కల గంటి, కల గంటి!

నేనూ అప్పారావు గాడు కలిసి ఆఫీస్‌లో ఎంటర్ కాగానే, “పితృత్వంలోనే ఉంది పురుష జన్మ సార్థకం. తండ్రి అనిపించుకొనుటే మగ మూర్తికి గౌరవం,” అంటూ పాడుకుంటూ వెళ్తున్న అనిల్ గాడు ఎదురు పడ్డాడు.

“ఏంట్రా, పాప పుట్టాక వీడు చాలా హుషారుగా తయారయ్యాడు?” అడిగాను నేను అప్పారావు గాడిని.

“అంటే వాడు తండ్రి అయ్యాకే వాడికి వాళ్ళ చుట్టాల్లో పక్కాల్లో బాగా రెస్పెక్ట్ పెరిగిందంట. ఒకప్పుడు కూరలో కరివేపాకులా తీసేసిన వాళ్ళే ఇప్పుడు వాడు రాగానే లేచి నిలబడుతున్నారట. తండ్రి అయ్యే వరకు మగవాడి జీవితం ఈ సమాజంలో ఎంత దుర్భరంగా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే కద!” చెప్పాడు అప్పారావు.

అవునన్నట్టు తలూపాను నేను. ఒకప్పుడు తల్లి కాని ఆడవాళ్ళను మాత్రమే గొడ్రాళ్ళు అనే వారు. ఇప్పుడు తండ్రి కాని మగాళ్ళకు కూడా ఆ అవమానం తప్పట్లేదు. అనిల్ గాడు కోయ డాన్స్ చేయకుండా కేవలం పాటతోనే సరిపెట్టుకోవడంలోనే వాడి సెల్ఫ్-కంట్రోల్ అర్థమవుతూంది.

“అది సరే కానీ ఏంట్రా నీ కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి?” అడిగాడు నన్ను అప్పడు.

“ఎలా చెప్పాలో తెలీట్లేదు,” మెల్లగా అన్నాను నేను.

“మొదటి నుంచి చెప్పు.”

“ఈ మధ్య నిద్ర ఉండట్లేదురా! ఒకటే పీడ కలలు. అంటే నిద్ర పడుతుంది కాని, ఆ పీడ కలలకు భయపడి నిద్ర పోవట్లేదు,” కళ్ళు రుద్దుకుంటూ అన్నాను నేను.

“అంటే ఎన్ని పీడ కలలు వస్తాయేంటి?”

“చాలా ఏం రావు. ఒకే ఒక పీడ కల వస్తుంది.”

“మరి పీడ కల(లు) వస్తున్నాయి అన్నావు?”

“ఎవరైనా అలానే అంటారు. పీడ కల వస్తూంది అనరు.”

“సరే సరే! ఇంతకీ ఆ పీడ కల ఏంటి?”

“చాలా విచిత్రమైన కల. నేను పరీక్ష గదిలో కూర్చుని ఉంటాను. టెంత్ క్లాస్ పరీక్షలు అన్న మాట. నాకేమో ఏమీ గుర్తుండదు. క్వొస్చన్ పేపర్ చూస్తే ఒక్క దానికీ సమాధానం తెలీదు. ఆఖర్లో ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తాను. ఆ టైంలో చెమటలు కక్కుతూ లేచి కూర్చుంటాను. విపరీతమైన టెన్షన్. అసలు నిజంగా ఎగ్జాం రాసినప్పుడు ఎప్పుడూ ఏ చీకూ చింతా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఈ దిక్కుమాలిన కల ఏంటో?” వాపోయాను నేను.

“అయ్యయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయిరా!”

“మరే…”

“ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు కద?”

“అమ్మో నేను వెళ్ళను. ఎవరైనా చూస్తే నాకు పిచ్చి అని ప్రచారం చేసేస్తారు. ఆ తరువాత ఆ ఇమేజ్‌కి సరిపోయేలా చారల డ్రాయరు వేసుకుని తిరగాల్సి వస్తుంది. దాని కంటే ఈ కలే బెటర్!”

“హ్మ్, ఐతే నీకు ఒక్కటే దారి.”

“ఏంటది?”

