అదిరేటి డ్రెస్సు మేమేస్తే, బెదిరేటి లుక్కు మీరిస్తే…

ఆదర్శ్ నగర్ కాలనీ! అక్కడ అందరూ మధ్య తరగతి కుటుంబీకులే. అఫ్ కోర్స్, ప్రస్తుతం జంబూ ద్వీపంలో, మధ్య తరగతి అన్న పదానికి డెఫినిషన్ మారింది అనుకోండి. స్థిరాస్తులు, చరాస్తులు కలుపుకుని కనీసం ఒక కోటి రూపాయలు ఉంటేనే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబీకుల కింద లెక్ఖ.

ఆ కాలనీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో గొడవ జరుగుతూంది. ప్రెసిడెంట్ గారు, తన ఆరేళ్ళ కూతురి మీద కేకలేస్తున్నారు, “ఛీ, నీ మూలంగా నా పరువు పోయింది కదే,” అంటూ. కూతురు లిల్లీ బిక్క మొహం వేసుకుని నిలబడి ఉంది.

“పోనీ లెండి, చిన్న పిల్ల కద!” సర్ది చెప్పబోయింది ప్రెసిడెంట్ గారి భార్య.

“ఆ సెక్రెటరీ గాడి కూతురు కూడా చిన్న పిల్లే. మరి అది ఎలా చేసింది, ఎలా చేయగలిగింది?”

“వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారండీ! ఎన్నో వీడియోలు కొన్నారు. ఎంతో ప్రాక్టీస్ చేయించారు. మన లిల్లీ జస్ట్ సిక్స్ మంత్స్ నుంచే కదా ట్రైనింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా సెలెక్ట్ అవుతుంది లెండి.”

“నాకు నమ్మకం లేదే, నెక్స్ట్ టైంకి దీనికి ఏడేళ్ళు వస్తాయి. నీకు తెలుసు కద, ఎంత తక్కువ వయసు ఉంటే అంత మంచిది వీటికి అని?”

ఇంతకీ అక్కడ జరుగుతూంది ఏమిటనుకుంటున్నారు? ఊ టీవీ చానెల్‌లో “గుంతలకిడి గెంతులు” అనే చిన్న పిల్లల డాన్స్ ప్రోగ్రాం వస్తుంది. అంధేరా ప్రదేశ్ నలుమూలల నుంచి తల్లి తండ్రులు తమ పిల్లలకు తర్ఫీదు ఇచ్చి పంపిస్తారు.

ఒక వేళ ఆడిషన్‌లో సెలెక్ట్ ఐతే, ఆ పిల్లలకు ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం, తద్వారా టీవీ మీద అందరికి కనిపించే అదృష్టం దక్కుతాయి. తమ పిల్లలు ఆడిషన్‌లో సెలెక్ట్ అయి ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలని అందరు తల్లి తండ్రులు ఆశగా ఎదురు చూస్తూంటారు.

దీనిలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఎవరి పిల్లలు ఐతే సెలెక్ట్ అవుతారో, వాళ్ళ తల్లి తండ్రులు కూడా స్టూడియోలో ఆడియెన్స్‌లో కూర్చోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ మొహాలు కూడా టీవీ మీద కనిపించే ఛాన్స్ ఉంటుంది.

కొంప దీసి వాళ్ళ పిల్లలు కనుక ఏదైన ప్రైజు గెలుచుకుంటే, తల్లి తండ్రులవి ఇంటర్‌వ్యూలు కూడా తీసుకుంటారు. ఒక మధ్య తరగతి కుటుంబానికి అంతకు మించిన భాగ్యం ఏముంటుంది?

