పీతల సీసా


“గురూ త్వరగా రా, మంచి ఫైటింగ్ సీన్ టీవీలో. మనం చూడని సినిమా ఏదో. పోలీసులకు పొలిటీషన్స్‌కి మధ్య ఫైట్. చాలా సహజంగా ఉంది. పోలీసులు రాజకీయ నాయకులని విరగదీస్తున్నారు,” ఉత్సాహంగా అరిచాడు రాధేశ్యాం. నేను వడివడిగా వెళ్ళి టీవీ స్క్రీన్ వైపు చూశాను. ఒక్క క్షణం అయ్యాక నాకు అర్థమయ్యింది అక్కడ ఏం జరుగుతూందో.

“ఒరేయి, అది సినిమా కాదురా, ఆ పొలిటీషన్స్ మన తెగులుదేశం ఎం.ఎల్.ఏ.లు. వాళ్ళని చావబాదుతూంది మనకు పక్కనే ఉన్న మామూలురాష్ట్రకు సంబంధించిన పోలీసులు.”

“మామూలురాష్ట్ర పోలీసులు ఎందుకు మన వాళ్ళని కొడుతున్నారు? అసలు మన వాళ్ళు అక్కడేం చేస్తున్నారు?”

“నువ్వు బొత్తిగా టీవీ-999 చానెల్ చూడవనుకుంటా! మామూలురాష్ట్ర ప్రభుత్వం గోదాజొన్న నది మీద కడుతున్న పాప్లీ ప్రాజెక్ట్ వల్ల మన అంధేరా ప్రదేశ్‌లో నాలుగు జిల్లాలకి నీరు అందకపోయే ప్రమాదం ఉంది అని, ఆ కట్టడాన్ని ఆపేయాలని అభ్యంతరం తెలుపుతూ మన వాళ్ళు అక్కడకి వెళ్ళారు. వాళ్ళు ఈ అభ్యంతరం పట్ల తమ అభ్యంతరాన్ని ఈ రకంగా తెలియజేశారు.”

“అదేంటి, మన వాళ్ళు ఏమన్నా అక్కడ వయొలెంటుగా బిహేవ్ చేశారా?”

“అంత ఛాన్సు మనవాళ్ళకు ఇవ్వలేదు. మనవాళ్ళు మామూలురాష్ట్ర సరిహద్దులు దాటకముందే పోలీసు అధికారులు వచ్చి పాప్లీ చూపిస్తాం రండి అని తీసుకెళ్ళి సరిహద్దులు దాటగానే అరెస్ట్ చేశారు.”

“అసలు సూర్యబాబు మామూలురాష్ట్రకి ఇప్పుడే ఎందుకు వెళ్ళాడు?”

“ఉప ఎన్నికలు కాబట్టి ఒక పొలిటికల్ స్టంట్ అని గిట్టని వాళ్ళు అంటున్నారనుకో.”

“అది కరెక్టే అనుకున్నా పాప్లీ సమస్య నిజమయ్యిందే కద! మన త్రిలింగ ప్రజల మీద, ముఖ్యంగా బృందగానా ప్రజల మీద ప్రభావం చూపించేదే కద! ఈ టైంలో మన త్రిలింగ ప్రజలందరు సూర్యబాబుని సమర్థించి మామూలురాష్ట్ర పోలీసుల జులుంని ఖండించాలేమో?”

“లెక్ఖ ప్రకారం నువ్వు చెప్పినట్టే జరగాలి. చూద్దాం మనవాళ్ళు ఏమంటున్నారో,” అంటూ నేను చానెల్ చేంజ్ చేశాను.

ఊటీవీలో ఇష్టారాజ్యం ప్రెసిడెంట్ రిచంజీవి విలేఖరులతో మాట్లాడుతున్నాడు. “పాప్లీ సమస్యని అప్పనంగా సూర్యబాబు ఒక్కడే హైజాక్ చేశాడు. మమ్మల్ని బొట్టు పెట్టి పిలవచ్చు కద? మేమూ వెళ్ళే వాళ్ళముగా! ఆయనొక్కడే మొత్తం క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు. ఐతే ఆయన్ని మామూలురాష్ట్ర పోలీసులు ట్రీట్ చేసిన విధానాన్ని మాత్రం ఖండ ఖండాలుగా ఖండిసున్నా”

నేను మళ్ళీ చానెల్ చేంజ్ చేశాను.

