పాడనా తెలుగు పాట!

ఋగ్వేదం చతుర్ముఖ శర్మ కళ్ళు తెరిచాడు. భగవంతుడి ధ్యానంలో ఉన్న తనని ఎవరు డిస్టర్బ్ చేశారో ఒక క్షణం ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు గమనించాడు ఆయన తన ఎదురుగా ఉన్న సతీమణిని.

“ఏంటి విషయం?” కాస్త విసుగ్గానే అడిగాడు ఆయన.

“మీకు గత వారం నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, ఆ సినిమా డైరెక్టర్ గారు మీకోసం ఫోన్ చేస్తున్నారని! ఇంతకు ముందే ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ రోజు సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాడట.”

“సినిమా డైరెక్టర్‌కి నాలాంటి తెలుగు పండితుడితో పనేంటే?”

“సాయంత్రం ఆయనే వచ్చి చెప్తారు కదండి, తొందరెందుకు?”

“అంతేనంటావా?”

“అంతేనండి.”

***

సినిమా డైరెక్టర్ సాయంత్రం తన సెక్రెటరీతో సహా హడావుడిగా వచ్చేశాడు. రాగానే చతుర్ముఖ శర్మకి పాదాభివందనం కూడా చేశాడు.

“ఆశీస్సులు, ఆశీస్సులు. నీకేం కావాలో చెప్పు నాయనా?” మృదువుగా అన్నాడు ఋగ్వేదం చతుర్ముఖ శర్మ.

“మూర్ఖుడికి మీరో పాట రాయాలి సార్.”

“నువ్వే తనంతట తాను మూర్ఖుడిని అని ఒప్పుకోవడం బానే ఉంది కాని, నీలాంటి మూర్ఖుడికి నా పాట అర్థమవుతుందంటావా?”

“మీరు బొత్తిగా టీవీ చూడరు అనుకుంటా. నేను చెప్పేది నా రాబోయే సినిమా “మూర్ఖుడు” గురించి.”

“ఓ! సినిమా పాటనా? నేను ఇప్పటి దాకా అలాంటి పాటలు రాయలేదే?”

“కానీ ఎన్నో కవితలు రాశారు కద! మీకు పాటొక లెక్ఖ కాదు. మీలాంటి పండితుడితో ఒక పాట రాయించుకుంటే మా సినిమాకి ఎంతో గౌరవం, ప్రతిష్ట!”

“అంతేనంటారా?” ఆలోచనలో పడ్డాడు చతుర్ముఖ శర్మ.

“అసలే మాది మాస్ మూవీ! ఒక్క ఫ్యామిలీ టైప్ సాంగ్ కూడా లేదు. కనీసం ఈ పాటైనా…” నసిగాడు డైరెక్టర్‌తో పాటు వచ్చిన సెక్రెటరీ.

“సరే రాస్తాను,” మాటిచ్చాడు చతుర్ముఖ శర్మ.

***

వారం రోజుల తరువాత చెప్పినట్టుగానే పాట రాసిచ్చాడు ఆయన. డైరెక్టర్ ఆ పాట చదివి ఏడ్చినంత పని చేశాడు. “నేననుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది సార్ పాట. మా సినిమాకే హైలైట్ అవుతుంది. పాట రికార్డ్ కాగానే, మిమ్మల్ని పిలిపించి వినిపిస్తా,” అన్నాడు వణుకుతున్న గొంతుతో.

“సంతోషం. శుభం భూయాత్,” ఆశీర్వదించాడు చతుర్ముఖ శర్మ.

ఆయన రాసిన పాట ఇలా ఉంది.

రస ఝరివి నీవు
తొలకరివి నీవు
నా మదిని కొలువున్న
భైరవివి నీవు.

మధుర గీతానివో జలపాతానివో
మదనుడు చూపు పక్షపాతానివో
మమతవో సమతవో నవతవో
యువతవో సుదతివో కవితవో .

పౌర్ణమి నాడు పోటెత్తి
పరవళ్ళు తొక్కే సంద్రానివో?
అమరిపురిన ఉండి అచ్చెరువు కలిగించు
పారిజాత పుష్ప గంధానివో?

