పీకిస్తాన్ – నాట్ ఫిక్సింగ్


జంబూ ద్వీపం పక్కనే పీకిస్తాన్ అనబడే ఒక దొడ్డ దేశం ఉండేది. నేను ఇంతకు ముందు ఒక సారి చెప్పినట్టు, పీకిస్తాన్ ఒకప్పుడు జంబూ ద్వీపంలో ఒక భాగమే. ఐతే కొందరు శాంతికాముకులైన మైనారిటీలు, దుష్ట మెజారిటీతో పడలేక పీకిస్తాన్ అనే కొత్త దేశం సృష్టించారు. మైనారిటీల నాయకుడు చిన్నా, “మీకొక దేశాన్ని జంబూ ద్వీపం నుంచి పీకి ఇస్తాను” అని వాగ్ధానం చేశాడు కాబట్టి అదే పేరు ఖరారు చేశారు.

పీకిస్తాన్, జంబూద్వీపాలలో కిరికెట్టు అనే ఆట చాలా పాపులర్. జంబూ ద్వీప వాసులకు మరీ ఇష్టం! అసలు కిరికెట్టు చాల రకాల నియమాలతో కూడుకున్ని ఉన్న ఆట కాబట్టి, జంబూ ద్వీప వాసులకు కిరికెట్టు రూల్స్ నేర్చుకోవడానికే ఒక జీవితకాలం పడుతుంది కాబట్టి, జంబూ ద్వీప వాసులు వేరే ఏ ఆటలు ఆడలేకపోతున్నారని గిట్టని వాళ్ళు అంటూంటారు. ఈ దరిద్రపు కిరికెట్టు వలనే ఓలమ్మోపిక్స్‌లో ఆఖరికి అల్యూమినియం పతకం కూడా రావట్లేదని కూడా వాళ్ళు అక్కసు వెళ్ళగక్కుతారు. ఐతే వారిని జంబూ ద్వీప వాసులు ఎవరూ పట్టించుకోరనుకోండీ. ఈ మధ్య రోజూ ఏదో ఒక కిరికెట్టు మ్యాచ్ ఉంటూంది కాబట్టి, ఈ విమర్శలకు సమాధానాలు చెప్పే టైం కూడా వారెవ్వరికీ లేదు.

ఒకప్పుడు పీకిస్తాన్ కిరికెట్టు ఆటగాళ్ళు జమిలిగా “బ్యాచ్ ఫిక్సింగ్” చేసేవారు. బ్యాచ్ ఫిక్సింగ్ అంటే, మొత్తం బ్యాచ్ బ్యాచంతా కలిపి ఫిక్స్ చేయడం. అంటే టీం మొత్తం కావాలని చెత్తగా ఆడి ఓడిపోవడం.

మీరు అమాయకులైతే మీకు వెంటనే సందేహం వచ్చేస్తుంది. ఆటగాళ్ళు ఎప్పుడూ గెలవాలని కోరుకుంటారు కద, ఈ కావాలని ఓడిపోవడమేంటి అని. వాళ్ళు అలా ఓడిపోవడానికి కారణం డొక్కీలు అనబడే కొందరు బ్రోకర్ టైప్ మనుషులు సదరు ఆటగాళ్ళకు, ఓడిపోయినందుకు బోలెడంత డబ్బులు ఇవ్వడమే.

దీని వల్ల ఆ డొక్కీలకు ఏంటి లాభం అంటారా? లక్షలది మంది (అ)మాయక ప్రజలు ఈ కిరికెట్టు మ్యాచ్‌ల మీద పందాలు కాస్తారు. ఈ డొక్కీలకు ముందుగానే ఏ టీం గెలుస్తుందో తెలుసు కాబట్టి, వాళ్ళు సరైన టీం మీద బెట్ కాసి బోలెడు చాలా డబ్బు సంపాయించుకుంటారన్న మాట.

