బృందగానా – శ్రీ గోవిందా కమీషన్


అంధేరా ప్రదేశ్‌కి చెందిన బృందగానా, మోస్తా ప్రాంతాల నాయకులు జుట్టు జుట్టు పట్టుకుని పోట్లాడడం వల్ల, అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అంధేరా ప్రదేశ్ రాజధాని ఆదరా బాదరాలో కొన్ని రోజులు స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. ఇదంతా చూసి ఆదరా బాదరాకి రావల్సిన పరిశ్రమలు, కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోయాయి. ప్రత్యేక బృందగానా మాట దేవుడెరుగు, అసలు మొత్తం అంధేరా ప్రదేశ్‌కే ఏ ప్రత్యేకత లేకుండా పోతుందేమో అని చాలా మంది ఆందోళన చెందారు. కాని బృ.రా.స. నాయకులు, ముఖ్యంగా వీ.సీ.ఆర్., పట్టు వదలకుండా పోరాడుతూనే ఉన్నారు. అటు వైపు మోస్తాలో ‘అందరూ అంధేరాలోనే’ ఉద్యమం నడుపుతున్న జగడపాటి రాజ్‌గోపాల్ వంటి నాయకులు కూడా వెనక్కి తగ్గ లేదు.

దీంతో హస్తినలో రూలింగ్ పార్టీ ఐన గాంక్రెస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. పేరుకి అందరూ పాల్గొన్నా, అది తూ తూ మంత్రమని, ఢిల్లీ అమ్మదే అసలు నిర్ణయమని అందరికీ తెలిసిన విషయమే. అది గాంక్రెస్ పార్టీ స్పెషాలిటీ.

“అసలు ఇంతకి గొడవేంటీ? ప్రత్యేక బృందగానా వస్తే ప్రజలకి ఒరిగేదేమిటి?” ప్రశ్నించింది ఢిల్లీ అమ్మ.

వృణబ్ ముఖర్జీ గొంతు సవరించుకున్నాడు. “అసలు గవర్నమెంట్ వల్ల ప్రజలకు ఎప్పుడైనా ఏం ఒరిగిందమ్మా? ప్రత్యేక బృందగానా వస్తే ఇంకో ముఖ్య మంత్రి పదవి, ఇంకో క్యాబినెట్, ఇంకా బోలెడు పదవులు అవసరమవుతాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న నాయకులందరికి ఒక జీవనోపాధి ఏర్పడుతుంది,” అన్నాడు.

“ఓ! అంత దయనీయమైన స్థితిలో ఉన్నారా కొందరు నాయకులు?” ఆశ్చర్యపోయింది ఢిల్లీ అమ్మ.

“మరే! నేను చెప్పిన ఈ నాయకులకి అంధేరా ప్రదేశ్ ఒకటిగా ఉంటే, వాళ్ళ రాజకీయ జీవితంలో ఎలాంటి ప్రగతిని పొందే అవకాశం లేదు,” విన్నవించుకున్నాడు వృణబ్.

“సరే, ఇంక చేసేదేముంది? ఒక కమీషన్ వేసేద్దాం. ఆ తరువాత చూసుకోవచ్చు,” సొల్యూషన్ చెప్పింది ఢిల్లీ అమ్మ.

గది మొత్తం చప్పట్లతో నిండి పోయింది. “ఆహా, ఎంత ఉత్తమమైన పరిష్కారం చెప్పారమ్మా!” అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు హోం శాఖ మంత్రి P. ఏకాంబరం.

“అది ఎవరైతే బాగుంటుందో కూడా మీరే చెప్పండమ్మ, నేను సంతకం పెట్టేస్తాను,” అన్నాడు (అ)ప్రధాన మంత్రి జగన్మోహన్ సింగ్.

“మన రిటైర్డ్ జడ్జ్ శ్రీ గోవిందా ఉన్నారు కద. ఆయన చెయిర్మన్‌గా ఒక కమీషన్ వేద్దాం. 92-93 లొ జరిగిన మతకలహాల మీద రిపోర్ట్‌కి ఆయన ఐదేళ్ళు తీసుకున్నారు. మనిషికి ఓపిక ఎక్కువ,” అంది ఢిల్లీ అమ్మ.