రెండు రోజుల కింద జరిగిన ఆడిషన్‌లో ప్రెసిడెంట్ గారి కూతురు లిల్లీ సెలెక్ట్ కాలేదు. పుండు మీద కారం చల్లినట్టు అదే కాలనీ సెక్రెటరీ కూతురు మల్లి ఎన్నుకోబడింది. ఒక తండ్రికి ఇంతకంటే అవమానమేముంటుంది? అందుకే ప్రెసిడెంట్ గారు అలా చిందులు తొక్కుతూంది.

“గుంతలకిడి గెంతులు” ప్రోగ్రాంకి సెలెక్ట్ కావడానికి తల్లి తండ్రులు చేయంది లేదు. ఆ ప్రోగ్రాంలో జడ్జులు సాధారణంగా మాస్ డాన్సులపై ఎక్కువ మక్కువ చూపుతారు. కాబట్టి పేరెంట్స్ కూడా తమ పిల్లలతో అన్ని మాస్ నృత్యాలే ప్రాక్టీస్ చేయిస్తారు.

ఆడిషన్ సంగతి మళ్ళీ గుర్తొచ్చినట్టుంది, ఇంకో సారి రెచ్చిపోయారు ప్రెసిడెంట్ గారు.

“నీకేం చెప్పానే, మొహంమొత్తే ఖాన్ పాటకి డాన్స్ చేయమని చెప్పానా? ఆ మూవ్‌మెంట్స్ కూడా ఇంట్లో దగ్గరుండి మరీ నేర్పించాను కద? నువ్వు చేసిందేమిటి? ఎప్పుడో పాత సినిమాల్లోని మాస్ డాన్సర్ విజయమాలిని పాటకి డాన్స్ చేస్తావా? ఆ డాన్స్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతాననుకున్నావే?” కోపంగా గద్దించాడు ఆయన.

“సారీ నాన్నా, ఆ మొహంమొత్తే ఖాన్ పాటకి డాన్స్ చేయాలంటే చిగ్గేసింది. అందుకే విజయమాలిని ఆంటీ డాన్స్ చేసా,” భయంగా అంది లిల్లీ.

“సిల్లీగా మాట్లాడకు లిల్లీ. ఆ పాటలో ఊపు లేదనే నిన్ను డిస్‌క్వాలిఫై చేశారు. ఆ మల్లి చూడు, చక్కగా ఛండాలంగా ఎలా నడుము ముందుకి వెనక్కీ ఊపిందో! నువ్వు తెగ సిగ్గు పడుతూ చేశావు. సిగ్గు లేకపోతే సరి. సరేలే నీకు చాలా సిగ్గు కద. అదే కొంప ముంచింది,” విసుక్కున్నారు ప్రెసిడెంట్ గారు.

***

శనివారం. ఆ రోజు “గుంతలకిడి గెంతులు” టెంత్ ఎడిషన్ మొదటి భాగం ఊ టీవీ స్టూడియోలో షూట్ చేస్తున్నారు. పాల్గొంటున్న పిల్లలతో పాటూ వాళ్ళ తల్లి తండ్రులు, వారి వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా విచ్చేశారు. ఆడియెన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ప్రోగ్రాం కి ముగ్గురు జడ్జెస్: ఒక రిటైరైపోయిన యాక్టర్, ఒక మాజీ కొరియోగ్రాఫర్, ఒక పనీ పాట లేని మ్యూజిక్ డైరెక్టర్.

మొట్ట మొదట ఒక ఆరేళ్ళ కుర్రాడు వచ్చేసి, దేశబెదురు సినిమాలోని “రాయే రాయే రాయే రాయే” పాటకు డాన్స్ చేసాడు. ఆ పాటలో ఒకే లిరిక్ ఐతే ఆ కుర్రాడు ఒకే స్టెప్‌తో మ్యానేజ్ చేశాడు. స్టూడియో చప్పట్లతో మారు మోగి పోయింది.

