నీ మొహం చూస్తే పాపం!

త్రిలింగ దేశాన్ని పరిపాలిస్తున్న గాంక్రెస్ పార్టీ గొప్ప సంస్కారవంతమైన పార్టీ. బతికున్నప్పుడు పట్టించుకోని వ్యక్తులని వాళ్ళు పరమపదించాక ఠక్కున గుర్తించి వారికి నివాళులు అందించడంలో ఆ పార్టీది అందె వేసిన చేయి. అదే సంస్కారంతో గాంక్రెస్ పార్టీకి చెందిన ఒక వృద్ధ నాయకుడు మరణించడంతో గాంక్రెస్ నాయకులంతా ఆయనకు నివాళులర్పించడానికి అంధేరా ప్రదేశ్ లోని ఒక పెద్ద పట్నమైన బ్లేజ్‌వాడ చేరుకున్నారు.

ఐతే ఇందులో ఒక చిన్న మతలబు ఉంది. గాంక్రెస్ పార్టీలో ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూంది అంటే కోల్డ్ వార్ అన్న మాట.

వై.నో పోయాక గాంక్రెస్ హై కమాండ్, ఆయన అబ్బాయి గగన్‌ని కాదని వృద్ధుడైన మోశయ్యని ముఖ్య మంత్రిని చేసింది. గగన్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మోశయ్యని దింపి తను గద్దె ఎక్కలేక పోయాడు. దీని వలన అంధేరా ప్రదేశ్‌లో గాంక్రెస్ రెండు ముఖ్య వర్గాలుగా విడిపోయింది. ఒకటి మోశయ్య వర్గం ఐతే ఇంకోటి గగన్ వర్గం. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే గగన్, మోశయ్య ఒకరి మొహం ఒకరు చూసుకోవడం కూడా మానేశారు.

ఇలాంటి పరిస్థితిలో గాంక్రెస్ పార్టీలో ముఖ్యులందరూ బ్లేజ్‌వాడకు వెళ్ళాల్సిన సందర్భం రావడంతో ఈ రెండు వర్గాలకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఎలాగైనా గగన్, మోశయ్యా ఒకరికొకరు ఎదురు పడకుండా చూడాలని ఇరు వర్గాలు నిశ్చయించుకున్నారు. దాని వల్ల కొన్ని చిత్ర విచిత్రాలు జరిగాయి…

***

అది గున్నవరం ఎయిర్‌పోర్ట్! గగన్ అసహనంగా ఉన్నాడు. “ఏమైందయ్యా, మన దివంగత నాయకుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అని నేను తొందర పడుతూ ఉంటే నన్ను ఆపేస్తున్నారు?” అడిగాడు పక్కనున్న వారితో.

“సారీ సార్! మోశయ్యగారు కూడా ఇదే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. మీరు బయటపడాలంటే ఆయన ముందు నుంచే వెళ్ళాలి. మీరేమో ఆయన మొహం చూడను అని తీర్మానించుకున్నారు. అందుకే కాసేపాగుదాం,” అన్నాడు గగన్ పీ.యే.

“ఓ, అలాగా! ఐతే సరే! నాకు ఆయన మొహం చూడాలంటేనే అసయ్యం. కష్టపడి మా నాన్న దక్కించుకున్న విజయాన్ని అప్పనంగా తన్నుకుపోయాడు,” కసిగా అన్నాడు గగన్.

అక్కడ మోశయ్యని ఆయన అనుచరులు హడావుడి పెడుతున్నారు, “ముఖ్య మంత్రి గారూ! తొందరగా పదండి. గగన్ గారి విమానం ఇప్పుడే ల్యాండ్ అయ్యిందట. ఆలస్యం చేస్తే ఆయన ఇటే వచ్చేస్తారు. మీరు ఆయన మొహం చూడాల్సి వస్తుంది మరి,” అంటూ.

“అమ్మో! అతన్ని ఫేస్ టూ ఫేస్ అస్సలు భరించలేను. ముఖ్య మంత్రి ఐనప్పటి నుంచి ఏవేవో గొడవలు లేవనెత్తి నా జీవితాన్ని దుర్భరం చేస్తున్నాడు. ఐనా అంతా పదవి వ్యామోహం ఉండకూడదు,” అక్కసుగా అంటూ హడావుడిగా అక్కడి నుంచి బయలుదేరాడు మోశయ్య.

***

డీసెంట్ రోడ్.

కార్‌లోంచి దిగి రెండు అడుగులు వేసిన మోసయ్య మొహం మీద ఒక పెద్ద తెల్ల గుడ్డ వేశాడు ఆయన సెక్రెటరీ.

“ఏమయ్యిందయ్యా! ఏదన్న శవ యాత్ర కాని ఇటు వైపు వస్తూందా? చూస్తే అశుభమా?” ఆందోళనగా అడిగాడు మోశయ్య.

“కాదు సార్! గగన్ గారు ఇప్పుడే మీ పక్కనుంచి వెళ్ళారు. ఆయన మీ మొహం చూడకుండా ఉండడానికి అలా చేశాను,” వినయంగా అన్నాడు సెక్రెటరీ.

“సెక్రెటరీ అంటే నీవేనయ్యా! మా దొడ్డ పని చేశావు,” మెచ్చుకున్నాడు మోశయ్య.