“ఒకప్పుడు డాక్టరుగా ఉండి, తరువాత బాబాగా మారిన స్వప్నానంద స్వామి ఒక్కడే నీ సమస్యని పరిష్కరించగలడు.”

“స్వప్నానంద స్వామా? అయినా ఆయన డాక్టర్ వృత్తి మానేసి, బాబా ఎందుకు అయ్యాడు?”

“కొందరు గిట్టని వాళ్ళు, ఈ బాబా వృత్తిలోనే ఎక్కువ ఆదాయం ఉంది, అందుకే అయ్యాడు అంటారనుకో. ఆయన మాత్రం ప్రజలకు సేవ చేయడానికి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం అయ్యానూ అంటాడు.”

“దేవుడు ఆయన్ని అజ్ఞాపించాడా?”

“అవునట. అస్తమానూ ఈయన చెవులు కొరుక్కు తిన్నాడట. బాబ్బాబూ, కాస్త బాబాగా మారు బాబూ అంటూ. ఆ గోల తట్టుకోలేక ఈయన స్వప్నానంద స్వామి అవతారం ఎత్తాడట.”

“ఏడిచినట్టుంది. అసలు ఈయనకే సైకియాట్రిస్ట్ అవసరం ఉందేమో?”

“మాట తూలకురా. ఆయన మహిమ నీకు తెలీదు. హిప్నాటిజాన్ని, యోగ శక్తులని కలిపి రంగరించి, ఆయన ఇలాంటి రుగ్మతలను నయం చేస్తూంటాడు.”

“రుగ్మతా? అంటే ఏంటి?”

“డిసీజ్, వ్యాధి.”

“ఓరేయి అప్పిగా! నాకు డిసీజ్ ఉందంటావా?”

“అందుకే మరి! డైరెక్టుగా చెప్తే నువ్వు ఫీల్ అవుతావని, నీకు అర్థం కాని పదం వాడాను.”

“అఘోరించావులే. సరే ఆయన ఎక్కడుంటాడో నీకు తెలుసా?”

“ఓ! నిన్ను అక్కడికి తీసుకెళ్ళే బాధ్యత నాది. నేను ఆయన్ని ప్రతి వారం కలుస్తూ ఉంటానుగా?”

“నీకేం రుగ్మత ఉంది?”

“నాకు బొత్తిగా కలలు రావురా. లైఫ్ అంతా చాలా డల్‌గా డింగా ఉంది. అందుకని కలలు రప్పించుకోవటానికి వైద్యం చేయించుకుంటున్నాను.”

“హేంటో, నీ రుగ్మత నాకుంటే బాగుండేది. ఈ రోజు సాయంత్రం ఆయన్ని దర్శించుకుందామా?”

“అలాగే. ఆఫీసు కాగానే బయలుదేరుదాం.”

***

స్వప్నానంద స్వామి అంటే గెడ్డాలు మీసాలు పెరిగిపోయి కాషాయ వస్త్రాల్లో ఉంటాడనుకున్నాను కానీ ఆయన ఫుల్ సూట్ వేసుకుని పెళ్ళి రిసెప్షన్లలొ పెళ్ళి కూతురుకి, పెళ్ళి కొడుకుకి వేసే స్పెషల్ ఎర్ర చెయిర్ల లాంటి ఒక దాని మీద కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొందరు శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా అంతా సఫారీ సూట్స్ వేసుకుని ఉన్నారు.

“రా అప్పారావు, రా! నా వైద్యం పని చేసిందా? ఏమన్నా కలలు వచ్చాయా?” అప్పారావుని చిరు దరహాసంతో అడిగాడు ఆయన.

“పడుకోగానే ఒక కల లాంటిది మొదలయ్యింది కానీ, ఒక్క నిముషంలో ఆగిపోయింది స్వామీ. ఆ తరవాత ఎంత గింజుకున్నా ఏ కల రాలేదు,” బాధగా అన్నాడు అప్పడు.

“బాధ పడకు నాయనా! ఈ రాత్రి ఇంకో కల వస్తుందేమోలే?”

“వేరే కల వస్తే రావచ్చేమో కానీ మళ్ళీ ఈ కల రాదేమో స్వామీ! నిన్నటి కల మొహంమొత్తే ఖాన్ డాన్సుతో స్టార్ట్ అయ్యింది,” కాస్త సిగ్గు పడుతూ చెప్పాడు అప్పారావు.