తరువాత బేబీ స్వర్ణ వచ్చి, “A అంటే ఎప్పాసు బేరం, B అంటే బోడిగుండు వారం, C అంటే సింగినాధం జీలకర్ర, గోల చేసి గెంతుతారు అంధేరా జనం,” అన్న పాటకి పచ్చి బూతు మూవ్‌మెంట్స్‌తో డాన్స్ చేసింది. ఈ సారి జడ్జ్‌లు లేచి మరీ చప్పట్లు కొట్టారు. బేబీ స్వర్ణ తల్లి తండ్రులు ఆనంద భాష్పాలు తుడుచుకోవడాన్ని క్యామెరా మ్యాన్ శ్రద్ధగా కవర్ చేశాడు.

నెక్స్ట్ క్యాండిడేట్ ఆదర్శ్ నగర్ కాలనీ నుంచి బేబీ మల్లి. ఆడియెన్స్‌లో ఉన్న మల్లి పేరెంట్స్, వారితో పాటు వచ్చిన ప్రెసిడెంట్ గారూ, ఆయన భార్య ఊపిరి బిగబట్టి చూడ్డం మొదలు పెట్టారు.

చిన్న పీలికల్లాంటి బట్టలు వేసుకుని బేబీ మల్లి ఎంటర్ అయ్యింది. కొందరు ఛాందసులు ఆ దృశ్యం చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నారు. సెక్రెటరీ గారి భార్య పక్కన ఉన్న ప్రెసిడెంట్ గారి భార్యతో గర్వంగా చెప్పింది, “ఈ కాస్ట్యూం నేనే సెలెక్ట్ చేసాను, క్యూట్‌గా ఉంది కదూ?” అని.

“అవునవును, అసలు కాస్ట్యూంకే ప్రైజ్ వచ్చేసేలా ఉంది,” వంత పాడారు ప్రెసిడెంటూ, ఆయన భార్య.

మల్లి స్టేజ్ మీద ఉన్న పట్టు స్మిత విగ్రహానికి మొక్కి తన డాన్స్ మొదలు పెట్టింది. తను ఎంచుకున్న పాట “ఇప్పటికింకా నా వయసు నిండా ఆరేళ్ళే. చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ అంతా అంకుల్సే!”

“పాట కూడా సూపర్! మీ అమ్మాయే టాపర్ లెండి ఈ రౌండ్‌లో,” అసూయగా అంది ప్రెసిడెంట్ గారి భార్య.

“అంతా మీ అభిమానం వదినా. అసలు సంవత్సరం పాటూ మా పిల్ల ఎలాంటి దుష్ప్రభావాలకూ లోను కాకుండా, కనీసం ఒక్క శాస్త్రీయ నృత్యం ప్రోగ్రాం కూడా చూడకుండా మ్యానేజ్ చేశాం,” ఆనందంగా అంది సెక్రటరీ గారి భార్య.

కానీ జరగకూడని ఘోరం జరిగిపోయింది. మల్లి డాన్స్ మధ్యలో మాజీ కొరియోగ్రాఫర్ లేచి, “ఆపు మల్లీ ఆపు!” అంటూ గర్జించాడు. పాట ఆగిపోయింది. మల్లి ఏడవడానికి రెడీ అయ్యింది.

“అసలా పాటకు మొహంమొత్తే ఖాన్ ఎలా డాన్స్ చేసింది, నువ్వెలా చేస్తున్నావు? ఆమె మూవ్‌మెంట్స్ ఏంటి, నీ మూవ్‌మెంట్స్ ఏంటి? ఇదేమన్నా తొక్కలో క్లాసికల్ డాన్స్ అనుకున్నావా, అలా కంట్రోల్డ్‌గా చేయడానికి? ఆ బరితెగింపు, ఆ విచ్చలవిడితనం ఏవీ? ఆ మాస్ ఎలిమెంట్స్ ఏవి?” బాధగా అన్నాడు కొరియోగ్రాఫర్.

భోరున ఏడ్చేసింది మల్లి. ఆ పిల్ల తల్లి తండ్రులు అంతకంటే వయొలెంట్‌గా రియాక్ట్ అయ్యారు.