మళ్ళీ గదిలో చప్పట్లు మారు మోగాయి. “ఆగండెహె, పూర్తిగా వినండి. ఆ కమీషన్ నిండా త్రిలింగ సంస్కృతి గురించి కానీ, అంధేరా ప్రదేశ్ చరిత్ర కానీ, ముఖ్యంగా త్రిలింగ భాష కానీ తెలియని ఒక ఐదుగురిని నియమించండి. అప్పుడు రిపోర్ట్ న్యూట్రల్‌గా ఉంటుంది,” చెప్పింది ఢిల్లీ అమ్మ.

ఈ సారి ఆనందం తట్టుకోలేక అందరూ గదిలో పొర్లు దండాలు పెట్టారు.

***

శ్రీ గోవిందా కమీషన్ అంధేరా ప్రదేశ్‌లో అడుగు పెట్టింది. వెంటనే వాళ్ళు తమ సమాచార సేకరణ మొదలు పెట్టారు. జన జీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలని ప్రశ్నలు అడుగుతూ, జర్నలిస్టులకు పదే పదే ప్రెస్ కాన్‌ఫరెన్సులు ఇస్తూ పెద్ద దుమారం సృష్టించారు.

కమీషన్‌లో ఒకడైన వినోద్ గగ్గోలు ఒక పూరి గుడిసె ముందు నిల్చున్న వ్యక్తిని అడిగాడు, “నీకు బృందగానా కావాలా?” అని. (సంభాషణంతా ఇంగిలిపీసులో సాగుతుంది. గగ్గోలు ఇంగిలిపీసులో ప్రశ్న వేస్తే, అక్కద ఉన్న దుబాసి, అనగా translator, గుడిసె వీరుడి సమధానాన్ని ఇంగిలిపీసుకి తర్జుమా చేస్తున్నాడు.)

“ఫ్రీ నా?” అనుమానంగా అడిగాడు అతను.

“ఫ్రీ అంటే అది కొంచెం కాంప్లికేటెడ్. ప్రత్యేక రాష్ట్రం వస్తే వనరులు విభజింపబడుతాయి. మీరు మోస్తాకి వెళ్ళాలంటే టాక్స్ కట్టల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న మోస్తా వాసులు తమ బిజినెస్సులు మూసుకుని మోస్తాకి చెక్కేయొచ్చు. ఇలా చాలా ఉంటాయి,” వివరించాడు గగ్గోలు.

“నా గుడిసెకు ఏం కాదు కద?” మళ్ళీ అనుమానంగా అన్నాడు గుడిసె వాసి.

“కావచ్చు కాకపోవచ్చు. నేనేమన్న సోది చెప్పే వాడినా? అలాంటి ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు,” విసుక్కున్నాడు గగ్గోలు.

“గిదంతా చూస్తూంటే నాకు డౌట్‌గుంది. ఐతే నాకొద్దులే,” అన్నాడు గుడిసె వీరుడు.

గగ్గోలు తన నోట్‌బుక్‌లో ఏదో రాసుకున్నాడు.

***

అదొక పల్లెటూరు. తన ముందు చేతులు కట్టుకుని నిలబడి ఉన్న జనాన్ని చూసి, “ఐతే నిన్న నాతో చెప్పినట్టు మీ అందరికి బృందగానా కావాలి, అంతేనా?” కన్‌ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో సారి అడిగాడు శ్రీ గోవింద.

జనం అంతా జమిలిగా ఏదో అన్నారు. దుబాసి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీ గోవింద. “వాళ్ళెవరికీ బృందగానా వద్దుట సార్,” ట్రాన్స్‌లేట్ చేశాడు అతగాడు.

ఉలిక్కి పడ్డాడు శ్రీ గోవింద. “అదేంటయ్యా, నిన్నేగా అందరూ కావాలని అన్నారని దుబాసి యాదగిరి చెప్పాడు?” అన్నాడు అయోమయంగా.

“మరే ఆయన బృందగానాకి చెందిన వాడు కద, ఆయన అలానే చెప్తాడు. నేను మోస్తాకి చెందిన వాడిని కద, నేను ఇలా చెప్తానన్న మాట,” వినయంగా చెప్పాడు దుబాసి అప్పారావు.

శ్రీ గోవిందా తల పట్టుకున్నాడు.

***

“ముప్పై రోజుల్లో త్రిలింగ భాష నేర్చుకోండి” అన్న పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతూంది దేవేందర్ కౌర్. ఈవిడ శ్రీ గోవిందా కమిషన్‌లో ఇంకో సభ్యురాలు.