కానీ ఈ బ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అంతా ఒక రోజు బట్టబయలు కావడంతో పీకిస్తానే కాకుండా ఇతర దేశాల్లో బ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్న చాలా మందిని కూడా ఆట నుంచి బహిష్కరించారు (వీరిలో జంబూ ద్వీప కిరికెట్టు టీం ఎక్స్-క్యాప్టెన్ బజారుద్దిన్ ఒకడు లెండి). అందు చేత బ్యాచ్ ఫిక్సింగ్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని కిరికెట్టు ఆటగాళ్ళు గ్రహించారు.

దానితో ఇంకో కొత్త టైప్ ఫిక్సింగ్ మొదలు పెట్టారు. దీన్నే నాట్-ఫిక్సింగ్ అంటారు. ఎందుకంటే ఈ ఫిక్సింగ్ మ్యాచ్ రిజల్ట్‌ని డిసైడ్ చేయదు. అందుకే not fixing అన్న మాట.

దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు (అ)మాయకులైన ప్రజలు ఒక్క మ్యాచ్ రిజల్ట్ మీదే కాకుండా, బాల్ బాల్ మీద కూడా బెట్టు కాయొచ్చు. అంటే ఈ బాల్‌లో బజారుద్దిన్ ఔట్ అవుతాడా లేక సిక్స్ కొడతాడా, లేక ఇంకేమన్నా చేస్తాడా ఇలా అన్న మాట. దీన్ని పసిగట్టడం మహా కష్టం. ఈ ట్రెండ్ పాపులర్ కాగానే కిరికెట్టు ఆటగాళ్ళు, ముఖ్యంగా పీకిస్తాన్ ప్లేయర్స్ రెట్టించిన ఉత్సాహంతో రెచ్చిపోయి మళ్ళీ ఫిక్సింగ్, అదే నాట్-ఫిక్సింగ్, మొదలు పెట్టారు.

పీకిస్తాన్ జట్టుకి క్యాప్టైన్ సల్మాన్ మొహమ్మద్ ఆమిర్. అందుకే మజా మజీద్ అనే డొక్కీ, అతన్ని లైన్‌లో పెట్టాడు. అదిలా జరిగింది.

సల్మాన్ మొహమ్మద్ ఆమిర్ ఒక రోజు కిరికెట్టు ప్రాక్టీసు నుంచి ఇంటికి వెళ్తూంటే మజా మజీద్ అడ్డు పడి, “నేనొక డొక్కీని,” అన్నాడు.

“నీ డొక్కు ఎంట్రీ చూస్తేనే తెలుస్తుంది, నువ్వు డొక్కీవని,” కోప్పడ్డాడు సల్మాన్ మొహమ్మద్ ఆమిర్.

“హహ్హహా, నువ్వు భలే జోకులేస్తావు. నేను డొక్కీనే కావచ్చు కానీ నీ డొక్కు జీవితాన్ని మార్చే సత్తా నాకుంది తెలుసా,” నవ్వుతూ అన్నాడు మజా మజీద్.

“నాది డొక్కు జీవితమా? నా దగ్గర పది కోట్ల పీకిస్తాన్ రూపాయలు ఉన్నాయి తెలుసా,” మండి పడుతూ అన్నాడు సల్మాన్ మొహమ్మద్ ఆమిర్.

“పిచ్చోడా! దానికేనా ఇంత మిడిసిపాటు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎంత అందంగా మారుతుందో సినిమా చూపిస్తా, చూడు!” అని చేయి ఊపాడు మజా మజీద్.

అంతే! సల్మాన్ కళ్ళ ముందు, తనకున్న ఆస్తి కనక వంద రెట్లు పెరిగితే, తన లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో కలర్‌లో కనిపించింది. “అబ్బో, సినిమా బెమ్మాండం! ఇలా కావాలంటే, నేను ఏం చెయ్యాలి డొక్కీ గారూ?” వినయంగా అడిగాడు సల్మాన్.

