అల్లుడి గారి కోరిక?”

“అదేదో నీకే చెప్తాడట.”

“ఇక ఆలస్యమెందుకు? పద, పెళ్లి కొడుకు ఉన్న విడిదింటికి!”

“పద బావా!”

***

విడిదింట్లో అడుగు పెడుతూంటేనే భయమేసింది జోగయ్య గారికి, అల్లుడు ఏ గొంతెమ్మ కోరిక అడుగుతాడో అని. కాని గుండె రాయి చేసుకుని అల్లుడి గదిలోకి అడుగు పెట్టాడు, రత్నాకర్‌తో సహా.

ఆయనకు కాబోయే అల్లుడు ఆదర్శ కుమార్, మంచం మీద ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు.

“అల్లుడు గారు,” మృదువుగా పిలిచారు జోగయ్య గారు.

“నేను అలిగాను, మాంగారూ,” డిక్లేర్ చేశాడు ఆదర్శ కుమార్.

“ఏం కావాలో చెప్పు బాబు. నా శక్తి కి సాధ్యమైంది ఐతే తప్పక తీరుస్తాను,” ప్రామీస్ చేశారు జోగయ్య గారు.

“మరేమో, మరేమో…”

“చెప్పు బాబు!”

“మరేమో నాకు..”

“కారు కావాలా?” అడ్డు పడ్డాడు రత్నాకర్.

“ఊహూ,” తల అడ్డంగా ఊపాడు ఆదర్శ కుమార్.

“ఐతే, ఫ్లాట్ కావాలేమో బావా?” అన్నాడు రత్నాకర్.

అల్లుడు చూడకుండ కసిగా బావ మరిదికి తొడ పాశం పెట్టారు జోగయ్య గారు. “వాడి మాటలు పట్టించుకోవద్దు. నీకేం కావాలో చెప్పు బాబు,” అన్నారు.

“అవేం వద్దు.”

“మీకు దండం పెడతా! ఏం కావాలో చెప్పండి అల్లుడు గారూ!”

“దండం అక్కర్లేదు. ఒక దండేస్తే చాలు!” ఆఖరికి తనకు కావల్సింది ఏంటో చెప్పాడు అల్లుడు.

“బాబూ!” ఒక్క పొలికేక పెట్టారు జోగయ్య గారు.

“ఆ వాల్యూం ఏంటి బావా! ఒక పక్క ఓపిక లేదు అంటావు. ఇంకొక పక్క ఇలా గావు కేకలు పెడతావు,” విసుక్కున్నాడు రత్నాకర్. మళ్ళీ ఎందుకైన మంచిది అని జోగయ్య గారు తొడ పాశం పెట్టే ఛాన్స్ ఇవ్వకుండా నాలుగు అడుగులు పక్కకి గెంతాడు.

కాని అక్కడ రత్నాకర్‌ని పట్టించుకునే స్థితిలో లేరు జోగయ్యగారు. ఆవేశంతో ఊగిపోతూ, “మామల్ని రాచి రంపాన పెట్టే అల్లుళ్ళున్న ఈ రోజుల్లో, జస్ట్, కేవలం ఒక దండ మాత్రమే అడిగావంటే, నువ్వు మాములు మనిషివి కాదు, బాబూ!” గద్గదమైన గొంతుతో అన్నారు.

“అంటే, మాంగారూ, నాకు ఎలాంటి దండ కావాలంటే…. చెప్పడం ఎందుకు లెండి, అలా టీవీ వైపు చూడండి,” వేలు పెట్టి చూపించాడు ఆదర్శ కుమార్.

అటు వైపు చూసిన జోగయ్య గారికి ఏదో న్యూస్ చ్యానెల్‌లో వస్తున్న ప్రోగ్రాం ఒకటి కనిపించింది. అది జంబూ ద్వీపంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్త ప్రదేశ్. ఆ రాష్ట్రానికి ముఖ్య మంత్రి, పేదల పాలిటి పెన్నిధి ఐన బాణామతి. ఆవిడ పార్టీ సభ్యులంతా కలిసి వెయ్యి రూపాయల నోట్లతో చేసిన ఒక దండను ఆమె మెడలో వేస్తున్నారు.

“అయ్య బాబోయి, కోట్ల విలువ చేస్తుంది,” అన్నాడు రత్నకర్.

“అంత అక్కర్లేదు మాంగారూ. బాణామతి గారికి వేసిన దండలో పదో వంతు బరువు ఉన్నా చాలు,” చెప్పాడు ఆదర్శ కుమార్.

దబ్ మన్న శబ్దంతో కిందకి విరుచుకు పడిపోయారు జోగయ్య గారు.

“ఇలా అపార్థాలు చేసుకోవడం ఎందుకు, మూర్ఛ పోవడం ఎందుకు,” తనలో తాను అనుకున్నాడు రత్నాకర్.

Multi-Crore Garland

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

2 Responses to దండేస్తే చాలు, దండం అక్కర్లేదు

  1. అనానిమకుడు says:

    ౧) చాలా బాగుంది.’ఫుల్ మీల్స్ లెవెల్లో ఉప్మా లాగించావుగా’ – ఫన్ టాస్టిక్.
    ౨) ’బాణామతి’.it is too good.

  2. krishna says:

    how did i miss this much funny blog sir,that too in wordpress?
    its really good,too good to resist from commenting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s