అటూ వైపు ఎక్కడ గగన్, మోశయ్యని చూస్తాడో అన్న తొందరలో ఏం చేయాలో తెలీక, అతని పీ.యే. తొందర పడి గగన్ నోటిలో కర్చీఫ్ కుక్కాడు.

“ఊ ఊ ఊ,” అంటూ గొణిగాడు గగన్. చేసిన తప్పు అర్థం అయ్యి నాలుక కర్చుకుని కర్చీఫ్ బయటకు లాగేశాడు పీ.యే.

“నీకేమన్నా మతి పోయిందా?” కోపంగా అరిచాడు గగన్.

“సారీ సార్! ఇప్పుడే మోశయ్యగారు మీ పక్కన్నుంచి వెళ్ళారు. ఆయన ఎక్కడ మీ మొహం చూస్తాడో అన్న ఖంగారులో అలా..” గొణిగాడు పీ.యే.

“ఏడిశావు. ఇంకా నయం. ఆయన సెక్రెట్రీ తెలివిగా ఆయన మొహం మీద గుడ్డ వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది,” అంటూ ఊపిరి పీల్చుకున్నాడు గగన్.

***

దివంగత నాయకుడి ఇంటికి ఒక అర కిలోమీటర్ దూరంలో.

“మళ్ళీ ఏమయ్యిందయ్యా?” విసుగ్గా అన్నాడు మోశయ్య.

“గగన్ గారు ఇదే రోడ్డు మీద దివంగత నాయకుడి ఇంటికి వస్తున్నారట సార్! ఆయన ఇంటి వరకు వెళ్ళాలి అంటే ఇదొక్కటే దారి,” చెప్పాడు సెక్రెటరీ.

“మరి ఇప్పుడు ఎలాగయ్యా?”

“ఒక మార్గం ఉంది సార్! ఈ రోడ్డు పక్కనే సొరంగంలాగా ఒక టన్నెల్ ఉంది. మీరు దానిలోంచి పాకుతూ వెళ్తే ఆయన కంట పడకుండా తప్పించుకోవచ్చు.”

“తప్పదంటావా?”

“మరి ఆయన మొహం..”

“సరే, సరే. పద పోదాం.”

అటు గగన్ వర్గం కూడా ఖంగారు పడుతున్నారు. “సార్! మోసయ్యగారు ఇటే వస్తున్నారట. ఆయనకు ఎదురు పడకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం. మీరు హెలికాప్టర్‌లో మిగిలిన డిస్టెన్స్ కవర్ చెయ్యండి. దివంగత నాయకుడి ఇంటి దగ్గర తాడు పట్టుకుని కరెక్టుగా ఆ ఇంటి మెయిన్ డోర్ ముందు దిగుదురూ గానీ!” అన్నాడు ఆయన పీ.యే.

“ఇదేదో బాగుందే. హీరో టైప్ ఎంట్రన్స్ అన్న మాట. నేను రెడీ!” అన్నాడు గగన్.

***

కాసేపయ్యాక.

“ఓరి నాయనో, ఈ సొరంగం సడన్‌గా ఇరుకు అయిపోయింది. ముందుకూ వెళ్ళలేను, వెనక్కి రాలేను. ఎరక్క పోయి వచ్చాను, ఇరుక్కు పోయాను,” ఒక చిన్న కేక పెట్టాడు మోశయ్య.

“ఇరుక్కుంటే ఇరుక్కున్నారు కానీ, ఆ గగన్ మొహం చూడకుండా తప్పించుకున్నారు సార్!” ఆనందంగా అన్నాడు ఆయన సెక్రెటరీ.

అటు గగన్ హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న తాడు పట్టుకుని కిందకి దిగుతూ మధ్యలో ఆగిపోయాడు. “అమ్మో చేతులు చెమట్లు పట్టేశాయి. జారి కింద పడతానేమో అని భయంగా ఉంది, రక్షించండి,” అంటూ అరిచాడు.

“రక్షిస్తాం సార్! ఆ మోశయ్య మొహం చూడకుండా ఇంతసేపూ ఎలా రక్షించామో అలానే రక్షిస్తాము,” మాట ఇచ్చాడు గగన్ పీ.యే.

ఎవరి దారి వారిదే

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

9 Responses to నీ మొహం చూస్తే పాపం!

 1. shyam says:

  bagundi…

 2. రవి says:

  🙂 🙂 …

  రేప్పొద్దున ఎన్నికలొచ్చేవరకే ఇదంతా. అవి వచ్చినప్పుడు ముఖాన ఊసినా, తుడుచుకుని కలిసిపోతారు. అదీ ఘన సంస్కృతి ఉన్న గాంక్రెసు లక్షణం.

 3. Shiva Bandaru says:

  🙂

 4. Sumn says:

  nice.. nice..

 5. చిలమకూరు విజయమోహన్ says:

  😀

 6. naga says:

  murali garu,

  meeru perlu baaga pedataaru. nice creativity!

 7. Rajiv says:

  డీసెంట్ రొడ్డు…..
  LOL
  🙂 🙂 🙂 🙂

 8. krishna says:

  LOL. very nice one!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s