కాదు చెలి ఇవేవి కావు.

రస ఝరివి నీవు
తొలకరివి నీవు
నా మదిని కొలువున్న
భైరవివి నీవు.

***

వాగ్ధానం ప్రకారం పాట రికార్డ్ కాగానే శర్మ గారిని అది వినడం కోసం రికార్డింగ్ స్టూడియోకి పిలిచాడు డైరెక్టర్.

స్టూడియో చాలా సందడిగా ఉంది. శర్మ గారు రాగానే ఒక పాట ప్లే కావడం మొదలు పెట్టింది. పూర్తి వెస్టర్న్ స్టైల్ పాట అది. ఆయనకు అందులో సగం పదాలు సరిగ్గా వినిపించనే లేదు. “ఇలాంటి పాటల మధ్య నా పాట వింటే కాస్త విచిత్రంగానే ఉంటుంది,” అనుకున్నాడు ఆయన.

ఆ పాట అయిపోగానే అలాంటిదే ఇంకోటి మొదలయ్యింది. కాస్త ఇబ్బందిగా కదిలాడు చతుర్ముఖ శర్మ. “బాబూ, నా పాట వినిపిస్తే నేను బయలుదేరుతాను,” అన్నాడు డైరెక్టర్‌ని ఉద్దేశించి.

ఆశ్చర్య పోయాడు డైరెక్టర్. “అదేంటి శర్మ గారూ, మీరింతకు ముందు విన్నది మీ పాటే!” అన్నాడు కొంత బాధగా.

“అది నా పాటా?” ఈ సారి ఆశ్చర్యపోవడం చతుర్ముఖ శర్మ వంతయ్యింది.

“అవును, కావాలంటే ఇంకో సారి వినండి,” మళ్ళీ అంతకు ముందు పాట ప్లే చేశాడు డైరెక్టర్.

ఈ సారి తను రాసిన కొన్ని పదాలు అలవోకగా వినపడ్డాయి చతుర్ముఖ శర్మకి.

ఆ పాట ఇలా ఉంది.

Yo, yo, yo, check her out!
She is the రస ఝరి from heavens.
She is the తొలకరి from beyond.
She is the భైరవి in my heart.

మధుర గీతం, జలపాతం, పక్షవాతం!
Yeah, that’s the way I like her.
మమత, సమత, నవత!
Look at her with your both eyes open!

పౌర్నమీ, పోటూ, సముద్రం,
She is a super lively party gal.
అమరపురి, అచ్చోసిన, పుష్పం!
Her fragrance takes my breath away.

Yo, yo, yo, check her out!
She is the రస ఝరి from heavens.
She is the తొలకరి from beyond.
She is the భైరవి in my heart.

పాటయ్యాక నోరెళ్ళబెట్టాడు చతుర్ముఖ శర్మ.

“శర్మ గారూ! ఇప్పుడు ఇదేనండి పద్ధతి. దీన్ని ఫ్యూజన్ మ్యూజిక్ అంటారు. ఇప్పుడు మన కుర్ర కారు ఇలా వినడానికే ఇష్ట పడుతున్నారు,” ఆయన మొహంలో ఎక్స్‌ప్రెషన్ గమనించి అన్నాడు డైరెక్టర్.

“అది అటుంచి, ఆ పాటలో పక్షవాతం, అచ్చోసిన లాంటి పదాలు వినపడ్డాయి. అలాంటివి ఏవీ నేను పాటలో రాయలేదే?” సందేహం వెలిబుచ్చాడు చతుర్ముఖ శర్మ.

“ఓ, అదా! పాడిన అబ్బాయికి తెలుగు రాదండి. ముంబాయి నుంచి తెప్పించాం. కాబట్టి పక్షపాతాన్ని పక్షవాతమని, అచ్చెరువుని అచ్చోసిన అని పాడాడు,” చెప్పాడు డైరెక్టర్.

“నా పాటని ఇలా మార్చింది ఎవరు?” ప్రశ్నించాడు చతుర్ముఖ శర్మ.