ఏదో చెప్పబోతూ నన్ను మొదటి సారి గమనించాడు స్వప్నానంద స్వామి. “ఈ భక్తుడు ఎవరు నాయనా?” ప్రశించాడు అప్పారావుని.

“ఇంకా భక్తుడు కాలేదు స్వామీ. మీ మహిమ చూశాక తప్పకుండా అవుతాడు. కష్టాల్లో ఉండి మీ దగ్గరకు వచ్చాడు,” వినయంగా చెప్పాడు అప్పడు.

“ఏంటి నాయనా నీ కష్టం?” మృదువుగా అడిగాడు స్వామీజీ.

“ప్రతి రోజూ ఒకే పీడకల వచ్చి చాలా విసిగిస్తూంది స్వామీ,” చెప్పాను నేను.

“ఒక్క నిముషం ఆగు నాయనా. కలలకు సంబంధించిన కష్టాలు ఇలా చెప్పకూడదు.”

“మరి ఎలా చెప్పాలి స్వామీ?”

సమాధానంగా ఆయన పక్కకు తిరిగి చప్పట్లు చరిచాడు. ఆయన శిష్య బృందంలో ఒకడు లోపలికి వెళ్ళి ఒక పరుపు తీసుకొచ్చాడు.

“ఆ పరుపు మీద పడుకుని అటూ ఇటూ పొర్లుతూ నీకొచ్చే కల గురించి చెప్పు నాయనా.”

కాస్తా విచిత్రంగా అనిపించినా, నాలాంటి విచిత్రమైన సమస్యలకు పరిష్కారాలు కూడా ఇలాగే విచిత్రంగా ఉంటాయి అనిపించి ఆయన చెప్పినట్టే చేశాను నేను. పరుపు మీద అటూ ఇటూ దొర్లుతూ నా కల గురించి ఆయనకు విశదంగా వివరించాను.

“ఎగ్జాం ఏ సబ్జెక్ట్ మీద ఉంటుంది నాయనా?”

“ఒకటని లేదు స్వామీ. ఒక్కొ సారి ఒక్కొ సబ్జెక్ట్. ఏదైనా సరే నేనిచ్చేది ఖాళీ పేపరే!”

“ఎగ్జాం టైమింగ్స్ ఏంటి నాయనా?”

నాకు ఒళ్ళు మండింది. “టైమింగ్స్‌తో పనేంటి స్వామీ?” కోపం అణుచుకుంటూ అడిగాను.

“అలా అనకు నాయనా! అన్ని వివరాలు తెలిస్తేనే వైద్యం కుదిరేది.”

“సాధారణంగా పొద్దున పది గంటలకు అనుకుంటాను.”

స్వప్నానంద స్వామి ముందుగా, పక్కన ఉన్న ఒక శిష్యుడితో అప్పారావుకి కొత్త వైద్యం చేయమని పురమాయించాడు. ఆ శిష్యుడు అప్పారావుతో సహా అక్కడినుంచి నిష్క్రమించాడు. తరువాత “పరీక్షా, ఖాళీ పేపరు, పొద్దున పది గంటలూ! పొద్దున పది గంటలూ, ఖాళీ పేపరు, పరీక్షా,” అని మార్చి మార్చి అంటూ తన చేతి వేళ్ళ మీద ఏదో గుణించాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత నా వైపు తిరిగి, “నీ సమస్యకు పరిష్కారం ఉంది నాయనా, హిప్నాటిజం, యోగశక్తి కలిపి కొడితే అదే నయమవుతుంది.”

“ఎవర్ని కొడితే స్వామీ? నన్నా?”

“నిన్ను కాదు నాయనా! సమస్యని. సరే ఇక వైద్యం మొదలు పెడదాం. నా కళ్ళలోకి సూటిగా చూడు. అహ! లేవకు. అలా పడుకునే చూడు. నువ్విప్పుడు నిద్రలోకి జారుకుంటున్నావు, నీ కళ్ళు మూతలు పడుతున్నాయి…”

ఎప్పుడు నిద్రపోయానో, అదే, ఎప్పుడు హిప్నాటిక్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయానో, నాకే తెలీదు. కళ్ళు తెరిచేప్పటికి పక్కనే అప్పారావు గాడు కనిపించాడు.