ఏంనీ టీవీలో ముఖ్యమంత్రి మోశయ్య అంటున్నాడు. “నేను చెప్పాగా. అన్ని పార్టీలని హస్తినకు తీసుకెళ్తాను, ఢిల్లీ అమ్మతో కలిపిస్తాను అని. కొంపలంటుకు పోయినట్టు ఈయన తన ఎం.ఎల్.ఏ.లను తీసుకుని మామూలురాష్ట్రలో జొరబడ్డాడు. పాపం అక్కడ ముఖ్యమంత్రి శవాన్ మాత్రం ఏం చేస్తాడు? తెలివిగా అరెస్ట్ చేయించాడు. ఐతే వాళ్ళని అలా లాఠీలతో విరగదీసి ఉండకూడదు.”

నేను మళ్ళీ చానెల్ ఫ్లిప్ చేశాను.

మీ టీవీలో బృ.రా.స అధ్యక్షుడు వీ.సీ.ఆర్. ఆవేశ పడుతున్నాడు. “అసలు బృందగానా సమస్యలు తీర్చెటందుకు ఈయనెవడు భై? మేమంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నడా? ముందుగాల ప్రత్యేక బృందగానా రావాలె. ఆ తరువాత మామూలూరాష్ట్రకు మా సత్త ఏందో చూపిస్తం. ఈయన పోవుడు వల్ల మామూలురాష్ట్ర ప్రజలకి మన త్రిలింగ ప్రజలకి మధ్య ద్వేషాలు పెరుగుతయి. ఏదైనా ప్రేమగా సాధించుకోవాలె.”

“వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక వైపు సూర్యబాబు బృందం అక్కడికి వెళ్ళడం తప్పు అంటారు. ఇంకో వైపు పోలీసులు వాళ్ళని కొట్టడం కూడా తప్పు అంటారు,” కూసింత ఆశ్చర్యపోయాడు రాధేశ్యాం.

“అదంతేరా రాధేశ్యాం. రాజకీయాల్లో మనం చేస్తేనే అది మంచి పని. ఎగస్పార్టీ వాళ్ళు చేస్తే దానిలో ఏదో ద్రోహ చింతన ఉన్నట్టే. కాబట్టి వీళ్ళెవరూ సూర్యబాబు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజల దృష్టిలోకి తెచ్చినా, దాని వల్ల జరిగే మంచిని వదిలేసి, అందులోని పొలిటికల్ స్టంట్‌ని మాత్రమే విమర్శిస్తారు. ఇక పోలీసు జులుంని ఎవరన్నా ఖండిచాల్సిందే. లేకపోతే ప్రజలు అసహ్యించుకుంటారు.”

“ఓహో!”

“ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య కాబట్టి, అన్ని పార్టీలు ఒకే తాటిమీద నిలబడి పోరాడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ అలా చెయ్యరు. ఇంకో నాయకుడికి ఎక్కువ పేరు వస్తుందేమో అని భయపడి చస్తారు. ఇంతెందుకు! ఇప్పుడు వాళ్ళంతా ఈ ఐడియా తమకు రాలేదెందుకా అని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు.”

***

బృ.రా.స. ఆఫీస్.

వీ.సీ.ఆర్ చిందులు వేస్తున్నాడు. “ఈ పాప్లీ సమస్యల ఇంత పొటెన్‌షియల్ ఉన్నదని నాకెవ్వరు చెప్పలేదేంద్రా? బంగారం లాంటి చాన్సు మిస్ అయినది. అమ్మా తవిక, నువ్వు కూడా చెప్పలేదేంది బిడ్డా?”

“సారీ డాడీ, వాయు కళ్యాణ్ సినిమా ‘అమరం సింహం’ మన బృందగానాలో నడవడానికి ఎన్ని కోట్లు ఇవ్వాలో బేరం ఆడుతూ బిజీగా ఉండె,” సిగ్గు పడుతూ చెప్పింది వీ.సీ.ఆర్. కూతురు తవిక.