“ఏంటి చదువుతున్నారు?” అడిగాడు ఇంకో సభ్యుడు బల్‌బీర్ సింగ్ (పంజాబీ లో).

“ఈ బృందగానా సమస్య పరిష్కరించాలంటే త్రిలింగ భాష నేర్చుకోవడం కంపల్సరీ అనిపిస్తూందండి. అందుకే ఈ పుస్తకం మీద పడ్డాను,” చెప్పింది దేవేందర్ కౌర్ (పంజాబీ లో).

అప్పుడే టీ తీసుకుని వచ్చాడు నౌఖరు నరసయ్య.

“ఈ నౌఖరు మోస్తా ప్రాంతం నుండి. చూడండి, శాంపుల్‌కి వీడి మీద నా త్రిలింగం ఉపయోగిస్తాను,” (పంజాబీ లో) అంటూ నరసయ్య వైపు తిరిగి, “ఏమండి, మాకీ కన్నీరు తెచ్చావా?” అని అడిగింది దేవేందర్ కౌర్.

“కన్నీరు కాదమ్మా, తేనీరు,” అన్నాడు నరసయ్య ఖంగారు పడి.

“అవును, అవును. షాం కో మా దుంప తెంచి తిండి పెడతారు కదరా?” రెట్టించిన ఉత్సాహంతో అంది దేవేందర్.

“అర్థం కాలేదమ్మా. సాయంత్రం బంగాళా దుంపల కూర వండుతాను అని చెప్పాను. దాని గురించా మీరు మాట్లాడేది?” అయోమయంగా అడిగాడు నరసయ్య.

“అవును, అవును,” అని, “చూశారా ఎంత బాగా మాట్లాడేస్తున్నానో?” అంది బల్‌బీర్‌తో (పంజాబీ లో).

“అబ్బో బ్రహ్మాండం. మీరు చదివాక, నాకూ ఆ పుస్తకం ఇవ్వండి,” అన్నాడు బల్‌బీర్ (పంజాబీ లో).

***

ప్రెస్ కాన్‌ఫరెన్స్:

శ్రి గోవిందా కమీషన్ సభ్యులంతా వేదిక మీద కూర్చుని ఉన్నారు. గగ్గోలు తన ముందు దొంతరగా పేర్చబడి ఉన్న నోట్‌బుక్స్‌ని పరిశీలిస్తున్నాడు. బల్‌బీర్ సింగ్, దేవేందర్ కౌర్ ఎవరిని పట్టించుకోకుండా సీరియస్‌గా “ముప్పై రోజుల్లో త్రిలింగ భాష నేర్చుకోండి” అన్న పుస్తకం చదువుకుంటున్నారు. అబ్ చలే షరీఫ్ అసలు అక్కడ లేనే లేడు.

విలేఖరులు ప్రశ్నలు గుప్పించడం మొదలు పెట్టారు.

“మీ కమీషన్‌కు పొలిటికల్ సపోర్ట్ ఎలా ఉంది?”

శ్రీ గోవింద: “మాకు అన్ని పార్టీల సపోర్ట్ ఉంది.”

“మరైతే గాంక్రెస్, తెగులు దేశం ఎందుకు మీకు ఇంకా నివేదిక ఇవ్వలేదు?”

శ్రీ గోవింద: “వారికివ్వాలనే ఉంది అని మా పరిశోధనలో తేలింది. ఐతే కొంచెం ఆలస్యం జరుగుతూంది. డిసెంబర్ 31 లోపల వాళ్ళు తమ నివేదికలు అందిస్తారని మాకు గట్టి నమ్మకం. నేను నిన్న సంప్రదించిన చిలక జోస్యం వాడు కూడా అదే చెప్పాడు.”

“డిసెంబర్ 30న ఇచ్చినా ఫరవాలేదా?”

శ్రీ గోవింద: “నో ప్రాబ్లెం! కావాలంటే మా సభ్యులమంతా టీ పెట్టుకుని నైట్ ఔట్ చేసి మరీ ఆ నివేదికలు చదివి మా నిర్ణయం వినిపిస్తాం.”

“పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఏమంటారు?”

“మనకెందుకు చెప్పండి అదంతా, అప్పట్లో పెద్ద మనుషులు అనబడే వాళ్ళు ఉండే వారు. ఇప్పుడు అలాంటి వారెవరూ లేరు కద!”