“అయ్యయ్యో, మన ట్రైనింగ్‌లో ఏం లోపం జరిగిందండీ? పొరపాటున కేబుల్ టీవీ మీద ఆ వె. కిశ్వనాథ్ సినిమాలు, కంకరాభరణమో సముద్ర సంగమమో చూసిందంటారా?” ఏడుపు గొంతుతో అడిగింది సెక్రటరీ గారి భార్య.

“అయ్యుంటుంది. అసలు అలాంటి సినిమాలని బ్యాన్ చెయ్యలి. బూజు పట్టిన భావాలు అవీ. అ దిక్కుమాలిన శాస్త్రీయ నృత్యాల ప్రభావం పడినట్టుంది. అందుకే టెంపో తక్కువయ్యింది మన అమ్మాయి డాన్సులో,” బొంగురు పోయిన గొంతుతో అన్నాడు వాళ్ళాయన .

కాని మ్యూజిక్ డైరెక్టర్, మాజీ యాక్టర్ ఎక్కువ మార్క్స్ వేయటం వల్ల నెక్స్ట్ రౌండ్‌కి ఐతే చేరుకుంది మల్లి. సెక్రటరీ గారూ ఆయన భార్యా, బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.

***

“గుంతలకిడి గెంతులు” లాంటి ప్రోగ్రాంలు చాలా హేయమైనవని, చిన్న పిల్లలతో, పెద్దలకు మాత్రమే టైప్ పాటలకి అలా డాన్స్ చేయించడం, మన సమాజానికి పట్టిన దౌర్భాగ్యానికి నిదర్శనమని, శిశు హక్కుల సంఘం పెద్ద గొడవ చేసింది.

టీవీ 999 విలేఖరి, “గుంతలకిడి గెంతులు” ప్రోగ్రాం ప్రొడ్యూసర్ నటరాజుతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు.

విలేఖరి: అలా చిన్న పిల్లలతో కురచ బట్టలు వేయించడం చాలా ఛండాలంగా ఉందని కొందరు అంటున్నారు. మీ కామెంట్?

నటరాజు: కొందరే అంటున్నారు అని మీరు అనడంలోనే తెలిసిపోతుంది. ఎక్కువ మందికి ఎలాంటి ప్రాబ్లెం లేదని. ఐనా పిల్లలు భగవత్ స్వరూపాలు. వాళ్ళు ఏం వేసుకున్నా ముద్దుగానే ఉంటారు. అవి బూతు డ్రెస్సులు అనే వాళ్ళే పెద్ద బూతు మనుషులు. వాళ్ళ మనసులో అంతా బూతే కాబట్టి వాళ్ళకు ఏది చూసినా బూతు లానే అనిపిస్తుంది.

విలేఖరి: ఐతే ఇలాంటి ప్రోగ్రాంలు ప్రసారం చెయ్యడం తప్పు కాదంటారు?

నటరాజు: కానే కాదు. ఐనా, ఆ పిల్లల తల్లి తండ్రులకే లేని బాధ ఈ సంఘానికెందుకండీ? తల్లి తండ్రుల పూర్తి అంగీకారంతోనే కద పిల్లలు పాల్గొనేది!

అలా ఇంటర్వ్యూ ముగిసింది.

***

విలేఖరి ఆ తరువాత “గుంతలకిడి గెంతులు” ఫైనలిస్ట్ ఐన బేబీ స్వర్ణ తల్లి తండ్రులని ఇంటర్వ్యూ చేశాడు.

విలేఖరి: ఈ వయసులో పిల్లలకు మంచి చెడు గురించి సరైన అవగాహన ఉండదు కాబట్టి, పేరెంట్సే వారిని సరిగ్గా గైడ్ చేయాలంటారు. మరి మీరే మీ పిల్లల్ని ఇలాంటి ప్రోగ్రాంస్‌లో పాల్గొనమని ప్రోత్సహిస్తే ఎలా?