“ఏం లేదు, సింపుల్. నువ్వు కాస్త నాట్-ఫిక్సింగ్ చేయాలి అంతే. అంటే, నేను చెప్పిన టైంలో కావాలని ఔట్ కావడమో, లేదా నీ బౌలర్స్‌తో నోబాల్ వేయించడమో చేయాలి. నీకు ఒక మ్యాచ్‌కి ఇచ్చే ఫీజ్, ఎండార్స్‌మెంట్స్ వల్ల వచ్చే డబ్బు కంటే ఇరవయి రెట్లు ఇస్తాను,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మజా.

అంతే! ఆ రోజు నుంచి సల్మాన్ నాట్-ఫిక్సింగ్ ప్రపంచానికి ఒక సూపర్ స్టార్‌లా తయారయ్యాడు. డొక్కీ చెప్పినట్టే సల్మాన్ జీవితం నాట్-ఫిక్సింగ్ మొదలయ్యాక పూర్తిగా మారిపోయింది. డబ్బే కాకుండా రక రకాల పవర్‌ఫుల్ మనుషులతో పరిచయం కూడా ఏర్పడింది. డేవిడ్ అబ్రహం లాంటి మాఫియా డాన్స్, పీకిస్తాన్ జంబూ ద్వీపంలోని రాజకీయ వేత్తలు, సినిమా తారలు ఇలా రక రకాల మందితో కాంటాక్ట్స్ నెలకొన్నాయి. వీళ్ళందరూ భారీ ఎత్తున కిరికెట్టు మీద పందాలు కాస్తారు కదా, అందుకన్న మాట.

డబ్బులు వచ్చి పడుతున్నాయి కానీ సల్మాన్‌కి చీకాకులు కూడా ఎక్కువయిపోయాయి. నాట్-ఫిక్సింగ్ చేయాలన్న డిమాండ్స్ పెరిగిపోయి, ఏ మ్యాచ్‌లో ఎవరు ఏది ఫిక్స్ చేయమంటున్నారో తెలీని గందరగోళం ఏర్పడింది. దాని వల్ల అతను కొన్ని విచిత్రమైన పరిస్థితిలు ఎదురుకోవాల్సి వచ్చింది.

***

ఒక మ్యాచ్ ముందు పొద్దున నెట్-ప్రాక్టీస్ చేస్తూంటే సల్మాన్‌కి ఫోన్ వచ్చింది. చేసింది డేవిడ్ అబ్రహం!

“ఇదిగో సల్మాన్, నువ్వు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాగానే నాలుగో బాల్‌కి ఔట్ అయి పోవాలి. అలా అని బోలెడు చాలా డబ్బు పందెం కాశాను,” అన్నాడు తాపీగా భాయి.

“చిత్తం దేవర!” బదులిచ్చాడు సల్మాన్.

బ్యాటింగ్‌కి వెళ్ళడానికి ప్యాడ్లు కట్టుకూంటూంటే ఇంకో ఫోన్ వచ్చింది. ఇది మోటా వాజన్ నుంచి. ఈయనకు, డేవిడ్ అబ్రహంకి అస్సలు పడదు. (పడదు అంటే మీకూ, మీ పాలిటి విలన్ ఎవడైనా ఉంటే వాడికీ పడనట్టు కాదు. వీళ్ళ గొడవల్లో వందలమంది శాల్తీలు గల్లంతవుతూ ఉంటారు. ఆ లెవెల్లో పడదన్న మాట.)

“ఏంటి భాయి నీ ఆజ్ఞ?” వినయంగా అడిగాడు సల్మాన్.

“ఇదిగో నువ్వు ఈ మ్యాచ్‌లో ఆడబోయే నాలుగో బాల్‌కి ఒక రన్ తీసుకోవాలి, లేదా రన్ ఔట్ అయిపోవాలి. రెండింటి మీద పందెం కాశాను,” కరకుగా విన వచ్చింది మోటా వాజన్ స్వరం.

గతుక్కుమన్నాడు సల్మాన్. “కానీ భాయి, నేను ఆల్‌రెడీ…” అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసేంతలోనే అవతల సైడ్ ఫోన్ క్లిక్‌మంది.