“అదీ నిజమే! ప్రజల మధ్యకు వెళ్ళి వారి అభిప్రాయాలు కనుక్కున్నారు కద? నిర్ణయానికి రావడానికి అది తోడ్పడిందా?”

శ్రీ గోవింద: “బియ్యం తెచ్చిన వెంటనే వడ్డించలేం కద? వండాలి, ఆ తరువాత వడ్డించాలి. ఇది కూడా అంతే టైం పడుతుంది.”

“పోనీ అన్నం ఎప్పుడు ఉడుకుతుందో చెప్పగలరా?”

శ్రీ గోవింద: “ఒక అన్నం ఉంటేనే సరిపోదు కద. పప్పు లేకుండా అన్నం ఎలా తింటాం? దానికి ఇంకొంత టైం పడుతుంది.”

“పప్పు ఎప్పుడు అవుతుందంటారు?”

శ్రీ గోవింద: “ఉత్త పప్పుతో ఏం తింటాం? కూర కూడా కావాలి. దానికి మరి కొంత టైం అవుతుంది.”

“మీరు ఫుల్ మీల్స్ తయారు చేసేసరికి కస్టమర్లు ఎవరూ ఉండరేమో సార్! మీ కమీషన్ సభ్యుల పని తీరు ఎలా ఉందని భావిస్తున్నారు?”

శ్రీ గోవింద: “అబ్బో బ్రహ్మాండం. దేవేందర్ కౌర్, బల్‌బీర్ సింగ్ రాత్రనకా పగలనకా త్రిలింగ భాష నేర్చుకుంటున్నారు. డిసెంబర్ 1 కి అయి పొతుంది వాళ్ళ చదువు. ఆ తరువాత పరిశోధన మొదలు పెడతారు.”

“మరి గగ్గోలు గారు, అబ్ చలే షరీఫ్ గార్ల సంగతి?”

“గగ్గోలు గారు వీధి వీధిలో తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అబ్ చలే గారు చేసిన పరిశోధనలో పాత బస్తీలో మైనారిటీలకు తీరని అన్యాయం జరిగింది అని తెలిసింది. కాబట్టి ఆయన పాంచ్ మీనార్ దగ్గర పాత బస్తి, అంధేరా ప్రదేశ్ నుంచి విడిపోవాలని ధర్నా చేస్తున్నారు.”

“బృందగానా రాకపోతే అంతర్యుద్ధం తప్పదంటున్నారు కద వీ.సీ.ఆర్. గారు?”

“మా కమీషన్ సమగ్ర పరిశోధన ముగిసేప్పటికి, ఎవరికీ ఏ రకమైన యుద్ధమూ చేసే ఓపిక ఉండదు,” చిలిపిగా నవ్వుతూ కాన్‌ఫరెన్స్ ముగించాడు శ్రీ గోవిందా. “గోవింద గోవిందా,” అంటూ కమీషన్ సభ్యులంతా అక్కడి నుండి నిష్క్రమించారు.

ఇంటర్వ్యూ

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

13 Responses to బృందగానా – శ్రీ గోవిందా కమీషన్

 1. Sravya Vattikuti says:

  🙂

 2. karthik says:

  kevvu saar super!!

 3. Wanderer says:

  As usual… scintillating!

 4. Yogi says:

  Awesome Mastaru..

 5. Murali gaaru..

  Yerramsetti Sai sthAyi ni dATi pOyAru! Very hilarious and I kept on laughing while I was reading the whole article.. mee pada prayOgAlu superb!!

  Keep going!!!

 6. Admirable, fabulous, mind blowing.

 7. the stories herin are fabulous…thanks a lot

 8. రామ says:

  ఇది జరిగి ఇంచుమించు ఏడాది అయి, అందరూ ఆ నివేదిక – కాదు, ఆ కమిషన్ గురించే మరిచిపోయి మళ్ళీ యధావిధి గా కొట్టుకోవడం మొదలెట్టడం చూస్తుంటే ఢిల్లీ అమ్మ తెలివికి నాకు కూడా శుభ్రమైన ప్రదేశం చూసుకొని పొర్లు దండాలు పెట్టాలనిపిస్తోంది.

 9. Madhavi says:

  Murali garu, enno rojula tarvata mallik rachana chadivinatulu feel ayyanu…. Simply superb. Keep going.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s