***

గాంక్రెస్ కార్యాలయం:

“అసలు ఆ సూర్య బాబు బృందాన్ని సరిహద్దులు దాటనిచ్చింది ఎవరు? మన రాష్ట్రంలోనే అరెస్ట్ చేయాల్సి ఉండేది!” నిప్పులు చెరుగుతున్నాడు మోశయ్య.

“అలా అరెస్ట్ చేస్తే ఆయన పాపులారిటీ ఇంకా పెరిగిపోతుందని భయపడ్డాం సార్,” సంజాయిషీ ఇచ్చుకున్నాడు ప్రెసిడెంట్ ఎస్.డీ శ్రీనివాస్.

“ఈ శవాన్ ఒకడు నా ప్రాణానికి. కుళ్ళబొడిపించిన ఆయన, కుళ్ళబొడిపించుకున్న సూర్యబాబు బాగానే ఉన్నారు. నా పరిస్థితే బాగా లేదు,” బాధ పడ్డాడు మోశయ్య.

***

ఇష్టారాజ్యం ఆఫీస్:

“నువ్వే ఈ యాత్ర మీద ముందు వెళ్ళుంటే బాగుండేదేమో బావా!” సాలోచనగా అన్నాడు సొల్లూ అరవింద్.

“చాలు బావా, చాలు! ఇప్పటి దాక నువ్వు నాకు ఇచ్చిన సలహాలు చాలు! ఆ ఒక్క అవమానమే నాకు ఇంకా కాకుండా మిగిలినది,” చేతులెత్తి దండం పెట్టాడు రిచంజీవి.

***

తెగులుదేశం కార్యాలయం:

“పబ్లిసిటీ బాగానే వచ్చింది కాని ఈ లెవెల్లో వాయిస్తారని అనుకోలేదు మొర్రో! లెగ్గిరిగినట్టుంది,” వాపోయాడు సూర్యబాబు.

“సరిహద్దు దగ్గరే ధర్నా చేసుంటే బాగుండేదేమో. అనవసరంగా లోపలికి వెళ్ళాం!” అన్నాడు ఇలాంటి దెబ్బలు అలవాటై పోయిన సర్పం ప్రజార్ధన్ రెడ్డి.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

6 Responses to పీతల సీసా

 1. హరే కృష్ణ says:

  గోదాజొన్న నది మీద కడుతున్న పాప్లీ ప్రాజెక్ట్
  ha ha
  very nice
  ఎప్పటిలానే చాలా బావుంది 🙂

 2. krishna says:

  భలేగా రాస్తారు! బాగు బాగు!

 3. రవి says:

  “రాజకీయాల్లో మనం చేస్తేనే అది మంచి పని. ఎగస్పార్టీ వాళ్ళు చేస్తే దానిలో ఏదో ద్రోహ చింతన ఉన్నట్టే. కాబట్టి వీళ్ళెవరూ సూర్యబాబు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజల దృష్టిలోకి తెచ్చినా, దాని వల్ల జరిగే మంచిని వదిలేసి, అందులోని పొలిటికల్ స్టంట్‌ని మాత్రమే విమర్శిస్తారు.”

  – బ్లాగుల్లో కూడా పాకిందండి ఇది. క్షుద్ర రాజకీయం అట సూర్యబాబుది!

 4. virajaaji says:

  ఎప్పటిలానే అదరగొట్టేశారు. పాపం దెబ్బలు తింటాడనేనేమో, సర్పం ప్రజార్ధన్ రెడ్డి హైదరాబాదులోనే ఉండిపోయాడు!

 5. Suresh Thotakura says:

  bagundi.

 6. suresh says:

  మరి ఎన్నికలలు అయిపోయాయి కదా…మరి సూర్య బాబు అనవసరంగా దెబ్బలు తిన్నానని బాధ పడుతున్నాడా ? లేక లబా లబా కృష్ణ ని రంగం లోకి దింపుతాడా అసమ్మతి ని ఫేసు చేయడానికి ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s