“ఇదేమన్నా నీ బెడ్‌రూం అనుకున్నావురా? ఇంతసేపు పడుకుంటావు,” కాస్త విసుగ్గా అన్నాడు. నేనున్న గదిలో మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. లేచి నిలబడుతూ, “ఐతే నా వైద్యం అయిపోయినట్టేనా?” అడిగాను వాడిని.

“వైద్యం అయిపోలేదు. నీ చికిత్స ఇప్పుడే మొదలయ్యింది,” చెప్పాడు వాడు నాతో పాటూ బయటకి నడుస్తూ.

“అన్నట్టు నేను నీకు రెండు వేలు అప్పు ఉన్నా కద, తీసుకో!” అని నా పర్స్ జేబులోంచి తీసి, దాన్ని తెరిచి షాక్ తిన్నాను, “ఇదేంటి ఐదు వేలు ఉండాలి ఇందులో, ఏమయ్యింది?” అంటూ.

“మొదటి సారి నేనూ అలాగే షాక్ తిన్నా. ఆ ఐదు వేలు స్వామికి నువ్వు చెల్లించాల్సిన ఫీజ్. నువ్వు ఇచ్చే స్టేజ్‌లో లేవని, వాళ్ళే తీసేసుకున్నారు,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అప్పారావు.

“వచ్చే వారం మళ్ళీ వస్తాం కద. అప్పుడు ఇంత డబ్బు తీసుకు రానులే, బుద్దొచ్చింది,” నిట్టూర్చాను నేను.

***

మరుసటి వారం, నేనూ, అప్పారావు స్వప్నానంద స్వామి దగ్గర హాజరు వేయించుకున్నాం. ఆయన అప్పారావు వైపు చూసి కళ్ళెగరేశాడు. “ఈ సారి కొంచెం బెటర్ స్వామీ, కాస్త పెద్ద కలే వచ్చింది,” చెప్పాడు అప్పారావు విషాదంగా.

“మరి ఆనందించాల్సింది పోయి, అలా ఏడుపు మొహంతో చెప్తావేంటి నాయనా?” అడిగాడు స్వ.స్వా. (అదే, స్వప్నానంద స్వామి)

“అంటే, ఈ సారి కలలో వచ్చింది, పాత నటి చిన్నాంబ, స్వామి,” దిగులుగా అన్నాడు అప్పడు.

“నీ సంగతి ఏంటి, బిడ్డా?” నా వైపు చూస్తూ అన్నాడు స్వ.స్వా.

నేను భోరుమన్నాను. “ఏం చెప్పమంటారు స్వామీ! మిమ్మల్ని కలిసే వరకు ఒక్క సబ్జెక్ట్ పరీక్ష మాత్రమే అటెండ్ అయ్యే వాడిని. గత వారం నుంచి, ప్రతి రాత్రీ, మొత్తం ఆరు సబ్జెక్టుల ఎగ్జాంసూ రాస్తున్నా. వరుసగా పది రోజులు మన అసెంబ్లీ సమావేశాలు చూస్తే మనసు ఎలా గజిబిజిగా తయారవుతుందో అలా ఉంది నా పరిస్థితి,” ముక్కు ఎగబీలుస్తూ అన్నాను.

“చికిత్స వికటించినట్టు ఉంది. మీ ఇద్దరినీ కొత్త టైప్ హిప్నాటిజంతో కొడతా! ఇస్తా, కొత్త వైద్యం ఇస్తా!” ఉత్సాహంగా అన్నాడు స్వ.స్వా.

***

ఈ సారి నేను కొంత తొందరగానే మేలుకున్నాను. పక్క రూంలో అప్పారావు గాడు గురకలు పెడుతూ కనిపించాడు. వాడిని లేపాకా, ఇద్దరం బయట పడ్డాం. పూర్వపు అనుభవం వల్ల ఎందుకన్నా మంచిది అని, ఒక సారి జేబు తడుముకున్నాను. వెంటనే కెవ్వున కేకేశాను. “అదేంట్రా అప్పిగా, ఈ సారి పర్సు కూడా లేదు,” అన్నాను ఆందోళనగా.