“మా ప్రొడ్యూసర్ గారి అబ్బాయండి. మొన్నే విదేశాల నుంచి వచ్చాడు,” కించిత్ గర్వంగా అన్నాడు డైరెక్టర్.

“ఐతే, ఒక పని చేయండి. నేను రాసిన దాని కంటే ఆయన రాసిందే ఎక్కువ ఉంది కాబట్టి, పాట రచయితగా ఆయన పేరే వేయండి,” అని చెప్పి అక్కడనుంచి బయట పడ్డాడు చతుర్ముఖ శర్మ.

***

స్టూడియో నుంచి బయటకు వచ్చిన చతుర్ముఖ శర్మని అప్పుడే అక్కడికి చేరిన విలేఖరులు చుట్టు ముట్టారు.

“సినిమాలకి మొదటి సారి పాట రాయడం ఎలా ఉంది? మీ స్పందన ఏంటి?” ప్రశ్నించాడు ఒక విలేఖరి.

“మీకు ఏదో పొరపాటు సమాచారం అందింది. నేను ఏ పాట రాయలేదు. ఈ సినిమా డైరెక్టర్ మా ఊరి వాడు. చుట్టపు చూపుగా కలవడానికి వచ్చాను,” అంటూ అక్కడినుంచి నిష్క్రమించాడు ఋగ్వేదం చతుర్ముఖ శర్మ.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

21 Responses to పాడనా తెలుగు పాట!

 1. కంది శంకరయ్య says:

  బాగుంది. అచ్చం ఇలాంటి సంఘటన నా నిజ జీవితంలో జరిగింది. దాన్ని వ్యాఖ్య రూపంలో ఈ బ్లాగులో పెట్టాలా, లేక నా “శంకరాభరణం” బ్లాగులో ప్రత్యేక శీర్షిక క్రింద పెట్టాలా అని ఆలోచిస్తున్నాను.

  • Murali says:

   శంకరయ్య గారూ,

   తప్పకుండా మీ బ్లాగ్‌లో రాయండి. నా కల్పనకి, మీ జీవితంలో జరిగిన సంఘటనకి ఎంత పోలిక ఉందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

 2. రవి says:

  హహ్హహ్హా… మీరు తెలుగు పాటలు రాసెయ్యచ్చు. కొన్ని పాటలు రాసి సక్సెస్ అయితే పేరు ప్రతిష్ట, కాకపోతే టీవీలలో వచ్చే పాటలపోటీల్లో జడ్జు పోస్టు…ఓహ్ రంగుల భవిష్యత్తు.

 3. surya says:

  ఫకాల్ ఫకాల్ ఫక ఫక ఫక ఫక ఘొల్లు ఘొల్లు ……… ఫడీ ఫడీ నవ్వులు…

 4. anuradha says:

  అసలు పాట,ఫ్యూజన్ రెండూ బాగున్నాయి.

 5. Padma. says:

  మీరు సినిమాలకి పాటలు రాసేయ్యోచ్చేమో..
  కడుపు చెక్కలయ్యేలా నవ్వి నవ్వి చచ్చా.. నిజమే, ఏనాటి పాటలు ఇలానే ఉంటున్నాయి. పైగా సింగర్ గురించి రాయడం కూడా బాగుంది.
  పద్మ

 6. Kumar says:

  Keka …ROFL

 7. 😀 😀
  ఇహ మీరు సినీమాల్లో పాటలు రచయితగా అరంగేట్రం చేయడమే తరువాయి.. 😉

 8. sowmya says:

  హ్మ్ బావుందండీ, నాకు వెంకీ సినిమాలో బ్రహ్మానందం, వేణుమాధవ్ గుర్తొచ్చారు.
  నిజంగా మీకు తెలుగు సినిమా ఇండస్త్రీలో మాంచి భవిష్యత్తు ఉంది.

  రింగ రింగ రింగ రిమ రే పక్కన మీ పాట కూడా చేరితే వహ్ వా….ఇహ చెప్పక్కర్లేదు 😛

 9. sisira says:

  చాలా బాగా రాశారండి. మీకు తెలుగు భాషమీద మంచి పట్టు ఉన్నట్టుంది. అభినందనలు.