తల్లి: సరిగ్గానే గైడ్ చేస్తున్నామండి. మనం పుట్టగానే బట్టలతో పుట్టామా, పోయేప్పుడు బట్టలతో పోతామా? ఈ న్యారో మైండెడ్ ఫెలోస్‌కి అవకాశమిస్తే బట్టలు లేకుండా తిరుగుతున్న చంటి పిల్లల్ని కూడా ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ కింద జైల్‌లో పెట్టమంటారు.

తండ్రి: ఇదంతా కుళ్ళుమోతుతనమండి! ప్రతి ఒక్క కుటుంబం టీవీ మీద కనపడాలని కోరుకుంటుంది. మాకు అవకాశం వచ్చింది. వాళ్ళకు రాలేదు. అందుకే ఈ ఏడ్పు.

***

ఆదివారం ఉదయం. పేపర్ చదువుతున్న సెక్రటరీ గారు (అదేనండి! బేబీ మల్లి నాన్నగారు) “ఏమేవ్ ఇది విన్నావా?” అన్నారు భార్యని ఉద్దేశించి.

“ఏ విషయమండి?” వంటింట్లోంచి బయటకు వస్తూ అడిగింది ఆవిడ.

“ఫాదర్ జేకబ్‌ని పెడోఫిలియా నేరం కింద అర్రెస్ట్ చేశారంట. అదేనే, తన ప్రాపకంలో ఉన్న కొందరు చిన్న పిల్లలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడట. అందుకని!”

“ఎంత దారుణమండి! ఆ పిల్లలు ఫాదర్‌ని నమ్మి ఆయన పంచన చేరారు. రక్షించాల్సిన వాడే భక్షిస్తే ఎలాగండి? ఎంత అన్యాయం!!!”

“కదూ!”

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

19 Responses to అదిరేటి డ్రెస్సు మేమేస్తే, బెదిరేటి లుక్కు మీరిస్తే…

 1. geeta says:

  chala chakkaga visleshincharu..

 2. వాస్తవాలను మీదైన శైలిలో చెప్పారు. చాలా బాగుంది

 3. karthik says:

  kevvu kevvu..

 4. sowmya says:

  మరి ఆ ముసలి కొరియోగ్రాహర్ బేబీ స్వర్ణతో “నేను చిన్నవాడినయ్యి నీతో జతకట్టి స్టెప్పులెయ్యలనుంది” అనలేదా? 😛

  రిటైర్మెంటు పుచ్చుకున్న యాక్టర్, బేబీ స్వర్ణ ని “జూనియర్ యజమాలిని”, బేబీ మల్లిని “జూనియర్ పట్టు స్మిత” అని పొగడలేదా? 😀

  • Murali says:

   అనే ఉంటారు. ఎన్ని ఘాతుకాలని కవర్ చేయగలం చెప్పండి!

 5. రవి says:

  నాకు టీవీ ప్రోగ్రాముల గురించి అంతగా తెలీదు. ఇంత ఛండాలమా? కొంచెం మా ఇంట్లో వాళ్ళను హెచ్చరించాలి.

 6. Wanderer says:

  Thank you very much for the post. This is the best post ever. చదువుతున్నప్పుడు మీ పేర్ల, పాటల, పేరడీకి ఎంత నవ్వొచ్చినా అంతర్లీనంగా విషాదం, చదవడం పూర్తయ్యేసరికి మనసంతా వికలం ఐపోయింది. కారణాలు ఏవైనా కానీండి. పిల్లలని ఇంత హేయమైన వాటికి పురిగొల్పే తల్లితండ్రులు పెడోఫైల్స్ కంటే ఏమీ తీసిపోరు. భారత్ లో CPS లాంటి సంస్థ ఉంటే ఈ పేరెంట్స్ తమ పిల్లల మీద హక్కులు ఎప్పుడో కోల్పోయి ఉండేవారు ఇలాంటి పన్లు చేసినందుకు గాను.