“నువ్వెంత అమౌంట్ పెట్టుకున్నావు పర్సులో?” ప్రశాంతంగా అడిగాడు అప్పడు.

“మూడు వేలు!”

“మరదే! అలాంటి చీప్ పనులు చేస్తే స్వామీజీ శిష్యులకు కోపం వస్తుంది. అందుకే ఈ సారి పర్స్ కూడా లేపేశారు,” వివరించాడు వాడు.

“నెక్స్ట్ టైం అసలు ఒక్క పైసా కూడా తేను,” కోపంగా అన్నాను నేను.

***

మరుసటి వారం నేనూ అప్పిగాడూ మళ్ళీ ఠంచనుగా స్వ.స్వా సన్నిధికి హాజరు అయ్యాము. ఆయన ఈ సారి ముందు నన్ను చూసి కళ్ళెగరేశాడు.

“ఈ సారి పీడ కలలో ఆరు సబ్జెక్టుల పరీక్షలు రాయడంతో పాటూ, పక్క విద్యార్థులు నన్ను కాపీ చూపించమని బెదిరించడం కూడా జరిగింది స్వామీ,” వాపోయాను నేను.

స్వామీజీ అప్పారావు వైపు చూశాడు. “ఈ సారి మా తాత కలలోకి వచ్చాడు సార్. నేను చిన్నప్పుడు ఎంత వెధవనో ఇప్పుడూ అంతే అని చాలా సేపు చీవాట్లు పెట్టి వెళ్ళాడు,” గద్గదమైన స్వరంతో అన్నాడు వాడు.

ఆయన నాలుక కరుచుకున్నాడు. “ఐతే ఈ సారి గండభేరుండ యోగాన్ని మీ మీద ప్రయోగిస్తా. దీనికి తిరుగు ఉండకూడదు,” హామీ ఇచ్చాడు, తన నున్నటి గెడ్డం నిమురుకుంటూ.

***

ఈ సారి నేనూ, అప్పారావు గాడూ ఒకే సారి లేచి కూర్చున్నాం. ముందు ఒకరిని చూసి ఒకరు కెవ్వున కేకేశాం. తరువాత మమ్మల్ని మేము చూసుకుని ఇంకో సారి కేక రిపీట్ చేశాం. ఆ కేకలకు కారణం మా వొంటి మీద ఉన్న ప్యాంటూ షర్టులు మాయం అయి ఉండడమే.

“నేను ఈ రోజు పర్సే తేలేదు, అందుకోసం నా బట్టలు లాక్కున్నట్టున్నారు, నువ్వు కూడా తేలేదా?”
అడిగాను నేను.

“తెచ్చాను, కానీ చాలా తక్కువ తెచ్చాను. అందుకే నాకీ సత్కారం అనుకుంటా,” అన్నాడు వాడు.

ఇద్దరము శిష్య బృందం మా కోసమే కన్వీనియెంట్‌గా వదిలిన పాత న్యూస్‌పేపర్లు చుట్టుకుని బయట పడ్డాం.

***

నెక్స్ట్ వీక్, నేనూ అప్పడూ, స్వ.స్వా దగ్గరికి మళ్ళీ బయలుదేరాం. గత వారం, న్యూస్‌పేపర్లు చుట్టుకుని సందుల్లో గొందుల్లో నడుస్తూ వెళ్ళడం వల్ల ఇంటికి చేరుకునే సరికి అర్ధ రాత్రి అయ్యింది. ఈ సారి అలాంటి అగత్యం రాకూడదని ఇద్దరం, మా దగ్గర ఎంతుందో అంత డబ్బూ తీసుకుని వచ్చాం.

ఈ సారి స్వప్నానంద స్వామి రియాక్ట్ కాలేదు. ఆయన శిష్యుడు ఒకతను మమ్మల్ని చూసి కళ్ళెగరేశాడు.