 10. Yogi says:

  Kekokeka..

 11. మిరియప్పొడి says:

  ROFLMAO!!

 12. ఈ కాలం పాటలపై మీ సెటైర్ బావుంది.

 13. Padmaja says:

  Plz send this story to any mag Navya/Vipula/Chitra/Nadi/
  They sure will publish and it should be read by all Telugus.
  Thanks.
  P

 14. సురేష్ says:

  ఏంటోనండీ!! ఎప్పుడూ మీ నుంచి మాంఛి సెటైర్స్ ఉన్న బ్లాగులు చదివీ చదివీ, ఇలాంటీ సినీ సామాజిక స్పృహ బ్లాగు అంతగా నచ్చలేదు…సినీ పాటల్లో సాహిత్యం ఏరుకోవడం పాతకాలం విడ్డూర దర్శన్ లొ పందుల పెంపకం ప్రోగ్రాం లేని సాయంత్రాలు కోరుకోడమేనని నా అభిప్రాయం….పోస్ట్ బానే ఉంది…మీ పాట బానే ఉంది..కాని నాకే సెటైర్లు/వ్యంగ్యం+హాస్యం అలవాటు అయిపోయి, అక్కడ నుంచి దిగలేకుండా ఉన్నాను.బ్రహ్మానందం ని చూసి సినీమా కి వెళ్ళితే, ఆయింట్ మెంట్ కూడా పూసుకోడానికి లేకుండా సెంటిమెంట్ తో కొట్టినట్టుంది.

  • Murali says:

   సారీ సురేష్ గారూ,

   కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టు, నా motto కాదేది సెటైర్‌కి అనర్హం.
   అందరికి అన్ని టాపిక్స్ నచ్చకపోవచ్చు. I can understand your disappointment.
   ఐనా ఇది సినిమా పాటల్లో సాహిత్యం వెతుక్కోవడం గురించి కాదు. మన సినీ సంగీతం ఎలా “కొత్త” పుంతలు తొక్కూతూందో,
   ఒక రచన ముడి సరుకు నుంచి finished productగా అయ్యేప్పటికి ఎంత మారిపోతుందో చెప్పడమే ఈ టపా ఉద్దేశం.

   ఐతే నేను సాధారణంగా రాసే టపాలు, మీకు నచ్చే టైప్‌వే ఉంటాయి లెండి. So, watch out for this space!

 15. yagnasri says:

  తెలుగు సినిమా పాటల పరిస్థితి పైన మీ satire చాలా బాగుంది. మీరు రాసిన పాట చాల బాగుంది. ఇంత మంచి తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు?

  • Murali says:

   యజ్ఞశ్రీ గారూ,

   నా తెలుగు అంతంత మాత్రమే. ఈ బ్లాగ్ ప్రపంచంలో ఎందరో ఘనాపాఠీలు ఉన్నారు. బహుశా మీకు ఇంకా తారసపడినట్టు లేదు.

   But a compliment is always cherished. So thanks for that. 🙂

   -మురళి

 16. RAM says:

  Murali Garu,

  kotta patallo sahityaanni vetakatam amte neti beerakayalo neti kosam vetikinatte….

  sunnitamaina amsaani amtakanna sunnitam ettichoopina meeku joharlu…

 17. Sandeep says:

  చాలా చక్కగా వ్రాశారండి. నిజంగా ఇది ఒక కథానాయకుడికి, సామవేదం షణ్ముఖశర్మ గారికి మధ్యన జరిగిన వృత్తాంతం కదా? ఇంకా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు మీరు చాలా సంధించాలండి.

  అన్నట్టు, మీ కవిత చాలా బాగుంది. freshness ఉంది.

 18. Kuladeep says:

  చాలా బాగుందండి…. పైన నా సోదరుడు వ్రాసినట్టు ఇదేదో నిజ జీవితం లో జరిగిన కథ లాగానే ఉంది… ఒక పెద్ద కథానాయకుడికి మన కవిగారికి మధ్యన జరిగిన కథలాగే ఉంది !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s