“ఓలమ్మో, నేనేం సేతురో దేవుడో?” అంటూ బ్యాటింగ్ గ్లవ్స్‌తో తన గుండెల మీద బాదుకున్నాడు సల్మాన్. ఒక్క క్షణం తరువాత అతనికి వెలిగింది. తను రన్-ఔట్ అయితే ఇద్దరినీ మెప్పించగలడు అని. అలా ఆ గండం నుంచి బయట పడ్డాడు.

***

ఇంకో సారి ఇంకో మ్యాచ్‌కి సల్మాన్‌కి మోటా వకీల్ నుంచి కాల్ వచ్చింది. ఎప్పటిలానే మామూలుగా నాట్-ఫిక్సింగ్ రిక్వెస్ట్.

“ఇదిగో సల్మాన్, నువ్వు మొదటి బాల్‌కే రన్-ఔట్ కావాలి,” చెప్పాడు మోటా వకీల్.

“అదెంత పని, అలాగే!” అన్నాడు సల్మాన్. ఈ సారి డ్రెస్సింగ్ రూంనుంచి గ్రౌండ్ వైపు నడుస్తూంటే సెల్ ఫోన్ తెచ్చి అందించాడు అతని ఫ్రెండ్.

ఈ ఫోన్ వచ్చింది మాజీ మస్తాను నుంచి. “సల్మాన్, నా మాట జాగ్రత్తగా విను. ఈ సారి నువ్వు బ్యాటింగ్‌కి వెళ్ళగానే మొదటి బాల్‌లోనే నీ ఎదుట ఉన్న బ్యాట్స్‌మ్యాన్‌ని రన్-ఔట్ చేయాలి,” అన్నాడు అతను.

“అదెలా కుదురుతుంది భాయి. ఆల్‌రెడీ మోటా వకీల్ గారికి మాటిచ్చాను, నేనే రన్-ఔట్ అవుతాను అని,” కొంచెం భయపడుతూనే చెప్పాడు సల్మాన్.

“ఐతే ఏంటంట? ఇద్దరూ రన్-ఔట్ కండి. నాకు మోటా వకీల్ శత్రువైనా అతని కడుపు కొట్టాలనేమీ లేదు. నాదసలే పెద్ద మనసు,” అన్నాడు మాజీ మస్తాన్.

“చిత్తం. తమది పెద్ద మనసు అన్నది జగద్విదితం. కానీ కిరికెట్టు ఆటలో ఒకే బాల్‌కి ఇద్దరు ఆటగాళ్ళు రన్-ఔట్ కాలేరు. ఎవరో ఒకరే కాగలరు,” గొంతు నిండా నమ్రత నింపుకుని అన్నాడు సల్మాన్.

“అదంతా నాకనవసరం, నీ ఎదుటి బ్యాట్స్‌మ్యాన్ రన్-ఔట్ అవుతున్నాడు, అంతే!” ఫోన్ పెట్టేశాడు మాజీ మస్తాన్.

“ఛీ, నా బ్రతుకు తగలెయ్య!” అనుకున్నాడు సల్మాన్. అర్జెంటుగా రూల్స్‌బుక్కులన్నీ తిరగేశాడు. ఇద్దరూ ఒకే బాల్‌కి రన్-ఔట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అని. కానీ అలాంటి ప్రొవిజన్ ఏదీ అతనికి దొరకలేదు. చేసేది లేక తానే రన్-ఔట్ అయ్యి మాజీ మస్తాన్‌కి తరువాత నచ్చ చెబ్దామనుకున్నాడు.

ఐతే అతను బ్యాటింగ్‌కి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్న బ్యాట్స్‌మ్యాన్ రసూల్‌కి కూడా మాజీ మస్తాన్ నుంచి ఆర్డర్లు అందినట్టున్నాయి. అసలు సల్మాన్ బ్యాట్ కి బాల్ తగలగానే అతను కూడా రన్‌కి (అదే రన్-ఔట్‌కి) పరిగెత్తాడు. సల్మాన్‌కి విషయం అర్థమయ్యింది. త్వరపడకపోతే తాను రన్-ఔట్ కాలేడని. వెంటనే తను ముందుకి పరిగెత్తి, హాఫ్ లైన్ దాటేంతలోపలే రసూల్‌ని వెనక్కి తోసేశాడు. ఆ రకంగా రసూల్ లేచేంత లోపల సల్మాన్ రన్-ఔట్ అయిపోయాడు.