“ఏం చెప్పమంటారు స్వామీ. ఇప్పుడు ప్రతి రాత్రీ ఎడ తెరపి లేకుండా కలలు. కానీ అందరూ చిన్నాంబ లాంటి వృద్ధ తారలు వచ్చి వాళ్ళ గత స్మృతులు వినిపిస్తున్నారు. అది చాలదన్నట్టు మా తాత అప్పుడప్పుడు వచ్చి వాళ్ళందరి ముందూ తిట్టి పోతూంటాడు,” బావురుమన్నాడు అప్పారావు.

“ఈ వారమంతా నేను పక్క విద్యార్థులకు భయపడి అన్ని సబ్జెక్ట్స్‌లో వాళ్ళకి కాపీ చూపించడం, వెంటనే ఎగ్జాం స్క్వాడ్ వచ్చి నన్ను రెడ్-హాండెడ్‌గా పట్టుకుని జీపులో ఎక్కించుకుని వెళ్ళడం జరిగింది స్వామీ,” ఘొల్లుమన్నాను నేను.

“ఐతే ఏమంటారు నాయనల్లారా?” చిద్విలాసంగా అన్నాడు స్వప్నానంద స్వామి.

“మిమ్మల్ని కలవడానికి ముందు నేను ఎలా ఉండే వాడినో అదే స్థితికి పంపించండి. నా పాత పీడ కలే ఎంతో బెటర్,” అర్థించాను నేను.

“నేను కూడా డిటో. ఏ కలలూ రాక పోవడమే బాగుండేది,” తను కూడా రిక్వెస్ట్ చేశాడు అప్పడు.

“మధ్యలో వైద్యం మానేస్తే పెనాల్టీ ఉంటుంది బిడ్డల్లారా!. ఇద్దరూ చెరొక పది లక్షలు సమర్పించుకోండి, అలానే చేస్తాను,” సెలవిచ్చాడు స్వ.స్వా.

మేమిద్దరం నా కోసం ఆల్‌రెడీ వేసి ఉన్న పరుపు మీద పడి స్పృహ తప్పాం.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

6 Responses to కల గంటి, కల గంటి!

 1. రవి says:

  పెద్దల పత్రికకు పంపే భేతాళకథలా చక్కగా ఉంది. చివరి ప్రశ్న: డాక్టరు బాబాగా ఎందుకు మారాడు? తెలియకపోవడమనేదే లేదు కాబట్టి తల వక్కలయే ప్రసక్తి లేదు.

 2. Murali says:

  రవి గారు, ఈ కింద ఎక్స్‌ప్లైనేషన్ సరిపోలేదా? 🙂

  —————————————————————-

  “స్వప్నానంద స్వామా? అయినా ఆయన డాక్టర్ వృత్తి మానేసి, బాబా ఎందుకు అయ్యాడు?”

  “కొందరు గిట్టని వాళ్ళు, ఈ బాబా వృత్తిలోనే ఎక్కువ ఆదాయం ఉంది, అందుకే అయ్యాడు అంటారనుకో. ఆయన మాత్రం ప్రజలకు సేవ చేయడానికి దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం అయ్యానూ అంటాడు.”

  “దేవుడు ఆయన్ని అజ్ఞాపించాడా?”

  “అవునట. అస్తమానూ ఈయన చెవులు కొరుక్కు తిన్నాడట. బాబ్బాబూ, కాస్త బాబాగా మారు బాబూ అంటూ. ఆ గోల తట్టుకోలేక ఈయన స్వప్నానంద స్వామి అవతారం ఎత్తాడట.”

 3. రవి says:

  చూశారా, మీ టపాలో రాసి ఉన్నా, బుర్రపని చేయక తిరిగి అదే ప్రశ్న అడిగాను. నేనూ నిత్యా..సారీ, స్వప్నానందస్వామి దగ్గరకు వెళ్ళాలేమో?

 4. Pradeep says:

  చాలా బాగుంది.

 5. suresh says:

  చాలా బాగుంది…:)…enjoyed it….

  “ఎవరైనా చూస్తే నాకు పిచ్చి అని ప్రచారం చేసేస్తారు. ఆ తరువాత ఆ ఇమేజ్‌కి సరిపోయేలా చారల డ్రాయరు వేసుకుని తిరగాల్సి వస్తుంది.”

 6. Jitu :) says:

  Rofl!!

  :D:D:D:D:D

  Loved reading this… 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s