 7. yjbasu says:

  మీరు పేరడీ బాగా రాస్తునే సమస్యలని పాఠకుల దృష్టికి తెస్తున్నారు.

 8. machili says:

  Chi daridram deeni gurinchi matladi matladi mana noru kalam paadu chesukovadame.

  kathalo naa paruvu thisavu kade anna di poorvam vaade vallaki buddhi ledu. Villani choosi, paruvuki nirvachanam nerchukovali.

  Lilly cheyaka pothe valla ammanainaa sare cheyyamantadu valla nanna. alaanti boothu dancelaku aame ready kooda avuthundi. Emi sendeham ledu.

 9. anulekha says:

  chala baaga raasarandi. Dhanya vadalu.

 10. narayanababu says:

  మురళి గారు
  ఈ మధ్య వస్తున్న సంగీత (దుర్గీత అంటే బాగుండునేమో) పోటి కార్యక్రమాల మీద మీరు వొక పేరడీ రాస్తే చూడాలని వుంది. ఉదాహరణకి జడ్జీలుగా (నిర్ణేతలు ) చక్రి శశిప్రీతం రేహమను లాంటి దిగ్గజాలు ఉంటారు. పోటి దారుల్లో త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముతుస్వామి దీక్షితారు, ఎం ఎస్ సుబ్బలక్ష్మి, బాలమురళి, నేదునూరి, నూకల వంటి వారు ఉంటారు. వీరికి నిర్ణేతలు మార్కులు వెయ్యడం, తప్పులు దిద్దడం వంటి ప్రహసనం మీరు మీ సహజ సృజన శక్తి తో రాయమని నా నివేదన. (ఒక టీవీ దుర్గీత ప్రేక్షక బాధితుడు) మీ శ్రేయోభిలాషి నారాయణ బాబు వేదుల

  • Murali says:

   నారాయణ గారూ,

   అవుడియా బాగానే ఉంది. కానీ సంగీతం పట్ల నాకున్న అవగాహన సరిపోదేమో అనిపిస్తూంది.

   -మురళి

 11. narayanababu says:

  మురళి గారూ
  సంగీతం పట్ల అవగాహన లేకుండా ఉండటమే కావలసిన లక్షణం. అది మీకుందని మేరు అన్నారు కాబట్టి తప్పక హిట్టు అవుతుందనే నా ప్రగాఢ విశ్వాసం. శుభం భూయాత్ . కార్యోన్ముఖులు కండి.
  నారాయణబాబు వేదుల.

  • Murali says:

   నారాయణ గారు,

   సంగీతం మీద అవగాహన లేని వారి పై ప్యారడీ రాయలంటే, రాసే వాడికి ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. 🙂 ఎగ్జాక్ట్లీ అలా కాకపోయినా ఆ theme మీద రాయడానికి ప్రయత్నిస్తాను.

   భవదీయుడు
   మురళి

   • suresh says:

    “సంగీత”o మీదనో లేక ”సం”గీతం జ్ఞానం ఉన్న వాళ్ళే ఈ రోజుల్లో పాటలు పాడేస్తుంటే, గీతాల మీద “సం” క్నాలెడ్జ్ ఉన్నవాళ్ళే జడ్జులు గా ఉంటుంటే, మీరు ఏమీటండీ మీన మేషాలు లెక్కిస్తున్నారు ?…రాసేయండి…మీరు ఈమధ్య ఒక మాటల రచయిత “తోముతా తియ్యగా” ప్రోగ్రాం జడ్జ్ గా వొచ్చినప్పుడు చూసినట్లు లేరు….

 12. narayanababu says:

  dhanyavadalu guruvu garu

 13. Ramana Turlaapti says:

  as usual, right on dot. enjoyed it thoroughly.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s