సాయంత్రం మాజీ మస్తాన్ నుంచి సల్మాన్‌కి కాల్ వచ్చింది. “నీకెంత ధైర్యంరా, నా మాట వినకపోవడమే కాకుండా, నా మనిషి రసూల్‌ని గాడిని రన్-ఔట్ కాకుండా చేస్తావా? నిన్నేం చెయ్యమంటావు,” గర్జించాడు.

“సారీ మాజీ గారూ, కావాలంటే ఫైన్ కట్టుకుంటా, నన్నొగ్గేయండి,” అర్థించాడు సల్మాన్. పది కోట్లు ఫైన్ వేసి అతన్ని అప్పటికి వదిలేశాడు మాజీ మస్తాన్.

ఇలాంటి సంఘటనలు కొన్ని అయ్యాక ఒక నిర్ణయానికి వచ్చాడు సల్మాన్.

***

పీకిస్తాన్ ఆంగ్లాడులో కిరికెట్టు సిరీస్ ఆడడానికి వెళ్ళల్సి వచ్చింది. ఆ టూర్‌లో సల్మాన్ తనంతట తనే వెళ్ళి వాట్-ల్యాండ్ పోలీసులకి లొంగిపోయాడు.

“వాట్, ఎవరు నువ్వు?” అడిగాడు అక్కడ ఇన్స్‌పెక్టర్.

“నేను పీకిస్తాన్ కిరికెట్టు క్యాప్టెన్‌ని. నాట్-ఫిక్సింగ్ కేసులో లొంగిపోవడానికి వచ్చాను,” చెప్పాడు సల్మాన్.

“వాట్, నువ్వే వచ్చి లొంగిపోతున్నావా? ఏంటి ఈ రోజు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి. ఐనా మేం పట్టుకోలేక పోయినప్పుడు నువ్వు లొంగిపోవడమెందుకు? బొత్తిగా అమాయకుడిలా ఉన్నావే?” ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్.

“ఈ నాట్-ఫిక్సింగ్ మొదలు పెట్టినప్పటి నుండి మనశ్శాంతి కరువయ్యింది. ఎప్పుడు, ఎక్కడ ఎందుకు, ఏం, ఎలా చేస్తున్నానో కూడా తెలీట్లేదు. ఇప్పుడు నేను ఆపేసి బయట మామూలుగా బతకడం కుదరదు. నన్ను చంపేస్తారు. నన్ను జైల్‌లో పెట్టండి. నేను అక్కడే సేఫ్,” విజ్ఞప్తి చేశాడు సల్మాన్.

Advertisements
This entry was posted in భూగోళం. Bookmark the permalink.

3 Responses to పీకిస్తాన్ – నాట్ ఫిక్సింగ్

 1. రవి says:

  కొన్ని రోజుల తర్వాత అంపైర్లకే డబ్బులిచ్చి, వాళ్ళతో ఫిక్సింగు చేయించేస్తారేమో.

  • Murali says:

   రవి గారు,

   అంపైర్లతో మొత్తం మ్యాచ్ ఫిక్స్ చేయడం కష్టం. మహా ఐతే ఒక కీ బ్యాట్స్‌మన్‌ని తప్పుగా ఔట్ చేయించే అవకాశం ఉంది. (మన సచిన్ టెండుల్కర్‌ని స్టీవ్ బక్నూర్ ఎడా పెడా ఔట్ చేసినట్టు.) ఐతే ఎక్కువ తప్పు డెసిషన్స్ ఇస్తే అంపైర్ల ఉద్యోగం ఊడే ప్రమాదం కూడా మెండు. ఎటొచ్చి ఫిక్సింగ్ చేయాలంటే కావల్సిన తప్పనిసరి క్యాండిడేట్, టీం క్యాప్టెన్.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s